[శ్రీమతి శాంతిలక్ష్మి పోలవరపు రచించిన ‘నీవే.. ఫలంగా.. పరిణమించిన వేళ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap]వే అదిగా
నీలో ఇదిగా..
అదీ ఇదీ అన్నీగా..
అవతరించిన పాలపుంతకు
పాల ధారల నిచ్చెడి.. పరా ప్రకృతి..
నీవే..
నీవే.. పదమే లేని పరమ పదము
పరం పరమౌతూ..
సాగిపోతూ సాగదీస్తూ
సంగమిస్తూ.. గమిస్తూ..
ఉదయాస్తమయాల వింత సంధ్యల
కుంతలాలలో వికసిస్తూ.. విరాజిల్లుతూంటే..,
ఈ చూసే కన్ను చాలటం లేదు..
కంటిలో మరో.. మహా నేత్రం.. మాగన్నుగా నిద్దరోతోంది..!!
అది క్రీగంటితో.. అలా చూస్తోంటే..
అప్పుడర్థమైంది..!!
ఇంద్ర దేవుని వేయి కన్నుల వింత అర్థం..
మహా దేవుని..
బేసి కన్నుల నిగూడార్థం..!!
నేను..కు అర్థం మారి పోయింది.
విత్తనపు నేను మొక్కై.
మానై.. ఎండిన కట్టై తగలడిన తల.. గడ క్రిందులలో..
ఆమ్లతను.. క్షారం చేస్తూ..,
అధారమైన మన్ను మిన్నై పోయింది.
పాల జలధి అమృత
దధి కుంభమై బాహ్యంలో కాదు..!
లోలోనే.. సుప్రశాంతంగా.. ప్రజ్వరిల్లుతోంది.
ఆరని హోమ కుండపు యజ్ఞ వాటిక..
సుగంధ భరితమై..
సుందరీకరిస్తోంది.. జగత్తునూ.. గమ్మత్తునూ..!!!
ఆహా !! నేను వసివాడుతూనే
తాను పరిమళిస్తోంది.. ఏమీ ఈ వింత..!!
ఈ చమత్కారంలో.. చాతుర్యం..
చమత్కరిస్తోంది..!!
అనుభూతి న..మస్తకమంటూ..
నమస్కరిస్తోంది..!!!
ఈ ధార అమృత బిందువులను
ధారగా కురిపిస్తోంది..!!
దోరగా తను ఫలిస్తూ..!!!