[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]జ[/dropcap]రుగుతున్న సంఘటనల ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు, నేను లేక్ వ్యూ గెస్ట్ హౌస్‍లో బందీగా ఉన్నప్పుడు, దేశంలో జరిగిన సంఘటనలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
భారత ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు హైదరాబాద్ ప్రభుత్వం, ఇత్తెహాద్‌లు సిద్ధమవుతున్నప్పుడు, భారత ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యనైనా చేపట్టే ధైర్యం లేదన్నది వారి విశ్వాసం. ఒకవేళ భారత ప్రభుత్వం ఎలాంటి చర్యనయినా చేపట్టినా, ప్రభుత్వం పతనమౌతుందని బలంగా నమ్మారు.
బ్రిటిష్ ఆఫీసర్లు లేకపోవటం వల్ల, సరైన ఆయుధ సామగ్రి అందుబాటులో లేకపోవటం వల్ల భారత సైన్యం హైదరాబాదుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోలేదన్నది వారి విశ్వాసం. దీనికి తోడు భారత సైన్యం కశ్మీరు వ్యవహారంలో చిక్కుకుని ఉంది. ఈ నమ్మకాన్ని పాకిస్తాన్ రేడియో బలపరచింది. ఒకప్పుడు భారత సైన్యంలో పని చేసి ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న బ్రిటీష్ ఆఫీసర్లు, భారత సైన్యాన్ని ఊచకోత కోయటంలో ఎలాంటి అపనమ్మకం అవసరం లేదని నమ్మిన హైదరాబాద్ సైనికులు అత్యంత విశ్వాసం కనబరచారు.
లాయక్ అలీ, ఇత్తెహాద్‌లు సైతం హైదరాబాదుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యను చేపట్టినా దేశమంతా మతకల్లోలాలు సంభవిస్తాయని, కాబట్టి భారత ప్రభుత్వం మతకల్లోలాలకు దారితీసే పని చేయదని వారు ఊహించారు. అంతేకాక, ఒకవేళ హైదరాబాదుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య చేపట్టినా భారతదేశంలోని ముస్లింలంతా కలసికట్టుగా ఒక్కటై ఉద్యమిస్తారని వారు గాఢంగా నమ్మారు.
ఇంత బలంగా, పాకిస్తాన్ ప్రజలు, నాయకులు నిజామ్ స్వతంత్ర సాధన ప్రయత్నాలకు మద్దతుగా ఉన్నారని ఇత్తెహాద్ నాయకులు నమ్మారు. ‘కొందరు పెద్దల కోసం పాకిస్తాన్‍ను ప్రమాదం లోకి నెట్టే ప్రసక్తి లేద’ని జిన్నా నిర్మొహమాటంగా చెప్పినా సరే, ప్రజాభిప్రాయానికి తలవంచి, నిజామ్ సహాయానికి పాకిస్తాన్ వస్తుందని వారు విశ్వసించారు. పాకిస్తాన్ జోక్యం చేసుకుంటే భారత ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సులభంగా ఓడిస్తుందని వారు నమ్మారు.
ఈ సమయంలో ఢిల్లీ అంతటా పండిట్‍జీ సర్దార్‌ల నడుకు భేదాభిప్రాయాలు ఉన్నాయన్న గుసగుసలు బయలుదేరాయి. ఈ గుసగుసల ప్రతిధ్వనులు హైదరాబాదులో మరింత బిగ్గరగా వినిపించాయి. న్యూ ఢిల్లీ సెక్రటేరియట్ చుట్టూ ఉన్న హైదరాబాద్ ఏజంట్లు తాము విన్న వాటికి తమ ఊహలు జోడించి సర్దార్, పండిట్‍జీల భేదాభిప్రాయాల గురించి హైదరాబాదులో ప్రచారం చేసేవారు. దీనికి మరింత జోడించి, సర్దార్ హైదరాబాదుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యను ప్రతిపాదించినా, పండిట్‌జీ అంతర్జాతీయంగా పోయే ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని సర్దార్‍ను రాజీనామా చేయమంటారని భావించారు అనేకులు.
ఈలోగా భారతదేశమంతటా ప్రమాద ఘంటికలు ధ్వనించాయి. రజాకార్ల కార్యకలాపాలు, నిజామ్ ప్రభుత్వ ప్రవర్తనలను జాతీయ ప్రమాదంగా ప్రజలు భావించారు. రజాకార్ల దుష్కృత్యాలు, రజాకార్ల గురించి భారత ప్రభుత్వం, నిజామ్ ప్రభుత్వాల నడుమ నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషు పత్రికలలోనూ, ఇతర భారతీయ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. ఫలితంగా దేశమంతా ఆవేశం, అసహనం చెలరేగాయి.
జూలై నెల అంతానికి మౌంట్‌బాటెన్ భారత్ వదలి వెళ్ళాడు. అతనితో పాటు, హైదరాబాద్ సమస్య పరిష్కారమవుతుందన్న భావన కూడా తొలగిపోయింది. ఈ సమస్య పరిష్కారం విషయంలో ఢిల్లీలో ఇంకా పలువురిలో సందేహాలున్నాయి. ఆరోగ్యం మెరుగవటంతో పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు సర్దార్. తన కలవాటయిన స్థిరత్వంతో, అన్ని విషయాలను పరిగణించి ముందరి చూపుతో నిర్ణయాలు తీసున్నారు. భారత సైన్యాన్ని ఆయన రెండు లక్ష్యాలతో మోహరించటం ప్రారంభించారు. వీలయినంత వేగంగా, నిర్దిష్టంగా, ఖచ్చితమైన రీతిలో హైదరాబాద్‌పై సఫలవంతమైన చర్య తీసుకునే సైన్యాన్ని సమీకరించటం, ఈ చర్య తీసుకునే సమయంలో దేశవ్యాప్తంగా అశాంతి చెలరేగకుండా కట్టుదిట్టాలు చేయటం అన్న ముందరి చూపుతో ఆయన నిర్ణయం తీసుకున్నారు.
సైన్యాన్ని సమీకరించటం అంత సులభం కాదు. భారతదేశపు పశ్చిమ సరిహద్దు, కశ్మీరులలో సైన్యాన్నిమోహరించటం తప్పనిసరి. హైదరాబాదు పరిస్థితిని ఆసరగా చేసుకుని పాకిస్తాన్ చేపట్టే ఎలాంటి చర్యనయినా మొగ్గలోనే తుంచేయటం తప్పనిసరి. కాబట్టి దేశమంతా సైన్యాన్ని సరైన రీతిలో అందబాటులో ఉంచటం తప్పనిసరి. అయినా మే నెల మొదటి వారాని కల్లా సైనిక చర్యకు అవసరమైన సైన్యాన్ని కీలకమైన ప్రాంతాలకు తరలించటం ఆరంభమై పోయింది. జూలై నెల కల్లా సైనిక చర్యకు అవసరమైన దళాలన్నీ తమ తమ నిర్దిష్ట స్థానాలకు చేరుకున్నాయి. వర్షాకాలంలో అవన్నీ కలిసికట్టుగా ఒక దళంలా పని చేయటం అలవాటు చేసుకున్నాయి. సెప్టెంబరు కల్లా ఎంపికయిన 20,000 సైనికులు ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.
దీనితో పోలిస్తే హైదరాబాద్ లోని 22000 సైనికులు, బ్రిటీష్ వారి పద్ధతిలో శిక్షణ పొందారు. వారి దగ్గర ఆయుధ సామగ్రి తక్కువగా ఉంది. ఇది కాక, తక్కువ శక్తి గల ఆయుధాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న 10,000 మంది సైనికులున్నారు. 10,000 సాయుధ పోలీసు దళాలున్నాయి. పలు రకాల మారణాయుధాలు కల అరబ్బు పోరాట వీరులున్నారు. 100,000 మంది రజాకార్లున్నారు. వీరిలో 20,000 మంది దగ్గర పలు రకాల తుపాకులున్నాయి. మిగతావారి దగ్గర కత్తులు, కటార్లున్నాయి.
రజాకార్ల అకృత్యాలు, నిజామ్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చులకనగా వ్యవహరించటం భారత సైనికులలో పట్టుదలను కలిగించి, తాము చేపట్టబోయే చర్య ఆవశ్యతను గ్రహించేట్టు చేశాయి. ప్రస్తుతం పొంచి ఉన్న ప్రమాదాన్ని వేగంగా, సమూలంగా నాశనం చేయాల్సిన ఆవశ్యకత భారత సైనికులలో ప్రతి ఒక్కరికీ తెలిసింది.
భారత్ సైనికాధికారులలో అధిక సంఖ్యాకులు ఏదో సమయంలో హైదరాబాద్ సైన్యాన్ని అతి దగ్గరగా చూసినవారు. కాబట్టి భారత్ చేపట్టబోయే సైనిక చర్య వేగంగా పూర్తవుతుందనీ, అంతర్గతంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదన్నది వారి విశ్వాసం. బ్రిటీష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ బుచెర్ మాత్రమే సందేహాలతో ఉన్నాడు. అతను హైదరాబాద్ సైన్యం గురించి ఉన్నదాని కన్నా ఎక్కువగా అంచనా వేశాడు. తమ సైన్యం గురించి తక్కువ అంచనా వేశాడు. అంతర్గతంగా, స్థానికంగా ఉత్పన్నమయ్యే శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కొనటంలో సర్దార్ శక్తిని కాని, స్థానిక ప్రభుత్వాల సామర్థ్యాన్ని కానీ ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. భారతదేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్న రజాకార్ల ప్రమాదాన్ని తొలగించటం ముందు ఏ రకమైనా త్యాగమైనా తక్కువేనని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు.
గత ఏడాదిన్నర సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలలోని ముస్లిం లందరినీ ఏకం చేసి, తమకు సానుకూలంగా స్పందించేట్టు తయారు చేయాలన్న ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. దేశంలోని ముస్లిం పత్రికలన్నీ ముక్తకంఠంతో నిజామ్ సమస్యని కొని తెచ్చుకున్నాడనీ, అది అతని స్వీయ అపరాధం అనీ వ్యాఖ్యానించాయి. ఆలోచనాపరులయిన ముస్లింలు నిజామ్ పట్ల కానీ, ఇత్తెహాద్‌ల పట్ల కానీ ఎలాంటి సానుభూతిని ప్రదర్శించలేదు. ఇందుకు భిన్నంగా వారు, దేశంలో మతపరమైన ఛాందస భావనలను రెచ్చగొడుతూ, దేశవిభజన తరువాత హిందూ, ముస్లింల నడుమ సౌహార్ద్రతను నెలకొల్పాలని అందరూ ఆశిస్తున్న భావనలను దెబ్బతీసేట్టు ప్రవర్తిస్తున్న ఇత్తెహాద్ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించారు.
అయితే, దేశంలలో అన్ని ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడే విషయాన్ని సర్దార్ తేలికగా తీసుకోలేదు.
(ఇంకా ఉంది)