[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
చీకటివెలుగులు
[dropcap]జీ[/dropcap]వితంలో ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో, మనది కాని వూరిలో మనం నివసించవలసి వస్తుంది. కొంతకాలం తర్వాత ఆ వూరు నచ్చితే అక్కడే స్థిరపడిపోవడానికి ప్రయత్నిస్తాం. అన్ని రకాలు గాను ఆ ప్రాంతం మీద, ఊరి మీద నమ్మకం ఏర్పడిన తరువాత, అక్కడి ప్రజల్ని కూడా నమ్మేస్తాం. స్వేచ్ఛగా బ్రతికే వెసులుబాటు కలుగుతుంది. అక్కడి ప్రజల మీద నమ్మకం ఏర్పడిన తర్వాత, ఇరుగు పొరుగుతో స్నేహబంధాలు మెరుగైన తర్వాత, ఇంటి విషయంలోనూ, ఇంటి పరిసరాల విషయంలోనూ పెద్దగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అసలు చేయం. దొంగతనాల గురించి, దోపిడీల గురించి అసలు ఆలోచించం. అలాంటి వాతావరణంలో, ఇంటి తలుపులు మూయడాలు, తలుపులకు తాళాలు కూడా వేసుకునే ప్రయత్నం చేయం. ఎందుచేతనంటే ఇరుగు పొరుగు మీద,ఆ ప్రాంతం మీద అంత నమ్మకం ఉంటుందన్న మాట! కొన్ని ప్రాంతాలలో అసలు దొంగల భయం లేకపోవడం వల్ల, అక్కడి ప్రజలు పని మీద రెండు మూడు రోజులపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లినా, వాళ్ళ ఇళ్లకు తాళాలు వేసుకోరట! అది వేరే విషయం అనుకోండి. అలాంటి ప్రజలను నిజంగా అభినందించాలి. నిజానికి కష్టపడి సంపాదించుకుని బ్రతికేవాడికి మరో ఆలోచన ఉండదు. దొంగతనాల జోలికి పోయే పరిస్థితే రాదు.
దొంగలు లేని ప్రాంతాలు లేనట్టే, దొంగల ప్రదేశంగా పేరుపడ్డ ఊళ్ళు కూడా వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో, ‘స్టువార్టుపురం’ ఒకప్పుడు దొంగల స్థావరంగా ప్రసిద్ధి. ‘స్టువర్టుపురం దొంగలు’ పేరుతో, ఒక తెలుగు చలన చిత్రం విడుదల అయినట్టు నాకు గుర్తు. క్రమంగా ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితులు లేవని చెబుతారు. అసలు ఈ దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? దీనికి అనేక కారణాలు ఉంటాయి.
పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత, అత్యాశ, అలాగే జీవితం అంటే నిర్లక్ష్య ధోరణి, ఇలా అనేక విషయాలు దొంగతనాలతో ముడిపడి ఉంటాయి. నా జీవితంలో ఇలాంటి సమస్యనొక దానిని నేను ఎదుర్కొనక తప్పలేదు. అది మీ ముందు ఉంచడానికే ఈ ఉపోద్ఘాతం అంతా.
1982 జూన్ నెలలో, నేను దంతవైద్యుడిగా, మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నియమింపబడ్డాను. నేను ఉద్యోగంలో చేరేవరకూ మహబూబాబాద్ గురించి నాకు తెలియదు. పోస్టింగ్ ఆర్డర్ చేతికి వచ్చాక అందరూ భయపెట్టారు. అక్కడ నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉంటుందని, శాంతిభద్రతల సమస్య ఉంటుందని, సరిగా ఉద్యోగం చేయనివ్వరని ఇలా అనేక విషయాలు నా మెదడులోకి చొప్పించారు. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేనాటికి నేను సింగరేణి కాలరీస్‌కు చెందిన బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్నాను. అక్కడ సహోద్యోగి, కంటి వైద్య నిపుణుడు డా. భద్రీనారాయణ గారు, నన్ను భయపడకుండా సముదాయించి, ప్రోత్సహించి పంపించారు. ఆ ధైర్యంతో నేను మహాహబూబాబాద్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. అయితే, అక్కడ బెల్లంపల్లిలో వైద్య మిత్రులు భయపెట్టినంత సన్నివేశం కనిపించలేదు. అక్కడి ప్రజలు కూడా ఎంతగానో గౌరవించేవారు, ప్రోత్సాహకరంగా స్నేహంగా ఉండేవారు. అదొక సురక్షిత ప్రదేశంగా అనిపించింది. మంచి రకం సన్న బియ్యం, మంచి తాజా పండ్లు కూరగాయలు దొరికేవి. అక్కడి వైద్యుల కంటే బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, రైల్వే ఉద్యోగులు ఎక్కువగా నాకు మిత్రులుగా ఉండేవారు. బ్యాంకు ఉద్యోగులు తోట సాంబశివరావు గారు, శ్రీ భుజంగ రావు గారు, శ్రీ యాకుబ్ మియా, శ్రీ తిరుమల రావు, శ్రీ కె.జె. శ్రీనివాస్ వంటివారు ఇప్పటికి మా స్నేహాన్ని కొనసాగిస్తూనే వున్నారు.
సాయంత్రం ఆసుపత్రి డ్యూటీ పూర్తికాగానే చాలామంది మిత్రులం ముఖ్యంగా బ్రహ్మచారులు, రైల్వే స్టేషన్‌లో కలుసుకునేవాళ్ళం. రైల్వే స్టేషన్‌లో చారి అనే బుకింగ్ క్లార్క్, శ్రీ సుబ్బారావు అనే స్టేషన్ మాస్టర్ నాకు మంచి మిత్రులు. నేను ఒక్కడిని వున్నప్పుడు స్టేషన్‌లో వాళ్ళ దగ్గర ‘టీ’ సేవించి, సుమారు ఒక గంటసేపు అక్కడ గడిపి ఇంటికి వెళ్ళేవాడిని. ఈ కార్యక్రమం నాకు పెళ్ళై, పిల్లలు పుట్టేవరకూ ఇంకా చెప్పాలంటే, నేను అక్కడి నుండి జనగాంకు (1994) బదిలీ అయ్యేవరకూ కొనసాగింది. పిల్లలు పుట్టిన తర్వాత మా చిన్న మేనమామ కొడుకు రాజబాబు కూడా అతని చదువు నిమిత్తం మాతో ఉండేవాడు (ప్రస్తుతం TSRTC – మంచిర్యాల డిపో – సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు).
ఈ నేపథ్యంలో ఒక రోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది గుర్తుకు వస్తే ఇప్పటికీ గుండె ఝల్లుమంటుంది. అదేమిటంటే, ఆ రోజు సాయంత్రం ఆసుపత్రి నుండి నేను సరాసరి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఒక గంట సేపు గడిపి, కాలి నడకన (అప్పటికి ఇంకా స్కూటర్ నేను కొనుక్కోలేదు) ఇంటికి బయలుదేరాను. సగం దూరం వచ్చేసరికి, మా రాజబాబు హడావిడిగా నాకు ఎదురు వచ్చాడు. “బావగారూ – మన ఇంట్లో దొంగలు పడ్డారు” అనగానే, వాయువేగంతో ఇంటికి చేరుకున్నాను. నా భయం దొంగలు ఏదో దోచుకు పోయి ఉంటారని కాదు. నా భార్యనూ పిల్లల్ని గాయపరిచారేమోనన్నది నా భయం. నేను ఇంట్లో ప్రవేశించేసరికి నా భార్య ఇంచుమించు షాక్‌లో, సంవత్సరం వయసున్న నా కూతురిని ఎత్తుకుని వుంది. మూడు సంవత్సరాల నా కొడుకు బిక్క మొహం వేసుకుని వున్నాడు. వీళ్ళందరూ భయంకరమైన సన్నివేశాన్ని అనుభవించారు. నలుగురు దొంగలు ఇంట్లో ప్రవేశించి మొత్తం బంగారం, పుస్తెలతాడుతో సహా భయపెట్టి తీసేసుకున్నారు. క్షణాల్లో దోచుకుని మాయమయ్యారు. రాత్రి పడుకునేటప్పుడు తప్ప, తలుపులు ఎప్పుడూ తెరిచి వుంచేవాళ్ళం. అదే కొంప ముంచింది.
సాయంత్రం పూట, నా శ్రీమతి, నా కూతురిని ఎత్తుకుని వంటగదిలో వంట చేసుకుంటోంది. చిన్నవాడైన కుమారరత్నం బయట ఆడుకుంటున్నాడు, మా బావమరిది పని మీద బయటకు వెళ్ళాడు. ఒకచోట వ్యూహం దెబ్బతిని వెనుతిరిగి వెళ్లిపోతున్న దొంగల బృందానికి ఇంటి తలుపులు బార్లా తెరిచివున్న మా ఇల్లు కనిపించింది. అంతే, క్షణం ఆలోచించకుండా, రాక్షసుడిలాంటి ఒక దొంగ మెల్లగా వంట గదిలోకి వెళ్లి చప్పుడు చేయకుండా, మా ఆవిడ వెనుక నిలబడ్డాడట. ఒక దొంగ ఇంటి హాలు గుమ్మం దగ్గర, గేటు దగ్గర ఇద్దరు దొంగలు నిలబడ్డారట! వంటగదిలో ప్రవేశించిన వాడిని, వెనక్కు చూడకుండా, నేను వచ్చి వెనుక నుంచున్నానని అనుకుందట మా ఆవిడ. వెనక్కి తిరిగి వాడిని చూసి అరవబోయిందట! వాడు వెంటనే కత్తితో భయపెట్టి, బీరువా దగ్గరికి తీసుకుపోయి వస్తువులు తీసి ఇమ్మన్నాడట. మారు మాట్లాడకుండా ఆమె అన్నీ తీసి ఇచ్చేసిందిట. తర్వాత మెడలో మంగళసూత్రం కూడా ఇచ్చేయమంటే తీసి ఇచ్చేసిందిట. హాల్‌లో వున్నవాడు, ఒక కబ్ బోర్డు తాళం పగలగొట్టారు. అందులో పుస్తకాలు తప్ప వాడికి ఏమీ దొరకలేదు. ఇదంతా నా కొడుకు గమనిస్తూనే, కిక్కురుమనకుండా అలా చూస్తూ వుండిపోయాడు. తర్వాత పోలీసులు దొంగల ఆల్బమ్ తీసుకొస్తే, దొంగలు అందరినీ అబ్బాయి గుర్తుపట్టేసాడు. పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఈ సంఘటన జరిగిన నాటికి మహబూబాబాద్ డి.ఎస్.పి.గా, శ్రీ ఆకుల రామకృష్ణ గారు ఉండేవారు. వీరు సాహిత్య ప్రియులు, నాకు మంచి మిత్రులు. వీరివల్ల ఈ దొంగలను పట్టుకోవడం కొంచెం సులభం అయింది. కొంత బంగారం ఆయన వల్ల దక్కింది. నా కూతురు కోసం ప్రత్యేకంగా ఖతార్ నుండి తెప్పించుకున్న బంగారు గొలుసు మాత్రం మాకు దక్కలేదు. కేసు సుమారు మూడు సంవత్సరాలు కొనసాగింది. అప్పటికి ప్రధాన దొంగ చనిపోయాడు కూడా!
ఈ సంఘటన గుర్తుకు వస్తే, ఇప్పటికీ గుండెకు దడ పుడుతుంటుంది. నా శ్రీమతి షాక్ నుండి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. ఈ సంఘటనలో, దొంగలు హింసకు పాల్పడకుండా, వస్తువులు మాత్రమే తీసుకు వెళ్లినందుకు మనస్సులో వాళ్లకి దణ్ణం పెట్టుకుంటుంటాను.
***
ప్రియమైన ‘సంచిక’ అంతర్జాల పత్రిక సంపాదక వర్గానికీ, పాఠక దేవుళ్ళకు హృదయ పూర్వక నమస్కారాలు. సుమారు మూడేళ్ళ పాటు ఈ ‘జ్ఞాపకాల పందిరి’ శీర్షికను ఆదరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికి 200 ఎపిసోడ్లు పూర్తి కావడంతో, దీనికి ముగింపు పలుకుతున్నాను. నా వ్యాసాలు చదివి చక్కని స్పందనలు అందించి, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన సాహితీ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘సంచిక’ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.
త్వరలో మరో మంచి శీర్షికతో మళ్ళీ కలుద్దాం.
డా. కె. ఎల్. వి. ప్రసాద్
సివిల్ సర్జన్ (రి) డెంటల్ &
కథ/వ్యాస రచయిత
సికింద్రాబాద్.