[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘ఓటరుబ్రహ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఎ[/dropcap]న్నికల ప్రవాహంలో
అధికారతీరం కోసం
నాయకుల ఈతల పోటీ!
వెల్లువలో వారి సుడి తిరుగుతుందో!
గుండంలో పడి మునుగుతుందో!
ఎవరికెరుక! దేవుడి దయ!
పాదయాత్రలూ, కంఠశోషలూ
చూస్తూ విలాసంగా నవ్వే
ఓటరు దేవుడు
ఆ తోలుబొమ్మలాటల్లో
బంగారక్కాతమ్ముళ్ళ బాగోతం
వినోదించే ఆనందమూర్తి
పదవులూ, పైత్యాలూ
ప్రలోభాలూ, ప్రకోపాలూ
వంటి ఈతిబాధల్లేని జ్ఞానమూర్తి
ఎవరు పాలించినా తేడా పడక
తన రెక్కల్నేనమ్ముకుని
గండాలు దాటే దేవతామూర్తి
ఉచితాల వేలం పాటలో
గెలిచి పీఠమెక్కిన వాడు
తాయిలాల ఊబిలో మునిగినా
ప్రజల్ని ఏమార్చబోయిన
భస్మాసురులు
ఓడి, శాపాలకు తెగబడినా
నోరు మెదపని మౌనమూర్తి
ఐదేళ్లకొకసారి ఓటుతో వారి
తలరాతలు రాసే వివేకమూర్తి