గీతాంజలి గారి ‘గుల్జార్ షాయరీ’ల అనుసృజనపై విశ్లేషణ

1
3

[ప్రముఖ కవి గుల్జార్ గారి షాయరీలకు గీతాంజలి గారి తెలుగు అనుసృజనను విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర. గుల్జార్ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించిన సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నాము.]

[dropcap]గు[/dropcap]ల్జార్ గొప్ప కవి, హిందీలో షాయరీలు రాశారు. గుల్జార్ రాసిన షాయరీలను తెలుగులో గీతాంజలి (డాక్టర్ భారతి) గారి అనువాదంలో చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం ఈ వ్యాసం.

షాయరీ-1:

గుల్జార్ రాసిన షాయరీలలో గొప్ప భావం అంతర్లీనంగా దాగి ఉంటుంది. చిన్న చిన్న కవితల్లో గొప్ప భావం, తాత్వికత, వేదన, దుఃఖం, సాటి మనిషి పట్ల ఆవేదన ఉంది. గుల్జార్ రాసిన షాయరీ చరణాల్లోకి దృష్టిని సారిద్దాం.

‘అనంతమైన దుఃఖపు సంపద కూడగట్టుకొని..
ఒక్క నేనే మహా ఐశ్వర్యవంతుణ్ణి అనుకున్నాను.
కానీ.. నా చుట్టూ ఉన్న ఒక్కో మనిషిని
దగ్గర నుంచి చూశాక..
ఆ ఒక్కొక్కడు నాకంటే
గొప్ప ధనవంతుడుగా
బయట పడ్డాడు కదా!’

అంతం లేనిది విశాలమైనది అనంతం అని చెప్పవచ్చు. సంపద అనేది వ్యక్తి కలిగి ఉన్న విలువైన ఆస్తుల సమృద్ధిని సూచిస్తుంది. బాధతో విలవిలలాడేటటు వంటి స్థితిలో మనిషికి దుఃఖం కలుగుతుంది. బాధ కలిగినప్పుడు మనిషికి తన్నుకు వచ్చేది దుఃఖం. మనస్సు కలత చెందడం వలన మనిషికి దుఃఖం కలుగుతుంది. అనుకున్నది జరగనప్పుడు మనిషికి కలిగేది దుఃఖం. ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోతూ మనిషి పడే ఆవేదన దుఃఖం. మనిషి ఎదలో బాధతో కూడినటు వంటి భావన దుఃఖం. మనిషి దుఃఖంతో జీవితాన్ని గడపటం కష్టం. అధిక ధనం ఉండే మనిషి ధనవంతుడు. అంతులేని బాధ కలిగినప్పుడు వచ్చేది దుఃఖం. సామాన్యుడు అంతు లేని బాధ కలిగినప్పుడు కలిగే దుఃఖమును కూడా దిగమింగుకుంటాడు. అంతులేని బాధ కలిగినప్పుడు వచ్చే దుఃఖమును కూడా విలువైన దుఃఖపు సంపదగా భావించాడు. లోకంలో ఒక్క నేనే బాగా దుఃఖపు సంపదగా కలవాన్ని అనుకున్నాడు. కాని, తన చుట్టూ నివసిస్తున్న ప్రతి మనిషి గడుపుతున్న జీవితాన్ని పరిశీలనగా చూసిన తరువాత ప్రతి మనిషి ఎంతో బాధ, దుఃఖం, వేదనను అనుభవిస్తున్నాడని భావించాడు. దుఃఖముతో గడుపుతున్న ప్రతి మనిషి జీవితంలో తన కంటే ఎక్కువ బాధ, దుఃఖమును అనుభవిస్తూ దుఃఖపు సంపదను కలిగి ఉన్నాడు. తన కంటే ప్రతి మనిషి గొప్ప అధిక దుఃఖపు సంపద కలిగిన ధనవంతుడిగా బతుకు గడుపుతున్నాడు అని తెలియజేయడానికి ఎంతో ధైర్యం కావాలి. మనిషి తన జీవితాన్ని దుఃఖంతో ఎలా గడుపుతున్నాడు? ఎవరికి వారు కష్టాల సుడిగుండంలో పడి కొట్టుకుపోతూ దుఃఖం యొక్క బాధను తట్టుకోలేక తాను అధికంగా దుఃఖపు సంపద కలిగి ఉన్నాను అని అనుకుంటాడు. మనిషి దుఃఖం నుండి ఓదార్పును పొంది సమాజంలో జీవిస్తున్న తన తోటి వ్యక్తుల జీవితాలను పరీక్షించి చూసినాక అతనికి ఈ లోకంలో తన కంటే ఇతరులు ఎక్కువ బాధలను అనుభవిస్తున్నట్లు, అధిక దుఃఖపు సంపదను కలిగి ఉన్నట్లుగా తెలిసింది. జీవితంలో ప్రతి మనిషి కష్టాలు, వేదనలను అనుభవిస్తుంటాడు. ఎవరికి వారు తానే తన జీవితంలో ఎక్కువ దుఃఖంతో బాధను అనుభవిస్తున్నట్టు కుమిలిపోతూ రుగ్మతలకు గురి అవుతూ ఉండడం మనం ఎరిగినదే. అతడు తను అనుభవిస్తున్న దుఃఖం నుండి బయటపడి తన తోటి మనుషుల జీవితాలలో రగులుతున్న వేదనను చూసిన తర్వాత అతనికి తన జీవితంలో కంటే గొప్ప దుఃఖపు సంపద కలిగిన ధనవంతులు సమాజంలో ఉన్నారు అని గుర్తించడం, కవి గుల్జార్ యొక్క అసమాన ప్రతిభకు నిదర్శంగా చెప్పవచ్చు. గుల్జార్ గొప్ప భావుకుడు. అతను రచించిన కవితలో ఎంతో లోతైన భావం దాగి ఉంది. దుఃఖం యొక్క లోతైన భావాన్ని గుల్జార్ తన షాయరీలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

షాయరీ-2:

గుల్జార్ రాసిన షాయరీలో విలక్షణమైన భావంతో కూడుకున్న అపురూపమైన శైలి ఉంది. షాయరీ చరణాల్లోకి దృష్టి సారించండి. గుల్జార్ కవితలోని భావాలు పాఠకుల హృదయాల్లో ప్రగాఢమైన ముద్రను వేస్తాయి. గుల్జార్ షాయరీను చదవడం ద్వారా పాఠకులకు కొత్త కొత్త విషయాలు అవగాహనలోకి వస్తాయి.

‘అందరినీ నా వాళ్లను చేసుకునే మైకమేదో
కమ్ముతూ ఉంటుంది నాకు
అందుకే ప్రతీసారీ.. నా శరీరం మీదో కొత్త
గాయం ప్రత్యక్షమవుతూ ఉంటుంది.’

లోకంలో భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనకు అగుపిస్తారు. ఒకడు తెల్లగా సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉంటాడు. ఒకడు నల్లగా వికారంగా ఉంటాడు. అతను నల్లగా ఉన్నప్పటికీ చామన చాయతో అందంగా అగుపిస్తాడు. అంధునిగా భావించబడే ఒకరికి పుట్టుకతో చూపు ఉండదు. చెవిటివాడుగా భావించబడే ఒకనికి చెవులు వినపడవు. మూగవానిగా భావించబడే ఒకనికి మాటలు రావు. ఒకడు పొడవుగా ఉంటాడు. ఒకడు పొట్టిగా ఉంటాడు. ఒకడు లావుగా ఉంటాడు. ఒకడు సన్నగా ఉంటాడు. ఒక మనిషి తన పని తాను చేసుకుంటూ ముభావంగా ఉంటాడు. ఒకడు తన పని తాను చేసుకుంటూ సంతోషంగా తోటి వారికి పనుల్లో సాయం చేస్తూ ఉంటాడు. ఒకడు ఇతరులకు సహాయం చేస్తూ ఆనందం పొందుతూ ఉంటాడు. అందరు నా వాళ్ళు అనే భావన ఎంతో విశాలమైనది. అందరు నా వాళ్ళు అనుకుని, అందరితో కలిసిమెలిసి ఉండడం సాధ్యమయ్యే పనేనా? అని సందేహం కలుగవచ్చు. మహాత్ములైన వ్యక్తులు పేదా, గొప్ప తేడా లేకుండా అందరిని సాటి మనుషులుగా చూస్తూ సౌహార్ధంతో జీవిస్తారు. అందరిని తన వాళ్లను చేసుకుని, బుద్ధి వికసించి అందరి పట్ల ప్రేమ భావనతో తేలిపోతుంటారు. అందుకే అలా భావించిన ప్రతి క్షణం అందరు తన వాళ్లని అనుకున్న వాళ్ళే అతని శరీరం మీద దాడి చేయడంతో గాయం ఏర్పడి నొప్పి కలుగుతుంది. ఇవ్వాళ మనం నివసిస్తున్న సమాజంలో మంచితనం అనేది కరువైపోయింది. మంచితనానికి ఏ మాత్రం చోటు లేదు. ఈనాటి సమాజంలో విచ్చలవిడితనం, దుర్మార్గం పేరుకుపోయాయి. ఎక్కడ చూసినా దుర్మార్గుల వికృత చేష్టలకు సామాన్యులు బలి అవుతున్నారు. దుర్మార్గం పెరిగిపోయి సమాజం కలుషితమైంది. మంచితనం కోసం పాటుపడే వాళ్లను హతమారుస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. అందరిని నా వాళ్ళుగా భావించే మైకం కొందరు మహాత్ములను కమ్ముకొని ఉంటుంది. అందుకే ప్రతిసారి అమానుషంగా దుర్మార్గుల దాడి జరిగి మహాత్ముల శరీరం మీద గాయాలు ఏర్పడుతున్నాయి. కవి గుల్జార్ సమాజంలో జరుగుతున్న వాస్తవ స్థితిని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

షాయరీ-3:

గుల్జార్ రాసిన షాయరీలోని అద్భుతమైన భావాలు మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. గుల్జార్ షాయరీ లోని పొంగి పొరలే భావాలు పాఠకుల హృదయాలను తట్టి లేపుతాయి.

‘బాల్యంలో నేను వాడుకున్న బొమ్మలన్నీ
నన్ను నిలదీసి మరీ అడుగుతున్నాయి..
చిన్నప్పుడు నువ్వు మాతో
ఆడుకున్నట్లే.. ఈ మనుషులు కూడా నీతో
ఎడాపెడా ఆడుకుంటూ ఉంటే నీకెట్లా
అనిపిస్తోంది అని.. ఏం చెప్పను?’

బాల్యం పసితనం నుండి ప్రారంభమవుతుంది. బాల్యం దాదాపు 12 -13 సంవత్సరాల వయస్సులో ముగుస్తుంది. మానవుని ఎదుగుదలకు మరియు మేధస్సుకు బాల్యం అత్యంత సున్నితమైన కాలం అని సైన్స్ చెబుతుంది. పిల్లలు ఎదుగుతున్నప్పుడు మరియు పరిపక్వం చెందుతున్నప్పుడు అనేక విభిన్న లక్షణాలు మరియు అభివృద్ధి స్థాయిలను గమనించవచ్చు. పిల్లల శరీర పరిమాణం, ఆకృతి మరియు నడక చక్కటి నైపుణ్యాలను ఉపయోగించడం, శారీరక సామర్థ్యంలో మార్పులు కనిపిస్తాయి. పిల్లల ఆలోచన, జ్ఞాపకశక్తి, అభివృద్ధి, శ్రద్ధ, సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటుంది. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. బొమ్మలతో బొమ్మరిల్లు కట్టుకుంటారు. పిల్లలు స్నేహితులతో కలిసి బొమ్మలతో ఆడుకుంటారు. ఇప్పుడు నేను పెద్దవాన్ని బాల్యం దశ నుండి దాటిపోయాను. అయినప్పటికీ నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు అన్ని ఇంట్లో మా అమ్మ భద్రంగా సందుగలో దాచి పెట్టింది. నేను ఆడుకున్న బాల్యంలోని బొమ్మలను చూసి మా అమ్మ ఆనందంతో మురిసిపోతుంది. నేను ఆడుకొన్న బొమ్మలను అమ్మ ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంటుంది. మా అమ్మకు నేనంటే ప్రాణం. నేను వెళ్లి అమ్మ కాళ్ళ ముందు కూర్చుంటాను. అమ్మ పాదాలకు మొక్కుతాను. అమ్మ ఎందుకు బాబు అలా నా కాళ్లు మొక్కావు అని అడుగుతుంది. అమ్మ కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా రాలుతాయి. అమ్మ నాకు కనిపించే దేవత. అమ్మ నా ఉన్నతికి పాటుపడింది. అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. పొద్దున్నే లేవగానే అమ్మ ముఖం చూస్తాను. ఆ రోజంతా నాకు హాయిగా ఉంటుంది. బాల్యంలో నేను ఆడుకున్న బొమ్మలన్నీ మనుషుల వలె నాతో మనసు విప్పి ఆప్యాయంగా మాట్లాడుతున్నాయి. బొమ్మలు నాతో మాట్లాడడమే కాదు. నన్ను బొమ్మలు ప్రేమతో నిలదీసి మరీ అడుగుతున్నాయి. చిన్నప్పుడు నాతో ఆనందంగా ఆడుకున్న బొమ్మలు నాతో మాట్లాడుతూ నువ్వు ఎంతో ఇష్టంగా మాతో ఆడుకున్నావు. చిన్నప్పటి ఆ రోజులలో నీవు ఆనందంతో బొమ్మలైన మాతో ఆడుకున్నట్లే, ఈ విపరీత బుద్ధిగల వింత మనుషులు కూడా నీతో ఆడుకుంటున్నారు. అలా బొమ్మలైన మాతో ఆడుకున్నట్లే వింత ప్రవర్తనతో మనుషులు నీతో ఆడుకుంటే నీకు ఆ మనుషుల ప్రవర్తన గురించి ఎట్లా అనిపిస్తుంది? అని బొమ్మలు నన్ను ప్రశ్నిస్తున్నాయి. ప్రాణం లేని బొమ్మలు కూడా మాటలు నేర్చుకుని చిన్నప్పుడు వాటితో ఆడుకున్నది గుర్తుపెట్టుకుని నా గురించి మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాయి. మనుషులు సాటి మనిషికి చేస్తున్న ద్రోహం గురించి బొమ్మలకు ఏమని సమాధానం చెప్పను అని తనలో తాను మథనపడుతున్నాడు. ఈనాటి స్వార్థం పెరిగిన మానవుల మనస్తత్వం తలచుకుంటే ఒక రకమైన బాధ, దిగులు కలుగుతుంది. నోరులేని బొమ్మలు కూడా మాటలు నేర్చుకుని ఈనాటి నయవంచకులైన మనుషుల గురించి వారి చేష్టల గురించి నన్ను ప్రశ్నిస్తున్నాయి! చిన్నప్పుడు నాతో ఎంతో ఇష్టంగా ఆడుకున్న బొమ్మలకు నాపై వాటికి ప్రేమ తగ్గలేదు. ఆ బొమ్మలు నా పట్ల దృష్టి పెట్టి మనుషులు చేస్తున్న ద్రోహం గురించి అడిగితే ఏం చెప్పను? అని ఈ షాయరీలో గుల్జార్ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

షాయరీ-4:

ఈ షాయరీ లోని విషయాలు పాఠకులను భావనా లోకంలోకి తీసుకువెళ్లి ఆలోచింపజేస్తాయి.

‘విషపు సీసాలో మందు
వెతుకుతున్నట్లు.. ఈ మనుషుల్లో
నిజాయితీ వెతుకుతున్నావు..
ఎంత వెర్రితనం నీది?’

విషం శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు విషం ప్రభావం వలన దేహమంతా నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. విషం తీవ్రత ఎక్కువగా ఉంటే మరణం సంభవిస్తుంది. పాముకు కోరల్లో విషం ఉంటుంది. తేలుకు తోకలో విషం ఉంటుంది. దుర్మార్గులకు నిలువెల్లా విషం ఉంటుంది అంటారు. మందుల తయారీలో విషం వాడుతారు. మనుషుల రోగం నయం చేయడానికి ఇవ్వబడే పదార్థం మందు. వ్యాధి నివారణకు మందులు అనేకం ఉన్నాయి. ఆయుర్వేదం మందులు, మూలికల మందులు, ఆల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునాని మందులు, సిద్ధమందులు మరియు అనేక రకాల మందులు వ్యాప్తిలో ఉన్నాయి. నేటి సమాజంలో అత్యవసర పరిస్థితులలో ఆల్లోపతి విధానంలోని మందులు ఎక్కువగా వాడుతున్నారు. వ్యాధి, గాయానికి ఉపశమనం, చికిత్స నివారణ, లక్షణ నిరూపణ, రోగ నిర్ధారణ నిర్వహించడం, రోగి యెడల శ్రద్ధ వహించడం, చికిత్స చేయడం, ఒక శాస్త్రంగా వైద్యం అందుబాటులో ఉంటుంది. రోగాన్ని నివారించే పదార్థం మందు. వైద్యుని పర్యవేక్షణలో రోగి తగిన మోతాదులో మందు తీసుకుంటే రోగం నయమవుతుంది. మనిషి తన జీవితంలో ఏదో సాధించాలని చేస్తున్న పరిశోధనలో ఒక మనిషిని సాటి మనిషిగా చూడడం మానేశాడు. భూగోళంపై ఉన్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుషులు చాలా పురోగతి సాధించారు. మానవులలో వివేకం, ఆలోచన, భాష వంటి విషయాలు, మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది ఉండటం వల్ల సాధ్యపడినాయి. మనుషులు కూడా సంఘ జీవులు. మానవులు భావ వ్యక్తీకరణ కొరకై సమాచార పద్ధతులను వాడడంలో అత్యంత నిపుణత కలిగి ఉన్నారు. మానవులు అందంగా కనిపించడానికి కృషి చేయడంతో పాటు కళ, సాహిత్యం, సంగీతం వంటి ఆవిష్కరణలు గావించారు. చూడు, ఈ లోకంలో మనుషుల జీవితాలు వింతగా సాగుతున్నాయి. మనుషులు నీతిని మరిచి జీవితాలు గడుపుతున్నారు. అసలు ఈ మనుషులకు ఏమైంది? కొంచెం అయినా బుద్ధిని ఉపయోగించడం లేదు. సరి అయిన కారణమేమిటో ఎవరికీ తెలియడం లేదు. ఎందుకో ఈ లోకంలో మనుషులు సరియైన ప్రవర్తన మరిచి అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం లేని మనుషులు విషం నిండిన సీసాలో మందు కొరకు వెతుకుతున్నారు. మనుషులకు విషం సీసాలో వెతికితే ఏమి దొరుకుతుంది? మనిషి విషం సీసాలో వెతికితే విషం దొరుకుతుంది. మనిషి విషం సీసాలో వెతికితే మందు లభ్యం కాదు. మనిషి మందు సీసాలో మందు కొరకు వెతికితే మందు లభ్యం అవుతుంది. వింత ప్రవర్తన కలిగిన మనుషుల్లో నిజాయితీ కొరకు వెతుకుతున్నావు? నిజాయితీ మర్చిపోయిన మనుషుల్లో నిజాయితీ కొరకు వెతకడం వల్ల ప్రయోజనం ఉండదు. దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలతో వ్యవహరిస్తున్న మనుషుల్లో నిజాయితీ ఎలా దొరుకుతుంది? నిజాయితీకి అర్థం చిత్తశుద్ధి, యథార్థత వంటి సద్గుణాలు. నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత నిష్పక్షపాతం కలిగి ఉండడం. నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిని నిజాయితీపరుడు అంటారు. నిజాయితీ కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నిజాయితీపరులు తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా నిష్కల్మషంగా వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధతతో ప్రవర్తిస్తారు. నిజాయితీని కోల్పోయిన మనుషుల్లో నిజాయితీని వెతుకుతున్నావు. ఎంత వెర్రితనం నీది అని ప్రశ్నించడం సమంజసంగా తోస్తుంది. సమాజంలో నివసిస్తున్న మనుషుల ప్రవర్తనలో కలిగిన మార్పుకు కవి గుల్జార్ ఆవేదన చెందినట్లుగా తోస్తోంది. గుల్జార్ కవితలో వ్యక్తీకరించిన భావం సమాజంలోని వాస్తవ స్థితికి అద్దం పడుతుంది.

షాయరీ-5:

గుల్జార్ రాసిన షాయరీలో మనస్సును ఆకట్టుకునే అద్భుతమైన పద సంపద ఉంది. గుల్జార్ షాయరీని చదివితే మనకు ఎక్కడ విసుగు అనిపించదు. గుల్జార్ షాయరీని ఎవరైనా అలవోకగా చదువుకోవచ్చు. గుల్జార్ లో గొప్ప దార్శనికత ఉంది. కవిత్వాన్ని ఎంతో గొప్పగా రాయడం గుల్జార్‌కే సాధ్యమవుతుంది.

‘ఈ లోకంలో ఎవరూ కడదాకా తోడు
ఉండరు..
శవం ఇంకా శ్మశానంలో
ఉండగానే.. కాల్చేయడానికి ఇంకా ఎంత
సమయం ఉంది అని మన వాళ్లే
విసుక్కుంటూ ఉంటారు.’

వివాహం చేసుకున్న మనుషుల మధ్య పరస్పర అవగాహనతో కూడిన అవినాభావ సంబంధం ఉంటుంది. వివాహంతో ఏర్పడేది భార్యాభర్తల సంబంధం. పుట్టినప్పటి నుండి శిశువు మరియు తల్లి మధ్య ఏర్పడే అనుబంధం తల్లి శిశువుల బంధం. వివాహంతో కలిసిన భార్యాభర్తలు ఈ లోకంలో ఎవరు చివరి దాకా తోడు ఉండరు. భార్యాభర్తలు ఇద్దరు అయినప్పటికీ ఒకే గూటిలో నివసించే పక్షిలా ఒక్కటిగా కలిసిమెలిసి అనురాగంతో ఆప్యాయతను పంచుతూ జీవిస్తారు. భార్యాభర్తలు ఇరువురు ఒకేసారి మరణిస్తారా? అంటే సమాధానం దొరకదు. భర్త ముందు చనిపోతే భార్య తర్వాత చనిపోవచ్చు. భార్య ముందు చనిపోతే భర్త తర్వాత చనిపోవచ్చు. ఈ లోకంలో భార్యాభర్తలుగా నివసించే ఎవరు కూడా చివరి వరకు ఒకరికొకరు తోడు ఉండరు. తండ్రి కొడుకు, తల్లి బిడ్డ, అన్నా చెల్లి, ఎవరు కూడా చివరి వరకు తోడు ఉండరు. ఆయువు ఎప్పుడు మూడుతుందో ఎవరికీ తెలియదు. పుట్టిన ప్రతి జీవికి తప్పనిసరిగా వచ్చేది చావు. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేది తెలియనిది మరణం. శ్మశానం అనగా చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చేసే స్థలం. శ్మశానాన్ని శ్మశాన వాటిక, వల్లకాడు అని కూడా అంటారు. శవం చనిపోయిన జీవి దేహం. జీవం లేని దేహాన్ని మృతదేహం అంటారు. చనిపోయిన మనిషికి స్మశానంలో దహన సంస్కారాలు జరుగుతాయి. ప్రతి ఊరిలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ శ్మశానాలు ఉంటాయి. శవాన్ని పాడె మీద మోసుకుని స్మశానానికి తరలిస్తారు. శవాన్ని తగలేయటం, మనుషులు తిరిగే ఊరిలోనే శవాన్ని పూడ్చటం, చివరకు పీనుగులు పడేసే వల్లకాటికి కూడా ఒక పద్ధతి లేదు. వల్లకాడు కాటికాపరి నివసించే చోటు అంటారు. చివరకు వల్లకాడులో కూడా నయవంచక స్వార్థపరులు సంచరిస్తున్నారు. నవ నాగరిక సమాజం నిజమైన వల్లకాడుగా మారినట్లుగా అనిపించింది. శవాన్ని స్మశానం సమీపంలో దింపి చివరిసారిగా చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు శవం చెవిలో అతని పేరు పెట్టి పిలుస్తారు. దింపుడు కళ్ళం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పాడె మీద నుంచి దింపిన శవాన్ని చితిపై పేర్చిన కట్టెలపై ఉంచిన తర్వాత శవాన్ని దహనం చేసే వ్యక్తి ఒక కుండలో నీళ్లు తీసుకుని చితి చుట్టు ఒక ప్రదక్షిణ పూర్తి కాగానే కాటికాపరి కుండకు ఒక రంద్రం చేస్తాడు. చితి చుట్టు రెండో ప్రదక్షిణ పూర్తి కాగానే కాటికాపరి కుండకు రెండో రంధ్రం చేస్తాడు. చితి చుట్టు మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కాటికాపరి కుండకు మూడో రంద్రం చేస్తాడు. కాటికాపరి కుండను చితి పక్కకు విసిరేస్తాడు. శవాన్ని దహనం చేసే వ్యక్తి శవానికి నిప్పు అంటించగానే జ్వాలలు ఎగసిపడతాయి. చితికి నిప్పంటించే కార్యక్రమం ఎప్పుడు పూర్తి అవుతుందని ఇంకా ఎంత సమయం ఉంది అని అక్కడికి చేరిన అతని బంధువులు ఆత్మీయులు విసుక్కుంటూ ఉంటారు. బతికున్నప్పుడు అతనితో ప్రేమగా మెలిగిన వాళ్ళు కూడా శ్మశానంలో ఈ తంతు ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎంత సమయం పడుతుంది అని విచిత్రంగా విసుక్కుంటున్న లోకంలో స్వార్థం పెరిగిపోయిన మనుషుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెలిపిన భావాల్లో ఎంతో నిజాయితీ ఉంది. చనిపోయిన మనిషి పట్ల కూడా సానుభూతిగా ఉండడం లేదు. బతికున్నప్పుడు అతను మనతో ఎంత ప్రేమగా ఉన్నాడు. సమాజ అభివృద్ధి కొరకు అతను ఎంతగా పోరాటం చేసాడు, ఎంత గొప్పగా బతికాడు అనే విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలి. చనిపోయిన వ్యక్తి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించాలన్నది మరచి ప్రవర్తిస్తున్న తీరును గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.

షాయరీ-6:

గుల్జార్ కవితల్లో అద్భుతమైన భావ సంపద పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గుల్జార్ లోకాన్ని సునిశితమైన దృష్టితో పరిశీలించినట్లు తోస్తోంది. చక్కని భావుకతతో నిండిన గుల్జార్ కవితలు చదివితే పాఠకులకు అపారమైన జ్ఞాన సంపద మరియు లోకం తీరు పట్ల సరైన అవగాహన కలుగుతుంది.

‘అతని మొఖం చూస్తేనే ఆకలి చంపిందని
తెలిసిపోతున్నది.
కానీ.. ఈ జనం ఉన్నారు చూసారు..
ఏదో తిని చనిపోయాడని అంటున్నారు..
చూడండిక!’

ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన. కాలేయంలో గ్లైకోజెన్ ఒక నిర్దిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని ఆకలి అంటారు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కలిగే బాధ ఆకలి. ఆకలి అనే పదం మానవులందరు అనుభవించే ఆహారం పట్ల సాధారణ కోరికకు మించిన అర్థంలో ఉపయోగించబడుతుంది. ఆకలి యొక్క అత్యంత తీవ్రత చేత, పోషకాహార లోపం ఉన్నప్పుడు తగినంత ఆహారం అందుబాటులో లేకపోవడం ద్వారా ప్రజలు ఆకలితో చనిపోవడం జరుగుతుంది. సరి అయిన ఆహారం లేక పేద ప్రజలు ఆకలితో బాధపడుతూనే ఉన్నారు. ఆహారం లభించకపోవడం వల్ల పేద ప్రజలు కడు దయనీయమైన స్థితిలో ఆకలితో చనిపోయారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. చనిపోయిన అతని ముఖం చూస్తేనే ఆకలి బాధకు తట్టుకోలేక ప్రాణం విడిచాడని తెలిసిపోతున్నది. ఈ దేశంలో పుట్టిన పేద ప్రజలు తినడానికి తిండి లేక చేయడానికి పని లేక అర్ధాంతరంగా జీవితాలను చాలిస్తున్నారు. ఈ దేశమును పాలిస్తున్న పాలకులు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాస్తున్నారు. తిండి లేని పేదలకు ఆహారం అందించి పౌరుల ప్రాణాలు కాపాడాల్సిన నైతిక బాధ్యతను కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్న పాలకుల పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ఎల్లెడలా కనిపిస్తున్నది. రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక హక్కులను కూడా దూరం చేస్తున్న ప్రభుత్వాల దమన నీతిని ఖండించాల్సిన అవసరం బాధ్యత గల పౌరులపై ఉంది. బతుకు గడవక జీవితంలో ఎంతో పోరాటం చేసి కనీస అవసరాలు అయిన కూడు, గూడు, గుడ్డ లభ్యం కాక ఎందరో పేద ప్రజలు ఆకలి చావులతో మరణించడం దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ,ఈ సమాజంలో నివసిస్తున్న కొందరు జనాలు ఆకలితో చనిపోవడంను చూసి కూడా వారి చావును పరిహాసం చేస్తున్నారు. అతడు పేదరికంతో ఆకలి చావుతో చనిపోలేదు. అతడు ఏదో తిని చనిపోయాడని అంటున్నారు. ఈ లోకంలో ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తి కూడా ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మహత్య చేసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడడు. పేదరికంతో బతుకు గడవక ఆకలి చావుతో చనిపోయిన అతనిని ఏదో విషం తిని చనిపోయాడని నిందలు వేయడం మానవతకే మచ్చగా చెప్పవచ్చు. మనుషులు పేద ప్రజల పట్ల ఎందుకు నీచంగా ఆలోచిస్తున్నారు. సాటి మనిషి పట్ల ప్రేమాభిమానాలు చూపించాలి. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం కనీస ధర్మం. కనీస ధర్మం మరిచిపోయి ప్రవర్తిస్తున్న జనాలు ఉన్నారు అని చెప్పుకోవడం హృదయానికి బాధను కలిగిస్తుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కనీస అవసరాలు తీరకుండా అర్థాంతరంగా ఆకలి చావులతో ప్రాణాలు వీడడం బాధను కలిగిస్తుంది. ప్రభుత్వాలు మరియు ప్రజలు కూడా సాటి మనిషి పట్ల ప్రేమ, ప్యాయత కనపరుస్తూ ఆకలితో ఉన్న వాడిని ఆదరించడం అనే కనీస ధర్మంతో ప్రవర్తించాలి. మనుషుల ప్రవర్తన వల్ల ఎదుటివారు బాధకు, దుఃఖానికి, ఆకలి చావులకు బలికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి మరియు పాలకులకు ఉంది. గుల్జార్ ఈ షాయరీలో పేర్కొన్న భావాలను సమాజం పట్ల సరియైన అవగాహనతో రాసారు అని తోస్తోంది.

షాయరీ-7:

గుల్జార్ కవితలోని శిల్ప సౌందర్యం పాఠకుల మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది. గుల్జార్ షాయరీ కవిత పాఠకుల హృదయాలకు చక్కని కవితను చదివామనే అనుభూతిని కలిగిస్తుంది. గుల్జార్ కవితలోని చరణాలపై దృష్టిని సారించి అలౌకికమైన అనుభూతిని సొంతం చేసుకుందాం.

‘నీతో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు!
రాయడానికి భావం కూడా అందటం లేదు.
నొప్పి అయితే తెలుస్తోంది.. కానీ
చూపియ్యడానికి గాయమే కనపడడం లేదు!’

మనం మాట్లాడే విషయాన్ని మాటల ద్వారా వ్యక్తం చేస్తుంటాం.మాటలు రెండు రకాలు.1) మంచి మాటలు. 2) చెడు మాటలు.

చెడు మాటలు నాలుగు విధాలుగా ఉంటాయి.

1) పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. మిత్రులు శత్రువులు అయితే అశాంతి, దుఃఖం కలుగుతుంది.

2) అనృతం అనగా అసత్యం. అసత్యం చెప్పడం వలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. అసత్యవాదులు జీవించినప్పటికీ మరణించిన వారితో సమానమని చెబుతారు.

3) పైశున్యం అనగా చాడీలు చెప్పడం వలన కుటుంబంలో కలహాలు, విరోధాలు, పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి.

4) అసందర్భ ప్రలాపం: వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా, వ్యర్థంగా మాట్లాడకూడదు.

శారీరక లేదా మానసిక బాధను నొప్పి అంటారు. వైద్యులు నొప్పి యొక్క తీవ్రత మొదలైన వివిధ లక్షణాలను విశ్లేషించి వ్యాధిని నిర్ధారిస్తారు. నొప్పి వివిధ వ్యాధుల వల్ల కలుగుతుంది. నొప్పి చాలామందిలో సాధారణ జీవనానికి అంతరాయం కలిగిస్తుంది. ఒక్కొక్కసారి ఏ విధమైన వైద్యం అవసరం లేకుండా నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గకుండా ఉంటే వైద్యుని అవసరం ఏర్పడుతుంది. వైద్యం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నొప్పిని కలిగించే కారకాల నుండి శరీరాన్ని లేదా శరీర భాగాన్ని రక్షించడం. మానసికంగా మనల్ని జాగరూకులను చేయడం అని చెప్పవచ్చు. గాయం అనగా దెబ్బ తగలడం. శారీరక గాయం శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బల వలన చర్మం చిట్లడం, చర్మం కమిలి పోవడం, చర్మం వాయడం, చర్మం గీక్కుపోవడం జరిగితే దానిని గాయం అంటారు. గాయము కర్రతో కొట్టినందు వలన, నిప్పుతో కాలినందు వలన సల్పూరిక్ ఆమ్లం, జిల్లేడు పాలు వంటి రసాయనం వలన ఇలా ఎన్నో విధములుగా జరగవచ్చును. సజీవ కణజాలానికి గాయం, చర్మంపై కోత, బాహ్య కారణాలవల్ల మన శరీరానికి సంభవించిన ఏదైనా నొప్పిని గాయం అని పిలుస్తారు. గాయం వల్ల మనసుకు కలిగే భయాన్ని అఘాతం trauma అని అంటారు. శరీరంలో ఏ భాగానికి అయినా గాయం సంభవించవచ్చు. కొన్ని గాయాలు సులభంగా మానుతాయి. మనసుకు కలిగిన గాయాలు తొందరగా మానవు. గాయం మానిపోగానే మచ్చ ఏర్పడుతుంది. ఏదైనా వస్తువులు తగిలినప్పుడు శరీరంపై గంటు ఏర్పడుతుంది. అకస్మాత్తుగా కింద పడినప్పుడు తగిలేది గాయం. గట్టి వస్తువుతో కొట్టడం వలన గాయం అవుతుంది. అతను ఆమెతో ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడుతూ నీతో మనసు విప్పి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు అని నిర్మొహమాటంగా చెబుతున్నాడు. అతడు ఆమెతో బాధగా నా మనసులో చెలరేగుతున్న సంఘర్షణను కలంతో రాయడానికి గుండె లోతుల్లోంచి భావాన్ని కూడా కాగితంపై పెట్టలేకపోతున్న అశక్తత నన్ను వెంటాడుతోంది అని అన్నాడు. హృదయం లోతుల్లో అతనికి తగిలిన తీవ్రమైన నొప్పి తెలుస్తుంది. కానీ,నా మనసుకు తగిలిన బాధ తాలూకు నొప్పిని చూపియ్యడానికి గాయం కనపడడంలేదు అని ఆవేదన చెందుతున్నాడు. గుల్జార్ అతను, ఆమె మధ్య జరిగిన సంఘర్షణను ఈ షాయరీలో వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది.

షాయరీ-8:

గుల్జార్ షాయరీ అద్భుతమైన భావనా పటిమతో కూడి ఉంది. గుల్జార్ షాయరీ పాఠకులను ఆలోచింపజేస్తుంది. గుల్జార్ షాయరీ సౌందర్యాన్ని ఆస్వాదించండి. గుల్జార్ కవితా లోకంలో విహరించండి. గుల్జార్ షాయరీ చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.

‘1) ఆమె పైన ప్రేమ పుట్టిన రోజునే నాకు
మృత్యువు కూడా వచ్చి ఉంటే
బాగుండేది!’
‘2) నాలోపలి విషాదాన్ని ఎవరూ
గుర్తించ లేక పోయారు.
నా హృదయం అంత గొప్పగా
నటించింది మరి!’

ఊపిరి ఆగిపోతే మృత్యువు. శరీరం నుంచి ప్రాణం బయటికి పోయే క్రియ మృత్యువు. జన్మించిన వాడికి చావు తప్పదు. పుట్టిన ప్రతి జీవికి తప్పనిసరిగా వచ్చేది చావు. తప్పించుకోలేనిది, ఎప్పుడు వచ్చేది తెలియనిది మరణం. ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయలేకపోవుట విషాదం. విషాదం అనేది విపత్తు లేదా దురదృష్టాన్ని సూచించే విషయంగా చెప్పవచ్చు. ఉద్యోగాన్ని కోల్పోవడం ఒక విషాదం. నిరుద్యోగులుగా మరియు ఆరోగ్య సంరక్షణ లేకుండా అనారోగ్యంతో బాధపడడం విషాదం. విషాదం అంటే గొప్ప నష్టం మరియు దురదృష్టానికి దారి తీసే సంఘటన. గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. గుండె ఛాతి మధ్యలో ఎడమ వైపున ఉంటుంది. గుండె ప్రాణులకు ప్రధానమైన అంగం. మనస్సు యొక్క ఒక శక్తి వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది. మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు ఉంటాయి. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం మనస్సు. ప్రేమ అంటే మానసికపరమైన ఒక పవిత్ర భావన. ఏ విధమైన ప్రతి ఫలాపేక్ష లేకుండా మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్ధమైన ఆదరణ ప్రేమగా చెప్పవచ్చు. ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణము లేదా మంచి అలవాటు. సర్వసాధారణంగా ప్రేమ, బలమైన ఆకర్షణ మరియు భావోద్వేగ అనుబంధాన్ని సూచిస్తుంది. ప్రేమ అనేది భావ వ్యక్తీకరణ. ప్రేమ సాధారణంగా లోతైన మరియు భావోద్వేగమైన ఆప్యాయతను వివరిస్తుంది. ప్రేమకు కూడా పుట్టినరోజు ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడు, ఆమెను చూడగానే తెలియని వ్యామోహంలో పడి కొట్టుకుపోయాడు. ఆ రోజు నుండి అతనికి ఆమె పట్ల ప్రేమ కలిగింది. అదే రోజును తనకు ఆమె యందు ప్రేమ పుట్టిన రోజుగా భావిస్తున్నాడు. ఆమె పరిచయం అయిన రోజు నుండి ఒక సంవత్సరం పూర్తి అయిన తర్వాత సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ పుట్టిన రోజు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకున్నాడు. ప్రేమ పుట్టిన రోజు ఉత్సవాన్ని తిలకించడానికి ఆ ఊరి జనాలు వచ్చారు. ప్రేమ పుట్టిన రోజున అతడు ఆమె కొత్త బట్టలు ధరించడం, ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి స్వీట్లు తోటివారికి పంచడం చేసినారు. ప్రేమ పుట్టిన రోజున అతడు ఆమెకు శుభాకాంక్షలు తెల్పినాడు. అతనికి ఆమెకు ప్రేమ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఉత్సవంలో పెద్దల నుంచి ఆశీస్సులు కూడా లభించాయి. అతనికి ఆమె పైన ప్రేమ ఎందుకు పుట్టింది? అతను ఆమె ఎక్కడ కలుసుకున్నారు అనే సందేహాలు మనలో ముప్పిరిగొంటాయి. ఆమెకు హృదయం లేదు. ఆమె తన ప్రవర్తన ద్వారా అతన్ని బాధపెట్టినట్లుగా తోస్తోంది. అతను ఆమె ప్రేమ తాలూకు బాధనుండి తేరుకోలేకపోతున్నాడు. దూరమైన ఆమెను తలుచుకొని అతను పదేపదే కన్నీళ్లు కారుస్తున్నాడు. అతను, ఆమె జ్ఞాపకాల తాలూకు అనుభూతులను మరిచిపోలేకపోతున్నాడు. అతను విచారంగా ఆమె పై ప్రేమ పుట్టినరోజును గుర్తు చేసుకుంటున్నాడు. ఆమెపై ప్రేమ పుట్టిన రోజు నాడు నాకు మరణం కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది అని వేదనతో తన మనోభావాన్ని తెలియజేస్తున్నాడు. అతను ఆమె గురించి పడిన దుఃఖం తాలూకు విషాదాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. అతను, ఆమె అన్యోన్యంగా కలిసిమెలిసి ప్రేమతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు అని భావించారు. ఆమె పట్ల ప్రేమగా ఉన్నట్లు అతని హృదయం కూడా గొప్పగా నటించింది అని ఆవేదన చెందుతున్నాడు. అతను ఆమె పట్ల గల ప్రేమలో మూడో వ్యక్తి ప్రవేశించి వాళ్ళ మధ్య గల ప్రేమాభిమానాలను తుంచి వేసి కలతలకు, ఎడబాటుకు కారణం అయ్యాడు అని తోస్తోంది. ప్రేమికుల మధ్య మూడో వ్యక్తికి తావు ఇవ్వకూడదు. మంచిగా ఉన్న వాళ్లను విడదీయడానికి మూడో వ్యక్తి ప్రయత్నిస్తాడు. మూడో వ్యక్తి వారి మధ్య గల సుఖ సంతోషాలను దూరం చేసి సంతోషిస్తాడు. చివరకు అతడు ఆమె నుండి విడిపోయిన సందర్భంగా జరిగిన సంఘటనను గుల్జార్ ఈ షాయరీలలో ప్రేమ పుట్టిన రోజున మృత్యువు వచ్చి ఉంటే బాగుండేదని తన లోపలి విషాదాన్ని ఎవరు గుర్తించలేకపోయారని తెలపడం బాగుంది.

షాయరీ-9:

గుల్జార్ షాయరీ లోని పదునైన భావాలు జీవంతో తొణికిసలాడుతున్నాయి. సమాజంలో మానవులు ఎదుర్కొంటున్న వేదనలు, బాధ, దుఃఖం చూసి గుల్జార్‌ హృదయం ద్రవించినట్లుగా తోస్తోంది. గుల్జార్ అల్పాక్షరాల్లో గొప్ప భావం పలికించారు.

‘ప్రేయసీ..
నీ జీవితం ఇలా వెలిగిపోతున్నందుకు.. అభినందనలు!
నాదేముందిలే.. చీకటి అలవాటైపోయింది
ఈ వింత చూడు!
నిన్ను పొంది నా నుంచి నేనే దూరమైపోయాను
నీకు దూరమై.. నా దగ్గరికి నేను చేరుకున్నాను!’

ప్రేయసి అనగా ప్రియుని యొక్క ఒక స్త్రీ భాగస్వామి, శృంగారపరంగా లేదా లైంగిక పరంగా అతనితో సంబంధం ఉండవచ్చు‌. ప్రేయసి, ప్రియుడు వైవాహిక సంబంధం లేనప్పటికీ బాగస్వాములుగా కట్టుబడి ఉంటారు. ప్రియురాలు, ప్రియుడు కలిసి ఉండి సహజీవనం చేస్తారు. జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన జీవితం. జీవించే ప్రాణి గడిపేది జీవితం. పుట్టినప్పటి నుండి చివరి దశకు చేరుకునే వరకు కాలానుగుణంగా ఎదురయ్యే కష్టసుఖాలను అనుభవిస్తూ గడపడం జీవితం. ఒకరిని మెచ్చుకొనుటకు ఉపయోగించే పదం అభినందన. అభినందనకు ఆంగ్లంలో congratulation అని అర్థం. ఆమెను ప్రేయసీ అని ప్రేమగా పిలుస్తున్నాడు. ప్రేయసి నీవు నన్ను ఒంటరివాడిని చేసి స్వార్థంతో విడిచి పెట్టి వెళ్ళిపోయావు. ప్రేయసీ ఇప్పుడు నీవు నా వద్ద లేవు. ప్రేయసి నీ జీవితం నీవు గడుపుతూ నన్ను విడిచి వెళ్లి స్వతంత్రంగా జీవిస్తూ నీవు ఒక కాంతిలా మారి ప్రకాశాన్ని వెదజల్లుతూ వెలిగిపోతున్నందుకు అభినందిస్తున్నాను. ఇప్పుడు నీవు నా ప్రేయసిగా నా వద్ద లేవు. అయినప్పటికీ నేను ఒకప్పటి ప్రియుడిగా నిన్ను మెచ్చుకుంటూ నీ మంచి కోరి అభినందన తెలియజేస్తున్నాను. ప్రేయసీ నీవు నా వద్ద లేవు. నీవు లేకుండా ప్రేయసి నాది అని చెప్పుకోవడానికి ఏముందిలే అని చెబుతున్నాడు. ప్రేయసీ అందంతో ప్రకాశవంతంగా కళకళలాడుతూ ఉండే నీవు నాతో లేకపోవడం చేత నాకు వెలుతురు లేని చీకటి గదిలో గడపడం అలవాటైపోయింది. చీకటిని ఆంగ్లంలో darkness అని అంటారు. ఒక ప్రదేశంలో వెలుతురు లేని స్థితిని చీకటి తెలియజేస్తుంది. అంతరిక్షం రాత్రిపూట నల్లగా కనిపిస్తుంది. ఆకాశంలో కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణ విహీనంగా నలుపుగా కనిపిస్తుంది. వెలుతురు ప్రసరించని ప్రదేశాన్ని చీకటి ప్రదేశం అంటారు. ప్రతిరోజు రాత్రి చీకటిగా ఉంటుంది. ఎక్కువగా నేరాలు రాత్రిపూట చీకటిలో జరుగుతాయి. ముఖ్యంగా వ్యభిచారం. అందువల్లనేమో చీకటి తప్పు అని అంటారు. చీకటి అంటే శూన్యం, ఖాళీగా ఉండడం అని చెప్పవచ్చు. భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యత ఏర్పడింది. వెలుగు లేకపోవడం చీకటి. సూర్యుడు అస్తమించడంతో అంతటా అంధకారం అలుముకుంటుంది. సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తే విషయం గాని వస్తువు గాని వింత అయినట్టిదిగా చెప్పవచ్చు. అపూర్వమైన మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన వింత. విస్మయం కలిగించే వస్తువు వింత. తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. ప్రేయసి నిన్ను పొంది చివరకు నన్ను నేను మరిచిపోయాను. నీవు నాతో కలిశాక నేను అనే వ్యక్తిని దూరం అయిపోయాను. ప్రేయసీ నీకు దూరమైన తర్వాత నాకు ఏమీ లేదు. అతడు నిరాశతో ప్రేయసీ నీవు లేకుండా నేను నాలో లేను అని తెలుపుతున్నాడు. అందుకే ప్రేయసీ నా దగ్గరకు నేను చేరుకున్నాను అని ఆవేదనతో ప్రియుడు ప్రేయసితో చెప్పిన తీరు ఆశ్చర్యం గొలుపుతూ ఉంది. ప్రేయసికి దూరమైన ప్రియుడి వేదన ఎలా ఉంటుందో షాయరీలో గుల్జార్ వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

షాయరీ-10:

గుల్జార్ కవితల్లో రచన శైలి అమోఘం. గుల్జార్ షాయరీ పాఠకునిలో చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.

‘అందరూ తమ తమ స్నేహితులను పొగుడుతూ ఉన్నారు.
నిద్ర నెపం వేసుకుని నేను ఆ మెహఫిల్‌ని తప్పించుకుని
వెళ్ళిపోయాను!
తరువాత అంతా.. నెలల తరబడి మౌనం.. దూరం!
ఏం చెప్పను మరి.. నీ స్నేహ సాంగత్యంలో కూడా
నాది ఏకాంతమే..
ఒంటరితనమే!’

మెహఫిల్ అనే పదం అరబిక్ భాష నుండి ఉద్భవించింది. మెహఫిల్ అనేది ఒక అధికార వేదిక. మెహఫిల్ వేదికలో కవిత్వం (ముషైరా) గానం, సంగీతం మరియు నృత్యం వంటి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.భారతదేశంలో గంగా జమునా తహజీబ్ సంస్కృతిలో భాగమని చెప్పవచ్చు. మెహఫిల్ సాధారణంగా ఆసక్తి గల కవిత్వ ప్రియులు లేదా కవిత్వ పఠన సమావేశాలను ఇష్టపడే వారి ఇళ్లలో నిర్వహిస్తారు. మైత్రి కలవాడు స్నేహితుడు. ఎవరైనా మనతోపాటు కలిసిమెలిసి ఉండేవాడు స్నేహితుడు. ఆపద సమయంలో మిత్రులు గల వ్యక్తికి అతని మిత్రులు సహాయం చేస్తారు. స్నేహం అనేది ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధంగా పరిగణించబడుతుంది. స్నేహం రక్తసంబంధం కాకపోయినప్పటికీ మనుషుల హృదయాంతరాలలో నుంచి పుట్టుకొస్తుంది. ఒక వ్యక్తిని ఒంటరితనం అనే అనుభూతి నుంచి బయటికి తీసుకువచ్చేది స్నేహం. మనకు పుట్టుక నుంచి మరణించే వరకు ఎవరు వెంట ఉన్నా లేకున్నా ఎవరి తోడు ఉన్నా లేకున్నా స్నేహం మాత్రం చివరి వరకు ఉంటుంది. నిద్ర శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. నిద్ర జంతువులలోనే కాకుండా సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు ఇతర జంతువులలో దైనందిన జీవితంలో నిద్ర బ్రతకడానికి అవసరం. నిద్ర శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యకర జీవనానికి నిద్ర పౌరుల ప్రాథమిక హక్కు. నిద్ర చాలా అవసరమైనది అని తెలుస్తుంది. అవసరానికి అనుగుణంగా నిద్ర విశ్రాంతి ఆరోగ్యరీత్యా మానవులకు తప్పనిసరి. నిద్ర కళ్ళకు విశ్రాంతి కలిగిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాట్లాడకుండుట మౌనం. మౌనం ఒక అపూర్వమైన కళ, తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడడం సర్వదా శ్రేయస్కరం. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలి. మితంగా మాట్లాడడం చేతకానప్పుడు మౌనంగా ఉండాలి. మాట వెండి అయితే మౌనం బంగారం అని సామెత. మనసుకు చికాకు ఏర్పడిన సందర్భంలో కావాలని ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉండటం వల్ల ఏకాంతం లభిస్తుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఏకాకి అని లోకులు అంటారు. ఒంటరిగా ఉన్న వారిని చూస్తే ఏకాంతంగా ఉన్నారు అనే అర్థం వస్తుంది. ఒంటరితనంలో వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో గాని బలవంతంగా వదిలి వేయడం వల్ల కాని విడిగా ఉంటాడు. ముసలితనంలో పిల్లలందరు ఎక్కడెక్కడో పని చేస్తూ వేరే చోట్ల స్థిరపడి ఉండడం వల్ల అతను ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. మన దేశంలో పేరు పొందిన రాజధాని నగరంలో అతను నివసిస్తాడు. మెహఫిల్ అధికార వేదికగా రాజధాని నగరంలో ఆ రోజు కవిత్వం, గానం, నృత్యం వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పేరు పొందిన పుర ప్రముఖులు, కవులు, సంగీత విద్వాంసులు, కళాకారులు, నృత్య ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా నగరంలోని జనాలు అందరు హాజరై సంతోషంతో కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు. నగర ప్రముఖులు తమ స్నేహితులు ప్రదర్శిస్తున్న కార్యక్రమాలు చూస్తూ పరవశించి చప్పట్లతో కరతాళ ధ్వనులు చేస్తూ ఉన్నారు. అంత గొప్పగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతు ఉన్నప్పటికీ అతని మనసు ఆ కార్యక్రమాల మీద నిమగ్నం కాలేదు. నిద్ర వస్తుందనే నెపంతో అతడు ఆ మెహఫిల్ సమావేశ మందిరం నుండి మనస్సు బాగా లేక చికాకుతో అన్యమనస్కంగా స్నేహితులందరిని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను ఆమె గురించి మనస్సులో రగులుతున్న బాధను ఎవరికీ చెప్పుకోలేడు. అతను మనస్సులో కలుగుతున్న బాధను కప్పిపుచ్చుకొని తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ఆమె మాట మీద నిలకడ ఉండే మనిషి కాదు. ఆమె అవసరం మేరకే చక్కగా మురిపిస్తూ ముద్దులు కురిపించినట్లుగా మాట్లాడుతుంది. ఆమెవి అన్ని వట్టి కాలక్షేపం కబుర్లు. ఆమె మాటకు కట్టుబడి ఉండదు. ఆమెలో నిజాయితీ కొరవడింది. ఆమెను నమ్మరాదు అనిపిస్తుంది. ఆమె మాటలతో బురిడీ కొట్టిస్తుంది. ఆమె గుణం ఎట్లాంటిదో తనకు బాగా ఎరుక. ఎన్నో రోజుల నుండి ఆమె సంగతి తనకు తెలుసు. ఆమె నెలల తరబడి తనతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఆమె అసలు కోపంతో అతనితో మాట్లాడదు. ఆమెది అదో వింత ప్రవర్తన. ఏమిటో తనకు అర్థం కాదు. ఆమె ఎందుకో కావాలని తనకు దూరంగా ఉంటూ గడుపుతుంది. ఆమె తనకు ప్రియమైన స్నేహితురాలు. ఆమె స్నేహ సాంగత్యంలో కూడా తాను ఆమె లేనట్లుగా ఏకాంత జీవితం గడుపుతున్నాడు. తనకు స్నేహితురాలు అయినప్పటికీ ఆమె ఎందుకో నన్ను కలవదు. ఎందుకు నాకు దూరంగా ఉంటావు? నీవు ఉన్నప్పటికీ తన దగ్గరకు ఎందుకు రావు. తన జీవితంలో ఆమె ఉన్నప్పటికీ ఒంటరితనమే మిగిలింది అని విచారంతో చెబుతున్నాడు. ఆమె సాహచర్యం ఉన్నప్పటికీ తన వద్ద ఉండదు. ఆమె తనతో మాట్లాడదు. తనకు దూరంగా ఎందుకు గడుపుతావు. ఆమె స్నేహం ఉన్నప్పటికీ తనది ఏకాంతం. ఆమె ఉన్నప్పటికీ తనకు జీవితంలో ఒంటరితనం మిగిలింది అని హృదయంలో కలిగిన వేదనను కవి గుల్జార్ వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

షాయరీ-11:

గుల్జార్ కవితల్లో తీసుకున్న భావాలు, వస్తు వైవిధ్యం, పద సంపద పాఠకుల మనసును ఆలోచింపజేస్తాయి. గుల్జార్ షాయరీలో వ్యక్తం చేసిన భావం పాఠకుడిని ఏదో కొత్త లోకంలోకి తీసుకువెళ్లి మనసును రంజింపజేస్తుంది. ఈ షాయరీ పూదోటలోకి వెళ్లి అపారమైన అనుభూతులను సొంతం చేసుకోండి.

‘ఖుదా.. నువ్వు మాత్రం ప్రేమలో అస్సలు పడకు
ఆనక నువ్వే బాధపడతావు సుమా!
ప్రేమలో విఫలమైన నేను మరణించాక నీ
దగ్గరికే వస్తాను.. మరి నువ్వెక్కడికి
వెళతావు చెప్పు?’

దేవుడు అనగా సృష్టికర్త. సృష్టిని సృష్టించినవాడు దేవుడు. అతడు సర్వాంతర్యామి. అతడు నిష్కళంకుడు, అతను మానవుల పాపాలను క్షమించేవాడు. అతడే నిజమైన మార్గాన్ని చూపించేవాడు. దేవుడు ఒక్కడే. ఆది కాలంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. అంత్య కాలంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఎటువంటి పాపం లేని వాడు. దేవుడు పాపం చేయనివాడు. దేవుడు జన్మ పాపం, కర్మ పాపం లేనివాడు. దేవుడు సత్యం బోధించువాడు. దైవమును ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి నడిపేవాడు అని నమ్ముతారు. దేవుడు అంటే జీవుడు. జీవాన్ని సృష్టించే వాడు సృష్టికర్త. దేవునితో మాట్లాడుతూ మనిషి స్వార్థపరుడిగా మారిపోయాడు. మనిషిలో ఏ కోశానా నిజాయితీ అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. మనిషి నిజాయితీ అనే సద్గుణం విడిచిపెట్టి వంచన మార్గంలో పయనిస్తున్నాడు. మనిషి సాటి మనిషి పట్ల కూడా ప్రేమ, దయ, జాలి, కరుణ ఏ మాత్రం కూడా చూపడం లేదు. మనిషి తన స్వార్థం కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా వెనుతీయడం లేదు. అట్లాంటి మనిషి వింత వ్యక్తిత్వం, అహంకారం చూసిన తర్వాత నేను నా జీవితంలో స్వయంగా అనుభవించి దేవుడా నీతో ఈ నాలుగు మాటలు నా హృదయం నుండి వచ్చిన పలుకులు మాట్లాడుతున్నాను. నా హృదయంలో దేవుడు అంటే అత్యంత విశ్వాసం ఉంది. నేను దేవుడి యొక్క శ్రేయోభిలాషిని. దేవుడా నీ మంచి కోరి చెబుతున్నాను. దేవుడా నువ్వు మాత్రం ప్రేమలో అసలు పడకు. దేవుడా నీవు ఆమె మాటలు నమ్మవద్దు. దేవుడా నీవు ఆమె ప్రేమలో పడవద్దు. దేవుడా ఒకవేళ అనుకోకుండా ప్రేమలో పడితే ఆమె చేసిన చేష్టల వల్ల నీ మంచి హృదయం గాయపడుతుంది. ఆమె నా పట్ల చేసిన ద్రోహం గురించి తలుచుకొని బాధపడుతున్నాను. దేవుడా నీ మంచి కోరి చెబుతున్నాను. నేను చెప్పినట్లు దేవుడా నా మాటలు మనసు పెట్టి విను అని చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెతో ప్రేమలో విఫలమైన నేను బాధతో కాలం గడుపుతున్నాను. నేను మరణించాక దేవుడా నీ దగ్గరికే వస్తాను. దేవుడా ఆమె మాయమాటలు నమ్మి ఆమెను ప్రేమిస్తావు. ఆమె నిన్ను అర్ధాంతరంగా వదిలి వేస్తే నీవు ఎవరి వద్దకు వెళతావు చెప్పు? అని ప్రశ్నించడం సమాజంలో ప్రేమ పేరిట జరుగుతున్న మోసం గురించి చెప్పిన తీరు కలవరం కలిగిస్తుంది. ఇవ్వాళ ప్రేమలో పడిన ప్రేమికులు జీవితంలో అన్యోన్యంగా అనురాగంతో ఆప్యాయంగా కలిసి ఉండటం లేదు. మూడునాళ్ళ మురిపంగా కొన్నాళ్లకే ఆమె అతనిలోని లోపాలను వెతికి అతని విడిచి వెళ్లిపోవడం బాధను కలిగిస్తుంది. అతడు ఆమె ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు. ఆమె అతని పట్ల గల ప్రేమ, అనురాగం మరిచిపోయి మరొకనితో జంటగా కలవడం ఆమె అతని పట్ల ప్రవర్తించిన తీరు వల్ల అతని జీవితంలో విషాదం ఏర్పడింది. అందుకే మనసారా ప్రేమించినప్పటికి ఆమె చేసిన ద్రోహం వల్ల కలత చెంది దేవుడా నువ్వు మాత్రం వగలమారి అమ్మాయి ప్రేమలో పడకు, దేవుడా తర్వాత నువ్వు నాలాగే బాధపడతావు అని చెబుతున్నాడు. నేను ఆమెతో ప్రేమ మోజులో తిరగలేదు. నేను ఆమెను పవిత్రంగా ప్రేమించాను. నా ప్రేమలో ఏ దోషము లేదు. నేను నిర్దాక్షిణ్యంగా ఆమె ప్రేమను కోల్పోయాను. నేను మరణించాక దేవుడా చివరికి నీ దగ్గరికే వస్తాను. మరి దేవుడా ఆమె కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి పోతావు చెప్పు? అని ప్రశ్నించడం కవి గుల్జార్ షాయరీలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

షాయరీ-12:

గుల్జార్ ఉర్దూ భాష ప్రాశస్త్యాన్ని తెలుపుతూ రాసిన ఈ షాయరీ కవిత అద్భుతం. ఒక్కసారి మనసు పెట్టి దృష్టి సారించి గుల్జార్ రాసిన ఈ షాయరీ చరణాల్లోకి వెళ్లి అద్భుతమైన లోకాల్లోకి విహరించండి. అనంతమైన, అనుభూతులను సొంతం చేసుకోండి.

‘మీరే చెప్పండి..?
ఇదెక్కడి మోహబ్బత్ నాకు ఉర్దూ అంటే..?
నోట్లో కమ్మగా ఊరుతూ..
కరిగిపోయే పాన్ మధుర రసంలా
ఉంటాయి కదా మరి ఈ ఉర్దూ పదాలు!’

ఉర్దూ భారతదేశంలో జన్మించిన భాష. భారతదేశంలోని 23 అధికారిక భాషలలో ఉర్దూ కూడా ఒకటి. ఉర్దూ భాషకు మాతృక ఖరీబోలి లేదా హిందుస్థానీ. ఉర్దూకు లష్కరి, రీఖ్తి అని ఇతర

నామాలు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలోని ముస్లింలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లోని పట్టణ ప్రాంతాల ముస్లింలు, పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల ప్రజలు, ముస్లింలు మాత్రమే కాకుండా సింధీలు, సిక్కులు, హిందువులు కూడా ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతారు.

గుల్జార్ ఈ షాయరీని చదివే పాఠకులకు ‘మీరే చెప్పండి’ అని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఉర్దూ భాష గురించి తనకు ఆసక్తి ఎలా ఏర్పడింది? ఉర్దూ భాష పట్ల తనకు ఇదెక్కడి అభిమానం, ప్రేమ అంటూ పాఠకులను ప్రశ్నిస్తున్నాడు. ఉర్దూ భాష పేరు చెప్పగానే తన నోటి నుండి లాలాజలం కమ్మని పదార్థం రుచి చూసినట్లు ఊరుతుంది. ఇదేమిటి ఇలా నేను నోరు తెరిచి మాట్లాడగానే తన లోపలి నుండి ఎందుకో అసంకల్పితంగా జాలువారిన ఈ ఉర్దూ పదాలు ఆశ్చర్యం గొలిపే విధంగా ఉబికి వస్తాయి. తనలో నుండి వచ్చే ఉర్దూ పదాలు నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాన్ తీయని తేనె రసంలా ఉంటాయి. గుల్జార్ ఉర్దూ భాషా పదాలు ఎంతో తీయగా మధురంగా ఉంటాయి అని చెప్పడం చక్కగా ఉంది.

‘అసలు ఈ మోహం ఏంటి నాకు
ఉర్దూ అంటే..?
మైకం కమ్ముకుంటుందెందుకు ఉర్దూ
మాట్లాడేటప్పుడు?
చిక్కనైన కశ్మీరీ ఖీమాం పాన్ గాఢత లాగా
నోట్లో కలుస్తూ.. కలుస్తూ ఉండగానే
భిన్నమైన భావాల అర్థాలను
మనోహరంగా విరజిమ్ముతుంది.’

మనకు అందుబాటులో లేని దానిని అనుభవించాలన్న కోరికనే మోహం అంటారు. మంచి కోరికలను సన్మార్గంలో తీర్చుకొనుట సముచితమైనది. మనిషి చెడు కోరికలను తీర్చుకోవాలనే కాంక్ష, దుర్మార్గ ప్రవర్తనకు, చెడు వ్యసనాలకు గురిచేస్తుంది. కావున మనిషి మోహాన్ని జయించుట అవసరం అని పురాణాలు చెబుతున్నాయి.

హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషిలో ఆరు గుణాలు ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మానవులు ఈ షడ్గుణాలకు అతీతంగా జీవించాలని వాటి బలహీనతకి గురికాకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అతను తనలో తాను అనుకుంటున్నాడు. అసలు తనకు ఉర్దూ భాష పట్ల మోహం ఎలా కలిగింది? అని ప్రశ్నించుకుంటున్నాడు. ఉర్దూ భాషలో మాట్లాడేటప్పుడు తనలో తెలియని మైకం ఎందుకు కమ్ముకుంటుంది? అని ఆలోచిస్తున్నాడు. కాశ్మీరీ ఖీమాం పాన్ మన పాన్ ప్రియులైన భారతీయులు చాలా ఇష్టంగా తింటారు. కాశ్మీరీ ఖీమాం పాన్ నోట్లో వేసుకోగానే కరిగిపోయి తీయని మధురమైన ఊటలు వచ్చినట్లుగా తప లోపల నుండి ఇంపైన ఉర్దూ పదాలు వస్తాయి. ఎందుకో తనలో నుండి వచ్చిన ఉర్దూ భాషా పదాలు భిన్నమైన భావాలతో కూడి చెప్పలేని అనుభూతులను కలిగిస్తూ మనోహరమైన అర్థాలను ఇస్తాయని అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘అంతెందుకు?
ఉర్దూ
మాట పెదవులని తాకిన వెంటనే..
తీయని ద్రాక్షా రసం..
గొంతులోకి
గుక్కిళ్ళు దిగుతున్నట్లే ఉంటుంది.’

అతను ఉర్దూ భాష గురించి ప్రస్తావిస్తూ అంతెందుకు? అని ప్రశ్నించడం ఆశ్చర్యం కలుగుతుంది. ఉర్దూ అనే మాట పెదవులని తాకిన వెంటనే తనలో తెలియని అదో రకమైన అనిర్వచనీయమైన అనుభూతి తీయని ద్రాక్షారసంలా ఎంతో మధురంగా గొంతులోకి దిగుతుంటే కలిగే హాయి చెప్పనలవి కాదు. అలాంటి దివ్యమైన ద్రాక్షా రసం గొంతులోకి చేరగానే ఎంతో తీయగా మధురమైన గాఢత మనసులో కలుగుతుంది అని ఉర్దూ భాషలోని గొప్పతనం, తీయని ద్రాక్షారసం గొంతులోకి దిగుతున్నట్లే ఉంటుంది అని కవి గుల్జార్ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

‘నిజం చెప్పాలంటే.,
ఏదో ఉత్కృష్టమైన గుణం ఉందీ
ఉర్దూలో..
మాట్లాడే మనిషికి,
పకీరుతనంలో కూడా నవాబు
దర్పాన్నిస్తుంది!’

సత్యాన్ని నిజాయితీ త్యాగాలతో పాటు ఆచరణలో పెట్టాలి. పాఠకుడికి ప్రేరణ కలిగించే గొప్ప విషయం ఉర్దూ భాషలో దాగి ఉంది. ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేయాలని అలా చేసిన పనికి సత్ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగి ఉండి ఇతరులకు మేలు చేయకపోవడం ఉపయోగపడకుండా ఉండడం అనేది ప్రకృతి సహజత్వానికి విరుద్ధం అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే అని ప్రారంభించి పాఠకుడిలో ప్రేరణ కలిగిస్తూ ఏదైనా ముఖ్యమైన విషయం ఉర్దూ భాషకు సంబంధించినది అయి ఉంటుంది. ఏదో తెలియని గొప్ప గుణం ఉర్దూ భాషలో దాగి ఉంది. అందుకే ఉర్దూ భాషా ప్రేమికుడిగా తనలో కలిగిన ప్రేమపూరితమైన భావాలను షాయరీ ద్వారా చాటుతున్నారు. ఈ లోకంలో ఉర్దూ భాషను మాట్లాడే మనిషికి గొప్ప సుగుణాలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఉర్దూ మాట్లాడే మనిషి పకీరు అయినప్పటికీ అతని పకీరుతనంలో కూడా నవాబుకు ఉన్నంత దర్జా, దర్పం కనబడుతుంది అని వ్యక్తం చేయడం చక్కగా ఉంది. కవి గుల్జార్ ఉర్దూ భాషను మాట్లాడుతూ భిక్షాటన చేసే పకీరులో కూడా నవాబుతనం దర్శనమిస్తుందని కొనియాడడం గొప్పగా ఉంది. ఇది ఉర్దూ భాష యొక్క గొప్పతనం పట్ల గుల్జార్‌కు కల అపారమైన ప్రేమాభిమానాలను తెలియపరుస్తున్నది.

‘అరుదుగా పదాల అర్థం
దొరక్కపోవచ్చేమో కానీ.. బలమైన
గొంతుతో మాట్లాడామనుకోండి.,
ఇంకా చూసుకోండి..
పుష్కలమైన., గంభీరమైన పదాల
వొరవడిలో ఉరకలెత్తుతుంది ఉర్దూ!’

అతను ఉర్దూ భాష గొప్పతనం గురించి తనలో కలిగిన అనుభూతులను షాయరీ ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. తనలో కలిగిన ఉర్దూ భాషలోని భావావేశాన్ని పాఠకులతో పంచుకుంటున్నాడు. అతడు ఉర్దూ భాషలో మాట్లాడుతుండగా కొన్ని పదాల అర్థం తెలియనప్పటికీ ఉవ్వెత్తున ఉబికి వచ్చే గంభీరమైన పదాల ప్రవాహంతో ఉర్దూ భాష పరుగులు తీస్తుందని కవి గుల్జార్ చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘ఎక్కడో దూరాల నుంచి..
గాలిలో ఒక ఉర్దూ గజల్.,
పోనీ ఒక షాయరీ వినిపిస్తూ
ఉందనుకోండి.,
అప్పుడిక ఎలా
ఉంటుందనుకుంటున్నారు?
శీతాకాలపు చలిలో వారగా
తెరుచుకున్న కిటికీలోకి., వెచ్చని
సూర్యకాంతి వొలికిపోతున్నట్లే
ఉంటుంది!’

అదొక మారుమూల పల్లె. ఎక్కడో చాలా దూరం నుంచి చెవులకు మధుర మనోహరంగా మంద్ర స్వరంతో చక్కనైన పాట వినపడుతోంది. ఉషోదయం వేళ ప్రకృతి పులకరించి ఉవ్వెత్తున వీచిన పైరగాలి నుండి ఒక ఉర్దూ గజల్ వీనుల విందుగా వినిపిస్తూ ఉంది. అదే సమయంలో మధురంగా ఒక షాయరీ కవిత వినిపిస్తూ ఉందనుకోండి. అప్పుడు గజల్ మరియు షాయరీ కవిత వినిపిస్తున్న క్రమం ఎలా ఉంటుందనుకుంటున్నారు? అని పాఠకులను ప్రశ్నిస్తున్నాడు. అతను తనలో కలిగిన అనుభూతికి తనే సమాధానం కూడా చెబుతున్నాడు. శీతాకాలపు చలి ఉధృతంగా ఉంటుంది. అలాంటి చలికాలంలో మనోహరమైన ఉర్దూ గజల్, షాయరీ కవిత వినిపిస్తే తెరుచుకున్న కిటికీలోకి వెచ్చని సూర్యకాంతి ప్రసరించినంత ఆనందంగా ఉంటుందని కవి గుల్జార్ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

‘ఎంతో
ఆశ్చర్యచకితమైనదీ.. అద్భుతమైనదీ
ఉర్దూ అంటే.. అలా
నెమ్మదిగా.. పరధ్యానంగా.,
గల్లీలో నడిచిపోతున్న ఒక ఊరు,
పేరు తెలియని బాటసారి.,
అదాటున ఒక మీర్జా గాలిబ్ షేర్
అందుకొని.., మత్తులో ఉన్నట్లు
మైమరిచి పాడేస్తుంటాడు!’

ఆశ్చర్యాన్ని కలిగించే వైవిధ్యమైన భావాలతో కూడి ఉర్దూ భాష అలరిస్తుంది. ఉర్దూ భాషలోని అసాధారణమైన భావాలు వినినప్పుడు మనస్సు ఆశ్చర్యంతో నిండిపోతుంది. ఉర్దూ భాష విలక్షణమైనది. అది పాఠకుల మనస్సులను రంజింపజేస్తుంది. ఉర్దూ భాష యొక్క సాహిత్యం నిజమైన కళాత్మకతతో కూడుకుని ఉంది. నిజంగా ఉర్దూ భాష ఒక అద్భుతం అని చెప్పటంలో సందేహం లేదు. అతను ఎవరో కానీ ఎలాంటి చింత లేకుండా నెమ్మదిగా తన దారిలో తాను సాగిపోతున్నాడు. అతను పరధ్యానంగా పల్లెలోని గల్లీలో నడిచిపోతున్నాడు. అతను ఒక ఊరు పేరు తెలియని బాటసారి. అతనికి తెలియకుండానే ఒక మీర్జా గాలిబ్ షేర్‌ను ఎత్తుకొని అందులో లీనమై మైమరిచిపోయి పాడుతుంటాడు అని కవి గుల్జార్ షాయరీ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘అప్పుడతగాడు.. అపరిచితుడే
అయినప్పటికీ ఈ దేశానికి
పరాయి వాడు ఎట్లా
అవుతాడు.. చెప్పండసలు?
నా మాతృభూమికి చెందినవాడే
అవుతాడు కదా!’

అతడు ఊరు పేరు తెలియని బాటసారి. అతను ఎవరికీ తెలియని వ్యక్తి అపరిచితుడే. అయినా అతడు ఈ దేశానికి చెందిన వాడు కాక పరాయి వాడు ఎట్లా అవుతాడు? అతడు మన దేశానికి చెందినవాడు అవుతాడు కదా అని గుల్జార్ పాఠకులకు తెలియజేస్తున్నారు. అతను తన దేశం యొక్క మాతృభూమికి చెందిన వాడు అవుతాడు కదా అని కవి గుల్జార్ పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించడం అద్భుతంగా ఉంది.

ఏ దేశంలో అయితే పుట్టి ఉంటాడో, అది అతని మాతృభూమిగా పరిగణిస్తాం. అతను పుట్టినటువంటి ప్రదేశం ఈ నేల కాబట్టి ఇదే అతని మాతృభూమి. మన జీవనానికి ఆధార భూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవడం భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. అంటే కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కంటె మిన్న అని చెబుతారు. జన్మనిచ్చిన తల్లి నవ మాసాలు మోస్తుంది. జన్మభూమి మనలను జీవితాంతం మోస్తుంది. మన జీవితాలకు ఆధారం జన్మభూమి అవుతుంది. అతను ఉర్దూలో రాసిన గాలిబ్ షేర్ అద్భుతంగా పాడినాడు. అతడు ఎవరో తెలియని బాటసారి అయినప్పటికీ పరాయి వాడు ఎట్లా అవుతాడు అని కవి గుల్జార్ షాయరీ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘సౌందర్యవంతమైన అల్పాజ్లతో, షేర్,
షాయరీలు.. టుంరీలు, గజళ్ళతో
సభ్యమైన.. వినమ్రమైన పదాలతో..
సంపద్వంతమై పరిమళించిపోయే
ఉర్దూ వింటుంటే..
ఈ దేశం సంస్కృతీ.. నాగరికతల్ని
మోస్తున్న ఒక హిందుస్తానీ భాషా
వారధి ఈ ఉర్దూ అనిపించక
ఉర్దూ కాక., మరి
ఇంకేమనిపిస్తుంది..?
అపురూపంగా హృదయానికి
హత్తుకోవాలనిపించక ఇంకోలా ఎలా
అనిపిస్తుంది?
ఇక ఉర్దూ మోహబ్బత్ కాక
ఇంకేమవుతుంది??’

ఉర్దూ కవిత్వంలో అల్పాజ్లతో, షేర్, షాయరీలు, టుంరీలు, గజళ్ళతో మొదలగు వివిధ రూపాలతో కూడుకొని ఉర్దూ భాష సౌందర్యవంతమై విలసిల్లుతుంది. ఉర్దూ పదాలు భాషకు పరిమళమద్దినట్లు సొగసును శోభను చేకూరుస్తున్నాయి. భారతదేశ సంస్కృతి నాగరికతలలో ఉర్దూ భాష ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందుస్తానీ భాషా వారధిగా ఉర్దూ భాష పేరుగాంచడం విశిష్టత అని చెప్పవచ్చు. ఉర్దూ భాషా సౌందర్యమును అపురూపంగా హృదయానికి హత్తుకోవాలనిపించే భావాలతో అలరారుతూ ఉంది. ఎంతో విశిష్టత గల ఉర్దూ భాష పట్ల ప్రేమ పొంగిపొరలడం భాషాభిమానులకు పాఠకులకు సహజం అని చెప్పవచ్చు. కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావాలు అద్భుతం.

~

కవి గుల్జార్ చిక్కని, చక్కని భావాలను తన పదాలలో అందంగా, పొందికగా ఇమిడ్చిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here