మహతి-37

7
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[మహతి లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలను చదివి వినిపించమంటారు తాతయ్య. విశ్వనాథ గారి రచనలు జ్ఞాన జలపాతాలని చెబుతూ, వాటితో మొదలుపెడదామని అంటుంది మహతి. తాను పదేళ్ళ వయసులో విశ్వనాథ గారిని చూశానని చెబుతూ, చిన్నప్పుడు చదువుకోలేదన్న బాధ ఇప్పటికీ పీడిస్తునే ఉందని అంటారు తాతయ్య. ఆ క్షణంలో మహతికో ఆలోచన స్ఫురిస్తుంది. వెంటనే వెళ్ళి పెద్ద బాలశిక్ష, పలకలు బలపాలు తెప్పిస్తుంది. రేపట్నించి కొందరు చదువుకోడానికి వస్తారనీ, వాళ్ళకి అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు నేర్పమని తాతయ్యకి చెబుతుంది. పదిహేను రోజులు బాగా శ్రమించి పెద్దలని 15 మందినీ, పిల్లల్ని 8 మందిని పోగేసి చదువు చెప్పటం మొదలుపెడతారు. పిల్లలకి ఎలా నేర్పాలనే అంశం మీద డా. శ్రీధర్‍కీ, మహికీ చర్చ జరుగుతుంది. వాళ్ళ సంభాషణ విన్న తాతయ్య, డాక్టరు గారు వెళ్ళిపోయాకా, మహతితో మాట్లాడుతారు. దేశంలో కులవ్యవస్థ, బ్రిటీషు వారి రాకతో ప్రాచీన వ్యవస్థలు నశించడం, డబ్బు ప్రాముఖ్యత పెరగటం గురించి చెప్తారు. పర్యావరణానికి కలుగుతున్న నష్టం గురించి మహతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. – ఇక చదవండి.]

మహతి-3 మహి-4

[dropcap]చా[/dropcap]లా చక్కని అవకాశం లభించింది. కర్రావూరి ఉప్పలపాడు పంచాయితీ వార్షికోత్సవం జరిగింది. ఆ పంచాయితీ పెట్టి 60 ఏళ్ళు నిండినై. అంటే పంచాయితీ షష్టిపూర్తిన్న మాట.

ఆ రోజున జిల్లా కలెక్టరే గాక పంచాయితీరాజ్ చీఫ్ ఇంజనీరూ, నీటి పారుదల, పంచాయితీరాజ్ శాఖలు చూసే మంత్రి పాండురంగారావు గారూ, మరి కొందరు పెద్దలూ వచ్చారు.

మా పంచాయితీ ప్రెసిడెంటు తనంతట తానేమీ చెయ్యడు. ఎవరైనా చేస్తే మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. నేను పెట్టిన స్కూలు గురించి ఆయనకి తెలుసు. ఆయన నన్ను కలెక్టర్ గారికీ, మంత్రిగారికీ పరిచయం చేసి నా గురించి బాగా చెప్పారు. హాస్పిటల్ మార్పుకి ఎలా కారణమయ్యానో కూడా చెప్పారు. కలెక్టర్ గారు తెలుగు బాగా తెలిసిన నార్త్ ఇండియన్.

“ఇంత చిన్న వయసులో అన్ని పనులా.. ఫెంటాస్టికు.. ఏమి చదువుతున్నావూ?!” అన్నారు. నేను చదువుని తాత్కాలికంగా నిలిపివేశాననీ, ఏం చెయ్యాలో, ఏం చేస్తే సమాజానికి నిజంగా ఉపయోగపడుతుందో ఆలోచిస్తున్నాననీ చెప్పాను. అక్కడే ఆపకుండా, “సర్.. పర్యావరణం గురించి మనవాళ్ళకి ఉన్న అవగాహన అతి తక్కువ. గృహ పరిశుభ్రత గురించి కొద్దో గొప్పో తెలిసినా, గ్రామాన్ని ఎలా పరిశుభ్రంగా వుంచాలో అసలు తెలియదు. ఇంట్లో చెత్తని రోడ్డు మీద పడేస్తారే గానీ, రోడ్డు కూడా మనదేననే ఆలోచన వాళ్ళకి రాదు. అలాంటి అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాను” అన్నాను. స్కూలు సంగతి ఆల్రెడీ ప్రెసిడెంటు గారు చెప్పేశారుగా, గొప్ప గొప్ప అధికారులకు సమయం అతి తక్కువగా వుంటుంది. అందుకే వీలున్నంత బ్రీఫ్‍గా చెప్పాను. ఆయన పేరు ఆదిత్య ధర్. ఆయన కాశ్మీరీ. కానీ చదువుకున్నది హైదరాబాద్ లోనేనట. వారి తండ్రీ సివిల్ సర్వీస్ ఆఫీసరే. ప్రస్తుతం రిటైర్డ్, అని ఆయనే చెప్పారు.

“మహతీ, నిన్ను ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను. నా పరిధిలో నేను చేయగలిగింది ఏదైనా సరే, 100% చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. నువ్వెప్పుడు నన్ను కలవాలన్నా నిరభ్యంతరంగా కలవొచ్చు.  డైరెక్టుగా ఆఫీసుకి వచ్చేయ్” అని భుజం తట్టారు. అంతేగాదు “వయోజన విద్యాలయం పేరుతో గ్రాంట్ కూడా ఏర్పాటు చేస్తాను. పంచాయితీ ద్వారా అలా చేయచ్చు” అని, ప్రెసిడెంటు గారితో చెప్పారు.. ఎలా ప్రొసీడ్ అవ్వాలో.

“నీ పేరునే చేస్తావా?” అన్నారు కలెక్టరుగారు.

“లేదు సార్.. అన్నీ నేను చూసుకుంటాను. ఒక టీచర్‍ని గనుక ఏర్పాటు చేస్తే, ఒక నిరుద్యోగికి భృతి దొరుకుతుంది” అన్నాను. “వెరీగుడ్..” చాలా సంతోషంగా భుజం తట్టారు. అంతేగాదు, మినిష్టర్ గారితోనూ మాట్లాడారు.

“ఏం పిల్లా.. రాజకీయాల్లోకి రావాలనే ఐడియా వుందా? ఇప్పట్నించీ ట్రైనింగైతే అయిదేళ్ళలో బాగా పుంజుకుంటావు” అన్నారు మినిస్టర్ పాండురంగారావుగారు.

“లేదు సార్ .. నా లక్ష్యం సిన్సియర్‍గా ప్రజలకి ఉపయోగపడాలని. అంతే.” అన్నాను.

“నిజం చెప్పనా? నువ్వు అక్కడితో ఆగవు.” నవ్వి అన్నారు ఆయన. ఆ తరువాత సభ జరగడం, అందులో నన్నూ మాట్లాడమని కోరడం జరిగింది.

నా మనసులో వున్న భావాల్ని సూటిగా చెప్పాను. పర్యావరణ పరిరక్షణ, విద్య కేవలం ప్రభుత్వాల భాధ్యతలు మాత్రమే కాదనీ, ప్రజలు కంకణం కట్టుకుంటే తప్ప ఆ రంగాల్లో ప్రగతి సాధించడం అసాధ్యమనీ చెప్పాను.

తొమ్మిది నెలలు మోసిన తల్లిని మాతృదేవోభవఅని దేవతని చేస్తున్నాం, వందేళ్ళ పాటూ మనని మోస్తూ, సర్వాన్ని ఇచ్చి మనని పోషించే నేలతల్లిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? తల్లి కంటే వందరెట్లు ఎక్కువగా గౌరవించాల్సిన భూమితల్లిని ఎందుకు సర్వనాశనం చేస్తున్నాం?” అంటూ నా గుండెల్లోని బాధని పెద్దల ముందే బయలు చేశాను. సభ అయ్యాక నన్ను అభినందించని వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా మంత్రి గారూ, కలెక్టరు గారూ, మా పంచాయితీ ప్రెసిడెంటూ అభినందనలతో ముంచెత్తారు.

ఆ సభకి మా తాతయ్య, శ్రీధర్ గారే కాక సత్యసాయి సేవా సంస్థ వారు కూడా వచ్చారు. మా తాతయ్యా, డాక్టరు గారి సంతోషానికి అంతు లేదు.

“ఓహ్.. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప గుర్తింపు” షేక్ హ్యాండ్ ఇస్తూ నిండుగా నవ్వి అన్నారు శ్రీధర్.

“ప్రజాసేవకి మా సత్యసాయి సేవా కేంద్రాలు ఎప్పుడూ ముందే వుంటాయి.  ఏది కావాలన్నా మాతో చెప్పు తల్లీ” అన్నారు కన్వీనర్ గారు.

“ఒక్కటే బాధగా వుందే, మీ అమ్మమ్మ, అమ్మానాన్నలు యీ రోజున ఇక్కడుంటే ఎంత సంతోషించేవారో. కనీసం అహల్యనీ, గౌతమ్‌నీ పిలిపించాల్సింది.” నిట్టూర్చాడు తాతయ్య.

“తాతయ్యా, నిజం చెబితే ఇవ్వాళ లభించిన గర్తింపుకి నాకు ఆనందం లేదు. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికీ, కనీసపు అవగాహన సభికులకి కలిగించడానికీ మాట్లాడానే కానీ, పేరు కావాలనే దృష్టి కాదు.” అన్నాను.

“ఆ విషయం మా కంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది! అయినా మహీ.. ప్రజల అభినందనని నీకు స్ఫూర్తినిచ్చే మెట్లుగా భావించాలి. ఓ పేషంటు ఆరోగ్యవంతుడయ్యాకా వారి చుట్టాలు నన్ను మెచ్చుకుంటుంటే ఎలా వుంటుందో తెలుసా? అర్ధరాత్రిలో నైనా సరే ప్రజల కోసం మేలుకొని ఉండాలనిపిస్తుంది. చప్పట్లు అనేవి కేవలం శబ్దం కాదు. రెండు చేతుల్ని కలిసి చరిస్తే పుట్టే శక్తికి అవి చిహ్నాలు. శబ్దం అనేది ఓ అద్భుత శక్తి. ఆ శక్తి పరిమాణాన్ని మ్రోగే చప్పట్లు తెలియజేస్తాయి. ఈ రోజు నీ సంభాషణ విన్నాక వూరు వూరంతా చప్పట్లతో మారుమోగింది. ఇది నీ తొలి విజయంగా భావించు. ఈ చప్పట్లే రేపు నీకు ధైర్యాన్ని స్ఫూర్తినీ ఇస్తాయి.” అన్నారు శ్రీధర్ గారు. అందులోనూ ఓ పాఠం వుందిగా!

“అమ్మాయ్.. ముందు పొట్ట చూడు.. తరవాతే మొహం” అనేది అమ్మమ్మ. “అంటే?” అడిగాను చిన్నప్పుడు.

“ఆకలితో వున్న వాళ్ళకి ఏమి చెప్పినా చెవికెక్కదు. ఆకలితో ఉన్నవాళ్ళకి అత్యంత ప్రియమైన వారు ఎదటున్నా, మనసు అన్నం మీదే తప్ప మనిషి మీద వుండదు, కనుక ఎవరు వచ్చినా ముందు కాళ్ళూ చేతులూ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి.” అంది.

“ఎందుకూ?” అన్నాను. “ఎవరైనా నీ మీద కోపంతో నాలుగు ‘అనాలని’ వచ్చినా, కాళ్ళూ చేతులూ, ముఖం కడుక్కునేసరికి ఆ కోపం సగానికి తగ్గుతుంది. ఆ తర్వాత తాగడానికి చల్లని మంచినీళ్ళో మజ్జిగో ఇచ్చామనుకో, కోపం 90% తగ్గుతుంది.”

“కోపంగా కాక ప్రేమగా వస్తే?” అల్లరిఆ అడిగాను.

“అప్పుడు ప్రేమ తొంభైశాతం పెరుగుతుంది. ఆ తరువాత వారిని అడుగు.. ‘భోజనం చేస్తారా?’ అని. చేస్తానంటే చక్కగా భోజనం పెట్టు. నువ్వు ‘కోపం’ సంగతి గుర్తుచేసినా వారికి కోపం రాదు.” అన్నది అమ్మమ్మ.

“అందరికీ నీళ్ళు ఇవ్వాలా?”

“అవును. బయటికి వెళ్ళిన వాళ్ళు అనేక చోట్ల తిరుగుతారు. కాళ్ళు చేతులూ, ముఖం కడుక్కోవడంలో శుభ్రతే కాదు.. ఓ హాయి ఉన్నది.” అన్నది అమ్మమ్మ.

“సరే.. వచ్చిన వాళ్ళు భోజన సమయానికి కాకుండా అటూ ఇటూ వస్తే?” లా పాయింటు లాగాను.

“అమ్మాయ్.. ఏ గృహస్థు ఇంట్లో అయినా కొద్దో గొప్పో తినుబండారాలను సిద్ధంగా పెట్టుకోవాలి. జంతికలో, కారప్పూసో, చెకోడీలో, బూందీనో ఏదో ఒకటి. అవి అతిథులకే కాదు.. అప్పుడప్పుడూ మనకీ పనికొస్తాయి.. నమలడానికి.” అన్నది అమ్మమ్మ.

“అందుకా నువ్వు అవన్నీ చేసి డబ్బాల్లో దాచడం” అన్నాను నేను.

“అవునే.. ‘అతిథి’ అంటే తిథి వార నక్షత్రాలను పట్టించుకుండా, సమయాసమయాలకు అతీతంగా వచ్చేవాడు. అందుకోసమే నేను ముందుగానే చేసి పెట్టుకునేది” అన్నది.

నా కళ్ళనించి ధారగా కన్నీరు కారింది. ఏమీ చదువుకోలేదని అంటూ వుండేది. నిజమైన చదువు ఇదే కదా! తాతయ్యకి కనిపించకుండా కళ్ళు తుడచుకున్నాను. ఎందుకంటే, ఆవిడ చెప్పిన మాటని ఆ రోజో అమలుచేశాను. అదీ, నా పాకెట్ మనీతో.

మంచి బిస్కెట్ పాకెట్లు, బ్రెడ్, జామ్, కిసాన్ ఆరెంజ్ స్క్వాష్ కొన్నాను. ‘అరుగు బడి’ విద్యార్థులకి (పెద్ద+చిన్న) ముందర బిస్కెట్లు, జామ్ పూసిన బ్రెడ్డులు ఇచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చాను. ఎండాకాలం కదా మరి! పెద్దలూ పిల్లులూ అందరు సంతోషించారు. అప్పుడు తాతయ్యి పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తుంటే, నేను పెద్దవాళ్ళకి అక్షరాల నేర్పాను – మధ్యలో చిన్నచిన్న కథలు, ప్రపంచ వింతలు విశేషాలూ చెబుతూ.

ఆ రోజు విద్యార్థుల శ్రద్ధ చాలా బాగుంది. అంటే హోటల్లో పనిచేసే పిల్లలూ, పాపుల్లో పనిచేసే పిల్లలూ ఆవురావురుమని తినడం చూశాక అనిపించింది మా అమ్మమ్మ చెప్పిన మాటల్లోని విలువ.

ఈ విషయం డాక్టరు గారితో చెబితే ఆయన అర్జంటుగా ఓ వెయ్యి రూపాయలు జేబులోంచి తీసి, “మహీ, ప్రతిరోజూ వాళ్ళకి ఏదో ఒకటి పెడదాం. నువ్వొక్కదానివీ అంత ఖర్చు భరించలేవు. కొంత సొమ్ముని ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కలెక్టు చేద్దాం. ‘మొదట ఆహారం, ఆ తరవాతే వ్యవహారం’ అని మా అమ్మగారూ చెప్పేది. ఈ ఎమోంట్‌ని నా తొలి చందాగా స్వీకరించు” అన్నారు.

“ఒక్క నిముషం” అని ఓ ఖాళీ స్వీట్ బాక్స్‌ని తెచ్చి ఆ ఎమోంట్‌ని అందులో వేయమన్నాను. ఓ వాడని డైరీలో డా. శ్రీధర్ పేరు వ్రాసి ఎదురుగా 1000.00 అని వ్రాశాను.

“వెరీగుడ్.. ఎవరు ఎంత ఇచ్చినా ఇలా పద్దు రాస్తే అద్భుతంగా వుంటుంది” అని మెచ్చుకున్నారు డా. శ్రీధర్.

గడ్డ కట్టిన మంచు కరగడం ప్రారంభిస్తే మొదట చుక్కలు చుక్కలుగా కరిగి తరవాత అతివేగంగా కరుగుతూ మరో ప్రవాహమౌతుంది. ఈ కార్యక్రమాల గరించి తెలిసిన వాళ్ళు తమకి తామే కొద్దో గొప్పో చందా ఇవ్వడం మొదలెట్టారు. కొందరైతే వస్తుపరంగా బిస్కట్ పాకెట్లు, బ్రెడ్ పాకెట్లు, వేరుశనగ వుండలూ, శనగపప్పు వుండలూ కూడా ఇచ్చారు. కొందరు ఆ పిల్లలకి సరిపడే పాత బట్టలు, అంటే, చిరిగిపోని బట్టల్ని ఇచ్చారు. ఎవరంటారూ మానవత్యం చచ్చిపోయించనీ? అది బ్రతికే వుంది. మానవజాతి వున్నంత కాలం కొద్దో గొప్పో బ్రతికే వుంటుంది. అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే, మా వూళ్ళో వున్న ఏకైక బాటా (చెప్పుల షాపు) ఓనరు పదిమందికి అంటే, ఎనిమిది మంది పిల్లలకి, ఇద్దరు పెద్దలకీ ఉచితంగా వారికి సరిపడిన కొత్త చెప్పులు ఇవ్వడం. ఎండాకాలం చెప్పులు లేకుండా కాళ్ళు కాలుతూ తిరిగే పిల్లలు, కొత్త చెప్పులు చూసి, అవి తొడుక్కుని గంతులు వేశారు. నా కళ్ళల్లో కన్నీరు. రెండు చేతులు ఎత్తి షాపు ఓనరు సుబ్బారాయుడికి నమస్కరించాను. థాంక్స్ చెప్పడానికి కూడా నోరు పెద్దల్లేదు. ఆయన సిగ్గుపడిపోయి “అదేంటమ్మా ఇంతదానికే దండం పెట్టాలా..! మా కళ్ళముందు పుట్టినదానివి. నువ్వు చేసే మంచి పనుల ముందు ఇదెంత!” అన్నారు.

“సంకల్పం మంచిదయినప్పుడు భగవంతుడే మానవరూపంలో మనకి సహకరిస్తాడమ్మా.. స్వామి అంటారు Love All Serve All అని. మనసులో నిస్వార్థ ప్రేమ వున్ననాడు అన్నీ మన దగ్గరికే వస్తాయి” అన్నారు సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గారు.

చిత్రం ఏమంటే, సుబ్బారాయుడి గారి దాతృత్వం తెలుసుకున్న పెద్దలు ‘ఏది అవసరం వచ్చినా నీ వెనుక మేముంటాం’ అని ముందుకొచ్చి నాతో చెప్పడం.

“ఆ.. ఆ పిల్ల మహా ముదురు. మన దగ్గర తీసుకున్న డబ్బులన్నీ హాయిగా జేబులో వేసుకుంటుంది.” అని కొందరు అన్నట్లు నాకు తెలిసింది. దానికి నేనేమీ బాధపడలేదు.

ప్రెసిడెంటు గారినీ, సుబ్బారాయుడి గారినీ, కన్వీనరు గారినీ, మరో మహిళా మండలి సభ్యురాలు త్రిపుర గారినీ, మా వూరి రిటైర్డ్ హెడ్ మాస్టరుగారినీ సహకార సంఘం సభ్యులుగా ఏర్పరిచి మొత్తం లెక్కలన్నీ వ్రాసి వారి చేతిలో పెట్టాను.

“అదేంటమ్మా.. మొదలెట్టింది నువ్వు. నీ పేరు లేకపోతే ఎలా?” అన్నారు ప్రెసిడెంటు గారు.

“సార్, నేను మళ్ళీ చదువులకి వెళ్ళాలి గదా! కలెక్టరు గారు ఒక పెయిడ్ టీచర్‍ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారుగా. తాతా నేనూ ఇక్కడున్నంత కాలం మేము అతనికి సహకరిస్తాము. మరొక విషయం ఏమంటే, ఎవరు ఏది విరాళంగా ఇచ్చినా, అది అందరికీ తెలిసేలా స్పష్టంగా ఉండాలి. అప్పుడే జనాలకి నమ్మకం పెరుగుతుంది. అప్పుడే మరింతమందిని విద్యావంతుల్ని చెయ్యొచ్చు..” అన్నాను. “అదీ మంచి ఆలోచనే. అమ్మాయ్, నీ వయసు చిన్నదైనా ఆలోచనలు గొప్పవి” అన్నారు త్రిపుర గారు.

“అవును, ఆ విషయం దాని చిన్నప్పుడే నేను గ్రహించా” అన్నారు హెడ్ మాస్టరు గారు.

***

మిత్రులారా, ఇవన్నీ నేను రాస్తున్నది నన్ను నేను హైలైట్ చేసుకోవడానికి కాదు. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకీ అక్రమాలకీ అందరికీ బాధగానే వుంటుంది. అరికట్టలేకపోతున్నామే అనే నిస్సహాయత, నిస్పృహా అందరికీ కలుగుతుంది. ఒకప్పుడు నేనూ అలా నిస్సహాయత లోనే మునిగా, అప్పడు “నువ్వు చెయ్యాలనుకున్నది ‘మంచి’ అయితే ధైర్యంగా చెయ్యి. ఎవరేమనుకున్నా లెక్కచెయ్యకుండా నిర్భయంగా చెయ్యి. ప్రతి ఒక్క ‘చర్య’కీ ‘ప్రతిచర్య’ వుంటుంది. నీ ప్రతిచర్య ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే వుండాలి. విమర్శల సంగతంటావా.. లక్షా తొంభై వస్తాయి. సద్విమర్శలూ వస్తాయి, కువిమర్శలూ వస్తాయి. మంచి పని చెయ్యడమంటే ఏటికి ఎదురీదటం లాంటిది. నీటిని చూసి భయపడేవాడు జన్మలో ఈదలేడు. అలాగే, విమర్శలకి భయపడేవారు ఏనాడూ అడుగు ముందుకు వెయ్యలేరు.” అని అమ్మమ్మ ధైర్యం చెప్పింది.. అంతేకాదు, “నువ్వు ఏ దారి ఎంచుకున్నా పొగడ్తలూ వుంటాయి, విమర్శలూ వుంటాయి. పొగడ్తలకి పొంగిపోవడం ఎంత తప్పో, విమర్శలకి క్రుంగిపోవడం కూడా అంతే తప్పు. ధైర్యం లేనివాడు పిల్లికి కూడా భయపడతాడు. ధైర్యం వున్నవాడు పులినైనా ఎదిరించగలడు. అందుకే ఏది చేసినా ధైర్యంగా చెయ్యి – ఒక్కోసారి మనం చెయ్యదలుచుకున్నది అప్పుడు ఇతరులకి తప్పుగా కూడా కనపడవచ్చు. ఆ ‘తప్పు’ అని ఇతరులు భావించేదాన్ని కూడా ధైర్యంతో పూర్తి చేసి నీ శక్తిని నువ్వే నిరూపించుకో” అని కూడా అన్నది మా అమ్మమ్మ.

పెద్దల మాట చద్దిమూట అంటారు. అందుకే జీవితంలో జరిగినవన్నీ యథాతధంగా రాస్తున్నా. అందులో ముత్యాలు వుండొచ్చు, ఆల్చిప్పలూ వుండొచ్చు. అన్నట్టు అమ్మమ్మ ఇంకో మంచి మాట చెప్పింది. “మహీ, జీవించడం వేరు, జస్ట్ బ్రతకడం వేరు. ‘జీవం’తో కూడుకున్నది జీవితం. జీవమంటే శక్తి, జీవమంటే ప్రాణం. జీవమంటే దైర్యం. ఇక బ్రతకడం సంగతా, అది జీవించడం క్రిందకి రాదు. బ్రతుకుని యీడవడం కిందకొస్తుంది” అని. నిజమేగా మరి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here