[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మసకలీ మనసులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సూ[/dropcap]ర్యోదయం మొదలు ఎన్నో ఆలోచనలు. మనసుకి ఆనందం కొన్ని, ఆవేదన కొన్ని! అదో మాయాజాలము. మనసు చేసే మాయ ఎవరికీ అంతు చిక్కదు, ఎవరికీ దొరకదు.
నేటి బంధుత్వాలు, పెళ్ళిళ్ళు ఇలాగే ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నప్పుడు అన్నదమ్ముల ప్రేమ, పెద్దప్పుడు అక్కచెల్లెళ్ళ ప్రేమ ఉంటుంది. ఆడపిల్లల మగ పిల్లల ప్రేమ, అన్నాచెల్లెలి ప్రేమ వాళ్ల పెళ్లిళ్లలో పిల్లల ఎదుగుదలతో మారిపోతాయి. నా పిల్లలు అంతా గొప్ప అంటే నా పిల్లలు అంతా గొప్ప అంటూ కుటుంబాలలో కలహాలు తలెత్తుతాయి.
అందుకే మనిషి జీవితం చిత్ర విచిత్ర గతిని నడుస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లు సాగవు కొందరికి. పుట్టిన వెంటనే అది అవ్వాలి ఇది అవ్వాలి అంటు మైండ్ సెట్ చేసి ఉంచుతారు. అది ఎదిగిన తరువాత అల జరుగవచ్చును జరుగక పోవచ్చును.
డాక్టర్ చదివించాలని ఆశ పడతారు కానీ యాక్టర్ అయ్యాము అంటూ నవ్వుతూ చెపుతారు. డాక్టర్ కన్న యాక్టర్‌కి ఎక్కువ సంపాదన ఉంటుంది. డబ్బుతోనేగా జీవితం.
కొందరు అదే జీవితం అంటూ, అది జరగకపోతే మానసిక ఒత్తిడి తెచ్చుకుంటారు. అంత బెంగ దేనికి? ఏది ప్రాప్తం ఉంటే అది జరుగుతుంది అంతే కానీ జరిగిన గతాన్ని తెచ్చుకుని భవిష్యత్తుని బెంగ పాలు పడకుండా చూసుకోవాలి. జీవితం ముఖ్యం అంతేకాని ఎప్పుడో ఊహించిన విషయాలు తలచుకుంటూ భవిష్యత్తుని సమస్యల పాలు చేసుకోవద్దు. మనిషి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అనుకోవడం కాదు అటు ఇటు జారుగా వచ్చును. అందిన వస్తువును అందుకొని జీవితాన్ని ఆనందంగా గడపాలి. అందివచ్చిన అవకాశాలతో ముందుకు వెళ్లేలా చూసుకోవాలి.
***
వైజయంతి శ్రీ చాలా సున్నితంగా, అందంగా ఉంటుంది. ఆమెను మొదట మేనత్త కొడుక్కి చెయ్యాలని నాన్నమ్మ పట్టుపట్టింది. అయితే వాళ్ళు కట్నంపై ఆశ ఎక్కువ చూపారు. ఐదు ఎకరాలు ఇచ్చి పిల్లకి మేము మీరు కలిపి పెట్టినట్లుగా నగల సెట్లు పెట్టండి, ఏదైనా మీ అమ్మాయికే కదా అన్నారు. వంక ఏ విధంగా పెట్టలేక, ఇలా డబ్బు వైపు మళ్ళారు.
వైజయంతి శ్రీ తండ్రి అక్క చేసే కట్నం బేరం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంటి ఆడపడుచుగా అప్పుడు చాలా పెట్టారు. పెద్ద కూతురు కనుక అన్ని పెట్టుబడులు ఎక్కువ ఇచ్చారు. పిల్లలు కాలేజ్‍కి వచ్చేవరకు పోషించారు. ఇంకా ఎంతకాలం? తరువాత నలుగురు ఆడపిల్లలకి అన్నదమ్ముల పెళ్ళిళ్ళు అన్ని కలిసి పాతిక ఎకరాలు కరిగిపోయాయి.
కూచుని తినేవారు ఎక్కువ, కబుర్లు చెప్పేవారు ఎక్కువ. కానీ సంపాదన తెచ్చేవారు అంతంత మాత్రం. తక్కువ పండింది అంటూ కౌలు రైతు చెపుతాడు. సొంత వ్యవసాయం చెయ్యడం కష్టం. తిండి గింజలకి మాత్రం కొన్ని ఎకరాలు కృష్ణ కాటుక బియ్యం కొన్ని, సోనా మసూరు మరికొంత ఎకరాలలో వేసి పండిస్తారు.
వైజయంతి శ్రీ వేంకటేశ్వర రావు పెద్దకూతురు. డిగ్రీతో పెళ్లి చెయ్యాలని ఆశ. పెద్ద పిల్లకి అయిన సంబంధాలు చేస్తే మంచిది, పెద్ద అల్లుడు చేతికి అంది వస్తాడని ఆశపడ్డాడు. రక్తబంధం, పేగు బంధం వదిలి పెనిమిటి బంధం లోకి ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేటప్పడు ఎన్నో ఆలోచించుకోవాలి పిల్ల, పిల్ల తల్లి తండ్రులు.
పెళ్లి కుదిరింది అంటూ సంతోష పడటం కాదు పెళ్లి అయ్యక ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. భవిష్యత్తు అంతా బాగుండాలి. తల్లి తండ్రి గారంగా పెంచి ఇరవై ఏళ్ళు రాగానే కిందా మీదా పడి పెళ్లి కానివ్వాలి అనే బాధ్యతతో, ఎంతో వ్యథతో సతమతమవుతున్న పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంటున్నది.
భవిష్యత్తు మన చేతిలోనే ఉన్నది. గతం కరిగిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మంచిది కాదు అంటూ వెక్కిరించేవారు ఉన్నారు. మేము చెప్పాం, ఎందరి చేతో మీ వాళ్ళకి చెప్పించాలని ఎన్నో విధాలుగా తంటాలు పడ్డాము, ఏం లాభము మీరు వినలేదు. రాసి పెట్టి ఉంటే అవుతుంది అంటూ మెట్ట వేదాంతం చెప్తారు. కానీ భవిషత్తు ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది దాన్ని మంచి ఆలోచనలతో ఆనందంగా మలచుకోవాలి అది మీ చేతిలోనే అపూర్వంగా ఉన్నది. భవిత ఆశాజనకంగా మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని ఆధారంగా అపూర్వంగా అద్భుత భావాలతో అమృత తుల్యంగా మార్చుకోవాలి.
మనుష్యులు ధన అహంకారంతో బంధువులను, రక్త సంబంధాలను వదులుకొని ఆర్థిక బంధాలతో కుటుంబాన్ని వదిలి డబ్బుకోసం దూర దేశాలకు వెళ్లి పోయి తిరిగి వెనక్కి చూస్తే ఏముంటుంది? కరుడు గట్టిన హృదయంతో
కుటుంబాల మధ్య జీవితాల్లో లక్షలు కోట్లు అంటూ కక్షలు కార్పణ్యాలతో గడిపేస్తూ ఎన్నో గొప్పలు చెపుతూ జీవితాలు వెళ్ళదీస్తున్నారు.
మేము విదేశాల్లో పెళ్ళిళ్ళు చేసికొని హాయిగా ఉన్నాము, మీరు మాత్రం సలహాలు సూచనలు మావి పాటించక – శాఖలు అంటూ కట్నాలు తక్కువ ఇచ్చి మీ పిల్లల్ని నష్ట పెట్టుకొని, కష్ట పెట్టుకుని జీవిస్తున్నారు ఏంటి? మీ పద్దతి బాగా లేదు అంటూ విదేశాల నుంచి విమర్శలు చేసే బంధువులు ఉన్నారు కూడా. అలా అయితే ఎలా చెప్పండి?
బాల్యం అంతా అక్కడే గడిపిన మామయ్య పెళ్లికి పిల్లలు పనికి రాలేదు చదువు తక్కువ, హై సొసైటీలో పనికి రారు అన్నారు. వేరే విదేశీ సంబంధాలు ముక్కు మొఖం మూతి జాతి తెలియని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. విదేశాలకి వెళ్ళిన మేనల్లుడు వైజయంతి శ్రీ ని చేసుకుంటే ఎంత కలిసి వస్తుంది మావయ్య ఆస్తి? ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. పెద్ద అల్లుడు అంటే ఇంటికి పెద్ద కొడుకు లాంటి దిక్కు కదా మరి. ఎక్కువ ఇస్తే మంచిది అన్నాడు.
వేంకటేశ్వర రావు వెళ్లి అక్కను అడిగినా ఇంటిల్లి పాదికి అదే ఉద్దేశం అని అంటున్నారు. వెళ్లి అడుగు అంటూ అక్క సాగదీసింది.
మనుషుల మధ్య వినయం, ప్రేమ లేదు. అన్నగారు అయినా తమ్ముడు అయినా ఒక తల్లి కడుపున పుట్టారు కదా అనుకోరు. పెళ్లి తరువాత వారు స్టేటస్ అంచనా వేస్తారు.
“నాన్నా, నువ్వు బాధ పడకు. అది జరుగక తప్పితే వేరే మంచి సంబంధం మనకి వస్తుంది. ఊరికే బెంగతో నీ ఆరోగ్యం పాడుచేసుకోకు” అన్నది వైజయంతి.
వేంకటేశ్వర రావు రెండో కొడుకుకి మెడిసిన్ సీటు వచ్చింది. పెద్ద కొడుకు శ్రావణ శర్మ డిగ్రీ అవగానే కంప్యూటర్ వర్క్ నేర్చుకుని, ‘ఇక్కడ ఉంటే విలువ లేదు ఈ లోగా కొంత సంపాదించాలి’ అనుకుని గల్ఫ్ వెళ్ళాడు. పెళ్లి చేసుకో అంటే చెల్లెలు పెళ్లి అవ్వాలి అంటాడు. అయినా సంబంధాలు ఏమి లేవు వాడికి. పై సంబంధం చెయ్యాలి. అక్కల చెల్లెళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు. అయినా ఇప్పుడు రక్త సంబంధాలు వద్దు అనుకున్నారు.
ఎప్పుడు అయితే వైజయంతి శ్రీని చిన్నప్పటి నుంచి అనుకుని డబ్బు కోసం వద్దు అన్నారో, పెద్ద కొడుకుని ఇండియాకి రారా అంటే ఇప్పుడు కాదు అంటున్నాడు.
చెల్లి పెళ్లి కుదిరే దాకా గల్ఫ్ నుంచి సెలవు పెట్టి రాను, ముందు చెల్లెలి పెళ్లి చూడండి అంటాడు శ్రావణ శర్మ.
వేంకటేశ్వర రావు రెండో అక్క కొడుకు బికామ్ చదువుకుని తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ అక్క ఇంటికి వచ్చి డైరెక్ట్‌గా వైజయంతి శ్రీ ని తన కొడుక్కి చెయ్యమని అడిగింది.
“అది అమ్మ పోలిక, అందంగా ఉంటుంది. చదువులో సరస్వతి. ఇద్దరు డిగ్రీయే కదా. నాకు ఉద్యోగం అవసరం లేదు. ఇంట్లో వంట మనిషి ఉన్నది, పాలేర్లు ఉన్నారు. నా ఇంటికి రాగానే బంగారు తాళం చెవుల గుత్తి దానికి ఇస్తాను, మేఖల మాదిరి వడ్డాణం కింద పెట్టుకోవచ్చు. అన్ని పట్టు చీరలు. నగలు కావాల్సినవి పెడతాను. ఊరికే పిల్లని, కొబ్బరిబొండాం ఇయ్యి చాలు” అని వారం రోజులు సూక్తి ముక్తావళి బోధించింది.
వేంకటేశ్వర రావు రెండో పిల్ల గడసరిది. “అక్క కంప్యూటర్ వర్క్ నేర్చుకుని సొంతగా డిజైన్ సెంటర్ పెట్టాలి అనుకుంటోంది, మరి మీరు ఒప్పుకుంటారా?” అని అడిగింది.
“అది చిన్న ఊరు, పల్లెటూరు కనుక బాగుండదు. బిజినెస్ చేస్తే ఫలనా వారి కోడలు అంటారు, మీ మావయ్యకి పరువు తక్కువ. వద్దు” అన్నది మేనత్త.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “నాకు కట్నం వద్దు అన్నాను కదా! పిల్లాడికి ముచ్చట కోసం వెండి కంచం, డిన్నర్ ప్లేట్స్, ఆరు కప్పులు చెంచాలు, మంచి నీళ్ళ గ్లాసులు ఉండాలి. జగ్ కూడా పెట్టాలి. పిల్లకి ఎలాగ నగలు పెడతారు కదా! మంచి పట్టు చీరలు కావాలి” అన్నదామె.
“అవును అత్తా! నీ స్టేటస్ నాకు తెలుసు కదా” అంది మేనకోడలు.
***
వేంకటేశ్వరరావు ఆలోచనలలో లీనమయ్యాడు.
పేగు బంధం పెనిమిటి బంధంగా మారేయి. పుట్టింటి రక్త సంబంధం అత్తింటి ఆదరణ బంధంగా మారేయి. హార్దిక బంధాలు ఆర్థిక బంధాలుగా మారాయి. పిల్లల బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగం ఇవన్నీ కూడా ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. బందువులు, బంధాలు, వెక్కిరింతలు విమర్శలు బంధాలు తప్ప ఆత్మీయతలు ఆదరణ లేదు.
ఎవరిది వాళ్ళు తింటున్నా, ఏదో రకంగా విశ్లేషణలు, వింత పోకడలు!
బాల్యంలో అమ్మ నాన్న వెంట పెరిగి – పెళ్లి తరువాత అత్త ఇంట ఒదిగి – పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళు అయ్యాక వారివెంట విదేశాలకు పరుగు! వృద్ధాప్యంలో ఒంటరిగా సమాజ సేవ గురించి అలోచనలే!
మిగిలి గతం అంతా కలలుగా జ్ఞాపకాలు!
***
వేంకటేశ్వర రావు తమ్ముడు భుజంగ రావుకి ఒక్క కూతురు. ఆలోచించి ఆలోచించి బాగా ఎప్పటి నుంచో తెలుసున్న వాడు ఒక్కడే కొడుకు అంటూ పెళ్లి చేశాడు.
అయితే తల్లి తండ్రి బాధ్యతగా అల్లుడికి ఇష్టమే. ఎంతో తెలివిగా “నువ్వు మీ అమ్మానాన్న దగ్గర ఉండు. ఒకే ఊరు కాకపోయిన నేను వచ్చి చూస్తాను. వాళ్ళు ముఖ్యం” అంటూ షుగర్ కోటెడ్ మందు బిళ్ళ సమాధానం చెపుతాడు. అక్కడ తల్లికి పెళ్ళికాని చెల్లెలికి భార్య అడ్డం అని వారి ఉద్దేశం. సత్రవు మాదిరి అక్కడ ఇల్లు నడుపుతారు. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు! నా వాళ్ళు నీ వాళ్ళు అంటాడు.
భుజంగ రావుకి విసుగు వచ్చి కూతుర్ని తమ దగ్గరే ఉంచుకుని బాగోగులు చూస్తున్నాడు. అల్లుడి చెళ్ళల్లకి పెళ్లి అయితే కానీ ఈ పిల్లని తీసుకు వెళ్ళడు. మంచి సంబంధం వదిలితే ఎలా అంటూ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడేమో అతి తెలివి బురిడీ కబుర్లు చెపుతూ ఉంటారు. ఇదో రకం జీవితం!
***
చిన్న కూతురితో బాబాయి సమస్య గురించి చెప్పి, పెళ్ళిళ్ళ గురించి చెబుతున్నాడు వేంకటేశ్వర రావు.
“కుటుంబంలో భార్య చెప్పిన మాట వినాలి. తల్లి ఎలా అంటే అలా చెయ్యాలి. ఇంట్లో అందరి మెప్పు కావాలి. అంతే కానీ ఇంట్లో భార్య భర్త ప్రేమ అడగకూడదంటే ఎలా? ఇది చూసి పెళ్లంటే భయమే కదా! పుట్టింట గారంగా పెరిగి చదువుకుంటారు. అయినా పని రావాలి, ఆడపిల్లకి అంటూ సాగదీసి మరి చెపుతారు. ఆధునిక శైలి డిస్పోజబుల్‌గా ఉండి అన్ని కొని, నచ్చినవి అన్ని తెచ్చి తినడం అలవాటైపోయిది జనాలకి. వండి తినడం పోయి కొనుక్కొని వచ్చి తిని పారేసే వస్తువులు ఎక్కువ ఉన్నాయి. నేటి మానవ జీవితంలో నవ విధానాల ప్రకారం అంతా ఆర్థిక బంధాలే, హార్దిక బంధాలు లేవు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య కూడ ఇదే బంధాలు! ఇంక స్నేహంలో అయితే వాళ్ల స్టేటస్ బట్టి కలుపుకునే స్నేహం ఉంటోంది. అలా కలుపుకుంటున్న విషయం తెలుుకోవడానికి కూడా సమయం పడుతుంది” అన్నాడు.
“అవును నాన్నా” అన్నది జయశ్రీ, వేంకటేశ్వర రావు చిన్న కూతురు.
“నేడు చిన్న ఫంక్షన్ కూడా ఈవెంట్ వారిని పిలిచి ఘనంగా చేస్తున్నారు. అందరు బట్టలు కట్టుకుని బుట్ట బొమ్మల్లా ఇల్లంతా తిరుగుతూ హాయిగా తింటూ కబుర్లు చెప్పుకోవడం స్టైల్. పుట్టినరోజు, పెళ్లి రోజు అన్ని ఇలానే. పెళ్లి అయితే ఇక సరే సరి. మామూలుగానే పాష్‌గా ఉంటున్నాయి” అన్నాడు.
“అవును మనం ఇంకా పాతవారి లాగానే ఉన్నాము నాన్నా. బావ విదేశాలు వెళ్లి వచ్చాడు అందుకే నచ్చలేదు” అంది జయశ్రీ.
అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్నారు, చిన్న మేనత్త, వైజయంతీ శ్రీ.
“అవును చెల్లి. చెప్పేదేముందీ! ఇక విదేశీ పెళ్ళి వారు అయితే చెప్పనవసరం లేదు. ఆకాశం అంతా నేల మీదికి వచ్చిందా అన్నట్లు దీపాల అలంకారాలు ఎంతో ఘనంగా ఉంటున్నాయి. స్తోమత ఉన్నా లేక పోయినా రక రకాల అలంకారాలు డాబుసరిగా ఉంటున్నాయి. మనుషుల్లో అహంభావం ఎక్కువ తప్ప ఆప్యాయత లేదు. వీరిని చూసి సామాన్యులు కూడా అదే పద్ధతిలో ఉన్నారు” అంది వైజయంతి.
“అవును నాన్నా. అక్క చెప్పింది నిజమే. అలాగే ఉంటున్నారు. మా గురించి ఈ వీధిలో ఎవర్ని అడిగినా గొప్పగా చెపుతారు, మా అంతటి మంచి వారు లేరు అటూ గొప్పలు చెపుతున్నారు. ఇదో పెద్ద గొప్ప విషయమని భావిస్తున్నరు. వంటలు పంచి పెట్టుకుని మంచి పేరు అనుకుంటున్నారు, వెనకాల వాళ్ళని విమర్శిస్తున్నారు” అంది జయశ్రీ.
జయంతి శ్రీ ఎన్నో వివరాలు చెపుతుంది, ఆమె తరచూ ఫంక్షన్స్‌కు వెడుతుంది.
“ఆధునిక జీవన శైలిలో ఇది నేడు అందరు ఆచరిస్తున్న పద్ధతిగా మారింది. హంగులు ఆర్భాటాలు ఎక్కువ. జీవన సరళిలో అన్ని తిప్పలు అంటూ తప్పులు చేస్తూ జీవితంలో పరుగులు పెడుతూ ఆశకు లోబడి ఆశయాలు ప్రక్కన పెట్టడం నేటి లక్ష్యంగా మిగిలింది. న్యూ వేవ్ అంటు పరుగులు తియ్యడమే పరమావధి అయ్యింది. ముఖ్యంగా నేటి యూత్ సంగతి చెప్పాలి అంటే అసలు అంతే లేదు కదా” అంది జయశ్రీ.
“ఇలా తండ్రి కూతుళ్లు చెప్పుకుంటే పెళ్లి ఎప్పుడు చేస్తారు?” అంటూ వేంకటేశ్వర రావు అక్క నవ్వింది.
“ఇవే అత్తా, అందరు చెప్పేవి. కబురు వేరు పని వేరు. కట్నం జీతంగా మారి పోయి హితంగా అయ్యింది. విద్యా ఖర్చులు పెరిగాయి. మనిషిలో ఎటువంటి వ్యవస్థలో ఉన్నా అందరివీ వేషాలే మసకల మనసులే. అన్ని కూడా తెరమాటు మాటలే. స్వచ్ఛత లేదు” అంది జయశ్రీ.
కాసేపుండి అత్త వెళ్ళిపోయింది.
వేంకటేశ్వర రావు మాత్రం చిన్న కూతురు మాటల గురించే ఆలోచిస్తున్నాడు.
అందరివీ ముసుగులే. అందులో మాస్క్ వెనుక మాటలు ఎలా ఉంటాయి అన్నది తెలియడం లేదు. మాస్క్ వెనుకాల మస్కా కొట్టే లక్షణాలు ఎన్నో. వైఫై మాదిరి మన చుట్టూ ఉంటున్నాయి అనుకున్నాడు.
ఆర్థికంగా మనుష్యులు ఎంత ఎదిగినా జీవితానికి దూరంగా ఉంటున్నారు. అవగాహన లేదు. ఎంత సేపు మనుష్యులు వాళ్ల జీవితాలను చూసుకోవడం. ఆత్మస్తుతి పరనిందగా మారింది.
మేము అంతా గొప్ప ఇంత గొప్ప అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటూ మాటలు చెప్పిన అతని మిత్రుడు – ఓ ఎల్. ఐ. సి ఎజెంట్ వచ్చి పాలసీ తీసుకోమంటే అబ్బే నాకు ఆ బ్యాంకులో ఎన్నో లక్షలు అప్పు ఉన్నది, అది కట్టుకోవాలి అంటు వెనక్కి వెళ్ళాడు. ఇలా అధిక గొప్పలు చెప్పేవారు కానీ ఈ విధంగా మాట్లాడటం అతి గొప్పలు అని అంటున్నారు అనుకున్నాడు.
సామాజిక పరిస్థితులకు ఎవరు లోంగడం లేదు. వచ్చే ఖర్చులకు సరిపడా సంపాదించాలి, కానీ ఖర్చులు మానుకోకూడదు అంటు సంపాదన పరుగులో ఉన్నారు. నేటి సామాజిక అంశములు మనుష్యుల్ని అతలాకుతలం చేస్తున్నా మనుష్యులు స్వభావాలలో మార్పు లేదు. ఎన్ని సమస్యలు వచ్చిన మనుష్యులలో మార్పు లేదు. నా వాళ్ళు అనే భావన లేక ఒంటరి జీవితాలను అనుభవిస్తు డబ్బు డబ్బు అంటున్నారు.
ఆ మాటే కూతుర్లతో అంటే, అవును కదా అన్నారు.
“అటు పిల్లలు హాస్టల్ అనుభవాలు ఇటు పెద్దలు వృద్ద ఆశ్రమాలలో ఉండలేక డబ్బు డబ్బు అంటూ కుటుంబ వ్యవస్థలో చిన్నాభిన్నమై మిగులుతున్నా. నేటి సామాజిక వ్యవస్థను నడిపేది కేవలం ఆర్థికమే అని చెప్పాలి. దీనిలో మార్పు అంటే మనసుల్లో మార్పు వస్తే సామాజిక వ్యవస్థ మారుతుంది” అన్నాడు.
“ఇలాంటి మాటలు వ్యాసాల్లోనే కానీ మన జీవితాల్లో ఎక్కడ ఉన్నాయి నేడు నాన్నా?” అంది వైజయంతి శ్రీ.
***
వైజయంతి శ్రీ కొంచెం నెమ్మది. జయంతిశ్రీ కొంచెం మాటకారి. పిల్లలదరూ ఒక్కలా ఉండరు కదా అంటుంది. అంతేగా మరి.
పెళ్ళి కుదిరే లోగా మంచి కోర్స్ చేస్తే మంచిది అంటూ జయశ్రీ అక్కను సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ చేసింది.
కంప్యూటర్ పై ఎంబ్రాయిడరీ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. ఒక నెలలో అన్ని నేర్పి సర్టిఫికేట్ ఇస్తారు. బ్యాంక్ లోన్‌తో బిజినెస్ పెట్టవచ్చును అని చెప్పింది జయశ్రీ.
సరే అని జాయిన్ అయ్యింది వైజయంతి.
ఆ మిషన్ – చిన్నది అయితే రెండు లక్షలు. పెద్దవి అయితే ఐదు పది లక్షల వరకు ఉన్నాయి. ఒకేసారి డజన్ వస్త్రాలు అంటే కవర్స్ వంటి వాటిపై ఎంబ్రాయిడరీ చెయ్యవచ్చును. చీరలు అయితే ఇక చీరపై పాతిక డిజైన్స్ ఒక్కసారి పాతిక సూదులు అమర్చి ఉంటాయి. ఒక రోజుకి రెండు చీరలు కుట్టవచ్చును. దానికి ట్రైనింగ్ తీసుకుంది వైజయంతి. నెల ఇట్టే గడిచిపోయింది.
బ్యాంక్ లోన్ కోసం అక్క చెల్లి వెళ్ళారు. ఇండియన్ బ్యాంక్ వారు ఇస్తామన్నారు. ఈ స్కీమ్ వారికి ప్రభుత్వం నుంచి వచ్చింది.
తల్లి పద్మశ్రీ మాత్రం “ఇంత లోన్ ఎప్పటికీ తీరుతుంది? ఎన్నాళ్ళు ఇలా బిజినెస్ చేస్తావు? పెళ్లి ముఖ్యం కదా” అన్నది కూతుళ్ళు బ్యాంకుకు వెళ్ళేముందు.
“కానీ అంతవరకు ఖాళీగా ఉండి చేసేది ఏముంది?” అంటూ కూతుళ్లు ముందుకెళ్ళారు.
అక్కడ, మేనేజర్ లేడు. రేపు రండి అన్నారు.
మర్నాడు వేంకటేశ్వర రావు పెద్ద కూతుర్ని తీసుకుని అవసరమైన కాగితాలు పుచ్చుకుని వెళ్ళాడు.
మేనేజర్ రూమ్‍కి వెళ్ళగానే “రండి కూర్చోండి” అన్నాడు. మర్యాద గానే కనిపించారు.
సరే కాగితాలు చూసి కొన్ని కాగితాలు పూర్తి చేయించి, “సగం డబ్బు మిషన్ కంపెనీకి పంపుతాము, కొంత మీకు ఇస్తాము” అని చెప్పాడు.
సరే అని పుచ్చుకున్నారు. కాఫీ తెప్పించనా అని అడిగాడు.
“మా అమ్మాయి తాగదు సర్” అన్నాడు వేంకటేశ్వర రావు.
“పోనీ లెండి, టీ తెప్పించనా?” అన్నాడాయన
“వద్దు అది తాగదు” అన్నాడు వేంకటేశ్వర రావు.
“ఓకె సర్. వైజయంతి శ్రీ అనే పేరు కొత్తగా ఉన్నది” అన్నాడు మేనేజర్ శ్రీరామ్.
“మా ఇంట్లో పేర్లు అలాగే ఉంటాయి” చెప్పాడు వేంకటేశ్వర రావు.
“సరే మంచిది” అన్నాడు శ్రీరామ్.
వేంకటేశ్వర రావు మాటల్లో – శ్రీరామ్ ఇంటిపేరు తెలిసికొని దూరపు చుట్టరికం కలిపి ఇంటి విషయాలు అమ్మా నాన్నల వివరాలు అడిగాడు
“నాన్నగారు యోగ టీచర్. అయన ఆశ్రమంలో యోగా చెపుతారు. అది ఆయనకు ఇష్టము. ఇక్కడ అమ్మ నేను అక్క ఉంటాము. మా అక్క ప్రైవేట్ జాబ్ చేస్తోంది. పిల్లలు ఎదిగి ఉన్నా మాకు సాయంగా అమ్మ మా దగ్గరే ఉంటుంది” చెప్పాడు శ్రీరామ్.
“ఆహా అలాగా అక్క వయసు?” అంటు కొంచెం సంభాషణ ముందుకు పెంచాడు వేంకటేశ్వర రావు. క్యాబిన్ రూమ్ కనుక ఎవరు లేరు.
“మా అబ్బాయి వేరే దేశంలో ఉన్నాడు. వాడికి పెళ్లి అవ్వాలి” అంటూ తన ఇంటి విషయాలు చెప్పాడు వేంకటేశ్వర రావు.
“ఒకసారి మా ఇంటికి రండి” అని మేనేజర్‌ని పిలిచాడు.
“ఎలాగో ఓపెనింగ్ సమయంలో రావాలి కదండీ” అన్నాడు శ్రీరామ్.
“మిషన్ వచ్చాక మేము చూసి చెపుతాను” అన్నాడు వేంకటేశ్వర రావు.
“సరే ఇదంతా ఒకనెలలో పూర్తి అవుతుంది. ఈలోగా నేను మీ ఇంటికి వస్తాను” అని వేంకటేశ్వర రావు అడ్రస్ పుచ్చుకున్నాడు.
వాళ్ల అక్క పేరు నక్షత్రం అడిగాడు వేంకటేశ్వర రావు. శ్రీరామ్ చెప్పాడు.
అలా, విద్యలు, విషయాలు అన్ని నచ్చాయి.
“మరి మీ పిల్ల పెళ్లి తరువాత కూడా బిజినెస్ చేస్తే కానీ బ్యాంక్ ఋణం తీరదు కదా” అన్నాడు శ్రీరామ్.
“అవును సర్ అలా ఇష్టం చూపించే పెళ్లి సంబంధమే చేస్తాను. ఎక్కడ ఉన్నా బిజినెస్ చూసుకునే సంబంధం చూసి చేస్తాను” చెప్పాడు వేంకటేశ్వర రావు.
“ఓకె” అన్నాడు శ్రీరామ్.
***
వారం రోజుల తరువాత శ్రీ రామ్ ఇంటికి వేంకటేశ్వర రావు వెళ్లి అతని తల్లి అన్నపూర్ణతో అన్ని చెప్పాడు.
“మా అబ్బాయి చెప్పాడు అండీ” అన్నది.
“మీ అబ్బాయి ఇండియాలో ఉంటేనే చేస్తాను. అన్నీ కుదిరిన కూడా వేరే దేశం పంపను. నా పిల్లలు నాకు ఫోన్ చేస్తే వచ్చేలా ఉండాలి” అన్నది అన్నపూర్ణ.
“అవును ఏ తల్లి తండ్రికి అయినా అంతే” అన్నాడు వేంకటేశ్వర రావు.
పిల్ల బాగానే ఉన్నది. ఆ పిల్ల పెళ్లి అయితే కానీ శ్రీరామ్ పెళ్లి చెయ్యదు
“మా అబ్బాయి శ్రావణ శర్మని – సంపాదించింది చాలు – ఇండియా వచ్చెయ్యి – అని చెప్పాను నేను” అన్నాడు వేంకటేశ్వర రావు.
పెద్దలకి అన్ని నచ్చాయి. పిల్లలకి ఇష్టత కలిగింది. శ్రావణ శర్మ వచ్చి వెళ్ళాడు.
మిషన్ ఓపినింగ్ నాటికి పెళ్లికి అన్ని కుదుర్చుకుని మంచిరోజున ఏర్పాటు తాంబూలాలు పుచ్చుకున్నారు.
అన్నపూర్ణ మాత్రం “కోడలు ఇంటి పనులు చెయ్యాలి, నేను పెద్దదాన్ని అయ్యాను” అన్నది
“అలాగే, మా పిల్ల పనిమంతురాలు. అది చేసేవి, మీరు చూస్తూ ఉండండి. ఏమి చెప్పకండి” అన్నారు పిల్ల తల్లితండ్రులు.
అన్నపూర్ణ కొంచెం పెంకిది. “మా కూతుర్ని అడిగి చేసుకుంటున్నారు, మీ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూస్తాడా?” అన్నది
“చూడండి నా పిల్ల, మీ పిల్ల అని తేడా ఏమి లేదు. భర్త అనేవాడు భార్యను ప్రేమగా చూస్తే వాళ్ళు అత్త ఇంటికి వచ్చినా సర్దుకుపోతారు. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎలా ఉన్న భర్త ముఖ్యం. అత్త ముఖ్యం. మీరు మా పిల్లని బాగా చూడండి. నా కొడుకు వైపు నేను ఉండి అన్ని బాగా చూసుకుంటాను” అన్నాడు వేంకటేశ్వర రావు.
“సరే మరి ఎదురు బెదురు పెళ్లి అని భయం” అన్నది అన్నపూర్ణ.
“పర్వాలేదు అన్ని బాగుంటాయి” అన్నాడు వేంకటేశ్వర రావు.
***
మనిషి జీవితం కోసం ఎంతో కృషి చెయ్యాలి, అప్పుడే ఎదుగుదల వస్తుంది. ఎన్ని వెతికినా ఆ సమయం వచ్చేవరకు ఏది కుదరదు. కాలం నిర్ణయం చేస్తుంది. అప్పుడు మనసులో మసకలు తొలగి, ఆలోచనలలో మార్పు వచ్చి మంచి జరుగుతుంది.
మంచు దుప్పటి తొలిగి పెళ్లికి సరేనన్నాడు శ్రీ శ్రావణ శర్మ. పిల్ల బాగుంది అని ఒప్పుకున్నారు. వేంకటేశ్వర రావు చిన్న కొడుకు శ్రీ చరణ్ శర్మ చదువు అవడానికి ఇంకా రెండు ఏళ్ళు పడుతుంది. జయశ్రీ చదువు కూడా ఉన్నది.
శ్రావణ శర్మ, తండ్రికి సాయంగా ఇక్కడే బిజినెస్ చెయ్యాలని ఆలోచించాడు. ‘చెల్లెలు వైజయంతి శ్రీ బిజినెస్‌కి ఇప్పుడు డిమాండ్ ఉన్నది కదా, నేను అందులో హెల్ప్ చేస్తాను’ అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.
ఆ వేసవిలో శ్రీరామ్ అక్క పెళ్లి శ్రీ శ్రావణ శర్మతో ఘనంగా జరిగింది. సీతా కల్యాణ వైభోగమే అంటూ కీర్తన వాయిస్తుండగా పెళ్లి జరిగింది.
ఆ తరువాత వైజయంతి శ్రీ పెళ్లి శ్రీరామ్‌తో జరిగింది. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురు అంటూ గట్టి మేళం వాయిస్తుండగా సుముహూర్తం వేళ శ్రీరామ్ తాళికట్టాడు. వైజయంతి శ్రీ – శ్రీమతి శ్రీరామ్‌గా మారింది
అక్క పెళ్ళిలో భోజనాల సమయంలో చెల్లెలు జయశ్రీ చక్కగా సంగీత కచ్చేరి చేసింది. ‘వాతాపి గణపతింభజే’ అంటూ దీక్షితార్ కీర్తనతో మొదలు పెట్టి, ‘ బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి’ అంటూ శ్యామశాస్త్రి కీర్తన పాడి, త్యాగరాజ స్వామి కీర్తన ‘సామజవరగమన’ అయ్యాక, ‘రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ’ అంటూ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన పాడింది. తరువాత శ్రీ రామనాథపురం శ్రీనివాస అయ్యర్ కృతి పాడి శ్రీ అన్నమయ్య కృతి ‘ఒక పరి ఒక పది వయ్యరామే’ అన్నది పాడింది. జయదేవ అష్టపది, మీరా భజన, తిల్లానా, లలిత సంగీతం పాడి శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ‘జో అచ్యుతానంద’ పాడి, ‘క్షీరాబ్ధి కన్యకకు’ అంటూ మంగళ హారతి పాడింది. ఏవైనా ఆడపిల్లకి సంగీతం వస్తే ఎంతో మంచిది అంటు వచ్చిన వాళ్ళు పొగిడారు.
***
శ్రావణ శర్మ ఇండియాలో స్థిరపడి బాద్యతలు చేపట్టి తల్లి తండ్రిని సుఖపెట్టాడు. అటు చెల్లెలి బిజినెస్‌కి సాయంగా ఉంటూ, ఆమెకు కొంత డబ్బు ఇస్తూ లోన్ అంతా క్లియర్ చేసి ఎక్స్‌పోర్ట్ ద్వారా ఎంబ్రాయిడరీ ఐటమ్స్‌లో మంచి లాభాలు గడించేలా చేశాడు. జీవితంలో అందరూ సుఖంగా ఉన్నారు.
వేంకటేశ్వర రావు చిన్న కొడుకు డాక్టర్ పూర్తి అయ్యింది. చిన్న కూతురు చదువు అయ్యి వాళ్ళు వాళ్ల క్లాస్మేట్స్‌లో ఎంపిక చేసుకుని ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
శుభము.