హిమాచల్ యాత్రానుభవాలు-9

0
5

[box type=’note’ fontsize=’16’] ‘చీకటి పడిన తరువాత టెంట్ లోంచి బయటికి వస్తే పండు పున్నమి వెన్నెల, నక్షత్రాలతో నిండిన ఆకాశం, చెట్ల చాటు చంద్రుడు. అబ్బో! బాల్యం గుర్తుకు వచ్చిం’దంటున్నారు డి. చాముండేశ్వరిహిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో. [/box]

చైల్/ఛాయల్

[dropcap]సి[/dropcap]మ్లా మనాలి యాత్ర నుండి తిరిగి వచ్చి ఒక వారం రిలాక్స్ అయ్యి మా మనమరాలితో ఆడుకుంటున్న సమయంలో మా అల్లుడు, అమ్మాయి మేము హైదరాబాద్ తిరిగి వెళ్ళేలోపున హిమాచల్ ప్రదేశ్‌లోని మరొక హిల్ స్టేషన్‌కి క్యాంపింగ్‌కి వెళ్దామన్నారు. టెంట్స్‌లో ఉందామని ఏర్పాట్లు చేశారు.

మే చివరి వారంలో ఒకరోజు ఉదయం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చండీగఢ్ వరకు ఎసి చైర్ కార్‌లో వెళ్ళాము. నాలుగు గంటల ప్రయాణం తరువాత 11.30 గంటలకి చండీగఢ్ చేరి ముందుగానే బుక్ చేసుకున్న జూమ్ కార్‌లో చైల్‌కి బయలుదేరాము. బ్రేక్‌ఫాస్ట్, టీ ట్రైన్‌లో ఇచ్చారు. మార్గమధ్యంలో లంచ్‌కి ఆగాము. చక్కని పంజాబీ శాకాహార వంటకాలు బావున్నాయి.

దాదాపు 3 గంటల ప్రయాణం తరువాత మా గమ్యం చేరాము. చండీగఢ్ నుండి సిమ్లా వెళ్లే దోవలో సొలాన్ గ్రామం దాటాక ఎడమప్రక్కకు తిరిగితే చైల్ కి చేరే మార్గం వస్తుంది. దోవంతా వృక్షాలతో పూలతో ఆహ్లాదకరంగా ఉంది.

మేము బుక్ చేసుకున్న క్యాంపింగ్ హోటల్ ఎత్తయిన ఒత్తయిన వృక్షాల మధ్య ఉంది. రోడ్డుకి ఎడమవైపు ఒక చెట్టుకు పెట్టిన హోటల్ బోర్డు కనిపించింది. మెయిన్ రోడ్ నుండి ½ కిమీ ఉండవచ్చు. సింగల్ రోడ్. మట్టి రోడ్.

కార్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసాక హోటల్ స్టాఫ్ వచ్చి సామాన్లు టెంట్స్‌లోకి తీసుకువచ్చారు.

ఇప్పటివరకు ఎప్పుడూ టెంట్స్‌లో, అడవిలో ఉన్న అనుభవం లేనందున కొత్తగా, కొంచం భయంగా అనిపించింది. మా పిల్లలు ధైర్యంగా ఉండటం చూసి స్వాంతన పొందాను. ప్రక్కప్రక్క టెంట్స్. పెద్దగా ఉన్నాయి. చాల వసతిగా ఉంది. ఫ్యాన్ లేదు. తలుపుకు బదులుగా రెండు వరుసలుగా ఉన్న జిప్ ఉంది. ఒకటి గాలివచ్చేలా, బయట కనపడేలా నెట్ జిప్. ఇంకోటి టెంట్ టార్పాలిన్ క్లాత్‌తో చేసిన జిప్ ఉన్నది. దాదాపు 12 టెంట్స్ ఉన్నాయి.

పెద్ద డైనింగ్ ఏరియా, కిచెన్, స్టాఫ్ టెంట్స్ ఉన్నాయి. న్యూ ఇయర్ రోజున ప్రారంభించారుట. ఓనర్ కం మేనేజర్ రోహిత్ చాల ఫ్రెండ్లీగా ఉన్నారు. హోటల్ స్టాఫ్ కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు.

‘జంగల్ స్టే’ హోటల్ పేరు. పేరుకు తగ్గట్టే ఉంది. టారిఫ్ కూడా ఎక్కువ కాదు. హోటల్ ఏరియా కలియదిరిగాక

మా టెంట్స్ ముందు వేసిన కుర్చీల్లో కూర్చుని వేడి తేనీరు తాగుతూ పరిసరాలు, చెట్లు చూస్తూ గడిపాము. మా చిన్నారి ప్రకృతికి చాలా నచ్చింది. అటూ ఇటూ పరుగిడుతూ ‘దేఖో దేఖో’ అని సీతాకోకచిలుకల్ని చూపించింది.

మా హోటల్ చుట్టుప్రక్కల కాలిబాటలు చాలా ఉన్నాయి. పల్లె ప్రజలు బరువులు మోస్తూ సునాయాసంగా కొండ ఎక్కిదిగుతుంటే ‘అమ్మో! మనమైతేనా?’ అనిపించింది.

చీకటి పడిన తరువాత టెంట్ లోంచి బయటికి వస్తే పండు పున్నమి వెన్నెల, నక్షత్రాలతో నిండిన ఆకాశం, చెట్ల చాటు చంద్రుడు. అబ్బో! బాల్యం గుర్తుకు వచ్చింది. వేసవిలో ఆరుబైట పదుల సంఖ్యలో పిల్లలం ఒక చోట చేరి అమ్మలు పరచిన మెత్తని పరుపుల మీదవేసి తెల్లని దుప్పట్ల మీద పడుకుని ఆకాశం చూస్తూ, తారలు లెక్కిస్తూ వాదులాడుకుంటూ, పెద్దక్క చెప్పే పెర్రిమైసోన్ కధలు, చిన్న అన్న చెప్పిన దయ్యం కధలు వింటూ ఉలిక్కిపడిన ఆనందించిన రోజులు – పాత తెలుగు సినిమాలో గిర్రున తిరిగిన ఫ్లాష్‌బ్యాక్‌లా గుర్తుకు వచ్చాయి.

అందరం మా మా బాల్యం కబుర్లు చెప్పుకుని, డిన్నర్ చేసి మా టెంట్స్ లోకి వెళ్లి విశ్రమించాము.

మరునాడు ఉదయం త్వరగా లేచి టెంట్ బయటికి వస్తే అందమైన సూర్యోదయం. ముందురోజు సూర్యాస్తమయం చూసాము. చల్లని కొండ గాలి. పక్షుల కిలకిలలు. దూకుతున్న నెమళ్ళు, సీతాకోకచిలుకలు మైమరిపింపచేశాయి. ఉదయం 9 గంటలకి బయలుదేరి చైల్ గ్రామం చూడాలని బయలుదేరాము.

చైల్ మన దేశానికీ స్వతంత్రం రాక మునుపు పాటియాలా రాజుకు వేసవి రాజధానిట. అందమైన పర్వతప్రాంతము.

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఆఖరిది అయిన శివాలిక్ పర్వతశ్రేణుల్లో సిమ్లాకు 60 కి మీ దూరంలో ఉంది. సట్లెజ్ నది పరివాహ లోయలకి అభిముఖంగా ఉంటుంది. దాదాపు 365 రోజులు చల్లని వాతావరణం కలిగి ఉంటుందిట. 1893లో పాటియాలా రాజా భూపేందర్ సింగ్ మరియు బ్రిటిష్ ఆర్మీ కమాండర్‌కి వచ్చిన వైషమ్యాలు వాల్ల రాజును సిమ్లా లోకి రాకుండా నిషేధించారు. అందువల్ల రాజా సిమ్లా కన్నా మంచి వేసవి విడిదిని నిర్మించుకుంటానని చెప్పి చైల్ గ్రామాన్ని ఎన్నుకొని ఇక్కడ రాజ భవనం, ప్రపంచం లోకెల్లా ఎత్తైన క్రికెట్ గ్రౌండ్, సైనిక పాఠశాల తదితర కట్టడాలు నిర్మించాడు.

చైల్, సిమ్లా, కుఫ్రిని కలిపి గోల్డెన్ ట్రయాంగల్ అఫ్ హిమాచల్ ప్రదేశ్ అంటారట. సిమ్లా రద్దీగా ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దట్టమైన దేవదారు వృక్షాలు అనేకం. చైల్ గ్రామం మాల్ రోడ్ చాల చిన్నది. అదొక చిన్న గ్రామం. అక్కడ నుండి క్రికెట్ గ్రౌండ్ చూడటానికి వెళ్ళాము. దోవంతా పచ్చగా ప్రశాంతంగా ఉంది.

గ్రౌండ్ లోపలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే ప్రస్తుతం అది ఆర్మీ స్కూల్ ఆధీనంలో ఉంది. బైటనుండి చూసాము. స్కూల్ యూనిఫార్మ్‌లో ఉన్న పిల్లలు డ్రిల్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది.

అక్కడనుండి చైల్ పాలస్‌కి వెళ్ళాము. ప్రస్తుతం అదొక పర్యాటక హోటల్. ప్రభుత్వానిది. లోపల అప్పటి రాజా చిత్రపటాలు, పెయింటింగ్స్, ఫర్నిచర్, షాప్, రెస్టారెంట్, హోటల్ రూమ్స్ ఉన్నాయి. పర్యాటకులకు అనుమతి ఉన్న రూమ్స్ చూసి ఆనుకుని ఉన్న పెద్ద తోట, పచ్చిక బయలులో కలియదిరిగాము.

మా మనమరాలు వందల సంఖ్యలో ఉన్న సీతాకోకల్ని పట్టుకోవాలని పరుగులు పెట్టటం భలేగా అనిపించింది.

పూల పందిళ్ళ క్రింద విశ్రమిస్తే ప్రాచీన సాహిత్యంలో కవులు వర్ణించిన విరులు, గిరులు గుర్తుకు వచ్చాయి. బహుశా వాళ్ళు పూలను చూసి పులకరించి రాసి వుంటారు. అక్కడి పాలస్ హోటల్‌లో హిమాచల్ ప్రదేశ్ స్థానిక వంటకాలు రుచి చూశాము. మధ్యాహ్నం మా టెంట్స్‌కి వచ్చాము. వాతావరణం ఉక్కపోత నుండి ఒక్కసారిగా మారి వడగళ్ల వాన కురిసింది. వందల సంఖ్యలో పెద్ద వడగళ్ళతో వాన పడింది. ‘అమ్మమ్మా ఐస్, ఐస్’ అని కేరింతలు కొట్టింది మనవరాలు.

టెంట్ కిటికీ బైటకు చెయ్యి పెట్టి పట్టినన్ని వడగళ్ళు సేకరించి ప్రకృతి చేతిలో వేశాము. వాన వెలిసాక సాయంత్రం టెంట్ బైటకు వచ్చి కాలిబాట వెంట కొద్దిదూరం నడచి వచ్చాము. టెంట్స్ అన్ని పర్యాటకులతో ఫుల్.

మరునాడు ఉదయం దగ్గర కొండలు ఎక్కి లోయలు చూస్తూ రిలాక్స్ అయ్యాము. తిరుగు ప్రయాణంలో సొలాన్ గ్రామంలో ఉన్న మోహన్ మెకన్స్ వైన్ ఫ్యాక్టరీ చూద్దామనుకున్నాము. వీలు కాదన్నారు. చండీగఢ్‌లో కార్ వాపస్ చేసి తిరిగి ట్రైన్‌లో ఢిల్లీ చేరాము.

మా హిమాలయ దర్శన్ యాత్రల్లో హిమాలయ మంచును చూడని యాత్ర ఇదే. టెంట్స్‌లో రిలాక్స్‌డ్‌గా ఎలాంటి తొందర లేకుండా హాయిగా విశ్రమిస్తూ, ఎక్కువ చూడాల్సిన ప్రదేశాల టెన్షన్ లేకుండా బాగుంది. ఆ ప్రదేశం మౌంటెన్ టెక్కింగ్ చేసేవాళ్లకు విడిది ప్రదేశము. అక్కడ టెంట్సే కాదు, అనేక రిసార్ట్స్, హోటల్స్ ఉన్నాయి. ప్రతి ప్రయాణం ఒక అనుభవం.

ఢిల్లీ వచ్చిన రెండో రోజు హైదరాబాద్ తిరిగి వచ్చాము. ఇక్కడితో మా హిమాచల్ ప్రదేశ్ యాత్ర ముగిసింది.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here