[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కాలం ఆక్రమించిన ఇష్టం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఈ[/dropcap] ప్రశ్న ఎక్కడిది?
చిత్రంగా రాత్రుళ్ళు ఉదయించి
పగలు అస్తమిస్తుందే..
నాపై పాకేటప్పుడు
వింతగా జ్ఞాపకాలు
పచ్చిగా రుచిని పంచుతాయి
సగానికి పైగా
కాలం ఆక్రమించిన ఇష్టాన్ని
ఖండించే బలం మనసుకు ఉందా?
తెలియకుండా ఇచ్చినవి..
పుచ్చుకున్నవి చాలా వరకు
నిజాయితీగా మనిషిని ఓడిస్తాయి
ఏ దూరం దగ్గరకు రాదు
ఏ దగ్గరితనం దూరం కాలేదు..
ఓ ప్రశ్న అనివార్య ప్రేమలో
తేలికగా నిజం తెల్లవారుతుంది..
నేను అనే నీ ఆస్తి
ఎక్కడ దాచినా సంతకం లేకపోయినా
పూర్తిగా చెల్లే నిజం
మనసంతా ఖర్చుపెట్టినే హక్కు ఒకటి
నిజాయితీగా నీ పక్షాన
ఉంటుంది నా రూపంలో..