[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 1
[dropcap]మై[/dropcap]సూర్ నగరం –
ప్రకృతికి దగ్గరగా..
రద్దీకి కాస్త దూరంగా..
ప్రతిష్ఠాత్మక మైన చారిత్రక మహారాజా ప్యాలెస్‌తో ఠీవీగా..
ఊటీ, కూర్గ్ లాంటి మనోహర ప్రకృతీ రమణీయతల సామీప్యంలో..
కావేరి తల్లి పద రంజిత ధ్వనులతో,
విరిసే బృందావన శోభలతో..
అలరారుతున్న ఆ చిన్న పట్టణంలో..
ఎప్పటినుండో స్థిర పడిన తెలుగు కుటుంబాలు ఎన్నో.
అలాంటి కుటుంబం లోని ఓ అమ్మాయే జాహ్నవి.
ఊహ తెలియక ముందు నుండే మైసూర్ వాసిని అయ్యింది.
మైసూర్ సిద్ధార్ధనగర్ లోని కేంద్రీయ విద్యాలయంలో స్కూల్ ముగిసిన బెల్ మోగింది. గవర్నమెంట్ స్కూల్స్‌కు మంచి పేరు అక్కడ. కిల కిల నవ్వులు.. మాటలు.. పక్కనే బండి మీద జామకాయల అమ్మకాలు, స్కూల్ బయట ఎంతో సందడిగా ఉంది.
గల గల కబుర్లతో ఆరుగురమ్మాయిలు కలిసి రోడ్ క్రాస్ చేస్తూ వెళ్ళి బస్ ఎక్కి, ఇంటి దగ్గర బస్ స్టాండ్‌లో దిగారు. చల్లని సాయంత్రములో పార్కు మీదగా స్నేహితులతో కలిసి ఇంటికి నడుచుకుంటు వెళుతూ, కబుర్లు చెప్పుకుంటూ సేద తీరే ఆ సమయము అంటే ఈ ఆరుగురు స్నేహితురాళ్ళకు చాలా ఇష్టము.
తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ మిక్స్‌లో అమ్మాయిల సంభాషణ సాగుతున్నది. ఎవరి ఇంటి మలుపు దగ్గర వారు బాయ్ చెప్తూ వెళ్ళి పోతూంటే..
ఆరుగురు స్నేహితురాళ్ళ లో చివరగా నడుస్తూ మిగిలేది వర్ణ, జాహ్నవి మాత్రమే.
అంత దూరo నుండే గులాబీ రంగు పూలు పూసి, గేట్ పైకీ ఎగబాకిన బఠాణి తీగతో ముచ్చట గొలుపుతున్న తమ ఆ చిన్న డాబా ఇల్లు ఆ క్షణం ఉత్సాహం కలిగించలేదు, జాహ్నవికి.
నిర్వేదo నీడలు అలుముకున్నాయి.
ఇంతేనా, ఇంక తమ ఇల్లు మారదా!
ఇల్లంటే ఎలా ఉండాలి?
విరిసిన పున్నాగవనంలా, నవ్వుల జలపాతపు హోరులా –
జాహ్నవి మనోగతంలో ఇంటి గురించి అందమైన స్కెచ్ ఉందేమో!
ఇల్లు గురించిన తలపులలో ఏవో నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. తన ఊహ తెలిసిన నాటి నుండి ఇంటి పరిస్థితిలో మార్పే లేదు.
తాతయ్యగారు.. అమ్మ..
జాహ్నవి అప్రయత్నంగా నిట్టూర్చింది. గడియారానికి టైం నేర్పుతున్నట్టు తాతయ్య, గడియారం ముల్లులా అమ్మ.. సాయంత్రం ఆరు అయ్యిందంటే తాతయ్యగారు చెప్పుల్లో కాలు దూర్చాల్సిందే. ఈవినింగ్ వాక్‌కు బయల్దేరాల్సిందే.
టంచన్‌గా ఎనిమిదింటికి అమ్మ కుక్కర్ విజిల్ మోగాల్సిందే.
ఈ దినచర్యలో ఏదో కుదుపు, ఏదో హడావిడి, కావాలని తన మనసుకు అనిపిస్తుంది. తమకెవ్వరూ లేరు. వచ్చే వారు, వెళ్ళే వారు, తమకంటూ ఆత్మీయులు కావాలి.
అసలు తమ ఇంట్లో ఈ వెలితి ఎందుకు?
ఈ స్తబ్ధతను తొలగించే వారు ఎవరు?
ఇల్లు దగ్గరవుతుంటే తన ఫీలింగ్స్ మార్చుకుంది. ముఖం లోకి ప్రసన్నత వచ్చి చేరింది. జాహ్నవి తల పైకెత్తి చూసింది. డాబా పై చిన్న గోడ నానుకుని ఎదురు చూస్తూన్న తల్లి కనిపించింది. నవ్వు.
అమ్మ ప్రక్కనే చేయి చాస్తే అందేంత దగ్గరకు అందమైన పూల చెట్టు ఉంది.
తమ ఇల్లంటే ఎంత ఇష్టమో, అంత అసంతృప్తి కూడా జాహ్నవికి. మెట్ల మీద నుండే ఆమె భుజాల మీది బ్యాగ్ మాలతి చేతుల్లోకి వెళ్ళింది. డ్రెస్ మార్చుకుని వచ్చి, “అమ్మ! కాస్సేపు టీనాతో ఆడుకుని వస్తాను,” అంది. “స్నాక్స్ తిని వెళ్ళు” అన్న మాలతి మాటలకు, “వచ్చాక తింటాలే!” అంది. హాల్ లో ప్రోటీనుల్స్ తాగుతున్న తాతగారికి చిరునవ్వుతో ‘హయ్’ చెప్పి, క్రింద పోర్షన్ లోకి వెళ్ళింది.
జాహ్నవి వెళ్ళేసరికి ఆరేళ్ళ టీనా చీర సింగారించుకుని ఉంది. చాప పై చిన్ని, చిన్ని లక్క పిడతలు, ప్లాస్టిక్ స్టవ్, వంట సామాను గుమ్మరించుకుంది.
“హయ్, టీనా!” అంది జాహ్నవి.
“హయ్” అని, “హుష్! నేను ఇప్పుడు అమ్మను. గోల చేయకు” అంది.
జాహ్నవి వచ్చే నవ్వును ఆపుకుంది.
శ్రీనివాస్ జాహ్నవిని చూసి పలకరింపుగా నవ్వాడు. టీనా వాళ్ళమ్మగారు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు.
శ్రీనివాస్ చాప మీద కూర్చొని, “మమ్మీ, నాకు ఆకలేత్తుంది, మమ్మీ, ఊ, ఊ” అంటూ చిన్న పిల్లాడి లాగ మారాం చేసాడు.
“ఒసే, టీనా, తమ్ముడిని ఆడించు నాకు ఇంకా వంట కాలేదు” అంది, జాహ్నవి వైపు చూస్తూ.
‘ఓహో! తానిప్పుడు టీనా రోల్ పోషించాలి కాబోలు’ అనుకుంది జాహ్నవి నవ్వుకుంటూ.
“నవ్వకు” తన ఆటకు నవ్వుతున్న జాహ్నవి వంక చిరు కోపంగా చూసింది. శ్రీనివాస్ కూడా నవ్వాపుకున్నాడు.
“మమ్మీ, ఆకలెత్తోంది. అన్నం పెట్టు” గోముగా పిల్లాడికి మల్లే మళ్ళీ అన్నాడు శ్రీనివాస్.
“నువ్వు, పింటూవని చెప్పానా! పాలు తాగు. ఒసే టీనా, తమ్ముడి పాల బాటిల్ తీసుకొని, రా!” అంది. జాహ్నవి పెదవుల మధ్య నవ్వు బిగించి, అలాగే తెచ్చిచింది.
అది బాటిల్ శ్రీనివాస్ చేతికిచ్చి, “ఇంక పాలు తాగు. నాకు వంటకు లేటవుతుంది” అంది అచ్చం వాళ్ళమ్మ లాగా. “బుజ్జమ్మా, నన్నుబాటిల్‌లో పాలు తాగమంటావా, నిన్నూ.. నిన్నూ” అంటూ దాన్ని పై కెత్తాడు శ్రీనివాస్. అది కిలా కిలా నవ్వుతూంది. జాహ్నవి మనసులో ఆ చిత్రం ముద్రించుకు పోయింది.
కాస్సేపటి తర్వాత మెల్లిగా పైకి వచ్చింది. ఆ అమ్మాయి మనసులో ఎక్కడో గుచ్చుకుందని ఎవరికీ తెలీదు. తాను కూడా ఆ విషయం మర్చి పోయినంతగా మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకుంది.
మాలతికి టీనా కబుర్లు చెప్పి నవ్వించింది. తాతగారితో కలిసి న్యూస్ చూస్తూ, ఏవో సందేహాలు అడిగింది. సందడి చేస్తూ, దోస్త్ లతో ఫోన్ మాట్లాడుతూ.. అమ్మ తాతగారికి భోజనం గదిలో పెట్టి రాగానే, ఆమెతో కలిసి భోజనం చేసింది. కాస్సేపు హోంవర్క్ చేసుకొని, మెట్లెక్కి తన రూమ్ లోకి వెళ్ళింది.
అప్పుడు.. అప్పుడు.. ఆమె లోని మరో జాహ్నవి.. అందరికీ తెలియని జాహ్నవికి స్వేచ్ఛ వచ్చింది.
శ్రీనివాస్.. టీనా..
ఎత్తుకుని గిరా గిరా తిప్పిన శ్రీనివాస్..
గల గలా నవ్వుతూన్న టీనా..
మెల్లిగా కప్‌బోర్డ్ తెరిచింది.
పట్టు పరికిణి కుట్టి, అందంగా ఉంది, అంతెత్తు రబ్బర్ బొమ్మ. బొద్దుగా ఉన్న దాని చేతులకు ముద్దొచ్చేలా చిన్న గాజులు కూడా తొడిగి ఉన్నాయి. దాన్ని చెక్కిలికి గాఢంగా అదుముకుంది. “నాన్న” ధ్యానంలో ఉన్న దానిలా కళ్ళు మూసుకొని అంది.
విత్తు భూమిని చీల్చుకుని వచ్చినట్టు, మనసు పొరల్లో నుండి గాఢoగా తొలుచుకు వచ్చింది “నాన్నా” అన్న ఆ మాట. నాన్న ప్రేమకు గుర్తుగా మిగిలిన అపురూప జ్ఞాపిక ఈ మున్ని!
***
మరునాడు క్లాస్ రూమ్‌లో కూర్చొని ఉన్నజాహ్నవి ఆలోచనలు ఇంటి వైపు మళ్ళాయి. ఇంగ్లీష్ లెసన్ నడుస్తూంది క్లాస్‌లో. ఓ వైపు లెసన్ వింటూనే మరో వైపు ఆలోచన సాగుతూంది జాహ్నవిలో.
తాతగారు, మండ్య వెళతారు ఈ రోజు. అద్దెవాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారట. పాపం! అమ్మ ఒక్కతే ఉంటుంది. బి.పి. టాబ్లెట్ వేసుకుందో, మరిచి పోయిందో! తాతగారు ఇంట్లో ఉంటే తనకు ఇలా ఆలోచనలు వచ్చేవి కావు.
తాను ఈ రోజు స్కూల్ మానేయాల్సింది. ‘సారీ అమ్మా’ అనుకుంది. చివరి క్లాస్ ముగిసింది. మిస్ క్లాస్ రూమ్ నుండి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతూంటే జాహ్నవి లేచి నిలబడింది.
క్లాస్ టాలెస్ట్ తను, క్లాస్ లీడర్ కూడా. మిస్ కరెక్షన్ చేసిచ్చిన నోట్ బుక్స్ ఎవరివి వారి పేరు చదువుతూ ఇచ్చేసింది. మిత్ర బృందంతో బడి గేట్ దాటింది.
నిటారు నడక, వంగని భుజాలు, ఎత్తిన తలతో స్థిర వ్యక్తిత్వపు ప్రతీకలా ఉంది జాహ్నవి. తన వయసు వారికి భిన్నమైన గంభీరత్వం ఉంది ఆమెలో. ‘సీరియస్ లుక్స్’ అంటూ తనకి పేరున్నా, తన ముందు అనే ధైర్యం లేదని తెలుసు. క్లోజ్ ఫ్రెండ్స్‌తో తప్పితే, క్లాస్‌లో అందరితో అంతగా కలిసి పోని జాహ్నవి, టీచర్స్‌కు రైట్ హ్యాండ్. క్లాస్‌ను కంట్రోల్ చేయగల లీడర్. స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా టీచర్స్ నోటిలో తిరిగే పేరు జాహ్నవి.
“రేపు గాక ఎల్లుండి ఏమిటి” అంది జాహ్నవి, ఫ్రెండ్స్‌తో.
“వావ్, నీలి బర్త్ డే కదా!” అంది వినుత.
“నిన్ననే గుర్తు చేసుకున్నాను” అంది ఆరణి.
నీలి బర్త్ డేకు ఏమి డ్రెస్‌లు వేసుకోవాలి వగైరా కబుర్లతో అమ్మాయిలు తొమ్మిదవ నెంబర్ బస్ స్టాప్‌కు చేరుకున్నారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న మాలతికి, నిశ్శబ్దం భరించరానిదిగా ఉంది. తాతగారు మండ్య వెళ్ళడంతో ఇల్లు బోసిగా ఉంది. జాహ్నవి స్కూల్ నుండి ఇంకా రాలేదు.
మనసు గతం లోకి వెళ్ళమని ప్రేరేపించింది.
‘పెళ్ళి’ ఆల్బమ్ తెరిచింది.
ఎప్పుడయినా ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, ఆల్బమ్ చూసుకుంటుంది మాలతి.
తన వివాహానికి పెళ్ళి పుస్తకం సాక్ష్యం.
కానీ, తన వివాహ వైఫల్యం – ఏ పత్రాల సాక్ష్యంగా జరుగలేదు.
అందుకే అవి వెతుక్కునేందుకు ఏ ఆల్బమ్ లేదు- నలిగి పోయిన తన హృదయం తప్ప.
మాలతి నిట్టూర్చింది.
ఇంక తిరిగి రాని రోజులవి.
చేయి జార్చుకున్న స్వర్ణ పాత్ర అది.
అవును! స్వర్ణ పాత్రలో ఆ రాక్షసి విషం చిమ్మింది.
తాను పిరికిదానిలా పారిపోయి వచ్చింది.
తన స్థానం దానికే ధారాదత్తం చేసింది.
తలుచుకుంటే ఇన్నేళ్ళయినా గుండెల్లో ములుకు గుచ్చిన లాంటి బాధ.
ఆనంద్ – నిలువెత్తు, గంభీరమైన అతని విగ్రహం, అతని లోని ఆకర్షణీయత – పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ విశేషంగా చెప్పుకుంటూంటే ఎంత మురిసి పోయింది.
మాలతిలో ఆక్రోశం, ఆవేదన ఒకే నిముషంలో పోటీ పడినట్టు ముఖం ఉద్విగ్నంగా మారిపోయింది.
ప్రక్కనే ఉన్న వస్తువులను కసి కొద్దీ విసిరి కొట్టింది.
దోసిల్లో ముఖం దాచుకుని, హిస్టీరిక్‌గా ఏడవ సాగింది.
అలా ఎంత సేపు గడిచిందో కానీ, కర్తవ్యం గుర్తు చేస్తున్నట్టు గోడకు ఉన్న తాతగారి పాత కాలపు చెక్క గడియారం ఠంగు మంటూ గంటలు కొట్టింది.
వర్తమానం లోకి వచ్చిన మాలతి యాంత్రికంగా ఆల్బమ్ మూసి వేసింది. ఆనంద్ ఆనవాళ్ళేవి జాహ్నవి కంట పడకుండా, అత్యంత గోప్యంగా దాచి వేసింది.
ముఖం చల్ల నీళ్ళతో కడుక్కుని, జాహ్నవికి స్వాగతం పలకడానికి ఎప్పటిలా మెట్ల మీదకు వచ్చి నిల్చుంది.
అంత దూరం నుండి బ్యాగ్ భుజాలకు తగిలించుకుని వస్తున్న జాహ్నవిని చూస్తూనే అప్పటి దాకా జరిగిన అంతర్యుద్ధం అంతా మరిచినట్టు – ఆమె మోము విప్పారింది.
***
ఆ రోజే నీలి బర్త్ డే.
ఐదుగురు స్నేహితురాళ్ళలో నీలిమ అంటే పంచ ప్రాణాలు జాహ్నవికి. స్కూల్ కంటే ముందు నుండి స్నేహం. నీలి బర్త్ డే అంటే ఉత్సాహం ఉరకలేస్తుంది జాహ్నవిలో. సాయంత్రం ఫ్రెండ్స్ అంతా గిఫ్ట్ కొనేందుకు వెళ్ళాలి.
తాతగారు నిన్ననే వచ్చారు. అమ్మ గురించి దిగుల్లేదు ఇంక. అమ్మ మందులు వేసుకోవడం, తిన్నది లేనిది ఆయనే కనుక్కుంటూ ఉంటారు. అయినా తాను కూడా అడక్కుండా ఉండలేదు.
క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫష్టైన జాహ్నవి తన విలువైన సమయం కొంత వెచ్చించి, ప్రాణ స్నేహితురాలికి తన బహుమతిగా అందమైన చిత్రం గీసింది.
మాలతికి ఆ చిత్రం చూపిస్తూ, “కుళ్ళుకుంటారేమోనే. మరీ వినుత ఎక్కువ” అంది నవ్వుతూ.
మాలతి చిత్రం వంక చూసింది. ఇద్దరు అమ్మాయిలు చేతులు పెనవేసుకుని పచ్చని పార్క్‌లో పరుగెడుతున్నారు. “నీలీ, జానూ” అంది తల్లికి వాళ్ళను చూపిస్తూ. మాలతి నవ్వింది. “వాళ్ళను ఎందుకే ఉడికిస్తావు” అంది. నీకు నీలినే మాకన్నా ఇష్టం అంటారు ఫ్రెండ్స్. అలా చిరుకోపం ప్రదర్శించడంలో వినుత ముందుంటుంది.
జాహ్నవి చక, చకా తయారయ్యింది. చక్కని గిఫ్ట్ ప్యాక్ చేత పట్టుకొని, తాతయ్యకు, అమ్మకు చెప్పి బయల్దేరింది. కొంచెం ముందుగా వెళితే, ఫ్రెండ్స్ అందరు కలిసి నీలికి గిఫ్ట్ కొనాలి మరి.
స్నేహితురాళ్ళంతా అనుకున్నట్టుగానే ఒక దగ్గర కలుసుకున్నారు. 101 వినాయకుళ్ళు ఆ గుడి ప్రత్యేకత. అక్కడికి వెళ్ళాలనుకున్నానని హారిక చెప్పడంతో అందరూ అక్కడే కలుసుకున్నారు. అక్కడి నుండి ఎటు వెళ్ళాలి?
కావేరి ఎంపోరియంలో అన్నీ ఎప్పుడూ కొనేవే ఉంటాయి. అందుకే దగ్గర్లో ఉన్నగిఫ్ట్ షాప్ వైపు నడిచారు.
యూనిఫామ్ నుండి రంగుల దుస్తుల్లోకి మారిన అమ్మాయిలు రూపాంతరం చెందిన సీతాకోక చిలుకల్లా ఉన్నారు. స్కూల్ ఫైనల్ అమ్మాయిలంటే నమ్మేలా లేరు.
జాహ్నవి వర్క్ చేసిన బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది. నీలికి చాలా ఇష్టమైన డ్రెస్ అది.
ఆ వయసు వాళ్ళలా తన ఇష్టయిష్టాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వదు జాహ్నవి. ఆమె వార్డ్‌రోబ్ అంతా మాలతికి ఇష్టమైన డ్రెస్‌లే ఎక్కువ ఉంటాయి. తాతగారి సంతోషం కోసం పట్టు పరికిణీలు కొంటుంది.
స్నేహితురాళ్ళంతా గిఫ్ట్ ఏమి కొనాలి అని తర్జన భర్జన పడుతూంటే, జాహ్నవి తన విశాలమైన కళ్ళను అలవోకగా అటు, ఇటు తిప్పి,”ఒక్కసారి ఆ పప్పి బొమ్మ ఇటివ్వండి” అంది. తెల్లని బొచ్చుతో ముద్దొచ్చేలా ఉంది, ఆ బొమ్మ.
జాహ్నవి గమనించింది అది కాదు. దానికి ఉన్న జిప్ లాగితే హ్యాండ్ బ్యాగ్లా బాగుంది. రాజా చెయ్యేస్తే అది రాంగవ్వదు మరి. అమ్మాయిలంతా ఏకగ్రీవంగా తలాడించారు. దటిజ్ జాహ్నవి! ఈ నిర్ణయాధికారం ఆమెకు తెలీకుండానే ఆమె చేతుల్లోకి వచ్చేస్తుంది. క్లాస్‌కు, స్కూల్‌కే కాదు స్నేహితురాళ్ళ టీమ్‌కు అనధికారిక లీడర్ ఆమె. ఫ్రెండ్స్ మధ్య వచ్చే చిన్న, చిన్న అలుకలకు, స్కూల్లో అమ్మాయిల మధ్య గొడవలకీ పరిష్కారం కోసం జాహ్నవి దగ్గరికే వస్తారు.
“మల్టీ పర్పస్.. బయటకెళ్ళినప్పుడు హేండ్ బ్యాగ్, ఇంట్లో ఉన్నప్పుడు షోపీస్!” అంది వినుత, పప్పీ బొమ్మను చూస్తూ. “ఎస్” అంది జాహ్నవి. ఆమె చేతిలో నీలి కోసం వేసిన పెయింటింగ్ జాగ్రత్తగా పట్టుకొని ఉంది.
కొంచెం నడక తర్వాత బస్టాప్ వచ్చింది. అమ్మాయిలు కబుర్లతో సందడి చేస్తూ, బస్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మాటలు విననట్టే వింటూ, అప్పుడప్పుడు ఛలోక్తులు విసిరే ఛాయిస్ మాత్రమే తీసుకుంటోంది జాహ్నవి.
మనసు ఇంకేదో ఆలోచిస్తూంది.
ఆ ఆలోచన నీలి గురించి, నీలి కోల్పోయిన స్వేచ్ఛ గురించి.
అమ్మాయిలకు అంత భద్రత అవసరమా? నీలికి తన అందమే తన శత్రువు అయ్యింది, ఇంట్లో ఒక్కత్తిని ఎక్కడకూ పంపరు. ఫ్రెండ్స్‌తో సరదాగా బయట తిరిగేందుకు కూడా లేదు. అంకుల్ పొలిటికల్ సైడ్ వెళ్ళారు. ఆడపిల్లల విషయంలో అంకుల్ చాలా స్ట్రిక్ట్ అట.
నీలితో స్నేహం స్కూల్‌తో మొదలయ్యింది కాదు. ఓకే వీధిలో ఉంటూ కలిసి ఆడుకున్న స్నేహం. నీలి వాళ్ళు దూరంగా వేరే ఇంటికి వెళ్ళినప్పుడు తన మనసునెంత లోటు ఆక్రమించిందో! అది ఫోన్స్‌లో మాటల్లో తీరేది కాదు. అందుకే ఇద్దరూ ఎంత దిగులు పడిపోయారో!
జాహ్నవి ఆలోచనల్లో ఉండగానే బస్ స్టేజి మీదకు వచ్చింది.
అమ్మాయిలంతా వరస పెట్టి బస్ ఎక్కారు.
(ఇంకా ఉంది)