జీవిత దర్పణం

0
4

[శ్రీ సిహెచ్. సి. ఎస్. శర్మ రచించిన ‘జీవిత దర్పణం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]శే[/dropcap]షారావు.. గ్రేట్ మెకానిక్.. సర్వీస్ సెంటర్ ఓనర్.. ప్రైవేటుగా చదివి బి.ఏ. పాసైనాడు. మోటర్ ఫీల్డ్‌లో ముప్పై నాలుగు సంవత్సరాల అనుభవం కలవాడు. ఇరవై మంది పనివారితో తన సర్వీస్/రిపేర్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అతని వయస్సు నలభై ఐదు.

భార్య శకుంతల.. వారి వివాహం జరిగి ఇరవై మూడేళ్ళయింది. ఒకే కొడుకు.. పేరు ఆనందరావు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వయస్సు పద్దెనిమిది. పెళ్ళయిన ఐదేళ్ళ తర్వాత జన్మించిన సుపుత్రుడు. శకుంతలకు కొడుకు మీద ఎన్నో ఆశలు.. కలెక్టర్‌ను చేయాలనే కలలు..

మూడేళ్ళ నాడు ఆనందరావు టెన్త్ ఫెయిల్ అయిననాడు.. “శకుంతలా! మనవాడు నీవు కలలు కంటున్నట్టు కలెక్టర్ కాబోడు. వాడికి చదువు మీద ధ్యాస లేదు. దానికి నీవే కారణం. అందుకే ఫెయిలైనాడు. ఎవరికైనా వయస్సు ముదిరితే నడుం వంగదు. వాడు చదివింది చాలు.. రేపటి నుంచి సెంటర్‌కు పంపు. అక్కడైనా బుద్ధిగా పని నేర్చుకొంటాడో లేదో చూస్తాను..” కొడుకు ఫెయిల్ అయినందుకు విరక్తిగా చెప్పాడు శేషారావు.

“ఏదో ఈ సంవత్సరం ఫెయిల్ అయినాడని.. వాడు ఇక మీదట ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే వుంటాడనేనా మీ అభిప్రాయం.. వాణ్ణి నేను సెంటర్‌కు పంపను. స్కూలుకు పంపుతాను. వచ్చే సంవత్సరం యీ నాటికి చూడండి నా బిడ్డ ఫస్టు క్లాస్ పాసై తీరుతాడు” కొడుకు మీది వ్యామోహంతో నోటికి వచ్చినట్లు చెప్పింది శకుంతల.

ఆనందరావు ఆ రీతిగా చదువులో శ్రద్ధ లేనివాడు కావడానికి కారణం ఒకటి తల్లి శకుంతల పిచ్చి అభిమానం.. రెండు తన పనుల్లో శేషారావు ఆనందరావు గురించి సరిగా పట్టించుకోక పోవడం.. సహజంగా మగపిల్లలకు తండ్రి అంటే భయం ఉండాలి. తల్లికి ఎటూ మగపిల్లల మీద ఆశ ఎక్కువగానే ఉంటుంది.. ఆ కారణంగా తల్లి మూలంగా వారు తమ కోర్కెలను తీర్చుకొంటారు.

తల్లిదండ్రులు పిల్లలకు బాల్య కౌమార్య వయస్సులో భయం భక్తినీ నేర్పాలి.. ఆ వయస్సులో పిల్లలు ఆడింది ఆట పాడింది పాటగా మితిమీరిన గారాబంతో పెంచితే.. పెంకివారుగా మూర్ఖత్వంతో తయారౌతారు. అలా పెరిగిన వాడే ఆనందరావు.

***

శేషారావు తన ఆఫీస్ రూమ్‍లో కూర్చొని వున్నాడు. అతని క్రింద పని చేసే రామకోటి పరుగున ఆ గదిలోకి వచ్చాడు.

“అన్నా!..” పిలిచాడు.

“ఏరా!..”

“మన ఆనంద్ డ్రిల్ మాస్టర్‌ని కొట్టాడంటన్నా!..” విచారంగా చెప్పాడు రామకోటి.

“ఏందిరా నీవనేది!..” ఆశ్చర్యంతో అడిగాడు శేషారావు.

“అవునన్నా!.. నా కొడుకు స్కూలు నుంచి ఇంటికి వెళుతూ నాతో చెప్పి వెళ్ళాడు..”

శేషారావు కుర్చీ నుంచి వేగంగా లేచాడు.

“కోటీ కారు తియ్యి. స్కూలుకు వెళ్ళి వద్దాం!..” అన్నాడు.. ఆఫీస్ రూమ్ నుంచి బయటకి వచ్చాడు.

కోటి పరుగున వెళ్ళి కారును స్టార్ట్ చేశాడు. శేషారావు కూర్చొని.. “స్కూలుకు పోనీ..” అన్నాడు.

కోటి కారును స్కూలు వైపుకు నడిపాడు. ఇరవై నిముషాల్లో వారు స్కూలుకు చేరారు.

ఇరువురూ ప్రిన్స్‌పాల్ గారి గదిని సమీపించారు. గది నుండి బయటికి వచ్చిన ప్రిన్స్‌పాల్ భాస్కరరావు – శేషారావును.. కోటిని చూచాడు. వారి కారు సర్వీసింగ్‌కు శేషారావు సర్వీస్ సెంటర్‌కే వెళుతుంది.

“నమస్కారం సార్!..” వినయంగా చేతులు జోడించాడు శేషారావు.

బాగా పరిచయమున్న శేషారావును చూచిన ప్రిన్స్‌పాల్.. “రండి శేషారావుగారు..!” అంటూ వెనుతిరిగి గదిలో ప్రవేశించి తన కుర్చీలో కూర్చున్నాడు. శేషారావు.. రామకోటి వారి టేబుల్ ముందు చేతులు కట్టుకొని.. భయంతో నిలబడ్డారు.

వారిని చూచి ప్రిన్స్‌పాల్.. “కూర్చోండి..” అని సాదరంగా చెప్పాడు. ఇరువురూ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నారు.

“మీ కొడుకు ఆనంద్!.. చాలా పెద్ద తప్పు చేశాడు శేషారావ్!.. డ్రిల్ మాస్టర్‌ని కొట్టాడు.. దాని ఫలితం ఏమిటో తెలుసా!.. వాణ్ణి నేను డీబార్ చేయాలి..”

“సార్!.. సార్!.. వాడికి నేను బుద్ధి చెబుతాను సార్!.. ఆ మాస్టారుగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుతాను. మీరు ఏం చేయమన్నా చేస్తాను. వాణ్ణి స్కూలు నుంచి తీసెయ్యకండి సార్!..” దీనంగా వేడుకొన్నాడు శేషారావు.

“ఒక తండ్రిగా మీరు బిడ్డ కోసం ఏమైనా చేయగలరు. అది మీ ధర్మం. అదే రీతిగా ప్రిన్స్‌పాల్‌గా యీ జూనియర్ కాలేజీని నడిపే విషయంలో నేను కొన్ని ధర్మాలకు కట్టుబడి పాటించాలి.. ముఖ్యంగా పిల్లల డిసిప్లిన్. రేపు రండి టి.సి. యిస్తాను..”

 “సార్!.. మా వాడు డ్రిల్ మాస్టర్ని ఎందుకు కొట్టాడు సార్..” అడిగాడు రామకోటి.

ఆశ్చర్యంగా ప్రిన్స్‌పాల్.. శేషారావులు రామకోటి ముఖంలోకి చూచారు. రామకోటి తల దించుకొన్నాడు, ‘అడగరాని ప్రశ్నను అడిగానే’.. అనుకొంటూ.

“మీ వాడు ఓ అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వబోతున్న సన్నివేశాన్ని మాస్టార్ చూచాడు. పిలిచి మీ వాడు సంకల్పించిన పని జరగకుండా చేశాడు. తప్పు చేయబోయావ్, అది నీ భవిష్యత్తును పాడు చేస్తుందని.. ఆడపిల్లలను వేధించడం తప్పని.. హెచ్చరించాడు. మీ వాడు వాదించాడు. మాట మాట పెరిగింది.. మీ వాడిది ఆవేశం మాస్టారుగారిది అనునయం. అది నచ్చని మీ ఆనంద్ మాస్టర్ గారిని కొట్టి పారిపోయాడు. ఇదీ జరిగిన విషయం!..” చెప్పాడు ప్రిన్స్‌పాల్ భాస్కరరావు.

అంతా విన్న తర్వాత శేషారావు.. రామకోటి మారు మాట్లాడలేకపోయారు.

“మీ వాడికి మిగతా విషయాల మీద వున్న ధ్యాస చదువు మీద లేదు. ఒక రీతిగా ఆ మాస్టార్ మీ వాడికి ఎంతో మేలు చేశాడు.. వాడు వ్రాసిన లవ్ లెటర్‌ను ఆ అమ్మాయికి ఇవ్వకుండా ఆపి. ఆ లెటర్ మీ వాడు ఆ అమ్మాయికి యిచ్చి వుంటే.. దాని పరిణామాలు ఎలా వుండేవో!.. ఆ అమ్మాయి ఆ లెట‍ర్‌ను.. వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి వుంటే ఏమై వుండేది?.. అయాం సారీ!.. శేషారావు.. మీ గురించి విన్నాను. జీవితంలో మీరు వున్న స్థాయికి వచ్చేదానికి మీరు ఎంతగా కష్టపడి వుంటారో నేను వూహించుకోగలను. మీరు వూరంతటికీ మంచివారు.. కానీ మీ కొడుకు దానికి పూర్తిగా భిన్నం..” విచారంగా చెప్పాడు ప్రిన్స్‌పాల్.

“సార్.. మీరు..” శేషారావు పూర్తిగా చెప్పక ముందే..

“నేను ఏమీ చేయలేను. రేపు వచ్చి టీసీ తీసుకొని వెళ్ళండి..” కుర్చీ నుండి లేచి ప్రిన్స్‌పాల్ వరండాలో ప్రవేశించారు. బిక్కముఖాలతో శేషరావు రామకోటి వారిని అనుసరించారు.

స్కూల్ బయటికి వచ్చి.. భాస్కరరావు తన కార్లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాడు.

శేషారావు.. రామకోటి తమ కార్లో సర్వీస్ సెంటర్ చేరారు.

***

వర్క్‌షాపులో పని చేసేవారు.. ఏడు గంటలకు తమ ఇళ్ళకు బయలుదేరుతారు. ముఖ్యమైన అర్జంట్ పనులు వుంటే ఆయా విభాగాల వారు రాత్రి పొద్దుపోయే వరకూ పని చేసి.. ముగించి ఇంటికి వెళ్ళేవారు. వారు పనిని ముగించేటంత వరకూ శేషారావు రామకోటి పనిచేసే వారితోటే వుండేవారు. పని త్వరగా ముగిసేటందుకు వారికి సాయం చేసేవారు.

ఆ రోజు పని ముగించి అందరూ వెళ్ళిపోయారు. తన కొడుకు చేసిన నిర్వాకాన్ని.. దాని పర్యావసానాన్ని.. ప్రిన్స్‌పాల్ చెప్పిన మాటలను తలచుకొంటూ… తన ఆఫీస్ గదిలో విచారంగా కూర్చుండిపోయాడు శేషారావు.

రామకోటి.. మెల్లగా ఆ గదిలో ప్రవేశించాడు. అతను శేషారావు తొలి నౌకరు నలభై ఏళ్ళ వయస్సు.. సీనియర్ మెకానిక్. సాత్వికుడు.. శేషారావు అంటే ఎంతో ప్రేమ.. గౌరవం.. శ్రీరామచంద్ర మూర్తికి శ్రీ ఆంజనేయస్వామి వారు ఎలాగో.. శేషారావుకు రామకోటి అలాంటివాడు.

విచారంగా కళ్ళు మూసుకొని కూర్చొని వున్న శేషారావును చూచి.. రామకోటి కళ్ళల్లో నీళ్ళు. గతంలో ఎన్నడూ రామకోటి శేషారావును ఆ స్థితిలో చూడలేదు. చక్కిళ్ళ పైకి జారిన కన్నీటిని తుడుచుకొని..

“అన్నా!..” మెల్లగా పిలిచాడు రామకోటి.

మెల్లగా కళ్ళు తెరచి చూచాడు శేషారావు.. అతని కళ్ళు ఎఱ్ఱగా చింత నిప్పుల్లా వున్నాయి.

“ఏం కోటీ!.. ఇంటికి పోలేదా!..” అడిగాడు శేషారావు.

“అన్నా!.. నీవు ఇంటికి పోకుండా వుంటే నేను నిన్ను వదలి ఎలా పోతానన్నా.. లే.. ఇంటికి బయలుదేరు. వెళ్ళి వదినతో విషయాన్ని చెప్పు. ఇక ముందైనా ఆనంద్ విషయంలో కాస్త కటువుగా వుండమని..” క్షణం ఆగి ఏదో తోచడంతో..

“అన్నా!.. నేనొక మాట చెబుతాను వింటావా!..” అన్నాడు రామకోటి.

“ఏ విషయంలో!..”

“మన ఆనంద్ బాబు విషయంలో!..”

“ఏమిటో చెప్పు..”

“ఇప్పుడు ప్రిన్స్‌పాల్ గారు ఇంట్లో వుంటారు. మనం వెళ్ళి వారిని కలుద్దాం!..”

“ఎందుకు?..”.

“వారు చాలా గొప్పవారు. ఎందరో తెలిసి వుంటారు. యీ సంవత్సరం వృథా కాకుండా ఆనంద్‌ను వేరే ఏ కాలేజీలోనైనా జాయిన్ చేయగలరేమో!.. ఓసారి అడిగి చూద్దాం అన్నా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రామకోటి.

శేషారావు రామకోటి ముఖంలోకి ఆశ్చర్యంతో చూచాడు.

“ఏందన్నా అలా చూస్తున్నావ్!.. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా!..” బిక్కముఖంతో శేషారావు ముఖంలోకి చూచాడు రామకోటి.

“నీకు తోచిన ఆ మాట నాకు తోచలేదురా!.. పద.. ప్రయత్నిద్దాం!..” వేగంగా కుర్చీ నుంచి లేచాడు శేషారావు.

ఇరువురూ గది నుంచి బయటికి వచ్చారు. రామకోటి ఆ గదికి తాళం వేసి వేగంగా కారును సమీపించారు. ఎక్కారు.

ఇరవై నిముషాల్లో కారు ప్రిన్స్‌పాల్ గారి ఇంటిని సమీపించింది. రోడ్డు ప్రక్కగా కారును ఆపి శేషారావు.. రామకోటి మెయిన్ గేటు తెరచుకొని భవంతి వరండాలో ప్రవేశించారు. కాలింగ్ బెల్ నొక్కాడు రామకోటి.

రెండు నిముషాల తర్వాత.. ద్వారం తెరవబడింది. ప్రిన్స్‌పాల్ గారు వారిని చూచి వరండాలోనికి వచ్చారు.

ఇరువురూ నమస్కరించారు.

“కూర్చోండి శేషారావుగారు!..” వారు కుర్చీలో కూర్చున్నారు.

“నా నిర్ణయానికి నాకూ విచారంగా వుంది. కానీ నేను రూల్సును వ్యతిరేకంచలేను కదా!.. అందుకే టీసీ ఇస్తానని చెప్పాను. అందరికీ వున్నట్లే టీచర్లకూ యూనియన్ వుంది” సౌమ్యంగా చెప్పాడు భాస్కరరావుగారు.

“నేను తమరికి ఒక చిన్న విన్నపాన్ని చేసుకోవాలని వచ్చాను” వినయంగా చెప్పాడు శేషారావు.

“ముందు కూర్చోండి.. మనుషులను చిన్నవారు కాని పెద్దవారు కానీ నిలబెట్టి మాట్లాడ్డం నాకు నచ్చదు.” చిరునవ్వుతో అన్నాడు ప్రిన్స్‌పాల్.

ఇరువురూ వారికి ఎదురుగా కూర్చున్నారు.

“చెప్పండి ఏమిటో మీ విన్నపం!..”

“నాయందు దయ వుంచి.. వాడికి మీకు తెలిసిన వేరే కాలేజీలో.. సంవత్సరం వృథా కాకుండా వేరే ఏ కాలేజీలోనైనా.. ఎక్కడైనా అవకాశం కల్పించండి సార్..” దీనంగా చెప్పాడు శేషారావు.

ప్రిన్స్‌పాల్ భాస్కరరావు కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచించాడు. తర్వాత..

“విజయవాడలో నా ఫ్రెండ్ ‘జాన్’ ఓ జూనియర్ కాలేజీని నడుపుతున్నాడు. అతనితో నేను మాట్లాడుతాను. అతను నా మాటను కాదనడు. ఆనంద్‌ను అక్కడ చేర్పించేటందుకు మీకు సమ్మతమా!..”

“సంతోషంగా చేర్పిస్తాను సార్!..” ఆనందంగా చెప్పాడు శేషారావు.

“అక్కడ హాస్టల్ వసతి కూడా వుంది. జాన్ పిల్లలను చాలా కట్టుదిట్టంగా పద్ధతిగా తయారు చేస్తాడు. మీకు ఆనంద్‌ను హాస్టల్లో చేర్పించేదానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా!..”

“లేదు సార్!.. మీరు ఎప్పుడు బయలుదేరమంటే.. అప్పుడు నేను వాడితో విజయవాడకు వెళ్ళి కాలేజీ.. హాస్టల్ ఫీజులు కట్టి వాడిని అక్కడ వదిలేసి వస్తాను.”

“కూర్చోండి.. ఐదు నిముషాల్లో వస్తాను..” భాస్కరరావు ఇంట్లోకి వెళ్ళి జాన్‌కు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. జాన్ మొదట సందేహించినా.. భాస్కరరావు మాటను కాదనలేక.. ఆనంద్‌ను చేర్చుకొంటానని చెప్పాడు.

తిరిగి వచ్చి భాస్కరరావు.. జాన్ సమ్మతిని శేషారావుకు తెలియజేశాడు. “మీరు ఎల్లుండి బయలుదేరండి. నేను కొంతవరకూ జాన్‌తో విషయాన్ని చెప్పాను. అతను మీ వాడిని తన కాలేజీలో చేర్చుకొంటాడు. కానీ.. మీరు మీవాడికి తత్వం మారేలా మంచి మాటలు, ఉపాధ్యాయులను గౌరవించే బుద్ధి.. శ్రద్ధగా చదువుకోవాలనే హెచ్చరిక.. చెప్పాలి.. సరేనా!..”

“అలాగే సార్!.. మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ఈ సమయంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పరిచినందుకు నన్ను క్షమించండి సార్…” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు శేషారావు.

శేషారావు.. రామకోటి వారికి మరోసారి సవినయంగా చేతులు జోడించి తమ ఇళ్ళ వైపుకు బయలుదేరారు.

“ఏం ఈ రోజు ఇంత పొద్దుపోయింది?..”

బులెట్ శబ్దాన్ని విని వరండాలోకి వచ్చిన శకుంతల శేషారావును చూచి అడిగింది.

“పని వుండింది శకుంతలా!.. ఆనంద్ ఇంటికి వచ్చాడా..” ఎంతో సౌమ్యంగా అడిగాడు శేషారావు.

భూతకాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. తన శ్రమ.. పట్టుదలతో నీతీ నిజాయితీని నమ్ముకొని అంచలంచెలుగా ఆ స్థితికి వచ్చినవాడు శేషారావు. ఎంతటి కష్టాన్నైనా తన ఎదలో దాచుకొని సహనంతో, చిరునవ్వుతో.. భార్యకు శాంతిని.. ఆనందాన్ని పంచి ఇవ్వడం అతనికి అలవాటు.

శకుంతలను.. శేషారావుతో పోల్చుకుంటే.. అతని కుటుంబం కన్నా శకుంతల కుటుంబం.. స్థితిగతుల్లో గొప్పదనే చెప్పాలి. అపాయస్థితిలో వున్న శకుంతల తండ్రిని.. తన ప్రాణాలకు తెగించి సాహసంతో కాపాడిన కారణంగా.. ఆ కుటుంబానికి శేషారావు చేరువ కావడం.. శకుంతల తండ్రి నారాయణకు.. తల్లి మాలతికి శేషారావు బాగా నచ్చిన కారణంగా.. తమకంటే పేదవాడైనా.. శకుంతలను వారు.. శేషారావుకు ఇచ్చి పెండ్లి చేశారు.

“ఆఁ.. అరగంట క్రిందట వచ్చాడు. తలనొప్పిగా వుందని ఏదో కొంచెం తిని పడుకున్నాడు.. అవును, మీరేంటి అదోలా వున్నారు. సెంటర్‍లో ఏమైనా సమస్యలా!..” శేషారావును పరిశీలనగా చూస్తూ అడిగింది శకుంతల.

“ఒళ్ళు కసకసలాడుతూ వుంది శకుంతలా!.. స్నానం చేసి వస్తాను..” నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు శేషారావు. బట్టలను విప్పి స్నానాల గదిలోనికి వెళ్ళాడు.

స్నానం చేస్తూ.. ‘ఆనంద్ యీమెకు విషయాన్ని చెప్పాడో లేదో!.. ఆమె మాటల ధోరణి చూస్తుంటే చెప్పినట్లుగానే వుంది. నేనే ఆమెకు చెప్పాలి. విషయాన్ని విని.. తాను ఏ రీతిగా మాట్లాడుతుందో!.. మనిషికి నోరు కొంచెం దురుసు. కొడుకు మీద వల్లమాలిన అభిమానం!.. ఏది ఏమైనా జరిగిన విషయాన్ని ఆమెకు చెప్పి.. నా నిర్ణయాన్ని కూడా తెలియజేయాలి. కొడుకును దూరంగా హాస్టల్లో వుంచి చదివించే దానికి అంగీకరిస్తుందో లేదో!.. తను అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. ఆనంద్‌ను విజయవాడ జాన్ సార్ కాలేజీలో చేర్చి హాస్టల్లో వుండేలా చేయవలసిందే!..’ అనుకుని ఆ నిర్ణయంతో బాత్‍రూమ్ నుండి బయటికి వచ్చాడు శేషారావు.

“భోజనం వడ్డించనా!..” తలుపు ముందే నిలబడి వున్న శకుంతల అతన్ని చూచి అడిగింది.

“ఆఁ.. పద వడ్డించు.. వస్తున్నా!..”

శకుంతల వంటగది వైపుకు వెళ్ళిపోయింది.

తల తుడుచుకొని చొక్కా, లుంగీతో శేషారావు డైనింగ్ టేబుల్‌ను సమీపించాడు.

శకుంతల వడ్డించింది.

“పెద్దగా ఆకలి లేదు శకుంతలా!.. చాలు..” అన్నాడు శేషారావు.

“బయట ఏమన్నా తిన్నారా!..”

మాట చెప్పకుండా అవునన్నట్లు తల ఆడించి తినడం ప్రారంభించాడు శేషారావు.

ఐదు నిముషాల్లో భోజనాన్ని ముగించి చేతిని కడుక్కొని తన గదికి వెళ్ళిపోయాడు శేషారావు.

శేషారావు మౌనం.. శకుంతలకు అనుమానాన్ని పెంచింది. పదార్థాలను ఫ్రిజ్ సర్ది.. ఓ గ్లాసు మజ్జిగ త్రాగి శకుంతల బెడ్రూంలో ప్రవేశించింది. శేషారావు మంచంపై పడుకొని పైన తిరిగే ఫ్యాన్‌ను తదేకంగా చూస్తున్నాడు.

కొన్ని క్షణాలు శేషారావు ముఖంలోకి పరీక్షగా చూచి.. నిట్టూర్చి

“ఏమిటండీ!.. వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను. చాలా ముభావంగా ముక్తసరిగా వున్నారు.. నాతో చెప్పకూడదా!.. మిమ్మల్ని అంతగా బాధపెట్టే విషయం ఏమిటది?” అడిగింది.

శ్రీ శేషారావు లేచి మంచంపై కూర్చున్నాడు.

“కూర్చో శకుంతలా!..” అన్నాడు.

శకుంతల మంచంపై కూర్చొని అతని ముఖంలోకి ఏమి చెబుతాడో అనే పరిశీలనగా చూడసాగింది.

శేషారావు.. ఆనంద్ చేసిన నిర్వాకాన్ని గురించి.. ప్రిన్స్‌పాల్ గారి నిర్ణయాన్ని గురించి.. తాను వారి ఇంటికి వెళ్ళి వారిని కోరిన విషయాన్ని గురించి.. ప్రిన్స్‌పాల్ గారు తనకు ఇచ్చిన సలహాను గురించి.. తన నిర్ణయాన్ని గురించి.. పదిహేను నిముషాల్లో ఓ కథలా చెప్పాడు.

“నా తండ్రి.. కొండలరావు ఐదవ తరగతి వరకూ చదివాడు. వారి తండ్రి మా తాతయ్య.. నాన్నగారి పన్నెండేళ్ళ ప్రాయంలో చనిపోయారు. తన తల్లిని.. చెల్లెలిని పోషించే దాని కోసం.. అంత చిన్న వయస్సులో మా నాన్న బాధ్యతను గుర్తించి.. చదువును మాని ఓ సారాయి అంగడిలో పనికి చేరాడు. వారి యజమాని పేరు జోగారావు. ఆయనకు ఒకే కూతురు శాంతి. వారి భార్య శ్యామల. శాంతి తర్వాత భార్య మగబిడ్డను కంటుందని వారు ఆశించారు. కానీ వారి ఆశ తీరలేదు. ఒకే కూతురైన శాంతిని వారు ఎంతో గారాబంగా పెంచారు. మా నాన్నకు ఆ శాంతికి వయస్సులో వ్యత్యాసం.. ఐదు సంవత్సరాలు. ఎంతో నిజాయితీపరుడైన మా నాన్న గారంటే జోగారావుకు ఎంతో ఇష్టం. శాంతి యుక్తవయస్సు వచ్చాక.. ఆమెను మా నాన్నగారికి యిచ్చి వారు వివాహం చేశారు. మా అమ్మ శాంతి ఐదుసార్లు గర్భవతి కావడం.. అది రెండు మూడు నెలల్లో విచ్ఛినం కావడం.. మా నాన్నగారికి ఎంతో ఆవేదనను కలిగించింది. ఫలితంగా వారు త్రాగుడు అలవాటు చేసుకొన్నారు. నేను నా తల్లి ఆరవ ప్రసవాన పుట్టాను. అమ్మా నాన్నా నా పుట్టుకతో ఎంతో సంతోషించారట. తర్వాత పదిహేను నెలలకే నాకు ఓ చెల్లెలు పుట్టింది. ఆమెకు భువన అని పేరు పెట్టారు. అప్పటికి నా వయస్సు పదకొండు. నా చెల్లెలి వయస్సు తొమ్మిది, రాత్రి పది గంటలకు త్రాగి సైకిల్‍పై వస్తున్న నాన్నను ఓ లారీ గుద్దింది. వారి కథ ముగిసిపోయింది. ఆరవ తరగతి చదువుతున్న నా చదువు ఆగిపోయింది.

తల్లిని.. చెల్లెలిని పోషించేటందుకు ఒక మెకానిక్ షాపులో చేరి.. వారు వారానికి ఇచ్చే డెభై రూపాయలను తెచ్చి నా తల్లి శాంతికి ఇచ్చేవాడిని.

మా పక్క ఇంట్లో రామకోటయ్య మాస్టారు వుండేవారు. వారు ఆ రోజుల్లో నన్ను చూచి.. “రేయ్ శేషూ!.. నీవు మీ ఇంటికి మగబిడ్డవురా!.. మా నాయన పైకి పోయె. నీ చెల్లిని అమ్మను నీవే చూచుకోవాలిరా!.. ఏ పని చేసినా కష్టపడి చేయాలి. ఆ పనిలోని మెలకువలను తెలుసుకోవాలి. తోటివారితో కలిసిపోవాలి. నీ కంటే పెద్దవారిని గౌరవించాలి. అప్పుడే వారు నీకు అన్ని విషయాలూ బాగా నేర్పగలరు. పని బాగా నేర్చుకుంటే ఒకనాడు ఎందరో.. నీ చుట్టూ తిరుగుతారు. మెకానిక్ పని తక్కువేం కాదు. అందరితో కలిసిపోయి పని బాగా నేర్చుకో. నీవు మంచివాడివి. తప్పకుండా పైకి వస్తావ్!..” అని చెప్పారు. నేను వారి మాటలను మననం చేసుకొంటూ జీవితాన్ని సాగించాను. దైవాన్ని నమ్ముకొన్నాను. శ్రమించాను. సంపాదించాను. నా చెల్లెలి పెండ్లి చేసాను. లారీ క్రింద పడబోయిన మీ నాన్నగారిని రక్షించాను. అది నా సంకల్పంతో జరగలేదు. దైవ నిర్ణయానుసారంగా జరిగింది. నేను నిమిత్తమాత్రుణ్ణి. మీ వారంతా నన్ను అభిమానించారు. గౌరవించారు. మన పెళ్ళి జరిపించారు. ఇంతవరకూ నేను చెప్పింది నా కుటుంబ కథ. నీకు తెలియనిది. మన వివాహానంతరం కథ నీకు తెలిసిందే!.. నా దృష్టిలో శకుంతలా!.. జీవితం ఓ దర్పణం.. దర్పణం అంటే అద్దం తెలుసుగా!.. నా భావనలో అద్దం అంటే మనస్సు.. మన మాట.. అలంకరణా.. హావభావాలు అద్దంలో ఎలా ప్రతిబింబిస్తాయో.. అలాగే మన సంకల్ప వికల్పాలు.. మన ఆశ నిరాశలు.. ఆనందం దుఃఖం.. మన మనోదర్పణం మీద నిలుస్తాయి. అలా నిలచిన వాటిలో.. మంచిని ఎన్నుకోవడం.. దానికి సంబంధించిన మార్గాన నడవడం.. నేను ఇంతవరకూ నా జీవిత గమనంలో అవలంబించిన మార్గం.. ఏనాడూ చేయకూడని సంకల్పమో కార్యాచరణో చేయలేదు. కొడుకు.. అంటే వంశానికి వారసుడు. తాత తండ్రుల పేరు నిలబెట్టే వాడు. చస్తే తల కొరివి పెట్టేవాడు. అదేదో నరకం అంటారే.. ఆఁ.. పున్నామ నరకం నుంచి కాపాడేవాడు..

నా తండ్రి సారాయి వ్యాపారి.. త్రాగేవాడు.. కానీ నీతిని తప్పి నాకు తెలిసి, వారు ఏనాడూ నడుచుకోలేదు. ఇక నాకు సంబంధించిన ఆ విషయం నీవు చెప్పాలి..

మన కొడుకు.. ఏ ధర్మాన్ని తెలుసుకోకుండా ఎదిగిపోయాడు. గురువునే కొట్టేటంతటి వాడైనాడు. వాడి జీవిత దర్పణం.. పగిలి పోయింది. పగిలిన ఆ అద్దాన్ని అతికించి చూచుకోగలిగిన దాన్నిగా చేయాలనేది నా ప్రయత్నం.. అందుకు నాకు నీ సహకారం కావాలి.. నీవు వాడిని నాతో విజయవాడకు పంపాలి. ఒక తండ్రిగా వాడి బాగును కోరడం నా ధర్మంగా నేను భావించాను. తల్లిగా నీవు ‘సరే’ అంటే గెలుపు నాది.. కాదంటే.. శకుంతలా!.. నా జీవిత దర్పణం కూడా పగిలినదే అవుతుంది. నేను చెప్పదలచుకొన్నది అంతా చెప్పేశాను. రేపటి మా ప్రయాణం.. నీ నిర్ణయం మీద ఆధారపడి వుంది. నిజంగా ఈ రోజు.. చాలా అలసిపోయాను. పడుకొంటాను శకుంతలా!..” చెప్పడం ఆపి శేషారావు మంచంపై వాలిపోయాడు.

కన్న తల్లిదండ్రులు.. ధర్మాన్ని తప్పి వర్తిస్తే.. సంతతికీ అదే అలవాటవుతుంది. శేషారావు ఎంతో మంచివాడు. కానీ పేరు.. సంపాదన ఆశక్తితో కాలాన్ని వాటికోసం వెచ్చించాడే కానీ.. కొడుకు గురించి పట్టించుకోలేదు. భార్య, చదువు కొన్నది మంచి వంశంలో పుట్టింది.. ఒకే కొడుకు సవ్యంగా పద్ధతిగా పెంచుతోందని అనుకొన్నాడు. పదవతరగతి ఫెయిల్ అయిననాడు గ్రహించాడు. తాను ఆనంద్ విషయంలో తప్పు చేసినట్లు. ఆనాటికి కొడుకు ఎదిగి తనంతటి శరీరాకృతిని పొందాడు. తల్లికి ముద్దు బిడ్డ. ఆనంద్ బాబు స్నేహితులు.. అతనికి తగినవారే. ఆ స్నేహం ద్వారా అతనికి మంచి చెడ్డలను గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. తన తల్లి మాటను తండ్రి కాదనలేడనే విషయం.. అతనికి ఏనాడో తెలిసిపోయింది.

శేషారావు మాటలకు.. చెప్పిన విషయాలకు.. శకుంతల చలించి పోయింది. తన గారాబం.. తాను చూపించే అభిమానం కారణంగా.. ఆనంద్ చెడిపోయాడనే విషయం ఆమెకు అర్థం అయింది. మనస్సులోని బాధ.. కళ్ళల్లో నుంచి కన్నీరుగా మారి బయటికి వెలువడింది.. భర్త నిర్ణయం.. సరైనదనే నిర్ణయానికి వచ్చింది.

“ఏమండీ!.. మీ నిర్ణయమే నా నిర్ణయం!..” అంది శకుంతల.

“అలాగా!..”

“అవును.. మన బిడ్డ బాగుపడి.. పది మంది చేత మంచివాడనిపించుకొని.. నాకు మీకు ఆనందాన్ని కలిగించాలండీ..” గద్గద స్వరంతో చెప్పింది శకుంతల.

“నీ నిర్ణయం.. నాకు చాలా సంతోషం శకుంతలా!.. పొద్దు పోయింది. పడుకో!..” అన్నాడు శేషారావు.

శకుంతల మంచంపై వాలిపోయింది కలవరమైన మనస్సుతో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here