సందిగ్ధత

2
2

[box type=’note’ fontsize=’16’] సందిగ్ధత తొలగి, పాత మనుషుల్లో కొత్త జీవితపు ఆశలు మొలకెత్తిన వైనాన్ని కథగా అందిస్తున్నారు దొండపాటి కృష్ణ. [/box]

[dropcap]“ఆ[/dropcap].. హలో.. లక్ష్మీ ..! నేనే..! బిజీగా ఉన్నావా..? లేదా..? మా ఇంటికి ఒకసారి రావే! కొంచం మాట్లాడాలి. నాకేదో టెన్షన్‌గా ఉంది” అని చెప్పి ఫోన్ పెట్టేసి, తక్షణ కర్తవ్యమేమిటని ఆలోచించసాగింది తులసి.

సమస్య ఎదురైనప్పుడు సలహాలు ఇవ్వడం సులభం. ఎంతటి ఉద్దండులకైనా అదే సమస్య ఎదురైతే ఆలోచన తట్టదు. వాళ్ళు గట్టెక్కించకపోయినా, సాంత్వన కొరకైనా సాయం తీసుకోవాల్సిందే!

కూతురిష్టమే తన ఇష్టంగా భావించి భారాన్నంతా భార్యమీదకు త్రోసేశాడు రాఘవరావు. భర్తమీద ఒకింత కోపం, కూతురి భవిష్యత్ గురించి ఒకింత కలవరంతో ఊపిరాడడం లేదు. అలా అనడం కన్నా వసుంధర ఊపిరాడనివ్వడం లేదని చెప్పడం సబబేమో! తల్లి టెన్షన్ పడుతుంటే కూతురు రంజని మాత్రం నిశ్చింతగా ఉంది. ఆలోచనల్లో ఉండగానే లక్ష్మీ వచ్చింది. ఇంటిదగ్గరే ఉన్న రాఘవరావు, రంజనిలను పలకరించి వరండాలో కూర్చున్న తులసి దగ్గరికొచ్చి ప్రేమగా చేయి వేసింది.

“చెప్పవే..! ఏంటి సంగతి..?” సుత్తి లేకుండా విషయానికోచ్చేసింది. అలా ఉండడమే తనకు నచ్చుతుంది. చుట్టుపక్కల వాళ్లకది నచ్చక ముక్కుసూటి మనిషితో వేగడం కష్టమని ముద్రేశారు. మంచి విజ్ఞురాలు కూడా. మనస్సు చంపుకునే మనస్తత్వం కాదు. మనస్సు విప్పింది తులసి.

“వసుంధర మళ్ళీ ఫోన్ చేసిందే!” ఫోన్ వచ్చిన సంగతి చెప్తూ నిట్టూర్చింది.

“ఈసారేమంటుంది?” అడిగింది లక్ష్మి.

“అన్నవరం వెళ్తున్నారంట! బంధువులంతా కలిసి వ్రతం చేస్తున్నారంట. అక్కడకు మనమ్మాయితో వెళ్తే ఒప్పుకున్నట్లని లేకపోతే లేదంది..!” చెప్పింది తులసి.

“మరేం చేద్దాం?” దీర్ఘంగా ఆలోచిస్తూ అడిగింది లక్ష్మి.

“మన తెలివి తెల్లారగాను. ఏం చేయాలో తెలిస్తే నిన్నెందుకు పిలవడం?” అంది తులసి. ఆ కంగారు ఆమె మొహంలో స్పష్టంగా తెలుస్తుంది.

“మనమ్మాయేం అంటుందే..” అడిగింది లక్ష్మి- వాళ్ళ అంతరంగాలను తెలుసుకోవాలని.

“అమ్మాయి వద్దంటుంది. వాళ్ళ స్టేటస్, మన స్టేటస్ కలవదని చెప్తుంది. ఎక్కడో ఇంటర్వ్యూలో చూసి, నచ్చానని ఇంటికి రాయబారం పంపించాడని కాస్త కోపంగా ఉందే” చెప్పింది కూతురు అంతరంగాన్ని తులసి.

“ఇందులే స్టేటస్ల గురించి మాట్లాడుకోవడానికేం ఉందిలే… అంతేనా కారణం ఇంకేదన్నా ఉందా..?” పట్టుబట్టి మళ్ళీ అడిగింది లక్ష్మి.

“ఏ.సి.లో పుట్టి పెరిగినవాడు, బాగా చదువుకున్న వాడు. అస్తమానం ఏ.సి.లో ఉంటే జుట్టు ఊడిపోదూ..? ఆ మాత్రం దానికే వయసులో పెద్దవాడని అనడం దేనికి? వాళ్ళ స్టేటస్ ఎక్కువ కాబట్టి మనమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేస్తారో చేయరో, న్యూస్ పేపర్లలో ఇలాంటివెన్నో చూస్తున్నామని ఆయన అనగానే అది కూడా ఆయనకే వంత పాడుతుంది. ఆయన గురించి నీకు తెలియంది ఏముంది చెప్పు. మంచి సంబంధం చేయి జారిపోతుందేమోనని అనిపిస్తుందే.. నువ్వే ఏదన్న దారి చూపాలి..” ప్రాధేయపడుతూ అడిగింది తులసి. మౌనం వహించారిద్దరూ! గతం గుర్తు చేసుకుంటే ఏదన్నా సమాధానం దొరకోచ్చనే ఉద్దేశ్యంతో ప్రయత్నం చేసింది లక్ష్మీ.

* * *

విజ్ఞులైనా, విద్యావంతులైనా నలుగురు చేయలేని పనిని, చేయడానికి వెనకాడితే వాళ్ళూ అందరితో సమానమే! చేయలేరనుకున్న దాన్ని కూడా చేసి చూపడానికి చాలా ధైర్యం కావాలి. పొరుగువాళ్ళ విమర్శలను ఎదుర్కోవాలి. అదే ఓ ఆడది, ఆ పని చేస్తే ఎక్కడలేని ప్రచారం వచ్చేస్తుంది. భర్త దూరమైనా ఉన్నత విలువలతో ఉన్న వసుంధర చేసి చూపించింది.

వసుంధరకు ఒక్కగానొక్క కొడుకు నరేష్. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకోవడంతో ఆ లోటు తెలియకూడదని అడిగినవన్నీ అందుబాటులో ఉంచేది. అడిగితే కాదనేది కాదు. డబ్బుకు లోటు లేదు. మంచి మర్యాదలకు డోకా లేదు. అనుకున్నది, కావాల్సింది ఏదైనా సరే దక్కి తీరాల్సిందే! పెద్ద సాఫ్ట్‌వేర్ కంపనీలో చేరిన కొద్ది రోజుల్లోనే ప్రమోషన్స్ తెచ్చుకుని హెచ్.ఆర్. మేనేజర్ స్థాయికెళ్లాడు. ప్రతి యేడు కొత్త ఉద్యోగులను నియమించుకునే క్రమంలో ఒక కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడే బీటెక్ పైనలియర్ చదువుతూ, క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైన రంజనిని చూసి ఇష్టపడ్డాడు. ఆ ఇష్టంతోనే ఇంటర్వ్యూని తనే స్వయంగా నిర్వహించి ఆమె గుణగణాలను పరిశీలించాడు. అవెంతగానే అతన్ని ఆకర్షించాయి.

“మొదట్నుంచి వరుసలు కలుపుతున్నానని ఏమీ అనుకోవద్దు అన్నయ్యగారు. నాకు ఒక్కగానొక్క కొడుకు నరేష్. డబ్బుకు లోటు లేదు. రీసెంట్‌గా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మీ అమ్మాయి రంజనిని చూసి ఇష్టపడ్డాడు. మొన్నీమద్యే నాకా విషయం చెప్పాడు. ఏదోలే చెప్తున్నాడని ఊరుకున్నాను. అమ్మాయిని ఇష్టపడుతున్నంతగా మరెవ్వరినీ ఇష్టపడడం లేదని అర్థమైంది. మీ అమ్మాయి మా ఇంటి కోడలిగా చేసుకోవడానికి మాకే అభ్యంతరం లేదు. పిల్లలు ఇష్టపడ్డాక కుల మత పట్టింపుల్లేవ్. మీ నిర్ణయమెంటో చెప్తే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు” అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పేసింది – కొన్ని రోజుల తర్వాత తన స్నేహితురాలిని వెంటబెట్టుకుని రాఘవరావు-తులసిల ఇంటికొచ్చిన వసుంధర. దంపతులిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

“మా కూతురి నిర్ణయం తెలుసుకోకుండా మా నిర్ణయం చెప్పలేమమ్మా…” అన్నాడు రాఘవరావు.

“అమ్మాయి నిర్ణయమెంటో కనుక్కోండి వదినగారు” అంటూ పక్కనున్న గదివైపు చూసింది వసుంధర. తలుపు దగ్గరే నిలబడి జరుగుతున్నదంతా చూస్తున్న రంజని తలుపు వేసేసింది. ఆ సంఘటనకు నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని కబురంపుతామని పంపేశారు. ఆశించినది కాకుండా మరో సమాధానం రావడంతో తట్టుకోలేని వసుంధర, కార్యసాధనకై ఈ సారి ఒంటరిగానే వచ్చింది.

“చూడండి అన్నయ్యగారు! అమ్మాయి చదువుకోవాలని వంక చెప్పడం కరెక్ట్ కాదు. అమ్మాయిని మేం చదివించుకుంటాం.. తను నిక్షేపంగా ఎంతవరకైనా చదువుకోవచ్చు. మీరటువంటి భయాలేం పెట్టుకొనవసరం లేదు” అంది – మరింత నమ్మకాన్ని కలిగించడానికి.

“చూడమ్మా! సంసారంలోకి దిగితే, ఇప్పుడు మాట్లాడుకున్న మాటలేం అప్పుడు పని చేయవు. తను చిన్నపిల్ల. మాకుందీ తనోక్కటే.! పెళ్లనేసరికి తను భయపడుతుంది. మంచి నిర్ణయం తీసుకోవడానికి మాకూ కొంత సమయం కావాలి కదా.. పైగా మీలాంటివారి మధ్య సఖ్యంగా నడుచుకునే తీరు తనలవాటు చేసుకోవాలి కదమ్మా..” అన్నాడు.

“మీరెలా చూసుకున్నారో మేమూ అలాగే చూసుకుంటాo అన్నయ్యగారు. నాదీ హామీ! తనని మాలో మేం కలుపుకుంటాం. బయట విషయాలు విని మీరేం కంగారు పడొద్దు” భరోసానిచ్చింది వసుంధర.

“వదినగారు! మీరు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మేం అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాని బయటవాళ్ళ గురించి కాదండి” అంటున్న భార్య వైపు భర్త చూసేసరికి సర్దుకుంది తులసి.

“23 సంవత్సరాల అమ్మాయి చిన్నపిల్లేం కాదు. అలా అనుకుంటే మనమే వయస్సులో మెట్టినింట్లో అడుగుపెట్టామో గుర్తుకు తెచ్చుకోండి వదినా! నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు. ఆయన నా లోకం నుండి దూరమైన దగ్గర్నుంచీ వాడే లోకం అయ్యాడు. వాడికి కావాల్సింది లేదనకుండా ఇవ్వడమే నా బాధ్యతగా పెట్టుకున్నా. మొదటిసారి వాడిముందు ఓడిపోదల్చుకోలేదు. చిన్నచిన్నవి దక్కకపోతేనే తట్టుకోలేం కదా! అలాంటిది జీవిత భాగస్వామిగా రావాల్సిన అమ్మాయి దూరమైపోతుంటే ఎలా ఉండగలడు చెప్పండి? వాడినలా చూస్తూ నేనుండలేను. మీరింకా నమ్మకపోతే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడను. కాకపొతే స్థాయి అడ్దోస్తుందంతే..!” అంటూ కంట తడి పెట్టుకుంది.

కొంత సమయం కావాలని చెప్పి పంపించేశారు. అప్పట్నుంచీ వీలున్నప్పుడల్లా ఫోన్ చేసి అడుగుతూనే ఉంది. వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. సంబంధం కుదుర్చుకోవాలో వద్దోనని సందిగ్ధత మాత్రం వదల్లేదు. ఇంతలో ఊహించని ట్విస్ట్.

అన్నవరం సత్యనారాయణస్వామీ ఆలయంలో బంధువులతో వ్రతం చేపట్టబోతుంది వసుంధర. అక్కడికి రాఘవరావు కుటుంబాన్నీ ఆహ్వానించింది. కాకపొతే ఒక కండీషన్ పెట్టింది. సంబంధానికి ఒప్పుకుంటున్నట్లయితే రంజనీని కూడా తీసుకురావాలని లేని పక్షంలో సంబంధాన్ని వద్దని ఖరాకండిగా చెప్పేసినట్లేనని షరతు పెట్టారు. ఇదే ఆఖరిసారిగా అడగడమనీ చెప్పింది. ఎటూ తేల్చుకోలేక లక్ష్మికి ఫోన్ కలిపింది తులసి.

* * *

జరిగినదంతా గుర్తు చేసుకున్నాక ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది లక్ష్మి. ఏం సలహా ఇవ్వబోతుందని ఆతృతగా తనవంకే చూస్తుంది తులసి. ఆడోళ్ళ బాతాఖానీ ఇప్పట్లో తేలదని మెల్లగా జారుకున్నాడు రాఘవరావు.

“వాళ్ళు అడిగిన దాంట్లోనూ తప్పులేదే తులసి. ఇన్నిరోజులు వాయిదా వేయడం మన తప్పే. ఆడపిల్లలకు పెళ్ళంటే భయం పట్టుకోవడం సహజమే. రంజనీకి ఇంకా భయం పోయినట్లులేదు. మనమ్మాయి పరంగా కాకుండా, నరేష్ కుటుంబం మీద చెడు అభిప్రాయమైతే లేదు కదా! మనమ్మాయి కావాలని వచ్చిన వాళ్ళ తాహతు గురించి ఆలోచించకు! ఎదుటివాళ్ళ ముందు మనమ్మాయి స్థాయిని తక్కువ చేసి మాట్లాడే రకం కాదేమో అన్పిస్తుంది. కష్టపడి పైకెదిగిన కుటుంబం వాళ్లదని నువ్వే చెప్తున్నావ్. భర్త లేకపోయినా మొండిగా బ్రతికిన విషయాల్ని తెలుసుకున్నావ్. అటువంటప్పుడు అనవసరమైన భయాలేందుకు చెప్పు? అమ్మాయి భయాన్ని ఆసరా చేసుకుని మంచి సంబంధం పోగొట్టుకోవడం దేనికే? ఒక పనిచేద్దాం! నేనూ మీతో వస్తాను. అమ్మాయిని కూడా తీసుకెళ్దాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అరవై, డెబ్బై శాతం నచ్చితే ఒప్పేసుకుందాం. లేకపోతే వద్దని చెప్పేద్దాం. కాస్త గొడవ జరగోచ్చేమో. అర్ధమయ్యేలా చెప్దాం. నువ్వేక్కువ కంగారు పడకు. మనం వస్తున్నామని కబురెట్టు. మిగిలిన సంగతి అక్కడ చూద్దాం. సరేనా.?” అంటూ సలహా ఇచ్చింది లక్ష్మి.

* * *

లక్ష్మి మీద నమ్మకం తులసిని ఒప్పుకునేలా చేసింది. రాఘవరావు, తులసి, లక్ష్మీ, రంజనీ అందరూ కలిసి అన్నవరం వెళ్ళారు. ఇష్టం లేకుండా తీసుకెళ్ళినందుకేమో రంజని అయిష్టంగా ప్రవర్తిస్తుంటే, లక్ష్మీ తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఏవేవో ఊసులు చెప్తుండడాన్ని, దంపతులిద్దరూ చూస్తూ ఉండిపోయారు. కాకినాడ నుంచి అన్నవరం చేరుకోవడానికి ఊహించినతసేపు పట్టలేదు. అంకెల్లో లెక్క పెట్టలేకపోయారు కాని అరికాళ్ళల్లో సత్తువంతా మునివేళ్ళపైకి వచ్చేసింది. భక్తి ముందు బాధలు పెద్ద లెక్క కాదుగా!

రంజనితో పాటు వచ్చిన వారిని చూసి వసుంధర, ఆమె బంధుగణం చాలా ఆనందంతో ఆహ్వానం పలికారు. రంజని మొహంలో సంతోషం లేకపోవడం గమనించిన వసుంధర ఇష్టం లేకుండా తీసుకోచ్చుంటారని అంచనా వేయగలిగింది. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టానిష్టాలతో పనిలేదు. పెద్దల నిర్ణయాలే కీలక పాత్ర పోషిస్తాయి. వరుడు కాని, వధువు కాని నచ్చినా నచ్చకున్నా పెద్దలిరివురికి సమ్మతమైతే ఆ పెళ్లి జరిగి తీరుతుంది. తర్వాత వారే ఇష్టమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలి. రంజనిని చాలాసేపు గమనించింది వసుంధర. రంజనిలో మార్పు లేదు. వసుంధర కంగారును పసిగట్టిన లక్ష్మి ఆమెను పక్కకు పిలిచి ఏం చెప్పాలో చెప్పి, నేర్పు ప్రదర్శించింది.

నోటిదాకా వచ్చినదాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఏమైనా చేస్తాం. లక్ష్మి అడిగింది కూడా తప్పింది కాదు. వసుంధరకు సమ్మతమైనదే! రంజనికి చెవిలో ఏదో చెప్పింది లక్ష్మి. నరేష్ కు చెవిలో ఏదో చెప్పింది వసుంధర. రంజని అయిష్టంగానూ, భయం భయంగానూ ఉంటే నరేష్ అమితానందంతో కనపడుతున్నాడు. అసలేం జరుగుతుందో అర్ధం కాలేదు దంపతులిద్దరికీ. కంగారొచ్చి లక్ష్మిని అడిగాడు రాఘవరావు.

“మనం అనుకున్నదంతా వసుంధరకు చెప్పేశాను. అర్థం చేసుకోమని అభ్యర్ధించాను. అందుకే పెళ్లిచూపులే అనుకోండి, మరేదైనా అనుకోండి. వారిద్దరిని దగ్గరికి పిలిచి ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకోమని, ఎవరి నిర్ణయాలు వాళ్ళను చెప్పమని చెప్పాను. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకోవాలని, గొడవలకు దిగకూడదని కూడా నిక్కచ్చిగా చెప్పేశాను. అందుకు సరేనంది. చదువుకున్న వాళ్ళు కాబట్టి అర్ధం చేసుకోగలిగారు. అప్పుడే మనమ్మాయికి చెప్పాను. అతనితో మనస్సు విప్పి మాట్లాడమని, ఫీలింగ్స్ అన్నీ చెప్పమని, ఒకరి గురించి – భవిష్యత్ గురించి అన్నీ మాట్లాడుకోమని చెప్పాను. ఒకరి గురించి ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటేనే కదా అంతరంగం బయటపడేది. ఎవరికేం కావాలో గుర్తేరిగేది. ఇద్దరికీ నచ్చితే పెళ్ళికి అంగీకరిస్తాం. లేకపోతే లేదని చెప్పాను” వివరించింది లక్ష్మి.

హోమం దగ్గర వేడి మండుతోంది. దంపతులిద్దరిలోనూ అదే వేడి రగులుతోంది. మొహమాటంగానే రంజని అతనివెంట కాస్త ఏకాంతంగా నున్న చోటుకెళ్ళింది. వాళ్ళ మనస్సేమో వ్రతం మీదుంటే వీళ్ళ మనస్సేమో కూతురి మీదుంది. కొద్దిసేపటికి రాఘవరావు కంటినుండి దూరమయ్యారు. వ్రతం దగ్గర్నుంచి కదలకూడని పరిస్థితి. ఒత్తిడి పెరిగిపోతుంది.

“నేను 2014 లో ఏమ్.సి.ఏ. కంప్లీట్ చేయగానే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యాను. అమ్మ బిజినెస్‌ను ఎలాగూ నేనే చూసుకోవాలి కాబట్టి ఎక్స్‌పీరియన్సు కోసం బాగా కష్టపడ్డాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. నా ఇంటెన్షన్ చూసి, మేనేజ్మెంట్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ పానల్‌లో నన్ను కూడా ఇంక్లూడ్ చేశారు. అలా మీ కాలేజీ కొచ్చినప్పుడు చూశాను. జాబ్ వస్తుందో రాదోనని నువ్వు పడుతున్న టెన్షన్ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఎప్పుడూ అమ్మాయల్ని పట్టించుకోని నాలో నీ అమాయకత్వం బాగా నచ్చింది. నిన్ను అబ్సర్వ్ చేశాను. చిన్నపిల్లల మనస్థత్వం నీది. అందుకేనేమో బాగా నచ్చావ్. వెయిట్ చేయడం దేనికని అమ్మతో కబురంపాను” అంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు నరేష్. తలొంచుకొని మొహమాటంగా వింటూ కూర్చుంది రంజని. అతని మాటల్లో ఆమెకు స్వచ్ఛత కనిపించింది.

“ఎంత నచ్చితే మాత్రం అలా మీ అమ్మను పంపించేస్తారా..? కనీసం ఆలోచించుకునే టైమే ఇవ్వరా..? అమ్మో.. మీ అమ్మగారు ఊపిరాడనివ్వలేదు తెలుసా..? భయం వేయదా మరి..” అంది అతనివైపు చూస్తూ.

“అవునా..? అంతలా ఇబ్బంది పెట్టిందా..? సారీ రా… నాకు తెలియదు. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. నేనేదడిగినా కాదనదు. అస్సలు కోపం తెచ్చుకోదు నా విషయంలో.. సరే… చెప్పు… నేను నచ్చానా లేదా..?” తన అభిప్రాయాన్ని అడిగాడు.

“అలా సడన్ గా అడిగితే ఎలా..? ఆలోచించుకోవద్దా..!” అందామె.

“ఎంతసేపు ఆలోచిస్తావో ఆలోచించు. కాని ఓకే అని చెప్పు చాలు” అన్నాడు ఆనందంగా.

“అమ్మో… అప్పుడే పెళ్లి చేసేసుకుంటే ఎలా…! చాలా తిరగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇంకా చదువుకోవాలి. మంచి జాబ్ చేయాలి… ఎన్ని ఉన్నాయో… అవన్నీ లేకుండా ఎలా?” ప్రశ్నించింది రంజని. ఆమె అంతరంగాన్ని అర్ధం చేసుకున్నాడు నరేష్.

“హహ్హహ్హ… ఆ కోరికలు నీకే కాదు. నిన్ను చూసిన దగ్గర్నుంచి నాకూ కలిగాయి. అన్నింటినీ ఫుల్‌ఫిల్ చేస్తాను. జాబ్ అంటావా.. మన కంపెనీని చూసుకుంటే సరిపోదూ.. ఒకరికింద నువ్వు పనిచేసేదేంటి… నువ్వే ఇంకొకరికి పనివ్వొచ్చు.” అన్నాడు నరేష్ – అధికారాలన్నీ ఇచ్చేస్తున్నట్లు.

“ఏమో బాబు. మీ అబ్బాయిలు ఇలాగే అంటారంట. పెళ్ళయ్యాక ఏమీ ఉండదంట. మీ సర్కిల్ అంతా చాలా పెద్దది, గొప్పోళ్ళు. నేనా పాష్ కల్చర్‌కి అలవాటు పడలేను బాబు” అంది ముందరి కాళ్ళకు బంధం వేస్తూ రంజని.

“ఓ… అదా నీ భయం.. నాకూ ఆ పాష్ కల్చర్ నచ్చదు. అందుకే అచ్చమైన తెలుగమ్మాయిని ఇష్టపడ్డాను. నువ్వు ఇష్టపడాలే కాని ఆఫీస్‌లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. అమ్మకు నేను చెప్తాను. నువ్వేం అలాంటివి మనస్సులో పెట్టుకోకు..” అని కొద్దిగా ఊపిరి ఒదిలి మళ్ళీ అందుకున్నాడు నరేష్. కాని స్వరం మారింది. అందులో నిరాశ ప్రవేశించింది.

“ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారని అమ్మ చెప్పడంతో నీకోసమని ఈ గాజుబొమ్మను గిఫ్ట్‌గా తెచ్చాను… తీరా చూస్తే నీకు నేను నచ్చినట్లుగా అనిపించడం లేదు. నేను బాధ పడకూడదని అమ్మే అలా చెప్పుంటుంది” అని నరేష్ అంటుంటే అతని చేతిలోని బొమ్మని తీసుకొని ముద్దు పెట్టుకుంది రంజని. ఆ సన్నివేశానికి ముగ్డుడైపోయాడు నరేష్.   వ్రతం ఫలితమో, మంచి జరగాలన్న ఆశయం ఫలితమోగాని నవ వధూవరులిద్దరూ ముచ్చటగా కలిసిపోయి మాట్లాడుకోవడం పెద్దల కంట పడింది.

“చూడండి వదినగారు! చిన్నపిల్ల చిన్నపిల్ల అన్నారు. సరైనా తోడు దొరికితే కన్నవాళ్ళు కూడా కనపడరు ఈకాలం పిల్లలకు. మనమిక్కడ ఉన్నా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారంటే ఈ సంబంధం ఖాయమైనట్లే!” కొడుకు సాధించుకున్నందుకు సంబరపడింది వసుంధర. దంపతుల నేత్రాలు విచ్చుకున్నాయి. ఆనందం ఓ వర్ణమై కన్పించింది. అంతలోనే మబ్బు కమ్ముకొచ్చింది.

ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఇది తప్పదేమో! అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి గడపదాటి మెట్టినింటినే సొంతింటిగా మార్చుకోవడానికి వెళ్ళిపోతుందన్న సంగతే బాధిస్తుంది. మగువ ప్రకృతితో సమానం. ప్రకృతి మాయా ప్రపంచం. దాంట్లో అన్నీ ఇముడ్చుకుంటుంది. అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అందరికీ సమాధానం చెప్తుంది. కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆమెదే పైచేయి. ఉత్ప్రేరికంగానైనా స్కలనం జరగని కన్యను దానం చేస్తేనే కన్యాదానం అనిపించుకుంటుంది. అంతటి అదృష్టం ఈ పుణ్య దంపతులకు దక్కబోతుంది.

క్షణాలు కరిగిపోకముందే ఆనంద వర్ణం కనిపించింది. నరేష్ ఇచ్చిన మొదటి బహుమతి గాజుబొమ్మను తల్లిదండ్రులకు చూపిస్తూ తన ఆనందాన్ని తెల్పింది రంజని. కూతురి ఆనందమే కావాల్సిన వాళ్ళు మరేం మాట్లాడలేదు. అక్కడేం జరిగిందో కనుక్కున్నారు. లక్ష్మీ ఊపిరి పీల్చుకుంది. రాఘవరావు-తులసి దంపతుల అంతరాళంలో గూడుకట్టుకున్న సందిగ్ధత వీడిపోయింది. తన కూతురి జీవితం నిక్షేపంగా ఉంటుందనిపించి పెళ్ళికి ఒప్పుకున్నారు.  ప్రయాణంలో పరిణయం కుదిరి, కలిసిన మనసులతో పెనవేసుకుపోయిన ఆనందకరమైన జీవితానికి పునాది రాయి పడింది. పాత మనుషుల్లో కొత్త జీవితపు ఆశలు మొలకెత్తాయి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here