[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
ప్రఖ్యాత సినీ కథా రచయిత సచిన్ భౌమిక్
ఎందరో బాలీవుడ్ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ కల్పించిన రచయిత సచిన్ భౌమిక్. దాదాపు 100 సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
సాధారణంగా ఎవరైనా ప్రముఖులు చనిపోయినప్పుడు, ఒక శకం ముగిసిపోయిందని చెప్పడం పరిపాటిగా మారింది. కానీ – అద్భుతమైన రచనా ప్రావీణ్యం, వినయం కలిగి ఉండి, మీడియాని తప్పించుకుతిరిగే సచిన్ భౌమిక్ విషయంలో మాత్రం ఇది ఖచ్చితంగా నిజం.
నేటి తరం వారు, సచిన్ దా అని ఆప్యాయంగా పిలుచుకునే – భౌమిక్ – క్రిష్, కోయి మిల్ గయా, కిస్నా, కోయ్‌లా, కరణ్ అర్జున్, తాళ్, ఇంకా అనేక ఇతర చిత్రాలకు పనిచేశారు. ఆరాధన, కర్మ, కర్జ్ (రిషి కపూర్), గోల్‌మాల్ (అమోల్ పాలేకర్, ఉత్పల్ దత్), కారవాన్, హమ్ కిసీ సే కమ్ నహీ, ఈవినింగ్ ఇన్ ప్యారిస్, లవ్ ఇన్ టోక్యో ఇంకా పలు చిత్రాలకు కథలో/స్క్రీన్ ప్లేనో అందించారు. 1950లలో నర్గీస్ నటించిన ‘లాజ్వంతి’ సినిమాకి గొప్ప కథను అందించి ఆ సినిమా విజయానికి దోహదమయ్యారని పాత తరం ప్రేక్షకులకి తెలుసు.
12 ఏప్రిల్, 2011న, 80 సంవత్సరాల వయస్సులో సచిన్ భౌమిక్ మరణించారు. ఆయన కథలందించిన – కర్జ్, ఖేల్ ఖేల్ మే, హమ్ కిసీ సే కమ్ నహీన్ మొదలైన చిత్రాలలో నటించిన రిషి కపూర్, భౌమిక్ గారిని గుర్తు చేసుకుంటూ – “60వ, 70వ దశకాలలో మాలో ఏ నటుడికైనా ఇమేజ్ మార్చుకోవాలనిపిస్తే, మేము సచిన్ భౌమిక్ గారి దగ్గరకు వెళ్ళేవాళ్ళం. ఆయన నాకు, మా బాబాయి షమ్మీ కపూర్‍కు కొన్ని అద్భుతమైన రొమాంటిక్ సినిమాల కథలు ఇచ్చారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇది చాలా వరకు నిజం. ఎందుకంటే భౌమిక్ లేకపోయుంటే – షమ్మీ కపూర్, రాజేంద్ర కుమార్, జితేంద్ర వంటి నటులూ, అంత అందగాడు కాని రాజేష్ ఖన్నా – సాఫ్ట్ రొమాంటిక్ హీరోల ఇమేజ్‌ని ఎప్పటికీ అందుకోలేకపోయేవారు. గరం ధరమ్ (ధర్మేంద్ర) కూడా ‘ఆయే దిన్ బహార్ కే’, ‘ఆయా సావన్ ఝూమ్ కే’ మొదలైన చిత్రాలలో సాఫ్ట్‌గా మారారు. సచిన్ భౌమిక్ స్క్రీన్‌ప్లేలు ఈ నటులందరికీ రొమాంటిక్ ఇమేజ్‍ని సాధించడంలో విజయవంతమయ్యాయి. మిల్స్ అండ్ బూన్స్ నవలలు భారతీయ మార్కెట్లోకి రావడానికి చాలా కాలం ముందే, ఆ రోజుల్లో అమ్మాయిలు ఈ వెండితెర నాయకులు సృష్టించిన రొమాన్స్ ఇమేజ్‌తో ముగ్ధులయిపోయారు.
సచిన్ భౌమిక్ షమ్మీ కపూర్‌కి బ్రహ్మచారి, ఈవినింగ్ ఇన్ ప్యారిస్, జాన్వర్ వంటి అనేక హిట్‌లను అందించారు. సచిన్ భౌమిక్ మరణించే సమయానికి షమ్మీ అనారోగ్యంతో ఉండడం వల్ల ఆ విషయం వెంటనే ఆయనకు చెప్పలేదు. భౌమిక్ ఇక లేరని తెలిశాకా, తన బాధను వ్యక్తం చేస్తూ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సచిన్ సాధారణ బెంగాలీ యాసతో హిందీ, ఇంగ్లీషులో ఎలా మాట్లాడేవారో షమ్మీ గుర్తుచేసుకున్నారు, “ఆయన హిందీ మాకు ఎంతకీ అర్థమయ్యేది కాదు, అందుకే ఇంగ్లీషులో మాట్లాడమని అడిగేవాళ్ళం.” అన్నారు.
షర్మిలా ఠాగూర్‌ని గుర్తించి, సినీ పరిశ్రమకి పరిచయం చేసినది భౌమిక్ గారే. ఆమెకు భౌమిక్ గారంటే చాలా ఇష్టం. భౌమిక్ గారి మరణ వార్త విన్నప్పుడు ఆయనని తలచుకుంటూ – “నన్ను సినిమాల్లో చేరమని మా అమ్మను ఒప్పించింది ఆయనే. శక్తిదా (దర్శకుడు శక్తి సమంత్) తో కలిసి తమ చిత్రం, ‘ఆరాధన’లో నటించేందుకు సంతకం చేయమని నన్ను ఎంతో బ్రతిమాలారు. ఆ చిత్రం సంచలనం సృష్టించింది, మా ఇద్దరినీ చాలా సన్నిహితులను చేసింది” అని చెప్పారు షర్మిలా.
ఈ సాన్నిహిత్యమే సచిన్ భౌమిక్ దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ‘రాజా రాణి’ లో అప్పటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా సరసన నటించేలా షర్మిలను ప్రేరేపించింది. అయితే ఆ సినిమా పరాజయం పాలైంది, తర్వాత సచిన్ భౌమిక్ మరే సినిమా దర్శకత్వం వహించలేదు.
కర్మ, కిస్నా, తాల్ మొదలైన అనేక చిత్రాలకు సచిన్ భౌమిక్‌తో పనిచేసిన దర్శక-నిర్మాత సుభాష్ ఘాయ్, “ఆయన ఎన్నో సినిమాలకు పని చేశారు, కానీ నిజ జీవితంలో సినిమా మనిషిలా ఉండరు” అంటూ సచిన్ భౌమిక్ వ్యక్తిత్వాన్ని క్లుప్తీకరించారు.
సచిన్ భౌమిక్ భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన సృష్టించిన ‘రొమాన్స్’ బాలీవుడ్‌ను ఇంకా ఎన్నో ఏళ్ళ పాటు శాసిస్తుంది. కాబట్టి – ఆరాధన, కారవాన్, హమ్ కిసీ సే కమ్ నహీ, బ్రహ్మచారి, ఈవినింగ్ ఇన్ ప్యారిస్, తాళ్ మొదలైన చిత్రాలను ఆస్వాదించడానికి బాక్ బటన్‌ను నొక్కండి.
మనోబినా రాయ్ జ్ఞాపకాలలో దర్శక నిర్మాత బిమల్ రాయ్
బిమల్ రాయ్ గారి సినిమాలు గొప్పవి. అవి ఆనాటి కాలానికి ప్రతిబింబాలు, ప్రగతిశీల భావనను చాటే సినిమాలు, సమాజంలోని క్రూరమైన దోపిడీని బహిర్గతం చేసేవి, మహిళా సామర్థ్యాన్ని చాటినవి. ఆయన జీవితం, సినిమాలపై ఎన్నో డాక్యుమెంటరీ, పుస్తకాలు వెలువడ్డాయి. కానీ ఆయన భార్య మనోబినా రాయ్ గురించి ఎక్కువ మందికి పెద్దగా తెలియదు.
నస్రీన్ మున్నీ కబీర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త, బిమల్ రాయ్ గురించి మనోబినా రాయ్ ఎన్నో విషయాలు చెప్పారు. వాటిల్లోంచి కొన్ని సంగతులివి.
బిమల్ రాయ్ కలకత్తాలోని న్యూ థియేటర్స్ సంస్థలో కీలకమైన సినిమాటోగ్రాఫర్, నితిన్ బోస్, ఇంకా పిసి బారువాతో కలిసి పనిచేశారు. 1930ల చివర్లో కుటుంబ సభ్యులతో నైనిటాల్ సమీపంలోని ముక్తేశ్వర్‌లో ఉండగా, అక్కడ మనోబినా సేన్‌ని కలిసారు రాయ్. యువ మనోబినాను చూసి వెంటనే బిమల్ రాయ్ పెళ్ళికి ప్రతిపాదించారట. అయితే ‘బీనా’ (ఇంట్లో పిలిచే ముద్దు పేరు) ఇంకా చిన్న పిల్ల అనీ అప్పుడే పెళ్ళేంటని ఆమె తండ్రి మొదట్లో సమ్మతించలేదు. కానీ కొన్నాళ్ళకి ఒప్పుకున్నారు. 1939లో, సేన్ రాయ్ కుటుంబాలు బెనారస్‌లో – సాంప్రదాయ బెంగాలీ పద్ధతిలో వీరికి వివాహం జరిపించారు. అప్పుడు మనోబినా వయసు 17, బిమల్ రాయ్ వయసు 28.
“ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక తెలివైన మరియు ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీ ఉంటుంది”- అనేది బాగా నలిగిన వాక్యం కావచ్చు, కానీ మనోబినా రాయ్ తన భర్త జీవితంలో బలమైన శక్తిగా మారారు. ఆయన చిత్రాల గురించి చర్చించడమే కాకుండా, ఫోటోగ్రఫీపై తన అవగాహనను ఆయనతో పంచుకునేవారు (ఆమె ఫోటోలు ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో క్రమం తప్పకుండా ప్రచురించబడేవి). బిమల్ రాయ్ భారతదేశంలోనూ, విదేశాలలోనూ పర్యటిస్తున్నప్పుడు వారి వెంట వెళ్ళేవారు మనోబీనా. ఆనాటి సాహిత్యాన్ని వెండితెరపైకి తీసుకురమ్మని భర్తని ప్రోత్సహించారు (ఆమె ‘సో ఫార్, దట్ నియర్’ అనే బెంగాలీ నవల రాశారు, ‘ఫెమినా’కు కాలమిస్ట్).
బాంద్రాలోని మౌంట్ మేరీ రోడ్‌లో వారు నివసించే విశాలమైన, అందమైన బంగ్లాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమెను ‘అమ్మా’ అని పిలిచినట్లు అనిపించిందని మున్నీ కబీర్ చెప్పారు.
“నాకు ఆమె స్వాగతం పలికేవారు, నాతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ, నేను ఆమె సంతానం – యశోధర, అపరాజిత, జాయ్‌లకు దగ్గరయ్యాను. నేను లండన్ నుండి వచ్చినప్పుడల్లా, ఆ మంత్రముగ్ధమైన ఇంట్లో చాలా గంటలు గడిపేదాన్ని. పైగా నేను మనోబినా రాయ్‌ని ‘అమ్మా’ అని పిలవడం ప్రారంభించాను. ఆమె చిరునవ్వుతో ‘అమ్మా అనే పదం అందరికీ ఊతపదంగా మారిందా ఏంటి?’ అని అడిగారు.”
“90వ దశకంలో, సాయంత్రపు వెలుగు వారి గదిలో కాంతి నింపుతుండగా, మనోబినా గారూ, నేను తరచుగా గంటల తరబడి ఆమె భర్త కృషి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ గది గోడపై, బిమల్ రాయ్ గారి పెద్ద ఫోటో ఒకటి – నల్లటి విగ్రహాల వరుస పైన వేలాడదీయబడి ఉండేది. 1953లో దో బిఘా జమిన్‌తో ప్రారంభించి 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఉత్తమ దర్శకత్వం లేదా ఉత్తమ చిత్రాలకు అందుకున్న ఏకైక దర్శకుడు ఆయనే. అత్యాశాపరుడైన ఓ భూస్వామి నుంచి తన భూమిని కాపాడుకోవడానికి కష్టపడే ఓ రైతు సరళమైన, హృదయ విదారకమైన కథను ‘దో బీఘా జమీన్’ అద్భుతమైన సినిమా భాషలో చెబుతుంది.
తన జీవితకాలంలో బిమల్ రాయ్ అత్యంత గౌరవం, కీర్తిప్రతిష్ఠలు పొందినప్పటికీ, వారి ఇంట డబ్బు ప్రవహించలేదు. తనకు నచ్చిన సినిమాలను తీయాలనుకుంటే, బాక్సాఫీస్ గురించి పెద్దగా పట్టించుకోవద్దని ఆయనకు తెలుసు. ఆయన ఎల్లప్పుడూ తన అంతఃప్రేరణనే అనుసరించేవారు.
“మా వారు తీసిన అన్ని సినిమాల కంటే ‘మధుమతి’ భిన్నమైనది,” చెప్పారు మనోబినా. “అది దెయ్యం కథ కాబట్టి ప్రజలు ఆ చిత్రాన్ని విమర్శించారు. ‘అంత వాస్తవికత ఉన్న బిమల్ రాయ్ ఈ స్థాయికి ఎలా దిగజారాడు? ఇది కేవలం దెయ్యం కథ, ప్రేమ కథ’ అన్నారు విమర్శకులు. ఆయన ఆ సినిమా చేయడం వారికి నచ్చలేదు. కానీ ‘మధుమతి’ నేటికీ [1990లలో] మమ్మల్ని బ్రతికించిన ఏకైక చిత్రం. అన్ని ఇతర చిత్రాలను ఖచ్చితంగా మర్చిపోలేదు – వాటి నాణ్యత వల్ల అవి గుర్తుంటాయి, కానీ వాటి వల్ల డబ్బు రాలేదు” అన్నారు మనోబినా.
బిమల్ మితభాషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆయన గురించి పెద్దగా తెలియని విషయం చెప్పమని మనోబినా రాయ్‌ని మున్నీ అడిగారు. “అవును, ఆయన చాలా మౌనంగా ఉండేవారు, కానీ ఆయనలో గొప్ప హాస్య చతురత ఉండేది, అది మా ఇంటికే పరిమితం” అన్నారామె.
జనవరి 8, 1966న, బిమల్ రాయ్ మౌంట్ మేరీ రోడ్‌లోని అదే విశాలమైన బంగ్లాలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అప్పుడు మనోబినా రాయ్ వయస్సు 44 సంవత్సరాలు మాత్రమే, నేటి ప్రమాణాల ప్రకారం యవ్వనంలో ఉన్నట్లే. ఎంతో ఇష్టపడే భర్తను పోగొట్టుకున్న బాధతో చాలా ఒత్తిడిని అనుభవించారు మనోబీనా. బాధ్యతలను స్వీకరించి, ఒంటరిగా, ఆమె తన పిల్లలను – ముగ్గురు కుమార్తెలు, రింకీ, యశోదర, అపరాజిత ఇంకా కుమారుడ్ జాయ్‌ను పెంచారు. బిమల్ రాయ్ ప్రొడక్షన్స్ కార్యాలయాలను మూసివేసి, తన భర్త సిబ్బందిని పంపేయకుండా, వారికి జీతాలిచ్చారు. సినిమాలేం నిర్మించనప్పటికీ 1980ల వరకూ సంస్థను నడిపారు.
“మనోబినా రాయ్ 2001లో కన్నుమూశారు. ఆమెతోపాటే హుందాతనం నిండిన ఓ శకం ముగిసింది. యశోదర, అపరాజిత, జాయ్ ఇప్పటికీ నన్ను ఆహ్వానిస్తుంటారు. వారు ఇప్పుడు తమ పాత బంగ్లా ఉన్న స్థలం పక్కన మరో ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంటి గోడలపై బిమల్ రాయ్ గారి సుపరిచితమైన ఫోటో ఇప్పటికీ ఉంది, ఇప్పుడు దాని పక్కన మనోహరమైన మనోబినా రాయ్ ఫోటో కూడా చేరింది” అని వెల్లడించారు మున్నీ కబీర్.