ప్రేమా? ఆకర్షణా?

0
4

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ప్రేమా? ఆకర్షణా?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చి[/dropcap]న్న కుదుపుతో ట్రైన్ ఆగింది. అప్పటి వరకు విండో పక్కన కూర్చున్న అవని ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి ట్రైన్ దిగింది. అప్పుడు సమయం తెల్లవారుఝామున నాలుగున్నర. అయినా స్టేషన్‌లో జనాలు బాగానే ఉన్నారు. ఆ స్టేషన్‌లో ట్రైన్ రెండు నిమిషాలు ఆగుతుందని తెలుసు.. అయినా హడావుడిగా ట్రైన్ దిగింది అవని.

తన బోగీ నెంబర్ తెలుసు కాబట్టి మనోహర్ దగ్గరలో నిలబడి తన రాక కోసం నిరీక్షిస్తుంటే.. అవని పెదవులపై సన్నగా చిరునవ్వుల రాగాలు పలికాయి.

తన చేతుల్లో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. నాలుగు రోజులు ఉండాలని ఐదారు జతల బట్టలు తెచ్చుకోవడంతో బ్యాగ్ బరువు ఎక్కువగా వున్నా అతడు అవలీలగా మోయడం తనకు చిత్రంగా అనిపించింది.

“అవనీ..” అతడి గొంతులో ఆప్యాయత ధ్వనించింది.

ఏంటన్నట్లుగా అతడి వైపు చూసింది.

“అవనీ.. నీ నిర్ణయంలో మార్పు లేదా?” దీనంగా అభ్యర్థిస్తున్నట్లుగా అడుగుతున్న అతడి వైపు చూస్తూ.. అవునన్నట్లుగా తలూపింది.

అవనికి తెలుసు ఇక ముందు తాము కలవడం కుదరదని. ఇదే చివరిసారి తాము కలవడం అని నిశ్చయంగా అనుకుంది. ఇకముందు అతడు తనను పలకరించాలని ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించాలనుకుంది.

మనోహర్, అవని ఆటో స్టాండ్ వైపు నడిచారు.

“మనోహర్! నువ్విక్కడ ఆగిపో. కాస్త దూరంలో అన్నయ్య వున్నాడు.” అంది.

ఆగిపోయాడు. కదులుతున్న తన వైపు చూస్తున్నాడు. మల్లెల్లా మురిపెంగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే అవని.. నేడు అడిగిన వరకే సమాధానం ఇవ్వడం.. ఆపై మాట్లాడకపోవడం అతడిని నిరాశకు గురి చేసింది.

అవని వాళ్ళ అన్నయ్యతో పాటుగా మరో వ్యక్తి అక్కడే వున్నాడు.. అజానుబాహుడిలా వున్న అతడే అవని వాళ్ళ బావ అయి ఉండవచ్చు. బహుశా యు.ఎస్.ఎ. లో జాబ్ సాధించి అవని మెడలో తాళి కట్టబోతున్న వ్యక్తి అతడే అయి ఉండవచ్చు.

అంటే ఇదే తమ చివరి పలకరింపులా? బాధగా అనిపించింది మనోహర్‌కి.

అవున్లే డాలర్లు.. లక్షల్లో సంపాదన ఉన్న అవని వాళ్ళ బావతో తనెక్కడ తూలగలడు.

అవని నిర్ణయం సరి అయినదే!!

తనెక్కడ వున్న క్షేమంగా వుండాలనే కదా కోరుకునేది.. అలాంటప్పుడు తన నిర్ణయాన్ని తప్పకుండా సమర్థించవలసిందే! అనుకున్నాడు మనోహర్.

సాధారణ డిగ్రీ చదువుకున్న తను.. ఇంజనీరింగ్ 95% మార్క్స్‌తో పాస్ అయి.. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళతో పోటీనా??

అదీ అతడు అక్కడ పెద్ద జాబ్‌లో చేరాడట ఇటీవలే.

అవని బావ గురించి గొప్పగా చెబుతున్నప్పుడు మనస్సులో చిన్నపాటి ఈర్ష కలిగినా దాచుకునే ప్రయత్నం చేస్తాడు మనోహర్.

అయినా తప్పంతా తనదే.. ఇంత కాలం తన మనస్సులోని మాట అవని ముందు చెప్పలేకపోయాడు. చెప్పాలనే అనిపించినా.. తనే మనుకుంటుందోననే చిన్న సందేహం!

తమ మధ్య ఉన్నది.. స్నేహమా!? ప్రేమా!? ఆకర్షణా!? కాలానికి సైతం సమాధానం చిక్కని ప్రశ్నేమో..!

మనోహర్ ఒంటరిగా ఇంటికి చేరాక దిగాలుగా పడుకున్నాడు.

* * *

“రేయ్! మనోహర్. ఆఫీస్‌కి టైం అవుతుంది. లే” అంటూ డాబాపై పడుకున్న తనని తల్లి నిద్ర లేపుతుంటే.. విసుగ్గా నిద్ర లేచాడు.

పక్షుల కిలకిలారావాలు.. సూర్యోదయ తొలి కిరణాల స్పర్శలతో అవని పసిడి వర్ణంలో మెరుస్తున్న సమయాలు.. దూరంగా వున్న మల్లెపూల మొక్క నుంచి సువాసనల పరిమళాలు.. గుడి గంటల సవ్వళ్ళు.. మనస్సుకు ప్రశాంతత నిస్తుంటే.. కళ్ళ ముందు కదులుతున్న అవని రూపం.. అతడి హృదయానికి సంతోష సంబరాలు పరిచయం చేస్తుంటే.. హుషారుగా కదిలాడు.

గుంటూరులో ఓ ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్‌గా కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. తన తండ్రికి వున్న పలుకుబడితో ఆ చిన్న ఉద్యోగాన్ని సాధించగలిగాడు. ఉద్యోగం ఇప్పించిన జయశంకర్ గారు – తన తండ్రి స్కూల్ మాస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన స్టూడెంట్ అట.

రాజయ్య (మనోహర్ వాళ్ల నాన్న) అడగగానే జాబ్ ఇప్పిచ్చిన ఆయనకు వేవేల కృతజ్ఞతలు తెలుపుకున్నారు తండ్రీకొడుకులు!

* * *

రెండు రోజుల తర్వాత..

“మనోహర్! ఈ రోజు మా ఇంటికి వెళదాం. యు.ఎస్.ఏ నుంచి మా బంధువులు వచ్చారు. వాళ్ళ కి నువ్వే దగ్గర ఉండి మన సిటీ చూపించాలి. వాళ్ళు వచ్చి రెండు రోజులైంది. సిటీ చూడాలంటున్నారు. అలాగే దగ్గర లో ఉన్న దర్శనీయ ప్రదేశాలు సైతం చూపాలి. నా కారు తీసుకుని వెళ్ళు. నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ కాదన వద్దు.” అంటున్న జయశంకర్ గారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

అక్కడ వున్న ఓ కుర్రాడ్ని చూసి ఎక్కడో చూసినట్టుగా అనిపించి.. గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు అవని చెప్పే కుర్రాడతనే అని గుర్తొచ్చింది.

“హాయ్! మై నేమ్ ఈజ్ శ్రీకాంత్” అన్నాడు.

ఎంతో మృదువుగా అతడి కరస్పర్శ. కంప్యూటర్ పై కదిలే వేళ్ళు అంతేగా ఉండేవి. లక్షల్లో వేతనాలు.. వేదనలే లేని జీవితాలు. అడుగడుగునా ఏ.సీ.ల్లో ప్రయాణాలు..! ఉన్నతమైన చదువు.. సంస్కారమే ఆభరణంగా అతడు!

మాస్ అన్న పదానికి అర్థంలా తాను.. నవ్వొచ్చింది మనోహర్‌కి!

* * *

“రేయ్ మనోహర్! మీ నాన్నని హాస్పిటల్‌లో చేర్చారట” అంటూ తెలిసిన వాళ్ళు హాస్పిటల్ అడ్రస్ చెబుతుంటే హడావుడిగా హాస్పిటల్‍కి బయలుదేరాడు.

“మీ నాన్న స్కూటర్‌ని ఎదురుగా వస్తున్న లారీ గుద్దేసిందట. తీవ్ర గాయాలయ్యాయి. కాలు ఫ్రాక్చరయింది. వెంటనే ట్రీట్‌మెంట్ ప్రారంభించాలి. ఓ ఇరవై వేలు కట్టండి.” కౌంటర్‌లో ఉన్న అమ్మాయి చెబుతుంటే.. “అలాగే” అన్నాడు.

“నాన్న అకౌంట్‌లో డబ్బులు లేవు రా. నెల రోజుల క్రితమే కదా అక్క పెండ్లి చేసింది.” అమ్మ నసుగుతూ మెల్లగా చెబుతుంటే.. తను జాబ్‌లో చేరి రెండు నెలలే కదా అయింది, తన దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనుకున్నాడు. తండ్రిని ఈ కష్టం నుండి ఎలా గట్టెక్కించాలో అర్థం కాలేదు.

తండ్రి దగ్గర నిలబడ్డాడు. నిస్సహాయంగా తన వైపు చూస్తున్న తండ్రి మోము అమాయకంగా కనిపించింది అతనికి.

“అక్క! రాలేదా?” ఆ స్థితిలో కూడా అక్క నే కలవరిస్తున్న తన తండ్రిని చూస్తుంటే అతడికి జాలిగా అనిపించింది.

బహుశా దెబ్బలు తగిలిన నొప్పికంటే కూతురు రాలేదన్న బాధే ఎక్కువగా ఉందేమో అనుకున్నాడు.

తన దగ్గర ఓ ఐదు వేల వరకు ఉన్నాయి. స్నేహితులు నలుగురు తాము ఓ ఐదు వేలు సర్దగలమన్నారు. ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబానికి చెందిన అవనిని అడగడం బాగోదేమో అనుకున్నాడు. ఏదో మూల నమ్మకం తన మాట అవని కాదనదని!

వెంటనే బయటకి వెళ్ళి ల్యాండ్ లైన్ నుండి కాల్ చేశాడు. జరిగిందంతా చెప్పాడు. తన వద్ద అంత డబ్బులు లేవన్నది.

వున్నా ఇవ్వాలనే నిబంధనేంటి? ప్రశ్న అతడి మనస్సులో ఉత్పన్నమైనది. రెండు రోజులాగితే పంపగలను అని చివరగా అంది.

“ఏదో ఒకటి చేస్తాను లే!” అన్నాడు.

“సరే” అంది.

డబ్బులు ఇవ్వాలనుకుంటే వెంటనే పంపగల స్తోమత ఆమెకుంది. కానీ ఓ మగాడిగా ఆడపిల్లని డబ్బు కోసం అడగడం ఎంతవరకు సమంజసం? స్నేహమా? ప్రేమా? మరేదైనా కానీ తను అవనిని డబ్బులు అడగడం కరెక్ట్ కాదు అనుకున్నాడు.

ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ సంస్కృతిని పెంచి పోషిస్తూ.. వేలని దాటి లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. సామాన్యులు సైతం త్వరగా ట్రీట్‌మెంట్ అందాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయే కాని.. ప్రజల రాతలు మారడం లేదు.

“అమ్మా! నా దగ్గర ఓ పదివేల వరకు ఏర్పాటు అవుతున్నాయి. అవే డబ్బులు కౌంటర్లో కడదాం.. తరువాత మిగతా డబ్బులు కడతామని చెబుదాం.” అన్నాడు. తల్లి కొడుకులు కౌంటర్ దగ్గరికి వెళ్ళారు.

“మిగతా డబ్బులు కట్టాల్సిందే.. మీకు సాయంత్రం వరకు సమయం ఉంది. ప్రాథమిక చికిత్స చేశాము..” అన్నారు వాళ్ళు!

“చిన్నా! ఈ చెవిపోగులు తీసుకుని మార్వాడి దగ్గర పెట్టి డబ్బు తీసుకురా. అక్కకి ఈ సంగతి చెప్పొద్దు సరేనా?” అంటున్న తల్లితో అలాగే అంటూ వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి.. కౌంటర్‌లో కట్టి తండ్రికి ట్రీట్‌మెంట్ ఇప్పించాడు మనోహర్.

జీవితం నేర్పిస్తున్న పాఠాలు తెలుసు కుంటున్నాడు. ఇంతకాలం తండ్రి సంపాదన అనుభవిస్తూ, తండ్రి చాటున పెరిగిన వాడల్లా.. తండ్రి రిటైర్మెంట్.. అక్క పెళ్ళి.. ఆర్థిక ఇబ్బందులు.. ఒక్కోటి అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనుభవిస్తే కాని తెలియని కష్టాలు నేడు ఒక్కోటిగా ఎదురవుతున్నాయి. అవని దూరమవ్వడం.. తనతో సరిగ్గా మాట్లాడక పోవడం.. అడిగిన సాయాన్ని పట్టించుకోకపోవడం.. అతడిని మరింత వేదనకి గురిచేస్తున్నాయి!

ఏదైనా పడిపోతున్నప్పుడు నిలబడడం కష్టం.. కానీ అదే జీవితమంటే!

* * *

 మరుసటి రోజు ఆఫీస్‌లో..

“మనోహర్! మీ నాన్నని హాస్పిటల్‌లో చేర్చారట. ఇప్పుడెలా ఉంది?” అడిగారు జయశంకర్.

“పర్లేదు సార్! కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఓ.కే.”

“డబ్బులు కావాలని ఎవరెవర్నో అడిగావట? నా దగ్గరికి రావచ్చు కదా? సర్దేవాడిని..”

“ఏదో చేశాం లే సార్.” అన్నాడు మాట దాటేస్తూ..

తానెవరెవరినీ అడిగింది ఈయనకెలా తెలుసు.. అనుకున్నాడు.

ఆ రోజు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళాడు.

ఒక్క రోజు ఉండి వెళ్ళింది అక్క. తను దగ్గరుండి ట్రైన్ ఎక్కించాడు.

“మీ బావగారు వెంటనే రమ్మన్నారు.. నాన్న జాగ్రత్త” అంది.

“సరే అక్కా!” అన్నాడు మనోహర్.

ట్రైన్ కదులుతుండగా అడిగింది..

“అవని ఎలా వుంది!? పెళ్ళెప్పుడు రా? నాన్నకి నీ ప్రేమ సంగతి చెప్పావా?” అడిగింది.

“అదీ..” అంటూ చెప్పబోతుండగా టైన్ కదిలింది.

“నాన్నకి ఆరోగ్యం ఎలా ఉందో రోజూ కాల్ చేసి చెబుతుండు” అంది.

ట్రైన్ దూరమవుతుండగా.. మాటలు గాల్లో కలుస్తూ సన్నగా వినిపిస్తున్నాయి.

* * *

నెల రోజులు గడిచాయి. తండ్రి ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడుతుంది. మనోహర్ ఆఫీస్‌కి రెగ్యులర్‍గా వెళుతున్నాడు. అవని నుండి ఎటువంటి కాల్స్ లేవు. అతడి ఆలోచనల్లో అవని కదులుతున్నా.. కనులముందైతే తను ఎదురు కావడం లేదు.

ఇంటర్మీడియట్ నుండి ఇద్దరికీ స్నేహం. ఫ్యాషన్ డిజైన్ చేసిన అవని.. డిగ్రీ చదువుతున్న మనోహర్.. ఆ రోజుల్లో తను హైదరాబాద్.. ఇతడు గుంటూరు.. ఎప్పుడు.. తరచుగా.. వచ్చినప్పుడల్లా కలిసేది. ప్రేమ కంటే.. స్నేహమే ఎక్కువగా ఉందేమో ఇద్దరి మధ్య.. అనుకున్నాడు మనోహర్.

అతడు ఎప్పుడు హద్దుమీరి అవనితో ప్రవర్తించలేదు.

మనోహర్ ఇటీవల నిరుత్సాహంగా ఉండడం గమనించిన జయశంకర్ అప్పుడప్పుడు.. అతడిని తన క్యాబిన్ లోకి పిలిచి.. ‘మీ నాన్న ఆరోగ్యం ఎలా వుంద’ని అడిగేవారు.

అతడి సమాధానం విని “టేక్ కేర్” అనేవారు.

అంతకు మించిన బాధేదో అతడ్ని వేదిస్తోందని గ్రహించినా ఎప్పుడు ఆ ప్రస్తావన తేలేదు జయశంకర్ గారు.

* * *

ఇక తను అవనిని మర్చిపోవలసిందే! ప్రేమంటే.. కొన్నిసార్లు కల కూడా! కలలా జరిగిందంతా మర్చిపోవాలనుకున్నాడు. ఇంతకాలమైనా అవని నుండి ఎటువంటి కాల్ లేదు. అవునులే ఆర్థికంగా ఉన్నతమైన.. విదేశాలలో పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తిని కాదనుకుని.. ప్రేమే కావాలనుకుంటూ.. ఎంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో ఉంటున్నారు.

అందరితో పాటు.. మారుతున్న కాలంతో పాటు తనూ అంతే! ఇది జీవన సత్యం.. తాను నమ్మినా నమ్మక పోయినా జరుగుతున్న వాస్తవం! మనస్సుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు మనోహర్.

జీవితంలో మనం కొన్నింటిని అతిగా ఆశిస్తాం. ఎంతగా అంటే మనం కోరుకున్నది దక్కకపోతే.. జీవించలేనంత! ప్రాణంతో సమానంగా! కానీ అంతా అనుకున్నట్లుగా జరుగుతుందా.. కానే కాదు..

భగవంతుడు వ్రాసినట్లుగా మాత్రమే జరుగుతుంది!

మనోహర్ ఆఫీస్‌లో ఉండగా జయశంకర్ గారి నుండి కాల్ వచ్చింది. గబగబా క్యాబిన్ లోకి వెళ్ళాడు.

“డియర్ మనోహర్! నేను చెప్పే రెండు మాటలు శ్రద్ధగా విను. అవని నాకు వరసకు సిస్టర్ అవుతుంది. నిన్ను జాబ్ లోకి తీసుకోవడానికి తనే కారణం.. అన్నట్టు మరో విషయం నీకు శ్రీకాంత్ తెలుసు కదా.. అతడిని రిజెక్ట్ చేసింది అవని. బహుశా అతను యు.ఎస్.ఏ.లో మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాడేమో.. అవని మాత్రం నువ్వే కావాలని వాళ్ళ ఇంట్లో తెగేసి చెప్పింది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానంది. వాళ్ళ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదు ఇన్నాళ్ళు. కానీ నేనే నీ గురించి చెప్పి ఒప్పించాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకున్నాక.. మిగతా వ్యవహారం అంతా.. నేనే మాట్లాడతాను. మీ నాన్నగారు నా మాటని గౌరవిస్తారు. ఒక మంచి ఫ్యామిలీలో నుండి అమ్మాయి వస్తుందంటే ఎవరైనా ఓ.కే. అంటారు. నాకా నమ్మకం ఉంది” అన్నారాయన.

“నాకు తనంటే ఇష్టం. కాదు ప్రాణం.” అసంకల్పితంగా అనేశాడు మనోహర్, తన ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ.. తన ప్రేమ సఫలమైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ..!!

నిజమైన ప్రేమ.. మన అనుకున్న వాళ్ళ అభ్యున్నతిని సదా కోరుకుంటుంది!

 —- No end for love stories—-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here