అంతా సాయిమయం

0
3

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అంతా సాయిమయం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]లియుగ దైవం, సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయినాథుని అపూర్వ, అసామాన్య, కరుణా కటక్షముల వలన రక్షింపబడి, అతి శ్రీఘ్రముగా అధ్యాత్మికోన్నతి పొందిన ఒక సామాన్య భక్తుని గురించి ఈ రచనలో తెలుసుకుందాం.

మహారాష్ట్ర దేశంలో అహ్మద్‌నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకా కొరాలే గ్రామానికి చెందిన అమీర్ శక్కర్ దలాల్ కసాయి కులానికి చెందినవాడు. బొంబాయి లోని బాంద్రాలో చాలా కాలం కమీషన్ వ్యాపారిగా పని చేసి పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు గడించాడు. సకల కళా పోషకుడు. జీవితం అన్ని విధాలుగా ఆనందించడానికి వుందన్న సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. ఏనాడూ భగవంతునికి కనీసం చేతులు జోడించి నమస్కరించి ఎరగడు.

ఒక సమయంలో అతనికి తీవ్రమైన కీళ్ళవాతం వచ్చింది. వున్న డబ్బు, పలుకుబడి వుపయోగించి ఎందరో వైద్యులను సంప్రదించి, ఖరీదైన వైద్యలను చేయించుకున్నా, అవన్నీ తాత్కాలికంగా వుపశమనం ఇచ్చాయే కాని శాశ్వత ప్రాతిపదికపై బాధ తగ్గలేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా బంధువుల, స్నేహితుల ప్రోద్బలంపై శిరిడీ వచ్చి శ్రీ సాయి కాళ్ళపై పడి తన బాధను తగ్గించమని వేడుకున్నాడు.

దయా సముద్రుడు, భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీ సాయి తక్షణమే కరుణించి అతనిని చావడిలో వుండమని ఆదేశించారు. కీళ్ళవాతం వచ్చిన ఆ రోగికి నిరంతరం తేమతో వుండే ఆ ప్రదేశం ఎంత మాత్రం పనికి రాదు. పైగా రోగాన్ని మరింత హెచ్చించే ప్రదేశం అది. అయినా శ్రీ సాయి మాటను మనస్ఫూర్తిగా నమ్మి అమీర్ శక్కర్ నాటి నుండి తన నివాసం చావడి లోనే ఏర్పరుచుకున్నాడు. తాను చెప్పే వరకూ మశీదుకు రావద్దని శ్రి సాయి ఖచ్చితంగా ఆదేశించారు. అయితే నాటి నుండి అమీర్ శక్కర్ జీవితంలో గొప్ప మార్పు సంభవించింది. ఉదయం, సాయంత్రం బాబా దర్శనం అయ్యేది. రోజు విడిచి రోజూ గొప్ప ఉత్సవంతో బాబా చావడికి నిద్రించడానికి వచ్చేవారు. కలియుగ దైవం, సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయి సన్నిధిలో నిద్రించడం కంటే భాగ్యం ఇంకేమి కావాలి? ఎన్ని వేల జన్మలలో పుణ్యం చేసుకుంటే ఈ అపూర్వమైన భాగ్యం కలుగుతుంది? పూర్తిగా తొమ్మిది నెలల పాటు అమీర్ అక్కడ జీవించాడు. ఈ మధ్య కాలంలో అమీర్‌లో ఎంతో మార్పు వచ్చింది. దుష్ట సంస్కారాలు నశించాయి. విషయానందం అనుభవించాలన్న ఆసక్తి తగ్గింది. సత్వ గుణం అలవడింది. బాబా అమీర్‌లో కోరుకున్న మార్పు అదే! ఇక అమీర్‌ ఆఖరుగా మార్పు తీసుకు రాదలిచారు శ్రీ సాయి.

ఒక రోజున అమీర్‌కు ఆ స్థలం పై విసుగు కలిగి ఆ రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా కోపర్గావ్ పారిపోయాడు. అక్కడ ఒక ధర్మశాలలో దిగగా ఆ రాత్రి ఒక ఫకీరు అతనిని పిలిచి దాహంగా వుందని చెప్పాడు. అమీర్ వెంటనే వెళ్ళి కాసిన్ని నీళ్ళు త్రాగించగా “అల్లా!” అంటూ ఆ ఫకీరు అమీర్ శక్కర్ ఒడిలోనే ప్రాణాలు విడిచాడు. అమీర్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. సత్రం యజమానులకు గాని, పోలీసులకు గానీ ఈ విషయం తెలియ పరిస్తే ప్రథమ ముద్దాయిగా తననే నిర్భందిస్తారని భయపడి శిరిడీని శ్రీ సాయి ఆజ్ఞ లేకుండా విడవడం తనదే తప్పని తెలుసుకొని, పశ్చాత్తాపంతో శ్రీ సాయిని ప్రార్థించి వెంటనే శిరిడీకి తిరిగి పయనమయ్యాడు. దారి పొడవునా శ్రీ సాయి నామ జపం చేస్తునే వున్నాడు. సూర్యోదయానికి ముందే శిరిడీ చేరి చావడిలో శ్రీ సాయి చిత్రపటం ముందు కూర్చుంటే తప్ప అతనికి ఆతృత తగ్గలేదు.

కొద్ది కాలానికే అతను శాశ్వతంగా రోగ విముక్తుడయ్యాడు. శ్రీ సాయికి నిష్కళంక భక్తుడు అయి జీవితాంతం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి ఆరాధనను చేసాడు. భక్తి తత్వంలో పరిపూర్ణత సాధించి, శ్రీ సాయి ఆరాధనలో తరించి అనిర్వచనీయమైన అధ్యాత్మికానుభూతిని పొంది చివరకు శ్రీ సాయిలో ఐక్యం చెందాడు!

సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణ మస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జనా సుఖినోభవంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here