శివలింగ పుష్పాల చెట్టు

0
4

[డా. కందేపి రాణీప్రసాద్ గారు రచించిన ‘శివలింగ పుష్పాల చెట్టు’ – అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మే[/dropcap]ము ఈ మధ్య కొచ్చిన్‌కు వెళ్ళాము. అక్కడ డాక్టర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా గత వారం మా కుటుంబమoతా కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు వెళ్ళాము. అక్కడ మేము తాజ్ గేట్ వే హోటల్లో దిగాము. నేనీ మధ్య ఆకులు, పూలు కొమ్మలతో బొమ్మలు చేస్తున్నందున ఎక్కడికి వెళ్ళినా చెట్లను పరిశీలిస్తున్నాను. ఆ హోటల్ కున్న గార్డెన్ లోని చెట్లను పరిశీలిస్తున్నపుడు నా కళ్ళు ఒక చెట్టుపై నిలిచాయి. గుండ్రని కాయలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. క్రికెట్ బoతికి నాలుగు రెట్ల సైజులో పెద్దగా ఉన్నాయి కాయలు. గత నెలలోనే బెంగుళూరు మెడికల్ కాలేజీలో చూసినపుడు లావు సొరకాయల్లాంటి కాయలు చెట్టు నుంచి వేలాడటం గమనించి ఆశ్చర్యపోయాను. పెద్ద పెద్ద వృక్షాలకు పెద్దపెద్ద కాయలు కాయడం నేను చూడలేదు. అలాగే ఇక్కడ ఈ కాయల్ని చూసి ఆశ్చర్యపోయాను.

ఆ కాయలు ఎంత గుండ్రంగా ఉన్నాయంటే ఎవరైనా శిల్పి తయారు చేశాడా అన్నట్లుగా అనిపించాయి. ఆ గుర్తొచ్చింది. పెద్ద సైజు ఏలక్కాయల్లా ఉన్నాయి అనవచ్చనుకుంటాను. దీంట్లో కూడా గుజ్జు ఉంటుందట.

నేను దగ్గరకు వెళ్ళగానే అద్భుతమైన సౌందర్యంతో పువ్వులు కనిపించాయి. మంచి సువాసనతో చుట్టు పక్కల ప్రదేశమంతా దాని సుగంధాన్ని వ్యాషింప జేస్తున్నాయి. లేత గులాబీ రంగులో చిన్న సైజు తామర పూలలా కనిపించాయి. మధ్యలో కేసరాలు గుత్తిగా ఉన్నాయి. సౌందర్యం, సుగంధం పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి ఇంతేకాయ రంగు లావణ్యం కూడా అతి మనోమారంగా ఉన్నాయి. అక్కడున్న సెక్యూరిటిని ఈ పూల పేరేమిటని అడిగాను. ‘నాగలింగ పూష్పాలు’ అని చెప్పి, “మా మేనేజర్‌కు తెలుసు, పిలుచుకోస్తాను” అన్నాడు. మేనేజర్ వచ్చాక దీని పేరు ‘కానన్ బాల్ ట్రీ’ అని చెప్పాడు. రెండు పూలు కోసివ్వమంటే కోసిచ్చాడు. వాటిని తెచ్చి కార్లో పెట్టుకుంటే కారంతా సువాసనలు వచ్చాయి.

ఇంతకీ ఈ పువ్వులు ఏమిటో తెలుసుకుందామా! శివలింగ పుప్పాలు, నాగలింగ పువ్వులు, నాగమల్లి పువ్వు, శివపంచాక్షరీ వృక్షం అని రకరకాల పేర్లున్నాయి. కానీ దీని శాస్త్రీయ నామం ‘కోరోపిటా గియానెన్సిన్’. ఇది ‘లెనిథిడేసి’ కుటుoబానికి, ‘మాగ్రోలియాప్సిడా’ విభాగానికి చెందిన చెట్టు. అన్ని చెట్లకు పువ్వులు చెట్టు పై భాగాన ఉoటే ఈ చెట్టుకు మాత్రం కిందకు ఉంటాయి.

చెట్టుకు ఉండే కొమ్మలు కూడా శివుడి జటాజూటం లోని వెంట్రుకల వలె గుబురుగా వేలాడుతూ ఉoటాయి. పువ్వుకు పెద్దగా ఉండే ఆరు ఆక్షర్షణ పత్రాలు ఉంటాయి. మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉండటాన వీటిని నాగలింగ పుష్పాలని అంటారు. అంతే కాదు వీటిని మల్లికార్జున పుష్పాలని కూడా పిలుస్తారు. కేసరాలతో కప్పబడిన భాగం కింద చిన్న శివలింగం ఆకారం కనిపిస్తుంది ఈ శివలింగం చూశాక వీటికి పేరు చాలా సహజమనిపిస్తుంది.

ఈ శివలింగ పుష్పాల చెట్టు దక్షిణ అమెరికాలోనూ దక్షిణ భారతదేశం లోను ఎక్కువగా వ్యాపిస్తుంది. లావైన కాండానికి సన్నది కొమ్మల్లాంటివి చాలా ఉంటాయి. ఇది శివుని వెంట్రుకల్లాoటివి అని భావిస్తారు. ఈ సన్నది కొమ్మలకే పూలు, కాయలు కాస్తాయి పూలు అద్భుత సుగంధంతో ఉంటాయి. కాయలు అoత్యంత గుండ్రంగా ఉంటాయి. ఈ కాయల ఆకారాన్ని బట్టి దీనిని ‘ఫిరంగి చెట్టు’ అని కూడా అంటారు. ఫిరంగుల్లో వాడే గుండ్ల వలె కాయలుంటాయని చెప్తారు. శత శిరస్సులున్నట్లుగా వందల కొద్దీ కేసరాలతో నున్న పువ్వు మధ్యభాగం శివలింగాన్ని కప్పి ఉన్నట్లుగా, ప్రణమిల్లుతున్నట్లుగా ఉంటుంది. శత శిరస్సుల పుష్పo అని కూడ అంటారట. వీటిని దైవదత్తమైన పువ్వులుగా భక్తులు భావిస్తారు. ఇంకా వీటిని శివ కమలం, కైలాసపతి చెట్లుగా పేర్లున్నాయి.

శివలింగ పూలు 6 సెం.మీ వ్యాసంలో ఉంటాయి. ఎరుపు, గులాబీ, పసుపు రంగుల మేళవిoపుతో పువ్వు లోపలి భాగం ఉంటుంది. ఆరు రెక్కలు కలిగిన అoదగా విప్పారుతుంది. పాము పడగ ఆకారంలో విప్పారి వంగి ఉంటుంది దీనికి శాస్త్రీయ నామాన్ని పెట్టిన వారు ఫ్రెంచి బోతానిస్ట్ అయిన J.E.అబ్లేట్. ఇతను 1755 AD లో ఈ పువ్వులకు పేరుపెట్టారు.

శివలింగ పుష్పాల చెట్టు 35 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కాoడం కూడా కనిపించకుండా బోలెడు పువ్వుల్ని ఇస్తుంది. వంద నుండి నూట యాభై దాకా పువ్వులు, కాయలు కాస్తాయి. పూలకు ఉoడే సువాసన ఉదయాలు, సాయంత్రాలు ఎక్కువగా వస్తుంది. కొన్ని ఈగల ద్వారా వీటి వ్యాప్తి పరాగ సంపర్కం ద్వారా జరుగుతుంది. కాయలు పశువులకు కిటకాలకు ఆహారంగా పనికొస్తుంది. వీటిలో ఔషద విలువలున్నాయని తెలుస్తున్నది. యాంటీ మైక్రోబియల్‌గా ఉంటాయి. హైపర్ టెన్షన్, దావులు, కడుపు నొప్పి, జలుబు లకు ఈకాయల గుజ్జును వాడతారు. చర్మ సమస్యలకు, గాయాలకు, మలేరియా, పన్ను నొప్పులకు ఔషదంగా ఉపయోగిస్తారు.

కాయలు పై నుంచి కిందకు పడినప్పుడు కూడా గాలికి ఒకదానికొకటి తాకినప్పుడు సైతం శబ్దం వస్తుంది. కాయలు పడినప్పుడు వచ్చే శబ్దం బాంబు పేలినప్పటి శబ్దంలా ఉంటుంది. అందుకే వీటిని మనుష్యులు తిరిగే ప్రాంతాలలో నాటకుండా ఉంటే మంచిది.

శివాలయంలో ఎక్కువగా ఈ చెట్టు నాటబడి ఉంటుంది. అంతేకాక బుద్దిస్ట్, జైన దేవాలయాల లోనూ శివలింగ పుష్పాల చెట్లు ఉంటాయి. బుద్ధుని తల్లి మాయాదేవి ఈ చెట్టు కిందనే బుద్దునికి జన్మనిచ్చిందని బౌద్ధ మతస్థులు చెపుతారు. బుద్ధిజమ్‌లో సాల వృక్షాలు, శివలింగ చెట్లు పవిత్రమైనవని చెపుతారు. శ్రీలంక, థాయ్ లాండ్, మయన్మార్ లలో ఈ చెట్లున్నాయని తెలుస్తున్నది.

కొన్ని చోట్ల ఈ చెట్లు వంద అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయట. కానీ మన రాష్ట్రాల్లో 30, 40 అడుగుల వరకు మాత్రమే ఎత్తు పెరుగుతాయి. ఇది సతత హరిత చెట్టు. ఈ చెట్టుకు పూలు సంవత్సరం పొడువునా పూస్తాయి. ఈ చెట్లు చాలా తక్కువగా, అరుదుగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి కూడా అంతరించి పోతున్నందున కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here