[శ్రీమతి కాసనగొట్టు స్వప్న రచించిన ‘నేను సైతం.. జనుల గొంతుకై..’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]
[dropcap]ప్[/dropcap]రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహించే, కవయిత్రి శ్రీమతి కాసనగొట్టు స్వప్న కలం నుండి జాలువారిన ‘నేను సైతం.. జనుల గొంతుకై..’ కవితని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అన్న మహాకవి శ్రీశ్రీని స్ఫూర్తిగా తీసుకొని కవయిత్రి స్వప్న ‘నేను సైతం.. జనుల గొంతుకై..’ అనే కవిత రాసినట్లుగా తోస్తోంది. శ్రీశ్రీ కవితలోని భావనలు సార్వజనీనాలు. అవి ఎప్పటికి నిలిచి ఉంటాయి. మహాప్రస్థానం పుస్తకం సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలికింది. అందుకే శ్రీశ్రీగారిని యుగకర్త అని చరిత్ర పుటలు సాక్ష్యం చెబుతాయి.
‘అక్రమాల నీడలు
అవనిని చుట్టినప్పుడల్లా..
పుడుతూనే ఉంటా’
అక్రమాలు అంటే ఆంగ్లంలో irregularities అని అర్థం. నేను ,నాది అనే స్వార్థంతో మనిషి అక్రమాలకు పాల్పడుతున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఆకర్షణీయమైన ఆవకాశాలు ఉండవచ్చు, అన్ని స్థాయిల్లోను అవినీతికి పాల్పడడం, అక్రమాలు పెరిగిపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలు కడగండ్లపాలై తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా అక్రమాలకు, అవినీతికి పాల్పడుతూ సాటి వాడ్ని దోచుకు తింటున్నారు. ఆనాటి మహాభారత కాలంలోనే అక్రమాలు, అవినీతి కొనసాగినట్లు మనకు చరిత్ర తెలుపుతుంది. కౌరవులు పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాలు చుట్టుముట్టి కల్లోలం రేగుతుంటే శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో హితబోధ చేసాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉండి పాండవులను కాపాడాడు. కవయిత్రి స్వప్న అక్రమాల నీడలు ఈ నేలను చుట్టుముట్టి కల్లోలం రగులుతూ ఉంటే నేను అక్రమాలను అరికట్టడానికి ఈ భూమి మీద పుడతానని చెప్పడం చక్కగా ఉంది.
‘అన్యాయాన్ని
కూకటి వేళ్ళతో పెకిలించే
ప్రశ్నల సునామినై..’
అన్యాయం అంటే ఆంగ్లంలో injustice అని అర్థం. అన్యాయం అంటే న్యాయం కానిది. అన్యాయం ఉంటే ఒకరికి ఇతరులు ద్రోహం చేసినప్పుడు కలిగే కోపం లేదా అసంతృప్తి అని చెప్పవచ్చు. మన చుట్టూ ఉన్న సమాజంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉండడం నిజాయితీపరులకు సాధ్యం కాదు. అన్యాయాన్ని ఎదుర్కోవడం వల్లనే న్యాయాన్ని పరిరక్షించడం జరుగుతుంది. కవయిత్రి స్వప్న అన్యాయానికి స్పందించి కవితకు ప్రాణం పోశారు. నిజాయితీపరులు ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరుగుబాటు చేస్తారు. అన్యాయం పునాదులు లేకుండా పెకిలించి వేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. నిజాయితీపరులు అన్యాయంపై ప్రజలను సమీకరించి పోరాటం చేస్తారు. నిజాయితీపరులు అన్యాయం జరుగుతున్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. నిజాయితీపరులు ప్రశ్నలను తూటాలవలె సంధించి అన్యాయాన్ని ఎదుర్కొంటారు అనే గొప్ప సంకల్పం కవితలో వ్యక్తం చేశారు.
‘ఆరని అక్షర జ్వాలై
ప్రజ్వలిస్తూనే ఉంటా..
అచేతనా స్థితిలో నలుగుతున్న
ఆడతనానికి అండగా..
కాచేవారికి కనువిప్పు కలిగించి
నరరూప రాక్షసులను
నుసి చేసే దిశగా..’
చల్లారని ఎగసిపడే అక్షరాల మంటలు మనం కనివిని ఎరుగం అని చెప్పవచ్చు. ఎగసిపడే అక్షరాల అగ్నిశిఖలు విశేషంగా మండుతూనే ఉంటాయి. స్పృహలేని స్థితికి చేరుకున్న ఆడవారికి సహాయంగా నిలుస్తాను. అక్షర జ్వాలలతో నిప్పులు కురిపిస్తూనే దుర్మార్గులను దునుమాడుతాను. అక్షరాలు ఆయుధంగా చేసుకుని అనాదిగా అణచివేయబడుతున్న సహనశీలురైన స్త్రీలకు అండగా నిలబడతాను అని కవయిత్రి చెప్పిన తీరు మానవీయతకు నిదర్శనంగా నిలుస్తుంది. అగ్ని శిఖలతో కూడిన అక్షరాలు సమాజంలో చైతన్యం రగిలిస్తూ వెలుగులు విరజిమ్ముతునే ఉంటాయి. చల్లారని నా అక్షర జ్వాలలతో స్త్రీలకు సహాయంగా నిలబడి పోరాడుతాను అని చెప్పడం చక్కగా ఉంది. కాచేవారు అంటే కాపాడేవారు రక్షకభటులు అని చెప్పవచ్చు. రక్షకభటులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలు జరగకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ అని చెప్పవచ్చు. రక్షకభటులు శాంతిభద్రతలను కాపాడడం, పౌరులను వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం అనే విధులు నిర్వర్తిస్తున్నారు. చట్టాలు, నిబంధనలను అమలు చేయడం కాచే వారి బాధ్యత అని చెప్పవచ్చు. కాచేవారు బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదు. కాచేవారు నరరూప రాక్షసులకు, నేరస్థులకు అండగా ఉంటున్నారు. ఇవ్వాళ సమాజంలో జరుగుతున్న దారుణమైన అకృత్యాలను చూస్తుంటే పావనమైన ఈ నేల పంకిలమైందా? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. దారుణమైన ఆకృత్యాలను మట్టు పెట్టడానికి శ్రీకృష్ణుడు మళ్ళీ ఈ నేలపై అవతరించాలి అని మనం కోరుకుంటాం. నరరూపంలో ఉన్న రాక్షసులు పసిపిల్ల, పండు ముదుసలి అని చూడకుండా అతివల మానాలు హరిస్తూ ప్రాణాలు తీస్తుంటే గుండెలవిసిపోతున్నాయి. అలాంటి ఘోరాలు, నేరాలు జరుగుతుంటే చూసి కవయిత్రి స్వప్న తనలోని కవితాత్మ విజృంభించేలా నరరూప రాక్షసులను అంతం చేసే దిశగా తన కలంను కరవాలం చేసి పోరాడుతానని ప్రతిన పూని ప్రజల పక్షాన నిలిచి మార్గ నిర్దేశం చేసినట్లుగా తోస్తోంది.
‘మేధో మదనానికి బీజమేసే
వాక్యాలను ప్రసవించే
కలాన్నవుతా..
పెట్టుబడిదారీ కుటిలాలోచన
ముట్టడితో..
బలైపోయే బలహీన వర్గాల రక్షణకై..’
పెట్టుబడిదారీ విధానం అనేది ఉత్పత్తి వ్యవస్థను ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంచడం, తద్వారా వారు లాభార్జన కోసం పని చేసే ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ విధానం ముఖ్యంగా లాభం కోసం మార్కెట్ లోని వస్తువుల ఉత్పత్తి మరియు అమ్మకం వైపు దృష్టి సారిస్తుంది. కార్మికునికి చెల్లించే వేతనాలు వారి శ్రమకు తగినట్లుగా ఉండవు. కార్మికులతో ఎంతో పని చేయించుకుని తక్కువ వేతనం చెల్లిస్తారు. పెట్టుబడిదారీ విధానంలో యాజమాన్యాలు, శ్రామికుల శ్రమను దోచుకుంటారు. యాజమాన్యాలు ఉత్పత్తి చేసిన వస్తువుల ప్రచారంలో రకరకాల జిమ్మిక్కులతో వినియోగదారులను ఆకర్షిస్తుంటారు. సామాన్య ప్రజానీకం అవసరం లేకున్నా ఆ వస్తువులను కొని అప్పుల పాలవుతున్నారు. యాజమాన్యాల దమన నీతి వల్ల సామాన్యులైన ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. పెట్టుబడుదారులు నిర్విఘ్నంగా చేస్తున్న దోపిడిని నిరసిస్తూ కవయిత్రి స్వప్న శ్రామిక వర్గం యొక్క శ్రేయస్సు కోసం కలాన్ని పదును పెట్టి అక్షరాలను ఆయుధంగా ఎక్కుపెట్టుతున్నారు. సమాజాభివృద్ధి మరియు పేద, బలహీన వర్గాల ప్రజల రక్షణ కోసం నా కలం అహరహం పాటుపడుతుంది అనే సందేశంతో కవయిత్రి స్వప్న కవితలో వెల్లడించిన భావాలు శ్రామిక వర్గ పక్షపాతిగా తెలియజేస్తున్నాయి.
‘పాలకులను సైతం ప్రశ్నించే జనుల
గొంతుక నవుతా..
ఏలికలైనా ఏ తప్పు చేయకూడదనే
సిద్ధాంతాన్ని ఒద్దికగా చెబుతూ..’
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు ఆయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య దేశం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ దేశంలోని ప్రజలు ఇంకా పేదరికంలో కూడు, గుడ్డ, గూడు, విద్య, ఆరోగ్యం, ఉపాధి సౌకర్యాలు లేక కునారిల్లుతున్న దుస్థితిని చూస్తే ఆందోళన కలుగుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల అణిచివేత కొనసాగుతున్నది. పాలకులను సైతం ప్రశ్నించడం ఆంగ్లంలో The voice of questioning even the rulers అని అర్థం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల సాధన కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం, నిరసన తెలుపడం, పౌరుని యొక్క బాధ్యత అని చెప్పవచ్చు. పాలకవర్గాలు ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా ఉద్యమిస్తున్న వాళ్లను లాఠీలతో బాదడం, తప్పుడు కేసులు పెట్టడం, శిక్షలు వేయించడం, జైళ్లకు పంపించడం, అణచివేసే ధోరణి కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆకాశాన్నంటిన అధిక ధరలతో కోట్లాదిమంది ప్రజలు సతమతమవుతున్నారు. చదివిన చదువులకు ఉద్యోగం దొరకక యువత నిరాశ నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిని చూస్తున్నాం. చేనేత కార్మికులు వాళ్ళ శ్రమకు సరైన ప్రతిఫలం లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జరుగుతున్న సంఘటనలు ప్రజలను తీవ్రంగా కలత పెడుతున్నాయి. పాలకుడు అంటే పాలించేవాడు అని అర్థం. పాలకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యల పట్ల స్పందించే గుణం ఉన్నప్పుడే పాలకులను ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజల మీద సానుభూతి లేకుంటే ప్రజా సమస్యల గురించి ఎలా ఆలోచిస్తారు? ప్రజలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ ప్రజల న్యాయమైన కోరికల సాధన కొరకు పాలకులతో సామరస్యంగా మాట్లాడుతాను. ప్రజా సమస్యలు పాలకులకు తెలియజేస్తాను అని కవయిత్రి స్వప్న కవితలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
‘ఆలోచనలకు పురుడోసే పదాల
సృష్టికర్త నవుతా..
కరుడుగట్టిన గుండెలను కరిగించి
మానవత్వపు బీజాలు నాటుతూ..’
కసాయి గుండెలు అంటే ఆంగ్లంలో Butcher’s Hearts అని అర్థం. కష్టాలలో ఉన్న వారిని చూస్తే స్పందించే గుణం మహాత్ములకే సొంతం అని చెప్పవచ్చు. మానవత్వం అంటే బాధితుల పట్ల కనికరం చూపటం. కులమతాలకు అతీతంగా మనుషులనందరిని ప్రేమించడం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. హింసకు పాల్పడకపోవడం. ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న. వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి. మానవతావాదం సాంప్రదాయక మత సిద్ధాంతాలకు అతీతమైనది. ప్రతి వ్యక్తి తోటి మానవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. కరుడుగట్టిన కసాయి గుండెలు కలవారు తోటి మానవులను హింసించి ఆనందిస్తారు. సాటి మానవుని పట్ల దయ చూపాలనే స్పృహ వారికి ఉండదు. అట్లాంటి కసాయి గుండెలను కరిగించి మానవత్వపు బీజాలు నాటుతాను. ఆంగ్లంలో Planting the seeds of Humanity అని అర్థం. కవయిత్రి స్వప్న మానవత్వం విలువలను చెప్పే అక్షర బీజాలను నాటుతూ ఉంటాను. సమాజంలో చైతన్యం కలిగిస్తాను అని చెప్పిన భావాల్లో నిజాయితీ ఉంది.
‘పలికే పెదవులతో స్థిరపడక
అక్షరాలతో నిత్య సేద్యం చేసే చేతులకు..
ఆపన్నులను చేరదీసే అందమైన
గుణాన్ని అలవర్చుతూ
సాగిపోతుంటా..’
పలికే పెదవులతో స్థిరపడక ఆంగ్లంలో Don’t settle for Lip Service అని అర్థం. ఇవ్వాళ సమాజంలో మాటలు చెప్పేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఆచరణకు వచ్చేసరికి అక్కడ నుండి మాయమైపోతారు. శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు మన రాజకీయ నాయకుల ప్రవృత్తి అని చెప్పవచ్చు. ఆపన్నులకు సహాయం అంటే కష్టాలలో ఉన్న వాళ్లను చేరదీసి వారికి సహాయం అందించడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇవి సుగుణాలు వాటిని అలవర్చుకుంటూ సాగిపోతుంటాను అని కవయిత్రి స్వప్న మంచి సమాజం కొరకు ఆరాటపడుతున్నట్లు కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
‘నేను సైతం
సమాజ హితానికి చేసే యజ్ఞంలో
సమిధనౌతా..’
యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న హిందూ సాంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. యజ్ఞము విష్ణు స్వరూపంగా భావించవచ్చు. యజ్ఞం అను శబ్దము యజ దేవ పూజాయాం అను ధాతువు నుంచి ఏర్పడింది. దైవ పూజను యజ్ఞం అంటారు. మనదేశంలో పురాతన కాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడం మరియు మెప్పించడం అని చెప్పవచ్చు. యజ్ఞం అనేది అగ్ని హోమం వద్ద వేదమంత్రాలతో సహితంగా జరుగుతుంది. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ఒక ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో సమిధలతో ఆహుతులు ఇస్తారు. యజ్ఞంలోని ఆహుతులు దేవతలు అందరికి చేరుతాయనే విశ్వాసం కలదు. యజ్ఞ గుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి స్వచ్ఛతకు దారితీస్తాయి. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు. యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరు లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశు పక్ష్యాదులు బాగుంటాయి. అంటు వ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. మనకు హాని చేసే క్రిములు నశిస్తాయి. అగ్ని హోమాల్లోని భస్మాలతో ఔషధాలు తయారు చేయవచ్చు. యజ్ఞ యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. యజ్ఞం పొగను పీల్చడం వల్ల అనారోగ్యాలు నయమవుతాయి. వర్షాభావం మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి దేశం సుభిక్షంగా ఉంటుంది. సమాజ హితానికి చేసే ఈ అక్షర యజ్ఞంలో కవయిత్రి స్వప్న నేను సైతం సమిధగా సమర్పించుకుంటాను. అక్షర యజ్ఞ ఫలాలు సామాన్యులైన జనాలు అందరికీ అందాలని దేశ సౌభాగ్యం కోసం సమిధనై కృషి చేస్తాను అనే భావం వెల్లడించడం చక్కగా ఉంది.
‘భావోద్వేగపు సిరాను నా కలంలో
జొప్పించి..
ఆగని కవన తరంగిణి నై
ప్రవహిస్తూ..’
భావోద్వేగాలు అనేవి హార్మోన్ల యొక్క సంక్లిష్ట మిశ్రమం. అపస్మారక మనసు వల్ల కలుగుతాయి. చాలా బాధాకరమైన భావోద్వేగాలు మన చేతన ప్రయత్నం ద్వారానే నియంత్రించవచ్చు. భావోద్వేగాలు అంటే భయం, క్రోధం, బాధపడటం, సంతోషం, అసహ్యం, నమ్ముట, అంగీకారం, ఆశ్చర్యం అని చెప్పవచ్చు. భావోద్వేగాలు ఆలోచనల కన్నా శక్తివంతమైనవి. మన బుద్ధిని సరిగా నియంత్రించి నిర్దిష్ట మార్గంలో వెళ్లడానికి నా కలంలో సిరాలా పోసి ఆగని కవన ఏరులై ప్రవహిస్తూ ఉంటాను అనే భావన అద్భుతం. కవయిత్రి స్వప్న తనలో చెలరేగే భావోద్వేగాలను అనుకూలంగా మలుచుకుని నేను సైతం నా కలంలో సిరాను పోసి కవన తరంగాల నదినై ప్రవహిస్తూ సాగుతాను అని చెప్పడం చక్కగా ఉంది. కవయిత్రి స్వప్న మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కాసనగొట్టు స్వప్న తేది 21 నవంబర్ 1984 న జన్మించారు. మల్లాపూర్ గ్రామం తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లాకు చెందినవారు. తల్లి మధుర, తండ్రి పోశెట్టి. తండ్రి పోశెట్టి వ్యాపారం చేసేవారు. తాత వీరయ్య, నానమ్మ చిలకమ్మ. తాత వీరయ్య వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. కాసనగొట్టు మధుర, పోశెట్టి దంపతులకు ఇద్దరు సంతానం. 1) ప్రథమ సంతానం: స్వప్న భర్త కృష్ణ. స్వప్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. భర్త కృష్ణ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. 2) ద్వితీయ సంతానం: వంగల రజిత భర్త శ్రీనాథ్. శ్రీనాథ్ ప్రభుత్వ ఉద్యోగం చేయుచున్నారు. రజిత ఎంబీఏ. చదువుకున్నారు.
స్వప్న 1వ, 2 వ తరగతులు మల్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివారు.3వ తరగతి నుండి 6వ తరగతి వరకు మల్లాపూర్ గ్రామంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదివారు. 7 నుండి 10వ తరగతి వరకు మన్నెంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదివారు. మల్లాపూర్ గ్రామం నుండి మన్నెంపల్లి గ్రామంనకు బస్సు సౌకర్యం లేదు. మూడు కిలోమీటర్లు దూరం ఉండేది. స్వప్న రోజు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఇంటర్మీడియట్ సి.ఇ.సి. వాణి నికేతన్ బాలికల జూనియర్ కళాశాల, కరీంనగర్‍లో చదివారు. కరీంనగర్ లోని జయశ్రీ డిగ్రీ కళాశాలలో B.com చదివారు. B.Ed. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల, హనుమకొండలో చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ పి.జి. కాలేజీలో M.com చదివారు.
స్వప్న 01-03-2008 సంవత్సరంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా అప్పర్ ప్రైమరీ స్కూల్ కొండాపూర్ గ్రామం, చిగురుమామిడి మండలం,కరీంనగర్ జిల్లాలో నియమింపబడ్డారు. స్వప్న ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ రొంపిగుంట గ్రామం కమాన్‍పూర్ మండలం పెద్దపెల్లి జిల్లాలో పనిచేస్తున్నారు. స్వప్న వివాహం కృష్ణతో 21-03-2009 రోజున కరీంనగర్‌లో జరిగింది. కాసనగొట్టు స్వప్న, కృష్ణ దంపతులకు ఇద్దరు సంతానం. 1) ప్రథమ సంతానం: అభిరామ్ 9 వ తరగతి చదువుతున్నాడు. 2) ద్వితీయ సంతానం: సిద్ధిత 5వ తరగతి చదువుతున్నది. స్వప్న 2006 సంవత్సరం నుండి కవితలు వ్యాసాలు రాయడం ప్రారంభించారు. 2018 సంవత్సరం నుండి ప్రవృత్తి రీత్యా రచన వ్యాసంగం కొనసాగిస్తున్నారు.
కాసనగొట్టు స్వప్న ముద్రిత రచనల వివరాలు: 1) ఎందుకో ఈ వేళ – 2020. 2) స్వప్న మంజరి – 2023.
కాసనగొట్టు స్వప్నకు లబించించిన పురస్కారాలు.
- స్వప్న విద్యార్థి దశలో 2001 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిభ పురస్కార్ అవార్డు పొందారు.
- తేది 08-03-2017 రోజున కరీంనగర్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు పొందారు.
- తేది 05-10-2018 రోజున రోటరీ క్లబ్ నుండి నేషన్ బిల్టర్ అవార్డు పొందారు.
- తేది 22-08-2023 రోజున తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వారి నుండి గ్రామీణ కళాజ్యోతి అవార్డు పొందారు.
- తేది 27-08-2023 రోజున స్వప్న మంజరి పుస్తకానికి విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారి గజల్ బుక్ అవార్డ్ పొందారు.