మరుగునపడ్డ మాణిక్యాలు – 79: అమెరికన్ బ్యూటీ

2
3

[సంచిక పాఠకుల కోసం ‘అమెరికన్ బ్యూటీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]న[/dropcap]డి వయసు వచ్చాక చాలామందిలో ఒక రకమైన అసంతృప్తి బయల్దేరుతుంది. దీన్ని midlife crisis అంటారు. దీన్ని వ్యంగ్యాత్మకంగా చూపించిన చిత్రం ‘అమెరికన్ బ్యూటీ’ (1999). ఇందులో పైకి కనిపించేదాని కన్నా అంతర్లీనంగా ఉండే అభద్రతా భావాలను అర్థం చేసుకుంటే మనలో చాలామంది ఇలాగే ఉంటారు కదా అనిపిస్తుంది. ఈ చిత్రం వచ్చి పాతికేళ్ళు అయింది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం అప్పుడు మన దేశంలో అంతగా లేదు. కానీ ఇప్పుడు ఆ ప్రభావం పెరిగింది. ఫలితంగా ఈ చిత్రం ఇప్పుడు మన దేశంలో మధ్య తరగతి జీవితానికి అద్దం పడుతుంది. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

చిత్రం మొదట్లో ఒక అమ్మాయి ఒకతనితో మాట్లాడతుండగా ఆమెని అతను రికార్డు చేస్తుంటాడు. ఆమె “మా నాన్న హుందాగా ఉండాలని నా కోరిక. ఆయనేమో నా ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకువస్తే చొంగ కార్చుకుంటూ ఉంటాడు. ఆయన ఇలా బతకటం కంటే చావటం మేలు” అంటుంది. “అయన్ని నేను చంపేయనా?” అంటాడతను. “ఆ పని చేస్తావా?” అంటుందామె. ఆ అమ్మాయి లెస్టర్ కూతురు. పేరు జేన్. లెస్టర్ భార్య క్యారలిన్. లెస్టర్ జీవితం మీద అసంతృప్తిగా ఉంటాడు. వాయిస్ ఓవర్‌లో తన జీవితం గరించి ప్రేక్షకులకి చెబుతూ ఉంటాడు. “ఒక సంవత్సరంలో నేను చచ్చిపోతాను” అంటాడు. అంటే లెస్టర్ చనిపోయిన తర్వత తన కథ చెబుతున్నట్టన్నమాట. అతన్ని ఎవరు చంపుతారు? ఎందుకు?

క్యారలిన్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. అంటే బ్రోకర్. అయితే ఆమె అమ్మటానికి ప్రయత్నించే ఇళ్ళు ఏమంత గొప్పగా ఉండవు. ఆమెకి బడ్డీ అనే అతను పోటీ. మంచి ఇళ్ళన్నీ అతనే అమ్ముతుంటాడు. ఒక పార్టీలో వారిద్దరూ కలుస్తారు. “మీరు నాకు చిట్కాలు చెప్పాలి” అంటుంది. అతను సరే అంటాడు. లెస్టర్ ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అతన్ని త్వరలో ఉద్యోగంలో నుంచి తీసేస్తారని అతనికి అర్థమవుతుంది. అతను భారంగా జీవితం గడుపుతూ ఉంటాడు. క్యారలిన్‌కి అతన్ని చూస్తే చిరాకుగా ఉంటుంది. వాళ్ళమ్మాయి జేన్‌కి పదిహేడేళ్ళు. తల్లీ తండ్రీ అంటే అయిష్టం. ఆమె ఫ్రెండ్ ఏంజెలా. అందంగా ఉంటుంది. మోడల్ కావాలనుకుంటుంది. మోడల్ కావాలంటే శరీరాన్ని తాకట్టు పెట్టాలని, లేకపోతే అవకాశాలు రావని బహిరంగంగానే అంటూ ఉంటుంది.

జేన్, ఏంజెలా స్కూల్లో బాస్కెట్ బాల్ జట్టుకి చియర్ గర్ల్స్. ఆటగాళ్ళని ప్రోత్సహించటమే కాకుండా మ్యాచ్ మధ్యలో డ్యాన్స్ చేసి ప్రేక్షకుల్ని అలరించేవారే చియర్ గర్ల్స్. ఒకరోజు మ్యాచ్ జరుగుతుంటే లెస్టర్, క్యారలిన్ వస్తారు. జేన్‌కి ఇష్టం ఉండదు. చియర్ గర్ల్స్ డ్యాన్స్ చేస్తుంటే లెస్టర్ ఏంజెలాని చూసి సమ్మోహితుడవుతాడు. జేన్ డ్యాన్స్ లో కాస్త తడబడుతుంది. అయినా క్యారలిన్ “నువ్వు బాగా చేశావు. ఒక్క తప్పు కూడా చేయలేదు” అంటుంది. ఆమె అంత శ్రద్ధగా చూడలేదన్నమాట. పిల్లల ప్రతి అడుగునీ తప్పుపట్టేవారు కొందరు. పిల్లలు ఏం చేసినా బాగానే ఉందిలే అనుకునేవారు కొందరు. అమెరికాలో ఈ రెండో కోవకి చెందినవారే ఎక్కువ. పిల్లలు కాలేజీకి వెళ్ళి వారి బతుకు వారు బతకాలని అనుకుంటారు. లెస్టర్ తన మీద మోజు పడ్డాడని ఏంజెలాకి అర్థమవుతుంది. ఆమెకి అదో థ్రిల్. జేన్‌కి మాత్రం పరువు పోయినట్టుంటుంది.

రికీ పద్దెనిమిదేళ్ళ వాడు. జేన్ పక్కింట్లోకి అతని కుటుంబం వస్తుంది. జేన్ స్కూల్లోనే చేరతాడు. అతన్ని కొన్నాళ్ళు మానసిక వైద్యశాలలో పెట్టారని ఏంజెలా జేన్‌కి చెబుతుంది. అతను జేన్‌ని ఇష్టపడతాడు. జేన్‌కి ఇది కొత్త. అందరూ ఏంజెలా వెనకాల పడుతుంటే రికీ తన వెంట పడటం ఆమెకి ఆనందంగా ఉంటుంది. అసలు ఏంజెలా జేన్‌తో కలిసి ఉండటానికి కారణం సాధారణంగా ఉండే జేన్ పక్కన తాను అందంగా కనపడాలని. రికీ అందరికంటే భిన్నంగా ఉంటాడు. గంజాయి తాగుతాడు. అమ్ముతాడు కూడా. అతని తండ్రి ఫ్రాంక్ ఒక రిటైర్డ్ కల్నల్. కొడుక్కి గంజాయి తాగే అలవాటుందని తెలుసు. అందుకే అర్నెల్లకోసారి మూత్రపరీక్ష చేస్తాడు. రికీ ఎవరిదో మూత్రం తెచ్చి తన రూములో చిన్న ఫ్రిజ్‌లో పెట్టుకుని తండ్రి పరీక్ష చేసినపుడు తన మూత్రానికి బదులు ఆ మూత్రం ఇస్తాడు. ఆ విధంగా పట్టుబడకుండా ఉంటాడు. ఈ కుటుంబాలు ఉండే చోటే ఇద్దరు స్వలింగప్రియులు కలిసి జీవిస్తూ ఉంటారు. ఫ్రాంక్‌కి వారంటే అసహ్యం.

లెస్టర్‌కి, రికీకి పరిచయం ఏర్పడుతుంది. లెస్టర్‌కి గంజాయి ఇస్తాడు రికీ. ఒకరాత్రి ఏంజెలా జేన్ ఇంట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడూ స్నేహితురాళ్ళ ఇళ్ళలో ఉండటం ఓ సరదా. ఆమె “మీ నాన్న కండలు పెంచితే ఆయనతో శృంగారానికి నేను రెడీ” అంటుంది జేన్‌తో. జేన్‌కి ఈ మాటలు నచ్చవు కానీ ఏంజెలా స్వభావం తెలుసు కాబట్టి నవ్వేసి ఊరుకుంటుంది. ఈ మాటలు తలుపు చాటునున్న లెస్టర్ వింటాడు. ఇక అప్పటి నుంచి అతను కండలు పెంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కసరత్తులు మొదలుపెడతాడు. అతనిలో ఒకరకమైన తెగింపు వస్తుంది. ఉద్యోగం పోయే పరిస్థితి తానే తెచ్చుకుంటాడు. అయితే కంపెనీ డైరెక్టర్ వేశ్యల కోసం కంపెనీ డబ్బు ఖర్చు పెట్టాడని, దాని మీద ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. తన మీద లైంగిక వేధింపులు జరిగాయని తప్పుడు ఫిర్యాదు కూడా ఇస్తానంటాడు. అతన్ని వదిలించుకోవటానికి కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరం జీతం ఇచ్చి అతన్ని తొలగిస్తారు. ఉద్యోగం వదిలింది, డబ్బు వచ్చింది. మరో పక్క క్యారలిన్ తన పోటీదారుడైన బడ్డీని కలుస్తుంది. అతని విజయరహస్యం తెలుసుకోవాలని ఆమె కోరిక. మాటల్లో అతను తన భార్య తనని వదిలేసిందని చెబుతాడు. “నేను పని మీదే ఎక్కువ ధ్యాస పెడుతున్నానట. అందుకే వదిలేసింది” అంటాడు. “మొన్న పార్టీలో ఇద్దరూ ఆనందంగానే ఉన్నారే” అంటుంది క్యారలిన్. “అంతే మరి! విజయం అందుకోవాలంటే విజయం మన సొంతమైనట్టే ప్రదర్శించాలి” అంటాడతను. లెస్టర్‌తో విసిగిపోయిన క్యారలిన్ బడ్డీ మాటలకి పడిపోతుంది. వారిద్దరికీ అక్రమసంబంధం మొదలవుతుంది.

లెస్టర్ డబ్బు సంపాదించటం లేదని క్యారలిన్‌కి అసహనం. ప్రొమోషన్లు తెచ్చుకుంటూ ఎదుగుతూ ఉండాలన్నమాట. లేకపోతే విలువ లేదు. పక్కలో కూడా అతన్ని తన దగ్గరకి రానివ్వదు. చివరికి తానే డబ్బు సంపాదించాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైసెన్స్ సంపాదించింది. అయితే అది కూడా కలిసిరాలేదు. మంచి ఇల్లు, పెద్ద కారు ఉంటాయి. అవి కూడా అప్పు చేసి కొన్నవే. అప్పు చేసి పప్పు కూడు అన్నమాట. ఉన్నంతలో ఉండొచ్చుగా! సమాజంలో హోదా కావాలి. తల తాకట్టు పెట్టయినా హోదా సంపాదించాలి. తలిదండ్రుల మధ్య సఖ్యత లేకపోతే జేన్ ఆనందంగా ఎలా ఉండగలదు? ఆమె ఏంజెలాని చూసి అసూయపడుతూ ఉంటుంది. ఆమె లాగా అందంగా ఉండాలని తన స్తనాలకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకుంటుంది. దాని కోసం డబ్బు దాచుకుంటుంది. అంత చిన్న వయసులోనే పాస్టిక్ సర్జరీ! అందానికి సమాజం ఇచ్చే ప్రాధాన్యత అటువంటిది. అందుకే వీధివీధికీ బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయి. రికీకి సమాజం పోకడలు నచ్చవు. అయితే అతను సంతోషాన్ని డ్రగ్స్‌లో వెతుక్కుంటున్నాడు. లెస్టర్ రికీని చూసి అతనిలా ఉండాలనుకుంటాడు. Classic midlife crisis. లేకపోతే రికీ దగ్గర లెస్టర్ గంజాయి తీసుకోవటమేమిటి?

అమెరికన్ బ్యూటీ అనేది గులాబీల్లో ఒక రకం. శబ్దార్థం తీసుకుంటే అమెరికా సౌందర్యం. అమెరికావన్నీ పైపై మెరుగులే అనే వ్యంగ్యార్థం వస్తుంది. గులాబీకి ముళ్ళుంటాయి. అలాగే అమెరికా సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ‘Stop and smell the roses’ అని ఆంగ్లంలో నానుడి. అంటే గులాబీల పరిమళాన్ని అస్వాదించాలి అని. అంటే జీవితాన్ని ఆస్వాదించాలి కానీ పరుగులు పెడుతూ ఉండకూడదని. తెలుగులో ‘పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగటం మంచిది’ అంటారు కదా! చిత్రంలో క్యారలిన్ గులాబీ మొక్కల్ని పెంచుతూ ఉంటుంది. వాటి మీద ఉన్న శ్రద్ధ ఆమెకి తన కుటుంబం మీద లేదు. డబ్బు ఉంటేనే ఆనందమనే భావన పెరిగిపోయింది. వస్తువులు పోగేసుకుంటున్నారు. మనుషుల్ని పట్టించుకోవట్లేదు. జేన్ లాంటి పిల్లలు అభద్రతాభావంతో పెరుగుతున్నారు. ఏంజెలా లాంటి వాళ్ళు పరమ లౌక్యంగా ఉంటారు. ఏమన్నా పొందాలంటే ఏదో ఒక మూల్యం చెల్లించకతప్పదు అంటారు. లెస్టర్ ఏంజెలాని తలచుకుంటూ ఊహాలోకంలో ఉన్నప్పుడు గులాబీ రేకులు తన మీద పడుతున్నట్టు ఊహించుకుంటాడు. ఆమెని పొందితే ఆనందం తన సొంతమనుకుంటాడు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అదెంత మూర్ఖత్వమో అర్థమవుతుంది. చిత్రంలో మిగతా రంగులు కాస్త వెలిసినట్టు ఉన్నా ఎర్ర రంగు మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. లిప్ స్టిక్ రంగు, గులాబీ పువ్వుల రంగే కాకుండా లెస్టర్ ఇంటి ముఖద్వారం రంగు కూడా ఎర్రగా ఉంటుంది. ఎరుపు రజోగుణానికి ప్రతీక. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని అర్రులు చాస్తూ ఉండే నేటి సమాజానికి ప్రతీక. చివరికి లెస్టర్ చిందించే రక్తం కూడా ఎరుపే కదా!

ఈ చిత్రానికి ఆలన్ బాల్ స్క్రీన్ ప్లే రాయగా శామ్ మెండెస్ దర్శకత్వం వహించాడు. ఇద్దరికీ ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు కూడా దక్కింది. లెస్టర్‌గా నటించిన కెవిన్ స్పేసీకి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. క్యారలిన్‌గా అనెట్ బెనింగ్, జేన్‌గా తోరా బర్చ్, ఏంజెలాగా మేనా సువారి నటించారు. కాన్రాడ్ హాల్‌కి ఉత్తమ ఛాయాగ్రాహకుడి అవార్డు కూడా దక్కింది. థామస్ న్యూమన్ అందించిన సంగీతానికి నామినేషన్ వచ్చింది. మామూలుగా హాలీవుడ్ సినిమాలలో వినిపించని తబలా వాయిద్యం ఈ సినిమాలో నేపథ్య సంగీతంలో వినిపిస్తుంది. లెస్టర్ ఊహల్లోకి వెళ్ళినప్పుడు సంగీతంలో ఒక రకమైన హడావిడి  మొదలవుతుంది. అతని గుండె సవ్వడి మారినట్టే. ఆ క్షణాల్లో అతనికి కాలమే ఆగిపోయినట్టు, ఒక కవ్వింపు, ఒక స్పర్శ మళ్ళీ మళ్ళీ అనుభవమైనట్టు అనిపిస్తుంది. కామంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయేవారు అలాగే ఉంటారు. సంగీతం, లైటింగ్, ఎడిటింగ్ ఉపయోగించి అతని ఊహాలోకాన్ని ఆవిష్కరించారు. రికీ వీడియో కెమెరాతో తనకి నచ్చిన వాటిని రికార్డ్ చేస్తూ ఉంటాడు. జేన్‌ని చాలా సార్లు రికార్డ్ చేస్తాడు. చనిపోయిన పావురం, గాలిదుమారంలో ఎగిరే ప్లాస్టిక్ సంచీ – ఇలాంటివి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అతన్ని పిచ్చివాడని చాలామంది అనుకుంటారు. దృష్టిని బట్టి ప్రపంచం ఉంటుంది. ఒకరికి ఆసక్తికరంగా కనిపించేది ఇంకొకరికి భయంకరంగానో, విసుగుగానో ఉండవచ్చు. అందుకే జగత్తు మిథ్య అంటారు భారతీయ తత్త్వవేత్తలు. రికీ ఒకరాత్రి చీకట్లో తన ఇంటి కిటికీ నుంచి లెస్టర్ ఇంటిలో ఉన్న జేన్‌ని రికార్డ్ చేస్తుంటాడు. అక్కడే ఏంజెలా కూడా ఉంటుంది. రికీ రికార్డ్ చేస్తున్నాడేమోనని అనిపించగానే ఏంజెలా మోడల్ లాగా పోజులిస్తుంది. అదే సమయంలో కింద ఉన్న గ్యారేజ్‌లో లెస్టర్ కసరత్తులు చేస్తూ ఉంటాడు. రికీకి అతను కనపడతాడు. లెస్టర్ బట్టలు విప్పేసి తన బొజ్జని చూసుకుని అసహ్యంగా మొహం పెట్టి కసరత్తు వేగం పెంచుతాడు. ఇవన్నీ చూసి రికీ ‘Welcome to America’s weirdest home videos’ అనుకుంటాడు. నిజానికి ‘America’s funniest home videos’ అని ఒక టీవీ కార్యక్రమం ఉంది. తమ ఇంట్లో రికార్డయిన తమాషా సంఘటనల్ని ప్రజలు పంపిస్తే ప్రసారం చేస్తారు. కానీ ఇంటిలో నిజంగా జరిగే బాగోతాలని ఎవరూ బయటపెట్టుకోరు కదా. పైపై మెరుగుల్ని చూసి అసూయపడటం వ్యర్థం. చాలా బతుకులు పైన పటారం, లోన లొటారం లాగే ఉంటాయి. దానికి కారణం లేనిపోని భేషజాలు.

ఈ క్రింద చిత్ర కథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

లెస్టర్ ఉద్యోగం వదిలేసి అదే రోజు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో సర్వర్‌గా చేరతాడు. అతనికి ఏ బాధ్యతలూ లేని ఉద్యోగమే హాయిగా ఉంటుంది. లెస్టర్ ఉద్యోగం మానేసిన విషయం తెలిసి భోజనాల దగ్గర క్యారలిన్ అతన్ని తిట్టిపోస్తుంది. జేన్ కూడా అక్కడే ఉంటుంది. “ఇప్పుడు నేనే సంపాదించి ఇంటి అప్పు తీర్చాలి” అంటుంది క్యారలిన్. లెస్టర్ “మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు, నేనూ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను” అంటాడు. క్యారలిన్ అడ్డుపడితే కోపంతో ప్లేటు గోడకేసి కొడతాడు. దాంతో క్యారలిన్, జేన్ బిక్కచచ్చిపోతారు. తర్వాత క్యారలిన్ జేన్ గదికి వెళ్ళి “నీ ముందు మేం పోట్లాడుకోకుండా ఉండాల్సింది. కానీ ఒక మాట చెబుతాను. జీవితంలో ఎవర్నీ నమ్మవద్దు. నీకు నువ్వే తోడు” అంటుంది. జేన్ “ఈ పాఠం చెప్పినందుకు ఇప్పుడు నేను నిన్ను వాటేసుకువాలా?” అంటుంది వ్యంగ్యంగా. క్యారలిన్ జేన్‌ని చెంపదెబ్బ కొడుతుంది. ఇలా కుటుంబమంతా అశాంతిగా ఉంటుంది. ఈ సమయం లోనే జేన్ తన తండ్రి బతకటం కన్నా చావటం మేలని రికీతో అంటుంది. కానీ తర్వాత “హాస్యానికి అన్నాను” అంటుంది.

క్యారలిన్ బడ్డీతో తన అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. తుపాకీ కొనుక్కుని అప్పుడప్పుడూ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తే ఒత్తిడి తగ్గుతుందని బడ్డీ ఆమెకి చెబుతాడు. మరో పక్క లెస్టర్ కసరత్తులు చేసి కండలు పెంచుతాడు. అతని బొజ్జ కూడా తగ్గిపోతుంది. ఆఖరికి అతను చనిపోయే రోజు వస్తుంది. పొద్దున్న క్యారలిన్, జేన్ కలిసి కారులో బయల్దేరుతారు. క్యారలిన్ ఆఫీస్‌కి, జేన్ స్కూల్‌కి వెళుతుంటారు. రికీ వారితో వెళతాడు. వెళ్ళేముందు లెస్టర్ బయటకి వచ్చి రికీకి ఫోన్ చేయమని సైగ చేస్తాడు. గంజాయి కోసం. రికీ తండ్రి ఫ్రాంక్ ఆ సైగని చూస్తాడు. అతనికి అనుమానం వస్తుంది. అతను రికీ గదికి వెళ్ళి వెతుకుతాడు. ఏమీ దొరకవు. వీడియో కెమెరా తీసి ఒక టేపు పెట్టి చూస్తాడు. అందులో లెస్టర్ బట్టలు లేకుండా కసరత్తు చేస్తున్న వీడియో ఉంటుంది. రికీ స్వలింగప్రియుడనే అనుమానం వస్తుంది అతనికి.

ఆరోజు మధ్యాహ్నం క్యారలిన్, బడ్డీతో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ డ్రైవ్ త్రూ (కారు దిగకుండా తిండి పార్సెల్ తీసుకెళ్ళే చోటు) కి వెళుతుంది. లెస్టర్ అక్కడ పని చేస్తున్నాడని ఆమెకి తెలియదు. తిండి ఆర్డర్ చేస్తుంది. బడ్డీతో సరసాలాడుతూ ఉంటుంది. లెస్టర్ అది చూస్తాడు. తానే పార్సెల్ ఇస్తాడు. క్యారలిన్ ఖంగు తింటుంది. “నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కానీ ఇంకెప్పుడూ నా మీద పెత్తనం చేయాలని చూడకు” అంటాడు లెస్టర్. ఆ రాత్రి వర్షం పడుతూ ఉంటుంది. లెస్టర్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. గ్యారేజ్‌లో కసరత్తు చేస్తుంటాడు. కసరత్తు అయిన తర్వాత గంజాయి కోసం రికీకి పేజర్ మెసేజ్ పంపిస్తాడు. రికీ జేన్ పిలిచిందని ఫ్రాంక్‌కి అబద్ధం చెప్పి వెళతాడు. ఫ్రాంక్ అనుమానంతో లెస్టర్ గ్యారేజ్ లోకి చూస్తాడు. లెస్టర్, రికీ కలిసి ఉండటం చూస్తాడు. గోడ అడ్డు ఉండటం చేత రికీ లెస్టర్‌కి అంగచూషణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అతనికి అనుమానం ధృవపడుతుంది. కానీ రికీ గంజాయి ఇవ్వటానికి మాత్రమే వెళ్ళాడు. మరోపక్క క్యారలిన్ తన అక్రమ సంబంధం సంగతి లెస్టర్‌కి తెలిసిపోయిందని ఆందోళనలో ఉంటుంది. తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని ఇంటికి బయల్దేరుతుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఏంజెలా కారులో జేన్, ఏంజెలా ఇద్దరూ జేన్ ఇంటికి వస్తారు. కారు శబ్దం విని రికీ వెళ్ళిపోతాడు. జేన్ వద్దంటున్నా ఏంజెలా లెస్టర్‌ని పలకరించటానికి వెళుతుంది. లెస్టర్ కండలు చూసి అతన్ని పొగుడుతుంది. తర్వాత జేన్ నిలదీస్తే లెస్టర్‌తో శృంగారం చేస్తానని అంటుంది. జేన్ కోపంగా “నీకు సెక్స్ పిచ్చి పట్టుకుంది. మా నాన్న జోలికి మాత్రం వెళ్ళకు” అంటుంది. అయినా ఏంజెలా మొండిగా ఉంటుంది. రికీ ఇంటికి వెళ్ళాక ఫ్రాంక్ అతనిని నిలదీస్తాడు. ఇంటి నుంచి వెళ్ళగొడతానంటాడు. “నువ్వు గే అవటం కంటే చచ్చిపోవటం మేలు” అంటాడు. రికీకి కూడా ఆ ఇంటి నుంచి బయటపడాలనే ఉంది. అందుకే అతను గంజాయి అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. తాను గే అయితే తండ్రి తనని అసహ్యించుకుంటాడని అతనికి అప్పుడే తెలిసింది. అలాగయినా ఇంటి నుంచి బయటపడవచ్చని తాను గే అని చెబుతాడు. ఫ్రాంక్ అతన్ని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మంటాడు. ఎంత బాధాకరమైన విషయం? పిల్లలు గే అయితే కొందరు తలిదండ్రులు వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. గే అయినంత మాత్రాన పిల్లలు చెడ్డవారయిపోతారా? ఇన్నాళ్ళూ పెంచిన ప్రేమ ఏమయింది?

రికీ ఇల్లు విడిచి బయల్దేరుతాడు. జేన్ దగ్గరకి వెళ్ళి “నాతో వస్తావా?” అంటాడు. అసలే ఆమె ఏంజెలా తనకి ద్రోహం చేస్తుందని నిస్పృహతో ఉంది. రికీతో వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. ఏంజెలా ఆమెని ఆపటానికి ప్రయత్నిస్తుంది. ఆమెకి జేన్ ఒక్కతే స్నేహితురాలు. జేన్‌కి ఆత్మన్యూనతాభావం కలిగించి తన అహాన్ని సంతృప్తిపరచుకుంటూ ఉండేది. ఎవరి అభద్రత వారిది! “వాడు వింత మనిషి. వాడితో వెళ్ళొద్దు” అంటుంది ఏంజెలా. “నేనూ వింత మనిషినే. అన్నీ ఉన్న నీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు అర్థం కారు” అంటుంది జేన్. ఏంజెలా అహం శాంతిస్తుంది. “అవును. కనీసం నేను అనాకారిని కాదు” అంటుంది. రికీ “నువ్వు అనాకారివే. మామూలు అమ్మాయివే. అది నీకూ తెలుసు” అంటాడు. “మీ చావు మీరు చావండి” అని ఏంజెలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంజెలా తన కండలని పొగడగానే లెస్టర్ మళ్ళీ కసరత్తు మొదలుపెడతాడు. ఫ్రాంక్ అతని దగ్గరకి వస్తాడు. వర్షంలో తడిసి ఉంటాడు. అతనిలో కోపం లేదు. దిగులుగా ఉంటాడు. “నీ భార్య ఎక్కడుంది?” అంటాడు. తన కొడుకుతో అంగచూషణ చేయించుకున్నవాడిని అతను ఆ మాట ఎందుకు అడిగాడు? అది ఒక్క క్షణంలో తెలుస్తుంది. “నా భార్య ఎవడితోనో తిరుగుతోంది. నేను పట్టించుకోను. మా జీవితం ఒక ప్రదర్శన మాత్రమే. మేము అందరిలాగే ఉన్నామని నటిస్తామంతే” అంటాడు లెస్టర్. ఇందులో ఫ్రాంక్‌కి వేరే అర్థం స్ఫురిస్తుంది. లెస్టర్ తాను గే అనీ, అందుకే తన భార్య వేరే పురుషుడి దగ్గరకు వెళుతుందని, పైకి మాత్రం సాధారణంగా ఉంటామని అంటున్నాడని అనుకుంటాడు. ఫ్రాంక్ మనస్సు వికలం అవుతుంది. లెస్టర్ అర్థం కాక అతన్ని సముదాయిస్తాడు. హఠాత్తుగా ఫ్రాంక్ లెస్టర్ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు! అంటే ఫ్రాంక్ స్వలింగప్రియుడు. అతనికి తన కొడుకు మీద కూడా కోరిక ఉందని చిత్రంలో అక్కడక్కడా అతని హావభావాల ద్వారా చూపించారు. ఇది వికృతంగా అనిపిస్తుంది. కానీ సమాజానికి భయపడి తన నిజస్వభావాన్ని దాచుకుని అతను ఎంత నరకం అనుభవించాడో కదా అనిపిస్తుంది. పైకి మాత్రం గేలంటే అసహ్యమని చెబుతాడు. ఇదో వింత ప్రవృత్తి. లెస్టర్ మీద అతనికి అసూయ కలిగింది. లెస్టర్ నిజానికి గే కాదు. రికీ తన స్వార్థం కోసం అబద్ధం చెప్పాడు. ఫ్రాంక్ లెస్టర్‌ని ముద్దు పెట్టుకుంటే లెస్టర్ దూరంగా జరుగుతాడు. “నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు” అంటాడు. ఫ్రాంక్ అవమానభారంతో వెళ్ళిపోతాడు.

రికీ అన్న మాటలకి ఏంజెలా ఏడుస్తూ ఉంటుంది. లెస్టర్ ఆమె దగ్గరకి వెళతాడు. “మీరు సెక్సీగా ఉంటారని అన్నందుకు జేన్ నాతో గొడవపడింది” అంటుంది. ఆమెకి ఆ సమయంలో ఒక సాంత్వన కావాలి. అందుకని అతన్ని పొగుడుతుంది. అతను ఇదే అవకాశంగా ఆమెని లొంగదీసుకోవటానికి సిద్ధపడతాడు. “నువ్వు అందరికన్నా అందమైనదానివి” అంటాడు. “నేను మామూలు అమ్మాయినని మీరు అనుకోవటం లేదా?” అంటుంది. “నువ్వు ఎంత ప్రయత్నించినా మామూలు అమ్మాయిల్లాగా ఉండలేవు” అంటాడు. ఆమెతో శృంగారానికి సిద్ధపడతాడు. ఆమె సహకరిస్తుంది. “నాకిదే మొదటిసారి” అంటుంది. “హాస్యమాడుతున్నావా?” అంటాడతను. కాదంటుందామె. ఒకప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు తప్పటడుగు వేయటానికి జంకేవారు. ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా టీనేజి దాటేలోపు సెక్స్ చేయకపోతే అదేదో లోపంలాగా భావిస్తున్నారు. ఇది వికృతమైన సంస్కృతి. ఏంజెలా లాంటివారు మనసులో బెరుకు ఉన్నా పైకి మాత్రం పెద్ద ఆరిందాలాగా ఉంటారు. ఇదొక రకమైన రక్షణ వ్యూహం. బరితెగించినట్టుంటే ఎవరూ దగ్గరకి రారని. లెస్టర్‌లో ఒక్కసారిగా పరివర్తన వస్తుంది. అమాయకమైన అమ్మాయిని తన కామవాంఛకి బలి చేయబోతున్నానని అతనికి గ్రహింపు వస్తుంది. వెంటనే ఆ ప్రయత్నం విరమిస్తాడు.

క్యారలిన్ ఇంటికి చేరుకుంటుంది. తుపాకీ తీసుకుని ఇంటి వైపుకి వస్తుంటుంది. అయితే ఇంతలోనే తుపాకీ శబ్దం వినిపిస్తుంది. ఫ్రాంక్ తన తుపాకీతో లెస్టర్ ఇంటిలో ప్రవేశించి అతన్ని కాల్చేస్తాడు. ఫ్రాంక్ గే అని తెలిసినవాడు లెస్టర్ ఒక్కడే. అందుకే ఫ్రాంక్ అతన్ని చంపేశాడు. లెస్టర్ చావుకి కారణం క్యారలిన్ అసంతృప్తి కాదు, జేన్ అసహ్యమూ కాదు. ప్రాంక్ అభద్రత. లెస్టర్ వెళ్ళిపోయిన యౌవనాన్ని మళ్ళీ పొందాలనుకున్నాడు. క్యారలిన్ డబ్బు, హోదా కోరుకుంది. ఏంజెలా ప్రచారం కోరుకుంది. ఫ్రాంక్ అబద్ధపు ప్రతిష్ట కోరుకున్నాడు. రికీ తండ్రి మీద అక్కసుతో చెప్పిన అబద్ధం లెస్టర్ మెడకి చుట్టుకుంది. రికీదంటే చిన్న వయసు. ఫ్రాంక్ లాంటి వాళ్ళు సమాజంలో గౌరవంతో చెలామణి అవుతారు. ఆ గౌరవం కాపాడుకోవటానికి అకృత్యాలు చేస్తారు. లెస్టర్ లాంటివాళ్ళు సమాజాన్ని ధిక్కరించి చేతకానివాళ్ళనిపించుకుంటారు. మనం పేపర్లో రోజూ హత్యల గురించి చదువుతూ ఉంటాం. సమాజంలో ఉన్న అశాంతే ఇలా బయటపడుతూ ఉంటుంది. పరస్త్రీకాంక్ష (పరపురుషకాంక్ష కూడా), ధనకాంక్ష, కీర్తికాంక్ష, పదవీకాంక్ష ప్రబలిపోవటమే ఈ అశాంతికి కారణం. మళ్ళీ పూర్వపు జీవన విధానం వస్తే కానీ ఈ అశాంతి తగ్గదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here