ఫస్ట్ లవ్-5

0
4

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హసంతి డి.ఎల్.ఎఫ్. క్యాంపస్‌లో జెన్ ప్యాక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తూంటుంది. కొలీగ్ మాధురితో హసంతికి స్నేహం పెరుగుతుంది. ఒక రోజు మాధురితో కలిసి ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌కి టీ తాగడానికి వెళ్తుంది. వీళ్ళు వెళ్తుంటే ఓ యువకుడు మాధురికి డాష్ ఇస్తాడు. అతని చేతిలో ఉన్న కాఫీ మాధురి డ్రెస్ మీద, చేతి మీద పడుతుంది. అయినా అతను ఏమీ పట్టించుకుకోకుండా ఫోన్ చూసుకుంటూ వెళ్ళబోతుంటే – మరో యువకుడు వచ్చి వెనక నుంచి అతని షర్ట్ పట్టుకుని లాగి మాధురిని చూపిస్తూ, సారీ చెప్పమని అంటాడు. నేనేం చేశానని అడుగుతాడు మొదటి యువకుడు. మాధురి డ్రెస్ మీద, చేతి మీద పడ్డ కాఫీ మరకల్ని చూపిస్తాడు రెండో యువకుడు. మొదటి యువకుడు సారీ చెప్పకుండా తప్పంతా మాధురిదేనంటాడు. అతని ఫోన్ లాక్కుని నువ్వెళ్ళచ్చు అంటాడు రెండో యువకుడు. తన ఫోన్ తనకివ్వకపోతే కంప్లయింట్ చేస్తానంటాడతను. అయితే తాను మహిళా సంఘాలకీ, హ్యుమన్ రైట్స్ వాళ్ళకి కంప్లయింట్ చేస్తాను, అబ్యూజింగ్ కేసు కింద జైల్లో పెడతారని రెండో యువకుడు అంటాడు. ఇక గొడవ పెంచడం ఇష్టం లేని మొదటి యువకుడు మాధురికి సారీ చెప్పి, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. మాధురి అతనికి థాంక్స్ చెబుతుంది. హసంతికి అతనెంతగానే నచ్చేస్తాడు. కాలం గడుస్తుంది. దాదాపు ఒకటిన్నర ఏడాదిగా అతన్ని రోజూ చూస్తూ అభిమానిస్తూ ఉంటుంది. అతనేం చేసినా హసంతికి నచ్చేస్తాడు. అతని గురించి తన డైరీలో కవితలు రాసుకుంటుంది. ఓ రోజు ఆ కేఫ్‍లో తన సూపర్ సీనియర్ శ్రీరామ్ కనిపిస్తాడు. మాటల సందర్భంలో ఆ కేఫ్ అతనిదేనని తెలుస్తుంది హసంతికి. తానెక్కడ పని చేస్తోందో చెబుతుంది. ఆ యువకుడిని హసంతి ఇష్టపడుతుండడం తాను గమనించానని అంటాడు శ్రీరామ్. ఓ రోజు అతను తన మిత్రులతో మాట్లాడుతుంటే రహస్యంగా ఫోటో తీస్తుంది హసంతి. ఒకరోజు అక్కడ కాఫీ తాగుతున్న హసంతి పక్కన మాధురి వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఎందుకీ దాగుడుమూతలు, నీ ప్రేమ గురించి చెప్పేయ్ – అని అంటుంది. శ్రీరామ్ కూడా అదే మాట చెప్తాడు. మర్నాడు చక్కగా చీర కట్టుకుని చిన్న గిఫ్ట్ తీసుకుని వస్తుంది. కాసేపటికి ఆ యువకుడు మిత్రులతో వస్తాడు. వాళ్ళల్లో ఉన్న ఒక యువతి ఆ యువకుడి భుజాల మీద చెయ్యి వేసి సెల్ఫీ దిగుతుంది. హసంతి వేగంగా వెనక్కి వచ్చేస్తుంది. ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap]ఫీసులో తన క్యూబికల్‌లో కూర్చున్న హసంతికి మనసు మనసులో లేదు. మనసులో తడి కళ్ళలోకి చేరి కళ్ళెర్రబడ్డాయి.

“హలో!” ఎవరో పిలిచినట్టు అనిపించి తలెత్తి చూసింది. ఎవరూ కనిపించలేదు. టీం లీడర్ అటువైపు రావటం చూసి లాప్టాప్ స్క్రీన్ మీద తన రూపమే ప్రత్యక్షమై మాట్లాడుతుంది.

“ఏయ్! అతను ఏదో నీకు సొంతమైనట్టు, సొంత ఆస్తి కోల్పోయినట్టు ఫీలవుతున్నావేంటి? సంవత్సరంన్నర నుండి దూరపు చూపులే కానీ ఎప్పుడైనా అతని దగ్గరకెళ్ళి ఒక్క మాటైనా మాట్లాడటానికి ప్రయత్నించావా! సైట్ కొట్టడం, ప్రపోజ్ చేయటం అబ్బాయిల డ్యూటీ అన్నట్టు ముడుచుక్కూచున్నావు. నువ్వు తనని ఇష్టపడుతున్నప్పుడు నువ్వే ప్రపోజ్ చేయాలి కదా! అతను నీ వైపు చూసేలా ప్రయత్నించావా? 365 రోజులు వేస్ట్ చేసావే తప్ప మనసంతా నువ్వే ఉన్నావు అని ఎప్పుడైనా చెప్పావా? బ్యాడ్ లక్” అంటుంటే ఎవరైనా చూస్తున్నారేమోనని తలెత్తి చూసింది.

ఇప్పటివరకు ఒరు తలై రాగం అనబడే మూకీ ప్రేమ చదివారుగా!

ఇహ ఫ్లాష్ నుంచి బయటకు రండి! మన హీరోయిన్ హసంతి పెళ్లి చూపుల్లో ఏం చేస్తుందో చూద్దాం రండి! రారండోయ్ వేడుక చూద్దాం..

***

అతనికి కాఫీ ఇస్తూ అతని కళ్ళలోకి చూసింది హసంతి. అతనూ తలెత్తి చూసాడు. అందరికీ కాఫీ ఇచ్చి అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది. పెద్దవాళ్లు మాట్లాడుతున్నారు.

హసంతి మనసు ఆనంద భైరవి రాగం పాడుతోంది.

ఇతనికి నా గురించి ఎలా తెలిసింది? సడన్‌గా ఈ పెళ్లిచూపులు ఏంటి? మరి మొన్న రెస్టారెంట్లో మరో అమ్మాయితో కనిపించాడేంటి?! ఏదైతే ఏం నేను వలచినవాడు నన్ను వెతుక్కుంటూ నాకోసం పెళ్లిచూపుల వరకూ వచ్చాడంటే వీడికి ప్రేమ, దోమ ఎవరితోనూ ఉండి ఉండవు. వీడు నా వాడే అని మనసుతో మాట్లాడుకుంది హసంతి.

సడన్‌గా అతను లేచి “ఐ వాంట్ టు టాక్ విత్ హర్” పక్కనున్న రఘు మామయ్యతో అన్నాడు.

హసంతి ఆశ్చర్యంగా చూసిందతన్ని.

“దానికి ఏముంది బాబూ!” అని హసంతి వైపు తిరిగి, “ఇద్దరూ నీ గదికెళ్ళి మాట్లాడుకొండి” అన్నాడు.

“అలాగే” అని లేచి మేడ మీద గదికి మెట్లెక్కబోతూ అతని కోసం చూసింది. అతను ఆమె వెనకాలే వస్తున్నాడు. అతను తన వెనక ఇలా వస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆలోచిస్తూ ముందు మెట్టు మీద కాలేయ బోయి, కాలు జారి వెనక్కి పడిపోయింది. అంతే! హీరోలా అతను ఆమె పడకుండా రెండు చేతులతో వీపు వెనుక భాగాన్ని పట్టుకున్నాడు.

‘తేరే మేరె బీచ్ మే కైసా హై ఏ బంధన్’.. పాట వినిపిస్తోంది ఇద్దరికీ. అతని స్పర్శ హాయిగా, పాటంత మధురంగా ఉంది.

కింద నుండి వాళ్ళిద్దర్నీ చూసిన గీతిక వేగంగా మెట్లెక్కి వస్తుంటే చూసి దూరంగా జరగ్గానే,. దగ్గరైన ఇద్దరి చూపులూ దూరంగా జరిగాయి.

వెంటనే హసంతి మనసు ‘సుందరమో సుమ శరమో’.. పాట పాడుకుంది. అతనేం రియాక్షన్ లేకుండా కళ్ళు, భూజాలు ఎగరేశాడు.

ఈసారి మేడమెట్లు అతను ముందెక్కుతుంటే హసంతి అతనిని ఫాలో అయ్యింది. అంతలో గీతికను పైకి వెళ్ళనివ్వకుండా తల్లి పిలవడంతో వెనక్కి వెళ్ళిపోయింది.

హసంతి తన గదిలోకి వెళ్తూ “ప్లీజ్ కం” అని అతనిని పిలిచింది.

“మిమ్మల్ని రెస్టారెంట్లో ఒకటి రెండు సార్లు చూశాను. మన మధ్య పరిచయం లేదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు?” అన్నాడు.

అతని గొంతు వింటూ చెప్పటం మరిచిపోయింది.

“హలో!” అన్నాడు ఆమె వైపు చూసి.

“ఆఁ.. ఆఁ.. డి.ఎల్.ఎఫ్ కాంప్లెక్స్‌లో జెన్ ప్యాక్‌లో” అంది.

ఆమె మీరు.. అని అడిగే లోపే అతనే “నేను విప్రోలో” అన్నాడు.

“అక్కడి నుంచి ఇక్కడికి రోజూ వస్తారా!?” అంది.

“మా ఫ్రెండ్స్ ఇక్కడ పెగా పిక్సల్స్‌లో పనిచేస్తున్నారు. వాళ్లకోసం వస్తాను.”

అతను గదిలోకి వచ్చి చుట్టూ చూస్తుంటే చైర్ చూపించి “కూర్చోండి” అంది.

అక్కడున్న వమొలిన్ చూసి “మీరు వయోలిన్ ప్లే చేస్తారా?” అని అడిగాడు.

“కొద్దిగా” అంది అతనికి ఎదురుగా ఉన్న మంచం అంచున కూర్చుని.

“వాట్ ఎల్స్” అన్నాడు.

“ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా?” అంది.

“ఊఁ.. నో అంటే ఓకేనా? ఎస్ అంటే ఓకేనా?”

“ఏదైనా పర్లేదు”

“పర్లేదు కాదు పర్ఫెక్ట్‌గా చెప్పండి. మీకు ఎవరో నా గురించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఉంటారు. లేదా నన్ను ఎవరితోనైనా మీరు చూసి ఉంటారు. యామ్ ఐ రైట్!” అన్నాడు.

“లాస్ట్ వీక్ జూన్ 5న గ్రే కలర్ ప్యాంటు, వైట్ షర్టు వేసుకున్న రోజు,. మరో అమ్మాయితో కలిసి టీ తాగుతూ భుజం మీద చేతులు వేసి క్లోజ్‌గా.. సెల్ఫీ..” అంది హసంతి.

ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి భుజాలెగరేసి “యాఁ.. యాఁ.. యు ఆర్ రైట్. నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు” అన్నాడు.

హసంతి లేచి పుస్తకాల మధ్యలో ఉన్న డైరీ తీసి అతనికి ఇచ్చింది.

“ఎందుకు ఇది?”.

“పర్లేదు చూడండి”

క్యూరియస్‌గా ఓపెన్ చేయబోయి ఆగాడు. దానిని మూసి పక్కన పెట్టాడు.

“చూడోచ్చు. సీక్రెట్స్ లేవు”

“ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి డైరీ రాసే వాళ్ళు ఉన్నారా?”

“ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. నాకు నచ్చిన పని ఖచ్చితంగా చేస్తాను” అంది

“ఓ.. గ్రేట్!” అని తెరవకుండానే ఆమెకి ఇచ్చాడు.

“మీరు వయోలిన్ ప్లే చేస్తారు కదా! అభ్యంతరం లేకపోతే..”

“అయ్యో! నాకు అంత బాగా రాదు, జస్ట్ నేర్చుకుంటున్నాను”

“కెన్.. ఐ”

“విత్ ప్లెజర్” అని లేచి వయోలిన్, బౌ తీసిచ్చింది.

ట్యూన్ సరిచేసుకుని ‘చూపే సింగారమాయెనే శ్రీవల్లీ..’ సాంగ్ ప్లే చేస్తుంటే ఆశ్చర్యంగా చూసింది హసంతి.

అంతలోనే ‘అలై పొంగెరాకన్నా’ క్లాసికల్ సాంగ్..

దాని తర్వాత రీసెంట్ గా హిట్టయిన జస్టిన్ బీబర్ ‘స్టే’ సాంగ్ ప్లే చేస్తుంటే క్లాప్స్ కొట్టింది హసంతి.

వయోలిన్ టేబుల్ మీద పెట్టి “ఏదో కొద్దిగా తెలిసింది ప్లే చేశాను. మీ అంత బాగా రాదు” అన్నాడు.

హసంతి అతని ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

“ఇంత బాగా ప్లే చేయటానికి ఎన్నేళ్లు నేర్చుకున్నారు?”

“బేసిక్స్ తెలుసుకున్నాక టైం దొరికినప్పుడల్లా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటా!”

“డైరీ తీసి చూడండి. పర్వాలేదు”

“వద్దండి”

“అందులో నేను రాసిన కవితలే ఉంటాయి”

“మీరే చదివి వినిపిస్తే వింటాను. ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా”

హసంతి నవ్వింది.

“ఓ.కే. నాకు పెళ్లంటే కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయి” అన్నాడు.

“?” అన్నట్టు చూసింది.

“నేను చేసుకోబోయే అమ్మాయి అందంగా ఉండాలి”

‘నేను లేనా!?’ అన్నట్టు అతని వైపు చూసింది.

అతను అదేమీ పట్టించుకోకుండా.. “ఆహ్లాదంగా మాట్లాడాలి. మూడోది ఏమిటంటే నాకు తెలియకుండా నన్ను ప్రేమించాలి. ఎట్లీస్ట్ ఒక సంవత్సరమైనా.. ఆ ఊహల్లోనే జీవించాలి. నువ్వు నాకు గుర్తొస్తే నాకు ఎవరు గుర్తు ఉండరు నీ జ్ఞాపకం తప్ప.. అన్నట్టు ఉండాలి” అన్నాడు ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు.

అతని మాటలు వింటూనే తన మనసులో అతని కోసం రాసుకున్న మెరిట్స్, డి మెరిట్స్ లిస్టులో అతను కోరుకునే క్వాలిటీస్ తనకు ఉన్నట్టు మెరిట్స్ పై టిక్ వేసుకుంది.

‘అన్ని నీవనుచు అంతరంగమున’ త్యాగరాజ కృతి ఆలపిస్తున్న అనుభూతికి లోనైంది హసంతి.

“మీ గురించి చెప్పండి” అన్నాడు.

“ఐ యాం హసంతి” అంది.

“ఐ యాం కార్తీక్” అన్నాడు చెయ్యి అందించి.

“మనల్ని మనం చూసుకోవాలంటే అద్దం చూసుకోవాలి. వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి. లవ్ ఈజ్ ఎక్స్‌ప్రెస్సివ్” తనలో తాను అనుకున్నానుకుంది. కానీ పైకే అనేసింది హసంతి.

“ఏంటో అంటున్నారు.”

“నథింగ్”అంది నవ్వుతూ..

***

హలో! ఇది నిజం అనుకుంటున్నారు కదా!

కాదు హసంతి కల. స్వీట్ డ్రీమ్. ఒక్కసారి వెనక్కి వెళ్దాం రండి!

***

“అక్కా, ఇంకా రెడీ అవ్వలేదా!” అంటూ హసంతి గదిలోకి వచ్చింది కదా గీతిక!

అక్కణ్ణుంచి ఇద్దరూ కిందికి దిగుతూ.. మెట్ల మీద నుంచి కిందికి చూసిన హసంతిని పెళ్లిచూపులు చూడటానికి వచ్చింది కార్తీక్ కాదు.

“అమ్మా! హసంతీ! వచ్చి కూచో” అన్నాడు రఘురాం.

మౌనంగా వచ్చి కూర్చుంది.

తన కలల రాకుమారుడు కార్తీక్ స్థానంలో.. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మేనత్త కొడుకు గౌతమ్ కూర్చున్నాడు.

చామన చాయ, పెద్ద ఎత్తు కాదు, మరీ పొట్టీ కాదు, అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కానీ కార్తీక్‌లో కనిపించే మేల్‌నెస్, స్మార్ట్‌నెస్ గౌతంలో కనిపించడం లేదనుకుంది. రాముడు మంచి బాలుడిలా అతి వినయంగా.. ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే, నోటి ముత్యాలు రాలిపోతాయేమో! అన్నట్టు ఆచి తూచి మాట్లాడుతున్నాడు గౌతం. అసలు హసంతి అతనిని చూసి కూడా పదేళ్లు దాటుతోంది.

గీతిక కాఫీ ట్రే తెచ్చి హసంతికి ఇచ్చింది.

అందరికీ కాఫీ ఇచ్చి, గౌతమ్ దగ్గరకొచ్చి కాఫీ ఇచ్చింది.

“థాంక్యూ హసంతీ!” అని తలెత్తి పైకి చూశాడు. అతనితో ఐ కాంటాక్ట్ కూడా హసంతి మనసంగీకరించడం లేదు.

కూర్చోబోతుంటే..

“హసంతీ! నువ్వూ, గౌతమ్ మేడ మీద గదికి వెళ్లి మాట్లాడుకోండి. ఇద్దరూ చిన్నప్పుడు ఎప్పుడో చూసుకున్నారు” అంది తల్లి కవిత.

హసంతి లేచి నడుస్తుంటే ఆమెను అనుసరించాడు గౌతం. గది తెలుపులు తీసి ఫ్యాన్ వేసింది.

గోడ మీదున్న చిన్నప్పటి ఫోటోలను చూస్తూ.. కుర్చీలో కూర్చున్నాడు గౌతం. అతనికి ఎదురుగా నిలబడ్డ హసంతితో “నువ్వూ కూర్చో!” అన్నాడు.

“పర్వాలేదండి”

‘బావా! అనకుండా అండీ అంటుంది ఏమిటి?’ అని మనసులో అనుకున్నాడు.

ఇద్దరి మధ్య గ్యాప్ తర్వాత “డెల్లాయిట్ కదా!” అన్నాడు.

“కాదు జెన్ ప్యాక్”

ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం.

హసంతితో బాల్యపు కబుర్లు చెప్పొచ్చని ఆశగా వచ్చిన గౌతమ్‌కి అసలామే ఆ అవకాశమే ఇవ్వటం లేదు.

“నిన్ను చూసి దాదాపు పదేళ్ళవుతోంది” అన్నాడు.

“అవును, మీరు యూ.ఎస్.లో ఉన్నారు కదా!”

“అవును. నేను యూ.ఎస్. వెళ్లకముందు వచ్చాను. అప్పుడు నువ్వు ఇండస్ట్రియల్ టూర్‌కి వెళ్లావు. నిన్ను మిస్ అయ్యాను.”

నవ్వి ఊరుకుంది హసంతి.

“నీకు కుకింగ్ వచ్చా?” అన్నాడు.

ఏంటి!? మరీ ఇంత పాత చింతకాయ పచ్చడి ప్రశ్న అడిగాడు.. అనుకుంది.

“మీరు ఏది తింటారో చెప్తే మీది మీకు, నాది నాకు చెయ్యగలను”

“అంటే!?” అన్నాడు అర్థం కానట్టు.

“అంటే ఈరోజు మీకు బిర్యాని తినటం ఇష్టమైతే మీకు వండి పెడతాను. నాకు అన్నం, పప్పుచారు తినాలనిపిస్తే నాకోసం సపరేట్‌గా చేసుకొని తింటాను” అంది.

మొదట గౌతమ్‌కి అర్థం కాలేదు.

“యు మీన్ ఆఫ్టర్ మ్యారేజ్!?!”

“అవును” అంది.

“ఆసం..” అని గౌతమ్ పెద్దగా నవ్వేసరికి చూపు తిప్పుకుంది హసంతి.

“హాబీలు ఏమిటి?” లాంటి రొటీన్ క్వశ్చన్‌లు అడిగితే ఆమె నుండి ఏం జవాబు వినాల్సి వస్తుందోనని సైలెంట్ అయిపోయాడు గౌతం.

ఆ ప్రశ్న ఆమే అడిగేసరికి విప్పారిన మొహంతో ఆమె వైపు చూశాడు.

“నాకు భక్తి ఎక్కువ. అన్ని రకాల వంటలు చేయడం వచ్చు. ఒకప్పుడు క్రికెట్ అంటే పిచ్చి” అన్నాడు.

“బ్యాటింగా? బౌలింగా?” అంది హసంతి.

“నో.. నో.. టీ.వీ.లో చూడటం వరకే” అన్నాడు.

‘అవునా!?!’ అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.

“చిన్నప్పటి నుంచి బాగా చదవాలనే కసితో చదివి ర్యాంకర్ అయ్యాను. ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడల్. అమెరికాలో ఎమ్మెస్ చేశాను. ప్రస్తుతం అక్కడే మంచి జాబ్‌లో ఉన్నాను”

“నాకు ఇండియాలోనే ఉండాలని ఉంది”

“మరి పెళ్లయ్యాక!?”

“అది మీ ఇష్టం. చెప్పానుగా! నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయటం నాకు ఇష్టం ఉండదని”

“ఇండియాలో లేనిది, విదేశాల్లో ఏముంటుంది? మన దేశం, మన కల్చర్.. నాకూ ఎంతో ఇష్టం. నీకు ఇక్కడే ఉండాలనిపిస్తే ఇక్కడే సెటిల్ అవుదాం” అన్నాడు సొంత అభిప్రాయం లేనట్టు.

అంతలో గీతిక కాఫీ తీసుకొని గదిలోకి వచ్చింది.

“గీతికా! నువ్వేం చదువుతున్నావు” అని అడిగాడు.

“బీ.టెక్. బావా! థర్డ్ ఇయర్ బి.వి.ఆర్.ఐ.టి ఉమెన్స్ కాలేజ్, బాచుపల్లిలో ఉంది. ఒక్క సంవత్సరమే కాలేజీకి వెళ్ళాను. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్లతో ఇప్పటివరకు ఇంట్లోనే ఉన్నాను. ఆన్లైన్ క్లాసులు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మధ్యమధ్యలో ఓ.టీ.టీ.లో మూవీస్ చూస్తుంటాను..” అంటూ నాన్‌స్టాప్‌గా తన గురించి చెప్తుంటే..

“ఓకే.. ఓకే..” అన్నాడు గౌతమ్ ఆపమన్నట్టు.

“అప్పుడే అయిపోలేదు బావా! ఇంకా ఉంది..” అని మళ్ళీ మొదలుపెట్టబోతుంటే..

“గీతూ! అమ్మ పిలుస్తోంది. వెళ్ళు” అంది హసంతి.

గీతిక తప్పదా! అన్నట్టు వెళ్ళింది.

“ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పట్నుంచి నీ రూపం నాతో పాటు పెరుగుతూ వచ్చింది. నేను ఊహించుకున్న దాని కంటే ఎన్నో రెట్లు ఎత్తులో ఉన్నావు హసంతీ! రియల్లీ ఐ యాం వెరీ లక్కీ” అని తనకు తనే చెప్పుకున్నాడు గౌతం.

మౌనంగా విని ఊరుకున్న హసంతితో “నీ అభిప్రాయం కూడా చెబితే వినాలనుంది” అన్నాడు.

“నీ మీద నాకు ఇంతవరకూ ఎలాంటి అభిప్రాయమూ లేదు గౌతం. నేనలా ఎప్పుడూ నిన్ను ఊహించుకోలేదు. సంగీత అత్తయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడని అమ్మ చెబుతుంటుంది. కానీ మనం ఎప్పుడూ కలుసుకున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. నా అభిప్రాయం ఇంత త్వరగా అడిగితే ఏం చెప్పను? సో.. ఐ నీడ్ సం టైం” అంది.

“నో.. ప్రాబ్లం. టేక్ యువర్ ఓన్ టైం. కానీ నేనిక్కడ ఒక్క నెల ఉంటాను. యాక్చువల్లీ మ్యారేజ్ అయితే ఇద్దరం కలిసి యు.ఎస్ వెళ్దామనుకున్నాను.” అంటుంటే హసంతి ఫోన్ రింగ్ అయింది.

“ఒన్ మినిట్” అని ఫోన్ తీసుకుని గది బయటకు వెళ్ళింది.

ఐదు నిమిషాల తర్వాత లోపలికి వచ్చి

“ఆఫీస్ కొలీగ్ ఫోన్. ఇంకా ఏమైనా మాట్లాడాలా? కిందికి వెళ్దామా?” అంది.

“ఓ.కే” అని గౌతమ్ లేచాడు. ఇద్దరూ కిందికి వచ్చి కూర్చున్నారు.

***

ఇదండీ! ఈ కథలో రెండో కృష్ణుడు గౌతం పాత్ర. కూర సువాసనకి వాడే కరివేపాకు ఎవరో; కూర మొత్తానికే రుచి తెచ్చే ఉప్పు ఎవరో.. కార్తీకా? గౌతమా?.. వీళ్ళిద్దరిలో హసంతి తొలిప్రేమను దక్కించుకున్న హీరో ఎవరో!?

రండి చదువుదాం!..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here