కాజాల్లాంటి బాజాలు-139: వదిన పెట్టే వింత బిజినెస్

4
3

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే వదిన వాట్సప్‌లో చాలా పేద్ద మెసేజ్ పంపించింది. ఉదయాన్నే అంత భారతం చదవడానికి టైము లేదనుకుంటూ నా పనిలో పడిపోయేను.

నేనింకా తను పంపినది చదవలేదని మళ్ళీ వెంటనే చిన్న మెసేజ్.. ముందుది చదివి వెంటనే సమాధాన మిమ్మని.

తనకేంపోయిందీ.. ఏవైనా చెప్తుంది.. పొద్దున్నే అష్టావధానం చేస్తున్న నేను అంత మెసేజ్ ఎక్కడ చదవగలనూ!

అందుకే అసలు వినిపించుకోనట్టు పనిలో మునిగిపొయేను.

వదినా ఊరుకునేదీ.. ఫోన్ చేసింది. ఇంక నాకు ఆ ఫోన్ ఎత్తక తప్పలేదు.

“ఏంటి వదినా పొద్దున్నే!” అన్నాను విసుగ్గా.

“రోజూ ఉండే పనే కదా! కొత్త సంగతి వచ్చినప్పుడు వెంటనే తెల్సుకోవద్దూ!”

“ఏంటో ఆ కొత్త సంగతి!”

“మా కాంతమ్మొదిన అల్లుడి తమ్ముడు పెళ్ళి కున్నాడు కదా! అతను తనకి ఎలాంటి అమ్మాయి కావాలో ఒక లిస్ట్‌లా రాసి అందరికీ పంపిస్తున్నాడు. నాకు ఇప్పుడే వచ్చింది. అది కొత్తగా అనిపించి నీకు ఫార్వార్డ్ చెసేను. వెంటనే చదివి దానిమీద నీ అభిప్రాయం చెప్పు!”

“తుంటిమీద కొడితే పళ్ళు రాలాయన్నట్టూ ఎక్కడో మీ కాంతమ్మొదిన అల్లుడి తమ్ముడికి కావల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకుంటే నాకెందుకు! అయినా ఎన్నిసార్లు చెప్పేను నీకూ ఇలా పొద్దున్నే నా బుర్ర తినొద్దనీ!”

“హూ.. సర్లే.. నీకు బాగా తీరుబడి అయ్యేకే చదువు. అప్పుడు మటుకు ముందే ఎందుకు చదవలేదా అనుకుంటావు!” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన.

ఇంకక్కణ్ణించి నా ఆలోచనలు పరిపరివిధాల పోయేయి. అందులో ఆ కుర్రాడు ఏం రాసినట్టూ.. నా దగ్గర పెళ్ళి కెదిగిన ఆడపిల్లలు ఎవరూ లేరే.. మరింక తొందరగా చూడకపోతే నాకొచ్చే నష్టమేమిటీ!

అయినా ఇప్పుడు రోజులెలా ఉన్నాయంటే “అదిగో పులీ, ఇదిగో తోక” అన్న సామెత పాతదయిపోయి “అదిగో గాలి ఇదిగో పోగెయ్” అనే కొత్త సామెత వచ్చినట్టుంది.

ఈ మధ్యనే మా ఊళ్ళో ఒకళ్ళింట్లో దేవుడి పటంలోంచి విభూతి పడినట్లు ఫొటో పెడితే అది నిమిషాల్లో ప్రపంచమంతా తెల్సిపోయింది ఈ వాట్సప్ వల్ల. ఏవుందీ.. చదివినా చదవకపోయినా ఆ మెసేజ్ మీద ఒక క్లిక్ చేసి ఓ గ్రూప్‌లో పడేస్తే చాలు.. అదింక అలా చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇప్పుడు ఈ మెసేజ్ కూడా అంతే అయుండాలి. ఇదివరకు అమ్మలక్కల్లాగ పనిలేనివాళ్లందరూ తీరుబడిగా కూర్చుని ఇలాంటివి ఫార్వార్డ్ చేసుకుంటుంటారు. అయినా ఆ కాంతమ్మొదిన అల్లుడి తమ్ముడికి ఎలాంటి అమ్మాయి కావాలో తెల్సుకోవాలని వీళ్ళందరికీ ఎందుకింత ఆత్రం. నాకు కోపం, విసుగూ కలిసి వచ్చేస్తున్నాయి.

ఛ.. ఈ వదినెప్పుడూ ఇంతే.. తను స్థిమితంగా కూర్చోదూ, నన్ను కూర్చోనియ్యదూ అని విసుక్కుంటూ స్టవ్వు మొత్తం ఆపేసి, గిన్నెలన్నింటి మీదా మూతలు పెట్టి, డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వదిన పంపిన మెసేజ్ తీసి చదవడం మొదలుపెట్టేను.

ఫార్వార్డెడ్ మెనీ టైమ్స్.. అన్నదాని కింద మెసేజ్ ఇలా ఉంది..

నా పేరు అచ్యుత్. నాకు ఇరవై ఎనిమిదేళ్ళు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నాను. మా తల్లితండ్రులు ఎప్పుడో అమెరికా వచ్చి స్థిరపడిపోయేరు. నేను ఇక్కడే పుట్టేను కనక అమెరికన్ సిటిజెన్‌నే.

ప్రస్తుతం నేను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను కనక నా ఉద్యోగం వదులుకుందుకు సిధ్ధంగా ఉన్నాను.

అదేంటీ అని ఆశ్చర్యపోకండీ.. ఈ కిందది చదివితే మీకు విషయమంతా అర్థమవుతుంది.

మంచి క్వాలిఫికేషన్ ఉన్నందువల్ల నేను ఇరవై మూడో యేటే జాబ్‌లో జేరాను. అప్పట్నించీ కంపెనీలు మారుతూ ఏడాది క్రితం ఇక్కడ చేరేను. కంపెనీ విషయంలో కానీ, పని విషయంలో కానీ నాకు ఎలాంటి పేచీ లేదు. అంతా సాఫీగానే ఉంది. కానీ ఇంక పెళ్ళి చేసుకోవాలి అనుకున్న దగ్గర్నించీ నాకు మొదలయ్యాయి సమస్యలు.

అమెరికాలో ఉన్నాను కనక ఇక్కడే పుట్టి పెరిగిన కొంతమంది ఇండియన్ అమ్మాయిలతో డేటింగ్ చేసేను.

ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఈ కింది విషయాలు తెలిసేయి..

వాళ్ళకి కాబోయే భర్తలో వారు కోరుకునే లక్షణాలు..

  1. వాళ్లకి కావల్సినది జీవితం పంచుకునే భాగస్వామి కాదూ బోలెడు సంపాదించి చేతిలో పోస్తూ, కేవలం ఆర్థికంగా తమని పెద్ద అంతస్తులో ఉంచే పేద్ద ఉద్యోగి,
  2. తమకన్న పెద్ద చదువూ, అంతకన్నా పెద్ద ఉద్యోగమూ ఉండడమే కాకుండా ఒడ్డూపొడుగూ ఉండి, కేవలం తమ కన్న ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే పెద్దగా ఉండే వరుడు,
  3. తాము కోరినవన్నీ, కొనిస్తూ, వీకెండ్స్‌కి పార్టీలకి తీసికెడుతూ, మధ్యమధ్యలో విహారయాత్రలు చేయిస్తూ ఉండే సరదా మనిషి,
  4. వాళ్ళు కూడా ఉద్యోగం చేసి అలిసిపోయి వస్తారు కనక ఇంటి కొచ్చేక వాళ్ళు ఇంటిపనులేమీ చెయ్యకుండా రిలాక్స్ అవమనే జాలిగుండె గల మనిషి,
  5. అస్తమానం ఇది వండూ, అది వండూ అనకుండా తనకి కూడా ఇష్టమైనవి వండి పెట్టే వంటొచ్చిన మనిషి,
  6. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమీ అడగకుండా, వాళ్ళు బైటకి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఏడిపించకుండా ఆడించే కేర్ టేకర్,
  7. సరే, వీటన్నింటితో పాటు పుట్టిన్రోజులకీ, పెళ్ళిరోజులకీ ఖరీదైన సర్ప్రైజు గిఫ్టులు ఇచ్చే ప్రేమికుడు,
  8. రేప్పొద్దున్న ఇద్దరికీ సరిపోక విడిపోతే వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలోకూడా ముందుగా అగ్రిమెంట్‌లో రాసిచ్చే పెద్దమనిషి,
  9. ఆమె జీతం ఆమె ఇష్టం. వాళ్ళమ్మా నాన్నలకి ఇచ్చినా, ఎలా ఖర్చుపెట్టుకున్నా అడక్కూడని విశాలహృదయుడు,

ఇలా వాళ్లతో మాట్లాడినప్పుడు ఇంకా ఇలాంటివి వాళ్లకి చాలా కావల్సినట్టు అనిపించింది.

ఇదంతా చూసాక నా అంతట నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకవేళ నేను పెళ్ళి చేసుకోవాలీ అనుకుంటే కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోక తప్పదనిపించింది.

ఇప్పుడు నేను నాకు కావల్సిన అమ్మాయి ఎలా ఉండాలో చెపుతాను. అలాంటి అమ్మాయి లెవరైనా ఇష్టమైతే నన్ను కాంటాక్ట్ చెయ్యండి.

  1. నేను ఏ ఉద్యోగమూ చెయ్యను. ఇంట్లో ఉండి వేళకింత వండి పెడుతూ, ఇల్లు నీట్‌గా ఉంచుతాను. నన్ను కూడా తన జీతంతోనే నా భార్య పోషించాలి.
  2. నేను బైట కెక్కడికీ వెళ్లను. నాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు. నెలకొకసారి నాకు ఓ కొత్త వీడియో గేమ్ కొనిస్తే చాలు.. దానితో ఇంట్లోనే కాలక్షేపం చేసుకుంటాను.
  3. బైటకి వెళ్లను కనక నాకు బట్టల ఖర్చూ, ఆడవారి కుండే మేకప్ ఖర్చూ ఉండవు.
  4. పిల్లలంటే నాకు ప్రాణం. కనివ్వడం వరకే నా భార్య పని. తర్వాత వాళ్లని నా ప్రాణంలా చూసుకుంటాను.
  5. మా అమ్మానాన్నలు నా మీద ఆధారపడిలేరు కనక వాళ్ళు నా ఇంటికి రారు. నా భార్య అక్కడికి వెళ్ళక్కర్లేదు.

పై సంగతులన్నీ చదువుకుని, నన్ను పోషిస్తూ, నేను మిస్టర్. పెళ్ళాంగా ఉండడానికి ఇష్టపడే అమ్మాయి లెవరైనా నన్ను సంప్రదించవచ్చు.

పైన ఉన్న మెసేజ్ చదివేసరికి నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఆడపిల్లలు సంఖ్యలో తక్కువున్నారూ, అందుకని పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళ డిమేండ్లు పెరిగేయీ అని విన్నాను.

ఇన్నాళ్ళూ పితృస్వామ్యంలో నడిచిన ఈ సమాజంలో వస్తున్న మార్పులకి ఒక ఆడదానిగా చాలా సంతోషించేను. కానీ ఆ మార్పు ఇంతగా వివాహ వ్యవస్థ రూపురేఖలనే మార్చేసేటంత వెర్రి తలలు వేస్తుందని అనుకోలేదు.

చదివినదాని గురించి మంచిచెడ్డలు చర్చించడానికి వదినకి ఫోన్ చేసేను. వదిన వెంటనే పలికింది.

“ఇదేంటి వదినా! అమ్మాయిలు ఇలా మాట్లాడుతున్నారా!” ఆశ్చర్యంగా అడిగేను.

“తర్వాత ఆశ్చర్యపోదువుగాని కానీ, ముందు మనం ఏం చేద్దామో చెప్పు.” అంది వదిన.

“మనమేం చేస్తాం! నీకూ నాకూ పెళ్ళి కెదిగిన పిల్లలు లేరు కదా!” అన్నాను.

“అయ్యో స్వర్ణా.. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేవిటీ! దీనిని మనం మంచి బిజినెస్ చేసుకోవచ్చు”.

“బిజినెస్సా!”

ఆశ్చర్యపోవడం నా వంతయింది.

వదిన దృఢంగా చెప్పింది.

“యెస్. ఇలాంటి అమ్మాయిలనీ, అబ్బాయిలనీ చేర్చుకుంటూ మనం ఒక మేరేజ్ బ్యూరో పెడదాం. కాలంతోపాటు మారాలి. పాత బ్యూరోలన్నీ పేకేజీలూ, గోత్రాలూ, జాతకాలతో నడుస్తున్నాయి. అవన్నీ ఔట్ డేటెడ్. ఇప్పుడు పిల్లలు ఇలాగే మాట్లాడుతున్నారు. మనం ఇలా కొత్తగా పెడితే బోల్డు మంది అమ్మాయిలూ, అబ్బాయిలూ చేర్తారు. రిజిస్ట్రేషన్ ఓ అయిదువేలో పదివేలో పెట్టేమనుకో.. ఈ రోజుల్లో డబ్బు కెవడు చూసుకుంటున్నాడు.. ఇంక మనకి డబ్బే డబ్బు. ఏవంటావ్!”

ఏవంటానూ! వదిన ప్రపోజల్ కి కింద పడకుండా ఉండడమే కష్టమయితేనూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here