[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[కార్తీక్ ఫ్రెండ్ సిద్ధూ ఫోన్ చేసి, తన ఫ్రెండ్ రాఘవ ఒక లో-బడ్జెట్ మూవీకి డైరక్షన్ చేస్తున్నాడనీ, ఆ సినిమాకి బి.జి.ఎం.లో కీబోర్డు ప్లే చేయాలని అడుగుతాడు. సరేనంటాడు కార్తీక్. ఆ సమయంలో రాఘవ కూడా సిద్ధు పక్కనే ఉండడంతో రాఘవతో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. వారం తర్వాత రామకృష్ణ పానీపూరి స్టాల్ వద్దకు తన మిత్రులతో వస్తాడు కార్తీక్. అది చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ‘పోస్టు గ్రాడ్యుయేట్ పానీ పూరి స్టాల్’ అని బోర్డు కూడా ఉంటుంది. అందరూ మెచ్చుకుంటారు. ఓ రోజు అర్ధరాత్రి 12 గంటలకు మేఘనకి ఫోన్ చేస్తాడు కార్తీక్. ఆ సమయంలో ఫోన్ చేసినందుకు ఆశ్చర్యపోయి, కారణమడుగుతుంది మేఘన. మేఘన వాళ్ళ కంపెనీలో పనిచేసే సౌమ్య అనే సింగర్ ఫోన్ నెంబరు ఉందా, సినిమాలో పాడే అవకాశం ఉందని చెప్తాడు. తన వద్ద నెంబరు లేదని, కనుక్కుని రేపు చెప్తానని అంటుంది. మర్నాడు సౌమ్య నెంబరు కార్తీక్‍కి పంపించి, ఫోన్ చేసి చెబుతుంది. కాసేపయ్యాకా, సౌమ్య ఫోన్ చేసి పరిచయం చేసుకుంటుంది. ఆ రోజు ఆమె ఫ్రీగా ఉంటే, 10 గంటల తర్వాత కాల్ చేసి ఎక్కడికి రావాలో చెప్తానంటాడు. ఆ రాత్రి సౌమ్య మేఘనకి ఫోన్ చేసి థాంక్స్ చెబుతుంది. సినిమాలో పాడే అవకాశం వచ్చిందని చెబుతుంది. మేఘన కార్తీక్‍కి ధన్యవాదాలు చెబుతుంది. పాట బాగా వచ్చినందుకు రాఘవ సంతోషిస్తాడు. పార్టీ ఇస్తానంటాడు. తను తీయబోయే ఓ షార్ట్ ఫిల్మ్‌లో హీరో పాత్రకి కార్తీక్ బాగా నప్పుతాడని, చేస్తానంటే, పనులు ప్రారంభిద్దామని అంటాడు. రేపు చెప్తానంటాడు కార్తీక్. మర్నాడు మేఘన కార్తీక్‍ని పానీపూరి సెంటర్ వద్ద కలుస్తుంది. కాసేపు మాట్లాడుకున్నాకా, రాఘవ నుంచి కార్తీక్‌కి ఫోన్ వస్తుంది. తాను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. ఓ రోజు ఆఫీసులో మేనేజర్ కార్తీక్‍ని పిలిచి యు.ఎస్. ప్రాజెక్టుకు అతన్ని సెలెక్ట్ చేశామని చెప్తే, తనకి ఆసక్తి లేదని, వేరేవాళ్ళని పంపమని చెప్తాడు. ఎందుకు వెళ్ళనంటున్నావని మిత్రుడు సురేష్ అడిగితే, సినిమా ప్రాజెక్టు ఉందని చెప్తాడు. ఇక చదవండి.]
[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిది గంటలకి నిద్ర లేచాడు కార్తీక్. ఫోన్‌లో గుడ్ మార్నింగ్ మెసేజెస్ చూస్తుంటే.. మేఘన పెట్టిన పెద్ద మెసేజ్ దాని కింద రీడ్ మోర్.. ..రీడ్ మోర్ అని రెండుసార్లు ఉన్న మెసేజ్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి కార్తీక్‌కి పది నిమిషాలు పట్టింది.
ఏతావాతా ఆ మెసేజ్ మీనింగ్ ఏంటంటే.. ‘నా మీద నీ అభిప్రాయం ఏమిటి? లవ్ యు, యువర్స్.. మేఘన.’ అని ముగించింది.
‘ఏంట్రా! సామీ! పొద్దున, పొద్దున్నే ఈ గోల’ అనుకున్నాడు.
(కార్తీక్ రకరకాల స్లాంగ్స్ మాట్లాడటం ఇష్టం. చిన్నప్పుడు వాళ్ళ పెద్ద మామయ్య చిత్తూరులో ఉన్నాడు. అప్పుడప్పుడు వాళ్ళింటి కెళ్ళేవాడు. అప్పుడు ఆ శ్లాంగ్ అలవాటయింది. ఈ మధ్య టీ.వీ సీరియల్స్‌లో చిత్తూరు స్లాంగ్ తరచూ వినిపిస్తుండటంతో ఆఫీస్‌లో ఆ ఏరియా వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళలాగే మాట్లాడుతాడు)
మేఘన పెట్టిన మెసేజ్‌కి రిప్లై ఏమి ఇవ్వలో ఆలోచిస్తూ.. బ్రష్ చేసుకుంటుంటే.. ఫోన్ మోగింది.
ఆమే అయుంటుందని సైలెంట్లో పెడదామని, చార్జింగ్ పెట్టిన ఫోన్ దగ్గరికి వచ్చి చూశాడు.
డైరెక్టర్ రాఘవ ఫోన్ చేశాడు. దానితోపాటు వాట్సప్‌కి మెసేజ్ కూడా పెట్టాడు.
“ఐ హేవ్ మెయిల్డ్ ద సినాప్సిస్ ఆఫ్ షార్ట్ ఫిలిం. ఒకసారి చదివి నాకు కాల్ చేయండి.”
లాప్టాప్‌లో మెయిల్ ఓపెన్ చేసి సినాప్సిస్ చదివాడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు అందులోని హీరో పాత్రకి తననే ఎందుకు రాఘవ అవడుగుతున్నాడో అర్థమైంది.
సిద్ధార్థ కి కాల్ చేశాడు.
“రాఘవ షార్ట్ ఫిలిమ్ సినాప్సిస్ పంపాడు. వెరైటీగా బాగుంది” అన్నాడు కార్తీక్.
“మరింకేం! చేస్తానని చెప్పు. అందరికీ అవకాశాలు రావు. నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఉపయోగించుకో! ఆల్ ద బెస్ట్. ఓ.కే. అని చెప్పు”
తర్వాత రాఘవకి కాల్ చేసాడు.
“ఓకే సార్, నేను చేస్తాను”
“దీనికోసం నువ్వు ఎక్కువ రోజులు ఆఫీస్‌కి లీవ్ పెట్టక్కర్లేదు. జస్ట్ 2 డేస్ చాలు” అన్నాడు.
“ఓకే! సార్ థాంక్యూ! ఆఫీస్‌కి వెళ్ళాలి. ఉంటా!” అని ఫోన్ కట్ చేశాడు కార్తీక్.
ఆఫీసుకు తయారవుతుంటే మేఘన కాల్ చేసింది.
“హలో మేఘన గారూ! హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? నల్ల ఇరిక్కీంగదలా? సుఖమాయుటో? చెన్నాగిదిరా? కైసే హో?” అన్నాడు గుక్క తిప్పుకోకుండా!
“అమ్మో! ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు. గ్రేట్”
“నేనేం గ్రేటండి! మన తాతగారు పీ.వీ నరసింహారావు గారు భారత తొమ్మిదవ ప్రధానమంత్రి. ఆయనకి 14 భాషలు వచ్చు. నేను ఎప్పుడు ఆ రికార్డు బద్దలు కొడతానో!” అన్నాడు.
“దిగులు పడకండి! రికార్డుల రాజా ఏదో ఒక రోజు ఆ రోజు తప్పకుండా వస్తుంది. కార్తీక్ ఓ హెల్ప్ అడగనా!”
“చెప్పండి”
“నా మోపెడ్ పంక్చర్ అయింది. ఇప్పుడు ఆఫీస్‌కి టైం అయింది. నేను లొకేషన్ పెడతాను. నన్ను పికప్ చేసుకుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా. ప్లీజ్!” అంది.
“ఇప్పుడు డ్రాప్ చేయమంటారు. సాయంత్రం వచ్చి పికప్ చేసుకోమంటారు. ప్రస్తుతం నేను ఈ రెండూ చేయలేను. మీరు పంపిన లొకేషన్కి క్యాబ్ బుక్ చేస్తా! నేను శ్రీనగర్ కాలనీ వెళ్లి, అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ బయలుదేరాను” అన్నాడు.
“ఓకే! బై” అని ఫోన్ కట్ చేసింది మేఘన.
***
సాయంత్రం ఐదు గంటల తర్వాత కార్తీక్, అభిరామ్, విఘ్నేష్, సురేష్.. పీ.జీ. పానీపూరి సెంటర్ దగ్గరికి వచ్చారు. బోర్డు మీద ఈరోజు స్పెషల్ బట్టర్ పన్నీర్ దోశ అని రాసుంది.
“విఘ్నేష్ ఏం కావాలో ఆర్డర్ చేయరా?”
“పార్టీ ఇస్తున్నది నువ్వు. నువ్వే చెప్పు”
“కానీ తినేది నువ్వే కదరా! ఎవరికి ఏం కావాలో వాళ్ళే ఆర్డర్ చేయండి” అన్నాడు ఫోన్ చూస్తూ
“ఫస్ట్ పానీపూరి, నెక్స్ట్ బటర్ పన్నీర్ దోశ” అందరూ ఆర్డర్ చేశారు.
“మరి నాకూ!” వెనకనుండి అంది మేఘన.
“హాయ్! హలో! అదేమిటి? మోపెడ్ రిపేర్ అన్నారు”
“ఇది మా హాస్టల్ మేట్‌ది. కలర్ కూడా తేడా చూడండి”
“ఇప్పుడు మీరు నిజ నిర్ధారణ చెయ్యనక్కర్లేదు. మీ ఆర్డర్ ప్లీజ్” అన్నాడు.
అందరికీ ఆమెని పరిచయం చేసాడు. ఆమెకీ, తనకి తొలి పరిచయం గురించి చెప్పాడు.
“ఇంట్రెస్టింగ్” అన్నాడు.
***
ఆరోజు రాత్రికి కార్తీక్కి మేఘన వాయిస్ మెసేజ్ పెట్టింది. కార్తీక్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ చూసుకోలేదు. పడుకోబోయే ముందు చూసాడు.
“కార్తీక్ నిన్నటి నా మెసేజ్‌కి నువ్వు రిప్లై ఇవ్వలేదు. నామీద అభిప్రాయం చెప్పలేదు. నాకు నీలో నీ సెన్సాఫ్ హ్యూమర్, హెల్పింగ్ టెండెన్సి, నీ టాలెంట్ ముఖ్యంగా నీ స్టైల్ విపరీతంగా నచ్చాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటానికి ఇంతకంటే ఏం కావాలి? ఎంత వద్దనుకున్నా పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ప్లీజ్ అర్థం చేసుకో! నువ్వు ఓ.కే. అంటే నీతో జీవితాంతం ఉండిపోవాలని ఉంది. నీ అభిప్రాయం త్వరగా చెప్తే, మా ఇంట్లో వాళ్లకి చెప్తాను. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ‘ఫరెవర్ యువర్స్’ అనిపించుకోవాలని ఉంది.”
కార్తీక్‌కి ఆమెకి ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. ఇంతవరకు తనని ఎవరూ ఇలా ప్రేమిస్తున్నానని చెప్పలేదు. తను కూడా ఎవరికీ చెప్పలేదు. తొలి ప్రేమ, ఫస్ట్ లవ్.. అంటే ఇదేనా!?!?
అలా అయితే మేఘన మాటలకి నా హృదయం స్పందించాలిగా! నువ్వు చెప్పిన దానికి గుండెల్లో అలజడి కలగటం లేదు. ఇది నీ దృష్టిలో ప్రేమ కావచ్చు. నా దృష్టిలో స్నేహం మాత్రమే అనిపిస్తోంది.
మనం మాత్రమే ప్రేమిస్తే.. ఆ వ్యక్తి కోసం మనసు ఆరాటపడుతుంది. ఆ వ్యక్తితోనే ఉండాలని తపన పడుతుంది. ఆ వ్యక్తి కనిపించకపోతే కలవరపడుతుంది. కానీ మనకు తెలియకుండానే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. జీవితం అంటే ఏమిటో! అసలైన ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది.
గుండె మాత్రమే నాదై, కానీ అది చేసేటప్పుడు తనదై ఉండాలి.
జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతారు. వాళ్ళలో ఎవరో ఒక్కర్ని చూడగానే గుండె ఆగకుండా చివరివరకూ చప్పుడు చేసే వాళ్ళు అన్పిస్తుంది.
అలాంటి వ్యక్తి తారసపడినప్పుడు గుండె తనంతట తానే స్పందిస్తుంది.
తొలి స్పందన, తొలిప్రేమ జీవితాంతం గుర్తుండే శాశ్వత ప్రేమ కావాలి. అది తుది శ్వాస వదిలేవరకు మనతోనే, మనకు తోడుండాలి.
ఇదే విషయాన్ని మేఘనకి మెసేజ్ చేశాడు. “సారీ! మేఘన గారూ! లేటజ్ బి ఫ్రెండ్స్. దీనికి వెంటనే.. మన రిలేషన్‌కి బ్రదర్ బ్లాంకెట్ కప్పనక్కర్లేదు. మనం ఎప్పటిలాగే ఉండాలి. ఉంటాం.” అని వాయిస్ మెసేజ్ పెట్టాడు.
ఆ నిశిరాత్రిలో మేఘనకి పంపిన మెసేజ్ ఆమె విన్నదో లేదో తెలియదు. కానీ కార్తీక్ మాత్రం తొలిప్రేమపై తనలో దాగున్న అభిప్రాయం, నిద్రిస్తున్న భావాలు ఇన్నాళ్ళకి తనకు మొదటి సారి తెలిసినందుకు తనే భుజం తట్టుకున్నాడు.
***
“సారీ కార్తీక్! నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రేమపై నీకున్న స్థిరమైన అభిప్రాయాలకు హేట్సాఫ్. నువ్వు చెప్పింది నిజమే.! మనకు తెలియకుండా మనల్ని ప్రేమించే వ్యక్తి ఒకరు ఉన్నారని తెలిస్తే, ఆ అనుభూతి చాలా మధురంగా భిన్నంగా ఉంటుంది. ఆ ప్రేమలో వాళ్లు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ అది తెలిసిన క్షణాన మనసులో ఉప్పొంగే ఆనందం ఆ నిర్వచనీయం. అది అందరికీ దక్కదు. హోప్ యు విల్ గెట్ యువర్ ఫస్ట్ లవ్ సూన్.. ఆల్ ది బెస్ట్” అని మెసేజ్ పెట్టింది.
***
ఆ తర్వాత కార్తీక్ కంపెనీ మారాడు. విప్రోలో జాయిన్ అయ్యాడు. అతని ఫ్రెండ్స్ అభిరామ్, సురేష్ డి.ఎల్.ఎఫ్ లో పెగా పిక్సల్స్‌లో జాయిన్ అయ్యారు.
***
ఇదండీ! ఈ కథలో మొదటి కృష్ణుడు కార్తీక్ కథ. మరి రెండో కృష్ణుడు గౌతమ్ కథ చదువుదాం రండి.
***
ఫోన్ రింగ్ అవుతుంటే.. నంబర్ చూసి, “అన్నయ్యా! చెప్పు” అంది కవిత.
“నిన్న రాత్రి గౌతమ్ అమెరికా నుండి నెల రోజుల లీవ్‌లో వచ్చాడమ్మా! ఆ లోపల మనం అనుకున్నట్టు హసంతికి, గౌతమ్‌కి పెళ్లి చేసి పంపిద్దాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ నొకళ్ళు చూసుకొని పదేళ్లు పైనే అయింది. రేపు సాయంత్రం నేనూ, గౌతం మీ ఇంటికి వస్తాం.”
“అంత కంటేనా! అన్నయ్యా! తప్పకుండా రండి”
“హసంతికి రేపు ఆఫీసుందా?”
“లీవ్ పెట్టమని చెప్తాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్యా?”
“పర్వాలేదమ్మా! ఏదైనా ఒకసారి బైపాస్ సర్జరీ అయ్యాక మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా!”
“ఔనవును. రేపు త్వరగా వచ్చేయండి. రాత్రికి డిన్నర్ ఇక్కడే”
“ఓ.కే అమ్మా,!” అని ఫోన్ ఆఫ్ చేశాడు.
***
రఘురాంకి కవిత బాబాయ్ కూతురు. కవిత భర్త. వాళ్లకి ఇద్దరు.. హసంతి, గీతిక. చంద్రశేఖర్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి.
రఘురాం ఆ రోజుల్లో బీకాం కంప్యూటర్స్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. సంగీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వీళ్ళకి గౌతమ్ ఒక్కడే కొడుకు.
రఘురాం ఇంటికి రెండు వీధుల అవతల చంద్రశేఖరం ఉండేవాడు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువగా ఉండేది.
బాల్యంలో హసంతి, గౌతమ్ కలిసి ఆడుకునే వాళ్ళు. హసంతిది ఆటల్లో ఓడిపోయినా తనదే పైచేయి అన్నట్టుగా ఉండే స్వభావం. ఆమె కోపానికి గౌతం అడ్జస్ట్ అయిపోయి “గెలుపు నీదే” అనేవాడు.
హసంతి అంటే సంగీతకి ఎంతో ఇష్టం. “నా కోడలు” అనేది. ఇద్దర్నీ పక్క పక్కన నిలబెట్టి గౌతమ్‌తో “నువ్వు నన్ను ఎలా ఇష్టపడతావో, హసంతిని కూడా అలాగే చూసుకోవాలి. తను ఏది కావాలన్నా తెచ్చివ్వాలి. అది నీ బాధ్యత” అని గౌతమ్ కి చెప్పేది.
ఓ రోజు చంద్రశేఖర్ ఆఫీస్ నుండి వస్తుంటే జరిగిన రోడ్ యాక్సిడెంట్లో స్పాట్లో మరణించాడు. భార్యా పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి అతను వెళ్ళిపోతే..
అది జరిగిన సంవత్సరానికి ఓ రోజు అర్ధరాత్రి సంగీతకి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణాలు వదిలి, రఘురాంని, గౌతమ్ ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది.
రెండేళ్ల తర్వాత..
రఘురాంకి సింగపూర్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. గౌతమ్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే కవిత పిల్లల ఆలనా, పాలనా చూసేవాడు. హసంతి, గీతికల చదువుకు డబ్బు పంపుతూ
‘నేనున్నాన’ని అండగా నిలబడ్డాడు.
గౌతమ్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక, అమెరికాలో జాబ్ రావడంతో వెళ్లిపోయాడు.
సంవత్సరానికోసారి రఘురాం ఇండియా వచ్చేవాడు.
గౌతమ్ షై టైపు. తొందరగా ఎవరితోనూ కలిసేవాడు కాదు. రఘురాం సింగపూర్ వెళ్ళాక తండ్రితో రెండుసార్లే ఇండియాకి వచ్చాడు.
రఘురాం హైదరాబాదులో మంచి పాష్ ఏరియాలో ఇల్లు కట్టుకున్నాడు. గౌతమ్ అమెరికా వెళ్లి మూడేళ్లు అవుతోంది.
ఆరు నెలల క్రితం రఘురాం కి బైపాస్ సర్జరీ చేశారు.
అప్పుడు గౌతమ్ తండ్రితో “ఇద్దరం కలిసి అమెరికాలోనే ఉందాం నాన్నా!” అన్నాడు.
“వద్దు. అయిన వాళ్ళకి దూరంగా ఇన్నేళ్లూ గడిపింది చాలు. నేను ఇండియాలోనే ఉంటాను. నీకూ, హసంతికి మీ అమ్మ కోరిక ప్రకారం పెళ్లి ఏర్పాట్లు చేస్తాను.” అని సింగపూర్ లో జాబ్ వదిలేసి ఇండియా వచ్చేసాడు రఘురాం.
హసంతి ఇంజనీరింగ్ చేసి హైదరాబాదులో డి.ఎల్.ఎఫ్ కాంప్లెక్స్‌లో జెన్ ప్యాక్ కంపెనీలో జాబ్ చేస్తోంది. చిన్నప్పటి నుంచీ తాను ఇష్టపడ్డది దక్కించుకోవాలన్నది ఆమె మనస్తత్వం.
రేపు సాయంత్రం.. గౌతమ్, హసంతి పదేళ్ళ తర్వాత చూసుకోబోతున్నారు. వెళ్లి మనమూ చూద్దాం రండి!
***
ఆ రోజు రాత్రి గౌతమ్ తండ్రితో “డాడీ! రేపు ఉదయం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్దాం” అన్నాడు.
“రేపు సాయంత్రం మనం కవిత అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పాను”
“డాడీ నేను హసంతిని చూడబోయే ముందు, చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను” అన్నాడు
కొడుకు మాట కాదనలేక మర్నాడు ఉదయం కారులో చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి బయలుదేరారు. చిలుకూరు చేరేసరికి 10 గంటలు దాటింది.
“గౌతమ్! ఈసారికి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. మరోసారి వచ్చినప్పుడు ప్రదక్షిణాలు చేద్దువు గాని” అన్నాడు రఘురాం.
“నో డాడ్! చిన్నప్పుడు అమ్మ దేవుడి మొక్కులు పెండింగ్ ఉంచుకోకూడదని చెప్పేది. నేను ప్రదక్షణాలు చేస్తాను” అన్నాడు
గౌతమ్ అమ్మ సెంటిమెంట్ చెప్పేసరికి.. కాదన్లేక “సర్లే! నువ్వు తిరిగి రా! నేను దర్శనం చేసుకొని, నీకోసం వెయిట్ చేస్తుంటాను” అన్నాడు రఘురాం.
ఆరోజు శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది యువతీ యువకులే.
‘వీసా స్వామి కదా! విదేశాలు వెళ్లాలనుకునే యూత్‌ని భలే రప్పించుకుంటున్నాడే’ అనుకొని ప్రదక్షిణాలు మొదలుపెట్టాడు గౌతం. జన సందోహం మధ్య ఒక రౌండ్ తిరిగి రావడానికి ఐదు నిమిషాలు పడుతోంది.
జెట్లాగ్‌తో ఓ పక్క నిద్ర వస్తోంది. అమ్మ చెప్పిన మాటలు గుర్తుంచుకొని.. వేగంగా తిరగటానికి ప్రయత్నిస్తున్నాడు గౌతం. స్పీడ్గా తిరిగినా.. ప్రదక్షిణలు పూర్తి అవ్వడానికి రెండు గంటలు పట్టింది.
చిలుకూరు నుంచి ఇంటికి రావడానికి మరో గంటన్నర పట్టింది.
భోంచేశాక పడుకునేందుకు గదిలోకి వెళ్తున్న ..
“సాయంత్రం కవిత అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పాను. నువ్వు ఐదు గంటలకల్లా నిద్రలేస్తే, మనం బయలుదేరి వెళ్లేసరికి 6:00 అవుతుంది” అన్నాడు రఘురాం.
“సరే” అని వెళ్ళిన గౌతం నిద్రలేచేసరికి రాత్రి 7:00 అయింది. అప్పుడు గబగబా తయారై బయలుదేరారు తండ్రి కొడుకులు.
***
గౌతం వాళ్ళు నాలుగు గంటలకే వస్తారని ఎదురుచూసిన హసంతి, ఆరు గంటలు దాటినా రాకపోయేసరికి విసుగుతో.. పై గదికెళ్ళిపోయింది.
ఏడు గంటల తర్వాత..
గీతిక పైకొచ్చి “అక్కా! వాళ్ళు వచ్చేసారు. నువ్వింకా రెడీ అవ్వలేదా?” మేడ మీద గదిలో కూచున్న హసంతి దగ్గరికి వచ్చి చెప్పింది చెల్లెలు గీతిక.
“వస్తున్నా! నువ్వెళ్ళు”
“రఘురాం మామ, గౌతం వచ్చేశారు. తొందరగా కానీవే బాబూ! లేకపోతే వాళ్లే పైకి వస్తారు. త్వరగా.. త్వరగా..”
హసంతి లైట్‌గా మేకప్ చేసుకుని, చీర, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని, జడేసుకుంటుంటే గీతిక మళ్ళీ వచ్చింది.
“అక్కా! అయ్యిందా? లేకపోతే ..” అనబోతుంటే
“పద” అని లేచింది.
ఇద్దరూ మెట్లు దిగి వస్తుంటే
“కాస్త తలెత్తి కిందకి చూడవే బాబూ! అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో చూడు” అంది.
“చాల్లే ఊరుకో!” అంది కోపంగా
“ఏంటే బాబూ! నువ్వూ, నీ కోపం!”
“అబ్బా! ఏదో అన్నా లేవే.. ఇదిగో చూస్తున్నా.. చూడు” అంది హసంతి.
ఈసారి నిజంగానే కిందికి చూసింది. అంతే! తను చూస్తోంది కలో! నిజమో ఒక్క క్షణం అర్థం కాలేదు హసంతికి.
సోఫాలో అతను, ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఇన్నాళ్లూ అతన్ని దూరంగా చూసిన ఆమె మౌనం మాట్లాడాలని ఉరకలేసింది. బలవంతంగా అదిమిపెట్టి కిందికి వచ్చింది. అతన్ని చూసేసరికి చిన్న తడబాటు. సంబాళించుకుంది. ఇప్పుడు అతన్ని ఇంకా దగ్గరగా చూసింది. మౌనంగా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
‘నాలో నిద్రిస్తున్న మనసు నిన్ను చూడగానే మౌనమైంది. ఎందుకని? నీ మనసుతో మాట్లాడాలని ఆరాటపడుతోంది. ఎందుకని?. నాకు తెలియకుండానే నా వయసు నీతో చెలిమిని కోరుకుంటోంది. ఎందుకని?’ హసంతిలోని భావుకత అస్తవ్యస్తంగా పదాల కోసం వెతుకులాట మొదలు పెట్టింది.
“మావయ్యా! బాగున్నారా!” అంది హసంతి.
“బాగున్నాం కన్నా!”
గౌతం తలెత్తి సూటిగా చూశాడు. అంతే! క్షణాల్లో హసంతి మనసు వాయువేగంతో ఆమె పనిచేస్తున్న డి.ఎల్.ఎఫ్ క్యాంపస్‌కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో రెస్టారెంట్‌కి పరుగులు తీసింది.
(సశేషం)