[box type=’note’ fontsize=’16’] “ఔత్సాహిక దర్శకులు ఎందరున్నా నిర్మాతలు కరువైపోయారు. థియేటర్లే లేనప్పుడు ఏ పాలసీలైనా ఏం చేస్తాయి?” అంటున్నారు సికందర్ ఖాసీ సినిమాలను విశ్లేషిస్తూ. [/box]
[dropcap]క[/dropcap]త్తికన్నా కలం గొప్పదనే అంటారు. ఇది శాశ్వత సత్యంగా నిల్చిపోయింది. అన్ని కళల్లో సినిమా కళ శక్తివంతమైనది. ఇది కూడా శాశ్వతంగా నిల్చిపోయే సత్యమే. అయితే దీని వెనుకా కలమే వుంటుంది. కలం లేనిది సినిమా లేదు. ఈ కలానికి కాసులు తోడైతేనే సినిమా. కాసులు లేక కలం లేదు, సినిమా లేదు. గొప్పల సంగతి తర్వాత. ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో కలాలకి కాసులు కరువై తమ సినిమా శక్తిని ప్రపంచానికి ఎత్తి చూపలేకపోతున్నారు. ఇందుకే దశాబ్దాలుగా మేఘాలయ సినిమా పుట్టుకకే నోచుకోలేదు. చివరికి 1962లో పదుమ్ బారువా అనే దర్శకుడి పుణ్యాన అప్పటి అవిభాజ్య అస్సాం రాష్ట్రంలో మొదటి ఫిలిం సొసైటీ వరకూ ఏర్పాటయింది. దశాబ్దం తర్వాత, 1972లో అస్సాం విభజనతో షిల్లాంగ్ రాజధానిగా మేఘాలయ రాష్ట్రం ఏర్పడ్డాక, ఆ ఫిలిం సొసైటీ కాస్తా అస్సాంకే వెళ్ళిపోయింది.
మరింకో దశాబ్దం తర్వాత ఎట్టకేలకు మేఘాలయకి ఒక సినిమా అంటూ పుట్టుకొచ్చింది. 1981లో హామ్లెట్ బారే నప్క్యంతా దర్శకత్వంలో రంగుల్లో తీసిన ‘కా సిన్జుక్ రీకీ లైఫ్యూవ్ సియెం’ (30 మంది రాజుల కూటమి) తో మేఘాలయా సినిమా బోణీ చేసింది. ఆ తర్వాత 1984లో అర్థేందు భట్టాచార్య రంగుల్లోనే ‘మాణిక్ రైటాంగ్’ (దౌర్భాగ్యుడైన మాణిక్) అనే ఖాసీ భాషలో తీసిన చలనచిత్రం ఇండియన్ పనోరమాలో కూడా ప్రవేశం సంపాదించి ప్రతిష్ఠ తెచ్చి పెట్టింది. అయితే దురదృష్ట మేమిటంటే, రాష్ట్రంలో థియేటర్లు లేవు. నిర్మాతలు ప్రొజెక్టర్లు పట్టుకుని ఊరూరా తిరిగి తమ సినిమాలని ప్రదర్శించుకోవాల్సిన పరిస్థితి ‘80 లలో కూడా దాపురించింది.
ఇప్పుడు మేఘాలయా జనాభా 30 లక్షలు. కానీ అప్పటి మొదటి చలనచిత్రం ‘మాణిక్ రైటాంగ్’ ఇప్పటికీ అక్కడి ప్రజలని అలరిస్తూనే వుంటుంది. కారణం స్థానిక జానపద కథ ఆధారంగా తీయడమే. రెండు గంటల నిడివి గల ఈ వర్ణచిత్రంలో కథానాయికా నాయకులుగా షేబా దింగ్డో, విలియం రింజా నటించారు. ఆ తర్వాత 2000 వరకూ ఏం సినిమాలు తీశారో చెప్పుకోవడానికి లేదు. 2000లో పము దాస్ ‘కా మోన్ బజత్’ అనే పక్కా కమర్షియల్ తీస్తే అది కాసుల వర్షం కురిపించింది. ఇందులో బాలీవుడ్ సింగర్స్ చేత క్రేజీ సాంగ్స్ పాడించాడు. దీంతో ఆ దశాబ్దం యువ టాలెంట్ కెమెరాలు చేతబట్టుకుని సినిమాల బాట పట్టారు. వాళ్ళకి చేతనైన సినిమాలు తీశారు. అవన్నీ షార్ట్ ఫిల్ములే. రాష్ట్రంలో థియేటర్లే లేనప్పుడు షార్ట్ ఫిలిమ్సే వాళ్ళ సినిమాలు, యూట్యూబులే వాళ్ళ సినిమా హాళ్ళు!
ఇప్పటికీ రాజధాని షిల్లాంగ్‌లో ఇదే పరిస్థితి. ఉన్నవి మూడే థియేటర్లు. అందులో రెండు మల్టీప్లెక్సులు. వాటిలో చక్కగా బాలీవుడ్ సినిమాలు. ఇతర పట్టణాల్లో ఎక్కడా కూడా సినిమా హాళ్ళు లేవు. సినిమా తీస్తే ప్రొజెక్టర్ పట్టుకుని ఊరూరా తిరిగి ప్రదర్శించుకుని డబ్బులు సంపాదించుకోవాల్సిందే. పైన చెప్పుకున్న పము దాస్ తీసిన ‘కా మోన్ బజత్’ ఇలాగే ఊరూరా తిరిగి ప్రదర్శించి సూపర్ హిట్ చేసుకున్నదే. కానీ ఈ విధానం అందరి వల్లా సాధ్యం కాలేదు.
దీంతో ఔత్సాహిక దర్శకులు ఎందరున్నా నిర్మాతలు కరువైపోయారు. 2011లో ప్రభుత్వం ఒక ఫిలిం పాలసీ తీసింది. దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. థియేటర్లే లేనప్పుడు ఏ పాలసీలైనా ఏం చేస్తాయి. థియేటర్లు నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి వుండదు. వుండాలని డిమాండ్ కూడా చేయలేరు. కనీసం కమ్యూనిటీ హాళ్ళు నిర్మించినా సినిమాలు ప్రదర్శించుకుంటామని కోరినా ఉలుకూ పలుకూ లేదు. ప్రైవేట్ వ్యక్తులెవరికీ సినిమా రంగమే పట్టదు. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనకి పెట్టుబడులు ప్రవహించే ప్రసక్తే లేదు. అడపాదపా బాలీవుడ్ సినిమాల షూటింగులకి వసతులు కల్పించి లాభార్జన చేయడం ప్రభుత్వానికి సులువుగా వుంది. బాలీవుడ్‌ని, అదే సమయంలో టూరిస్టులనీ ఆకర్షించడానికి పర్యాటక స్థలాలని అభివృద్ధి చేయడం ఒక్కటే ప్రభుత్వం చేస్తున్న పని. పైగా టూరిజం ప్రమోషన్‌లో భాగంగా అని చెప్పుకుని, బాలీవుడ్ సినిమాలకి భారీ సబ్సిడీలు కూడా సమర్పిస్తోంది. ‘రాకాన్ – 2’ షూటింగు మేఘాలయాలో జరిపినందుకు గాను సబ్సిడీ రూపంలో రెండు కోట్ల 30 లక్షల రూపాయలు నిర్మాతలకి కట్టబెట్టేసింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. మరోవైపు చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ధారబోస్తోందని ఆందోళనలు కూడా చెలరేగాయి.
నిర్మాతలెవరూ దొరకని ఔత్సాహికులే ఐదారు లక్షలు పోగేసుకుని ఆ మొత్తంలోనే సినిమాలు తీసి, టూరుకి బయల్దేరుతున్నారు ప్రదర్శించుకోవడానికి. వీటికి సెన్సార్ సర్టిఫికెట్లు కూడా వుండవు. ఇలా ఐదారు లక్షల్లో తీసిన సినిమాలు కూడా నష్టాల పాలవుతున్నాయి. కారణం పైరసీదార్లు వీటిని కూడా వదలకపోవడమే. విచ్చలవిడిగా పైరసీ సీడీలు మార్కెట్లో వదుల్తున్నారు. ఇక రాష్ట్రంలో ఫిలిం స్కూలు కూడా లేకపోవడంతో వివిధ శాఖల సాంకేతికాలని ఇంటర్నెట్‌లో చూసి కష్టపడి నేర్చుకుంటున్నారు. స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, ఏవీ లేవు.
వస్తుపరంగా ఈ సినిమాలు బాలీవుడ్‌కి నకలే. అయినా షిల్లాంగ్ మల్టీప్లెక్సుల్లో వీటికి స్థానం లభించకపోవడానికి కారణం ఇవి నాసిరకంగా వుండడమే. కొందరు కళాతృష్ణ గల దర్శకులు స్థానిక సంస్కృతి ప్రతిబింబించే అర్ధవంతమైన గుణాత్మక సినిమాలు తీసి జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలకి పంపుకుంటున్నారు. అక్కడ అవార్డులూ అవీ పొందక షిల్లాంగ్ మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే అర్హత సంపాదించుకుంటున్నారు. 2014లో ప్రదీప్ కుర్భా దీనికి బాట వేశాడు. ఇతను తీసిన ‘రీ – హోం లాండ్ ఆఫ్ అన్ సర్టెనిటీ’ జాతీయ, అంతర్జాతీయ పురస్కరాలు పొందిన మాస్టర్ పీస్‌గా నిల్చిపోయింది. సినిమా ప్రారంభిస్తే ముగిసే వరకూ మన కళ్ళు దీనికి అతుక్కుపోతాయని విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు.
రాష్ట్రంలో థియేటర్లు లేక విదేశాలకోసం సినిమాలు తీస్తున్న, కళాతృష్ణ చంపుకోలేని ఇటువంటి నయా దర్శకులు – మేఘాలయా సినిమాలంటే గ్లోబల్ ఆర్ట్ హౌస్ సినిమాలుగా పేరు సంపాదించి పెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.