అమ్మణ్ని కథలు!-18

2
3

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

వంటాయన – వజ్రాలవేట

[dropcap]ప్ర[/dropcap]తీ వేసవికాలంలో మేము మా అమ్మమ్మ గారింటికి వెళ్లేవాళ్లమని చెప్పినాను కదా! అమ్మమ్మా వాళ్ల ఇల్లు.. ఊరి బయట, కోర్టు పక్కనే వుండేది.

పెద్ద కాంపౌండు, మధ్యలో లంకంత ఇల్లు అమ్మమ్మా వాళ్లది. కాంపౌండ్ లో ఐదారు ఇళ్లు వుండేవి. వాటిని బాడుగలకు ఇచ్చేవారు.

మా తాతగారికి అద్దెకున్నవాళ్ల మీద సానుభూతి చాలా ఎక్కువ. బాడుగలు బయటి కంటే చాలా తక్కువగా తీసుకునేవారు.

రెండు మూడేళ్లకోసారి గానీ బాడుగ పెంచేవారు కాదు.

ఒక్కోసారి అద్దెకున్నవాళ్లే వొచ్చి.. “సార్! మూడేండ్లయింది సార్ మేము మీ ఇంట్లోకి వొచ్చి. బాడుగ పెంచాల గదా!” అని అడిగేవాళ్లు.

“అవునా? మూడేండ్లయిందా? సరే అయితే.. ఒక అర్ధరూపాయి పెంచండి!” అని చెప్పేవారు.. మొహమాటపడుతూ.

వాళ్లు ఆయన ఉదారత్వాన్ని పొగుడుతూ వెళ్లేవారు.

మా మామలు మాత్రం “అప్పా! మేము సిటీలలో వందల రూపాయలిచ్చి అద్దె ఇండ్లలో వుంటున్నాము. నీవు చూస్తే ఇక్కడ ఇంత తక్కువకు ఇళ్లు అద్దెకిస్తున్నావు. మూడేళ్ల తర్వాత అర్ధరూపాయి పెంచడం ఒక పెంచడమా?” అని గొడవ చేసేవారు.

“పోనీలేండ్రా.. చిన్న చిన్న ఉద్యోగులు.. ఇంటిబాడుగకే వొచ్చిన జీతమంతా పెట్టుకుంటే పిల్లా పాపలతో యేమి తింటారు?” అని సమర్థించేవారు.

“మాకూ నీలాంటి ఇంటి ఓనరు దొరికితే బాగుండును!” అని గొణిగేవాళ్లు మామావాళ్లు.

కాంపౌండులో ఒక మూలగా చిన్న తోట.. తోటలో కరివేపాకు, ఉసిరి, కొబ్బరి, సపోటా, గోరింటాకు లాంటి చెట్లూ, జాజిపూల పందిర్లూ వుండేవి.

ఇంటి చుట్టూ రకరకాల చెట్లు, పూలతీగల పందిర్లతో ఎండాకాలంలో కూడా చల్లగా వుండేది.

మా ఊళ్లో అయితే అక్కడొకటీ ఇక్కడొకటీ వేపచెట్లు.. గుళ్లలో రావిచెట్లు తప్ప పెద్దగా చెట్లుండవు. ఊరి బయట చీనీతోటలు, మల్లెపూల తోటలూ ఉంటాయట. కానీ మేమెప్పుడూ వాటిని చూడలేదు.

మావూళ్లో పెరట్లో యేవైనా పూల చెట్లు వేసుకున్నా, కోతులు కొమ్మలను విరిచెయ్యడం, మొగ్గలను తుంచేయడం వంటి పనులు చేసేవి.

అందుకే మాకు అమ్మమ్మగారింట్లో చెట్లను చూస్తే ఆనందంగా వుండేది.

ఆ ఊరికి పోతే పెద్దపిల్లలంతా కలిసి గుత్తి కోటకు వెళ్లడం ఒక పెద్ద కార్యక్రమం! ఒకటే హడావిడి!

పొద్దున్నే ఎనిమిదింటికల్లా భోజనం చేసేసి, బయల్దేరేవారం.

కొండ పైకి ఎక్కాక మళ్లీ పిచ్చి ఆకలి వేస్తుంది. అందుకే దారిలో హోటల్లో ఇడ్లీలు ఎవరికి వారికి విడిగా ప్యాక్ చేయించి ఇప్పించేవారు మామా వాళ్లు. కొండ పైకి ఎక్కడం కష్టమని చిన్నపిల్లలను పిలుచుకొని వెళ్లేవారు కాదు.

అక్కడ రాజులు పాలించిన రోజుల నాటి కోట ఆనవాళ్లు వున్నాయి. అక్కడ రాజులు వాడిన ఫిరంగులు వున్నాయి. బావులు, నీటి కుంటలు వున్నాయి. కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. ఆ కోటకు ఎంతో చరిత్ర వుంది. రాయలకాలంలో ఆయన సామంతులు, ఆ తర్వాత మరాఠీ సర్దారులు, నవాబులు పాలించినారట ఆ కోటను.

ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్పాలి. ఆ వూళ్లో మహామంత్రి తిమ్మరుసు.. తన చిన్నవయసులో నివశించినారట! ఆ తరువాత ఎన్నో కష్టాలకోర్చి ఆయన రాయలవారి మహామంత్రి స్థాయికి ఎదిగినారు.

ఒకసారి భట్టుమూర్తి అనే కవికి ఆయనపై ఎందుకో కోపం వొచ్చింది.

“నువ్వు ఇప్పుడు మహామంత్రి వయ్యావు గానీ.. దానికి ముందు నువ్వు ఎలాంటి బతుకు బతికినావో నాకు తెలియదా..” అని తిమ్మరుసును ఎద్దేవా చేస్తూ ఓ పద్యం చెప్పినాడు.

దాని భావమేమంటే.. తిమ్మరుసు పూర్వజీవితంలో గుత్తి (అమ్మమ్మా వాళ్ల ఊరు)లో విస్తరాకులు కుట్టి, వాటిని అమ్మి జీవించేవాడట. చంద్రగిరి అనే ఊళ్లో యాయవారం.. అంటే భిక్షాటన చేసి జీవించినాడట. పెనుకొండలో హత్తిన్ సత్రమనే సత్రంలో ఉచితభోజనాలు చేసినాడట.

ఎందరో దుర్గాధీశుల దగ్గర తాంబూలపు తిత్తులు మోసినాడట. (అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసినాడని అధిక్షేపణ అన్నమాట!)

ఇట్లా ఇంకా ఏవేవో మాటలని తన అక్కసు వెళ్లగక్కాలనుకున్నాడు. ఇంకా తనను ఏమి తిట్టబోతాడోనని తిమ్మరుసు భయపడి, తన మెడలోని పచ్చలహారాన్ని భట్టుమూర్తి మెడలో వేశాడట.

దాంతో శాంతించిన ఆ కవి పద్యం చివరిపాదంలో తిమ్మరుసును ప్రశంసించి దీవించినాడట.

ఇలా ఆ పద్యం తిమ్మరుసుగారికి గుత్తితో వున్న అనుబంధాన్ని చెప్పింది.

ఆ కోటలో, ఆ వూళ్లో తిమ్మరుసు వంటి మహానుభావుడు తిరిగి వుంటాడన్న భావం నాకు చాలా గర్వంగా అనిపించింది. అదంతా రాయలేలిన సీమ కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు రాయలవారు కూడా ఆ చుట్టుపక్కల తిరిగి వుంటారు.. అని ఆనందించేదాన్ని. అంతటి మహానుభావులు ఇక్కడి గాలిని పీల్చినారు. ఈ నేలను తొక్కినారు.. అనే భావం మనసులో పరవశాన్ని కలిగించింది.

ఇప్పుడు తిమ్మరుసు గారు నివశించిన ఆనవాళ్లు అక్కడ ఏమీ లేవు. కానీ, సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టరుగా వున్నప్పుడు కట్టించిన ‘మన్రో సత్రం’ మాత్రం ఇప్పటికీ వుంది. అక్కడ చిన్నపిల్లల బడిని నడిపేవారు.

ఆ ఊళ్లోనే హంపన్న సమాధి అనే ప్రదేశం వుంది. హంపన్న రైల్వే క్రాసింగ్ గేటు దగ్గర గార్డుగా పనిచేసేవాడు. ఒకరోజు రాత్రివేళ కొందరు గ్రామీణ స్త్రీలు అటుగా వొస్తుండగా ఆంగ్లసైనికులు వాళ్లపై అత్యాచారానికి ఒడిగట్టినారు. హంపన్న వారిపై తిరగబడినాడు. ఆ యువతులను రక్షించినాడు గానీ, సైనికుల తుపాకులకు తన ప్రాణాలను కోల్పోయినాడు. ప్రజలు కృతజ్ఞతగా ఆయన సమాధిని నిర్మించుకుని, ఆయనను గౌరవించుకున్నారు.

కోటంతా చుట్టుకుని, మధ్యాహ్నం ఇడ్లీలు తినేసి, నెమ్మదిగా ఇంటిదారి పట్టేవాళ్లం.

కోటలో ఒకచోట కొండ నిటారుగా, లోయ మాదిరిగా వున్న చోటును చూపి, రాజులు మరణశిక్ష పడినవాళ్లను ఆ కొండపై నుండి కిందికి తోసేసేవారని చెప్పారు మామా వాళ్లు. నాకైతే చచ్చే భయం వేసింది.. ఆ ప్రదేశాన్ని చూసి! అదేదో మృత్యులోయ మాదిరి అనిపించింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయో కదా.. ఆ ప్రదేశంలో.. అని మనసు ఉసూరుమనిపించింది.

కోటకు పోయివచ్చినాక కాళ్ల నొప్పులు రెండురోజులైనా తగ్గేవికావు. అయినా ఆ అనుభూతి గొప్పగా వుండేది.

తరువాత ఆ వూళ్లో సినిమాకు వెళ్లడం ఒక పెద్ద ప్రహసనం. మా తాతగారికి సినిమాల మీద పెద్ద మంచి అభిప్రాయం లేదు. ‘అసలు సినిమా చూడడం అనేది శుద్ధ పనికిమాలిన పని..’ అని ఆయన నిశ్చితాభిప్రాయం!

ముందు తాతను మా సినిమా ప్రయాణానికి ఒప్పించాలి.

‘సినిమా చాలా బాగుందంట. తప్పక చూడాల్సిన సినిమా అంట!’ అని ఆయనకు అందరూ నచ్చజెప్పాలి.

మా అవ్వ “సినిమా బాగుందంట. పిల్లలను పోయి రానీ లెండి” అని సిఫార్సు చెయ్యాల. ఎలాగో సరేననేవారు.

ఆ రోజుల్లో రాత్రి యేడింటికి మొదలయ్యేది సినిమా. అందరం త్వరగా భోంచేసి బయలు దేరేవాళ్లం!

మా మామల్లో ఒకాయన మా అందరికీ లీడరు. ఆయన పిల్లలకోడి లాగా జాగ్రత్తగా పిల్లలందరినీ లెక్కబెట్టుకొని తీసుకెళ్లి, టికెట్లు కొని థియేటర్‌లో కూర్చోబెట్టేవారు.

మా ఊళ్లో టూరింగ్ టాకీసే వుండేది. మేము సినిమా థియేటర్లో సినిమా చూడటం అదే మొదటిసారి. అది మా పాలిటికి చాలా గొప్ప అనుభూతి! అది పరమడొక్కు థియేటరే కావొచ్చు గాక!

అక్కడే ‘ఇండియా బాదమ్’ అని అమ్మే వేరుసెనక్కాయలు తినేవాళ్లం. అది ఒక పెద్ద లగ్జరీ. గోలీసోడా తాగడం ఇంకా పెద్ద లగ్జరీ.

ఇంటికి వచ్చేసరికి వరండా చివర నిలుచుకుని మా తాతగారు కళ్లమీద చెయ్యి పెట్టుకుని చూస్తూ వుండేవారు.

వీధిదీపాల వెలుగులో మేము వస్తున్నామా.. లేదా.. అని కళ్లు చికిలించి చూస్తుండేవారు.

ఆయనకు ఎవరైనా వస్తామని చెప్పిన సమయానికి రాకపోతే చాలా కోపం!

ఆయన చాలా త్వరగా ఆందోళన చెందేవారు.

రాగానే ‘సినిమా బాగుండిందా?’ అని ఒక్కొక్కరినీ అడుగుతారు. అందుకే మా మామా వాళ్లు ముందే మాకు చెప్పివుంచుతారు, ‘తాత అడిగితే సినిమా బాగుంద’ని చెప్పాలని.

అందుకే మాకు నచ్చినా, నచ్చకున్నా “చాలా బాగుంది తాతా” అని చెప్పేవాళ్లం. పొరబాటున ఎవరైనా ‘బాగాలేదు’ అని చెప్తే.. మా మామా వాళ్లకు బాగా అక్షింతలు పడేవి.

“బాగా లేని సినిమాకు అంత డబ్బు ఖర్చు పెట్టి, పసిపిల్లలను పిలుచుకొని పోవడం ఎందుకు?” అని కోప్పడేవారు. ఆ మందలింపు లేవో మామా వాళ్లే పడేవారు.

తర్వాత అందరం మేడమీద బయలు జాగాలో పెద్ద జంబుఖానా పరుచుకుని పడుకునేవాళ్లం! వయసుల వారీగా, గ్రూపులు గ్రూపులుగా మేమంతా కబుర్లే కబుర్లు! కథలే కథలు! మావాళ్లలో ఒకరిద్దరు సినిమా కథలు చెప్పడంలో దిట్టలు! వాళ్లు వాళ్ల ఊళ్లలో చూసిన సినిమా కథలు చెబుతూ వుంటే, చందమామను, నక్షత్రాలను చూస్తూ హాయిగా నిద్రపోయేవాళ్లం. డిటెక్టివ్ కథలు, దయ్యాల కథలు విన్న రోజు రాత్రి కలతనిద్రతోనే గడిచేది. కళ్లు తెరిస్తే గాలికి ఊగుతున్న కొబ్బరిచెట్లు దయ్యాల్లా బెదిరించేవి. నీడల్లో ఎవరైనా దొంగలో, హంతకులో దాక్కున్నారేమోనని హడలు పుట్టేది.

 పిల్లలం అంతా నిద్రపోయాక మా తల కింద దిండ్లు పెద్దవాళ్లు తీసుకుని వెళ్లేవాళ్లు. పొద్దున లేచి చూసుకుంటే ఎవరి తలకిందా దిండు వుండేది కాదు.

నిద్ర లేచి, అక్కడే కూచుని కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్లం!

కాసేపు బావి దగ్గర నీళ్లు తోడి తొట్లో పొయ్యడం, తోటలోకి వెళ్లి చెట్లన్నీ చూసుకుని, వంటకోసం కరివేపాకు కోసుకుని రావడం, త్వరగా స్నానాలు చేసి, తొమ్మిదింటికల్లా భోజనాలు చెయ్యడం, అప్పటినించీ రకరకాల ఆటలు ఆడుకోవడం.. ఇలా జీవితమంటే ఎంజాయ్ చెయ్యడానికేనన్నట్టుగా వుండేవాళ్లం.

తోటలో గోరింటాకు చెట్లు వుండేవి. అందరం పోటీలు పడి గోరింటాకు కోసుకోవడం, దాన్ని రుబ్బడం, చేతులకు పెట్టుకోవడం ఒక పెద్ద కార్యక్రమం.

కోర్టు ఆవరణలో బోలెడన్ని చింతచెట్లు వుండేవి. మధ్యాహ్నం వేళ రాలిన చింతకాయలన్నీ యేరుకోవడం, కోర్టు క్లబ్ దగ్గర వుండే బావి దగ్గర వాటిని కడిగి, అక్కడే వుండే ఒక బండమీద పెట్టి, రాయితో దంచుకోవడం, పెద్దవాళ్లు అందరూ భోంచేసి, తలుపులు చేరవేసి పడుకున్నప్పుడు, నెమ్మదిగా వంటింట్లోకి దొంగలాగా వెళ్లి, పిడికిటి నిండా ఉప్పు ఒకరు, కొన్ని పచ్చిమిరపకాయలు ఒకరూ తెచ్చేవాళ్లం.

తలుపు కిర్రుమనకుండా, పెద్దవాళ్లు లేవకుండా, వాళ్లేదైనా నిద్రమత్తులో అడిగినా.. అందకుండా పొందకుండా సమాధానాలు చెప్పి తప్పించుకుని వచ్చేవాళ్లం.

చింతకాయపచ్చడి చేసుకొని, నోరు మండిపోతున్నా చప్పరించు కుంటూ తినేవాళ్లం!

ఒక్కొక్కసారి పెద్దవాళ్లనడిగి చింతపండు ఇప్పించుకొని, దానిలో ఉప్పు, కారం, జీలకర్ర వేసి దంచుకొని చిన్నచిన్న ఉండలు చేసుకుని పుల్లలకు గుచ్చి చప్పరించేవాళ్లం!

సాయంత్రమైతే ఒక్కొక్కసారి రైల్వేస్టేషన్ దాకా వెళ్లడం, అక్కడ ఆగివున్న రైళ్లను చూడడం, కదిలిపోయే రైళ్లకు టాటా చెప్పడం చాలా సరదాగా వుండేది.

నేను అంతవరకు రైలును చూడనే లేదు. అప్పటికి రైలు ఎక్కలేదు కూడా!

స్టేషన్‌లో ఆంగ్లోఇండియన్స్ కొందరు కనిపించేవారు. అది బొంబాయి – మద్రాసు రూట్‌లో వున్న రైలు మార్గం కావడంతో ఆంగ్లోఇండియన్స్ ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు.

వాళ్లు రైలు దిగి అటూ ఇటూ తిరుగుతూ కనిపించే వారు. వాళ్లలో ఆడవాళ్లు ఫ్రాకులు వేసుకుని కనిపిస్తే మా ఆశ్చర్యానికి అంతే వుండేది కాదు. చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్లు ఫ్రాకులు, గౌన్లు ఎలా వేసుకుంటారా.. అని ఆశ్చర్యపోయేవాళ్లం!

వాళ్లలో కొందరి తెల్లతోలు చూసి, వాళ్లేదో చాలా నాగరికులనీ, గొప్పవాళ్లనీ అనుకునేవాళ్లం!

ఒకసారి రైల్వే రిటైరింగ్ రూములో కెళ్లినప్పుడు ఒక ఆంగ్లోఇండియన్ ఆవిడ వాష్ బేసిన్‌లో తలపెట్టి, తలకు సోప్ రాసుకుని తలస్నానం చేస్తుంటే నివ్వెర పోయాము.. అట్లా కూడా తలస్నానం చెయ్యొచ్చా.. అని.

ఆ తర్వాతెప్పుడో బ్యూటీపార్లర్లలో అలా షాంపూ చేయించడం చూశాము. అప్పటికి మేమెంత వెనకబడివున్నామో కదా.. అనుకుంటుంటాను.

ఒకసారి మా అమ్మ అమ్మమ్మగారి ఊరికి వొచ్చినప్పుడు అవ్వ అమ్మ చేతిలో ఒక వెండిభరిణె పెట్టి “మీ తాతగారి గుర్తుగా ఉంచుకో” అని ఇచ్చింది. దాంట్లో రకరకాల సైజుల ముత్యాలు చారెడు వున్నాయి. అవేంటని మా అమ్మను అడిగితే మా అవ్వగారి తండ్రి గురించిన కథ ఒకటి చెప్పింది.

ఆయన చిత్తూరు జిల్లాలోని నగరి అనే ఊరిలోని సంస్థానాధీశుడు అయిన నవాబు దగ్గర జ్యోతిష్కుడు ఉండేవారట. ఆయన పేరు పారనంది సదాశివశాస్త్రి గారు. ఆయన ఎవరికైనా జాతకం చెబితే.. చెప్పింది చెప్పినట్టు జరిగేదట!

ఒకసారి ఆ నవాబుగారు ఒక చిలకను చేతిలో పట్టుకొని, దాని మెడపై కత్తిపెట్టి, “దీన్ని నేను చంపబోతున్నాను. దీనికి ఆయుష్షు మూడిందా? లేక ఇంకా ఇది బతుకుతుందా? చెప్పండి..ఇది మీ పాండిత్యానికి పరీక్ష..” అన్నాడట.

శాస్త్రిగారు ముహూర్తాన్ని గుణించి, “నవాబుగారు.. దీనికి ఆయుష్షు చాలా మిగిలివుంది. మీరు దీన్ని చంపలేరు!” అన్నారట.

ఎందుకు చంపలేనో చూద్దాం.. అని దాన్ని కత్తితో చంపబోతే అది తల పక్కకు తిప్పి తప్పించుకుందట. దాంతో నవాబు గారి వేలు తెగింది. ఆ కంగారులో ఆయన పట్టు విడిపించుకొని అది ఎగిరి పోయిందట.

శాస్త్రిగారి జ్యోతిషశాస్త్ర పాండిత్యానికి మెచ్చుకున్న నవాబు తాను ధరించిన ముత్యాల అంగీని (ఓవర్ కోటు వంటిదనుకుంటా..) తీసి ఆయనకు తొడిగాడట!

ఆ అంగీ పాతబడి చినిగిపోతే, దానికి కుట్టి వున్న ముత్యాలను అవ్వ దాచి వుంచి, వాటిలో కొన్నింటిని అమ్మకిచ్చిందన్నమాట!

అయితే ఇదే కథను బీర్బల్ కథల్లోనూ, మరి కొన్ని కథల్లోను చదివినాను. కానీ, శాస్త్రిగారి కథ నిజమైందని చెప్పడానికి అమ్మ దగ్గర మొన్నమొన్నటి వరకూ వుండిన ముత్యాలే సాక్ష్యం!

అమ్మమ్మగారింట్లో రాజారావు అనే వంటాయన ఉండేవాడు. ఆయన కర్నాటకలో కోలారుకు చెందిన వాడు. తాతగారింట్లో చాలా సంవత్సరాలు వంటచేశాడు. ఎప్పుడూ చిరునవ్వుతో, నెమ్మదస్థుడిలాగా వుండేవాడు. ఆయన మా తాతగారి గుమాస్తాలు పనిచేసుకునే గదిలో సామాను పెట్టుకునేవాడు. ఆయన దగ్గర రెండు చిన్న ట్రంకుపెట్టె లుండేవి. ఒకదాన్లో ఆయన గుడ్డలు వగైరా పెట్టుకునేవాడు. రెండో పెట్టె నిండా రకరకాల రాళ్లు వుండేవి. ఆయనకు ఖాళీ వున్నప్పుడల్లా ఒక భూతద్దం పెట్టుకుని, ఆ రాళ్లను పరిశీలిస్తూ వుండేవాడు.

అట్లా ఎందుకు చేస్తాడో తెలిసేది కాదు.

అడిగితే “అమ్మణ్నీ.. నువ్వు చిన్న పిల్లవమ్మా.. నీకు తెలియదు..” అనేవాడు.

నేను వొదుల్తానా? మాకంటే పెద్దవాళ్లను అడిగి తెలుసుకున్నాను.

వానపడ్డ రోజుల్లో ఆయన గుత్తికి దగ్గర్లో వున్న ‘వజ్రకరూరు’ అనే వూరికి వెళ్లేవాడు. అక్కడ కొండల మీదా, పొలాలలోనూ, వాగుల్లోనూ కొంచెం ప్రత్యేకంగా కనిపించిన రాళ్లను సేకరించుకుని తెచ్చుకునేవాడు.

విషయం యేంటంటే ఆ వూళ్లో వానపడినప్పుడు వజ్రాలు దొరుకుతాయట! చాలామందికి దొరికినాయట కూడా!

తనకు కూడా దొరుకుతాయేమోనని ఆయన తన అదృష్టాన్ని అట్లా పరీక్షించుకునేవాడన్నమాట! ఆ రాళ్ల బరువు మోసుకుని, బస్సులో తిరిగి వొచ్చేవాడు.

అప్పటినించీ భూతద్దం పెట్టి తాను మోసుకొచ్చిన రాళ్లలో వజ్రపు జాడలు వున్నాయేమోనని తెగ వెతుకుతూ వుండేవాడు.

ఆ వూళ్లోని కొండలన్నీ తెగ తిరిగేవాడట! వాగుల్లో వెతికేవాడట! పొలాలన్నీ శోధించినాడు.

కానీ, పాపం ఆయనకు ఒక్క వజ్రం కూడా దొరకలేదు.

జీవితం ఎంత చిత్రమైనదో కదా! ఎన్నో ఆశలను సృజిస్తుంది!

ఆశ ఎంత లోతైనదో కదా..!

మనిషిని ఊరించి.. ఊరించి.. కడ దాకా వదలదు.

అదృష్టం ఎంత అగమ్యమైనదో కదా..దాని కోసం ఎంత అన్వేషించినా అందరికీ అందదు!

ఎవరో రైతుకు వజ్రం దొరికి లక్షరూపాయలు వొచ్చాయట!

రాజారావుకు మాత్రం వజ్రాలు దొరకలేదు కానీ, వొట్టి శ్రమే మిగిలింది!

ఎన్ని వానల్లో తడిసినాడో.. వజ్రాల కోసం..! పడిశం పట్టిందేమో గానీ, అదృష్టం మాత్రం పట్టలేదు రాజారావుకు.

ఇంకా నయం! ఆ వజ్రకరూరులో అడుగడుగునా పాములుంటాయట! అదృష్టం బాగుంది కాబట్టి ఏ పాముకాటుకో గురికాలేదు రాజారావు!

చాలాయేళ్లు అమ్మమ్మగారింట్లో వుండి వంట చేశాక, తిరిగి వాళ్ల ఊరికి.. తన భార్యా పిల్లల దగ్గరికి, కోలారుకు వెళ్లిపోయాడు ఆయన!

వజ్రాలవేటలో, వంటపనితో అలసిన వంటాయన వజ్రాలు, వైఢూర్యాలూ యేవీ దొరకక రిక్తహస్తాలతో నిష్క్రమించాడు!

ఆ వజ్రాల మీద ఆశచావక మరో జన్మ వజ్రకరూరులోనే ఎత్తి, వజ్రాన్వేషణ చేస్తుంటాడేమోనని నా అనుమానం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here