ఓ భావుకుడి ప్రణయ భావన ‘ఆనందవర్ధనం’ కవిత

0
3

[శ్రీ స్తంభంకాడి గంగాధర్ రచించిన ‘ఆనందవర్ధనం’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, స్తంభంకాడి గంగాధర్ కలం నుండి జాలువారిన ‘ఆనందవర్ధనం’ కవితా సంపుటిలోని ‘ఆనందవర్ధనం’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. ఆనందవర్ధనం కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ఆనందమంటే శ్రేయస్సు కోసం తపించడం అనేది ఒక నిర్దిష్ట జీవశక్తుల అతిశయం అని చెప్పవచ్చు. నిరాశ, కృంగిపోవడం అనేది అధమ స్థాయి జీవశక్తి. మనమందరం ఆనందాన్ని అనుభవిస్తాం. కాని ప్రజలు ఆ ఆనందాన్ని కొనసాగించలేకపోవడం అనేది వాస్తవం అని చెప్పవచ్చు. సంతోషం కొరకు వెతకడం, సంతోషం పొందడం కొరకు ప్రయత్నించడం జరుగుతుంది. ఆనందం అర్థం ఒక కల్పిత ప్రదేశం. అక్కడ వింతలు ఉంటాయి. అద్భుత లోకంలో వింతలు జరుగుతాయి. మనుషుల జీవితంలో క్షోభ, దుఃఖం లేకుంటే వచ్చేది ఆనందం. మనసు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన ఆనందం. ఆనందం అంటే ఎటువంటి బాధలు లేకుండా హాయిగా ఉండటం అని చెప్పవచ్చు.

ఆనందం ఎక్కడ లభిస్తుంది? ఆనంద వర్ధనం అంటే ఆనందాన్ని వృద్ధి చెందించేది, ఆనందాన్ని పెంచేది అని చెప్పవచ్చు. ఇవ్వాళ మనం సుఖ సంతోషాలతో ఉంటున్నామా? ఆనందంగా ఉన్న క్షణాలు తక్కువే అని చెప్పవచ్చు. ఆనందం అంటే మనస్సునకు ఆనందంగా ఉండే స్థితి, అభిరుచి, సంతోషం, సంతసం అని సామాన్యార్థం. పారమార్థికంగా ఎనిమిది రకాల ఆనందాలు ఉన్నాయి. అవి 1) బ్రహ్మానందం, 2) విషయానందం 3) ఆత్మానందం 4) అద్వైతానందం 5) నిత్యానందం 6) యోగానందం 7) సహజానందం 8) పరమానందం. ‘అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం’ అనేది ఒక సినిమా పాట.

ఆనందం అనేది దయ, కృతజ్ఞత మరియు ప్రేమ, సామర్థ్యానికి సంబంధించినదని చెప్పవచ్చు. ఆనందం అంటే సంతృప్తి నుండి తీవ్రమైన ఆనందం వరకు ఇతరులతో పాటు సానుకూల లేదా ఆహ్లాదకరమైన భావోద్వేగాల ద్వారా నిర్వచింపబడే శ్రేయస్సు యొక్క మానసిక భావోద్వేగ స్థితి. మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక సమస్య మాయమైనప్పుడు లేదా మీరు ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు మనసు కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటుంది. నిరంతర ఆలోచనల నుండి ఉపశమనం పొందుతుంది. ఈ సమయంలో ఆనందం మీలో పెరుగుతుంది.

స్తంభంకాడి గంగాధర్ భావుకులు. భావాలతో అద్భుతమైన అల్లికలు అల్లుతారు. ఆయన భావాల్లో ప్రణయంను ముఖ్య వస్తువుగా తీసుకున్నారు. ప్రణయం ఉంటే ప్రేమ ఉంటుంది. ప్రణయాన్ని వస్తువుగా తీసుకొని కవిత్వం రాసిన వాళ్లను భావకవులు అంటారు. గంగాధర్ సంస్కృత పాఠశాలలో చదువుకున్నారు. సంస్కృత కావ్యాలతో పాటు తెలుగు సాహిత్యం విస్తృతంగా అధ్యయనం చేశారు. విద్యార్థి దశ నుండి గంగాధర్‌కు పద్యాలు, కవితలు, వ్యాసాలు రాయడం అలవడింది. గంగాధర్ కవిత్వానికి మొదటి పాఠకురాలు ఆయన శ్రీమతి శ్రీవిద్య అని చెప్పుకున్నారు. గంగాధర్, శ్రీవిద్య ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ప్రేమలేఖలు రాసుకున్నారు. గంగాధర్  శ్రీవిద్యలు పెళ్లి చేసుకున్నారు. బహుశ గంగాధర్ కవిగా రాణించడానికి ఆయన శ్రీమతి శ్రీవిద్య  ప్రోత్సాహం ఉందేమో అనిపిస్తుంది. భావకవులు ప్రధానంగా తీసుకునే వస్తువు ప్రణయం. ప్రణయ కవిత్వంలో ప్రేమ, ప్రేయసి, ప్రియులు – ఇవే వస్తువులుగా ఉంటాయి. ప్రణయ కవిత్వంలో కూడా గంగాధర్‍కు భాషా సౌష్టవం అలవడింది. గంగాధర్ కలం నుండి అద్భుతమైన భావాలు పండిస్తున్నారు.

‘సూర్య కిరణం సముద్రంతో రమిస్తే

మేఘం జనించినట్టు

నా భావం భాషతో సంగమించి

కవిత్వాన్ని ప్రసవిస్తుంది.’

భాష ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలపడానికి ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగపడే మాధ్యమం అని చెప్పవచ్చు. భాషకు లిపి, బాషా సూత్రాలు, వ్యాకరణం, సాహిత్యం ముఖ్యమైన అంశాలు. ఒకరిలో చెలరేగే భావాలు, ఆలోచనలు మరియు భావాలను వ్యక్తీకరించడానికి భాష అత్యంత శక్తివంతమైనది. భాష అంటే ఏమిటి? మనసులోని భావనను బహిర్గతపరిచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం అని చెప్పవచ్చు. భాష నాగరికతతో పాటు వృద్ధి చెందుతుంది. మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. మనిషి తన భావ ప్రకటన కోసం ప్రకృతిని సహజంగా వాడుకుంటాడు. భాషను శక్తివంతంగా మలుచుకోవడానికి ప్రకృతిలో గల అందమైన చెట్లను, జంతువులను, పక్షులను అన్నింటిని వాడుకుంటాడు. నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసి ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మకమైన సాహిత్య ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. అనుభవాన్ని వ్యక్తం చెయ్యడమే కాక దానిని మనకు అనుభూతి కలిగేటట్లు చేయటం కవిత్వం యొక్క పని. జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతిని అందివ్వడమే కవిత్వం యొక్క ధ్యేయం అని చెప్పవచ్చు. భావ కవిత్వం అంటే మేలు రకం కవిత్వం, సొగసైన భావాలతో కూడుకున్న కవిత్వం, హృదయాన్ని స్పందింప జేసే కవిత్వం. హృదయంలో పరిపూర్ణమైన అనుభూతిని పొందుతూ పదాలతో గీచే భావ చిత్రాలను భావ కవిత్వం అంటారు. భావకవి అనగా మనకు గుర్తుకు వచ్చే కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. భూతలం మీది నీరు వేడిమికి ఆవిరి అయి మేఘ రూపం దాల్చి ఆకాశంలో తేలుతుంటాయి. సూర్యకిరణాలు సముద్రంతో సంగమించడం వల్ల మేఘం ఏర్పడింది. గంగాధర్ కవి మనసులో కదలాడే భావంతో పాటు రూపుదిద్దుకున్న భాష పొంగి పొరలి వస్తుంది. భావం భాష కలిస్తేనే సృజనకు పునాది అయిన కవిత్వం పుడుతుంది అని చెప్పడం ప్రతీకగా ఉంది. కవిలో చెలరేగే భావాన్ని సూర్యకిరణంతో, భాషను సముద్రంతో, కవిత్వాన్ని మేఘంతో పోల్చడం వల్ల ప్రతీకాత్మక భావం ఏర్పడింది. భాష, భావం, కవిత్వం తాత్వికతలుగా తాదాత్మ్యం పొందాయని చెప్పవచ్చు.

‘తూర్పు రేఖలు పూర్తిగా వికసించక మునుపే

నా కవిత్వం కాగితపు నదిలో

అభ్యంగన స్నానం చేస్తుంది’

తెలతెలవారకముందే పక్షుల కిలకిలారావములతో ప్రకృతి పరవశం నొందే వేళ ఆకాశంలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుని లేలేత కిరణాలు భూమాత ఒడికి చేరక మునుపే కవిత్వం రాస్తాను. ఎక్కడ కవిత్వం రాస్తాను? కాగితంపై రాస్తాను. నేను రాసే కవిత్వం భావాల జల కాగితపు నదిలో ప్రవహిస్తుంది అని చెప్పాలి. కవిత్వం యొక్క సున్నితమైన భావాన్ని ఎంతో అందంగా మలిచారు. భావ చిత్రాలు ఒలికించారు. కవి గంగాధర్ బహుశా తెల్లవారకముందే లేచి కవిత్వాన్ని కాగితాల్లోకి ఒంపుతారేమో భావ చిత్రాల ధార కాగితంలోకి చేరి ప్రవాహంలా సాగుతుంది. కవిత్వం ఎక్కడైనా కాగితపు నదిలో స్నానం చేస్తుందా? కవిత్వం కాగితపు నదిలో అభ్యంగన స్నానం చేస్తుంది అని చెప్పారు. కుంభమేళా లాంటి ఉత్సవాల్లో గంగా యమునా నదుల్లో చేరి జనాలు తమ కోరికలు తీరాలని పాపాలు నశించాలని అభ్యంగన స్నానం చేస్తారు. కవి గంగాధర్ కవిత్వాన్ని కూడా కాగితపు నదిలో అభ్యంగన స్నానం చేయించడం ప్రతీకలా ఉంది.

‘అక్షర రూపం దాల్చే

నా భావనలు..

కలల కర్పూరాలు కావవి

ఎగిరే కపోతాలు!’

మనలో చాలామందికి కునుకు నిద్ర తీయడం ప్రారంభమైన కొద్దిసేపటికి ఏవేవో కలలు ప్రవాహంలా వస్తుంటాయి. మనిషికి వచ్చే కలలలో అద్భుతమైన విషయాలు, వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత కొన్ని కలలు మనలను ఆలోచింప చేస్తాయి. ప్రతి దినం మన ప్రమేయం లేకుండానే నిద్రలో అనేక రకాల కలలు వస్తుంటాయి. మనకు సాధ్యం కాని కోరికలు కలలో తీర్చుకోవడం జరుగుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. మనం నిద్రలేచేసరికి కలలను మర్చిపోతాం. కలలు కనడం వల్ల మన మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ది చెందుతాయి. కలలు గుర్తుండవు కనుక కరిగిపోతాయి.దేవాలయాల్లో మరియు ఇంటిలో కర్పూరం పూజలో ఉపయోగిస్తారు. దేవాలయాల్లో కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు. కర్పూరం కూడా వెలిగి కరిగిపోతుంది. కపోతం అంటే పావురం. పావురాన్ని పట్టణాలలో మన ఇంటి పరిసరాల్లో చూస్తుంటాం. పావురాలు ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తాయి. పావురాలు చూడ ముచ్చటగా ఉంటాయి. కవి గంగాధర్ కలం నుండి జాలువారే అక్షర జలపాతాలు భావనలుగా రూపం దాల్చి కవిత్వంగా పరిణమించడం సహజమే. కవి గంగాధర్ రాసిన అక్షరాల భావనలు మనిషికి వచ్చే కలవలె  కరిగిపోవు అని చెబుతున్నారు. నేను రాసే అక్షరాలు కరిగిపోయే కర్పూరాలు కావు అంటున్నారు. నా కలం నుండి దూసుకు వచ్చిన అక్షరాలు స్వేచ్ఛగా ఎగిరే పావురాలై ఉంటాయి. నేను రాసే అక్షరాలు సజీవంగా ఉంటాయి. నేను రాసే అక్షరాలు కలవలె, కర్పూరం వలె కరిగిపోవు. నా కవిత్వంలో స్వేచ్ఛగా నా భావాలను వెల్లడిస్తాను. ఆ భావాలు ఎప్పటికీ ఎగిరే కపోతాలై నిలుస్తాయని చెప్పడం చక్కగా ఉంది.

‘తళుకు బెళుకు రాళ్లు కావవి

మరకతమణులు’

తళుకు బెళుకు రాళ్ళు ఆంగ్లంలో Pebble Stones అని అర్థం. గంగాధర్ కవి నేను రాసే నా కవిత్వంలోని భావనలు ఊరక మెరిసే గాజు రాళ్లు కావు. గాజురాళ్ళ లాంటి కవిత్వం వ్యర్థం అని చెప్తున్నారు. నేను రాసే కవిత్వంలోని భావనలు అపూర్వం, అపురూపమైనవి. మరకతమణి శిలలతో చెక్కినట్లుగా ఉంటాయి. నా కవిత్వ భావనలు ఎప్పటికీ నిలిచిపోయేలా మరకతమణుల శిలలతో నవరత్నాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్పడం చక్కగా ఉంది. యోగి వేమనను స్ఫూర్తిగా తీసుకొని రాసినట్లుగా తోస్తోంది. నిజమైన మంచి నీలమణి ఒక్కటైన చాలును. ఊరక మెరిసే గాజురాళ్ళు తట్టెడు ఉన్నను వ్యర్థమే. చాటు పద్యము ఒక్కదానిని విన్నను చాలును గదా! అనేక  రస హీన పద్యములను విన్నను నిరుపయోగమే కదా అన్నారు వేమన.

‘మిణుగురుల చిహ్నాలు కావవి..

ప్రజ్వరిల్లే ప్రభాత జ్యోతులు!’

మిణుగురు పురుగులు ఒక రకమైన కీటకాలు. వర్షాకాలం శీతాకాలంలలో కనిపిస్తుంటాయి. మిణుగురు పురుగు కాంతి వేడి లేకుండా వెలుగును మాత్రమే ఇస్తుంది. కవి గంగాధర్ నా కవిత్వంలో వెల్లడించే భావాలు మిణుగురు పురుగుల వెలుగులు కావు. ఆరిపోయే దీపాలు వెలుగునివ్వవు. నేను రాసే కవిత్వం కాంతులు విరజిమ్మడమే కాదు. మండే అగ్నిగోళంలా, సూర్యుడి నుండి లభించే కాంతిలా ఎప్పటికీ నా కవిత్వం వెలుగును ప్రసరింపజేస్తుంది. నేను రాసే నా కవిత్వం ప్రకాశిస్తూ దేదీప్యమానమై నిలుస్తుంది అని చెప్పడం చక్కగా ఉంది.

‘హేమంతపు ప్రత్యూషలో పచ్చ గడ్డి పై

మంచు ముత్యాలు మనోహరంగా

పరుచుకున్నట్టు

తెల్ల కాగితంపై నా కవితాక్షరాలు

కమనీయంగా కథితమవుతాయి.’

హేమంత ఋతువు అంటే మార్గశిర పుష్య మాసములు అని చెప్పవచ్చు. హేమంత ఋతువులో వాతావరణం చల్లగా ఉంటుంది. హేమంత ఋతువులో చల్లదనంతో పాటు రాత్రి పూట ఆకాశం నుండి మంచు బిందువులు కురుస్తాయి. హేమంత మాసంలో రాత్రి కురిసిన మంచు పడి పచ్చగడ్డి పై ముత్యంలా మెరుస్తూ ప్రకాశవంతంగా కళకళలాడుతుండడం మనలను అబ్బురపరుస్తుంది. పచ్చగడ్డి పై మంచు బిందువులు సూర్య కాంతి సోకగానే మనోహరంగా ముత్యాలు పొదిగినట్టు కనపడుతాయి. అలాగే కవి గంగాధర్ నేను రాసే కవితలోని అక్షరాల కూర్పుతో కూడిన భావనలు అంత సొగసుగా కమనీయంగా ఉంటాయని చెప్పడం చక్కగా ఉంది.

‘నా మనో సుమం రాల్చే

భావాల మధువు

ఆనందవర్ధనం! అమృతతుల్యం!’

పువ్వు మీద వాలి తుమ్మెదలు  తేనెను సేకరిస్తాయి. కవి గంగాధర్ మనస్సు అనే  పువ్వు రాల్చే తేనె చక్కనైన భావాలతో నిండి ఉంటుంది. నా మనస్సు నుండి వచ్చే అక్షరాలు పువ్వుల యొక్క మకరందాన్ని పోలి ఉంటాయి. తేనె కూడా మధురంగా ఉంటుంది. నేను రాసే నా అక్షరాల భావనలు తేనెతో కూడుకుని ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. ఆనందం అలాగే కొనసాగుతుంది. నా మనస్సు పుష్పం నుండి రాలే అక్షరాలు తేనె లాగా మృతం లేకుండా శాశ్వతంగా ఉంటాయి. నా మనో సుమం రాల్చే భావాలు తీయనైనవి. మకరందాన్ని పోలి ఆనందాన్ని ఇస్తాయి. నేను రాసే భావాలకు చావు లేదు. నేను రాసే భావాలు అమృతతుల్యమై  ఉంటాయని చెప్పడం చక్కగా ఉంది.

‘ఊయల నుండి ఊపిరి ఆగేదాకా

ఊహలు ఊరేగుతునే ఉంటాయి.’

శిశువు పుట్టగానే ఊయలలో వేయడం మనం చూస్తూనే ఉంటాం. శిశువుగా నేను పుట్టినప్పటి నుండి నా మనస్సులో ఊహలు పల్లకి ఎక్కి ఊరేగుతున్నాయి. నాలో చెలరేగే ఊహలు ఊపిరి ఆగే దాకా కొనసాగుతుంటాయి. పసితనంలోనే భావాలు ఊపిరిపోసుకున్నాయి. అట్టి నాలో చెలరేగే భావాలు ఊపిరి ఆగేదాకా కొనసాగుతుంటాయి అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

‘శైశవం నుండి శ్వాసాంతం దాకా

కవిత్వాన్ని శ్వాసిస్తూనే ఉంటాను.’

శైశవం ఆంగ్లంలో Infancy అని అర్థం. శిశువు దశ నుండి చివరి దశ అయిన ఊపిరి ఆగేంత వరకు కవిత్వాన్ని రాస్తూ ఉంటాను కవిత్వాన్ని శ్వాసిస్తూనే ఉంటాను అని చెప్పడం కవి గంగాధర్‌కు కవిత్వం పట్ల గల అవ్యాజమైన ప్రేమను తెలియజేస్తున్నది.

‘నా కవిత్వం..

ప్రణయ జ్వలిత ఉద్దీపనం!’

భావ కవిత్వపు ప్రధాన వస్తువులైన ప్రకృతి కవిత్వం, ప్రణయ కవిత్వం అని చెప్పవచ్చు. ప్రణయ కవిత్వంలో ప్రేయసి ప్రియులు వారి ప్రేమకు సంబంధించిన కవిత్వంతో కూడుకుని ఉంటుంది.

ఇందులో ఏక వస్తువు ప్రణయం అని చెప్పవచ్చు. చీకటి లేకుండా ప్రేయసి ప్రియుల ప్రేమ వెలుగుతుంది. కవి గంగాధర్ ప్రణయ కవిత్వం వస్తువుగా తీసుకొని కవిత్వం రాస్తున్నట్లుగా తోస్తోంది. ప్రణయ కవిత్వంతో పాటు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించడం, ప్రకృతి పట్ల గల అపురూపమైన ప్రేమను తెలియజేస్తుంది.

‘నా కవిత్వం..

హృదయ విజయ కేతనం!!’

నేను రాసే కవిత్వం హృదయాలను గెలుచుకొని ప్రేమపూరితమైన భావాలను వ్యక్తం చేస్తుంది. హృదయగతమైన భావాలు విజయాన్ని ఆనందాన్ని ఇనుమడింప చేస్తూ జెండాలా నిలుస్తాయని గంగాధర్ చెప్పడం అద్భుతంగా ఉంది.

కవి గంగాధర్ మంచి కవితా సుమాలు వెలువరించాలని మనసారా కోరుకుంటున్నాను.


స్తంభంకాడి గంగాధర్ 09-09-1974 తేదిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల ధర్మపురి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లలితమ్మ, నారాయణ. తండ్రి నారాయణ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. తాత సీతారాములు, నాయనమ్మ లచ్చవ్వ. తాత సీతారాములు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. గంగాధర్ విద్యాభ్యాసం 12-06-1979 తేదిన ధర్మపురి లోని వెంకటరమణ సారు వద్ద ప్రారంభమైంది. ఒకటవ తరగతి నుండి నాలుగో తరగతి వరకు శ్రీ దయానంద గీతా విద్యాలయం చదువుకున్నారు. 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, ధర్మపురిలో చదివారు. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధర్మపురిలో చదివారు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ధర్మపురిలో చదివారు. డిగ్రీ బి.ఏ. (ఎల్) శ్రీ లక్ష్మి నరసింహ ఓరియంటల్ కళాశాలలో చదివారు.

గంగాధర్ తెలుగు పండిత్ శిక్షణ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ, వరంగల్‍లో పొందారు. ఎం.ఏ.తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఎం.ఏ. సంస్కృతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. గంగాధర్ మూడు సంవత్సరాలు ప్రైవేట్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేశారు. గంగాధర్ 04-04-2002 నాడు బోయినిపల్లి మండలం, కరీంనగర్ జిల్లా, అనంతపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు.

గంగాధర్ కు అక్కయ్య, ఇద్దరు చెల్లెల్లు కలరు. 1) అక్కయ్య పద్మ. భర్త సత్యనారాయణ. 2) చెల్లెలు సునీత. భర్త శ్రీనివాస్. 3) చెల్లెలు అనిత. భర్త నరేందర్.

గంగాధర్‌కు 18-11-1995 నాడు శ్రీవిద్యతో వివాహం గోదావరి ఖనిలో జరిగింది. గంగాధర్ శ్రీవిద్య దంపతులకు ఇద్దరు సంతానం. 1) గౌతమ్ సాయి 2) రోహిత్ సాయి.

గంగాధర్ పదవ తరగతి చదువుతున్నప్పటినుండి రచనా వ్యాసంగం ప్రారంభించారు. గంగాధర్‌కు 9 ఏళ్ల వయసు నుంచి పుస్తక పఠనం అలవడింది. గంగాధర్ కరీంనగర్‌లో స్వగృహం నిర్మించుకున్నారు. ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

గంగాధర్ వెలువరించిన ముద్రిత పుస్తకాలు – ఆనంద వర్ధనం కవితా సంపుటి, 2021; అమృతతల్పం కవితా సంపుటి,2021.

1) గంగాధర్ తేది 05-09-2018 రోజున కరీంనగర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్నారు.

2) 2008 సంవత్సరంలో సత్య సాయి సేవా సమితి కరీంనగర్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

3) అఖిల భారతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.

4) కరీంనగర్ జిల్లా సాహితీ గౌతమి కోశాధికారిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.

గంగాధర్ వివిధ సాహిత్య సంస్థల సమావేశాల్లో కవిగా వ్యాఖ్యాతగా పుస్తక పరిచయం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here