నేను నా బుడిగి-4

0
3

[box type=’note’ fontsize=’16’] “ఇంట్లో ఎంతమంది మనుషులున్నా తెలీనట్లే వుండాలి. అది పెద్దోళ్ళ పని కదా! మాలాంటి పిల్లలకెట్ల కుదురుతుందది? ఇలాంటి పిల్లల విషయాలే బామ్మకు అస్సలు తెలీదు” అంటున్నారు వాసవి పైడినేను నా బుడిగి” కథ నాలుగవ భాగంలో. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు మా ట్యూషన్ పిల్లలకంతా సందడిగా వుంటే నాకు మాత్రం మూణ్ణెళ్ళముందే మా ఇంటికి పెద్దపండగ వచ్చేసినంత ఆనందమయిపోయింది. ఆ సాయంత్రం అందరం ఎక్కాలు చెబుతున్న టయిములో మంచి రోజు కూడా చూడకుండా గణేశ్, మణిలను వాళ్ళ నానమ్మ మా శ్రీధర్ సార్‌కు అప్పజెప్పేసారు. పోతాపోతా ఊరకే అలాచేతులూపుకుంటా పోలా. వీళ్ళ గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలియని చరిత్రనంతా మాముందు దొర్లించి, పొర్లించి ఆ తర్వాత నెమ్మదిగా, నిబ్బరంగా గాల్లో చేతులూపతా, అంటే వాళ్ళిద్దరికి బైబై చెప్పడమంటలే, వెళ్ళిపోయారు. ఇంకేముంది… అప్పటిదాకా అందరిముందు ఫోజులుగొట్టే వాళ్ళిద్దరికి ఇక మంచిరోజులు పోయినట్టే. వీళ్ళిద్దరి పుణ్యమాని నేను వాళ్ళకన్నా కొంచెం మంచిదాన్నయి బ్రతికిపోయా. అయినా వీళ్ళకన్నీ ప్రత్యేకమైన అలవాట్లు. గణేశ్‌కు పుస్తకం పట్టుకుంటే ఎక్కడలేని నిద్ర ముంచుకొచ్చి మీదపడిపోతుంది. అది ఏ టయిమయినా సరే-ఎక్కడయినా సరే. ఇక చదువు  వాడిదగ్గరకెట్లొస్తుంది? బడిలో వాడిపై ఇదే పెద్ద కంప్లైంట్. అంటే ఇంకేం లేవని కాదు. మిగతావి  దీని ముందు చిన్నవయిపోయాయి అంతే. ఇక మణికి మాటకి చేయి పైకి లేస్తుంది. అది ఎవరో ఒకర్ని కొట్టిగాని దిగనంటుంది.  కోపం వాడిని విడిచిపెట్టనని మొండికేస్తుంది. వీడు మాస్టార్లకు  కూడా భయపడడు. అదే మాకు భలే విచిత్రం. ఇప్పుడిప్పుడే పాఠాలు చెబుతున్న మాసార్లకి పాపం బెత్తం వాడడం మాత్రం అస్సలు రాదు. దాంతో వాడు ఇంకా మొండిగా అయిపోతాడు. ఒక్కోసారి సార్లు పాఠాలు చెప్పడం మర్చిపోయి మణిగాడిని ఎలా లొంగదీసుకోవాలా అని యోచిస్తుంటారు. ఈ టయిములో మాకు హీరో, విలన్, జోకర్ అన్నీ మణిగాడే.

వాడి పక్కన కూర్చోవాలంటే మాకంతా భయం. సార్ మీద కోపం మామీదెక్కడ కుమ్మరిస్తాడో అని. అయినా వాడెప్పుడూ నిలబడో, లేదా గోడకుర్చిలోనో వుంటాడు. ముందురోజు పాఠం పలకమీద రాసుకు రమ్మంటే రాసుకురాడు. ఇక్కడ అదంతా నిలబడి రాసుకోవాలి ఇదెంత కష్టం? దీనికన్నాఇంటిదగ్గర రాసుకొని రావచ్చుకదా! అందరిలోకి  పొడుగ్గా వుంటాడుకాని, ఇవేవీ తెలీదు. ఇంక గణేశ్-కూర్చొని చదవమంటే నిద్రపోతాడని ట్యూషన్ టైమంతా వాడు నిలబడుకొనే వుండాలి.

ఇక వీళ్ళకు పాఠాలు చెప్పలేక మాసార్లిద్దరూ పడ్డ తిప్పలు మాకు బోలెడంత సంబరం తెచ్చినట్టే. మామూలుగానే శ్రీధర్ సార్ తమాషాగా మాట్లాడతా మమ్మల్ని పాఠంలోకి తీసుకెళ్తా వుంటారు. మాసార్లు మాకు పాఠాలకన్నా ముందు కథలు, పాటలే ఎక్కువ నేర్పిస్తారు. అవి విన్నాక పాఠం మొదలుపెడతారు అవి మేము తొందరగా నేర్చేసుకుంటాం. పాపం అదింకా మణికి అర్థంకాక అందర్నీ ఉడకాడిస్తున్నాడు.

నా కష్టాలు ఎక్కువ దినాలు వుండకుండా ఏదో ఒక అవరోధం వచ్చేట్టు చేస్తాడు వినాయకుడు. రోజూ నాపైన పాడే ప్రార్ధనాగీతాలు వినలేక, పనిష్‌మెంట్లు భరించలేక ఇంట్లో మాట్లాడ్డం తగ్గించి తగ్గించి నేనింక ఇంటిదగ్గర మాటలు మర్చిపోయి మూగపిల్లని అయిపోతాననుకునేప్పుడు పక్కింటి బామ్మ ఈమెని బామ్మ అని పిలవాలని ఆ బామ్మే మడికట్టుకొని వున్నప్పుడు చెప్పింది. యాత్రలనుంచి వచ్చేసింది. వచ్చినరోజే పిల్లలంతా  గేటు తీసుకొని రావడం పోవడం, మిద్దెక్కెప్పుడు వాళ్ళ గోల ఇదంతా చూసి వాళ్ళ మనవళ్ళతో ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకోమన్నారు ట్యూషన్.

ఇది తెలిసి గణేశ్ వాళ్ళ నాన్న వాళ్ళింటి మిద్దిపైన ట్యూషన్ చెప్పుకోమని అనుమతి ఇచ్చేసారు. నాకు పోయిన నా స్వేచ్ఛ తిరిగిచ్చిన బామ్మంటే ఎంతిష్టమై పోయిందో! కాని ఏం లాభం లేదని ఆ తరవాత బాగా అర్థమయ్యేట్టు చేసింది బామ్మ. మొదట  ఇంటి చుట్టూ వున్న పూలమొక్కలు నందివర్ధనం, మందారగేటు అటూఇటూ గుబురుగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు పూసే, నూరువరహాల చెట్లు మొదళ్ళవరకు కొట్టించేసారు. ఎందుకంటే పురుగులు, దోమలూ వస్తాయంట అందుకు. మాగుమ్మం పక్కనుండే కిటికీల దగ్గరపెద్దగా పెరిగిపోయున్న నైట్ క్వీన్ చెట్టుంది. సాయంత్రం ఆ చెట్టు కింద కర్రపుల్లలతో పందిరిలాగా వేసి లోపల చెక్కబొమ్మలుంచితే ఉదయానికి చెట్టునుండి పూలన్నీరాలి పందిరిమీదంతా పరచుకొని పూల పందిరిలా ఎంతబాగుండేదో! లోపల బొమ్మలపైన కూడా ఈ పూలు నింపేసి బడినుంచొచ్చాక తీస్తే బొమ్మలకు కూడా ఈ వాసన అంటుకొని ముక్కు కానించుకోగానే ఎంత బాగుండేదో! ట్యూషన్ కొచ్చిన పిల్లలకంతా అదే పనికదా, ఇపుడా చెట్టును కూడా బోడిగా చేసేసింది బామ్మ. పూల చెట్లు కొట్టేయడం అమ్మకు కూడా నచ్చలేదు.. మేమా ఇంటికొచ్చాక మొక్కలన్నిటికీ పాదు కట్టి ఎరువేసి ఎంత బాగా పెంచిందో, అసలు బామ్మకెలా మనసొప్పిందో అని చాలా బాధ పడ్డాం… చెట్ల నిండా పూలు, వాటిపైన వాలే రంగుల సీతాకోకచిలుకలు ఇప్పుడెక్కడికెళతాయో పాపం.

బామ్మకు ఎంత స్ధలమున్నా చాలదు. వాళ్ళవాటా పక్కనున్న స్ధలం మడి చీర కట్టుకోడానికంట. మేము అక్కడికొస్తే ఎక్కడ చీర తాకి పనికిరాకుండా చేస్తామోనని అని తను, నన్నూ రానివ్వదు. అయినా మడిచీరని మేమేం చేసుకుంటాం. ఇంతకుముందు అక్కడ మందార, గన్నేరు చెట్లుండేవి. వాటిపైన వాలుండే సీతాకోకచిలుకలూ, వాటి రంగులూ లెక్కపెట్టుకుంటా, ఆకుకిందున్న మెరిసే గుడ్లనుంచి సీతాకోకచిలుక వచ్చిందో లేదో చూసుకోడానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడక్కడ ఆ చెట్లూలేక, చిలుకలూ లేక బోసిపోయి, మాసిపోయన మడిచీర ఒక్కటే దండెంమీద వేసి వుంటుంది. దాంతో మావైపున్న కొంచెం ఖాళీస్ధలంలోనే అనిత నేనూ ఆడుకుంటాం. గేటు ముందువుండే స్ధలం ఎండుమిరపకాయలో గోధుమలో ఎండడానికి కావాలి. అక్కడ అడుగులేసి నేలపాడు చేయకండి అని ఆర్డరు. అసలు కారణమేంటంటే వాళ్ళకి శబ్దాలు సరిపడవు. ఇంట్లో ఎంతమంది మనుషులున్నా తెలీనట్లే వుండాలి. అది పెద్దోళ్ళ పని కదా! మాలాంటి పిల్లలకెట్ల కుదురుతుందది? ఇలాంటి పిల్లల విషయాలే బామ్మకు అస్సలు తెలీదు. ఎట్ల చెప్పి దారికితెచ్చుకోవాలో మనం అని అనితతో అంటే  అది కూడా అయ్యో ఎంతకష్టం అంటుంది. పిల్లల కష్టం-పిల్లలే పడాలింక.

ఇంతేనా… అంటే  ఇంకా ఎంతో వుందన్నట్టు, “మీకు పూజకు పూలు కావాలి కదా కొన్నయినా కొట్టకుండా వుంచేయకూడదా” అని అమ్మ అడిగితే బామ్మ ఏమందో తెలుసా? “గణేశ్ వాళ్ళింట్లొ చాలా చెట్లున్నాయి కదా! రోజూట్యూషన్ కు వెళ్ళేముందు నాకు పూలు తెచ్చిపెట్టు పిల్లా”  అని నాతో  అనడమేకాక, “ఈ పిల్ల పైనుండి కిందదాకా ఒకటేగా గుండ్రాయి మాదిరి  తయారవతావుంది శ్రీలక్ష్మీ, కాస్తా కాళ్ళూ చేతులకు ఏదో ఒక పని చెప్పు” అని అడగకనే అమ్మకు నా ఆరోగ్యరహస్యాలు చెప్పి ఒక మూట పుణ్యం దక్కించుకునేసారు.

ఇకనేం రోజూ టంచనుగా  ఆరుగంటల కంతా బడిలో గంట కొట్టినట్టు నన్ను నిద్రలేపుతుంది అమ్మ లేచి పళ్ళు తోంకోని స్నానంచేసి పూలబుట్టతీసుకొని గణేశ్ వాళ్ళింటి కెళ్ళాల. అక్కడ టైగర్ ఒకటుందిగదా, గేటు దగ్గరకి రాగానే మొరుగుతా వుంటుంది. లోపల్నుంచి ఎవరో ఒకరొచ్చి గేటు తాళం తీసాక మిద్దిమెట్లు నాలుగెక్కితే అక్కన్నుంచి నాకందినంతవరకు ఒక్కచెట్టూ వదలకుండా బుట్టనిండేంతదాకా పూలు కోసి, ఇంటికొచ్చి అందులో అమ్మకు కొన్నిపూలు ఇచ్చి, బుట్ట బామ్మ వాళ్ళంటిముందు ఫెట్టేసి రావాలి. “ఇదేమైనా బాగుందా బామ్మా! నీ మనవల్లిద్దరూ నీ మాట వినరనే కదా చిన్నపిల్లని కూడా చూడకుండా ఒక పక్క పనిచేయించుకుంటా నన్ను అంతమాట అనేస్తావా! ఇప్పుడు నాకు అమ్మ దగ్గర ‘ఆకలి’ అని అడగాలంటే ఆలోచించాల్సొస్తుంది. అలాని బామ్మ ఏమైనా అమ్మమ్మలా సన్నగుందా! అబ్బే నేను మా వంటింట్లో వుండే చిన్నగుండ్రాయైతే ఆమెపెరట్లో వుండే పెద్దగుండ్రాయి. అయినా నేను మీకేమవుతానని? ఇలా మీరూ, మీ మనవళ్ళు నాపై కక్షకట్టి వేధిస్తున్నారు?” అని అడగాలనుకున్నా. సార్లముందు మనకు ధైర్యం లేదని ఇదివరకే తెలిసిపోయింది. బామ్మతో కొంచెం చనువు పెరిగాక అడుగుదాం అనుకునే లోగా మళ్ళీ వినాయకుడు నాకు రెండు మంచిపనులు చేసేసాడు. అదెలాగంటే రోజూ నేను పూలు కోసుకునేప్పుడు గణేశ్ నానమ్మ, పనమ్మాయి చేత దగ్గరుండి పెరడంతా చిమ్మిస్తుంటుంది. అప్పుడక్కడ కొన్ని జాంపండ్లు నిమ్మపండ్లులాగా పసుపుగా మారిపోయి కిందపడుంటాయి. అవి పూలకన్నా మంచి వాసనను అంటించుకోనుంటాయ్. అలాంటి పండ్లుకొన్ని నా పూలబుట్టలో వేసి బామ్మకిమ్మంటుంది ఈ నానమ్మ. అవి బామ్మ దేవుడికిపెట్టాక నాకూ, అనితకూ ఇస్తుంది. మనకలాంటివి చూస్తే ఇంక మాటలు రావుకదా! ఇక రెండోది రోజూ నేను పూలకొచ్చే టయిముకి ఇప్పుడు గణేశ్ కూడా మిద్దెక్కి  పూలుకోస్తుంటాడు. వాడు నాకన్నా లావుగా వుంటాడుకదా! వాళ్ళమ్మకీ మా పక్కింటి బామ్మే ఇచ్చుంటుందీ సలహా. దాంతో ఇద్దరం పూలుకోసే డ్యూటీ చేసుకుంటా – మాట్లాడుకుంటా ఫ్రండ్సయిపోయాం. అక్కడ చెట్లమధ్యలోంచి కనబడే నారింజరంగు సూర్యూడిని చూస్తుంటే అమ్మమ్మ ఇల్లు గుర్తొచ్చేది.

***

అమ్మమ్మ దగ్గరున్నప్పుడు ఇంట్లొ అందరూ చీకటిగా వుంటేనే లేచేసి ఇంకా నిద్రలేవని మమ్మల్ని  ఎత్తుకొచ్చి పెరట్లో మంచంపైన పడుకోబెట్టేవాడు రాజు మామయ్య. అక్కడ కొంచెం దూరంలో ఆవులు ‘అంబా’ అని అరుస్తావుంటే మేమూ ‘అమ్మా’ అంటూ  లేచేసేవాళ్ళం. అమ్మమ్మ కొంచెందూరంలో గన్నేరు చెట్లొ పూలు కోస్తూవుండేది. “అమ్మ బుడిగి దగ్గర వుందర్రా” అని అరిచేది. మామయ్య వచ్చి మా దగ్గర కూర్చోని “అదిగో ఎదురుగా ఆకాశంలో ఏముందో చూడండి” అనేవాడు సూర్యుడిని చూపిస్తా. అలా అంటుండగానే ఎదురుగా వేపచెట్ల వెనక కొంచెంకొంచెంగా మీదమీదకొస్తా వుంటే చూడ్డానికి “అచ్చు నారింజమిఠాయి లాగా వుంది కదా మామయ్యా” అంటే మామయ్యేమో అమ్మమ్మతో “అమ్మా చూడే ఇది, సూర్యుడ్ని నారింజమిఠాయి చేసేసింది. కాసేపుంటే ఎత్తుకో మామయ్యా తింటా అంటుందేమో- మీ దేవుడి పూజకు కోసిన పూలు చాలుగాని, తొందరగా టిఫెన్ల సంగతి చూడు” అనేవాడు. అయినా “నీకు అన్నీ తినే వస్తువుల్లా ఎలా కనిపిస్తాయే” అంటూ నా చెవి పట్టుకునేవాడు. “ఏమో ఆ సంగతి నాకేం తెలుసూ… నాకళ్ళకలా కనిపిస్తే నేనేం చేయనూ! అందుకేనేమో చీకటిపడగానే అంతదూరంగా దాక్కోని ఉదయాన్నే మబ్బుల వెనకాల నుంచి నెమ్మదిగా నక్కినక్కి వస్తూ, వచ్చిన కాసేపటికంతా కొంచెంకొంచెంగా పైకెల్లిపోతా ఎవరూ ముట్టుకోలేనంతగా వేడెక్కిపోతాడు. చల్లబడ్డాకేమో చీకటిని అడ్డం వుంచుకొని మాయమైపోతాడు. ఎందుకని మామయ్యా? దొరికితే పెట్టెలొ దాచిపెట్టుకొని  చాలారోజులు కొంచెం కొంచెం కొరుక్కొని తింటూండచ్చుకదా?” అంటే అక్కడమామయ్య వుండడు ఎప్పుడో నా చెవి వదిలి జంప్- అచ్చం చందమామలా. అందుకే నాకు తెలుసు నా ప్రశ్నలకు వినాయకుడు తప్ప వీళ్ళెవ్వరూ జవాబు చెప్పలేరు.

అనిత, నేనూ ఉదయాన్నే లేచేసి దొడ్లో దూడపిల్లల్లా ఇంట్లో అటూఇటూ తిరుగుతుంటాం. దూడలకేమో మెడలో గజ్జెలువుంటే మాకు కాళ్ళకువుంటాయి. అంతే తేడా. ఆ టయిములో అమ్మమ్మ పెరటి తలుపుతీసి బయటకు వెళితే మేమూ వస్తామని వెంటపడుతాం. ఎందుకంటే పెరటి వైపునుండి కొంచెం దూరంలో వెనకవీధి వస్తుంది. అక్కడ నడుస్తుంటే నేలంతా పసుపుగా వుంటుంది. పేడనీళ్ళతో కళ్ళాపి చల్లితే అలా వుంటుందంట, అమ్మమ్మ చెప్పింది. వాకిలి శుభ్రంగా- వాకిలి పొడవునా మెలికల ముగ్గులేసి గుమ్మానికి అటూయిటూ పొడవుగా వున్న అరుగులకంతా పైన తెల్లగా ముగ్గులు అంచుల్లో ఎర్రగా ఎర్రమట్టి పెట్టి భలే అందంగా వుంటాయి. దారిపొడవునా దారం పోగులన్నీ కలిపి చాప లాగా చేసి కర్రలపైన ఆరబెట్టి పోగులన్నీ సరిగ్గా వున్నాయో లేవో అని సరి చేసుకుంటా వుంటారు. వాళ్ళంతా చాలామంది మాకు తెలిసినోళ్ళు, చుట్టాలూనూ. కనిపించిన ప్రతిఒక్కరూ అమ్మమ్మని ఆపి నిలబెట్టి మాట్లాడతా వుంటారు. కొంతమంది మా గురించి, అమ్మ, నాన్నని అడగతా వుంటే అమ్మమ్మ అన్నిటికీ సమాధానం చెప్తా వుంటుంది. నాకు అనితకు ఆ పోగులు చూడడమంటే చాలా సరదా. అంతసన్నగా వుండే దారాలు చిక్కుపడకుండా ఒక్కోక్కటి…  అంత పొడవుగా వున్నవి… ఎలా పక్కపక్క నుంచారా అని ఆశ్చర్యంగా వుండేది. వరుసగా ఒక్కోక్క చాపా అలా చూసుకుంటా వెళుతుంటాం.

ఓరోజు దారిలో అమ్మమ్మ ఎవరో పలకరిస్తే ఆగి మాట్లాడుతుంటే నేనూ, అనిత చిన్నగా రంగుల చాపలు చూసుకుంటా పోతున్నామా! కొంచెం సేపయ్యాక చూస్తే మావెనకాల అమ్మమ్మ కనిపించలేదు. ఆగి కాసేపు అక్కడే నిలబడ్డాం. ఊహూ అమ్మమ్మలేదు… ఆ వీధి ఎటుచూసినా ఒకేలావుంది. వరసగా ఒకటేగా వుండే పెంకుటిళ్ళు, అక్కడక్కడా పూరిళ్ళు ప్రతి ఇంటి ముందూ రంగుపోగుల చాపలు… దాంతో మేము ఎటువెళుతున్నామో కూడా తెలీడంలేదు. బిక్కమొహాలేసుకొని అయోమయంగా చూస్తున్న మమ్మల్ని చూసి “చిన్నమ్ములూ ఇక్కడున్నారేంది”? అని ఒక ఇంట్లోనుంచి ఒక ముసలవ్వ వచ్చి మమ్మల్ని పలకరించింది, ఆమె అమ్మమ్మ ఇంటికి చాలాసార్లు వస్తే చూసాను. అమ్మమ్మ ఏమైనా అప్పచ్చులు చేసాక అన్నీ డబ్బాలో పెట్టి గట్టిగా మూతపెట్టి వాటన్నిటినీ వంటింట్లొ పెద్ద చెక్కపెట్టెలో పెట్టేసేది. డబ్బా అల్మారాలో వుంటే స్టూలు సాయంతో పైకెక్కి అందుకొని అందులోవి ఎత్తుకొని తినచ్చుకాని, అంతపెద్ద చెక్కపెట్టెలోవి ఎలాతీసుకోగలం? పెట్టెమూత పిల్లలు  తీసేట్టుందా! అమ్మమ్మతో, “అలా అన్నీ పెట్టెలో పెట్టెస్తే  వాటిని మేము ఎలా  తినిపెట్టాలి?” అనడిగా”, అన్నీ మీరే తినేయకూడదు” అనేది. “మరి? నువ్వు  తినేస్తావా” అంటే అప్పుడు బదులేమీ చెప్పలేదుకాని ఇదిగో ఇక్కడ కనిపించిన అవ్వకు ఎవరూ లేనప్పుడు ఒక సంచిలో వేసివ్వడం చాలాసార్లు చూసా. అందుకే చూడగానే గుర్తుపట్టాను. “ఇంటినుండి ఈ దారిలోనే అమ్మమ్మతో వచ్చాం తర్వాత. అమ్మమ్మ కనిపించడం లేదు” చెప్పాను. మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడున్న మంచంపైన కూర్చోబెట్టింది. అక్కడ మాకన్నా చిన్న అబ్బాయి వున్నాడు. వాళ్ళ నాన్నేమో బయట నుంచి వచ్చి మమ్మల్ని చూసి, “అమ్మమ్మని తీసుకొస్తా ఇక్కడే వుండండి” అని చెప్పి వెళ్తూ మంచం మీదున్నబాబుని, “దిగు కింద కూర్చో” అని గట్టిగా చెప్పారు. ఆ బాబు వెంటనే మంచందిగి మా ఎదురుగా కిందకూర్చున్నాడు. కాసేపయ్యాక అవ్వ రెండు ప్లేట్లలో ఇడ్లీ, అందులోకి చట్నీ తెచ్చి నాకూ అనితకు ఇచ్చి తినమన్నారు. వాళ్ళ బాబు “నాకూ కావాలి” అన్నాడు. “నీకు మళ్ళా ఇస్తాలే ఊరుకో” అనేసి లోపలికెళ్ళారు… ఆ అబ్బాయి గమ్మనే మమ్మల్నిచూస్తా వున్నాడు. బాబుని పిలిచి ముగ్గురం తిందాంరా అంటే మొదట రాలేదు. మళ్ళా ఆకలేమో దగ్గరకొచ్చాడు ఇడ్లీ తుంచి చిన్నముక్కచట్నీలో అద్ది బాబుకు పెడుతుంటే భలే వున్నది. గుటుకు గుటుకు మని తినేసాడు, వాళ్ళ అవ్వచూస్తే అరుస్తుందనేమో. అక్కడ మగ్గం గుంతవుంది బయటవున్న పోగులచాప జాగ్రత్తగా చుట్టి మగ్గంకు తగిలుంచుంది. నేసినభాగం చీరలాగా కనిపిస్తుంది. ఆ ఇంట్లో సామాన్లు ఏమీలేవు. ఇల్లంతా బోసిగావుంది. అమ్మమ్మ మేం కనిపించక కంగారు పడుతుందేమో అనుకుంటూంటే అంతలోనే అమ్మమ్మ వచ్చింది “ఇంతదూరం వచ్చేసారే” అంటూ. అవ్వతో వెళ్ళొస్తామని చెప్పి మమ్మల్ని పిలుచుకొని ఇంటికి బయలుదేరింది.

ఈసారి ఇద్దరం చెరోపక్క అమ్మమ్మ చేయిపట్టుకొని నడిచాం. ఎందుకో ఈసారి అలా నడుస్తుంటే నాకు చాలా బాగున్నది. మర్నాడు ఆకాశంకేసి అలా… చూస్తావుంటే మామయ్య “ఏంటే అంత ధీర్ఘంగా చూస్తున్నావు?”, అని అన్నాడు.

“ఎలాగైనా ఆరంజి మిఠాయిని కిందకు తెచ్చేసి ముక్కలు చేసి అందరికీ పంచిపెట్టాలి మామయ్యా ఏదైనా ఉపాయం చెప్పవా” అనడిగా. “అమ్మోయ్ పెద్దదానికి పిచ్చి పట్టినంటుందే” అని పిచ్చిమాటలు మాట్లాడతా అమ్మమ్మ దగ్గరకి పరిగెత్తాడు.

అమ్మమ్మ ఇంట్లో అందరూ సందడి చేసేవాళ్ళే. ఇక్కడ, ఇంటి దగ్గర బామ్మ, వంటకూడా సందడిలేకుండా చేసేస్తుంది. రెండు బొగ్గులకుంపట్లతో మంట కనబడకుండా ఎర్రగా బొగ్గుల సెగలోనే అన్నీచేసేస్తుంది. ఒకటి వంటింట్లో గడప పక్కగా- ఇంకోటి గడపకివతల రుబ్బురోలు దగ్గరపెట్టి. మొదట్లో మమ్మల్ని దగ్గరకుకూడా రానిచ్చేవారుకాదు. తర్వాత తర్వాత నేనే కొంచెంకొంచెం దగ్గరగా వచ్చేసా. బామ్మ కుంపట్లో వంకాయ కాల్చి పచ్చడి చేస్తారు. అప్పుడూ, ఆ తర్వాత లోపల పోపు వేసాక ముక్కుకు రకరకాల కమ్మటి వాసనలు. అవి పొట్టలోకెల్లి ఆకలి అంటూ చిన్నగా శబ్దాలు చేయడం మొదలయ్యేది. పాలు అయితే పొంగకుండా గిన్నెలోపలే కాగిపోతాయి. అన్నం కూడా నీళ్ళు వంచే పనిలేకుండా అన్నం అయిపోతుంది. పప్పు, చారు, ఇంకా కాఫీ, దేవుడికి నైవేద్యం ఏంచేసినా వాటిపైనే. సార్లిద్దరికీ కూడా వంటచేయడం బాగా వచ్చు. బామ్మ రాకముందు వాళ్ళే చేసుకునేవాళ్ళు. అమ్మ వాళ్ళని మెచ్చుకుంటుంటే నాన్నమాత్రం ‘పిచ్చిసన్నాసులు’ అని పెదవి విరిచేవారు.

వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ వాళ్ళూరులో పెద్దపిల్లలకు పాఠాలు చెబుతారంట. వీళ్ళింట్లో అందరూ బడిలో పాఠాలు చెప్పి ఇంటిదగ్గర నోటికి రెస్ట్ ఇస్తారేమో. బామ్మకూడా చుట్టుపక్కల ఎవరినీ వదిలి పెట్టకుండా పాఠాలు చెబుతుంది… బామ్మ చేతిలో తోడు వేసిన పెరుగు, వెన్నకాచి చేసిన నెయ్యి అన్నీ బాగుంటాయి. బామ్మ అన్నం తప్ప మిగిలినవన్నీ మాకు పెడుతుంది. అమ్మేమో అన్నీ అడిగి తెచ్చుకోవద్దు అని అరుస్తుంది. నేనడగలేదమ్మా అని రాగం తీగానే ‘హుష్’ అని నోటిపై వేలుంచి ఊరుకోమంటుంది. ఈలోపలే బామ్మ”అది అడగలేదు శ్రీలక్ష్మీ” అని అక్కన్నుంచి అరిచి అమ్మ నోరు మూయించేస్తుంది. అప్పుడు మాత్రం ఉడుక్కున్న అమ్మని చూస్తే అనితకు, నాకు నవ్వు ఆగదు. నోటికి చెయ్యడ్డంపెట్టుకొని అమ్మచుట్టూ తిరుగుతా నవ్వులు విసుర్తుంటే వుంటుందీ మజా! మళ్ళా సాయంత్రం అది నాన్నకు చెబుతుంటే అది డబల్ మజా! ఎలాగైతేనేం మనకి రోజూ పండగ భోజనమే.

సెలవురోజు అమ్మచేసే పనులు కూడా నేనే చేసేయాల. అంటే వంటలాంటి పన్లు కాదు. పాలబూత్ దగ్గర పాలు తీసుకురావడం. అమ్మ ఉదయం పూట తెస్తే మధ్యాహ్నం పూట నేను తీసుకురావాలి. అక్కడ పాలుపోసే అన్నయ్య నన్నుచూసి “అదేంటి? నువ్వు ఉదయం అమ్మలాగా వుంటే మధ్యాహ్నం చిన్నపిల్లవైపోతావే!” అని ఆశ్చర్యపోయేవాడు. అది అమ్మ- ఇది నేను అంటే కాదు  కావాలంటే ఇంటికెళ్ళి అమ్మనడుగు అనేవారు. అమ్మనడిగితే “అవును కవితా బంగారూ నీకు చిన్నగా వుంటేనేకదా ఇష్టం అందుకని” అంటూ అర్థంకాకుండా మాట్లాడుతుంది. అర్ధమయినా కాకపోయినా సెలవు రోజుల్లో పాలు తెచ్చే పని మాత్రం నాకు తప్పదు. ఎప్పుడైనా అనితని పంపితే అది దారిలో చిల్లర పారేసుకొని వస్తుందని అమ్మ నన్నే వెళ్ళమంటుంది. ఈమధ్య నాన్నపనులు అమ్మ- అమ్మ పనులు నేనూ చెయ్యాల్సొస్తుంది. నాన్నకు టయిమంతా ఆఫీసు పనులకే సరిపోతుంది కదా!

గణేశ్ వాళ్ళమిద్ది పైన చాలా స్ధలం వుంటుంది. మాకు చిన్న సార్ అక్కడ కధలు చెప్పడం, పాటలు, పద్యాలు నేర్పించిన తర్వాత ఆటలు కూడా ఆడేసుకుంటాం. అయితే మిద్దిపైన కాబట్టి అన్నీ కూర్చోని ఆడే ఆటలే. మొదట్లో ట్యూషన్ అంటే ఏడుపు మొహం పెట్టే మాకు ఇప్పుడక్కడే బాగుంది. ఎటూ బడిలో పాఠం ఓసారి చదువుకోవాలి. ఇక్కడ పాఠం పాటికి పాఠం ఆ తర్వాత ఆటలు, పాటలు. మణికి మాత్రం ముందు పాఠం అయ్యాకే ఆటలు. ఏరోజూ ఆటల రౌండుకి రాలేడు. పాఠం దగ్గరే పద్మాసనమేసుకొని వుండిపోతాడు, ఆడుకునే మమ్మల్ని చూస్తే వాడికి కోపం. అందుకని అడక్కుండానే మాకు మొటిక్కాయలు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. వాడికి భయపడి మేమూ సార్‌కు చెప్పకుండా ఊరుకుంటాం.

గణేశ్ మాత్రం మంచోడే. ఎప్పుడూ పక్కన టైగర్ వుండడం చూసి మేమే దూరంగా వుండేవాళ్ళం. గణేశ్‌ను చూస్తుంటే బామ్మ మాటలు బాగా అర్ధమవుతున్నాయి. తిండి ఎక్కువ తినకూడదు తింటే మొద్దుల్లాగా అయిపోతారు. నాకు అమ్మమ్మ చెప్పింది కాబట్టి కొంచెం మేలు. అయితే మణిలా వీడు ఎవరినీ ఏమీ అనడు. అసలు ఏమన్నా అనాలంటే ముందు నేర్చుకోవద్దూ…, వీడికెప్పుడూ నిద్రే. అందుకే వీడికి నేను పాఠం చెప్పాల్సొస్తుంది పూలు కోసేప్పుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here