[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
221
చెలి చిరునవ్వులతో చూపులు
మలి చూపులకొరకు ఎదురు చూపులు
కలిసి మాట్లాడాలంటే భయం
కొలిక్కి వచ్చే దాక ఎదురు చూపులే గదా
222
కొండ యెంత అండగా వుందో తమకు
బండ రాళ్ళు కొట్టే వాళ్ళ వధింపుతో చిన్న దయ్యె
తడవ తడవ చేసి మాయమయ్యె
మూడు నాళ్ళ ముచ్చటే అయింది
223
బండ రాయికి తన అచేతన తనానికి సిగ్గు
కొండను ఢీ కొనాలని ఆశ
గడ గడా వణికించాలని కోరిక
కొండంత ఆశ నిష్ఫలమైంది
224
ర్యాగింగ్‌కి యెంత మంది బలో
పగ అని కాదు కాని, ఆట పట్టించటానికి మొదలైంది
తగినంతగా రాక్షసత్వం చోటు చేసుకుంది
ఆగదా ఈ భూతం?
225
ముందున్న వాడే మొనగాడు
అందరి ప్రశంసలు అందుకుంటాడు
కొందరు వెనుకబడిన వాళ్ళు కుళ్ళుకుంటారు
ఎందరు ఎన్ని అనుకున్నా ముందే గొప్ప
226
కర్ర అడ్డు తొలగినా దూకుచునే వుండు గొర్రె, అలాగే
గొర్రె దాటు బేరం ప్రజలదీనూ
చరణాలలో తప్పులున్నా
ఫరవా లేదని పాడేస్తుంటారు
227
విహార యాత్రలలో నేత్రానందం
ఆహ్లాదం, పుణ్యమూ వచ్చు తీర్థయాత్రలలో
ఊహా లోకంలో రెండూ పొందవచ్చు
మహదానందం పొందవచ్చు మాయా లోకంలో
228
ఎంతటి మహత్ములైనా
మత బోధకులు గావచ్చు, ఋషులు గావచ్చు
శత కోటి పూజలు చేసుండ వచ్చు
అంతా చివరకు నిర్యాణం పొంద వలసిందే
229
ఎన్ని అద్భుతాలు జరిగినా
కొన్ని మాయలు, మంత్రాలూ చేసినా
ఎన్నెన్ని కుట్రలు, కుత్రంత్రాలు చేసినా
ఎన్నైనా ప్రకృతిని మించి యేమి వుండవు గదా
230
ఎవరెన్ని కథలు, కవితలు
సవివరంగా వ్రాసినా, వాళ్ళ మనోభావాలు వాటిలో అనగా
కవిత్వంలో చొప్పించబడతాయి
ఆవిర్భావమౌతాయి