[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మైసూరులో స్థిరపడిన తెలుగు కుటుంబాలలో జాహ్నవి వాళ్ళ కుటుంబం ఒకటి. సిద్ధార్థనగర్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్కూలు ముగిసాకా, ఆరుగురు అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయల్దేరుతారు. ఇంటి సమీపానికి చేరిన జాహ్నవి తమ చిన్న డాబా ఇంటిని చూసి నిరుత్సాహపడుతుంది. అసలు ఇల్లంటే ఎలా ఉండాలో తలచుకుంటుంది. తమ ఇల్లు ఇలా ఉండడానికి కారణం తాతయ్యగారు, అమ్మ అనుకుంటుంది. వాళ్ళ తాతయ్యగారు అత్యంత క్రమశిక్షణ గల మనిషి. ప్రతీదీ అనుకున్న సమయానికి చేసి తీరాలనుకునే వ్యక్తి. తమ ఇంట్లో స్తబ్ధత, వెలితి ఎందుకో అనుకుంటుంది జాహ్నవి. డాబా మీద నుంచి అమ్మ మాలతి నవ్వుతూ పలకరిస్తుంది. లోపలికి వెళ్ళి ప్రెష్ అయ్యి, తాతయ్యని పలకరించి క్రింది పోర్షన్‍లోని ఆరేళ్ళ పాప టీనాతో ఆడుకుని వస్తానని వెళ్తుంది జాహ్నవి. అక్కడ టీనా తమ బొమ్మలతో అడుతూంటుంది. ప్రస్తుతం తాను అమ్మననీ, జాహ్వని టీనా అని చెబుతూ వంట ఆట ఆడుతూంటుంది టీనా. తండ్రి శ్రీనివాస్‍కి తమ్ముడు పింటూ పాత్ర ఇస్తుంది. ఆటలో భాగమైపోయిన శ్రీనివాస్ కూతురిని ముద్దు చేస్తాడు. కాసేపయ్యాకా ఇంటికి వచ్చేస్తుంది జాహ్నవి. అన్నం తిని, హోం వర్క్ చేసుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. కప్‍బోర్డ్ నుంచి తనకిష్టమైన ‘మున్ని’ బొమ్మని బయటకు తీసి దాన్ని చెక్కిలికి అదుముకుంటుంది. అప్పుడామె మనసులో తన తండ్రి మెదులుతాడు. మర్నాడు మామూలుగా బడికి వెళ్ళిపోతుంది జాహ్నవి. అప్పుడు తాతగారు ఊరెళ్ళారనీ, అమ్మ మందులు వేసుకుందో లేదో అని గుర్తు చేసుకుంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మాలతి భర్త ఆనంద్ జ్ఞాపకాలలో మునిగిపోతుంది. పెళ్ళి ఆల్బం తీసి చూస్తుంది. బాధాకరమైన గతం గుర్తొచ్చి, ఉద్విగ్నతకు లోనై చుట్టూ ఉన్న వస్తువులని విసిరేస్తుంది. మళ్ళీ అంతలోనే తనని తాను సంబాళించుకుని, అన్ని జాగ్రత్తగా సర్ది, ఆల్బం జాహ్నవి కంటబడకుండా దాచేసి, కూతురి కోసం ఎదురుచూస్తూ మెట్ల మీద నిలబడుతుంది. మర్నాడు జాహ్నవి స్నేహితురాలు నీలిమ పుట్టినరోజు కావడంతో, నీలిమ కోసం ఓ అందమైన బొమ్మని గీస్తుంది. జిప్ తీస్తే హ్యాండ్ బ్యాగ్‍లా ఉండే ఓ పప్పిని సెలెక్ట్ చేసి మిత్రురాళ్ళతో కలిసి నీలిమ ఇంటికి వెళ్తుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 2
[dropcap]“జా[/dropcap]నూ లేకుంటే ఇల్లు ఇల్లులా కనిపించదు, కదూ, నాన్నా!” నీలి బర్త్‌డేకు జాహ్నవి వెళ్ళిన సందర్బంగా అంది మాలతి. తాతగారికి మర చెంబులో నీళ్ళు బల్ల మీద ఉంచింది.
“అంతే కదా, మాలతమ్మ! ఈ ఇంటి వెలుగు, మన కంటి దీపం అదే!” అన్నారు తాతగారు. పెద్దదిగా ఉన్న ఆ రూమ్‌లో ఆయన మంచం వైపుకు తిప్పి పెట్టిన టేబుల్ ఫ్యాన్ ఉంది. పాత కాలం టేకు వుడ్‌తో చేసిన మంచం, ప్రక్కన అలాంటిదే పాత కాలం బల్లపై ఆలిండియా రేడియో, అద్దాలు బిగించిన టేక్ వుడ్ షెల్ఫ్ లో ఆయనలా ప్రాక్టీస్ చేసినప్పటి పుస్తకాలు.. తాతగారికి పాత పై గల మక్కువను తెలిపేలా ఉంది, ఆ గది ఎక్కడివక్కడ సర్ది, ఆ కాలం వారి క్రమ పద్ధతికి దర్పణంలా ఉంది.
“జాహ్నవి పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి” అంది మాలతి. “అది ఎప్పుడూ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్టే కదా, అయినా పదవతరగతి అంటే కాస్త ఆందోళన ఉండే మాట వాస్తవమే. కానీ, దాని విషయంలో సంపూర్ణ విశ్వాసంగా ఉండు, మాలతీ!” అని ఆయన అంటుండగా ఆయన రూమ్ లోని ల్యాండ్ లైన్ గణ గణా మ్రోగింది. ఆయన ఫోన్ ఎత్తి “హలో! నీ వేనా! డబ్బాలో గులక రాళ్ళు పోసి గడగడ లాడించినట్టు ఫోన్ మోత లోనే తెలిసింది” అన్నారు.
తాతగారి ఆ పరిహాసం విని అవతల భూషణం బాబాయ్ గారి ఫోన్ అని అర్థమయి, దరహాసం విరిసింది మాలతి పెదవుల పై. మొన్న ఫోన్ చేసినప్పుడే మాట్లాడింది, బాబాయ్ గారితో. అందుకే హాల్ లోకి నడిచింది.
మనిషికి మనిషి అలికిడి కావాలి. తోటి మనిషి ఉనికి తెలిసేలా ఉండాలి. ఫోన్స్ మనుషులకు ఎప్పుడూ ప్రత్యమ్నాయం కావు. మాలతి కెప్పుడూ మనుషులు కావాలి. ఇంట్లో మాటలు నిండాలి. ఇంట్లో ఆ లోటు భర్తీ చేసేది జాహ్నవే.
కానీ.. జాహ్నవికి కూడా మాటలు పంచేవారు కావాలి. సందడి నింపే వారు కావాలి. అమ్మా, తాతయ్యా ఆమె ప్రెసెన్స్ కోసం ఎదురు చూస్తూన్నట్టే, ఆమె మనసు మరొకరి ప్రెసెన్స్‌ను ఆశిస్తోందనేది, వాళ్ళ ఊహ లోకి కూడా రాని విషయం.
మాలతి, తాతగారి ఫోన్ మాట్లాడడం కాగానే భోజనం తీసుకొని వెళ్ళ వచ్చు అని సోఫాలో వాలింది. టీవీలు చూడడం ఎప్పుడో మానివేసింది, ఏ కథ తన గతం తలుపు తడుతుందోనని భయంతో.
ఓ నిముషం, అప్రయత్నంగా చేయి రిమోట్ మీదకు వెళ్ళింది. ఎప్పుడైనా అలా మధ్యలో పెట్టి చూస్తుంటుంది. మంచి పాట వస్తోంది.
మానస వీణా మధు గీతం
మన సంసారం – సంగీతం.
ఒకప్పుడు తాను గుండెల నిండా పొంగే ఆనందంతో, ఆ పాటతో మమేకమై గొంతు కలిపేది. ఇప్పుడు విషణ్ణ వదనయై, మనసుగతం లోకి పలాయనం చిత్తగిస్తూంటే, ఉలిక్కిపడి టి. వి. ఆఫ్ చేసింది మాలతి.
భర్త తోడిదే ప్రపంచం అంటారు.
భర్త తోడు లేకుంటే ప్రపంచం నుండే దూరం జరగడం ఏమిటో!
మాలతి మనస్తత్వం అలాంటిదే!
***
నీలిమ తన బర్త్‌డే ఫంక్షన్‌కు ఖరీదైన పింక్ కలర్ గాగ్రా చోళీ వేసుకుంది. అసలే అందమైన ఆమె, మరింత అందం సంతరించుకుంది. స్నేహితురాళ్ళను చూసి నీలిమ కళ్ళల్లో అంతులేని సంతోషం..
బోర్డ్ ఎగ్జామ్ కదా, స్కూల్, చదువుల్లో బిజీ అందరూ. తననెటూ ఇంట్లో పంపరు. జానూను ఎంత మిస్ అవుతున్నానో అనుకుంది.
అందరూ వెళ్ళేదాకా అమ్మాయిలంతా వెయిట్ చేసారు. అప్పుడు మొదలయ్యింది, వాళ్ళ అల్లరి.
నీలి రూమ్‌లో డెక్ మ్రోగుతూంది. తాము తెచ్చిన కేక్ నీలూతో కట్ చేయించారు. ఎన్నో రుచుల మేళవింపు రూమ్ లోకే సర్వ్ చేయబడింది. ఒకరి నొకరు పరిహాసాలాడుతూ, నవ్వుల నావలో తేలియాడుతూన్నారు.
అంతలో హఠాత్తుగా, డెక్ సౌండ్‌ను, అమ్మాయిల కేరింతలను మెల్లి, మెల్లిగా చీలుస్తూ, ఎవరిదో రోదన ధ్వని.. అలలు, అలలుగా.. చెవిన పడుతూంది. అమ్మాయిలు అలర్ట్ అయ్యారు. ఎక్కడి నుండో కాదు, ఇంట్లో నుండే.
అందరూ నీలి వంక ప్రశ్నార్ధకంగా చూసారు.
నీలిమ నిట్టూర్చి చెప్పింది.
“ఆమె మా పిన్ని కూతురు. ఆక్సిడెంట్‌లో బావ పోయి నాలుగు నెలలు ఆయ్యింది.”
అమ్మాయిలంతా నీలి ఏమి చెప్తుందోనని చిత్తరువుల్లా కళ్ళప్పగించి ఉన్నారు.
“అక్క కొడుకు మూడేళ్ళ వాడు. ఎవరో వాళ్ళ నాన్నలాంటి షర్ట్ వేసుకొని, కాస్త అలాగే కనిపిస్తూ స్కూటర్ మీద, వీడి ముందు నుండి వెళ్ళారట. ఇంక అది మొదలు వీడు నాన్న కోసం ఏడుపు.. ఇక్కడికి వచ్చి, ఈ సందట్లో ఎలాగో కాస్త ఆటలు మొదలు పెట్టాడనుకుంటే, మళ్ళీ నాన్న స్కూటర్ మీద వెళ్ళాడంటూ ఏడుపు మొదలు పెట్టాడు. వాళ్ళ నాన్న కోసం ఏడ్చి తినకుండానే పడుకున్నాడు” అన్నది.
ఆ చిన్నవాడిని గుండెలకు అదుముకుని ఓదార్చాలన్న స్త్రీ సహజ భావం అమ్మాయిల్లో ‘ఆ క్షణం’.
“అక్క బాగా అప్సెట్ అయ్యింది. పొద్దున్నుండి కంట్రోల్ చేసుకున్నది కాస్త, వాడు పడుకున్నాక ఇంక ఆపుకోలేక పోతోంది”
జాహ్నవి తనను తాను నిగ్రహించుకునే విషయం మర్చిపోయిన దానిలా, ఓ శిలలా ఏడుపు వినిపించిన వైపు కదిలింది.
నీలిమా వాళ్ళ ఇల్లు పెద్దది. చాలా రూమ్స్ ఉంటాయి. ఓ రూమ్ ముందు ఆగిపోయింది.
ఏడ్చి, ఏడ్చి ఎర్రబారిన మోముతో, కంటి నుండి కన్నీటి చారికలతో, ఓ వైపు ఒదిగి నిదుర బోతున్నబాబు.. వాణ్ణి చూడాలన్న అర్ధం లేని ఆరాటంతో వచ్చిన ఆమె చప్పున వెను దిరిగింది.
కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని వచ్చిన ఆమెను చూస్తూ, “జానూ..!” అంది నీలిమ. అంతే, జాహ్నవి నీలిమ భుజం పై తల వాల్చి, వెక్కి, వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
ఒక నిముషం అమ్మాయిలంతా విభ్రాంతికి గురయ్యారు. జాహ్నవిలో ఎన్నడూ చూడని కోణం వారికిది. జాహ్నవి తండ్రికి దూరమయిన పిల్ల కాబట్టే అంతలా చలించి పోయిందని అర్థం చేసుకున్నారు.
“జానూ, ఊరు కోవే, మా బంగారం కదూ!”
“ఆ మహాతల్లి ఏమి బావుకోదు లేవే!”
“అవును, ఇంతకింతా అనుభవిస్తుంది”
ఆరిందల్లా అమ్మాయిలందరి మాటలు వింటూ, నీలిమ సూటిగా ఒకే ఒక ప్రశ్నసంధించింది.
“జానూ, ఇంక మీ అమ్మా నాన్న కలిసే అవకాశమే లేదా!”
జాహ్నవి గుండె ల్లోకి లోతుగా దిగబడింది, ఆ మాట.
జాహ్నవి చాలా త్వరగా తనను తాను సంభాళించుకుంది. నగ్నంగా తన మనసుని స్నేహితురాళ్ళ ముందు పరిచింది ఈ రోజు. తన వ్యక్తిగత జీవితం పై మాట్లాడే అధికారం ఇచ్చినట్టయ్యింది. ఏ సానుభూతి తనకు నచ్చదో, ఆ విషయమే జరుగుతోంది ఇప్పుడు.
మరు నిముషంలో అక్కడ సీన్ మార్చేసింది. ఇంత క్రితం అంత ఉద్వేగం చెందింది ఆమేనా అన్నట్టుగా, అక్కడి వాతావరణాన్ని తన సహజ ఛలోక్తులతో తేలిక చేసింది. ఒక విధంగా అక్కడి వాతావరణాన్ని తన గ్రిప్ లోకి తెచ్చుకుంది.
దటిజ్ జాహ్నవి.
***
నీలిమ బర్త్ డే పార్టీ ముగిసాక, వాళ్ళ కారు లోనే స్నేహితురాళ్ళందరినీ పంపించారు నీలిమ నాన్నగారు.
బృందావన్ కాలనీ లోని అందమైన చిన్న డాబా ఇంటి ముందు కారు దిగి, ఫ్రెండ్స్‌కు బాయ్ చెప్పింది జాహ్నవి.
గేట్ తీస్తూ, బిల్డింగ్ వంక చూసింది.
మాలతి కారు శబ్దం విని బయటకు వచ్చింది.
జాహ్నవి మనసును ముసిరిన చీకట్లలో తాను ఏరి కోరి సెలక్ట్ చేసిన ఆ చిన్న డాబా ఇంటి అందమైన రంగులన్నీ ప్రకాశం తగ్గించుకున్న భావన.
ఎప్పుడూ తన ఫీలింగ్స్‌ను దాచి వేసే ఆమె, ఈ రోజు నీలి పుట్టినరోజు సందర్భంగా ఆ చిన్నబాబు దుఃఖానికి, తాను అనుభవించిన వేదనకు తార్కాణంగా ముఖం వడలి పోయి, ఇల్లు చేరింది. తల్లి మనసు పసి గట్టింది.
“జ్వరం కానీ రాలేదు కదా” అనుకుంటూ నుదుటి మీద చేయి వేసి చూసింది.
“అలసటగా ఉందమ్మా, పడుకుంటాను” అంటూ రూమ్ లోకి నడిచింది జాహ్నవి.
“సరిగా తిన్నావా పార్టీలో, లేకపోతే కాస్త కలుపుకుని వచ్చేదా?”
“వద్దమ్మా, తిన్నాను. డ్రెస్ మార్చుకుని పడుకుంటాను” జాహ్నవి ఆ డూప్లెక్స్ పోర్షన్‌లో మెట్లెక్కి తన గది లోకి వెళ్ళింది.
అమ్మ రూమ్‌లో పడుకోవాలా, తన రూమ్ లోనా అన్న ఆప్షన్ ఆలోచించ లేదు. మనసు ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటూంది.
భావాలు తరంగాల్లాంటివి. స్నేహితురాళ్ళ ముందు దాచి, నటించినా, మళ్ళీ ఉవ్వెత్తున లేచాయి. బాధాతప్తమైన చిన్నవాడి ముఖం, బుగ్గలపై కన్నీటి చారికలతో ముడుచుకొని పడుకున్న తీరు ఆమె హృదయాన్ని తాకుతూంది. ఎవరికైనా అమ్మ ఒక్కత్తే సరిపోదు. నాన్న కూడా కావాలి. ఈ నిజం ఆ చిన్నవాడి బుగ్గల పై కన్నీటి చారికల సాక్షిగా ధృవపరుచుకుంది జాహ్నవి.
డ్రెస్ మార్చుకుంది. వార్డ్‌రోబ్ నుండి రబ్బరు బొమ్మ అందుకుంది.
ఇంకెవరితోనూ పంచుకోలేదు. పంచుకునేందుకు ఎవరున్నారు? జాహ్నవి తల అడ్డంగా ఊగించింది. ఉన్నారు.. అమ్మా, తాతయ్య ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. కానీ ఈ విషయంలో తాను ఏకాకి. పంచుకుంటే, గుండె చించుకోవడమే.. తానెవరితో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోలేదు. అది తాను బలమని భావించే బలహీనత.
జాహ్నవి బొమ్మను తన ప్రక్కనే పడుకోబెట్టుకుంది. ఈ బొమ్మ ద్వారా నాన్నకూ, తనకూ అదృశ్య సంకేతాలేవో నడుస్తూన్న ఫీలింగ్. తమ మధ్య బంధానికి కనిపించని వారధి ఈ మున్నీ. మనసు చెదిరినప్పుడు ఆశ్రయం. తోడబుట్టిన దానిలా సేద దీర్పు ఈ మున్నీ..
మెల్లిగా నిద్ర లోకి జారుకుంది జాహ్నవి.
***
మాలతి లావెక్కింది. కళ్ళ క్రింద కమ్ముకున్న నలుపు చారికలు, అదుపులో ఉండేందుకు ఇబ్బంది పెట్టే బ్లడ్ ప్రెషర్.. ఆమె సంతోషంగా లేదేమో ననిపిస్తుంది, ఒకప్పటి మాలతితో పోల్చుకుంటే ఎవరికైనా.. విధి లేక జీవితం లాగిస్తూన్నట్టు కనిపించే ఆమె ముఖంలో నిరాశ మేఘాలు.. అవి ఎలా ముసురుకున్నాయో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది జాహ్నవికి.
వయో భారం కల తాతగారు, చింతాక్రాంతయైన తల్లీ.. ఇరువురి నడుమ ఒక టీనేజ్ అమ్మాయి.. బోర్‌గా ఉంది ఇల్లు అనుకోదు జాహ్నవి. కుటుంబ పరిస్థితుల మధ్య తన కర్తవ్య నిర్వహణకు చిన్నప్పుడే శ్రీకారం చుట్టింది. అమ్మ మోములో నవ్వులు పూయించడం, తాతగారి మౌన సమాధిని బద్ధలు కొట్టడం రెండూ ముఖ్యమైనవే ఆమెకు. భూషణం తాతగారు ఫోన్ చేస్తే తప్ప తాతగారు ఎవరితో మాట్లాడతారు. అమ్మ, తాతయ్యల మధ్య రోజువారీ దినచర్యకు సంబంధించి కాక మాటలేముంటాయి. మాట్లాడుకోవచ్చు కానీ, ఓ లాంటి స్తబ్ధతలో ఇరుక్కున్నారు ఇద్దరూ, ఆ స్తబ్ధతను పారద్రోలేందుకే నలిగి పోతూంటుంది జాహ్నవి.
నీలిమ ఇంట్లో జరిగిన సంఘటనను ఇంకా తేలిగ్గా తీసుకోలేక పోతోంది. తాను ఫ్రెండ్స్ ముందర అలా బరస్ట్ కావడం, చాలా అన్ కామన్ థింగ్.. కానీ జరిగి పోయింది ఆ రోజు అలా.. జాహ్నవి ఆలోచన దాని గురించి కాదు. ఆ మర్నాడు నీలి ఫోన్ చేసింది.
“జానూ, ఆర్ యూ, ఓ.కే. నౌ?” అంది. అప్పుడనిపించింది, తాను చాలా తప్పు చేసానని.
నీలికి, తనకు పర్సనల్ ఫోన్స్ లేవు. ఆంటీ ఫోన్ లో ఎక్కువ మాట్లాడ్డం సేఫ్ కాదు. నీలికి లెటర్ వ్రాస్తే ఎలా ఉంటుంది? తానేంటో నీలికి చెప్పాలి. ఇప్పటికే తాను నీలి స్నేహానికి చాలా ద్రోహం చేసింది.
ఆలోచిస్తూ బెడ్ మీద ఒరిగి పోయింది. కళ్ళు మూసుకుంటూంటే నీలిమ మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. “జానూ, ఇంక మీ అమ్మా, నాన్న కలిసే అవకాశమే లేదా!” ఒక్కసారి కాదు, వంద సార్లు అవే మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇప్పుడు నీలిమ కాదు, జాహ్నవిని జాహ్నవే ప్రశ్నిస్తోంది. సమాధానం లేని ప్రశ్న సంధిస్తోంది.
***
సాయంత్రం మాలతి చేసిచ్చిన వడలు తింటూ, కబుర్లు చెప్ప సాగింది జాహ్నవి. స్కూల్ నుండి వస్తూ, క్రింద పోర్షన్ లోకి చూసి వచ్చింది. టీనా దెయ్యం మళ్ళీ చీర సింగారించుకుని కనిపించింది. దాని కబుర్లు మాలతికి ఇష్టం. అమ్మ మోములో నవ్వు చూడ్డం కోసం, జాహ్నవికి బాగా పనికి వచ్చేవి టీనా ముచ్చట్లే.
హాల్లో చాప పై బుక్స్ పరుచుకుని హోం వర్క్ చేసుకోవడం మొదలు పెట్టింది. తాతగారు న్యూస్ చూస్తున్నారు. మాలతి కిచెన్‌లో ఏదో పని చూసుకుంటూంది. అప్పుడు మ్రోగింది, సెల్ ఫోన్. “జానూ, నీలిమ ఫోన్ నీకు”, మాలతి ఫోన్ తెచ్చిచ్చింది. జాహ్నవికి ఏమి చేయాలో అర్ధం కాలేదు. నీలితో పర్సనల్‌గా మాట్లాడాలి. ఫోన్ తీసుకొని మాట్లాడుతూ, పైన తన రూమ్ లోకి వచ్చింది. “ఫోన్ చేసావట. స్నానానికి వెళ్ళానప్పుడు. అమ్మ చెప్పింది” అంది నీలిమ.
“నీలూ, నేను నీకు సారీ చెప్పాలే” అంది.
“నాకు సారీనా! అదేంటే?”
“అవునే, అదేంటో నేను మాటల్లో చెప్పలేను.”
అవతల నుండి అర్ధం కాని నీలి నిశ్శబ్దంగా వింటూంది.
“అందుకే లెటర్ వ్రాస్తాను” అంది.
“జానూ, లెటర్స్ వ్రాసుకునేంత పెద్ద విషయాలు మన మధ్య ఉన్నాయంటావా!”
అప్పుడే బోర్న్‌విటా గ్లాస్ పట్టుకొని మాలతి పైకి వచ్చింది. జాహ్నవి, “మమ్మీ బోర్న్‌విటా తెచ్చింది” అంది. నీలి చురుగ్గా టాపిక్ స్కూల్ విషయాలపైకి మళ్ళించింది.
జరుగుతున్న డ్రామా మాలతి గమనించ లేదు. ఏవో దోస్తుల కబుర్లు అనుకుంది.
ఆ రాత్రి భోజనాలు అయ్యాక, తన రూమ్ లోకి వెళ్ళిన జాహ్నవి, అంతర్ముఖి అయ్యింది. ఆలోచనా మథనం కావిస్తూ, స్కూల్ నుండి వస్తూ తెచ్చుకున్న నీలి రంగు కవర్ పై వ్రాయబోతూ ఆగింది. తెలుగులో వ్రాస్తేనో.. యెస్ నీలికి తెలుగు వచ్చు. వాళ్ళమ్మ గారు తెలుగావిడే. సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారు వ్రాయడం నేర్పారు. ఎక్స్‌ప్రెస్ చేయలేని దగ్గర, ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదా, అనుకుంది. అందుకే అచ్చు తెలుగులోనే ఇలా సంభోదిస్తూ మొదలు పెట్టింది.
“ప్రియాతి ప్రియమైన నీలూకు”, ఒక్క క్షణం ఆగి పోయింది. ఎక్కడ మొదలు పెట్టాలి. మళ్ళీ కలం కదిలింది. జాహ్నవి హృదయంలో అంచెలంచలుగా భావాలు.. నడుస్తూన్నకథ ఇది..
ఎక్కడ ఆరంభం దీనికి? తాతగారు, తనను, అమ్మను తీసుకొని మైసూర్ వచ్చినప్పటి నుండి వ్రాయాలి. అంతకు ముందు కూడా కథ ఉంది, అది తనకు తెలీదు. తనకు తెలిసిందల్లా ఒకటే.. అమ్మ కోసమే తాతగారు, హైదరాబాద్ నుండి మైసూర్ వచ్చేసారు. ఒకసారి భూషణం తాతగారితో తాతగారు మాట్లాడుతూంటే విన్నది. ఇప్పుడాలోచిస్తే, బంధువులంతా అక్కడే కదా, కావాలనే అక్కడి నుండి దూరంగా, అమ్మ మనశ్శాంతి కోసమే వచ్చి ఉంటారనిపిస్తూంది. ఇంత వరకు వ్రాసింది.
జాహ్నవి కళ్ళ ముందు గతం విచ్చుకుంటూ. నీలిని చూసి భూషణం తాతగారు, ఇంగ్లీష్ దొరసానమ్మ అనడం గుర్తుంది. రాగి జుట్టుతో, నీలి కళ్ళతో ముద్దొచ్చే బేబీ బ్యూటీ నీలి. తనకు మైసూర్‌లో మొదట చాచిన స్నేహ హస్తం నీలిమ దే.
ఒకే వీధిలో ఉండటం వల్ల పొద్దస్తమానం ఎవరింట్లోనో ఒకరింట్లో ఆడుతూ గడిపే వారు ఇద్దరు. తాను నీలిమకు తన బొమ్మలన్నీ ఆడు కోవడానికి ఇచ్చేసేది. ఒక్క మున్నీని మాత్రం ఇచ్చేది కాదు. అది తన ఓన్ ప్రాపర్టీగా ఫీలయ్యేది. మంచం మీద ప్రక్కనే కూర్చో బెట్టుకున్న మున్నీ వంక చూసింది జాహ్నవి. “నాకు తెలుసు లే” అన్నట్టు చూసింది మున్నీ.
ఒకసారి నీలిమకు టైఫాయిడ్ వచ్చి తగ్గట్లేదు. నీలిమ కోసం వెక్కి వెక్కి ఏడ్చింది. టైఫాయిడ్‌తో ఏమీ కాదని అమ్మా, తాతయ్య ఓదార్చడం తనకు లీలగా గుర్తు. నీలికి తగ్గి పోగానే మున్నీని ఆడు కోవడానికి ఇచ్చేయాలనుకుంది. కానీ నీలిమకు జ్వరం తగ్గాక అంత సాహసం చేయలేక పోయింది.
జాహ్నవి అక్షరాలు లిఖించేందుకు మళ్ళీ ముందుకు వంగింది. ఇలా వ్రాస్తూంటే అదో లాంటి ఉద్విగ్నత.. బాల్యం తలుపులు తడితే, ఆనందం వెంట వచ్చేది ఉద్విగ్నతయే!
నీలూ! నీలం చెమ్కి పరికిణి నువ్వు కట్టుకుని వస్తే, బాగుందని నాకూ కుట్టించారు. నీకు ఉన్న చిన్న వ్రిస్ట్ వాచ్ చూసి, నాకూ కొన్నారు. జడ గంటలు కూడా.. కానీ, నీకు ఉన్నది, నాకు లేనిది.. ఒకటున్నది. ప్రైస్‌లెస్ కానీ వర్త్‌ఫుల్.. అదే నాన్న! ఎస్, నీలూ.. నాన్న.. నాన్న.. నాన్న. ఆ నాన్న చుట్టే నా మనసు తిరిగేది.
ఆ తర్వాత మన కాలనీకి కొద్ది దూరం లోకి వినుత వాళ్ళు వచ్చారు. స్కూల్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి నుండి మనమంతా ఒక గ్రూప్‌లా ఉన్నాము. కానీ, నీలూ! ఎందరు స్నేహితులు వచ్చినా, అందరితో ఎంత స్నేహం ఏర్పడినా, నా నీలూ తర్వాతే అందరూ.
ఇంకా వ్రాయబోతున్న జాహ్నవికి, మాలతి కాలి పట్టీల శబ్దం.. “ఇంకా పడుకో లేదా, జానూ!” అన్న మాలతి మాటలు వినిపించి, “పడుకుంటున్నానమ్మా” అంది.
పెన్ మూసి, మున్నీని కూడా పక్కనే పడుకోబెట్టుకుంది. కళ్ళు మూసుకుంటూంటే, ఆనాడు వినుత అన్న మాటలు ఎక్కడ నక్కి ఉన్నాయో ఆమె మనోఫలకం పైకి వచ్చాయి.
“ఆ మహాతల్లి ఏమీ బావుకోలేదు లేవే, ఇంతకింతా అనుభవిస్తుంది.”
“మహా తల్లి” ఎవరామె!
ఎప్పుడూ తను ఆలోచించని ఆ కొత్త పాత్రకు తమ జీవితాల్లో ప్రమేయమెంత. ఆ విషయం ఎక్కువ ఆలోచించడం ఇష్టం లేకేమో, మూసుకున్న జాహ్నవి కళ్ళ పై నిదుర వచ్చి వాలింది.
(ఇంకా ఉంది)