[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘త్రిగుణముల విశ్లేషణ’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ప్ర[/dropcap]కృతిలో సాత్విక, రాజస మరియు తామసము లనే మూడు ప్రధాన గుణాలు వున్నాయి. అన్ని జీవులలో ఈ మూడు గుణాలు తప్పని సరిగా (కొంచెం ఎక్కువ తక్కువ పాళ్ళలో) వుంటాయి. కేవలం ఆత్మ దర్శనం పొందిన వారు, భగవత్ స్వరూపులు, భగవంతుడికి మాత్రమే ఈ గుణాలు అంటక వారు త్రిగుణాతీతులై వుంటారు. ఈ జగత్తును నడిపించే విశ్వాత్మక మాయ ప్రతీ జీవిని ఆవరించి ఈ మూడు గుణాలకు అనుగుణంగా ప్రవర్తించేలా చేస్తుంది.
అయితే రాజస, తామస గుణాలు ఇతరులపై అధికారం చేలాయించేందుకు ప్రేరేపిస్తుంటాయి. ఒక్క సాత్విక గుణం మాత్రమే మానవులను ఆధ్యాత్మిక పధంలో నడిపించేలా చేస్తుంది. ఈ సత్వ గుణాన్ని పెంపొందించుకోవడం వలనే మనస్సు నిశ్చలమవుతుందని పతంజలి యోగసూత్రాలు చెబుతున్నాయి. సత్వ గుణం వలనే భగవద్దర్శనం, ఆత్మజ్యోతి దర్శనం సాధ్యం.
ఒక సరస్సులో మన ప్రతిబింబం చూసుకోవాలనుకుంటే అందులోని నీరు నిశ్చలంగా, నిర్మలంగా వుండాలి. ఈ స్థితి సాత్విక గుణానికి ప్రతీక. కొలను లోని నీరు మురికిగా (తామస) లేదా కెరటాలతో (రాజస) వుంటే మన ప్రతిబింబాన్ని స్పష్తంగా చూడడం సాధ్యం కాదు.
వేదాల ప్రకారం పరమాత్మ జీవాత్మ కలిసి ఉన్నప్పుడు త్రిగుణముల సమత్వము చెదరక ఉంటుంది. జీవాత్మ శారీరక ఉపాధులతో జననం ద్వారా చేరి పరమాత్మకు దూరమైనప్పుడు, త్రిగుణముల సమత్వము తప్పుతుంది. అప్పుడు జీవాత్మ తన దైవిక లక్షణాలను కోల్పోయి శరీరంతో, దాని వికారాలతో తనను తాను అనుసంధానం చేసుకుంటుంది. అప్పుడే దానికి త్రిగుణాలు అబ్బుతాయి.
ఆత్మ సాక్షాత్కారం ద్వారానే ఈ త్రిగుణాల నుండి విడివడడం సాధ్యం. ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం.
మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడి వుంటాము. పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచప్రాణములు అనే నాలుగు పంచారములతో కూడినది శరీరము. పంచప్రాణము లాధారముగ మిగిలిన పంచారములు పనిచేస్తూ వుంటాయి. ప్రాణ మాధారముగనే దేహ మేర్పడు చున్నది. ఇందులో జీవుడు త్రిగుణాత్మకుడై జీవిస్తూ వుంటాడు.
త్రిగుణముల అతీతంగా దైవం వుంటాడు. దైవమే ప్రాణముగను, ప్రజ్ఞగ వుంటాడు అంటోంది వేదం. కాబట్టి జీవుడు త్రిగుణములకు బద్ధుడై దైవమందించు ప్రాణ, ప్రజ్ఞ లాధారముగ తనదైన జీవితము జీవిస్తూ వుంటాడు. త్రిగుణాలకు లోబడి వున్నంత వరకు జనన మరణ చక్ర బంధంలో చిక్కుకొని నిత్యం అనేక బాధలు అనుభవిస్తూ వుంటాడు.
భగవంతుడు గుణాతీతుడు. సత్వ, రజో, తమో గుణములు జీవుని సదా బంధించి వుంచుతాయి కాబట్టి సాధన ద్వారా వీటి నుండి విడివడదానికి కృషి చేయాల్సి వుంది.