మహాభారత కథలు-44: ధృష్టద్యుమ్నుడు ద్రౌపదుల జన్మ కథలు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఆదిపర్వము -ఏడవ ఆశ్వాసము

ధృష్టద్యుమ్నుడు ద్రౌపదుల జన్మ కథలు

ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జననము

[dropcap]మ[/dropcap]హాభారత కథ చెప్తున్న సూతమహర్షి శౌనకుడు మొదలైన మహర్షులకి భీముడు బకాసురుణ్ని చంపిన తరువాత జరిగిన కథ చెప్తున్నాడు.

పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణుడి ఇంట్లోనే బ్రాహ్మణ వేషాలు ధరించి వేదాలు నేర్చుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ద్రుపదరాజు పట్టణం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు పాండవుల ఇంటికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటానని అడిగాడు. పాండవులు, ఆ ఇంటి యజమాని అతిథి అభ్యాగత పూజలు చేసి ఆయన్ని గౌరవించారు. పాండవులు “అయ్యా! మీరు ఏ దేశాలు చూశారు.. వాటిలో మీకు ఏ దేశాలు అందంగా కనిపించాయి.. ఏ దేశాల రాజులు ధర్మంగా పరిపాలన చేస్తున్నారు?” అని కుతూహలంగా అడిగారు.

ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు “నాయనలారా! నేను శ్రమకోర్చి దేశాలన్నీ తిరిగి వస్తున్నాను. ఈ భూమి మీద ద్రుపదరాజ్యానికి మించిన అందమైన రాజ్యం, ద్రుపదరాజుని మించిన గుణవంతుడైన రాజు నాకు కనిపించలేదు. సద్గుణాలలో ఆయనకి ఆయనే సాటి. ద్రుపదరాజు కుమర్తె ద్రౌపది అగ్నిగుండం నుంచి పుట్టింది. ఆమె మానవ కాంతకి జన్మించిన స్త్రీ కాదు. ఆమె అందమైనది, సద్గుణవంతురాలు. ఆమెకి వివాహం చెయ్యాలని ద్రుపదరాజు ఎంతో మంది రాజకుమారుల్ని చూస్తున్నాడు. ఆమెకి సరిపడిన రాజకుమారుడు ఎక్కడా కనిపించలేదు. అందుకని స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు” అని చెప్పాడు.

బ్రాహ్మణుడి చెప్పినదాన్ని విని కుంతీదేవి, ధర్మరాజు చాలా ఆశ్చర్యపడ్డారు. ద్రౌపది జన్మ వృత్తాంతం వివరంగా చెప్పమని బ్రాహ్మణుణ్ని అడిగారు. బ్రాహ్మణుడు పాండవులతో “భరద్వాజ మహర్షి కలశం నుంచి పుట్టిన ద్రోణుడు, వృషతుడి కొడుకు ద్రుపదుడు మంచి స్నేహితులు. ఒకే గురువు దగ్గర ఉండి వేదాలు నేర్చుకున్నారు. తరువాత ఇద్దరూ అగ్నివేశుడి దగ్గర ధనుర్విద్యని నేర్చుకున్నారు. విద్య పూర్తి చేసుకున్న తరువాత ఇద్దరూ మంచి స్నేహితులుగా విడిపోయారు. ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు.

ఒకసారి ద్రోణుడికి కొంత ధనం అవసరమయింది. ద్రుపదుణ్ని సహాయం చెయ్యమని అడిగాడు. ద్రుపదుడు స్నేహితుడే అయినా రాజవడం వల్ల వచ్చిన అహంకారంతో ద్రోణుణ్ని అవమానించాడు. ప్రపంచమంతా కీర్తిని పొందిన ద్రోణుడు హస్తినాపురానికి వెళ్లి కురుకుమారులకి శస్త్ర విద్య నేర్పించి గొప్పవాళ్లుగా తీర్చి దిద్దాడు. ద్రోణుడు తన దగ్గర విద్య నేర్చుకున్న కౌరవ పాండవ రాజకుమారుల్ని తనను అవమానించిన ద్రుపదుణ్ని పట్టి బంధించి తనకు గురుదక్షిణగా ఇమ్మని అడిగాడు.

రాజకుమారులు అందరూ ద్రుపదుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. అర్జునుడు మాత్రం ద్రుపదుడితో సమానంగా యుద్ధం చేసి అతణ్ని బంధించి పట్టుకొచ్చి ద్రోణుడికి అప్పగించాడు. ద్రోణుడు ద్రుపదుణ్ని అవమానంగా మాట్లాడి “భయపడకు నిన్ను ఏమీ చెయ్యను. నువ్వు నన్ను అవమానం చేసావు. అవమానం పొందినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో చూపించాను అంతే!” అని చెప్పి అతణ్ని వదిలేశాడు.

తనను బంధించి వదిలిపెట్టడం ద్రుపదుడుకి అవమానంగా అనిపించింది. అప్పటినుంచి ప్రతిరోజూ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి సేవ చెయ్యడం మొదలుపెట్టాడు. యుద్ధరంగంలో ద్రోణుణ్ని చంపగల కొడుకు, అర్జునుడికి భార్య అవడానికి తగిన లక్షణాలు కలిగిన కూతుర్ని పొందాలని అనుకున్నాడు. అందువల్ల అన్ని ప్రదేశాల్లో ఉన్న బ్రాహ్మణుల్ని పూజించడం మొదలు పెట్టాడు. ఒకరోజు గంగానదీ తీరంలో వానప్రస్థ జీవితం గడుపుతున్న ఇద్దరిని చూశాడు. వాళ్ల పేర్లు యాజి, ఉపయాజి. ఇద్దరూ కాశ్యపస గోత్రులు, నియమనిష్ఠలతో క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇద్దరిలో వయస్సులో చిన్నవాడు, తపోమహిమలో పెద్దవాడు అయిన ఉపయాజితో ద్రుపదుడు “మహర్షీ! నాకు వీరుడైన కొడుకు కావాలి. అందుకు నాతో ఒక యజ్ఞం చేయించండి. మీకు లేగదూడలతో ఉన్న లక్ష పాడి ఆవుల్ని ఇస్తాను!” అన్నాడు. ద్రుపదుడి మాటలు విని ఉపయాజుడు “నేను ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనీ చెయ్యను. అటువంటి వాళ్లని వెతుక్కుని అక్కడికి వెళ్లి అడుగు” అన్నాడు. ద్రుపదుడు ఒక సంవత్సరం ఓర్పుగా అక్కడే ఉండి ఆయన్నే సేవించాడు. ఒకరోజు ఉపయాజుడు ద్రుపదుడితో “నా అన్న యాజుడు నువ్వు అడిగింది చేస్తాడు. అక్కడికి వెళ్లి అడుగు” అన్నాడు.

ద్రుపదుడు ఉపయాజుడు చెప్పినట్టు యాజుడి దగ్గరికి వెళ్లి ఉపయాజుణ్ని అడిగినట్టే అడిగాడు. మళ్లీ అన్నాడు “భరతవంశానికి గురువు, భరధ్వాజమహర్షి కొడుకు అయిన ద్రోణుడు నన్ను అవమానపరిచాడు. అతణ్ని పెద్ద యుద్ధంలో ఓడించగల కొడుకు నాకు కావాలి. ఆరుమూరలు ధరించే ద్రోణుణ్ని ఎవరూ ఎక్కడా ఓడించలేరు. అటువంటి వాణ్ని ఓడించగలిగితే ధర్మార్ధ కామమోక్షాలైన నాలుగు పురుషార్ధాలు నాకు దక్కినట్టే” అన్నాడు. యాజుడు ద్రుపదుడితో “నువ్వు అడిగినట్టే నీతో యజ్ఞం చేయిస్తాను, నువ్వు కోరుకున్నట్టే నీకు ఒక కొడుకు, ఒక కూతురు కలుగుతారు బాధపడకు” అని చెప్పాడు.

యజ్ఞానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నాడు. తమ్ముడు ఉపయాజిని సహాయంగా పిలిచాడు. ద్రుపదుడు, అతడి ధర్మపత్ని కోకిలాదేవిని కుర్చోబెట్టి వాళ్లతో యజ్ఞం చేయించాడు. మంత్రాలతోను, ఆహుతులతో పేల్చిన పదార్థాలతోను అగ్నిదేవుడు తృప్తి పొందాడు. ఖడ్గం, పెద్ద ధనుస్సు, శక్తివంతమైన కవచం, కిరీటం ధరించి, భయంకరమైన శరీరంతో రథాన్ని ఎక్కి అగ్నిహోత్రుడిలా ప్రకాశిస్తున్న ఒక కొడుకు ఉదయించాడు. వంశాన్ని పవిత్రం చేయగల శక్తి, నల్ల కలువ రంగుతో ఉన్నశరీరం, కలువకు ఉండే సుగంధం, పెద్ద కలువరేకుల్లా కళకళలాడే పెద్ద కళ్ళు, గిరజాలు తిరిగిన జుట్టు, దేవతలకు ఉండే తేజస్సు, అందమైన ఆకారం కలిగిన ఒక కన్య అగ్నికుండంలోంచి పుట్టింది.

వాళ్లు ఇద్దరూ పుట్టగానే వాళ్ల పేర్లు ‘ధృష్టద్యుముడు’, ‘కృష్ణ’ అని ఆకాశవాణి అందరికీ వినిపించేలా చెప్పింది.

ద్రౌపది స్వయంవరానికి ఏర్పాట్లు

ద్రుపదుడు తను కోరుకున్నట్టు సంతానం కలిగినందుకు సంతోషించాడు. యాజుడికి తను ముందుగా చెప్పినట్టే దక్షిణలు ఇచ్చాడు. బ్రాహ్మణుల్ని భక్తితో పూజించాడు.

ధృష్టద్యుమ్నుడికి ధనుర్వేదాన్ని నేర్పించి అందులో గొప్ప ప్రావీణ్యుణ్ని చేశాడు. ఇప్పుడు యుక్త వయస్సు వచ్చిన కృష్ణకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. పరాక్రమవంతులైన పాండవులు లక్క ఇంటిలో అగ్నిప్రమాదంలో కాలిపోయారని విన్నాడు. బంధువులు, మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు అందరూ అది నిజమేనని చెప్పడంతో చాలా దుఃఖపడ్డాడు. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం, నల్లకలువలా అందమైన శరీరం కలిగిన ఇంద్రుడి కుమారుడు అర్జునుడికి కృష్ణని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా తనకు అన్యాయం చేశాడని.. మహాయజ్ఞంలో అగ్నికుండం నుంచి పుట్టిన కృష్ణని సామాన్యుడికి ఇచ్చి ఎలా పెళ్లి చెయ్యాలని ద్రుపదుడు దుఃఖపడుతున్నాడు.

పురోహితుణ్ని పిలిచి తన బాధ చెప్పుకున్నాడు. పురోహితుడు ద్రుపదుణ్ని శాంతపరుస్తూ “పాండవుల గురించి ఎన్నో శుభశకునాలు చూశాను. వాళ్లకి కీడు జరగదు. పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనిపించలేదు. శచీదేవి ఏడుస్తుంటే కనిపించిన శుభశకునాలని బట్టి అమెకి ఇంద్రుడు తిరిగి వస్తాడని బృహస్పతి చెప్పినట్టు వేదాలు చెప్తున్నాయి. నేను కూడా అటువంటి శుభశకునాలు చూశాను. పాండవులు మరణించలేదు. ఎక్కడో సుఖంగానే ఉన్నారు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇక్కడికి వస్తారు. నువ్వు ప్రశాంతంగా ఉండు. పట్టణంలో ద్రౌపది స్వయంవరానికి చాటింపు వేయించమని అజ్ఞాపించు. స్వయంవరం ప్రకటించడం రాజులకి శాస్త్రం సమ్మతించిందే” అని రాజుకి చెప్పాడు.

ద్రుపదుడు పురోహితుడు చెప్పిన ప్రకారం ఆనాటికి డెభ్భై ఐదవ రోజు పుష్యమాసం, శుక్లపక్షం, అష్టమి, రోహిణీనక్షత్రం రోజు స్వయంవరం జరుగుతుందని చాటించమని సేవకుల్ని ఆజ్ఞాపించాడు. ఎక్కుపెట్టడానికి, లాగడానికి శక్యం కాకుండా ఉండేలా ఒక బలమైన ధనుస్సుని, దూరంగా ఆకాశంలో తిరిగే బంగారంతో చేసిన ప్రకాశవంతమైన మత్స్యయంత్రాన్ని తయారు చేయించాడు. భూమి మీద ఉన్న రాజులందరూ పోటీలుపడుతూ ద్రుపదుడి కాంపిల్య నగరానికి స్వయంవరం కోసం వెడుతున్నారు” అని చెప్పాడు.

బ్రాహ్మణుడు చెప్పినది విన్న పాండవులు కాంపిల్యనగరానికి వెళ్లాలని మనస్సులో అనుకున్నారు.

కాంపిల్య నగరానికి బయలుదేరిన పాండవులు

పాండవుల ఆలోచన తెలుసుకున్న కుంతీదేవి పాండవులతో “ఏకచక్ర పురంలో ఈ బ్రాహ్మణుడి ఇంట్లో చాలా కాలం నుంచి ఉంటున్నాము. ఎంత కాలం ఉన్నా మనకి కలిగే లాభం ఏముంటుంది? ఇతరుల ఇళ్లల్లో ఎంతకాలం ఉంటాము? పాంచాలదేశం అందమైందని, ఆ రాజ్యాన్ని పాలించే రాజు ధర్మబుద్ధి కలవాడని విన్నాము. అంతేకాదు పాంచాలదేశంలో నివసించే గృహస్థులు బ్రాహ్మణులకి అడగకుండానే ఎక్కువగా దక్షిణలు ఇచ్చి భోజనం పెడుతూ ఉంటారని కూడా విన్నాం. మనం కూడా పాంచాలదేశం వెడదాం” అంది.

ఆమె మాటలు విని పాండవులు పాంచాలదేశం వెళ్లడానికి సంతోషంతో అంగీకరించారు. తాము ఉంటున్న బ్రాహ్మణుడికి చెప్పి అతడి దగ్గర సెలవు తీసుకున్నారు.

వేదవ్యాసుణ్ని కలిసిన పాండవులు

పాంచాలదేశానికి వెళ్లడానికి బయలుదేరిన పాండవులు పెద్ద పెద్ద సరస్సులు, భయంకరమైన పర్వతాలు, నదులు, దట్టమైన అడవులు దాటి ఆపకుండా ప్రయాణం చేస్తూ వెడుతున్నారు. మధ్యలో ధర్మాత్ముడు, పితామహుడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, విష్ణుమూర్తి స్వరూపుడు, అందరి దుఃఖాల్ని పోగొట్టేవాడు, ప్రాచీనమహర్షి, పరాశరుడి కొడుకు అయిన వ్యాసమహర్షిని దర్శించి వినయంగా ఆయనకి నమస్కరించారు.

మహర్షి వాళ్లని చూసి “నాయనలారా! ధర్మరాజు ఉన్నచోట ధర్మానికి లోటు ఉండదు. అయినా కూడా ధర్మాన్ని వదలక ప్రశాంతమైన మనస్సుతో వినయంగా ఉండండి. పూర్వం ఒక మహర్షి కుమార్తె ఆమె పూర్వజన్మ కర్మ వల్ల భర్తని పొందలేక పోయింది. కఠోరమైన తపస్సు చేసింది. ఆమెకి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని చెప్పగానే భర్త కావాలని అయిదుసార్లు అడిగింది. ఈశ్వరుడు ఆమెకి మరుసటి జన్మలో ఐదుగురు భర్తలు వస్తారని చెప్పాడు. ఆమె ఇప్పుడు ‘కృష్ణ’ అనే పేరుతో పాంచాలరాజు ద్రుపదుడికి కూతురుగా పుట్టింది. ఈ రోజు ద్రుపదుడు ఆమెకి స్వయంవరాన్ని ప్రకటించాడు. మీరు ద్రుపదపురానికి వెళ్లండి. మీకు మంచి జరుగుతుంది” అని చెప్పి వెళ్లిపోయాడు.

పాండవులు పాంచాల దేశం చేరడానికి మధ్యలో ఆగకుండా రాత్రి పగలు ప్రయాణం చేస్తూ వెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here