సిరివెన్నెల పాట – నా మాట – 33 – రసజ్ఞత నిండిన పాట

2
10

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

అమ్మ బ్రహ్మదేవుడో..

~

చిత్రం: గోవిందా గోవిందా

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: రాజ్, కోటి

గాత్రం: ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్ర, మాల్గాడి శుభ బృందం..

~

పాట సాహిత్యం

ఆమె 1 : హుయ్ డమ్ కేయ్ డుమ్ డుమ్ డిగా సందడి చేయ్ తమాషగ అంగరంగ వైభోగంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా హుయ్.. దరువేయ్ తథినకా అడుగేయ్ రా అదీ లెక్క సామిరంగ సిందాడంగా శీనయ్య ఏడుకొండలు దిగి కిందికి రాగా

 

పల్లవి :

ఆమె 1 : హుయ్ డమ్ కేయ్ డుమ్ డుమ్ డిగా సందడి చేయ్ తమాషగ అంగరంగ వైభోగంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా హుయ్.. దరువేయ్ తథినకా అడుగేయ్ రా అదీ లెక్క సామిరంగ సిందాడంగా శీనయ్య ఏడుకొండలు దిగి కిందికి రాగా
పల్లవి:
అతడు: అమ్మ బ్రహ్మదేవుడో
కొంపముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యాడ దాచినావురో
పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో
ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసివుంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెందివుంటదా
చరణం:
అతడు: కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనకిప్పుడు ఎదరున్నది కల్లైపోదుగా
ఆమె2 : ఓహో హో ఓహో ఓహో ఓహో
కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనకిప్పుడు ఎదరున్నది కల్లైపోదుగా
అతడు: ఒకటై చిన్నాపెద్దా అంతా సుట్టూ చేరండి తకథై ఆటాడించి సోద్యం చూడండి
ఆమె 2: చంద్రుళ్ళో కుందేలు సందెల్లో అందాలు మనముంగిట్లో కథాకళీ ఆడేనా
అతడు : అసలు భూలోకం ఇలాంటి సిరి చూసివుంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెందివుంటదా
అమ్మ బ్రహ్మదేవుడో కొంపముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యాడ దాచినావురో
చరణం:
ఆమె2: మహాగొప్పగా మురిపించగ సరికొత్త సంగతి తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి ఓహో హో ఓహో ఓహో ఓహో
అతడు: మహాగొప్పగా మురిపించగ సరికొత్త సంగతి తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
ఆమె1: అపనా తనామనా కదం తొక్కే పదానా తపనా తనమనా తేడాలేవైనా
ఆమె2: తందానా తాళానా కిందైనా మీదైనా తలవంచేనా తెల్లార్లు థిల్లానా
అతడు: అసలు భూలోకం ఇలాంటి సిరి చూసివుంటదా,
కనక ఈ చిత్రం స్వర్గానికి చెందివుంటదా ॥అమ్మ బ్రహ్మదేవుడో॥

64 కళలలో, నృత్యము, గానము, సాహిత్యము వంటివి రసానందాన్ని కలిగించే ఉత్తమమైన లలిత కళలు. సాహిత్యం కూడా నవరసాలని అందిస్తూ, మనకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సాహిత్యంలో వర్ణనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతెందుకు? దేవతలకు మనం చేసి అర్చనలు, స్తోత్రాలు, సహస్ర నామాలు అన్నీ కూడా వర్ణనలే కదా!

దేవతా సౌందర్య వర్ణనలో, ‘సౌందర్యలహరి’, కంచి కామాక్షి దేవి సౌందర్యాన్ని మన మనసులో శాశ్వతంగా ముద్రించగల ఆదిశంకరాచార్యుల వారి సంస్కృత శతకం. అమ్మవారి ఒక్కొక్క అవయవ వర్ణనగా పైకి కనిపించే ఒక్కొక్క శ్లోకంలో, ఒక మంత్రం, ఒక యంత్రం, నిక్షిప్తమై ఉన్నాయట! శ్రీవిద్యాలహరిలో అమ్మవారు ఎలా వర్ణించబడిందో, ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది.

కోటి సూర్యప్రతీకాశం చంద్రకోటి సుశీతలం విద్యుత్కోటి సమానాభమరుణం తత్పరం మహః | నైవచోర్ధ్వం నతిర్వక్చ నమధ్యేపరిజగ్రభత్ ఆద్యంతరహితం తత్తునహస్తాద్యంగ సంయుతం | న స్త్రీరూప మధవాన పుంరూప మధోభయమ్॥

ఆమెను రూపుదాల్చిన నాలుగు వేదాలు స్తుతి చేస్తుండగా, కోట్లకొలది సూర్యుల యొక్క కాంతులతో, చంద్రుల యొక్క చల్లదనంతో, ఆ రూపము కొన్ని కోట్ల మెరుపుతీగలు ఒక్కసారి వచ్చినట్లుగా తళుక్కున్న మెరిసిందట. ..ఆ తేజస్సును చూడలేక, దేవతలంతా వేడుకోగా, అప్పుడు ఆమె మంచి యవ్వనంలో ఉన్న అందమైన కన్యగా, పరమేశ్వరిగా నాలుగు చేతులతో వారికి దర్శనమిచ్చిందట.

ఇక వాగ్గేయకారుల విషయాన్ని పరిశీలిస్తే, అన్నమయ్య, అలిమేలు మంగమ్మను, ఇతర దేవతా మూర్తులను ప్రస్తుతిస్తూ రాసిన అద్భుతమైన వర్ణనలు గల ఎన్నో పదాలు మనకు, భక్తి తత్పరతను పెంచుతూ, వీనుల విందు చేస్తాయి.

//ప//ఏమోకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెనో.. భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా..
//ప// ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి..
//చ// కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి..

‘భావకవిత్వంలో’ స్త్రీ హృదయాన్ని, అంతరంగాన్ని లోతుగా స్పృశిస్తే, ‘ప్రబంధ కవిత్వం’లో ఇంతి సొగసులు, అంగాంగ వర్ణనలు, శృంగార దశ ప్రధానంగా చిత్రీకరించడం జరిగింది. ప్రాచీన కవులు ఆదర్శ ప్రణయాన్ని వర్ణిస్తూ, స్త్రీని శృంగారమూర్తిగా చిత్రీకరించారు. మరికొందరు ద్వంద్వ విధాలుగా, ‘భావ సంధి’, కవిత్వాలను వ్రాశారు. నరకాసురుడిపై యుద్ధం చేసేటప్పుడు సత్యభామలో వీర రసాన్ని ఒకవైపు, కృష్ణునిపై తన చూపు నిలిపినప్పుడు శృంగార రసాన్ని మరొకవైపు, ఒకేసారిగా వ్యక్తికరించారు. ‘రాగబంధం’, కవిత్వ శైలిలో, ప్రకృతిని ప్రేయసిగా, కవి హృదయాన్ని పురుషుడిగా సంభావించుకొని ప్రకృతి వర్ణన చేయడం జరిగేది.

ఒకరిద్దరు ప్రబంధ నాయికల వర్ణన ఒకసారి చూద్దాం.

ఒక కన్యను ఎన్ని రకాల మనోహరంగా వర్ణించవచ్చో మహాకవి కాళిదాసు యొక్క శకుంతలను చూస్తే తెలుస్తుంది.

అనాఘ్రాతం పుష్పం, కిసలయమలూనం కరరుహై
రనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసమ్
అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి..

‘శకుంతల రూపం యింకనూ వాసన చూడని అప్పుడే పూసిన పూవు. మాయని, గోటితో గిల్లని క్రొత్త చిగురు. ఇంకనూ రంధ్రము వేయని తీర్చిన ముత్యము. ఇంకనూ తీపు చవి చూడని క్రొత్త పూదేనె. మనోహరమైన, పరిపూర్ణమైన పుణ్యాలకు ఫలము. అటువంటి శకుంతలననుభవించడానికి బ్రహ్మ యెవరికి రాసి పెట్టాడో నాకు తెలియకున్నది’ అని అంత వఱకు యెవ్వరునూ ముట్టనిది, ఎవరూ అనుభవించనిది, పుణ్యాలకు ఫలమైనది మొదలైన మధురమైన, భావాలతో శకుంతలను ఆయన తీర్చిదిద్దారు.

పెద్దనగారి వరూధిని వర్ణన:

అతడా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా న్విత మిచ్చోటని జేరబోయి కనియెన్ విద్యుల్లతావిగ్రహన్, శతపత్రేక్షణఁ, జంచరీక చికురన్, జంద్రాస్యఁ, జక్రస్తనిన్, నతనాభి, న్నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్.

వరూధినిని విద్యుల్లతావిగ్రహ అట. మెరుపుతీగలా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి మెరుపుతీగది

ఆమె చంచరీక చికుర. అనగా తుమ్మెదల వంటి నల్లని కేశపాశము కలదిట. ఆమె చంద్రాస్య చంద్రుని వంటి ముఖము కలిగినదట..

కొంతమంది ప్రముఖ కవులు వారి ప్రేయసిని కావ్య నాయికగా స్వీకరించి కావ్య రచన చేశారు.. మరికొందరు ప్రకృతిలోని అందాలనే వారి ప్రణయ ప్రేయసిగా చేసుకొని వర్ణించి వున్నారు..

ఉదాహరణకు నాయని సుబ్బారావు గారి ‘సౌభద్రుని ప్రణయ యాత్ర’ లోని వత్సల అనే ఆ కవిగారి ప్రేయసేనట..

అడవి బాపిరాజు గారు ‘శశికళ’ లో ఓ ఊహా సుందరినే అయిన ప్రేయసిగా కవిత్వీకరించారు..

~

విశ్వనాధ సత్యనారాయణ గారి ‘కిన్నెరసాని’ పాటలో ‘కిన్నెర’ అంటే ఒక వాగు. ఆ వాగునే ఆయన ప్రేయసిగా భావించారు..

కిన్నెర పుట్టుక ..
ఓహో కిన్నెరసానీ
ఊహామాత్రము లోపల
నేల నిలువవే జవరాలా.

కన్నులకును కనిపించెను
చిన్ని తరగ చాలువోలె ఓహో..
నీ యొయ్యారపు నడకలు
మాయురె కనిపించెను పో
మలకలుగా ప్రవహించిన
సెలయేటి భవన్మూర్తిని ఓహో..
నీ నవ్వులు నురుగులుగా
నీ వళులవి తరగలుగా
నీ కన్నులు మీనులుగా
నీ కరణిని ప్రవహించెదు ఓహో..
నీ జఘనము నిసుకతిన్నె
గా జూచిన నాకన్నులు
ఊడిపడవు నేలపైన..

ఇలా ఎన్ని హోయలతో మలుపులు తిరుగుతుంది కిన్నెరసాని.

~

ఇక ప్రకృతి సౌందర్యంతో మమేకమయ్యే, వనలక్ష్మి లాంటి, నండూరి సుబ్బారావు గారి – ఎంకి అందాలు ఒకసారి చూద్దాం.

చెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
మెల్లంగ వస్తాది నా యెంకీ!
సల్లంగ వస్తాది నా యెంకీ!

పచ్చన్ని సేలోకి పండు యెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె
వొయ్యారమొలికించు నా యెంకీ!
వొనలచ్చి మనిపించు నా యెంకీ!

~

ఇలా ఎందరో కవులు వారి ప్రేయసిని వివిధ రూపాలలో చూసుకుంటూ వారి శైలిలో ‘నభూతో న భవిష్యతి’లా ఎన్నో పద్యాలు, కావ్యాలు, రచనలు రాసారు.. నిజానికి ఆ వర్ణనలు వారికోసమే అన్నట్లుగా వుంటాయి..

తరువాత చెప్పుకోదగ్గది సినీగేయ సాహిత్యం, లలిత సంగీతం, (ప్రైవేట్ పాటలు). ఒకటి రెండు ప్రైవేట్ పాటలలో స్త్రీ వర్ణన ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ఆద్యంతము మధురంగా సాగే, దాశరధిగారి రచన, ‘తలనిండ పూదండ దాల్చిన రాణి’..

ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును బ్రోలునటే కొలనులొని నవ కమలదళమ్ములు నీ నయనమ్ముల పోలునటే ఎచట చూచినా, ఎచట వేచినా, నీ రూపమదే కనిపించినదే..
పల్లవి:
తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే 2
చరణం:
పులవానలు కురియు మొయిలువో
మొగలిరేకులలోని సొగసువో
నా రాణి తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే 2

~

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన..

నీలిమబ్బుల పడవలోనా
నేల దిగిన దేవకన్య
పల్లె పడుచై పుట్టినావో
వల్లె వాటును వేసినావో..

ఇలా, పాల బుగ్గల నునుపు, పాల గిన్నెల బిగువు, నల్ల తుమ్మెద జడ, తీగ నడుము.. వంటి ఉపమానాలతో హాయిగా అలా సాగిపోతుంది.

సినీగీత సాహిత్య విషయానికి వస్తే, ఒక కథా నాయిక, లేదా ఒక స్త్రీని ఇంతకంటే గొప్పగా వర్ణించడం సాధ్యమవుతుందా? అన్న చందాన, సినీ దిగ్గజ కవులంతా, ఎంతో అద్భుతమైన సాహిత్యాలను అందించారు. మచ్చుకు..

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో.. అని వేటూరి గారు కితాబిస్తే..
సాకీ:
ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో.. నా మదిలో నీవై నిండిపోయెనే..
పల్లవి:
ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో..
చరణం:
నీ రూపమే దివ్య దీపమై.. నీ నవ్వులే నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే..
అని, నాయిక అందాలకు మనోహరమైన ప్రశంసల జల్లు కురిపించారు దాశరధి..

~

ఇక సిరివెన్నెల గారి పాటల విషయానికి వస్తే, ఆయన నిండైన భావుకతతో, విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా, స్త్రీ స్థాయిని ఉన్నతంగా చూపిస్తూ, ఎన్నో సుమధురమైన గీతాల్ని , సినీ నేపథ్యానికి తగినట్టుగా రచించారు. ఈ క్రింది ‘మెచ్చుతునకలు’, ఆయన కవిత శిల్పానికి అద్దం పడతాయి.

అలవైకుంఠపురములో..

సామజవరగమనా నినుచూసి ఆగగలనా?
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు?..
మల్లెలమాసమా మంజులహాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా..

~

పౌర్ణమి చిత్రంలో..

మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే – నయగారమా గాలికే సంకెళ్లేశావే..

~

లాయర్ సుహాసిని చిత్రంలో..

దివిని తిరుగు మెరుపులలన-సామజవరగమనా
కరుణ కరిగి భువికి దిగెన- సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన- సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన- సామజవరగమనా

~

సుబ్బరాజుగారి కుటుంబం చిత్రంలో..

శ్రీనాథుడి ఒళ్ళో శృంగారం నువ్వై పుట్టిందో
ప్రాణం ఉంటే బంగారం నీలా ఉంటుందో
ఒంపుల్లో ఉందే ఒయ్యారి నెమలి
చంపేస్తూ ఉందే నా గుండె నమిలి
నువ్వే సరేనంటే సమస్తాన్ని సమర్పిస్తానే నారీ.

~

పెళ్ళిసందడి చిత్రంలో..

సౌందర్యలహరి సౌందర్యలహరి
సౌందర్యలహరి స్వప్నసుందరి –
నువ్వే నా ఊపిరి శృంగారనగరి స్వర్ణమంజరి –
రావే రసమాధురి వన్నెచిన్నెల చిన్నారి నీ జంటకోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కలనుంచి ఇలచేరి కనిపించు ఓసారి.. ..

~

నీ స్నేహం చిత్రంలో..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడి పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆమని మధువనమా..

~

గోవింద గోవింద చిత్రంలో..

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా..

~

ఇలా సిరివెన్నెల గారి పాటల్లో స్త్రీ వర్ణనను గమనిస్తే, ఎంతో లలితంగా, మనోహరంగా, ప్రకృతిలోని ఉపమానాలు తీసుకుంటూ, అవసరమైన చోట, అవసరమైన మేరకు అతిశయోక్తులు వాడుతూ, బూతు సాహిత్యానికి అల్లంత దూరంలో, హత్తుకునే శైలిలో ఉందని మనకు అర్థం అవుతుంది. ఆదిశంకరుల వారి సౌందర్యలహరి నుండి, కావ్య నాయికల వర్ణన, భావకవుల వర్ణన ఉపోద్ఘాతంగా తీసుకోవడానికి కారణం, సిరివెన్నెల శిల్పంలో కనిపించే భావ లాలిత్యం, భావ సౌకుమార్యం, అలాంటి వర్ణనలకు ఏమాత్రం తీసిపోలేదని చెప్పడం. అందుకే, ఆ విషయం అర్థం చేసుకోవడానికి కావలసినన్ని ఉపమానాలను సేకరించి ఈ వ్యాసంలో పొందుపరిచాను. దీనివల్ల ఆయన సాహిత్యం కావ్యాల, ప్రబంధాల స్థాయిలో ఉందన్న విషయం మనందరికీ స్పష్టమవుతుంది.

అందాల నటి శ్రీదేవిని వర్ణించే నేపథ్యంలో, వ్రాయబడిన, అయ్యొ! బ్రహ్మ దేవుడా! పాటలో ‘పూల రెక్కలు, తేనె చుక్కలు రంగరించి చేసిన బొమ్మ’ అన్న భావ ప్రకటన మనల్ని ఏదో ఊహాలోకాల్లోకి తీసుకువెళ్తుంది. ఆ సుందరి తప్పనిసరిగా దివినుండే దిగి వచ్చిందనీ, ఈ భూలోకంలో ఇప్పటిదాకా ఇలాంటి అందాన్ని చూడలేదని.. రాస్తారు.

ఎంతో ఉదాత్తమైన భావగాంధీర్యంతో, ఈయన వ్రాసిన పాటల్లో.. /ప్రాణమున్న పైడి బొమ్మ/ రసమాధురి/ శృంగార నగరి/ దివిని తిరుగు మెరుపు లలన/ మల్లెల మాసం/ మంజుల హాసం/ వన్నెల వనం/ తన అందంతో నేలకు నాట్యం నేర్పడం/ గాలికి సంకెళ్లు వేయడం/ఊహలే ఉలికి పడు ప్రాయం/ అందాల సెలయేరమ్మ/ శ్రీనాథుని ఒళ్ళో సింగారం నువ్వై పుట్టావో/.. వంటి రమ్యమైన ఉపమానాలు, వర్ణనలు, రసజ్ఞులను ఎంతో ఆకట్టుకుంటూ, ఆయన కవిత శిల్పానికి, రసజ్ఞతకు మనలను దాసోహం చేస్తాయి. సినీ సాహితీ ప్రస్థానంలో, ఆయన స్థాయి ఎంతో ఉన్నతంగా ఉందనీ, అది చిరస్థాయిగా నిలిచిపోతుందని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. రాబోయే తరాల వారు, ఈ పాటల ద్వారా, సాహిత్యాన్ని, సాహితీ విలువలను ఎంతో చక్కగా గ్రహించగలరు.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here