[శ్రీ చలపాక ప్రకాష్ రచించిన ‘నా జీవన యాత్ర’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]సా[/dropcap]ధారణంగా స్వీయచరిత్రలు/ఆత్మకథలు గద్యరూపంలో ఉంటాయి. వంద నుంచి ఆరేడు వందల పేజీల ఆత్మకథలూ ఉన్నాయి. కానీ ఒక జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంక్షిప్తంగా ఒక దీర్ఘ కవితలా చెప్పడం అరుదు. ఒక ప్రయోగం కూడా కావచ్చు.
ప్రముఖ కవి, కథకుడు, సంపాదకుడు శ్రీ చలపాక ప్రకాష్ తన జీవన యానంలోని ముఖ్యమైన మజిలీల గురించి – ఓ బాటసారిలా – చెబుతూ ఓ దీర్ఘ కవిత వ్రాశారు. దానిని ఆకాశవాణి 26 ఆగస్టు 2015 న ప్రసారం చేసింది. తరువాత 3 ఫిబ్రవరి 2022 నాడు ‘నేటి నిజం’ పత్రిక ప్రచురించింది.
అదే సంవత్సరంలో – కొన్ని అరుదైన ఛాయాచిత్రాలను చేర్చి, ఈ దీర్ఘకవితను నలభై పేజీల పుస్తకంగా వెలువరించారు చలపాక ప్రకాష్.
అయితే ఇది సంపూర్ణమైన స్వీయ చరిత్ర కాదు. యాత్రాపిపాసిగా, సాహిత్యాభిమానిగా వారి జీవితంలోని రెండు పార్శ్వాలను స్పృశిస్తూ సాగిన దీర్ఘ కవిత.
యాత్రలు చేయాలన్న తన కోరిక చిన్నప్పడు తీరకపోయినా, ఎదిగే కొద్దీ యాత్రలు చేస్తూ, తన జీవితంలో తానే ఓ పాత్రగా మారి ఈ కవితనల్లారు. మధ్య తరగతి జీవితంలో ఇష్టమైన ప్రయాణాలు చూడటం ఎంత కష్టమో చెబుతూ, తాను వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన ప్రాంతాలను చెబుతారు.
స్కూల్ తరపున కొండపల్లి కోటకి విహార యాత్రకి వెళ్ళినప్పుడు – అక్కడ ఓ మిత్రుడు ప్రవర్తించిన తీరు చేదుగా గుర్తుండిపోయిందంటారు. ఆ ప్రయాణంలోనే తమ టీచర్ చెప్పిన మాటలు విజ్ఞాన రహస్యాలని తర్వాత తెలుసుకున్నానని అంటారు.
నేరేడు పండ్లు అనుకుని ఇంకుడుకాయలని తిని ఉమ్మేసిన వైనం గుర్తు చేసుకుని అది తన విజ్ఞాన యాత్ర అని అంటారు. చెల్లినీ తననీ చిన్నప్పుడు అమ్మమ్మ భద్రాచలం తీసుకువెళ్ళడాన్ని మది నిండా నింపుకుంటారు.
బ్రతుకు బండి వృత్తికే పరిమితమైనప్పుడు యాత్రాబండి షెడ్ లోనే ఉండిపోయిందని వాపోతారు. తాను రాసిన ఒక కవిత ఓ సంకలనంలో చోటు చేసుకుని, ఆ పుస్తకావిష్కరణకి కామారెడ్డి వెళ్ళవలసి రావడం తన సాహితీయానంలో ప్రధాన మజిలీ అని అంటారు,
ఇక వ్యక్తిగత జీవితం వెనక్కి వెళ్ళి సాహిత్యమే ముందుకొస్తుందీ దీర్ఘకవితలో. యాత్ర చేయడమంటే చిన్న విషయం కాదనీ, అల్లాటప్పా కాదనీ, యాత్రంటే సమస్త ప్రకృతిని పలకరించి రావడమని అంటారు.
తన యాత్ర భిన్నమైనదనీ, తాను ఆలయాలకు బదులు సాహిత్య సభలకు వెళ్ళాలని, దేవుళ్ళకు బదులు సాహితీవేత్తలకి నమస్కరించానని, అక్షర పద్యాలను మంత్రాలుగా చదివానని అంటారు.
ఎన్నో ఊర్లు తిరిగాననీ, అనేక సాహితీ పరిమళాలను ఆఘ్రాణించాననీ, అనేక జీవన గాథలను కథలుగా స్పృశించానని అంటారు.
ఉయ్యూరులో కాలేజీ విద్యార్థులకు బ్రతుకు పాఠాలను కథలుగా చెప్పడం, కామారెడ్డి సభ నుంచి చెన్నై కవి సమ్మేళనం వరకూ తన ప్రస్థానం సాగటం, ప్రముఖ సాహితీ దిగ్గజాలను కలవడం, వారి ఆలోచనలను గ్రహించటం, ఎందరో ఉద్దండుల సంస్మరణ సభల్లో పాల్గొనడం, తన జీవితాన్ని మలచుకోవడం వంటి వాటి గురించి సంక్షిప్తంగా చెప్తారు.
రచయితగా ఎదగడం, సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించటం వంటివి తన జీవనయాత్రలో ఓ భాగమని అంటారు.
రేపటి తరానికి ఇష్టం ఉన్నా లేకున్నా తన సాహితీయాత్రని అందిస్తున్నాని అంటూ కవితని ముగిస్తారు.
ఈ దీర్ఘకవిత చదివిన వారికి ప్రకాష్ గారి సాహితీ లోతులు అర్థమవుతాయి. ఆయన కలిసిన దిగ్గజాలు, ఉద్దండుల గురించి తెలుస్తుంది. చేసిన కొన్ని ప్రసంగాల ఉద్వేగపు తాకిడి తెలుస్తుంది.
అయితే ఇన్ని విస్తృత పరిచయాలు, స్నేహాలు ఉన్న ప్రకాష్ తమ స్వీయచరిత్రని సమగ్రంగా రచిస్తే సాహితీలోకానికి ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.
***
నా జీవన యాత్ర (దీర్ఘ కవిత)
రచన: చలపాక ప్రకాష్
పేజీలు: 40
వెల: ₹ 30/-
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్, విజయవాడ.
శ్రీ చలపాక ప్రకాష్. ఫోన్: 9247475975
chalapaka@gmail.com