[ఇటీవల సింహాచలం క్షేత్రాన్ని దర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]గ[/dropcap]త నెల 28న, నా సోదరుడు జి. సత్యనారాయణ (జి.యస్.యన్‍గా అందరికీ తెలుసు) ఫోన్ చేశాడు.
“అన్నా ఈ నెల 31న రిటైరవుతున్నా. నా రిటైర్మెంట్ ఫంక్షన్‍కు నీవు తప్పక రావాలి. మంచి పద్యాలు చదవాలన్నా నీవు! నీవు రాకపోతే నీను ఒప్పుకోనంతే!” అన్నాడు. అతనికి నా దగ్గర కొంచెం గారాబం, నర్సీపట్నం బాయిస్ కాలేజీలో ఇద్దరం కోలీగ్స్‌మి. అతడూ ఇంగ్లీష్ లెక్చరరే. మంచివాడు పాపం! (‘పాపం!’ ఎందుకో)
“రెండ్రోజుల ముందు చెబుతావా? వైజాగుకు హైదరాబాదు నుండి ట్రెయిన్ రిజర్వేషన్ అంటే మాటలా? కనీసం పదిహేను రోజులు ముందు చెప్పాలని తెలీదా జిఎస్సెన్?” అని కోప్పడ్డాను, ప్రేమగా.
“అన్నా, వినాల నువ్వు. ఇంతవరకు రిటైర్మెంట్ ప్రొసీడింగ్సే రాలేదు కమిషనరేట్ నుంచి. రిటైర్మెంట్ ఏజ్ మరో రెండేళ్ళు పెంచుతాడేమో అన్నా” అతడి గొంతులో దిగులు. అవును మరి! ఆ జనవరి నెలాఖరులో ఎ.పి.లో 30 వేలమంది రిటైరవుతారట. వారి గ్రాట్యుటీ 2024లో, కమ్యుటేషన్ సొమ్ము 2030లో ఇస్తారట. పెన్షన్ ఎప్పుడు సెటిలవుతుందో అని టెన్షన్.
“ఇప్పుడెలా మరి?” అన్నాను.
ఈ దుర్భర పరిస్థితికి ఐదారేళ్ల ముందే రిటైరైనందుకు నన్ను నేను అభినందించుకున్నాను. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు అప్పటి ప్రభుత్యం మా రిటైర్మెంట్ వయసు 58 నుండి 60కి పెంచింది చక్కగా రెండేళ్ళు, నెలనెలా లక్షన్నర జీతం! ఆ రెండేళ్లలోనే పి.ఆర్.సి! 2016లో ఠంచన్‌గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేశాయి. హ్యాపీస్!
“నిన్న ప్రొసీడింగ్స్ పోస్ట్ చేశారట. సాయంత్రం కన్ఫర్మ్ చేస్తా. తత్కాల్ చేయించుకో” అన్నాడు.
సాయంత్రం ఫోన్ చేసి, ఆర్డర్ వచ్చిందనీ, వచ్చేయమనీ చెప్పాడు. వెంటనే మా అమ్మాయి ప్రణవిని తత్కాల్‌లో చూడమన్నాను.
“నువ్వు ఎల్లుండి కదా వెళ్లేది నాన్నా! రేపు చూస్తాలే!” అన్నది బంగారు తల్లి. మర్నాడు గరీబ్‍రథ్‌కు దొరికింది.
“మళ్లీ 1న బయలుదేరతాను. 31న అట్నుంచి తత్కాల్ చేయి అదే బండికి!” అన్నా. సరేనంది.
ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాను. “అన్నా, అనకాపల్లిలో దిగిపో! కాంప్లెక్స్ (ఉత్తరాంధ్ర జిల్లాల్లో బస్ స్టాండ్‌ను కాంప్లెక్స్ అంటారు) కు వచ్చి, విజయనగరం బస్సు ఎక్కు” అన్నాడు.
“విజయనగరం బస్సెందుకురా నాన్నా?” అన్నా అయోమయంగా.
“నీవు హైదరాబాదులో ఉండి, అన్నీ మర్చిపోయావన్నా. వైజాగ్ సిటీతో సంబంధం లేకుండా, అనకాపల్లి నుండి సబ్బవరం, పెందుర్తి మీదుగా విజయనగరం వెళతాయి. నీవు పెందుర్తిలో దిగు. నేనక్కడే కదా ఉండేది! అదన్నా గుర్తుందా?”
“ఉంది లేరా బాబూ! ఆ! పెందుర్తిలో దిగుతాను. తర్వాత..?”
“నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకొంటాను. అక్కడ సోనికా గ్రాండ్ అని మా కొలీగ్ వాళ్ళ లాడ్జ్ ఉంది. నీకు అందులో రూమ్ బుక్ చేస్తాను. ఆ రోజంతా రెస్టు. ఫంక్షన్ చోడవరం కాలేజీలో, ఒకటి ఫిబ్రవరి!”
“సరే, సరే”
“ఈ మధ్య నీవు యల్లమందన్న తెగ తిరుగుతున్నారు కదా! అన్నకూ చెప్పాను. వస్తాడు”
“అయితే సూపర్”
“రిటర్న్ జర్నీ కూడ అనకాపల్లి నుంచే చేయించుకో, తత్కాల్‌కు. పోనీ నన్ను చేయమంటావా?”
“వద్దులే! నీ ఫంక్షన్ హడావిడిలో పడి మరిచిపోయినా, రెండు నిమిషాలు లేటుగా ఓపన్ చేసినా టికెట్లు దొరకవు.”
జి.ఎస్.ఎన్. నవ్వాడు!
“నిజమే అన్నా” అని ఫోన్ పెట్టేశాడు.
కాసేపటికి మా యల్లమంద ఫోన్! “మిత్రమా! చోడవరానికి వస్తున్నావా?” అడిగాడు.
“వస్తున్నా. గరీబ్‌రథ్. పెందుర్తిలో రూం తీస్తాడట.”
“అయితే నేనూ అక్కడిక్ వస్తా. ఇద్దరం కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు.”
***
నేను పెందుర్తి బస్టాప్‍లో దిగేసరికి కారుతో రడీగా ఉన్నాడు జి.ఎస్.ఎన్. రోడ్డు మీదే నాకు పాదాభివందనం చేశాడు. సోనికా గ్రాండ్ బాగుంది. టిఫిన్ పంపిస్తానన్నాడు. “సార్ మా అన్న. జాగ్రత్తగా చూసుకోండి” అని హోటల్ కురాళ్లతో చెప్పాడు.
అతడి వినయానికి, కన్‌సర్న్‌కు నాకు ముచ్చటేసింది. “ఏం మారలేదు తమ్ముడూ నీవు!” అన్నా.
“నీవైనా మారలేదు కదా!” అన్నాడు. ఎప్పటికీ ఒకలాగా ఉండటం ఉత్తమ వ్యక్తిత్య లక్షణం.
“ఈరోజు సాయంత్రం సింహాచలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటా. నేను యల్లమంద ఇద్దరం వెళతాం” అన్నాను.
“తప్పకుండా అన్నా” అని, ఎవరికో ఫోన్ చేశాడు. నిమిషం మాట్లాడాడు. “అన్నా, సింహాచలం దేవస్థానంలో అటెండరుగా అప్పారావని మా ఊరాయన పనిచేస్తున్నాడు. మీరు వస్తారని చెప్పాను. దగ్గరుండి అంతరాలయ దర్శనం చేయిస్తాడు. అతనికి మీకు తోచినదెంతో ఇచ్చేయండి” అన్నాడు.
“ఓ.కె నాన్నా! ఇక నీవు వెళ్ళు! యస్.ఆర్ (సర్వీస్ రిజిస్టర్) లో జాగ్రత్తగా ఎంట్రీ వేయించుకో. అక్కడ కమిషనర్ గారి ప్రొసీడింగ్స్ నంబరు తప్పక వేయాలి. అటెండెన్స్ రిజిస్టర్‌లో ముందే మధ్యాహ్నం సంతకం కూడ చేసెయ్. అక్కడ కూడ రాయించు” చెప్పాను.
“ప్రిన్సిపాల్ ఒక సర్టిఫికెట్ ఇస్తాడు కదా!”
“ఇవ్వడు. అవసరం లేదు”
“నీవు ప్రిన్సిపాల్‌గా చేశావు కాబట్టి అన్నీ తెలుసు” అన్నాడు జి.ఎస్.ఎన్. కాసేపుండి వెళ్లిపోయాడు.
గంటకే యల్లమంద వచ్చేశాడు.
“భద్రాచలం నుండి వచ్చి నాలుగు రోజులన్నా కాకముందే మళ్లీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మిత్రమా!” అన్నాడు. దాంపత్యమైనా కొంత కాలానికి బోర్ కొడుతుందేమోగాని, ఎన్నటికీ బోర్ కొట్టనిది స్నేహం ఒకటి. అన్ కండిషనల్ లవ్ చూపేది స్నేహితుడొకడే!
సింహాచలం అప్పారావు ఫోన్. “గురువుగారు, మీరు ఐదుంబావు కల్లా ఎలివచ్చేయండి సార్. మీరు పెందుర్తిలో 68 నం బస్ ఎక్కండి. కొండ పైకి వెళ్ళే దేవస్థానం బస్టాండు కాడ ఉండండి” అన్నాడు.
“అలాగే బాబు!” అన్నాను.
మెయిన్ రోడ్ లోని గుంటూరువారి మెస్‌లో భోజనం చేసి కాసేపు నడుం వాల్చాము. 4 గంటలకు లేచి తయారై బస్టాప్‌కి వెళ్లాం. 68 వచ్చింది. ఆర్.కె.బీచ్ నుండి సింహాచలం రూటది. సీట్లున్నాయి. అరగంటలో దిగాము.
అప్పారావు అప్పటికే ఎదురుచూస్తున్నాడు మా కోసం. తెల్లని ప్యాంటు, షర్టు, ధరించాడు. దేవస్థానం సిబ్బంది యూనిఫాం అది. మెడలో ఐడి కార్డు వేలాడుతూంది.
“సత్యనారాయణ మాస్టారు మీ గురించి శాన ఇదిగా సెప్పేసినారండి. పదండి బాబు ఎలదాం” అన్నాడతడు, ఇంకా ఐదేండ్ల సర్వీసుందట.
దేవస్థానం బస్సు సిద్ధంగా ఉంది. నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లబోతూంటే అతడు వారించాడు. బస్ ఎక్కి కూర్చున్నాం.
“సింహాద్రి అప్పన్నా! గోవిందా! గోవింద!” అని నినదించారు భక్తులు. ఒరిస్సా నుండి ఎక్కువగా వస్తారు. బోర్డుల మీద ఒరియా భాషలో కూడ రాసి ఉంటుంది.
నేను డ్రైవర్‌కు సమాంతరంగా ఉన్న సింగిల్ సీటులో కూర్చొని, ఘాట్ రోడ్ ప్రయాణాన్ని వీడియో తీయసాగాను. మధ్యలో ఆర్చ్‌లు. వాటి మీద ‘సింహాద్రినాథుని దర్శనం సకల పాపహరం’, ‘ప్రహ్లాద వరదా! సింహగిరి నరసింహ!’, ‘లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్’ అని వ్రాసి ఉంది. నా మనసంతా స్వామివారు నిండిపోయారు. నాలో వైబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి.
బస్ దిగాము. గాలిగోపురంలోని మహాద్వారం వద్ద చాలా మెట్లు ఎక్కవలసి వచ్చేది ఇదివరకు. ఇప్పుడు లిఫ్ట్ సౌకర్యం ఉందని చెప్పాడు అప్పారావు. సెల్‌ఫోన్స్ ఆఫ్ చేసుకోమన్నాడు.
లిఫ్ట్ దగ్గర చాలా క్యూ ఉంది. పదినిమిషాలు వెయిట్ చేసిన తర్వాత లిఫ్ట్‌లో ప్రవేశించాము. పైకి వెళ్లి సింహగిరీశుని ఆలయప్రాంగణంలో ప్రవేశించాము. ఉచిత దర్శనం క్యూలు, వంద రూపాయల శీఘ్ర దర్శనం క్యూలు కిటకిటలాడుతున్నాయి. మమ్మల్ని నేరుగా గర్భాలయం దగ్గరకు తీసుకు వెళ్లాడు అప్పారావు.
నా కళ్ల వెంట ఆనందాశ్రువులు! గొంతు డగ్గుత్తిక పడింది. స్వామివారు స్వర్ణ కవచ అలంకారంలో ఉన్నారు. బంగారు తొడుగు ప్రసన్న సింహవదనం. ఒక చేత బంగారుగదను ధరించారు. ఒక చేత అభయహస్తం! జగన్మోహనుడైన వరాహనరహరిని కనులారా దర్శించుకున్నాము. అంతరాలయంతో ప్రదక్షిణం చేశాము. తీర్థం తీసుకొని, శఠగోప స్పర్శ శిరస్సుకు చేయించుకున్నాము. వదలలేక వదల లేక, స్వామిని విడచి వస్తుంటే దుఃఖం ఆగలేదు నాకు.
ఆండాల్ అమ్మను దర్శించాము. కప్పస్తంభాన్ని చూశాము. శిఖర దర్శనం చేశాము. మహా శిల్పసంపద అలరారే అతిపురాతన ఆలయం సింహాచలం.
బయట మాకు ఉచిత ప్రసాదం ఆకు దొన్నెలలో పులిహార లభించింది. చెరో రెండు లడ్లు తీసుకున్నాము.
అప్పారావు కృతజ్ఞతలు తెలిపాము. అతను “నాదేముంది గురువుగారు! అంతా స్వామివారి దయ!” అన్నాడు. అతనికి ఐదువందలు ఇవ్వబోయాను. వద్దంటే వద్దంటాడు. “మీరు పెద్దోరు. స్వామిని చూసి మీరు శానా ఇదిగా దుక్కించారు. పున్యాత్ములు” అంటాడు. ‘పిల్లలకేమయినా కొనిపెట్టమ’ని బలవంతంగా నోటు అతని జేబులో పెట్టాను. అతడు వెళ్లిపోయాడు.
మేం కాసేపు ప్రాంగణంలో కూర్చుని, లిఫ్ట్‌లో కిందికి వచ్చేశాము. గాలిగోపురం ఎదుట వీధిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దారిలోని ఉపాలయాలను దర్శించుకున్నాము. కొండమీద ప్రశాంతంగా ఉంది. నాకు అప్పుడే వెళ్లాలని లేదు! బంగారు తొడుగు ధరించిన నరసింహుని సుందర రూపమే నా కనులలో మెదులుతూన్నది. ఒక అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నాం.
“మిత్రమా! నేను ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చాను గాని, నీతో వస్తే ఆ అనుభూతి వేరు. ఏదైనా శ్లోకం అందుకో!” అన్నాడు యల్లమంద.
నేను బిళహరి రాగంలో..
‘సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యే స్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం
త్య్రక్షం చక్ర పినాక సాభయ కరాం బిభ్రాణ మర్కచ్ఛవిం
ఛత్రీభూత ఫణీంద్ర మిందు ధవళం లక్ష్మీనృసింహం భజే!’
అనే శ్లోకం పాడాను.
మిత్రుడు “శభాష్” అని నా భుజం చరిచాడు. “ఏదైనా కీర్తన..” అన్నాడు. అన్నమాచార్యుల కీర్తన, ‘వేదములే నీ నివాసమట విమల నారసింహ! నాద ప్రియ! సకల లోకపతి నమోనమో నరసింహా!’ పాడాను. డా॥ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడగా, యూట్యూబ్‌లో విని, దాన్ని సాధన చేశాను.
“మామూలుగా అయితే స్వామి లింగాకృతిలో ఉంటారు. గంధం చెక్కలు అరగదీసి, నిజరూపమైన వరాహాకృతికి దట్టంగా పట్టిస్తారు. లింగాకృతికి పట్టు పంచ కట్టి, వజ్రఖచితమైన తిరునామం అలంకరిస్తారు. నేను చాలా సార్లు వచ్చాను. వచ్చినపుడల్లా, అదే దర్శనం అయ్యింది. ఈసారి విశేష దర్శనం అయింది” అన్నాను.
“నీ వల్ల నాకు” అన్నాడు మిత్రుడు
“నావల్ల.. కాదు! నాతో బాటు” అని సరిదిద్దాను.
“క్షేత్రం గురించి నీకు తెలిసింది చెప్పు” అన్నాడు.
“సింహాచల పర్వతశ్రేణి సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఒకప్పుడు దూరం అనిపించింది. కాని ఇప్పుడు విశాఖనగరంలో గుడి ఒక భాగమే! స్వామివారు వరాహనరసింహుడు. అక్షయ తృతీయ పర్వదినాన, గంధాన్ని తొలగించి, స్వామివారి నిజరూపాన్ని చూడడానికి భక్తులను అనుమతిస్తారు. ఆ రోజు లక్షల మంది సింహాద్రికి పోటెత్తుతారు. ఒరిస్సా, బెంగాల్ నుంచి కూడా వస్తారు. దర్శనం అతి దుర్లభం. నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు.” చెప్పాను.
“అవును. కొండ దిగువ వరకూ క్యూ లైన్ ఉంటుందని విన్నాను.”
“ఈ పర్వతరాజు తూర్పు కనుమల లోనిదే! స్వామిని ‘అప్పన్న’ అని పిలుస్తారు. స్వామివారికి ‘సొజ్జప్పాలు’ అనే చిన్న సైజు అరిసెల లాంటి స్వీట్లు నైవేద్యంగా పెడతారు.. అప్పారావు, అప్పన్న, సింహాద్రి, సింహాచలం, అప్పయ్య, అప్పడు లాంటి పేర్లు ఉత్తరాంధ్రలో సర్వసాధారణం. రావిశాస్త్రి గారి రచనల్లో ‘సివంసెలం’ అనే పాత్ర తప్పకుండా ఉంటుంది.” అంటూ కాసేపు ఆపాను.
“ఈ గుడిని 13వ శతాబ్దంలో ఒరిస్సాకు చెందిన ‘తూర్పు గంగరాజు లాంగుల నరసింహ దేవ’ నిర్మించారు. 1268లో ఆయన కుమారుడు ‘భానుదేవ’ చేత ప్రతిష్ఠించబడింది. ఆంధ్రలో తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవస్థానం సింహాద్రి. చందనాన్ని తొలగించి నిజరూప దర్శనాన్ని స్వామి వారు భక్తులకు అనుగ్రహించడాన్ని ‘చందన యాత్ర, చందనోత్సవం’ అంటారు. ప్రముఖ వస్త్రవ్యాపార శ్రేణి ‘చందన బ్రదర్స్’ కూడ తమ సంస్థ పేరును స్వామివారి నుండి గ్రహించి ఉంటారేమో!
సింహాచల చరిత్ర పదకొండవ శతాబ్దం నుంచి ఉంది. భారత ఇతిహాసాల ప్రకారం అది ఇంకా పురాతనం.. స్థలపురాణం ప్రకారం పహ్లాదుడు ఇక్కడ వరాహనరసింహుని ఆరాధించాడు. తర్వాత పురూరవ చక్రవర్తి ఆకాశమార్గాన తన దివ్య విమానంలో వెళుతుండగా, ఈ క్షేత్ర ప్రభావం వల్ల అది క్రిందకు ఆకర్షించబడింది. అక్కడ పుట్టలో కప్పబడి ఉన్న స్వామివారు ఆయనకు కనిపించారు. సంవత్సరమంతా స్వామిని చందనంతో కప్పిఉంచాలనీ, లేకపోతే ఆయన జ్వాలను ప్రపంచం తట్టుకోలేదనీ, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం స్వామివారి నిజరూపం భక్తులకు దర్శనమివ్వాలనీ, అశరీరవాణి పురూరవునికి చెప్పినట్లు ఐతిహ్యం.
విగ్రహం త్రిభంగాసనంలో ఉంటుంది. వరాహం తల, సింహం తోక, మనిషి శరీరం. రామానుజుల వారు ఇక్కటి శైవాగమ పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి మార్చారంటారు” చెప్పాను.
“ఇద్దరూ ఒకటే కదా!” అన్నాడు యల్లమంద.
“అదే తత్త్వం! దైవ తత్త్వం! ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయగం శివః’ అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
1098లో చోళరాజు కుళోత్తుంగడు వేయించిన శాసనం ద్వారా వేంగి చాళక్యులు దేవాలయాన్ని అభివృద్ధి చేశారని తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాంతంలో సుమారు 252 శాసనాలున్నాయి.
శ్రీకృష్ణ దేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించిన తర్వాత ఈ మహాక్షేత్రాన్ని రెండు సార్లు, 1516లో, 1519లో దర్శించుకున్నాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు. స్వామివారికి ధరింప చేసి పచ్చల హరం రాయలవారు ఇచ్చినదే.
రాయలు 1428లో కళింగ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న తర్వాత సింహాద్రినాథుని దర్శించాడు. ఆ విజయధ్వజం, శిలాశాసనం, ఇప్పటికీ ఉన్నాయి” అన్నాను.
“చాలా విషయాలు తెలిశాయి మిత్రమా!” అన్నాడు యల్లమంద.
బస్సులో పెందుర్తి చేరుకున్నాము. ఉదయం చోడవరంలో మా జిఎస్సెన్ పదవీ విరమణ సభలో పాల్గొన్నాము. నేను ‘గెస్ట్ ఆఫ్ ఆనర్’ని. ఇద్దరం మావాడితో మాకున్న సాన్నిహిత్యాన్ని పద్యాల ద్వారా రాగయుక్తంగా తెలిపాము
ఆ రోజు సాయంత్రం అనకాపల్లి చేరుకొని మిత్రులు కొందరిని కలుసుకుని, రాత్రి 9.30కి గరీబ్‌రథ్ ఎక్కాను. యల్లమంద చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లాడు.
అలా, అనుకోకుండా, సింహాచల వరాహనర సింహస్వామి వారు, నా ఇష్టదైవం, నా అన్ని విజయాలకూ కారకుడు, కరుణా సముద్రుడు, మాకు దివ్య భవ్య దర్శనాన్ని అనుగ్రహించాడు. ధన్యోస్మి!