తల్లివి నీవే తండ్రివి నీవే!-20

0
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

నారద పరిష్కృతమ్

క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే

ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే

కేశవ! ధృత కచ్ఛప రూప!

జయ జగదీశ హరే!

మందర పర్వతాన్ని తన వీపుపై మోసిన వాడు, అలా మోస్తూ ఆ పర్వతము ఒక చక్రం లాగ తిరిగి సాగర మథనం ముందుకు సాగేలా చేసిన కూర్మావతారుడైన, జగదీశ్వరుడైన శ్రీహరికి జయము జయము.

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః॥

4) భూత భవ్య భవత్ ప్రభుః – భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.

5) భూత కృత్ – భూతములను సృష్టించిన వాడు. భూతములు అనగా సకల జీవరాశులు. పంచభూతములతో ఏర్పడినవి. మనందరి శరీరములు కూడా పంచ మహాభూతములైన పృథివ్యప్ తేజో వాయురాకాశములతో ఏర్పడినవే.

6) భూత భృత్ – జీవులందరిని పోషించు వాడు.

7) భావః – సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.

8) భూతాత్మా: – సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా ఉండువాడు.

9) భూత భావన: – జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.

ఇప్పుడు అసలైన విధానంలో పరిశీలిద్దాము.

– జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు ఎలా ఉంటాడు?

సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా!

– సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా ఉండేవాడు ఎవరు?

సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.

– సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు ఏమి చేస్తాడు?

జీవులందరిని పోషిస్తాడు.

– జీవులందరినీ పోషించువాడు అలా ఎంతకాలం చేయగలడు?

అనాది నుంచీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు, ఈ క్షణాన చేస్తున్నాడు. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాడు.

అలా ఎలా చెప్పగలవు?

Mathematical Induction.

ఒక్కసారి బ్రహ్మ గారు ఎలా వచ్చారో చూద్దాము. దానికన్నా ముందు Mathematical Induction అంటే ఏమిటో తెలుసుకుందాము.

Technical గా మాట్లాడితే..

Mathematical Induction is a technique of proving a statement, theorem or formula which is thought to be true, for each and every natural number n. By generalising this in form of a principle which we would use to prove any mathematical statement is ‘Principle of Mathematical Induction’.

అర్థాత్

గణిత శాస్త్రంలో ఏదైనా సిద్ధాంతం, వివరణ, సూత్రము మొదలైన వాటిని ఏ అనుమానమూ లేకుండా ప్రతి సహజ సంఖ్యకూ నిరూపించే పద్ధతి.

అంటే ఒక గణిత సూత్రం ఏదైనా తీసుకుని, తొలుత n = 1 అనే సహజ సంఖ్యకు అది నిరూపితమౌతుందో లేదో చూడటము. నిరూపితమైతే n = m అనే సహజ సంఖ్య దగ్గర అది నిరూపితమౌతుందో లేదో చూస్తాము. అక్కడ కూడా నిరూపితమైతే n = m+1 అనే ఆ తరువాత సహజ సంఖ్య దగ్గర నిరూపితమౌతుందో లేదో చూస్తాము. ఈ మూడు చోట్లా ఇది నిరూపితమైతే, ఆ సూత్రము సహజ సంఖ్యలన్నిటికీ వర్తిస్తుందని సిద్ధాంతీకరిస్తారు గణితజ్ఞులు/గణిత శాస్త్రవేత్తలు.

ఇప్పుడు మనం బ్రహ్మ గారి వద్దకు వద్దాము.

పూర్వం ప్రళయ సమయంలో విశ్వమంతా జలమయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేనుకొని క్షీర సాగరమధ్యంలో నిర్వికారముగా పవళించాడు. ఆ ఆదిశేషుడు స్వచ్ఛమైన అమృతపు నురుగులవంటి తెల్లనైన శరీరం కలవాడు. అతని తెల్లని శరీర కాంతి అతని వేయి (అనంతం) తలలపై తళతళలాడే రత్నాల కాంతులతో చెలిమి చేస్తున్నట్లుగా వెలుగొందుతున్నది. నారాయణుడు తన కడుపులో అగ్నిని దాచుకొన్న కట్టెలా లోపల చైతన్యశక్తి కలవాడై ఉన్నాడు. అనంతమైన తత్త్వదీప్తితో అద్వితీయుడై ఆనందమయుడై కపటనిద్ర నభినయిస్తూ కన్నులు మూసుకొని ఉన్నాడు (యోగ నిద్ర. ఎందుకంటే ఆయన సదా జాగరూకుడై ఉంటాడు కనుక). కుతూహలం కలిగి కూడా కోర్కెలు లేనివానిలా నిష్కళంకమైన స్వరూపంతో విరాజిల్లాడు.

అలా యోగమాయను కూడా నియంత్రించి, వెయ్యి యుగాల పర్యంతం సమస్త లోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సత్త్వ గుణాన్ని వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తు డైనాడు.

ఇదంతా కనీసం 2,00,36,00,000 సంవత్సరాలకు పైపడిన కాలంలో.

ఆ సృష్టి కార్యం జరిగినది దరిదాపుల 1,60,36,00,000 సంవత్సరాల క్రితం.

అలా తన కడుపులో దాచుకున్న లోకాలన్నింటిని (లయం చేసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి) తిరిగి పునఃసృష్టి గావించడానికి ఉపకరణాలైన సూక్ష్మ పదార్థాలను (fundamental particles) మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని ధరించాడు. సత్త్వ గుణం కలిగినప్పుడే సృష్టి గురించి సమబుద్ధితో ఆలోచించగలము. ఆ పైన సృష్టి చేయాలంటే కావలసినది రజోగుణము.

ఇంత? ఎంత? అనే ప్రశ్నలు వచ్చేది రజోగుణము వల్లనే!

As we need precise number of fundamental particles (material) in precise energy proportions, and at a precise time (which is possible only to the God itself – నిర్గుణ, నిరాకార), all these acts should be orchestrated at a balanced state. That’s why Sattva Guna again. Next,

ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడిన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్య ప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సుచేత వృద్ధిపొందిన నీటినడుమ ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగూణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన ఒక శక్తిని ప్రసరింప జేశాడు. ఆ శక్తిని పదార్థంగా మలచి, ఒక ఆకారం రూపుదిద్దుకునేలా చేశాడు. ఆ క్షణానే ఆ పద్మంలో నుంచి సకల గుణ సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

ఆయన స్వయంభువుడు ఎలా అయ్యాడు? సమయం వచ్చినప్పుడు చూద్దాము. చతుర్ముఖుడు – who can affect and be affected by the four fundamental forces.

పద్మంలోనుంచి ప్రభవించిన ఆ బ్రహ్మ పద్మం పైభాగన నిలబడి, కన్నులు బాగా తెరచి లోకాలనూ, దిక్కులనూ, ఆకాశాన్ని తన నాలుగు ముఖములతో పరికించి చూశాడు.

ప్రలయం ముగుస్తున్న సమయమది. చుట్టూ మహాజలం. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. అలలు లేచిపడుతున్నాయి ఆ జలమధ్యంలో ఒక పద్మం ఆ పద్మంమధ్య దుద్దుపై తాను స్పష్టమవుతూ ఉన్న లోకాల స్వరూపం. ఇదంతా ఏమిటో అర్థం కాలేదు.

చూశారా వింత!!

అంతటి సృష్టికర్త అని పిలువబడే బ్రహ్మ గారికి కూడా అయితే అర్థమే అవుతుంది. అందుకే ఆయన కూడా ఒక జీవాత్మ.

ఆయనను సృష్టించినది?

శ్రీమహావిష్ణువు. భూత భావనః

ఆయనలో అంతర్యామిగా ఉన్నది?

శ్రీమహావిష్ణువు. <<<(పరాత్పరుడు తన కళతోకూడిన ఒక శక్తిని ప్రసరింప జేశాడు. ఆ శక్తిని పదార్థంగా మలచి, ఒక ఆకారం రూపుదిద్దుకునేలా చేశాడు)>>> భూతాత్మా

ఆయనలో వ్యాపించి ఉన్న శక్తి?

శ్రీమహావిష్ణువు. భావః

ఆయనను పోషించేది?

శ్రీమహావిష్ణువు. భూత భృత్

కానీ ఇదంతా. అర్థం కూడా కాని బ్రహ్మ, ఏమి జరిగినదో, ఏమి జరుగుతున్నదో, ఏమి జరుగబోతున్నదో..

తెలుసుకోలేక చతుర్ముఖుడు తన మనస్సులో చాలా విచారాన్ని పొంది ఇలా వితర్కించాడు.

– ఈ నీటిపై ఈ పద్మం ఏ విధంగా పుట్టింది?

– ఒంటరిగా నేను ఈ తామర గద్దెపై ఎలా ఉంటున్నాను?

– నేను ఎవరిని?

– నా పేరు ఏమిటి? నామము. నాలుగవ ప్రశ్న కనుక నాల్గవ యుగంలో ప్రాధాన్యతను పొందింది. పొందుతోంది. పొందబోతోంది.

– నాకు ఈ పుట్టుక రావడానికి కారణం ఏమిటి?

= ఈరకమైన అన్వేషణ ప్రతి జీవి కూడా చేయాలి.

“ఎంత ఆలోచించినా ఈ క్రమం ఏమిటో తెలుసుకోలేక పోతున్నాను” అని బ్రహ్మ గారు ఆశ్చర్యచకితుడైనాడు.

ఆపైన, ఆ తామరతూడు ఎక్కడ నుంచి పుట్టిందో, దాని మొదలు ఎక్కడో తెలుసుకోవాలని ఆ నీటిలో వెదకడంకోసం బ్రహ్మదేవుడు పద్మనాళం వెంట లోపలికి ప్రవేశించాడు. ఆ రకమైన అన్వేషణా కుతూహలం జీవులన్నిటికీ ఉండాలి.

అంతు తెలియని లోతూ, లెక్కలేనంత విరివీ కలిగిన ఆ సంద్రపు నీటిలో మునిగినవాడై ఆ బ్రహ్మ..

(బ్రహ్మ కూడా జీవుడే. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు అని చెప్పుకున్నా, ఇవన్నీ సగుణాత్మకమైనప్పుడే. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు అని చూశాము కదా. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు లేదా పద్మసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరిగా ఎంచే ఈ బ్రహ్మ గారు సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు.

ఇది బ్రహ్మకు ఒక పగలు.

అలా ఒక కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం.

కల్పాంతం కూడా 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మ గారికి రాత్రి.

ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మ గారికి ఒక రోజు.

ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మ గారికి ఒక సంవత్సరం.

ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే ఈ బ్రహ్మ గారి ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు. కనుక శ్రీ రామాయణం ఈ కాలచక్రంలో జరిగినదే.)

॥ఇక అసలు విషయానికి వద్దాము॥

..వేయి దేవతావత్సరాలు ఎంతో జాగ్రత్తగా వెదికాడు. అయినా ఆ తామరతూడు మూలాన్ని తెలుసుకోలేక పోయాడు. ఇదంతా భగవంతుని మాయాప్రభావం. ఈయన కూడా జీవుడే కాబట్టి ఆ మాయకు లోబడ్డాడు. అందు మూలాన ఆయనకు ఆ మూలరహస్యం అంతు చిక్కలేదు. మతి చెదిరి, ధైర్యం కోల్పోయి, మళ్లీ వచ్చిన దారినే వెళ్ళి ఆ తామర పూవు పైకే చేరాడు.

తరువాత ఆయనకు తపస్ చేయమని ఆఙ్ఞ రావటం, ఆ పైన జరిగినది మనం గతంలో చూసి ఉన్నాము.

అలా చతుర్ముఖుడు ఆ పద్మపీఠంపై కూర్చుండి అష్టాంగయోగంపై ఆసక్తి గలవాడైనాడు. గాలిని బంధించి, ఏకాగ్రభావంతో తపస్సు చేసాడు. ఈ విధంగా నూరేళ్ళు గడిచాయి.

బ్రహ్మదేవుడు ఇలా చేసిన యోగాభ్యాసం వల్ల విజ్ఞానాన్ని పొందాడు. ఆ విజ్ఞానం కలగినా కూడా అతడు శ్రీమహావిష్ణువును చూడలేకపోయాడు. అప్పుడు తన దృష్టిని తన హృదయంలో నిలిపాడు. అక్కడ అప్పుడు ఆ పరాత్పరుని దర్శించి తన హృదయంలో ఉన్నవాడే తనను కన్నవాడని తెలుసుకొన్నాడు.

ఈ విధంగా అచంచలమైన భక్తితో కూడిన యోగమాహాత్మ్యం వల్ల బ్రహ్మదేవుడు శుభచరిత్రుడూ, పరమపవిత్రుడూ, లక్ష్మీకళత్రుడూ, అయిన శ్రీమన్నారాయణుని దర్శించాడు. ఆ విష్ణువు సగుణ|సాకార రూపంలో వికసించిన కమలాలవంటి కన్నులు కలవాడు. నీలమేఘంతో సమానమైన దేహచ్ఛాయ కలవాడు. గరుడవాహనుడు. గరుడుని గురించి తరువాత మాట్లాడుకుందాం. చాలా విశేషాలు వస్తాయి.

అంతేకాదు. ఆ మహానుభావుడు గొప్పవైన పడగలనే గొడుగుల చివర గల స్వచ్ఛమైన రత్నాల కాంతులతో ప్రళయకాలంలోని చీకట్లను పోకార్చుతూ కొంగ్రొత్త తామరతూడులాంటి తెల్లని దేహసంపద కలిగన ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసికొని మిక్కిలి నిర్మలంగా ఉన్న నీళ్ళమధ్యలో శయనించి ఉన్నాడు.

ఆయన ఓజస్సు సహస్సుతో బ్రహ్మ గారిని పోషించుచున్నాడు కనుక వషట్కారః.

అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణువు.

ఆ వ్యాపకుని అసలు రూపం, నిరూపం… విశ్వమ్!

ఇక్కడికి ఇదంతా n = బ్రహ్మ (1) వద్ద నిరూపితమైనది. ఎందుకంటే తొలి జీవి ఆయనే కనుక.

దీన్ని బట్టే ఇంకోటి చెప్పవచ్చు.

ఏకం సత్ విప్రా బహుధా వదంతి.

బ్రహ్మలు కూడా అనేకులు కదా! ఈ బ్రహ్మ గారికి ఇలా అవగతమైతే, మరో బ్రహ్మ గారికి మరొక రకంగా అవగతమౌతుంది. అయినా సరే!

జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు ఎలా ఉంటాడు?

సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా!

– సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా ఉండేవాడు ఎవరు?

సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.

– సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు ఏమి చేస్తాడు?

జీవులందరిని పోషిస్తాడు.

– జీవులందరినీ పోషించువాడు అలా ఎంతకాలం చేయగలడు?

అనాది నుంచీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు, ఈ క్షణాన చేస్తున్నాడు. భవిష్యత్‌లో కూడా చేస్తూనే ఉంటాడు.

తరువాత నారదుని విషయంలో చూద్దాము.

దానికి నారద మహర్షి కథ తెలుసుకోవాలి.

అంటే n = నారద = m

Usually in mathematics, we go in ascending order to apply mathematical induction. But here in this case, at this is a higher plane or at this quantum level (సూక్ష్మ) we need to go in the descending order.

మూడో యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించిన సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఇది మనం వ్యాస పరాశరం అనే ఘట్టంలో చూసియున్నాము.

5142 సంవత్సరాల క్రితపు మాట!

ఒకనాడు వ్యాసుడు బదరికాశ్రమంలో, సరస్వతీనదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తిచేసుకొని శుచియై, సూర్యోదయ సమయంలో ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు.

భూత భవిష్య ద్వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి (ఎంతైనా విష్ణ్వంశ కదా) అప్పటికి జయసంహితమనే మహాభారతాన్ని మానవులకు అందించి ఉన్నాడు. అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మంద బుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారనీ తన దివ్య దృష్టితో తెలుసుకొన్నాడు. దాని నిదర్శనాలను ద్వాపరయుగం సంధికాలంలో అనగా మహాభారత కాలంలో చూసి కూడా ఉన్నాడు.

ఆ పైన,

అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు (కర్మ యోగం) నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని ఋక్, యజుః, సామ, అథర్వణ అనే నాలుగు భాగాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. మహాభారతం పఞ్చమవేదమన్నది వేరే మాట.

అయినప్పటికీ విశ్వశ్రేయస్సు (???)

<<<విశ్వము. జీవులు తమను తాము ఆ పరమాత్మలో భాగాలుగా ఎఱిగి, ఆయననే నిరంతరమూ స్మరిస్తూ ఉంటే ఆయనే మన బాధ్యత స్వీకరిస్తాడు. అంటే మనమే ఆయన. ఆయనే మనం. కనుక మనం కూడా విశ్వమే. అందుకే వ్యాస మహర్షి అలా మన (జీవుల) గురించి ఆలోచించాడు.>>>

కొరకు తాను చేసిన కృషితో ఆయన మనస్సు తృప్తి చెందలేదు. అందువల్ల వేదవ్యాసుడు సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి తన ఆవేదనకు, అసంతృప్తికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు.

అంతర్ముఖుడైనాడు. తనలోకి చూసుకున్నాడు. అక్కడ తనలోని పరమాత్మ దర్శనం అయీ అవకుండా అయినది. అన్నీ చేశాను కాని పరబ్రహ్మ అయిన శ్రీహరికీ, ఆ శ్రీహరి భక్తులైన పరమ హంసలకూ అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మరచిపోయాను. (ఇది కూడా భాగవతాపచారం లాంటిదే. అలా భాగవతాపచారం చేసి భీష్ముడు అనుభవించిన శిక్ష చూసి ఉన్నాము కదా. ఇక్కడ వేదవ్యాసుడు మరచినాడు. అది పొరబాటు మాత్రమే. కావాలని చేయటం కాదు కనుక కేవల వేదన మాత్రమే ఆయనను బాధించుచున్నది.

“ఎంత పొరపాటు చేశాను? ఎంత తెలివి తక్కువ పని చేశాను? ఎంతటి విస్మృతి పాలయ్యాను?” అని వ్యాసమహర్షి విచారించాడు.

ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణనామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటివెంట వెలుపడే హరినామ సంకీర్తనం అనే అమృతప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతూ ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా, ఒంటినిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్ఠలు గలవాడు, సకల శాస్ర్తపురాణ విశారదుడు ఐన నారదముని వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు.

ఎందుకు? ఉద్ధరించేందుకు.

కుబేరుని సంతానం అయిన నలకూవర మణిగ్రీవుల వద్దకు కూడా అందుకేగా వెళ్ళినది.

మనకు చాల దగ్గరగా ఉన్న చరిత్రలో త్యాగబ్రహ్మకు కూడా ఆయన దర్శనమే కదా శాంతి చేకూర్చినది!!

ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి, లేచి వ్యాసుమహర్షి యథావిధిగా పూజించాడు.

<<<గమనించారా? అహంకార పూరితులై, నారదముని అంతటి వాడిని తిరస్కరించిన మణిగ్రీవ నలకూవరులు శాపమునకు గురి అయి, ఆ పైన ఉద్ధరింపబడ్డారు.

ఇక్కడ వ్యాసుడికి మరపు తప్ప వేరొక దోషము లేదు కనుక ఉపదేశ మాత్రముచే అనుగ్రహింపబడ్డాడు. పైగా నారద చరితమును ప్రసాదముగా అందుకున్నాడు.>>>

అప్పుడు నారదుడు మధుర మందహాసంతో దివ్య కాంతులీనుతున్న వదనముతో మహతీవిపంచిని మెల్లగా మీటుతూ వ్యాసుని ప్రశ్నించి, ఆయన సమస్యను, వేదనను తెలుసుకున్నాడు.

అన్నాడు.

నాయనా, కృష్ణ ద్వైపాయన వ్యాసా! పవిత్రమైన అనేక ధర్మాలను, ధర్మసూక్ష్మాలను నీవు మహాభారతం రూపంలో వెల్లడించావు. కానీ, పొరపా టేమిటంటే దానిలో లేశమాత్రముగనే విష్ణుకథలు చెప్పావు. అక్కడే సమగ్రత లోపించింది.

వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. ఎందుకంటే పరమధర్మమైన ఆ శ్రీమన్నారాయణుని గుణ కీర్తనమే భాగవతులకు ఆనందము చేకూర్చునది.

అదియే నీ మనస్సుకు ఈ అశాంతి చేకూరుటకు కారణం. నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే. మహాభారతం భీష్ముని గాధయే. అందు శ్రీకృష్ణ పరమాత్మ కథానాయకుడు కావచ్చును గాక. అక్కడ శ్రీహరి లీలలు అపరిమితంగా చోటుచేసుకోక పోవటానికి అదే కారణం కూడా.

పరాశర పుత్రా! హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ అది శుభకరంగా ఉండదు. పైగా దాయాదుల తగవులతో కూడిన ఆ కథ వినటానికి ఆసక్తిగా ఉన్నా, చెవులకు (ఇంద్రియాలకు) ఇంపగునా? అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని స్మరిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామ జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకిస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు.

సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీహరి సేవను విడిచిపెట్టటం తగినపని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యంకాని ఆనందం ఏదైతే ఉందో, అది తప్పకుండా సిద్థిస్తుంది. శ్రీహరి సేవాపరాయణు డైనవాడు నీచజన్మని పొందినప్పటికీ సంసారబంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణస్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. అందుకు ఉదాహరణమే నా పూర్వ జన్మ వృత్తాంతము.

పరాశరాత్మజ వ్యాసా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన కుటుంబీకుల ఇంట ఉండేది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here