అదృష్ట లక్ష్మి

0
3

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘అదృష్ట లక్ష్మి’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]స్త ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, “మీ ఉంగరాలు పోయాయని విన్నాను. ఇంకా దొరకలేదా పాపారావ్ గారూ. ఇంతకీ అసలేం జరిగిందండీ” అడిగారు రమణ శాస్త్రి, పాపారావ్ గారి చేతి వంక చూస్తూ.

“దొరకలేదయ్యా, ఓ నాల్రోజుల క్రితం, బార్ లోంచి బయటికి వచ్చే దార్లో, ఇద్దరు దరిద్రులు ఎంతో మంచి వాళ్ళలాగా నటించారు. తర్వాత నాతో మాట కలిపి, నన్ను జాగ్రత్తగా తీసుకు వచ్చి కారెక్కించారు. సరేలే మన ఊరి కుర్రాళ్ళు ఎంత మంచి వాళ్ళో అని లోలోనే మురిసి మొగ్గలేశాను. కానీ తర్వాత రోజు పొద్దున, నా చేయి చూసుకున్నాక గుండె బద్దలైనంత పనైంది.  ఆ దరిద్రులు నా రెండు ఉంగరాలూ తీసేస్తారని అస్సలు ఊహించలేదు. పైగా ఆ రెండు ఉంగరాల్లో ఒకటి వజ్రపుటుంగరం, అది మా తాతముత్తాతల నుండీ వంశపారంపర్యంగా వస్తోంది. మా బామ్మర్ది పోలీసు ఫిర్యాదు చేశాడు, చూడాలి” చెప్పాడాయన బిక్కమొహంతో

“నే అనుకోవడం, వాళ్ళు తీసుండరండీ. మీరే అజాగ్రత్తతో అక్కడే ఎక్కడో పడేసుకుని ఉంటారు”. అని  ఏదో గుర్తొచ్చినట్టు “అది సరే కానీ, మొన్న మీ కోడలిగా సరిపోయే ఓ అమ్మాయి ఫోటో ఇచ్చి వెళ్ళాను. ఆ విషయవై ఏం ఆలోచించారు” అడిగారు శాస్త్రి.

తన మెడలో ఉన్న పులిగోరుని, చేత్తో సరిచేసుకుంటూ “మీరు మొన్న చెప్పింది నిజవేనా శాస్త్రిగారూ” అడిగాడాయన మరోసారి.

“భలే వారే, ఆ అమ్మాయి ముఖంలో పెళపెళలాడే కళ చూస్తే తెలియడంలేదటండీ. ఆ అమ్మాయి అడుగుపెట్టిన ఇల్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, కొత్త స్టీలు గిన్నెలా తళ, తళా మెరిసిపోతుంది. ఎల్.ఈ.డీ బల్బులా మిలమిలా వెలిగిపోతుంది. కా..కపోతే” అంటూ నసిగారు శాస్త్రి గారు.

“ఏవిటయ్యా అది, చక్కగా నడుస్తున్నవాడు, చెప్పు తెగి ఆగిపోయినట్టు, అలా చెప్తూ, చెప్తూ ఆగిపోయావేంటి? కంగారులో నాలుక్కరుచుకున్నావా ఏవిటి” సందేహంగా చూస్తూ అడిగారు పాపారావ్ గారు.

“అబ్బే అదేం లేదండీ, ఆ అమ్మాయి జాతకం వగైరా అన్నీ మహా బేషుగ్గానే ఉన్నాయి కానీ, ఆ అమ్మాయిది మీ కులం కాదండీ. ఆ విషయం మొన్న మీకు ఫోటో ఇచ్చినప్పుడే చెప్పాలనుకుంటూనే మర్చిపోయాను. అదే మీతో ఇపుడు ఎలా చెప్పాలీ, ఏవిటీ అని సందేహిస్తూ ఇలా” అంటూ నసిగారు శాస్త్రి గారు చేతులు పిసికేసుకుంటూ.

“ఓస్ అదా, మరేం పర్లేదు. నాకు అలాంటి పట్టింపులేం లేవు. మంచి కుటుంబం అయి ఉండి, దండిగా ఆస్తి పాస్తులు ఉండి, మా వాడికి వాళ్ళు అండదండగా ఉంటే, అంతకన్నా ఈ తండ్రి గుండె కోరేదేం వుంది” చెప్పాడాయన.

“మరోసారి సారీ, ఆస్తి పాస్తులు కూడా, కాస్తో కూస్తో తప్ప, జాస్తిగా లేవు. కానీ ఖాయంగా, ఆ అమ్మాయి మెట్టినింటికి మాత్రం అదృష్ట లక్ష్మవుతుంది. ఇక మీరే ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పాలి” అన్నారు శాస్త్రిగారు.

“అంటే ఆ అమ్మాయికి ఆస్తి లేదా” అంటూ ఓ క్షణం మౌనంగా ఉండిపోయి, తర్వాత తేరుకుని, “మా అబ్బాయికి ఈ అమ్మాయి ఫోటో చూపించగానే, బాగా నచ్చిందనీ, ఆమెనే పెళ్లి చేసుకుంటా అని, ఇంకెవరినీ చూడొద్దనీ, బల్ల గుద్దినట్టు చెప్పేశాడు. మా ఆవిడ కూడా అమ్మాయి బావుందనీ, ఆస్తి, అంతస్తు లాంటి పట్టింపులు పెట్టుకుని, ఈ అమ్మాయిని కాదనకండి అంది. కనుక నాకు మాత్రం డబ్బుతో పనేం ఉంది. పైగా మంచి కుటుంబం, మంచి అమ్మాయి, మంచి జాతకురాలు అంటున్నారు. కనుక ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం. అమ్మాయి తరుపు వాళ్ళతో మాట్లాడండి” చెప్పారు పాపారావ్ గారు.

ఆ మాట వింటూనే, శాస్త్రిగారు సంతోషంగా “చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక తర్వాత పెళ్లే. మిగతా విషయాలు నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను” చెప్పి వెళ్లిపోయాడాయన..

తర్వాత రెండు వారాల్లోనే, పెళ్లి తంతూ అదీ అయిపోయాక, పాపారావ్ గారి ఇంటికి వెళ్లారు శాస్త్రి గారు. అక్కడ వాళ్ళబ్బాయి మధుని కలిసి, “బాబూ, మీ నాన్నగారంటే భయంతోనో, భక్తితోనో మీ  ప్రేమ విషయం మీ నాన్నగారికి చెప్పలేక నన్ను పురమాయించారు. దాంతో, మీరు ప్రేమించిన అమ్మాయిని మీతో కలపడానికి గాను, మీ నాన్నగారికి ఆ అమ్మాయి ఫోటో చూపించి, సాధారణ జాతకురాలిని, అదృష్ట లక్ష్మి అని గట్టిగా చెప్పి ఒప్పించాను. అలా చెప్పినందుకుగాను, నా మనసు న్యూనతా భావంతో ఒకటే నస, నసగా ఉంటోంది ఈ మధ్య. అది పక్కన పెడితే, మీరు చెప్పినట్టు అంతా కష్టపడి ఇంత చేస్తే, మీరు నాకు ఒట్టి పది వేలు మాత్రమే ఇచ్చారు. ఇది న్యాయవేనా చెప్పండి” అడిగాడాయన.

“భలేవారే, మరో పది వేలు కూడా ఇద్దామని తీసే ఉంచాను. ఉండండి తెస్తాను”, అని లోపలికి వెళ్ళి, పదివేలు తీసుకు వచ్చి, “ఇదిగొండి మరో పదివేలు, తీసుకు వెళ్ళండి” అని నవ్వుతూ అందించాడు.

అవి తీసుకుని, “చాలా సంతోషం”, అని ఓ క్షణం ఆగి, “అవునూ, మీ నాన్నగారు కొత్తకోడలిని అదృష్ట లక్ష్మి అని అందరి దగ్గరా ఆకాశానికి ఎత్తేస్తున్నారట. ఏం మంత్రం వేశారు” అడిగారు ఆసక్తిగా.

“అదా” అని చిన్న గొంతుతో, ఆయన చెవిలో చెప్పాడు మధు.

అది విని, “మీ బుర్ర మామూలు బుర్ర కాదు. మీ తెలివి మామూలు తెలివి కాదు. భలే ఆలోచన చేశారు” అని ఓసారి వాచీ చూసుకుని, “సరే టైమ్ అయింది, వస్తా బాబూ” అని వెళ్తుండగా పాపారావ్ గారు ఎదురుపడి,

“ఆ.. శాస్త్రిగారూ, మీరు అన్నట్టు నా కోడలు అదృష్ట లక్ష్మి, నాకు కూతురు లేని లోటు తీరిపోయిందయ్యా. అది పక్కన పెడితే, ఆమె వచ్చిన రోజునే బార్ దగ్గర పోయిందనుకున్న బంగారు ఉంగరం, మా ఇంట్లో ఓ మూల, మా పనివాడికి దొరికిందయ్యా”.” చెప్పాడాయన తెగ మురిసిపోతూ.

ఆ మాటలు విన్న శాస్త్రిగారు అతని వంక జాలిగా చూస్తూ, ‘ఓరి నీ అమాయకత్వం తగలెయ్యా, ఎందుకు దొరకదూ! బార్ దగ్గర నువ్వు ఒక ఉంగరం పోగొట్టుకుంటే, రెండోది మీ అబ్బాయికి కార్లో దొరికిందట. పెళ్ళి అదీ అయ్యాక, నీ కోడలిని నువ్వు అదృష్ట లక్ష్మి అనుకోవాలని, పెళ్ళి రోజునే దాన్ని మీ పనోడికి దొరికేలా చేశాడట. ఇందాకే చెప్పాడు’ అని అతను మనసులో అనుకుంటుండగానే, పాపారావ్ బావమరిది వచ్చి, “బావా నీకో శుభవార్త. నువ్ బార్ దగ్గర పోగొట్టుకున్న వజ్రపుటుంగరం దొరికిందట. ఇప్పుడే కానిస్టేబుల్ నన్ను కలిసి, నీ ఉంగరం ఇచ్చేసి పోయాడు. ఇదిగో బావా నీ ఉంగరం” అని చేతికి అందించి, “నీ కోడలు నిజంగానే అదృష్ట లక్ష్మి బావా” అన్నాడతను. దాంతో పాపారావ్ తెగ సంతోష పడిపోయారు.

అది చూసిన శాస్త్రిగారు, ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు, కాస్త తేలిక పడుతూ, “నే చెప్పాను కదండీ, మీ కోడలు అదృష్ట లక్ష్మి పాపారావ్ గారూ” మనస్ఫూర్తిగా అనేసి, చిరునవ్వుతో ముందుకు కదిలారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here