[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నేను మాత్రమే, నాకై’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap] గమ్యం
ఏదో నిర్ణయం కాకముందే
నే వెళ్ళే రోజేదీ
నిశ్చయం చేసుకోకముందే
సన్మానాలు మొదలైపోయాయి
ప్రయాణ సన్నాహాలేవీ నే చేపట్టకముందే
వీడ్కోలు ముచ్చట్లు వచ్చెళ్ళిపోయాయి
ఎవరెవరో ఇచ్చెళ్ళిన జ్ఞాపికలు
ఎంతో బరువుగా ఉన్నాయి
వేరెవరో వెల్లబోసుకున్న జ్ఞాపకాలూ
మరింత మరింత భారంగా తోస్తున్నాయి
నడకను మోస్తూ వచ్చిన ఆ బంధాలన్నీ
దృష్టిపథంలోంచి దూరమవుతూ ఉంటే
తను మాత్రం తోడుగా ఉంటానంది
బెంగగా చూస్తున్న నాతో ఒంటరితనం
ఎందుకో..?
సాయంత్రం కాకముందే
నా చుట్టూ చిక్కగా చీకటిపడిపోయింది
వస్తుందో రాదో తెలియని సందిగ్ధంలో
నన్నుంచేసింది నా రేపటి ఉదయం
అలికిడైతే తలతిప్పి చూశా
కన్నీళ్ళుగా ఖాళీ అయిపోతోంది
క్షణంకూడా ఓ చోట కాలునిలువని కాలం
ఇదీ, నా పరిస్థితి!