అలనాటి అపురూపాలు – 207

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సినీ ఉద్దండులు గౌరవించే దిగ్గజం ఆలూరి చక్రపాణి

‘విజయ’ చక్రపాణిగా గుర్తింపు పొందిన శ్రీ ఆలూరి చక్రపాణి అత్యంత కీర్తి ప్రతిష్ఠలు పొందిన సినీనిర్మాత అనడంలో అతిశయోక్తి లేదు. చక్రపాణి అనగానే ‘విజయ’ సంస్థ, ‘విజయ’ అనగానే చక్రపాణి గుర్తొస్తారు. తెలుగు సినీ స్వర్ణయుగం అనబడే కాలంలో ఖ్యాతికెక్కిన సినీ నిర్మాణ సంస్థ ‘విజయ’. నాగిరెడ్డి గారితో పాటు ఆ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు చక్రపాణి. చక్రపాణిని గారిని తలచుకోగానే ‘విజయ’ సంస్థతో బాటుగా గుర్తొచ్చేది ప్రసిద్ధ బాలల పత్రిక ‘చందమామ’. ఈ రెండిటికీ ఆయన ఆత్మలాంటి వారు.

బి. నాగిరెడ్డి, చక్రపాణి – విజయ బ్యానర్ వ్యవస్థాపకులు

చక్రపాణి 05-08-1908న ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి జిల్లా ఐతానగరంలో జన్మించారు. వారి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని రచనలు చేశారు. ఒక హిందీ పాఠశాల బాధ్యతలను స్వీకరించి, కొన్ని హిందీ రచనలను తెలుగులోకి అనువదించారు. ‘చిత్రగుప్త’, ‘వినోదిని’ వంటి పత్రికలకు వ్రాసారు. వ్రజానంద శర్మ సూచన మేరకు ‘చక్రపాణి’ అనే కలం పేరుని స్వీకరించారు.

క్షయవ్యాధికి చికిత్స పొందుతూ మదనపల్లిలోని శానిటోరియంలో ఉన్నప్పుడు చక్రపాణికి బెంగాలీ సాహిత్యం పరిచయం అయింది. శరత్ రచనల వల్ల ఆయన చాలా ప్రభావితమయ్యారు. శరత్ రచనలను తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. ఆయన అనువాదాలు శరత్‌ను తెలుగువారికి ఆత్మీయులుగా మార్చాయి. పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకులు కూడా ఈ అనువాదాలకు ముగ్ధులై ఆయనను మెచ్చుకున్నారు.

ఈ ఫోటోలో వ్యాస రచయిత్రి పేరు ఉన్న చోట – నిలుచున్న వారు పి. పుల్లయ్య. కూర్చున్న వారు చక్రపాణి

చక్రపాణి జీవితం కళలతో నిండి ఉండేది. ఆయన ఎల్లప్పుడూ సాహిత్యం, పత్రికలు, సినిమాలలో లీనమై ఉండేవారు. ‘పాత మంగలి’, ‘అహం బ్రహ్మాస్మి’, ‘కొమ్మ’ మొదలైన కథలను వ్రాసిన ఈ బహుముఖ రచయిత, ‘పనిలేని మంగలి’ పేరుతో సమాజంపై వ్యంగ్య రచనలు చేశారు. పెద్దల కోసం ‘ఆంధ్రజ్యోతి’, పిల్లల కోసం ‘చందమామ’ పత్రికలను వారి అభిరుచులకు అనుగుణంగా నిర్వహించారు. ఆయన 14 భారతీయ భాషలలో ‘చందమామ’ అనే పిల్లల మాసపత్రికను నడిపారు, ఎడిటర్‌గా ఇది ఒక రికార్డు. 1980 నుండి అంధ పాఠకుల కోసం బ్రెయిలీ లిపిలో ఈ పత్రికను నడిపారు. ‘వనిత’, ‘విజయ చిత్ర’ పత్రికలకు కూడా ఆయన సంపాదకత్వం వహించారు. ఈ పత్రికలు కన్నడ, తమిళ భాషలలో కూడా ప్రచురించబడ్డాయి.

ఈ సాహిత్య నేపథ్యంతో ఆయన 1941లో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘ధర్మపత్ని’ (1941) చిత్రానికి కథ, సంభాషణలు రాశారు. వాహిని ఫిలింస్ నిర్మించిన ‘స్వర్గ సీమ’ (1945) చిత్రానికి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు.

బిఎన్‌కె ప్రెస్‌కు యజమానిగా ఉన్న బి.నాగిరెడ్డితో చక్రపాణి స్నేహం పెంచుకున్నారు. నాగిరెడ్డి చక్రపాణి భాగస్వామ్యంతో ఫిల్మ్ స్టూడియోని స్థాపించాలని అనుకున్నారు. వారు ‘విజయ ప్రొడక్షన్స్’ ప్రారంభించి మొదటి చిత్రం ‘షావుకారు’ నిర్మించారు. ‘షావుకారు’ చిత్రానికి చక్రపాణి స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రం ఎటువంటి నాటకీయ సన్నివేశాలు లేకుండా చాలా వాస్తవికంగా చిత్రీకరించబడింది. ఈ చిత్రం విమర్శకులకు నచ్చింది కానీ అంత వాస్తవికతను అంగీకరించలేని ప్రేక్షకులు సినిమాను తిరస్కరించారు. కానీ ‘షావుకారు’ చిత్రం తెలుగు సినిమాలో ఆధునిక పోకడలకు తెరతీసిందని చెప్పవచ్చు. సామాన్యుడు సినిమాల నుండి ఏమి కోరుకుంటున్నాడో చక్రపాణి అర్థం చేసుకున్నారు, భావజాలాన్ని నేరుగా చెప్పడం కంటే వినోదం జోడించి చెప్పాలని గ్రహించారు. ఆ అవగాహనతో, చక్రపాణి తన స్క్రిప్ట్‌లను సరైన విలువలు, వినోదం మేళవించే విధంగా తీర్చిదిద్దడం ద్వారా సినీ దిగ్గజం అయ్యారు, దీని ఫలితమే విజయ బ్యానర్‌లో అనేక రజతోత్సవ చిత్రాలు.

కెమెరా స్టాండ్‌పై మార్కస్ బార్ట్‌లే, వారి పక్క తాతినేని ప్రకాశరావు, తరువాత నృత్య దర్శకులు పసుమర్తి, దర్శకులు ఎల్.వి. ప్రసాద్, మాస్టర్ కుందు, కళాదర్శకులు గోఖలే, నిర్మాత చక్రపాణి, కళాదర్శకులు కళాధర్, పింగళి. (పెళ్ళి చేసి చూడు సినిమాలో ‘ప్రియా ప్రియా’ పాట చిత్రీకరణ సందర్భంగా, 1952)

పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, జగదేక వీరుని కథ, పెళ్ళి చేసి చూడు, అప్పు చేసి పప్పు కూడు, రేచుక్క పగటి చుక్క వంటి సినిమాలు నేటికీ తెలుగులో క్లాసిక్స్‌గా పరిగణించబడతాయి. ఈ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, కథ/స్క్రీన్‍ప్లే కూడా అందించారు చక్రపాణి. తరువాత కాలంలో, వాహిని స్టూడియో యజమాని మూలా నారాయణ స్వామి ఆర్థికపరమైన చిక్కులకు గురవగా, విజయ సంస్థ ఆ స్టూడియోని కొనుగోలు చేసి విజయ స్టూడియోస్ గా మార్చింది.

ఎడమ నుంచి కుడికి కళాదర్శకులు కళాధర్,??, దర్శకులు ఎల్.వి. ప్రసాద్, నిర్మాత చక్రపాణి, ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ట్‌లే (పెళ్ళి చేసి చూడు సినిమా పూర్తయిన సందర్భంగా, 1952)

సినీ పరిశ్రమలో చక్రపాణి తెలివితేటలు అత్యంత విశ్వసనీయమైనవి. సినిమా షూటింగ్ సమయంలో ఆయన క్రమశిక్షణా నియమావళిని ఏర్పాటు చేశారు. నియమాలను ఎవరూ ఉల్లంఘించే ధైర్యం చేయలేదు. చిత్రీకరణకు ఆలస్యంగా వచ్చినందుకు ‘మిస్సమ్మ’ చిత్రం నుండి భానుమతిగారిని వెంటనే తొలగించటం ఇందుకు ఉదాహరణ. తనకి ఎందుకు ఆలస్యమైనందుకు ఆమె కారణాలను వివరించినా, చక్రపాణి అంగీకరించలేదు. ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. అయినప్పటికీ, ఆయన – తను తీసుకున్న ఈ వృత్తిపరమైన నిర్ణయం – భానుమతితో తన వ్యక్తిగత సంబంధాన్ని ప్రభావితం చేయనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన మరణం వరకు ఆమె కుటుంబానికి నిజమైన స్నేహితుడిగా ఉన్నారు. భానుమతి చక్రపాణి ప్రచురణ అయిన ‘యువ’ కోసం వ్రాసేవారు. ఆమె కథలు ‘యువ’ దీపావళి సంచికలలో క్రమం తప్పక వచ్చేవి. నిజానికి, చక్రపాణి ఆలోచన స్ఫూర్తితో భానుమతి ‘రంభా చక్రపాణియం’ అనే వ్యాసం రాశారు. ఇంద్రుడు చక్రపాణి వద్దకు రంభను పంపితే, ఆమెతో ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఈ కథనం యొక్క ఇతివృత్తం. ఈ వ్యాసం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

బి. నాగిరెడ్డి, చక్రపాణి, ఎల్.వి. ప్రసాద్ – ఆ రోజుల్లో ఇండస్ట్రీ పెద్దలు

స్క్రిప్ట్ చర్చల సమయంలో చక్రపాణి చాలా సూటిగా మాట్లాడేవారు. తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సంకోచించేవారు కాదు. దుక్కిపాటి మధుసూదనరావు, బిఎ సుబ్బారావు వంటి దర్శకులు ఆయన మాటలను అంగీకరించేవారు. ఆ కాలం అలాంటిది.

సినీ నిర్మాణం గురించి చక్రపాణి సిద్ధాంతాలు బలమైన దృఢ విశ్వాసంపై ఆధారపడ్డాయి. సినిమాపై వారి అవగాహన, ప్రేక్షకుల నాడిపై వారి పట్టును నిరూపించాయి. ఆయన సూత్రాలలో కొన్ని నేటికీ వర్తిస్తాయి.

  1. విషాదాంత సినిమాలు ఆయనకు నచ్చవు. విలువలతో కూడిన వినోదభరిత సినిమాలంటే ఇష్టం.
  2. తెరపై హీరో ఏడవడం సరికాదనేవారు. ఏ సినిమాకైనా హీరో ‘కనెక్టింగ్ ఫాక్టర్’ అనీ, అతన్ని బలహీనుడిగా చూపించడం వల్ల ప్రేక్షకుల కనెక్టివిటీ దెబ్బతిని, ఆ ప్రభావం సినిమాపై పడుతుందని చక్రపాణి నమ్మకం. అందుకే ఆయన హీరో ఎప్పుడూ తనకెదురైన అడ్డంకులను అధిగమిస్తాడు, కానీ ఎప్పుడూ ఏడవడు.
  3. ఏ సినిమాకైనా సరైన కాస్టింగ్‌ ఉండాలనేది చక్రపాణి నమ్మకం. స్టార్ హీరోతో జోడీ కట్టడానికి కొత్త హీరోయిన్ అయినా పర్వాలేదు కానీ, ప్రేక్షకులు అంత తేలిగ్గా అంగీకరించరు కాబట్టి కొత్త హీరో అయినా స్టార్ హీరోయిన్‌తో జోడీ కట్టకూడదని చెప్పేవారు. ప్రధాన పాత్రలను ప్రముఖ నటులే పోషించాలని విశ్వసించేవారు. సినిమాలోకి నాయికానాయకులకు ఏదో ఒక సమయంలో కొంత సంబంధం ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తారని, ఆ సమయంలో ఆ పాత్రల మధ్య సంఘర్షణలను చూపించడానికి దర్శకుడికి తగినంత సమయం ఉంటుందని చక్రపాణి విశ్వసిస్తారు. ఫలితంగా ప్రేక్షకులు కథలో లోనమవుతారు. నిజంగా ఇది ఓ బలమైన నమ్మకం.
  4. ఆయనకి హాస్యంపై ఉన్న అవగాహన ప్రశంసనీయమైనది. తరువాతి తరాలకు అందించవలసిన పాఠం అది. కామెడీ చేస్తున్నప్పుడు సస్పెన్స్ ఉండకూడదని అనేవారు. ఉదాహరణకు ‘మిస్సమ్మ’లో సావిత్రి పాత్రను పరిచయం చేస్తున్నప్పుడు, సావిత్రి పాదాలపై ఉన్న పుట్టుమచ్చని ప్రధానంగా చూపించి, తరువాత ఆమెని చూపిస్తారు. ఆ ఒక్క షాట్ ప్రేక్షకులకు ఆమె ఎస్వీ రంగారావుగారి తప్పిపోయిన కూతురేనని చెబుతుంది. కానీ ఆ వాస్తవం తెరపై ఉన్న పాత్రలకు తెలియదు. హాస్య సన్నివేశాలు, సంభాషణలు క్లైమాక్స్‌కి దారితీస్తాయి. అంతిమ ఫలితం ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఉంది. ‘మిస్సమ్మ’ సినిమా రూపొందించిన ప్రతి భాషలో కాలాతీత క్లాసిక్‌గా నిలిచింది. తమిళంలో ‘మిస్సియమ్మ’, హిందీలో ‘మిస్ మేరీ’గా తీసారు.
  5. ఒకసారి మేకప్ మ్యాన్ ఆయన వద్దకు వచ్చి, ఎన్టీఆర్‍కి అద్భుతంగా మేకప్ చేశానని, అందులో ఆయనను అంత తేలిగ్గా గుర్తించలేనని గర్వంగా చెప్పారట. వెంటనే చక్రపాణి ‘వేషధారణ అనేది తెరపై పాత్రలకే తప్ప ప్రేక్షకులకు కాదు. తెరపై చూస్తున్నది ఎన్టీఆర్ అని ప్రేక్షకులు గుర్తించలేకపోతే ఎన్టీఆర్ నటించాల్సిన అవసరం లేదు’ అని అన్నారట.
  6. గుండమ్మ కథ షూటింగ్ సమయంలో రేలంగి చక్రపాణి వద్దకు వచ్చి తనకు సినిమాలో నటించే అవకాశం రాలేదని వాపోయారట. ఆ సినిమాలో హాస్య పాత్రలు లేవని చక్రపాణి చెప్తే, బదులుగా రేలంగి ‘రమణా రెడ్డి చేసే పాత్రని నేను సులువుగా చేయగలన’ని అన్నారట. చక్రపాణి అప్పుడు చాలా సీరియస్ అయ్యి, “నువ్వు చేస్తావు, కానీ జనాలు చూడరు” అని చెప్పి వెళ్లిపోయారట. ఈ ఒక్క సంఘటన చాలు, చక్రపాణి తన సినిమాకి సరైన కాస్టింగ్‌కి ఇచ్చిన ప్రాముఖ్యతను సమర్థించడానికి.

విజయా వారి ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన బాపు – షూటింగ్‌ని పర్యవేక్షించడానికి చక్రపాణి జీవించిలేరని బాధపడ్డారు. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ గొప్ప చిత్రంగా పరిగణించబడుతున్నప్పటికీ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. చక్రపాణి పట్ల ఉన్న గౌరవంతో, ఈ చిత్రానికి దర్శకుడిగా వారి పేరు వేశారు.

చక్రపాణి 1975 సెప్టెంబరు 24న తుది శ్వాస విడిచారు. చక్రపాణి మరణంతో నాగిరెడ్డి విజయ సంస్థ ఇకపై సినిమా నిర్మించదని ప్రకటించి బ్యానర్‌ను మూసేశారు. రెండు దశాబ్దాల తరువాత ఈ బ్యానర్‍ని ‘విజయ చందమామ పిక్చర్స్’ పేరుతో తాత్కాలికంగా పునరుద్ధరించి ‘బృందావనం’, ‘భైరవ ద్వీపం’ వంటి సినిమాలు అందించారు.

సినీ దిగ్గజంగా చక్రపాణి – తరతరాల చలనచిత్ర నిర్మాతలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. వారి మేధస్సుకి సంబంధించిన కథలు నేటి చలనచిత్ర నిర్మాతలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here