మానసిక ఆరోగ్యం ప్రాధాన్యంపై వెలుగు ప్రసరించే నవల ‘మార్పు మన(సు)తోనే మొదలు’

2
3

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ‘మార్పు మన(సు)తోనే మొదలు’ నవలపై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]మా[/dropcap]నసిక అనారోగ్యాలపై అనేక అపోహలున్న సమాజం మనది. ఏదైనా మానసిక సమస్య ఎదురైనా, మానసిక వైద్యుల వద్దకో, మానసిక నిపుణుల వద్దకో వెళ్ళక, అసలు తమకేమీ సమస్య లేనట్టు, తాము సంపూర్ణ ఆరోగ్యవంతులమన్నట్టు భ్రమిస్తారు కొందరు. తమ కుటుంబాలలో అలాంటి సమస్యను ఎదుర్కుంటున్న వ్యక్తులెవరైనా ఉంటే, గుట్టుగా ఉంచేస్తారు ఇంకొందరు. సొంత వైద్యమో, చిట్కా వైద్యమో, పూజలో, భూతవైద్యమో చేయిస్తారు మరికొందరు.

ఈ నేపథ్యంలో కొన్ని రకాల మానసిక సమస్యలను, వాటి లక్షణాలను, ఆ సమస్యలను ఎదుర్కుంటున్న వ్యక్తుల ప్రవర్తననూ ప్రదర్శిస్తూ ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే చక్కని నవలని అందించారు డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి.

భారతీయ రైల్వేలలో ఉన్నతాధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రవృత్తిగా రచనలు చేసే సూర్య లక్ష్మి గారి రెండవ నవల ఇది. ఈ నవల 22 జనవరి 2023 నుంచి 28 మే 2023 వరకూ సంచిక వెబ్ పత్రికలో 19 వారాల పాటు ధారావాహికంగా ప్రచురితమైంది. జనవరి 2024లో శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ వారి ద్వారా పుస్తక రూపంలో వెలువడింది.

నవలలోని ప్రధాన పాత్ర డా. గగన్ డిఎంహెచ్‌పి (జిల్లా మానసికారోగ్య కార్యక్రమం) లో మానసిక వైద్యులు. ప్రభుత్వం తనకి అప్పజెప్పిన ఒక్కో ఔట్‌రీచ్‌కి వెళ్ళి అక్కడి మానసిక రోగులకి మందులు ఇవ్వడం, వారిని పరిశీలించడం, కౌన్సిలింగ్ చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అవసరమైన సందర్భాలలో క్లినికల్ సైకాలజీలో ఎం.ఫిల్ చేసిన భార్య పూర్ణిమ సహాయం తీసుకుంటాడు.

ఒక్కో రకం మానసిక సమస్యతో బాధపడే ఒక్కో పాత్రని తీసుకుని ఆ సమస్యల వల్ల అటువంటి వ్యక్తులు ప్రవర్తించే తీరు, కుటుంబం ఎదుర్కునే ఇబ్బందులు ప్రసావించి, వాటికి తగిన చికిత్స చేసి, మామూలు మనుషులను చేయడం నవల సారాంశం.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ఆక్టివ్ డిసార్డర్ (ఏ‌డీహెచ్‌డీ)తో బాధపడే ఆనంద్, మెనోపాజ్ దగ్గర పడుతుండగా మూడ్ స్వింగ్స్ ఏర్పడి భర్తతో అనవసర వాదన పెట్టుకునే సుధ, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌‌కి లోనైన మంజుల, తీవ్రమైన స్కిజోఫ్రేనియాతో బాధపడే ప్రభాత్, మెంటల్ రిటార్డేషన్‍కి గురైన జమీందారీ వంశస్థుడు చిన భూపతి, అడిక్షన్‍కి బానిసైన నిరూప్, ‘సూపర్ ఉమన్ సిండ్రోమ్’తో బాధపడే పర్ఫెక్షనిస్ట్ అమిత, భర్త మరణాన్ని తట్టుకోలేక, తామూ చనిపోవాలని పిల్లలకి ఎండ్రిన్ కలిపిన అన్నం పెట్టి చంపి, అప్పుడే అన్న వచ్చి హాస్పిటల్‍కి తీసుకువెళ్ళడంతో తాను మాత్రం బతికిపోయి మానసిక వ్యథకి లోనయిన కామాక్షి, ఆబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‍తో బాధపడే స్వయంప్రకాష్, క్లినికల్ డిప్రెషన్‍కి గురైన మృగనయని – మొదలైన వారికి చికిత్స చేసి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తాడు డా. గగన్.

ఇన్‍స్పెక్టర్ భరత్, అడ్వొకేట్ జాయ్, బాల్యం నుంచి మానసిక వ్యాధులను గుర్తించి, చికిత్స చేయించాలనే తపనతో స్వచ్ఛంద సంస్థని స్థాపించిన దివిజ్, మెరుగైన సమాజం కోరుకున్న ప్రమీల, సేవా సంస్థలో పని చేసి పలువురికి మేలు చేయాలనుకున్న అనామిక, మానసిక సేవిక మల్లిక, గగన్ పూర్ణిమ దంపతుల కుమారుడు శశాంక్ – తదితరులు సహాయక పాత్రలుగా కథని ముందుకు నడిపిస్తారు.

ఈ పాత్రలన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని నవలకి అవసరమైన రీడబిలిటీని కల్పించాయి. ఆయా సమస్యలను/బాధితుల ప్రవర్తనను సంభాషణల రూపంలో చెప్పడం వల్ల – రచయిత్రి చెప్తున్నట్టుగా కాక పాత్రలు ఇంటరాక్టివ్‍గా ఉన్నట్లు ఉండి పాఠకులు కథాగమనంలో లీనమవుతారు.

కథాలో భాగంగా ఒకప్పుడు బై-పోలార్ డిజార్డర్‌తో బాధపడి – దాన్నుంచి బయటపడిన త్రయంబకేశ్వర్ అనే ఆయన అనుభవాలు చెప్తారు రచయిత్రి. అలాగే సంఘ సేవిక గీతా ఇళంగోవన్ కృషిని సంక్షిప్తంగా చెప్తారు. అది చదివిన పాఠకులకు గీత గారి గురించి ఇంకా తెలుకోవాలనిపిస్తుంది.

దాదాపు 25 ఏళ్ళ పాటు సాగిన ఈ కథాకాలంలో సమాజంలోని మార్పులను కూడా రచయిత్రి ప్రస్తావిస్తారు. గ్లోబలైజేషన్ భావజాలం పెరిగి, అమెరికాలోని కార్పోరేట్ సంస్థలో ఉన్నత ఉద్యోగం సాధించి, rat race లో ఇరుక్కుపోయిన దివిజ్, సూపర్ ఉమన్ అనే టాగ్ తగిలించబడి గొడ్డు చాకిరీ చేసిన అమితల గురించి చెప్పినప్పుడు కార్పోరేట్ సంస్థల వ్యవహారశైలిని – ఆధునిక వృత్తి జీవితపు ఒరవడులను ప్రస్తావించడం; కరోనా ప్రస్తావన, జూమ్ మీటింగ్స్, వాట్సప్ గ్రూపులు, స్పిరిచువల్ యాప్స్ వంటివి ప్రస్తావించడం నవల నేటి కాలానికి వర్తించేలా చేశాయి.

నవలలో ఒకచోట సందర్భోచితంగా – ‘డియర్ జిందగీ’ సినిమా (2016)లోని – ‘బాధ తెప్పించే మన గతాన్ని వర్తమానంలో మనల్ని బ్లాక్‌మెయిల్ చెయ్యనిస్తే, మన బంగారు భవిష్యత్తు మన చేజారిపోతుంద’ని షారూఖ్ ఖాన్ డైలాగ్‍ని ఉపయోగించడం చాలా బావుంది.

నవలలోని కొన్ని పాత్రలకు రచయిత్రి పెట్టిన పేర్లు విశిష్టంగా ఉన్నాయి. కొన్ని పాత్రలకు – అవ్యక్తంగా ఆ పాత్ర స్వభావం పేరు ద్వారా వెల్లడవడం బావుంది.

సాధారణ నవలకు భిన్నమైన ఇతివృత్తం తీసుకున్నప్పటికీ, సరళమైన శైలిలో రచించి, medical parlance లోని పదాలను వాడినప్పుడు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ.. సానుకూల దృక్పథం నుంచి దూరం కాకుండా, ఈ నవల ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని సాధించారు రచయిత్రి అని పాఠకులు భావిస్తారు.

మానసిక సమస్యలను ఎదుర్కునే వ్యక్తులకు చికిత్స నందించే సమయంలో వైద్యుడితో పాటు కుటుంబ సభ్యులకు ఎంత ఓపిక అవసరమో, నిబ్బరం కోల్పోకుండా రోగికి సహకరించడం ఎంత కీలకమో ఈ నవల చదివితే అర్థమవుతుంది. మానసిక రుగ్మత నుండి కోలుకున్నాకా, వారిని హేళన చేయడం కానీ, మెంటల్ అని వెక్కిరించడం కానీ ఎందుకు చేయకూడదో ఓ పాత్ర ద్వారా చెప్పినప్పుడు, రచయిత్రిలో పాఠకులు ఏకీభవిస్తారు. మార్పు మనతోనే అని సంబంధిత వ్యక్తులు భావించినప్పుడు మానసిక రుగ్మతలున్న వ్యక్తుల చికిత్స విజయవంతమవుతుందంటారు రచయిత్రి.

నవల ముగించాకా, చివర్లో “ఎవరికైనా మానసిక అనారోగ్యపు లక్షణాలు కనిపిస్తే, అవి లేనట్టు భ్రమపడో, సొంత వైద్యానికి పాల్పడో, ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా, మానసిక వైద్యులని సంప్రదించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను” అన్న సూచన చేశారు రచయిత్రి.

మనసు మారనిదే మనిషి మారడని చెప్పిన ఈ నవల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంది. సమాజానికి ఉపయుక్తమైన నవలని అందించినందుకు రచయిత్రికి అభినందనలు.

***

మార్పు మన(సు)తోనే మొదలు (నవల)
రచన: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్
పేజీలు: 174
వెల: ₹126/-.
ప్రతులకు:
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, (ఎస్ఆర్ పబ్లికేషన్స్),
దిట్టకవి రాఘవేంద్ర రావు వీధి,
ఇన్నర్ రింగ్ రోడ్డు, అంబాపురం,
విజయవాడ. Cell: 9849181712, 8464055559
~
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్,
నల్లకుంట, హైదరాబాద్. 9032428516
ఆన్‍లైన్‌లో ఆర్డర్ చేసేందుకు:
https://srpublications.in/product_view.php?bt=MAARUPUMANASUTHONEMODALU
~
ఫిబ్రవరి 19 వరకు జరిగే 36వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (ఎన్.టి.ఆర్. స్టేడియం) లో శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ వారి స్టాల్ నెం 155లో ఈ నవల లభ్యమవుతుంది.

~

‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవల రచించిన డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-dr-chellapilla-surya-lakshmi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here