[box type=’note’ fontsize=’16’] “చేయాల్సిన పనుల్ని చేయడానికి బద్ధకించి వాటిని శ్రమనుకుంటున్నారు. ప్రతిదానికీ రిమోట్లు వాడుతూ, కూచున్న చోటునుంచి కదలకుండా రోజులు గడిపేస్తున్నారు. మీ ఉద్యోగాన్ని తప్పించి మిగతా ఏ పనైనా దాన్ని శ్రమనుకుంటే ఎలా? ఇంటిపనిని ప్రేమించడం నేర్చుకోండి” అంటుదో అమ్మ – సలీం కల్పిక – ‘రిమోట్ కంట్రోల్‘లో . [/box]
[dropcap]అ[/dropcap]రుణకు కొడుకు మీదికి మనసు మళ్ళింది. వాణ్ణి చూసి ఏడాది దాటిపోయింది. వాడు కొనిచ్చిన ఐపాడ్‌లో స్కైప్‌లో కొడుకూ కోడలు కన్పిస్తే చూసి మాట్లాడటమే. ఇంతకు ముందు వారానికోసారి మాట్లాడేవారు. ఇప్పుడు నెలకోసారి కన్పించడం కూడా గగనమైపోయింది. అదేమంటే చాలు పురాణం మొదలెడున్నాడు. ‘పని వత్తిడమ్మా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో తీరికెక్కడ దొరుకుతుంది చెప్పు. నువ్వేమో రమ్మంటే మన పల్లెటూరు వదిలిపెట్టి రావాయె’ అంటూ నిష్ఠూరాలు కూడాను.
ఈసారి తనే వెళ్ళాలని నిర్ణయించుకుంది. కొడుకు సూర్యానికి తను ఏ ట్రెయిన్లో వస్తుందో ఫోన్ చేసి చెప్పింది. ఉదయం ఆరింటికి సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి కొడుకు కోసం వెతికింది. కన్పించలేదు. తను తన కోచ్ నంబర్ కూడా రాసింది కదా. మరి కోచ్ ఆగిన చోటే వాడు నిలబడి ఉండాలి కదా అనుకుని ఫోన్ చేయబోయేంతలో ఆమెకే ఫోన్ వచ్చింది. కోడలి ఫోన్… “అత్తమ్మా… బైట మీకోసం వెయిట్ చేస్తున్నా. పోర్టర్‌ని మాట్లాడుకుని వచ్చేయండి” అంది.
అరుణ తన సూట్‌కేస్ వైపు చూసి మెల్లగా నవ్వుకుంది. అది చక్రాలున్న సూట్‌కేస్. ఈ మాత్రం దానికి పోర్టర్ దేనికి అనుకుని సూట్‌కేస్‌ని కుడి చేత్తో లాక్కుంటూ మెట్లవరకూ వెళ్ళి దాన్ని మధ్య హ్యాండిల్ సాయంతో ఎత్తిపట్టుకుని మెట్లెక్కింది. స్టేషన్ బైటికొచ్చి నిలబడిన అత్తగార్ని చూడగానే సంధ్య కారుని ఆమె ముందుకు తెచ్చి ఆపింది. అరుణ ఎక్కి కూచున్నాక “మీరెందుకు మోసుకొచ్చారు అత్తమ్మా. పోర్టర్‌ని మాట్లాడుకోవాల్సింది” అంది. అరుణ నవ్వి వూర్కుంది.
సంధ్య ఈ ఏడాది కాలంలో బాగా లావెక్కినట్టు తెలుస్తోంది. పెళ్ళయి నాలుగేళ్ళు కూడా కాలేదు. పిల్లా జెల్లా కూడా లేరు. అప్పుడే మనిషి ఎందుకు వూరిపోయిందో అర్థం కాలేదు. ఇంటికెళ్ళగానే సూర్యం నవ్వుతూ ఎదురొచ్చి “ప్రయాణం సుఖంగా జరిగిందా అమ్మా” అంటూ పలకరించాడు. అతను కూడా బాగా లావైనాడు. బనీన్లోంచి పొట్ట ఓ మోస్తరు కుండలా కన్పిస్తోంది. ఆమె సోఫాలో కూచోగానే రిమోట్‌తో ఏసీ ఆన్ చేశాడు.
“నువ్వు కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక స్నానం చేసెయ్ అమ్మా, గీజర్ ఆన్ చేసే ఉంది. నేనూ సంధ్యా జిమ్ కెళ్ళి వస్తాం. బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేశాను. మరో అరగటంలో స్విగ్గీ కుర్రాడు తెచ్చిస్తాడు. వాడికి మన యిల్లు తెల్సులే. వాటిలో నీక్కావల్సినవి తిని టీవీ చూస్తూ కూచో. ఇదిగో రిమోట్. ఈ లోపల మేము కూడా వచ్చేస్తాం’ అంటూ తన భార్యతో కలిసి హడావిడిగా కార్లో వెళ్ళిపోయాడు.
అరుణ తలారా స్నానం చేసి జుట్టు ఆరబోసుకుంటున్నప్పుడు స్విగ్గీ కుర్రవాడు ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు. అందులో ఇడ్లీ, మసాలా దోసె, పూరీ రెండు రెండు చొప్పున పార్శెల్ చేసి ఉన్నాయి. ఆమె రెండిడ్లీలు తిని మిగతావాటిని డైనింగ్ టేబుల్ మీదే పెట్టేసి బాల్కనీలో కొచ్చి నిలబడింది. బాల్కనీ నిండా పూల కుండీలు.. సూర్యం వాళ్ళుంటున్నది నాలుగో అంతస్తులో ఉన్న త్రీ బెడ్రూం ఫ్లాట్. దానికి మూడు బాల్కనీ లున్నాయి. ప్రతి బాల్కనీలో రకరకాల మొక్కలున్న కుండీలున్నాయి. యింట్లో కూడా చాలా చోట్ల కుండీలు పెట్టి ఉన్నాయి.
ఓ గంట తర్వాత కొడుకూ కోడలు తిరిగొచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని ఎవరో తరుముతున్నట్టే గబగబా బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తొందరగా తయారయి ఆఫీస్‌కి వెళ్ళబోతున్న సమయంలో పనిమనిషి వచ్చింది. “మామూలుగా రోజూ ఆరింటికే వచ్చేస్తుంది అత్తమ్మా. ఈ రోజునుంచి ఎలాగూ మీరుంటారుగా. అందుకే ఈ సమయంలో రమ్మని చెప్పా. మధ్యాహ్నం అన్నం రైస్ కుక్కర్లో పెట్టుకోండి. రాత్రి వండిన కూరలూ పప్పు ఫ్రిజ్లో ఉన్నాయి. వెచ్చబెట్టుకుని తినండి” అంది సంధ్య.
పనిమనిషి ఇల్లంతా చిమ్మి తడిగుడ్డపెట్టి తుడిచింది. అంట్లు తోమింది. మొక్కలకు నీళ్ళు పోసింది. “కూరగాయలు ఏమైనా తరిగిపెట్టమంటారా?” అని అరుణని అడిగింది.
“ఆ పని కూడా నువ్వే చేయాలా ఏమిటి? నేను చేసుకుంటాలే” అంది అరుణ.
“ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలు తరిగి పెట్టేస్తే అమ్మగారికి వంట చేసుకోవడం సులువవుతుందమ్మా. పాపం అమ్మగారు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తారు కదా” అంది.
“ఈ రోజుకి వద్దులే. సంధ్యకు చెప్తాలే నేనే వద్దన్నానని” అంది అరుణ.
మధ్యాహ్నం భోజనం నిన్నటి కూరల్లో తినడానికి ఆమెకు మనసొప్పలేదు. ఫ్రిజ్ తెరిచి చూసింది. కూరగాయలేమీ లేవు. ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు కూడా లేవు. రెండు బంగాళా దుంపలుంటే తీస్కుని వాటికి చెక్కు తీసి సన్నటి ముక్కలు చేసి, వేపుడు చేసుకుంది. దాంతోనే తిని చివర్లో మజ్జిగ కలుపుకుంది. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని లేచాక కుండీల్లోని మొక్కల్ని శ్రద్దగా పరిశీలించింది. కొన్ని వాడిపోయి ఉన్నాయి. కొన్ని నీళ్ళు ఎక్కువ కావడం వల్ల కుళ్ళిపోయి ఉన్నాయి. ఒక్కో మొక్క దగ్గర కూచుని పాడై పోయిన కొమ్మల్ని. రెమ్మల్ని తుంచేసింది. కొన్ని కుండీల్లో మట్టి సగం కంటే తక్కువే ఉంది. దాని కారణం ట్యూబ్‌తో నీళ్ళు కొట్టడమే అన్పించిందామెకు. కొన్ని మొక్కలకు సరైన ఎరువు వేయకపోవటం వల్ల కృశించి పోతున్నాయనుకుంది.
సాయంత్రం ఆరయింది. కొడుకూ కోడలు వచ్చేలోపల వంట చేద్దామనుకుంది. కానీ కూరగాయలు లేవు. మార్కెట్లోకెళ్లామంటే ఎంత దూరమో తెలీదు. పోనీ ఎవర్నయినా అడిగి వెళ్తామన్నా ఇంటికి తాళం వేయాలి. ఆ టైంలో కొడుకూ కోడలు వస్తేనో.. ముద్దపప్పు చేసి తాలింపు వేసింది. తను వూరినుంచి తెచ్చిన ఆవకాయో మాగాయో కలుపుకుని నెయ్యి వేసుకుని తినొచ్చన్న ఆలోచన…
ఎనిమిదింటికి ఇద్దరూ వచ్చారు. “రోజూ ఇంతాలస్యమౌతుందా? అని అడిగింది అరుణ.
“ఆఫీస్ నుంచి నేరుగా జుంబా క్లాసులకి వెళ్తానత్తమ్మా. నేనక్కడ ఉండే గంట సేపూ ఈయనేమో పక్కనే ఉన్న ఫిట్‌నెస్ సెంటర్లో గడుపుతారు” అంది సంధ్య.
“జుంబా అంటే ఏంటి? ఏం నేర్పుతారక్కడ?”
“డ్యాన్సులు చేస్తాం.”
“డ్యాన్సులా? ఎందుకు?”
“లావు తగ్గడానికి. ప్రెగ్నెన్సీ రావటం ఆలస్యమెందుకవుతుందో తెల్సుకుందామని డాక్టర్ దగ్గరకెళ్ళి చెకప్ చేయించుకుంటే లావు తగ్గమన్నారు. అందుకే శ్రమపడ్తున్నా”
ఆ సమాధానం విన్నాక అరుణకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఫ్రిజ్‌లో కూరగాయలు లేవన్న విషయం గుర్తొచ్చి “కూరలు వండుదామంటే ఏమీ లేవేమిటి సంధ్యా” అని అడిగింది
“ఎందుకత్తమ్మా శ్రమ? పక్క వీధిలోనే కర్రీపాయింట్ ఉంది. హోం డెలివరీ కూడా చేస్తారు. మేము శనాదివారాలు తప్ప వంట చేసుకోం. ఓపికుండదు. శనాదివారాల్లో కూడా బిర్యానీలాంటివి తినాలనిపిస్తే స్విగ్గీ ఉండనే ఉందిగా’ అంటూ నవ్వింది సంధ్య.
“వద్దొద్దు. నేను ముద్ద పప్పు చేశాను. ఈ పూటకి దాంతో తినేయండి. రేపు మార్కెట్ కెళ్ళి నేనే కూరగాయలు కొనుక్కొస్తాను” అంది అరుణ.
అత్త చేసిన ముద్ద పప్పుతో ఎలా తినాలా భగవంతుడా అనుకుంది సంధ్య. ఆ అయిష్టాన్ని పైకి కన్పించనీయకుండా “కూరగాయల మార్కెట్ చాలా దూరం అత్తమ్మా కిలోమీటర్ పైనే వెళ్ళాలి. వాటిని తెచ్చుకుని, ముక్కలుగా తరిగి, వేయాల్సిన దినుసులన్నీ వేసి కూర వండుకునే బదులు కర్రీ పాయింట్లో ఆల్రెడీ వండి పెట్టిన కూరలు తెచ్చుకుని తినటం బెటర్ కదా. శ్రమకు శ్రమా ఉండదు. ఖర్చు కూడా తక్కువే”
“మన యింట్లో వండుకునే ఆహారంలో ఉండే రుచి, శుచి, శుభ్రత బైట కొనుక్కునే వాటికెక్కడ నుంచి వస్తుంది? రేపు నేను మార్కెట్లోకెళ్తాను. ఎక్కడో చెప్పు”
అత్త తన మాట వినదని అర్థమై, మార్కెట్ ఎక్కడో చెప్పాక “ఆటోలో వెళ్ళండి అత్తమ్మా. ముప్పయ్యో నలభయ్యో తీసుకుంటాడు” అంది.
ముద్దపప్పులో నెయ్యి వేసుకుని ఆవకాయ కలుపుకుని తింటుంటే సంధ్యకు అమృతంలా అన్పించింది. భోజనాలయ్యాక మొగుడూ పెళ్ళాలిద్దరూ టీవీ ముందు కూచున్నారు.
“ఇంటినిండా మొక్కలు పెట్టాలన్న ఆలోచన ఎవర్ది?” అని అడిగింది అరుణ.
“నీ కోడలికి మొక్కలంటే ప్రాణం అమ్మా అందుకే ఇంటిని రకరకాల మొక్కల్లో అలంకరించింది” అన్నాడు ఉత్సాహంగా సూర్యం.
“అంత ఇష్టమైనపుడు వాటి ఆలనా పాలనా పనివాళ్ళమీద వదిలేస్తే ఎలా? మొక్కల్ని పసిపాపల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోకపోతే వాడిపోతాయి. నీకు వీలైనపుడు మట్టి తెప్పించు. దాంతో పాటు ఎరువు కూడా. రేపట్నుంచి మొక్కలకు నీళ్ళు నేనే పోస్తాను” అంది అరుణ.
“ఎందుకత్తమ్మా శ్రమ? పనిమనిషుందిగా” అంది సంధ్య.
“కొన్ని పనులు మనం చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. మొక్కలకు నీళ్ళు పోయటం శ్రమనిపించదు. నాకూ మొక్కలంటే చాలా ఇష్టం”
మరునాడు ఇద్దరూ ఆఫీస్ కెళ్ళాక నడుచుకుంటూ పోయి కూరగాయలు కొనుక్కొచ్చింది. మొక్కలకు ట్యూబ్తో కాకుండా బకెట్లో నీళ్ళు నింపి మగ్‌తో ఒక్కో మొక్కకు ఎంత అవసరమో అన్ని నీళ్ళే పోసింది. రాత్రి వాళ్ళు వచ్చేసరికి కూరలూ పప్పూ వండి తయారుగా పెట్టింది. ఇద్దరూ ఆఫీస్ నుంచి వచ్చాక సోఫాలో సెటిలై టీవీకి అతుక్కుపోయారు. భోజనాలు చేశాక మళ్ళా పదిన్నర వరకు టీవీ చూసి పడుకున్నారు.
సూర్యం మట్టి తోలించాక కుండీల్లో మట్టిని సర్ది ఎరువు వేసింది అరుణ.
అరుణ వూర్నుంచి వచ్చి అప్పుడే నెల కావస్తోంది. రేపు తన వూరికి తిరిగెళ్ళడానికి టికెట్ తీసి పెట్టుకుంది. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర జీవితాన్ని సుఖమయం చేసే గాడ్జెట్స్ కొత్తగా మార్కెట్లోకి ఏమేం వచ్చాయో అనే దానిగురించి చర్చ జరిగింది. “మనం శ్రమపడి పళ్ళు తోముకోవాల్సిన అవసరం లేదట. ఆ పరికరాన్ని నోట్లో పెట్టుకుంటే చాలట. ప్రతి పన్నునీ శుభ్రపరిచేస్తుందట. ఎంత పేస్ట్ వాడాలి? ఎంతసేపు బ్రష్ చేయాలి లాంటి విషయాలు ఆలోచించక్కరలేదు. అన్నీ అదే చూసుకుంటుందట” అన్నాడు సూర్యం.
“చాలా బావుందండి. ఎంతట” ఉత్సాహపడిపోతూ అడిగింది సంధ్య.
“ఎనిమిది వేలే. రోజూ ఈ శ్రమపడటం కన్నా ఓసారి దాన్ని కొనిపడేస్తే చాలనుకుంటున్నా” అన్నాడు సూర్యం.
అరుణకు చాలా దిగులేసింది. వూరికి వెళ్ళే ముందు వాళ్ళు చేస్తున్న తప్పేమిటో చెప్పటం తన బాధ్యతనుకుంది.
“మీరు చేయాల్సిన పనుల్ని చేయడానికి బద్ధకించి వాటిని శ్రమనుకుంటున్నారు. ప్రతిదానికీ రిమోట్లు వాడుతూ, కూచున్న చోటునుంచి కదలకుండా రోజులు గడిపేస్తున్నారు. కానీ లావు తగ్గడానికి జుంబాలు, జిమ్లూ అంటూ డబ్బులు తగలేస్తున్నారు. ఫ్యాన్ ఆన్ చేయాలంటే లేచి స్విచ్ వేసుకోలేరా? దానిక్కూ డా రిమోట్ కావాలా? కూరగాయలు తరిగి వంట చేసుకోలేరా? కుక్కర్లూ నాలుగు బర్నర్ల స్టవ్లూ, మిక్సీలు ఉండనే ఉన్నాయిగా… తక్కువ శ్రమతో వంట ముగించడానికి. మొక్కలకు నీళ్ళు పోసుకోలేరా? మనసుకి ఎంత ఆహ్లాదాన్నిస్తుందో ఆ పని. ప్రతిదానికీ పనిమనుషుల మీదనో, యంత్ర పరికరాల మీదనో ఆధారపడటం మంచిది కాదు. మీరు చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని తప్పించి మిగతా ఏ పనైనా దాన్ని శ్రమనుకుంటే ఎలా? ఇంటిపనిని ప్రేమించడం నేర్చుకోండి” అంది.
మరునాడు స్టేషన్ బైట కారు ఆపి “బై అత్తమ్మా”, “బై అమ్మా” అన్న కొడుకు కోడలితో “కారుని పార్క్ చేసి స్టేషన్ లోపలికి రండి. నేను బ్రెయిన్ ఎక్మేవరకు ఉండండి. కార్లో తిరగడం కాదు. కారుదిగి నడవడం కూడా నేర్చుకోండి” అంటూ సూట్‌కేస్ పట్టుకుని లోపలికి నడిచింది. యాభై నాలుగేళ్ళ వయసులో కూడా సన్నగా నాజూగ్గా ఉన్న అరుణవైపు వాళ్ళిద్దరూ ఓ క్షణం చూసి కారు పార్క్ చేసి రావడానికి వెళ్ళారు.