[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘మలి సంధ్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]జీ[/dropcap]వితం పడమటి సంధ్యా రాగం
పాడుతున్న వేళలో
పేరు తెలియని వ్యాధులు ఒక్కొక్కటి పరిచయాలు
పెనవేసుకుని దేహంతో స్నేహం చేస్తున్నాయి
జీవితం చిన్నదైపోయింది
ఇక మిగిలిన ప్రతి క్షణానికి విలువ పెరుగుతోంది
ఏమో ఏం జరుగుతుందో!
కొన్నాళ్ళకు నేను చెప్పేది నీకు వినపడకపోవచ్చు
నా మసకబారిన కళ్ళకు
నీ రూపం ఆనకపోవచ్చు
తోడు లేనిదే గడప దాటలేని స్థితిలో
మౌనంగా నైనా ఎదురు పడలేము
అందుకే ఇప్పుడే అప్పుడప్పుడు
మాట్లాడుకుంటుంటే
పోయేదేముంది బాధలు తప్ప!
మిగిలేవి ఈ జ్ఞాపకాలే!