అపర ‘భారవి’ కీ.శే. చిల్లర భావనారాయణరావు గారు

3
4

[డా. సి. భవానీదేవి గారి – అపర ‘భారవి’ కీ.శే. చిల్లర భావనారాయణరావు గారు – అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]వి, సాహితీవేత్త, నాటక, నాటిక, సినీ రచయితగా ప్రసిద్ధులైన చిల్లర భావనారాయణరావు గారు కీ.శే. శ్రీ పున్నయ్య శర్మ, కీ.శే. శ్రీమతి రంగానాయకమ్మగార్లకు నాల్గవ కుమారునిగా 6-8-1925 నాడు జన్మించారు. పున్నయ్యశర్మ గారు గద్వాల సమీపంలోని ‘మేకల సోంపల్లె’, ‘దాసరపల్లెల’ కరణీకం చేసేవారు. గారాబం వల్ల 11 సంవత్సరాల వయస్సు వరకు బడికి వెళ్ళని ఈ రచయిత ఇంటి దగ్గరే తండ్రిగారు భారత, భాగవత, రామాయణాది గ్రంథాల పద్యాలు పాడుతుంటే విని పద్యంపై పట్టును బాల్యంలోనే సాధించారు. భావనారాయణగారు దాసరపల్లె గ్రామంలో వీధి బడిలో, గద్వాల హైస్కూల్లో 7, 8 తరగతులు చదివారు. పాఠశాలలో తెలుగు పండితులైన కీ.శే. గాడేపల్లి వీరరాఘవశాస్త్రిగారు శతావధాని, గద్వాల ఆస్థాన పండితులు కూడా! వారు నిర్వహించే పండితసభల ప్రభావంతో తాను ఎదిగానని రచయిత స్వయంగా తదనంతరకాలంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. గద్వాలలోనే ఒక టీచర్ దగ్గర ఉర్దూ నేర్చుకుని ఉర్దూలో ప్రావీణ్యం సాధించారు.

దాదాపు 1944వ సంవత్సరంలో అన్నగారయిన శ్రీ చిల్లర ఆంజనేయులు గారు, అప్పటికి నిజాం స్టేట్ రైల్వేలో పనిచేస్తుండటంవల్ల వారి దగ్గరికి హైద్రాబాదుకు వచ్చారు. కొంతకాలం మిలటరీ డిపార్టుమెంటుకు చెందిన ‘ఆర్డినెన్స్ డిపో’లో, తర్వాత రైల్వేలో 16 సంవత్సరాలు టి.టి.గా కూడా పనిచేశారు. నందిరాజు ఇందిరగారితో 1947వ సంవత్సరం ఏప్రిల్‍లో వివాహం జరిగింది. రచయిత కవిత్వారంభం ‘పుష్పాంజలి’ ముద్రణతో వికసించి ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారి ఆశీస్సుల్ని పొందడం ముదావహం.

రచయిత సాహిత్యాభిలాష టి.టి. ఉద్యోగంలో తీరలేదు. ఎమ్.ఎ, బి.ఓ. ఎల్ పట్టాలు పొంది వెస్లీ బాలుర ఉన్నత పాఠశాల, సికింద్రాబాదులో తెలుగు పండితులుగా చేరారు. వారిలోని సామాజిక స్పృహ, రచనాసక్తి పెంపొంది పలు నాటకాలు, నవలలు, కథానికలు రచించారు. ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్న మీజాన్ పత్రిక, ఆంధ్ర దిన వార పత్రికలు, ఆంధ్రప్రభ, కృష్ణా పత్రికలలో వారి రచనలు వెలువడ్డాయి.

భావనారాయణగారు రజాకార్ మూవ్‌మెంటు, మిలటరీ ప్రభుత్వం చూసిన అనుభవాలతో ‘దేశద్రోహం’ పేరుతో మొదటి నాటకం రచించి 250 రూపాయల పారితోషకం అందుకున్నారు. 1948వ సంవత్సరం మిత్రులతో కలిసి నవ్యకళాసమితిని స్థాపించారు. రాష్ట్రపతి రోడ్డుకి దగ్గరలో శంకర వీధిలో ఉండే ఆ నాటక సమితి ద్వారా తాను రాసిన ‘కళాభిమాని’, ‘దేశద్రోహం’ నాటకాలు సమాచారశాఖచే తెలంగాణా ప్రాంతమంతా దాదాపు వంద ప్రదర్శనలకు ఏర్పాటుచేసి విజయం పొందారు. ‘యోగి వేమన’ కూడా ఆంధ్ర దేశమంతటా దాదాపు వందసార్లు ప్రదర్శించారు. కామందు, ఉమర్ ఖయ్యాం, అగ్ని గుండెలు, పదవులు- పెదవులు, మట్టే బంగారం, ఉయ్యాల చిలుకలు, జీవన శిఖరం, సెయింట్ పాల్, శ్రీనాథ మహాకవి కనకాభిషేకం, వియ్యాలవారి కయ్యాలు, కళాభిమాని, ఉప్పెన, కొత్త మనిషి, పరిణామం, గుడిగంటలు, కృష్ణవేణి మొదలయిన అనేక నాటకాలు నాటికలు రచించారు. వీరు రచించిన నాటక, నాటికల పూర్తి జాబితా లభ్యంగా లేదు.

‘కృష్ణవేణి’ రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి బహుమతినిచ్చి గౌరవించింది. డా. సి. నారాయణరెడ్డి, దాశరథి, ఉత్పల సత్యనారాయణచార్యులు, ఆచార్య బిరుదరాజు రామరాజు వంటి ప్రముఖ సాహితీవేత్తలతో భావనారాయణ గారికి సన్నిహిత మిత్రత్వం ఉండేది.

ఎడమనించి మొదటి వారు కీ.శే.చిల్లర భావనారాయణరావు గారు

ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలలో ప్రదర్శించబడిన ‘ఉమర్ ఖయ్యాం’ బహుమతి పొందటం వారి రచనా ప్రతిభకు తార్కాణం. ఈ నాటకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి మట్టి చెన్నారెడ్డిగారు మరోసారి హైద్రాబాదులో ప్రదర్శింపజేయటం విశేషం. సికింద్రాబాదులోని ‘విశ్వశ్రీ నాట్యమండలి’ ఆధ్వర్యంలో, విజయవాడ వారి ‘హనుమంతరాయ గ్రంథాలయ’ యాజమాన్యంలో ‘గుడిగంటలు’ నాటకం పలుచోట్ల ప్రదర్శింపబడి నాటకాభిమానుల ప్రశంసలు పొందింది. విజయవాడ ‘సినీ సమాఖ్య’ సంస్థ వారు ‘మట్టే బంగారం’ నాటకాన్ని ‘పదవులు – పెదవులు’ నాటకంలో నాయికగా ప్రముఖ నటి గూడూరి సావిత్రి నటించగా పలుచోట్ల ప్రదర్శనల్లో అనేక బహుమతులు, ప్రశంసలు సాధించారు. విజయవాడ నాటక సమాఖ్యవారు కూడా ‘గుడి గంటలు’, ‘మట్టే బంగారం’ నాటకాలు ప్రదర్శనలిచ్చి బహుముఖ ప్రచారం కల్పించారు. విజయనగరంలో నాటక పోటీలకు ‘గుడిగంటలు’ ఎంపిక కావటం, అదే పోటీల్లో శ్రీ బెల్లంకొండ రామదాసుగారి నాటకం కూడా ప్రదర్శితమవటం ఒక విశేషం.

‘అరుణోదయ నాట్యమండలి’ అధ్యక్షులు కీ.శే. సుంకర కనకారావు ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన నాట్యకళా పరిషత్తులో విశ్వశ్రీ నాట్యమండలి ‘ఉమర్ ఖయ్యాం’ ప్రదర్శించి సుంకరవారి ప్రశంసలందుకోవటం ముదావహం. ఈ సంస్థవారే ఈ నాటకాన్ని పలుమార్లు ప్రదర్శించారు.

ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం ‘యోగి వేమన’ నాటకాన్ని శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారి ద్వారా రూపొందించి ప్రసారం చేశారు. ‘యోగి వేమన’ ఆంధ్ర దేశంలో దాదాపు వందసార్లు ప్రదర్శితమైంది. ఆకాశవాణి, విజయవాడ, మద్రాసు ఆకాశవాణి కూడా ఈ నాటకాన్ని ప్రసారం చేశారు. ఆం.ప్ర. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ‘అగ్గి గుండెలు’ నాటకాన్ని పలు ప్రదర్శనలిచ్చినప్పుడు రచయితే స్వయంగా ప్రదర్శనను నిర్వహించారు.

ఆకాశవాణిలో ప్రసారమైన వంద దాకా నాటికలు 1947వ సంవత్సరంలో దక్కన్ రేడియో ఖైరతాబాదులో ఉన్నప్పటి నుంచి 1968వ సంవత్సరం వరకూ ప్రసారమైనవే! 1968వ సంవత్సరంలో భావనారాయణగారి జీవితం అనుకోని మలుపు తిరిగింది. రచయితకు సినీరంగం మీద చాలాకాలంగా మనసుంది. ఒక శుభఘడియలో భావనారాయణగారు రచించిన నాటకాన్ని చూసిన ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావుగారు, వీరిని మద్రాసు పిలిపించి తమ చిత్రానికి తెలుగు కథ రాయించారు. నిర్మాత పింజల సుబ్బారావుగారితో పరిచయం కలిగించారు. పింజలవారు భావనారాయణగారి కథ ఆధారంగా ‘పేదరాసి పెద్దమ్మ కథ’ రూపొందించారు. తర్వాతి కాలంలో రచయిత చిత్రసీమలో మంచి స్థానాన్ని పొందారు.

మద్రాసులో ముత్యాలపేట ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత పదవిని 1972వ సంవత్సరం జూన్‍లో చేపట్టి 1973వ సంవత్సరం జూన్‍లో మద్రాసు క్రిష్టియన్ కాలేజీ ఉన్నత పాఠశాలకు మారి 1984వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. చిత్ర పరిశ్రమలో కమలాకర కామేశ్వరరావు, విఠలాచార్య వంటి గొప్ప దర్శకుల సాహచర్యంలో లక్ష్మీకటాక్షం, సుగుణసుందరి కథ, రాజకోట రహస్యం పాతాళనాగు, లక్ష్మీపూజ, సంతోషీమాత వ్రతమహత్మ్యం, సీతారామ వనవాసం, విక్రమార్క విజయం, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్మ్యం వంటి పేరెన్నికగన్న చిత్రాలకు కథ, మాటలు, పాటలు అందించారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం చిత్రంలోని ‘నీ పాపను నాన్నా’ అనే పాటకు ఉత్తమ పాటల రచయితగా, అదే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు పొందారు. ఎస్వీ రంగారావు వంటి మహానటులు కవిగారి మార్గదర్శకంలో సుదీర్ఘ సమాసాల ఉచ్చారణ నేర్చుకుని ‘భళా’ అన్పించుకున్నారు. ప్రముఖ నటులు ఎన్టీఆర్ కూడా ‘కవి’ గార్ని అమితంగా గౌరవించేవారు.

పదవీవిరమణ తర్వాత హైదరాబాదులో స్థిరపడినాక ఆధ్యాత్మ రచనలపై దృష్టి సారించారు. పలు గ్రంథ మథనంతో జీవిత సారాన్ని రంగరించి 108 పుష్పహారాలతో ‘శ్రీ షిర్డీసాయి భాగవతం’ అనే బృహత్తర కావ్య రచన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం అందుకున్నారు. అందులో 44వ పుష్పహారాన్ని తమిళనాడు ప్రభుత్వం వారు 12వ తరగతి వాచకంలో పాఠ్యాంశంగా ఉంచటం గౌరవనీయమైన విశేషం. ‘ఉపనిషత్కథా భారతి’, ‘బాసర సరస్వతీ శతకం’, ‘శ్రీదత్త చరిత్ర’, ‘శ్రీ శ్రీనివాస పద్మావతీ పరిణయం’, ‘శ్రీ వెంగమాంబ చరిత్ర’, ‘శ్రీ వేంకటేశ్వర పారిజాత కుసుమాలు’ మొదలైన కావ్యాలు రచించారు. రచయితకు ప్రాక్తన జన్మ కర్మ విషయంలో విశ్వాసం ఉంది. అందుకే ముక్తపదగ్రస్తాలంకారంలో

“బంధితుడీ నరుండు తన ప్రాక్తన కర్మకు, కర్మకున్న సం
బంధము కోర్కె, కోరికకు పల్లకి మానవ బుద్ధి, బుద్ధికిన్
గంధపు పూత ఈ మదిని గల్గిన సంస్కృతి, సంస్కృతీ మహా
స్కంధము సృష్టి! సృష్టికిని కారణమిచ్ఛయ, యిచ్ఛ కాదియా”

బంధుర మూల కారణపు బ్రహ్మము! బ్రహ్మము సాయినాథుడే! అన్నారు కవి. డా॥ తూమాటి సంజీవరావుగారి మాటల్లోనే ‘విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం’, గడియారం వారి ‘శివభారతం’, చిల్లర భావనారాయణరావు గారి ‘షిర్డి సాయి భాగవతము’ ఈ శతాబ్దపు రామాయణ, భారత, భాగవతాలు, ‘అనర్ఘ కావ్యత్రయం’ అని భావించవచ్చు.

షిరిడీ ఏకాదశ సూత్రాలకు వ్యాఖ్యానం రచించిన రచయిత సినీ మాయాజాలంలోపడి పద్యాన్ని పారేసుకోలేదు. ఆంధ్ర శివక్షేత్ర గీతావళి, శ్రీ అయ్యప్ప చరితము, శ్రీ వినాయక చరితము రచించారు. హెచ్.ఎమ్.వి వారికి పాటలు రాశారు. ‘భేతాళ కథలు’ విజయ-వాహినీ వారు సీరియల్‌గా ప్రసారం చేశారు. ‘శ్రీనాథ మహాకవి కనకాభిషేకం’ నాటకాన్ని చెన్నై ఆకాశవాణి-బి కేంద్రం 1990వ సంవత్సరంలో సంక్షేపించి రేడియో నాటకంగా ప్రసారం చేశారు. ఈ నాటకాన్ని ప్రచురింపజేసే భాగ్యం ఈ వ్యాసకర్తకు దక్కటం సంతోషకరం.

చిల్లర భావనారాయణరావుగారు 22.1.2010 తేదీన భౌతిక దేహాన్ని విడిచారు. వారు ‘భారవి’ అనే కలం పేరుతో కూడా రచనలు చేశారు. “భారవేః అర్ధ గౌరవమ్” అంటారు. ప్రకాశించే సూర్యుడులాంటి ‘భారవి’ జీవితంలో ఎన్ని ఇబ్బందులెదురైనా చివరిదాకా అక్షరాన్నీ లక్ష్యాన్నీ వీడని మహనీయ మూర్తికి ‘భారవి’ కలంపేరు సార్థకమైంది.

‘సహజ కవితా విలాస’, ‘సాయితత్త్వ సందర్శన’ వంటి అనేక బిరుదులు పొందిన భావనారాయణరావు గారు శ్రీ షిర్డీ సాయి భాగవతానికి తాత్పర్యంగా కావ్యంలోగల భక్తి రహస్యాలను స్వయంగా రాశారు. అరుదైన ఈ జ్ఞానం ఇంకా అముద్రితంగా ఉంది. కవి, రచయిత భావనారాయణగారు ‘శ్రీనాథకవి కనకాభిషేకం’ నాటకం చివరిలో రాసిన మాట అందర్నీ ఆలోచింపజేస్తుంది.

“ప్రజలంతా కళ్ళు విప్పి నిజమైన కవిని గుర్తించటం ఆలస్యమైతే ఆ కవి కన్నుమూసిన తర్వాత ఏమి చేసినా ఏం లాభం లేదు” ఈ మాట ఆధునిక సమాజానికి ఒక హితవుగా భావించవచ్చు.

ఆరడుగుల రూపం. పసిమి ఛాయ, తెల్లని లాల్చీ, ధోవతి ఉత్తరీయాలతో తెలుగు సంస్కృతికి ప్రతిరూపంగా అందరి మన్నన పొందిన పండిత కవి, ప్రముఖ నాటక రచయిత చిల్లర భావనారాయణగారు నిజంగా కీర్తిశేషులు, సాహిత్యోపాసకులకు ఆదర్శప్రాయులు! మన తెలంగాణా సాహితీలోకంలో చిరయశస్సుగన్న పూజనీయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here