శ్రీ మహా భారతంలో మంచి కథలు-7

0
3

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

19. జాజిలి తులాధారుల సంవాదము!

[dropcap]పూ[/dropcap]ర్వం జాజిలి అనే ముని కదలిక లేకుండా తపః స్థితిలో ఆసీనుడయి ఉన్నాడు. పిచ్చుకలు అతడి తలపై గూళ్ళు నిర్మించి, గుడ్లు కూడా పెట్టాయి. ఆ గుడ్లు పిల్లలయ్యాయి. క్రమంగా అతని తలపై పక్షలు తమ సంతానంతో నివసించసాగాయి. ఆ ముని వానిని తరిమివేయలేదు. పైగా అలా వానికి నివాసం కల్పిస్తున్నందుకు సంతోషించాడు. దానికి తనను తానే ప్రశంసించుకొని, “ఇంతటి ధర్మనిష్ఠ ఎక్కడైనా ఉంటుందా?” అని పలికాడు.

అపుడు ఆకాశవాణి “జాజిలి ముని! ఆత్మప్రశంస మానుకో. కాశీలో ఉన్న వైశ్యుడు, మహాధర్మాత్ముడైన తులాధారుడు ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడి ఎరుగడు. నిన్ను నీవు మెచ్చుకోవటమెందుకు?” అని ఆక్షేపిస్తూ ధ్వనించింది. ఆ ధ్వనిని విని, వెళ్ళి తులాధారుని చూశాడు. తులాధారుడు జాజిలికి అతిథి సత్కారాలు చేసి, “అయ్యా! తలపై పిచ్చుకలు గూడు కట్టుకొని హాయిగా జీవిస్తుండగా, నీవు ఏ మాత్రము మనోవికారము లేకుండా ఎలా తపస్సు చేస్తున్నావు? నీ ప్రవర్తన చాలా గౌరవించదగినది” అన్నాడు. దానిని బ్రాహ్మణ శ్రేష్ఠుడైన జాజిలి ముని ఆ వైశ్యుని జ్ఞానానికి ఆశ్చర్యపడ్డాడు.

“నీవు వ్యాపారములో ఉన్నావు కదా! నీకు ఈ విధమైన జ్ఞానం యెలా కలిగింది?” అని అడిగాడు.

అపుడు తులాధారుడు, “నేను వ్యాపార వృత్తిలో క్రయవిక్రయాలు చేసేటపుడు మోసముండదు. తగిన లాభాన్ని తప్ప, ఎక్కువ లాభాన్ని కోరను. లాభాలాభాల పట్ల సమభావం కలిగి ఉంటాను. మట్టిపెళ్ళను, బంగారాన్ని సమంగానే చూస్తాను. స్తుతి నిందలు చేయను, ఆత్మ ప్రశంస చేసుకోను. పరులను హింసించను. భూతదయ కలిగి ఉంటాను. సత్యప్రవర్తన కలిగి ఉంటాను. మితిమీరిన సుఖాలను కీర్తినీ కోరను. ఉపకారము చేస్తానే తప్ప ఇంత చేసానని ఆలోచన కలుగదు. రాగద్వేషాలు లేవు. నేనే ఈ లోకాన్నంతటిని చిత్రంలోని బొమ్మను చూచినట్లే చూస్తాను. అందుకే నా మనసు కలువరేకున నీరుండనట్లు నిస్సంగ స్థితిలో ఉంటుంది” అన్నాడు.

అపుడు జాజిలి “ఇపుడు నీవు పేర్కొన్న కర్మలలో తపస్సులు, యజ్ఞాలు, ధర్మకార్యాలని చెప్పవు. వేదవేత్తలు వీనిని సత్కర్మలు అంటారు కదా” అన్నాడు.

అపుడు తులాధారుడు “అహంకారము – కోరిక – వీటితో కూడిన తపస్సు ఫలం మీది కోరికతో చేసే యజ్ఞంలా ప్రయోజనకారులు కావు. ఆ రెంటిలోనూ పెద్ద లోభితనం ఉంది. అందువలన దేవతలు ఆ తపోయజ్ఞాలు మెచ్చరు. అంతేకాక వానివలన ఇహలోక పరలోకాల మధ్యన రాకపోకలకు చెందిన త్రిప్పటలు అపకారం కలిగిస్తాయే కాని మేలు కలిగించవు. మునీంద్రా! ఎవడు సత్యమే యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదాతృప్తి పొంది ఉంటాడో, అతడిపట్ల దేవతలు కూడా సంతృప్తి వహిస్తారు” అన్నాడు.

అపుడు జాజిలి “అలాగైతే నీవు కర్మ వదలకుండా ఉండటానికి కారణమేమిటి?” అన్నాడు.

అపుడు తులాధారుడు, ఇలా అన్నాడు:

ధర్మారాముడు సంతత | ధర్మసఖుడునై యసంగతా నిష్టమతిన్

నిర్మలుడగువానికి ని | ష్కర్మత్వానంద సిద్ధి గలుగు మునీంద్ర! (12-5-235)

“ఎవడు ధర్మములో రమిస్తాడో, ధర్మానికి సదామిత్రుడై ఉంటాడో, బుద్ధిలో అసంగత్వాన్ని పాటిస్తాడో, అట్లా పాటించి నిర్మల హృదయుడవుతాడో, అలాంటివాడికి కర్మ రహితత్వం వలన కలిగే ఆనందం సిద్ధిస్తుంది. ఏ విధమైన కాలుష్యం, పంకంలేని ఆత్మ అనే తీర్థాన్ని తెలుసుకున్న పవిత్రాత్ముడికి లోకములో ఉన్న కొండలన్నీ పావనమైన కొండలే. నదులన్నీ పావనమైనవే. సర్వమూ పవిత్రమే. నాకు తెలిసిన ధర్మము తెలిపాను. ఇది సరైనదో కాదో సజ్జనుల ద్వారా తెలుసుకుందామా” అంటూ “సంశయం తొలగించుకొనే పని మనమే చేసుకోవచ్చును. నీవు పక్షులను ప్రేమతో పెంచావు. వాటిని నీ చేతి పైకి ఉంచుకొని బుజ్జగించుము” అన్నాడు.

జాజిలి పక్షులను పిలిచాడు. అవి అతడి చేతిపైకి రాకుండానే జాజిలితో, “మేము ధర్మదేవత సేవకులము. ఆ దేవత పంపిస్తే వచ్చాము. నీకు కలిగిన సంశయము తొలగే విషయాలు చెబుతాము ఎవరి హృదయంలో మాత్సర్యం ఉంటుందో, వారిలో ఈర్ష్య, కలక, కలహం అనే దుర్గుణాలు కలుగుతాయి. దీనితో హింస పెరుగుతుంది. కావున ముని వృత్తిలో నున్నవారు మాత్సర్య దోషాన్ని హృదయం నుండి తొలగించుకుంటే మంచిది. స్పర్ధ వినాశకారి. కావున దానిని విడనాడాలి. సత్వగుణం వలన జనించిన శ్రద్ధ శుభం కలుగుజేస్తుంది. చిత్తశుద్ధే శ్రద్ధకు స్వరూపం. తత్వజ్ఞుడు శ్రద్ధను పురుష స్వరూపుణిగా భావించి అనుసరిస్తాడు. శ్రద్ధ అనే ధనసంపద మన మాటలను, మనసును చెడుదారిలో పోనీయకుండా కాపాడుతుంది. శ్రద్ధ జీవాత్మ యొక్క ప్రసన్నతా గుణమే సుమా. శ్రద్ధ, శౌచం లేని దోషాన్ని తొలగిస్తుంది. శ్రద్ధ అనే గుణం లేని వాడికి దాన గుణం ఉండదు. అందుచేత బ్రహ్మ దానం చేసేవాడే శ్రేష్ఠుడు అని చెప్పాడు. అనాయాసంగా కుబుసాన్ని తొలగించుకొనే పామువలె శ్రద్ధావంతుడైన మానవుడు పాపమును తొలగించుకుంటాడు. అందువలన మానవుడు శ్రద్ధావంతుడు కావటం శుభప్రదం” అని తెలిపాయి.

అపుడు ముని “ఓ తులాధారా, పూర్వం నేను మునుల వద్ద తత్వం వినలేదు. అందుకే ఆత్మశ్లాఘత్వమనే అవినయ దోషం కలిగింది. ఇపుడు నాకు కనువిప్పు కలిగింది” అని తెలిపి, సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

వ్యాపార వాణిజ్యాల ద్వారా లౌకిక జీవనంగా గడుపుతున్నా ధర్మాధర్మ విచక్షణ నెరిగియుంటే ఉత్తమ జీవనం గడుపుతూ జ్ఞాన మార్గంలో జీవించవచ్చునని తెలిపే కథ.

వైశ్య వృత్తిలో ఉన్న తులాధారుడైనా, కసాయివృత్తిలో ఉన్న ధర్మవ్యాధుడైన తమ జీవనాన్ని ధార్మిక మార్గంలో నడుపుకొని, జ్ఞానులయి, వేదోప నిషద్ధర్మాలను అనుష్ఠించి చూపుతూ లౌకిక జీవనం కూడా అర్థవంతంగా చేయవచ్చునని నిరూపించారు.

పరనిందయే కాదు ఆత్మప్రశంస కూడా పాపమని సూచించే ఈ కథ భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.

శాంతి పర్వం పంచమాశ్వాసం లోనిది.

God hates those who praise themselves.

20. గౌతమీ లుబ్ధక సర్ప మృత్యుకాల సంవాదము!

పూర్వము గౌతమి అను పేరుగల ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె కోపతాపాలను అదుపులో పెట్టుకున్న మహాత్మురాలు. ఆమె కుమారుడు ఒకనాడు పాము కాటు వలన మరణించాడు. పుణ్యాత్ములకైకనా బాధలు తప్పవుకదా. మృత్యువు ఎవరినీ విడిచిపెట్టదు కదా. కొడుకు మరణానికి తల్లి దుఃఖిస్తూ ఉండగా, ఆ తల్లి దగ్గరికి ఒక అడవి జాతివాడు, పామును త్రాడుతో కట్టి తెచ్చి, కోపముతో, “అమ్మా! ఇది చాలా దుష్ట సర్పము. దీని తలను కర్రతో చితక కొట్టాలా? లేక కత్తితో నరకాలా? ఏం చేయమంటావో చెప్పుము” అన్నాడు.

దానికి ఆ మహా దయగల తల్లి “అన్నా! దానిని వదిలి పెట్టుము” అన్నది.

సాధారణముగా ఎవరూ విషజంతువును విడిచిపెట్టమనరు. కానీ కాలమే మనిషి మృత్యువుకు కారణమని నమ్మేవారు కదా. అందుకే అలా అన్నది.

అపుడు కిరాతకుడు “లేదమ్మా! పసివాని ప్రాణం తీసిన ఈ పాము ప్రాణం తీస్తాను” అన్నాడు.

ఆమె అతడితో

“విధివశమున వచ్చిన కీ | డధములు గొనియాడి వెడగులై, విపులభవాం

బుధి మునుగుదురు, మునంగరు | పధర్ములగు నుత్తములు, ప్రశాంత జులకనై (3-1-9)

“అన్నా! ఆపదలు మన పూర్వ జన్మ కర్మానుసారంగా వస్తాయి. కనుక అధములైన వారు తల్లడిల్లి సంసార చక్రములో మునుగుతారు తప్ప రహస్యాన్ని ఎరిగి, వాస్తవం విచారించటం లేదు. ఉత్తములు సృష్టిలోని క్రమాన్ని చూచినవారు కావున, ధర్మవేత్తలు కావున, శాంతిని పొంది సంసార సాగరాన్ని దాటిపోతున్నారు. బాబును పాము విధి ఆజ్ఞతో కరిచింది. కనుక వదిలిపెట్టుము. మరొకమాట అర్జునకా! దీనిని చంపితే నా బిడ్డ బ్రతుకుతాడా? కోపము వదులుము” అన్నది.

“నీవు తెలివికి తక్కువ దానివి కనుక పామును వదలమంటున్నావు. నేను కోపముతో ఉన్నాను. కనుక నీ మాటలు నాకు నచ్చవు” అన్నాడు.

“అన్నా! నీ పేరు అర్జునకుడు. అంటే స్వచ్ఛమైన వాడివని కదా! ఆ పేరునకు అర్థం, మహాత్ములు కాదనేటట్లుగా మహాత్ముల స్నేహితులు ప్రవర్తించరు కదా. నీబోటి వాడికి నా దగ్గర ఈ క్రూరత్వమేమిటి? హింస కూడదు” అన్నది.

“మనుష్యులకు బాధ కలిగించే జంతువులను చంపటంలో పాపం లేదమ్మా” అన్నాడు.

“శత్రువైనా చేత చిక్కినపుడు చంపరాదు నాయనా” అన్నది.

“పూర్వం ఇంద్రుడు పుత్రుడిని చంపలేదా? శివుడు యజ్ఞాన్ని నాశనం చేయలేదా? ఈ హింసలు ధర్మమే కదా? దీనిని చంపనిమ్ము” అని పలికినా, బోయడి మాటలు గౌతమి అంగీకరించలేదు.

అపుడు పాము బోయతో “ఓ అర్జునకా! నాపై కోపం విడువు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. నేను మృత్యుదేవత ఆజ్ఞకులోనై బాలకుడిను కరిచాను. అంతేకాని కోపంకానీ, కోరిక కానీ ఏమీలేవు. ఈ రహస్యం నీకు తెలియదు” అన్నది.

అపుడు బోయవాడు “నీవు మృత్యువు చేతిలో పనిముట్టువైనావు” అని అన్నాడు. అపుడు పాము “అయ్యా! కొంచెం ఆలోచించు. కుండలు చేసేవాడు చేతి కర్రతో సారెను తిప్పుతాడు కదా. తిరిగే సారెది దోషమా? కర్రతో తిప్పిన కమ్మరిది దోషమా? భగవంతుడు కుమ్మరి వంటివాడు. మట్టిని కుండగా చేయాలంటే మట్టి, సారె, కోల అవసరం. ఇవి బాహ్య సాధనాలు. అలా చేయాలనుకున్న భావం, భగవానుని సంకల్పం. ఇక్కడ చేతి సాధనాలు అచేతనాలు. సృష్టీ సామర్థ్యం అతడిదే. మట్టి, సారె, కోలకుండను చేయలేదు. అవి సాధనాలు మాత్రమే. అయ్యా! చంపే శక్తి నాకు ఎక్కడ ఉన్నది” అన్నది.

అపుడా కిరాతుడు “బాణమెక్కు పెట్టి విలుకాడు శత్రువుపై బాణము వేస్తే అదేమి చేస్తుంది లెమ్మని ఊరుకోకుండా నడుమనే విరుగగొట్టి నందువలన పాపమంటదా ఎవరైనా? ఎవరో పంపించారని బాలుడినే కరుస్తావా? నిన్ను నరికినా పాపము లేదు. అంతే కాకుండా మీరు కేవలము మృత్యువు చేతిలో మనసున్న సాధనాలే అయితే మిమ్మల్ని తిరుగనివ్వకుండా చంపటమే అన్ని విధాలా మంచిది” అన్నాడు.

అపుడు పాము “నీదన్నట్లు బుద్ధిగలుగు సాధనాలు గదా యజ్ఞం చేయించే పురోహితులు. వారు చేయించే హోమాల ఫలితం యజమానుడికి వస్తుంది తప్ప పురోహితుడికి వస్తున్నదా? అలాగే బుద్ధి ఉన్న సాధనాలమైనా మా పని కూడా అంతే” అని పాము అంటుండగా మృత్యుదేవత వచ్చింది.

“పాపపుహితుడా! నిన్ను నేను చెప్పి పంపినట్లుగానే నన్ను యముడు పంపించాడు. అందువల్ల అతడి నీకు వినిపించాను. కనుక మనమీ చావుకు కారణము కాము. మరొకమాట వినుము. సూర్యచంద్రాగ్నులు, ఆకాశం, నేల, నీరు, గాలి మొత్తం ఏడు. మరియు జీవితమనగా యజమానుడు కలిసి ఎనిమిది వస్తువుల కదలికలనే కాల స్వరూపుడి చేతిలోని పనులు. విషయం తెలిసి నాపై పాపము మోపటమంటే నీపై నీవే మోపటం కదా! నేను నిన్ను ఈ పనికి వినియోగించిన్నట్లు నన్ను ఆయన వినియోగించినాడు. కనుక మన ఇద్దరిది పాపము కాదు” అని మృత్యువు పలుకగా, పాము “నీ మీద నేను గుణాన్ని ఆరోపించి మాట్లాడితే నీవేమో నన్ను పంపావని అదేదో తప్పన్నట్లుగా చెబుతున్నావు. ఆ తప్పును పోగొట్టడానికి నేనిట్లు అన్నది. అయ్యా! నీదే పాపము లేదు నిజము.

యముడిపై తప్పు మోపుటకుగానీ, తప్పు లేదన్నట్లుకుగానీ నేనెవరిని. నాకు గుత్తు ఎక్కడున్నది” అని పాము పలికి బోయవాడి ముఖము చూచి “నీవు మృత్యువు మాటలు విన్నావు. విషయమంతా స్పష్టంగా చూశావు. కనుక ఈ పాపము నాకు అంటగట్ట తగదు” అనగా బోయవాడు నవ్వి, “నీవు, మృత్యువు ఇద్దరు పాపానికి వశమైన మనసు కలవారు. కనుక మీరెంత చెప్పిన ఇందులో ఒరిగేది ఏది లేదు. మీరల అన్నంత మాత్రాన నేను భయపడేది లేదు” అన్నాడు.

అప్పుడు మృత్యువు “మాదేమున్నది? తప్పు మాది కాదు.. అంతా కాలానికి లోబడి నడుస్తున్నది” అని అన్నది. అంతలో ధర్మ సందేహాన్ని పోగొట్టడానికి యముడు వచ్చాడు. వచ్చి కిరాతునితో “నేనూ, పాము, మృత్యువు ఈ పసివాడి చావుకు కారణం కాము. మరేమిటంటే – వీడి కర్మ పూనుకొని వీడికి ఆ చావుని తెచ్చిపెట్టింది.

విను కర్మంబొనరించుచు! జననము, మాణంబు, నదియ సౌఖ్యము, దుఃఖం

బును గావించుచుందన చేసిన దానింబడకపోవ శివునకు వశమే? (15-1-34)

జీవుడు తాను చేసిన కర్మ వల్లనే పుట్టుక చావూ.. పొందుతున్నాడు. అదే సుఖదుఃఖాలకు కారణమవుతున్నది. తాను చేసిన కర్మము తప్పించుకొని పోవటము శివునికి కూడా సాధ్యము కాదు కాబట్టి మీరంతా ఈ చర్చ మానండి!” అనేటప్పటికి ఆ బ్రాహ్మణ స్త్రీ తన మాటలు యముడి మాటలు ఒకే రకంగా ఉన్నందున, “ఓ అర్జునకా ఇలాంటి దుఃఖాలు మన పాపాల వల్ల వస్తాయి. ఈ విధంగా పిల్లలు చచ్చిపోవడానికి వారి పాపకర్మకు కారణం తప్ప ఎవరూ కారు. కర్మానుగుణంగానే మనుషులు ప్రవర్తిస్తారు. దీని కొరకు కోపం, ఏడ్పు దేనికి? పామును విడిచిపెట్టి శాంతిని పొందుము.”

అనగానే, జ్ఞానోదయమైన బోయవాడు పామును వదిలిపెట్టాడు. మృత్యువు, కాలుడూ సంతోషంగా వెళ్లిపోయారు. సర్వము ఈశ్వరేచ్ఛ తప్ప జనేచ్ఛ కాదు.

మనకు కలిగిన కష్ట నష్టాలకు, సుఖదుఃఖాలకు కారణం మన కర్మే తప్ప మరొకరు కాదు. ఈ దృష్టితో బ్రతికితే సుఖ శాంతం కలుగుతాయి. ఘర్షణలు పోతాయి. ఈ భారతీయ సంస్కృతి నాలుగు పాత్రల ద్వారా చెప్పిన అద్భుతమైన కథ ఇది.

యుద్ధములో బంధుహతం అవడానికి, తుట్టుకోలేక పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ ఇది.

ఆనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసం లోనిది.

– యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత॥

Yama has no mercy, be careful therefore, be careful.

– విధికధికంబు కర్మమని వేమరు మ్రొక్కి భజింతు గర్మమున్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here