వ్యామోహం-14

0
3

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సత్యమూర్తి, డాక్సర్సాబ్ ఇద్దరూ ఒకేసారి వరంగల్లు చేరుతారు. పని ఉందంటూ ఊర్లోకి వెళ్ళొచ్చిన సత్యమూర్తి, ఈ ఇల్లు ఆసుపత్రికి దూరంగా ఉందని, అక్కకి ఇబ్బందవుతోందని చెప్పి, హనుమకొండలో ఇల్లుందని ఓ మిత్రుడు చెప్పాడని అంటాడు. ఇక్కడైతే కృష్ణమాచారి తోడుంటాడని అనుకున్నానని చెప్తాడు డాక్టర్సాబ్. అందరూ మాట్లాడుకుని హనుమకొండలోని ఆ ఇంటికి మారిపోతారు. బళ్ళకి సెలవులివ్వడంతో అమ్మని జంగారెడ్డిగూడెం పంపి అక్కా పిల్లల దగ్గర తానుంటాడు సత్యమూర్తి. ఓ రోజు సాయంత్రం నాలుగు దాటాకా, జోడెద్దులపాలెంలో ఆకస్మికంగా గాలి దుమారం మొదలవుతుంది. ఇంటిముందర గడంచె మీద ఎండబెట్టిన మామిడి వరుగులను ఆరబెట్టిన బట్టతో సహా లోనికి తీసుకు పరుగెత్తుతుంది వీరలక్ష్మి. గాలికి దుమ్ము విపరీతంగా లేస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి తన ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తూ కనపడతాడు. పరిశీలనగా చూస్తే, ఆ వ్యక్తి డాక్టర్సాబ్. సైకిల్‍ని గోడకి ఆనించి, లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆయన ఒళ్ళంతా దుమ్ము అంటుకుంటుంది. డాక్టరు గారు లోనికి రాగానే తలుపువేసి గడియ పెడ్తుంది వీరలక్ష్మి. ఆమె ఇచ్చిన తువ్వాలుతో ఒళ్లంతా తుడుచుకుంటాడు డాక్టర్సాబ్. ఎక్కడికెళ్ళావని అడిగితే, చెప్తాడు డాక్టర్సాబ్. తినడానికి సకినాలు పెడ్తుంది వీరలక్ష్మి. డాక్టర్సాబ్ అవి తిని బయల్దేరుతానంటే, తలుపు తీసి బయటకి చూస్తుంది. వడగళ్ళా అనిపించేటంత పెద్ద పెద్ద చినుకులతో వాన పడుతూంటుంది. కాసేపు ఉండమని చెప్పి, పాలు వెచ్చబెట్టి ఇస్తుంది. తన బాల్యం గురించి, పుట్టింటి గురించి, అత్తమామల గురించి చెప్తుంది. కాసేపయ్యాకా, టైమ్ చూసుకుని ఏడున్నర అవుతుండడంతో బయల్దేరుతానని లేస్తాడు డాక్టర్సాబ్. తలుపు తీసి చూస్తే బయట కుంభవృష్టి, వీధి మొత్తం జలమయమై చెరువులా కనిపిస్తుంది. వెళ్తానని డాక్టర్సాబ్ అంటే, ఈ వానలో వెళ్ళలేవని, తలుపులు వేసేస్తుంది వీరలక్ష్మి. వాన తగ్గదు. జొన్నరొట్టెలు చేసి తినమంటుంది. ముందు వద్దన్నా, తినక తప్పదు డాక్టర్సాబ్‌కి. వాన తగ్గే సూచన లేకపోవడంతో, ఆమె బలవంతం మీద వాళ్ళింట్లోనే నిద్రిస్తాడు. ఇక చదవండి.]

[dropcap]వి[/dropcap]పరీతమైన గాలితో తలుపులు వాటంతటవే తెరచుకొన్నాయి. వర్షం పెద్దగా లేదు గాని సన్నతుప్పరతో ఒక్కసారిగా డాక్టరుగారి ముఖం, చొక్కా, పంచె ముందుభాగం తడిసిపోయి చల్లబడిపోయాయి.

వెంటనే తలుపులను మూసేసే యత్నం చేశాడు. మూసుకోలేదు. బలంగా మూయవలసి వచ్చింది. గాలి అంత శక్తిమంతంగా వీస్తోందన్నమాట. ఈలోగా మరింత తడిశాడు. గాలికి వెలుగుతున్న లాంతరు కాస్తా ఆరిపోయింది. చిమ్మని చీకటి. తలుపు గడియపడడం లేదు. “వీరలక్ష్మీ! గడియ పడ్తలేదు. కొద్దిగ చూడు” అన్నాడు.

“వస్తున్న! ఆగయ్య!” అంటూ తన ఇల్లే కనుక చీకట్లోనైనా అలవాటు ప్రకారం తలుపు వద్దకు చేరుకొంది. తడుముతూ తడుముతూ డాక్టరు గారి చేతుల్లోంచి గడియ తీసుకొని ఎడమవైపు తలుపును బలంగా నొక్కి కుడివైపు తలుపుకున్న గడియను ఒత్తిపట్టి గుండ్రంగా తిప్పివేసింది. గడియ పడింది.

గడియ పడ్డాక స్పృహలోకి వచ్చింది వీరలక్ష్మి. డాక్టరు గారి ఊపిరి తన మెడపైన సోకుతోంది. గబుక్కున వెనక్కు తిరిగింది. తడిసిన చొక్కా చల్లగా తగిలింది.

“అయ్యొ! అంగి తడిసెనా! దీపమ్ముట్టిస్త” అంటూ ముందుకు అడుగువేసింది. డాక్టరు గారు వెనక్కు అడుగు వేస్తున్నాడో లేదో ఆమె పాదం డాక్టరు గారి పంచె అంచుల్లో చిక్కుకొని తూలిపడబోయింది. అప్రయత్నంగానే ఆమెను పడకుండా పట్టుకొన్నాడతడు. ఆమె చేతులు అతని నడుమును చుట్టుకొన్నాయి పట్టుకోసం. దగ్గర్లోనే ఎక్కడో పిడుగుపడినట్లుగా వుంది. ఆ శబ్దం వల్ల ఏర్పడిన బుగులు కారణంగా డాక్టరు గారిని చుట్టుకొన్న వీరలక్ష్మి చేతులు మరింతగా బిగుసుకున్నాయి. వీరలక్ష్మికి ధైర్యం చెబుతూ అనునయిస్తున్న డాక్టరు గారి చేతులు ఆమె వీపును సున్నితంగా నిమురుతున్నాయి. డాక్టరు గారి హృదయానికి అంటుకుపోయిన వీరలక్ష్మి చెవులకిప్పుడు ఆయన గుండెచప్పుడు సుస్పష్టంగా వినిపిస్తున్నది. ఆ చప్పుడులో ఆమెకు తన పేరే వినిపిస్తున్నది.

డాక్టరు గారికి మెలకువ వచ్చింది. తను కప్పుకున్న దుప్పటి వెచ్చగా వుంది. ఛాతీ అనాచ్చాదితంగా వున్నది. కింద పంచె అస్తవ్యస్తంగా. పక్కనే పడుకున్న భార్య. ఆమె పరిస్థితీ తనకు భిన్నంగా లేదు. ఇదేమిటీ తనిలా! ఇంట్లో ఎదుగుతున్న పిల్లలున్నారు. గబుక్కున లేవబోయాడు. తన గుండెలపైనున్న ఆమె చేయి బిగుసుకుని ఒత్తిపెట్టింది. “ఈ రాత్రెక్కడికి బోతవయ్య! కోడి గూసినంక బోదువులే!”

వీరలక్ష్మి గొంతు విని ఈ లోకంలోకొచ్చాడు డాక్టరు గారు. “వీరలక్ష్మీ!”

“ఆఁ”

“లే! నేను పోవాలె. ఏం జరిగింది. ఎట్ల జరిగింది” ఆందోళన అయోమయమూ తొంగి చూస్తున్నాయి డాక్టరు గారి గొంతులో.

“ఎట్ల జరిగితేంది! జరిగిపోయింది గద!” మరింతగా డాక్టరుగారికి దగ్గరవుతూ చెప్పింది వీరలక్ష్మి.

“కొక్కొరొకో” అంటూ వినిపించింది కోడికూత.

“దీనిల్లు బంగారంగాను. ఇప్పుడే కుయ్యాన్న!” అంటూ లేచింది వీరలక్ష్మి.

రెణ్ణిమిషాల్లో తయారయ్యాడు డాక్టరు గారు. లాంతరు చూపెడుతూ వీధి తలుపు తీసింది వీరలక్ష్మి.

వాతావరణం ప్రశాంతంగా వుంది. చందమామ ప్రకాశమంతంగా వెన్నెలలు కురిపిస్తున్నాడు. తన సర్వస్వాన్ని భూమికి ధారాదత్తం చేసిన ఆకాశం స్వచ్ఛమైన నీలకాంతితో ప్రకాశిస్తోంది. రాత్రంతా జలధారలలో తానమాడి తాపాన్ని పోగొట్టుకొన్న భూమి చిరునవ్వులు చిందిస్తోంది.

గోడకానించి పెట్టిన సైకిలును తీసుకొని డైనమో వేసుకొని తొక్కుతూ వేగంగా వెళ్ళిపోయాడు డాక్టరు గారు. ఆయన కనుమరుగయేంతవరకు తనివి తీరా చూచిన వీరలక్ష్మి ఇంట్లో కడుగుపెట్టింది రాత్రి పులకింతలు తనను మళ్ళీ కమ్ముకొస్తుంటే.

ఇంటికొచ్చిన డాక్టరు గారికి నిద్ర సరిపోలేదనిపించి మళ్ళీ మంచాన్నాశ్రయించాడు. దుప్పటి కప్పుకొంటుంటే ‘ఈనాడు కదా తొలిసారిగా నేను స్త్రీని స్పృశించాను’ అన్న భావన కలిగింది. ‘నీవు నలుగురు పిల్లలకు తండ్రివి. నీకలాంటి ఆలోచన రావచ్చునా!’ అంటూ హెచ్చరిస్తున్న వివేకాన్ని జోకొడుతూ నిద్రలోకి జారుకున్నాడు డాక్టరు గారు.

***

ఆలస్యంగా నిద్రలేచిన డాక్టరు గారు కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసికొంటున్నాడు.

“యద్రాత్రియాత్ కురుతే పాపం

తద్రాత్రియాత్ ప్రతి ముచ్యతే”

మంత్రం అక్కడితో ఆగిపోయింది. ముందకు సాగడంలేదు. ‘ఏ రాత్రి యందు చేసిన పాపం ఆ రాత్రి యందే నశించును గాక’ అని చెప్తున్నాడు. కాని తాను చేసిన పాపానికి నశింపు వుంటుందా! గృహస్థాశ్రమ ధర్మవిరుద్ధంగా ప్రవర్తించాడు కదా! అతి కష్టమ్మీద సంధ్యావందనాన్ని ముగించాడు.

ఏ పనిచేస్తున్నా ఆ విషయమే గుర్తుకు వస్తున్నది. సుఖం తాలూకు పులకింతలు. వెనువెంటనే ధర్మం తాలూకు హెచ్చరింతలు. అన్ని పనులనూ కట్టిపెట్టి సాయంకాలానికల్లా కాజీపేట రైలెక్కాడు డాక్టరు గారు. మూడు నాలుగు రోజులు భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తే గాని ఆ రాత్రి తాలూకు ఛాయలు అతనిని వదలిపెట్టలేదు.

ఐదో రోజున మళ్ళీ జోడెడ్లపాలానికి చేరుకొని తన పనిలో తాను మునిగిపోయాడు. మూడు రోజులు గడచిపోయాయి. నాలుగవ రోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఎవరో తలుపు కొడ్తుంటే మెలకువ వచ్చింది డాక్టరు గారికి. భోజనానంతరం రోజూ ఓ గంట సేపు పడుకోవడం ఆయనకు అలవాటు.

వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా వీరలక్ష్మి నమస్కార ముద్రతో. నిర్ఘాంతపోయాడు ఏం చేయడానికి తోచలేదు. నిశ్చేష్టుడై అలాగే నిలుచున్నాడు.

“లోపలికి రానియ్యవా డాక్సరు సాబు!” అంటూ కర్తవ్యాన్ని గుర్తుచేసింది వీరలక్ష్మి.

సర్దుకుని “రా!” అంటూ తలుపులు బార్లా తెరచి వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు.

వచ్చి రోగి కూర్చునే స్టూలు మీద కూర్చుంది వీరలక్ష్మి. ‘లోగడ కూర్చోమంటే గాని కూర్చునేది కాదు. ఒక్క రాత్రి ఎంతటి మార్పును తీసుకువచ్చింది’ అనుకున్నాడు డాక్టరుగారు.

“ఊరికి బొయ్యొచ్చిన్రట. అమ్మకెట్లున్నది?”

“మంచిగనె ఉన్నది”.

“మత్లబొస్తే బొయ్యొచ్చిన్రా. మీ ఇచ్చ మీరె బొయిన్రా!” చిరునవ్వుతో అడిగింది వీరలక్ష్మి.

“పెండ్లాం పిల్లల తానకు బోనీకి మత్లబు రావాల్నా” అసహనంగా జవాబిచ్చాడు డాక్టరు గారు.

“తబ్బట్టుకోకు డాక్సర్సాబు. ఉన్నట్టుండి పోయిండు డాక్సరాబ్ అని అందరనుకుంటుంటే ఏమన్న తొందర ఏర్పడ్డది కావచ్చు అనుకోని అడిగిన” వివరించింది వీరలక్ష్మి.

‘అమ్మో ఇది గుండెలు తీసిన బంటు. ఎంత తెలివైంది’ మనసులోనే అనుకున్నాడు డాక్టరు గారు.

“నాకు మందులియ్యవా ఇక” అడిగింది వీరలక్ష్మి.

“నీ వైద్యం అయిపోయింది కద” చెప్పాడు డాక్టరు గారు.

“కొత్త వైద్యం కొరకచ్చిన”

“అంటె”

“మొన్నరాత్రి మొదలుపెట్టినవు కద!”

వెంటనే లేచి నిలబడ్డాడు డాక్టరు గారు. “వీరలక్ష్మీ! నీవిక వెళ్ళవచ్చు. నా వల్ల పొరపాటు జరిగింది. అదీ దిద్దుకోలేని పొరపాటు. దాన్ని మళ్ళీ మళ్ళీ చేయకపోవడమే దిద్దుబాటుగా భావిస్తున్నాను. ప్రస్తుతానికి నీ ఆరోగ్యానికొచ్చిన లోపమేమీ లేదు. కనుక నీవిక్కడకు రావలసిన అవసరం కూడా లేదు.”

డాక్టరు గారి కోపాన్ని చవి చూచిన వీరలక్ష్మి జంకింది. లేచి నుంచుంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే “అంతెనంటవా!” అంది డగ్గుత్తికతో.

వీరలక్ష్మి కన్నీళ్ళను చూచిన డాక్టరు గారు తనంత కటువుగా మాట్లాడాల్సింది కాదనుకొన్నాడు.

“చూడు వీరలక్ష్మీ! నాకు భార్యాపిల్లలున్నారు. నీకు భర్త వున్నాడు. మనం చేసింది తప్పు. మహాపాపం” నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు డాక్టరు గారు.

“పటేలు నాకు పెనిమిటి కాడు. నన్నుంచుకున్నడు. అంతకే. పటేలుకు పెండ్లాం పిల్లలుండంగ సుత నా రెట్టబట్టుకున్నడు. నేను పటేలును కోరుకోలె. పటేల్ నా అందం తన స్వంతం కావాన్ననుకున్నడు. నా తరఫున నిలబడెటందుకు నా ఎనుకముందు కెవల్లేరు. అది తన కెర్కనె. అందుకె దైర్నెం చేసిండు. పటేల్ను కాదంటె నాకు బతుకు లేదు. నా ముసలి అత్తమామలు పటేల్ను ఎదిరించి బతుక జాలరు”. ఆవేశంగా చెప్తూ చెప్తూ కుప్పకూలిపోయింది వీరలక్ష్మి.

గమనించిన డాక్టరు గారు ఒక్క అంగలో ముందుకొచ్చి వీరలక్ష్మిని పడిపోకుండా పొదవుకొని నెమ్మదిగా తీసుకొచ్చి పరీక్ష బల్ల మీద పడుకోబెట్టాడు. నాడి చూశాడు. పరవాలేదనిపించింది. లోపలికెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి మొహమ్మీద చిలకరించాడు. రెండు నిమిషాలకు కళ్ళు తెరిచింది వీరలక్ష్మి. సిగ్గుపడుతూ లేచి కూచుంది. మంచినీళ్ళందించాడు డాక్టరు గారు. గటగటా తాగేసింది. ఐదు నిమిషాలు మౌనంగా గడిచాయి. డాక్టరు గారు వీరలక్ష్మిని స్టెతస్కోపుతో పరీక్ష చేశాడు. బి.పి. చూశాడు. అంతా సవ్యంగానే వుంది. అలా ఎందుకు పడిపోయిందో అర్థం కాలేదు.

“పెరట్లకు బొయ్యొస్తవా!” అడిగాడు డాక్టరు గారు.

సిగ్గుతో తలదించుకొని, తలూపింది వీరలక్ష్మి. వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కుంది. కాస్త టీ కాచిచ్చాడు డాక్టరు గారు. త్రాగింది వీరలక్ష్మి. “ఇప్పుడెలా వుంది!” అడిగాడు.

 “మంచిగనె వున్నది.”

“అవుసరాన్ని మించి మూత్రాన్ని ఆపుకోగూడది. నువ్వడ్డం బడుడుకు కారణమదే!” మందలించాడు డాక్టరు గారు. సిగ్గుపడింది వీరలక్ష్మి.

“సరే! వెళ్ళిరా!”

“మల్ల రావచ్చునా!”

“ఏదో మాట వరుసకున్నా. నీవు రావద్దు. పటేలు ఎటువంటివాడైనా మీ ఇద్దరి సంబంధం స్థిరమైనదని, పవిత్రమైనదని ఊరివాళ్ళంతా నమ్ముతున్నారు.”

“పక్కా సంబంధం కావచ్చు గాని, పవిత్రమైందని నేననుకుంటలేను.”

“సరే ఏదో ఒకటి”

“ఏదో ఒకటి కాదు. నీతోని గడిపిందే పవిత్రమైందని నేననుకుంటున్న” స్థిరంగా చెప్పింది వీరలక్ష్మి.

“అది తప్పు!”

“తప్పు కాదు. నా దేవునికి నా దగ్గరున్నదంత సమర్పించుకున్న. సచ్చెటి దాన్ని బతికించినవు. నాకు దేవునివి. నేన్నీకు తీర్చుకోలేని బాకిలపడ్డ. బాకీ తీర్చుకొనే అవకాశం కలిగింది. తీర్చుకున్న. ఇప్పుడిప్పుడనిపిస్తున్నది కదాంటె ఇది తీరె బాకి కాదని బాకి తీరుట్ల నాకానందమనిపిస్తది. ఎన్ని వాయిదాలల్ల బాకి తీర్తె అంతమంచిగ.”

“నీకు చదువు రాదన్న మాటే గాని బాగా చదువుకున్న వాళ్ళను సైతం మెప్పించగల తెలివితేటలు నీ దగ్గరున్నాయి. ఏదేమైనా ఈ తప్పును కొనసాగించడం భావ్యం కాదు. ఇక నీవు వెళ్ళవచ్చు.” స్థిరంగా చెప్పాడు డాక్టరు గారు.

“అయ్యా! నువు నా మాట మెచ్చవని నాకెర్కనె. కని నా మనసు నా స్వాధీనంల లేదు. రేపు రాత్రి నువు మా ఇంటికి వస్తున్నవు. వేడి వేడి జొన్న రొట్టెలు కాల్చినయి సిద్ధంగ ఉంటయి. రేపు నువ్వు రాలేదనుకో ఎల్లుండి మాపటీలి పక్కబట్టల్తోని నీ ఈ దవాఖాన్ల ఉంట. రాత్రి ఇక్కణ్ణే పంట. నువు నన్ను ముట్టుకో ముట్టుకోకపో! నాకు సంబంధం లేదు. తెల్లన్దన్క ఈడనె వుంట. పొద్దుగాల అందరు సాన్పులు జేసుకుంటుంటె వాపసుబోత. నువు నన్ను బయటికెల్లగొట్టి తలుపులు బెట్టుకుంటె సుత మీ ఇంటి అరుగుల మీద పంట. అటెన్క నీ ఇష్టం. మల్లన్న దేవుని మీద ఒట్టు బెట్టుకోని చెప్తున్న. నువు రాకుంటే మాత్రం నేనీ పన్జేసుడు ఖాయం.” చెప్పవలసిందంతా చెప్పేసి నెమ్మదిగా నడుచుకుంటు వెళ్లిపోయింది వీరలక్ష్మి.

నిరుత్తరుడై నిలుచుండి పోయాడు డాక్టరు గారు. ఏం జరిగిందో బోధపడడానికి చాలా సమయం పట్టిందాయనకు.

మర్నాడు రాత్రి ఎనిమిది గంటలకల్లా డాక్టరు గారి సైకిలు వీరలక్ష్మి ఇంటి గుమ్మం పక్క గోడకు చేరవేసి వుంది. ఆ సైకిలు అక్కడ అలా రోజూ రాత్రి పన్నెండు వరకు ఉంటుందని ఊరి వాళ్ళందరకూ తెలిసిపోయింది.

***

వర్షాకాలం వచ్చేసింది మరో రెండేళ్ళు వానలు లేకపోయినా పరవాలేదన్నట్లుగా కురిసాయి వర్షాలు. ఆగిపోయిన ఇంటి పని మొదలు పెడదామనుకున్నాడు డాక్టరు గారు.

“అమ్మకు పొద్దులటగద. కొడుకొ, బిడ్డనొ పుట్టినంక మొదలుపెట్టున్రి. ఇప్పుడు మట్టి పని మంచిది కాదు” అన్నారు మేస్త్రీలు.

నాలుగు నెలలు అన్నచోట ఐదు నెలలకు యాత్రలు పూర్తి చేసుకొని వచ్చాడు పోలీసు పటేలు. యాత్రలు చేసివచ్చిన సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకొని తన స్థాయికి తగ్గవాళ్ళందరనూ భోజనాలకు పిలిచాడు. డాక్టరు గారికి కూడా పిలుపు వచ్చింది.

యాత్రా విశేషాలను డాక్టరు గారికి ప్రత్యేకించి చెప్పాడు. ఆయన మందులు వాడవలసి వచ్చిన సందర్భాలను కూడ చెప్పాడు. మొత్తానికి బాల్రెడ్డి పటేలు ఉత్తర దేశయాత్ర ఊరివాళ్ళకు సంబరాన్నే మిగిల్చింది.

భార్యను చూచి రావడానికి వెళ్ళిన డాక్టరు గారు సుమారు నలభై రోజులకు గాని ఊళ్ళోకి రాలేదు. దసరా, దీపావళులు ఆసుపత్రి చుట్టు తిరగడంలోనే గడచిపోయాయి. డాక్టరమ్మకు సరిగ్గా దీపావళి రోజు పురుడు వచ్చింది. ఆడపిల్ల పుట్టింది. నలుగురు మగపిల్లల వెనుక ఒక ఆడపిల్ల అందరూ ఆనందించారు. పురుడే కష్టమైంది. పురుటినొప్పులతో వచ్చిన తల్లిని బ్రతికించాలా, పుట్టబోయే బిడ్డను బ్రతికించాలా అన్న మీమాంసతో ప్రారంభమైంది వైద్యం. అదృష్టం బాగుండి ఇద్దరూ బ్రతికి బట్టకట్టారు. అందరూ డాక్టరు గార్ని అభినందించారు.

అప్పుడప్పుడే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మొదలవుతున్నాయి. డాక్టరమ్మ ఆరోగ్యరీత్యా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సను వాయిదా వేయడం మంచిదని చెప్పారు ఆసుపత్రి వైద్యులు. నాలుగైదు నెలలవరకు తల్లిని జాగ్రత్తగా చూచుకోవాలన్నారు కూడ.

బాలెంతరాలు, పసిగుడ్డుతోపాటు అందరూ మందులకుంటకు చేరుకున్నారు. రాము చదువు సమస్య వచ్చింది. వాడిప్పుడు ఆరోక్లాసుకి వచ్చాడు. మిగిలిన వాళ్ళ చదువు పెద్ద సమస్య కాదు. సత్యమూర్తి రాముని తన బళ్ళోనే చేర్చుకున్నాడు.

ఈ ఏర్పాట్లన్నీ చూచుకొని జోడెడ్లపాలానికి బయల్దేరాడు డాక్టరు గారు. ప్యాసెంజరు దిగి ఊరు చేరేప్పటికి రాత్రి పదిగంటలయింది. సహజంగానే ఊరంతా నిద్రపోయింది.

తాళం తీద్దామంటే తాళం చెవి కప్పలో దూరడం లేదు. అగ్గిపుల్ల వెలిగించి చూచాడు. డాక్టరు గారు చెయిన్ స్మోకర్. అంచేత అగ్గిపెట్టె కోసం వెతుక్కోవలసిన బాధలేదు. ఆశ్చర్యపోయాడు. తను వేసిన తాళం కాదది. పక్కనే వున్న కిరాణా దుకాణం విశ్వనాథం వాళ్ళింటి తలుపు కొట్టాడు.

“ఎవలుల్లా!” అంటూ తలుపు తీయకుండా లోపల్నుంచే అరిచాడు విశ్వనాథం.

“నేను డాక్టర్సాబును” బయటి నుండి అరచి సమాధానం చెప్పాడు.

“ఓ డాక్టర్సాబా!” అంటూ చేతిలో లాంతరుతో వచ్చి తలుపు తీశాడు విశ్వనాథం.

“రండ్రి రండ్రి. ఇదేనా రాకడ” అంటూ లోనికి ఆహ్వానిస్తూ కూర్చోడానికన్నట్లుగా దుకాణంలోని స్టూలును చూపించాడు గల్లా ముందరి తన స్థానంలో తను కూర్చుంటూ. కూర్చున్నాడు డాక్టరు గారు.

“మంచినీల్లు తాగుతరా!” అడిగాడు విశ్వనాథం. తాగుతానన్నట్లుగా తలనూపాడు డాక్టరు గారు. గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. గటాగటా గ్లాసుడు నీళ్ళూ తాగేశాడు డాక్టరు గారు.

“ఎవరొచ్చిన్రు” అంటూ ఆరా కోసం వచ్చింది విశ్వనాథం భార్య సుశీలమ్మ.

“మన డాక్టర్సాబేనే! ఏం భయం లేత్తియి” చెప్పాడు విశ్వనాథం.

గమ్మం వరకు వచ్చింది సుశీలమ్మ. “నమస్తె డాక్టర్ సాబు. అమ్మ మంచిగున్నదా! నీళ్ళాడిందా!”

“ఆఁ మంచిగనె వున్నది ఆడపిల్ల. కాకుంటె కాన్పు కష్టమైంది. నాలుగైదు నెల్లు ఏం పన్లు చేసుకోవద్దన్నారు. అందుకే తల్లిగారింట్ల దించొచ్చిన” చెప్పాడు డాక్టరు గారు.

“ఆఁ కాదామల్ల ఐదో కాన్సాయె. మంచి పనిచేసిన్రు. బిడ్డ మంచిగున్నదా!” అడిగింది సుశీలమ్మ.

“మంచిగనె వున్నది.”

“అంతమంచిగనె. నలుగురు మగపిల్లగానెన్క ఆడపిల్ల. దేవుడు మీకు మంచిగనె ఇచ్చిన్డు తియ్యి” అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది సుశీలమ్మ.

“నా ఇంటికి నేను వేసిన తాళం లేదు. కొత్త తాళం వేసివున్నది. ఏమైంది సేటూ!” అడిగాడు డాక్టరు గారు. మామూలుగానే అడిగినా గొంతులో ఆందోళన సుస్పష్టంగా తెలుస్తున్నది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here