వర్షించని మేఘం

0
4

[శ్రీమతి సుగుణ అల్లాణి రచించిన ‘వర్షించని మేఘం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]మే[/dropcap]ఘావృతమైన ఆకాశం వర్షిద్దామా వద్దా అని ఆలోచనలో పడ్డట్టుంది. కసితీరా కమ్ముకుంటున్న నల్లని మబ్బులు వాన పడే తీరాలని పట్టుపట్టినట్టున్నాయి.

మేఘన బాల్కనీలో కూర్చుని ఆకాశం లోకి చూస్తూ ఉండిపోయింది. తన మనుసు నిండా కూడా ఆలోచనా మేఘాలు కమ్ముకున్నాయి.

మేఘనకు తన తల్లి మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మూడు రోజులుగా అమ్మ ఒకే మాట చెపుతుంది. “నీవు ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు.” అని. తను చెప్పేదేంటంటే.. ఏ ఆడపిల్లకైనా ఆర్థిక స్వావలంబన అవసరం అని.. తనను ఈ పొజిషన్‌కి తీసుకురావడానికి అమ్మ చాలా కష్టపడింది.. అమ్మ చదివినది డిగ్రీయే అయినా టీచర్‌గా ముప్పైఏళ్లు చేసింది.

ఇప్పుడు సూర్యకు తను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కారణం మాత్రం పిల్లాడికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నాడు. కానీ అది కాదని అర్థమవుతోంది. మరి ఇంకేం అయివుండచ్చు. పెళ్లికి ముందే చెప్పింది పెళ్లైయియాక కూడా జాబ్ చేస్తానని, తనకు జాబ్ అనవసరమని మానేయనని.. మరి ఇప్పుడు ఇలా మానేయమని పట్టుపడుతున్నాడెందుకు. ఎంత ఆలోచించినా మేఘనకు అర్థం కాలేదు.

అమ్మ ఎప్పుడూ తన మంచికే చెపుతుందని తెలుసు కానీ, సూర్య మాట కాదంటే ఇంట్లో రణరంగమే కదా! చెప్పకముందే తనే అరుస్తాడు.

ఎలా చెప్పాలి.. ఆలోచిస్తూ ఉండిపోయింది.

మేఘన తలిదండ్రులు సుమ సుబ్బారావులు వారికి ఒక్కగానొక్క కూతురు మేఘన. చక్కని చుక్క. చిన్నప్పటి నుండి చదువులో ఆటల్లో ముందుండేది. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్‌లో పాసయ్యింది. కాంపస్ సెలక్షన్స్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తన పెర్ఫామెన్స్‌కి మంచి జీతం కోట్ చేసి తీసుకున్నారు.

బెంగుళూరుకు, వెళ్తే మరింత ఎక్కువ జీతం అన్నారు కానీ, అమ్మానాన్నలను విడిచి వెళ్లలేనని హైదరాబాద్ లోనే చేరింది. అందంతో పాటు అణుకువ, మాటలో మర్యాద, పనిలో నైపుణ్యత, నిరాడంబరమైన వస్త్రధారణ, నడకలో గాంభీర్యం, నడతలో హుందాతనం కలిసి మేఘనని అందరిలో ప్రత్యేకంగా ఉండేలా చేసాయి. ఈ లక్షణాలు ఎవరైనా ఇష్టపడేలా చేసేవి. చేరిన అతి తక్కువ కాలంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంది.

అదే కంపెనీలో సూర్య మరో హెచ్.ఆర్. తను కంపెనీలో చేరినప్పటినుండి మేఘనను దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు. మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చి, మనసు పడ్డాడు. తన కన్నా కొంచం ఎక్కువ స్థాయిలో ఉన్నందున తొందర పడి తన ఫీలింగ్స్‌ని బయటపడనీయలేదు.

ఒక సంవత్సరం తర్వాత ఒక క్లైంట్స్ కాన్ఫరెన్స్‌కి బెంగుళూరు ఇద్దరూ కలిసి వెళ్లవలసి వచ్చింది. ఇక ఈ అవకాశాన్ని వదలుకోకుండా సూర్య తన శాయశక్తులా ప్రయత్నించి మేఘనకు దగ్గరయ్యాడు. తిరిగి వచ్చాక సూర్య తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. సూర్య ప్రవర్తన, తన గురించి తీసుకునే జాగ్రత్త ఆఫీస్‌లో సూర్య పొజిషన్ చూసిన మేఘనకు నిరాకరించడానికి కారణం కనుపించలేదు. అయినా అన్ని విధాలా సూర్యను గమనించి ఒప్పుకోవడానికి ఆరునెలలు పట్టింది.

మేఘన తల్లి సుమ ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్. తండ్రి కూడా ప్రైవేట్ ఉద్యోగమే. ఏదో కొంత పెద్దల ఆస్తి తాలూకు డబ్బు ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు.

హైదరాబాదులో చిన్న అపార్టుమెంటు కొనుక్కుని ఉన్నారు. మేఘనకు కావలినంత స్వేచ్ఛనిచ్చారు. ముగ్గురిదీ ఒకేమాట.

అందుకే ఎటువంటి సంశయం లేకుండా సూర్య విషయం చెప్పింది మేఘన. కానీ కుల ప్రస్తావన దగ్గర కొంత ఇబ్బంది పడ్డారు. తర్వాత మేఘన మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుని పెళ్లిచేసారు. రెండేళ్లకు ఒక కొడుకు పుట్టాడు.

గత కొన్నిరోజుల నుండి సూర్య ప్రవర్తనలో మార్పు గమనిస్తున్నది మేఘన.. పెళ్లికి ముందు, పెళ్లైన తర్వాత కొన్ని రోజులు వరకు తన తలిదండ్రులతో గౌరవంగా ప్రవర్తించాడు..

ఒక సంవత్సరం చాలా సంతోషంగా గడిచిపోయింది. కొడుకు పుట్టడం వాడికి ఆరునెలలు వచ్చేవరకు లీవులో ఉండి, తర్వాత ఆరు నెలలు వర్క్ ఫ్రం హోం చేసింది. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్తోంది. కొడుకుని పొద్దనే తల్లిదగ్గర దించి, మళ్లీ ఇంటికి వెళ్లేటపుడు తీసుకొని వెళ్లేది. తల్లి సుమ టీచర్ ఉద్యోగాన్ని వదిలేసింది మనవడి కోసం. మనమడితో చాలా సంతోషంగా గడిపేది. ఎందుకో ఇలా సుమ దగ్గర సాత్విక్‌ని దింపడం ఇష్టం లేదేమో! అనుకుంది. కానీ అడగలేదు.

మేఘనకు మలేరియా జ్వరం వచ్చింది. పసి పిల్లవాడితో పని చేసుకోవడం కష్టం అని సుమ వచ్చి తమ ఇంటికి తీసుకెళ్లింది. అదే సమయంలో సూర్య వాళ్ల అమ్మ నాన్న చెల్లెలు వచ్చారు. ఆ టైంలో సూర్య మేఘనను ఇంటికి రమ్మన్నాడు. ఆ నూటమూడు జ్వరంతో ఎలా వస్తుంది సూర్యా ..తగ్గిన తర్వాత వస్తుందని సుమ అనడంతో కోపం వచ్చి వెళ్లిన వాడు మళ్లీ ఎలా ఉందో అని చూడడానికి కూడా రాలేదు. ప్రతి రోజూ ఫోన్ చేసింది. జవాబు ఇవ్వలేదు. చాలా బాధపడింది మేఘన..

ఆరు రోజులకు కొంచెం జ్వరం జారి పత్యం తిన్న మేఘన మళ్లీ తనే మెసేజ్ చేసింది జ్వరం తగ్గింది వస్తున్నాను అని.

ఏ జవాబు లేదు. అన్నీ సర్దుకొని బయలుదేరుతూంటే చిన్న పిల్లాడితో ఒక్కదాన్ని పంపలేక సుమ నేనూ వస్తాను అన్నది.

అక్కడికి అమ్మ వస్తే ఏం గొడవో ఏమో! అనుకున్నది కానీ అమ్మను కాదనలేక బాబుతో సహా తన ఇంటికి వెళ్లింది మేఘన.

వెళ్లేటప్పటికి ఎవరూ లేరు. తాళం వేసి ఉంది.

తన దగ్గర ఉన్న తాళం చెవితో తలుపు తీసింది. ఇంట్లోకి వెళ్లి చూసి.. అలాగే కుర్చీలో కూలబడింది మేఘన.. ఇల్లంతా చిందరవందరగా ఘోరంగా ఉంది.

సుమ ఏం మాట్లాడకుండా వాచ్‌మన్ భార్యని పిలుచుకువచ్చి తానూ ఆమె కలిసి ఇల్లంతా శుభ్రం చేసింది.

మేఘన బెడ్ రూం అంతా సర్దుకుంది. రూం నిండా విడిచిన బట్టలు ఉన్నాయి. అన్నీ తీసి వాషింగ్ మిషన్‌లో వేసింది. పాలు తాగించి బాబును పడుకోబెట్టింది.

ప్రొటినెక్స్ వేసిన పాల గ్లాస్ మేఘన చేతికి ఇచ్చి, వంటంతా చేసాను.. నాన్న ఎదురు చూస్తారు ఇక వెళ్లొస్తానని చెప్పి సుమ వెళ్లిపోయింది.

అప్పటికే వాన వచ్చేట్టుందని అనుకుంది. తల్లి వెళ్లిన తర్వాత తలుపు వేసి వచ్చి బాల్కనీలో నిలబడి సూర్య గురించి ఆలోచిస్తూ మేఘాలు కమ్మిన ఆకాశాన్ని చూస్తూ కూర్చుంది..

తలుపు తీసిన శబ్దం విన్నది. ఆలోచనలనుండి బయటపడి.. ప్రస్తుతానికి వచ్చింది. ఆరు రోజుల తర్వాత జ్వరం తగ్గి వచ్చిన తన దగ్గరికి వెంటనే వస్తాడేమో అని ఎదురుచూస్తూ మంచం మీద కూర్చొని లాప్‌టాప్ ముందేసుకుంది.

మేఘన వచ్చినట్టు తెలిసినా, చూసినా అత్తగారు మామగారు ఆడపడుచు అందరూ చూడనట్టే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సుమ వండిన వంటను సూర్యతో పాటు అందరూ తిన్నారు. ఎవరూ లోపలికి వచ్చి ఎలా ఉందని అడగలేదు. తింటావా అని అడగలేదు. నవ్వులు మాత్రం గట్టిగట్టిగా వినపడుతున్నాయి. నీరసంగా ఉన్నా మర్యాద కాదని బయటకు వెళ్లింది. అందరినీ చూసి నవ్వింది పలకరింపుగా. ఎవరూ మాట్లాడలేదు. పది నిమిషాలు చూసింది. ఓపికలేక రెండు చపాతీలు ప్లేటులో పెట్టుకొని లోపలికి వచ్చేసింది.

గంట తర్వాత సూర్య వచ్చాడు రూం లోకి. ఏం మాట్లాడ లేదు ..మేఘన కూడా.. తినేసి, తన వర్క్ తాను చేసుకుంటూ కూర్చున్నది. సూర్య బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని బాల్కనీలోకి వెళ్లాడు.

పదిహేను నిమిషాల తర్వాత మేఘన లాప్‌టాప్ మూసేసింది. సూర్య బాల్కనీలో కుర్చీలో కూర్చుని బయటకు చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు.

మేఘన బాబు దుప్పటి సరిచేసి బాల్కనీ తలుపు తీసుకొని వెళ్లి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

తల తిప్పి ఓసారి చూసి.. మళ్లీ ముఖం తిప్పేసుకున్నాడు.

“అంటే ఇంక నాతో మాట్లాడదలుచుకోలేదా సూరీ” అన్నది మేఘన

సిగరెట్ పడేసి మేఘన వైపు చూసి “ఏం మాట్లాడమంటావూ.. నేనేది మాట్లాడినా నీకు కోపం వస్తుంది..” అన్నాడు

“చెప్పే విషయాన్ని సరిగా రీజనింగ్‌తో చెప్తే ఎందుకు విననూ!” అన్నది

“అంటే నేను మాట్లాడే మాటల్లో రీజనింగ్ లేదా? అయినా నేను నీ అంత ఇంటెలిజెంట్ కాదులే!”

“చూడు సూర్యా! నేను ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు. అస్సలు ఓపిక లేదు. నేను చెప్పేది విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి ప్లీజ్!! ఇది మనిద్దరికీ మంచిది. మధ్యలో మాట్లాడకుండా విను.”

ఏ సమాధానమూ లేదు.. !

“నేనేంటో నీకు తెలియదా! పెళ్లికి ముందే నీకు చెప్పాను.. జాబ్ మాననని.. నేను ఎందుకు మానెయ్యాలో ఒక కారణం చెప్పు ప్లీజ్.. సంవత్సరానికి నలభైలక్షల పాకేజ్ నాది.. ఎంత కష్టం ఇది మానేస్తే.. ఫ్యూచర్‌లో ఎన్ని అవసరాలుంటాయి?” అన్నది మేఘన చాలా నెమ్మదిగా.

“ఇదే నాకు నచ్చనిది.. నా కన్నా నీకు పాకేజ్ ఎక్కవన్నగర్వం నీకు..” కక్కినట్టు కచ్చగా ఈర్ష్యగా అన్నాడు.

ఓ ఇది నా మీద జెలసీనా అనుకుంది మనుసులో!

“ఇది కొత్తగా ఏం కాదుగా! ముందునుండి నీకన్నా నాకెక్కువే! అప్పుడు లేని ప్రాబ్లెం ఇప్పుడెందుకు వచ్చింది నీకు! అప్పుడు నీకు తెలియదా! తెలిసి, నచ్చే ప్రపోజ్ చేసినావు కదా! అయినా ఎప్పుడైనా నేను నిన్ను తక్కువ చేసానా? అయినా నీకు కూడా ఆల్మోస్ట్ అంతే కదా!” ఆశ్చర్యంగా అన్నది.

ముఖం తిప్పుకుని కూర్చున్నాడు.

మేఘన మళ్లీ తనే..

“ఇప్పుడు బాధపడి ఏం లాభం సూర్యా! పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి. ఇటువంటి ప్రాబ్లెంస్ వస్తాయని.. అప్పుడు ఏవైతే బాగా నచ్చుతాయో పెళ్లైన కొన్నేళ్లకు ఫేడ్ అయ్యి నచ్చవు.. మనం పెళ్లి చేసుకున్నాము. నచ్చక పోతే వదిలేయడానికి ఇది లివిన్ రిలేషన్ కాదు. ఏది ఏమైనా కలిసే ఉండాలి.. పిల్లల కోసమైనా..

ఇక నా జాబ్ అంటావా.. నేను ఉద్యోగం వదిలే ప్రసక్తే లేదు.. మా అమ్మానాన్నలను చూసుకునే బాధ్యత నాది. వాళ్లిద్దరికీ పెన్షన్ లాంటిదేమీ లేదు. నేనే ఆధారం. ఇక నీ వైపు మీ చెల్లి చదువు ,పెళ్లి ఉన్నాయి. ఊళ్లో కట్టిన ఇంటి అప్పు ఉంది. వీటన్నిటికీ డబ్బు కావాలా వద్దా? అది కాకుండా మన హోం లోన్, కార్ లోన్.. ఇవన్నీ నువ్వు చూసుకుంటావా? మా అమ్మావాళ్లతో సహా!!” అన్నది

సూర్య తెల్ల ముఖం వేసి చూస్తున్నాడు మేఘన కేసి.. తనకెందుకు తట్టలేదివన్నీ!!

ఇంటి ఆడవాళ్లు ఉద్యోగం చేయడం మన ఇంటావంటా లేదు.. అయినా నీ కంటే ఎక్కువ సంపాదిస్తే నీకు విలువ ఇవ్వదంటూ అంటూ గత సంవత్సరం నుండి చెవిలో పోరుతున్నారు.. అమ్మానాన్న.. అది పట్టుకొని మేఘనను మాటలతో చేతలతో ఎన్నో రకాలుగానో బాధపెట్టాడు. ఆర్నెల్లు మెటర్నిటీ లీవు, తర్వాత వర్క్ ఫ్రం హోం చేస్తూ సంవత్సరం నుండి ఇంట్లో ఉండిపోయింది. ఈ మధ్యే వెళుతుంది.. అందుకే ఇప్పుడు చెప్పాలిసొచ్చింది. చెప్పడం కాదు బలవంత పెట్టాడు.. మేఘన మాట్లాడిన మాటలు విన్నాక..

ఇంతగా ఆలోచిస్తుందా తన గురించి తనవాళ్ల గురించి.. ఫ్యూచర్ గురించి ఆ ప్లానింగ్, క్లారిటీ ఆశ్చర్యమనిపించింది..

తను అన్నవి అన్నీ కరెక్టే!నేనెందుకు ఆలోచించలేదు.?? అనుకున్నాడు

మళ్లీ మేఘనే “సూర్యా! ఇంతకి నన్ను ఉద్యోగం మానమనటానికి ఇదేనా కారణం ఇంకేదైనా ఉందా?” అన్నది.

“అబ్బే అదేం లేదులే..” అంటూ లోపలికెళ్లి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.. ఈ బాధ్యతలన్నీ మోయడం వాటి గురించి ఆలోచించడం తనవల్ల కాదు..ఆ విషయం మేఘనతో చెప్పలేక.. ఏం మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాడు.

మేఘన కూడా ఇక రెట్టించకుండా వెళ్లి పడుకుంది..

***

ఈ విషయమై చాలా రోజులు ఇద్దరూ మాట్లాడుకోలేదు..

మేఘన తన ఇంటి పని, సాత్విక్, ఆఫీసు తల్లిదండ్రులు.. ఈ విషయాల్లో మునిగిపోయింది.

సూర్య కూడా ఎటువంటి గొడవ లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు.

***

సూర్యలో వచ్చిన ఈ మార్పు చూసి తల్లీకూతుళ్లు గుంభనంగా నవ్వుకున్నారు..

సాత్విక్ పదినెలలు రాగానే మేఘన తన ఇంటికి వెళ్లింది.. అప్పుడప్పుడే సూర్య ఉద్యోగం మానమని మెల్లిగా మొదలుపెట్టాడు. ముందు సీరియస్‌గా తీసుకోలేదు.. తరువాత ఏదోరకంగా మనుసు బాధపడేలా మాటలనడం.. వెక్కిరించడం ఆఫీసులో పంచ్ డైలాగులు ఎక్కువవడంతో తల్లికి చెప్పింది. “నేనింక భరించలేను.. వచ్చేస్తాను నా బతుకు నేను బతుకుతాను నాకు మీరున్నారు, నా సాత్విక్ ఉన్నాడు.. చాలులే అమ్మా నాకు!!” అన్నది మేఘన.

అందుకు సుమ.. “కోప్పడినా, తిట్టినా, మాటకు మాట మాట మాట్లాడినా నీ కాపురం కూలుతుంది.. ప్రతి బంధం లోనూ వాదనలు వివాదాలు మాటలు అనడం తప్పకుండా ఉంటాయి. మనుషులు నచ్చి మన అనుకున్నపుడు వాళ్లలో మంచి చెడు రెండు అంగీకరించాలి. ఏ బంధాన్నైనా ఓర్పుతో సర్దుకొని నిలబెట్టుకోవాలే తప్ప వదులేసుకోకూడదు. వదిలేయడం పిరికితనం. అంటే నీవు బాధ్యత నుండి పారిపోయినట్లు. ఇక పెళ్లి.. పెళ్లి అగ్రీమెంట్ కాదు నచ్చకపోతే కాన్సిల్ చేసుకోవడానికి.. పెళ్లి కమిట్‌మెంట్.. ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని అభిప్రాయ బేధాలున్నా ఎవరోఒకరు సర్దుకోవలసిందే!

నేనెందుకు కాంప్రమైజ్ కావాలి?

నేనే ఎందుకు తగ్గాలి అని ఇద్దరూ అనుకుంటారు. అలా అనుకొని కూల్చుకున్న కాపురాలు ఈ కాలంలో కోకొల్లలు. నీకు అలా కాకూడదు.

జీవితాంతం ఉండాల్సిన బంధం..ఏ ప్రయత్నం చేయకుండా చేతులెత్తడం కరెక్ట్ కాదు. అందుకే…

నీవు కొన్ని రోజులు మౌనంగా ఉండు.. తర్వాత పరిస్థితి అర్థం అయ్యేలా నిదానంగా చెప్పు.. నీ ఉద్యోగం వల్ల లాభాలున్నాయా.. ఏమైనా ఇబ్బందులున్నాయా..మానేస్తే పరిస్థితి ఏంటి.. అని క్లియర్‌గా చెప్పు..

వినక పోతే ఏం చేయాలో అప్పుడు చూద్దాం… ఎక్కడా నీవు ఆవేశపడకు.. ఇద్దరూ ఆవేశపడితే నష్టమే తప్ప మరేం ఉండదు..” అన్నది..

అమ్మ సలహా మాత్రం బాగా వర్కవుట్ అయింది..

సూర్య మారాడా లేక నటిస్తున్నాడా తెలీదు. తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు మేఘన. మారుతాడని కూడా మేఘన అనుకోవడం లేదు.

ప్రస్తుతం తన ఆలోచన అంతా కొడుకు సాత్విక్ గురించే.. సూర్య మరోసారి ఉద్యోగం మానమని మాత్రం అనలేదు. కానీ ఎటువంటి గొడవ లేకుండా రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి.. మేఘనకు ఎటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోకుండా విషయం చక్కబడింది అనే తృప్తి మిగిలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here