మా ఊరొక కావ్యం

0
4

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘మా ఊరొక కావ్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చూ[/dropcap]డ ముచ్చటైన రమ్యమైన దృశ్యాలు
తోడిన కొద్దీ చెలిమలో నీళ్లూరినట్లుగా
చెప్పినకొద్దీ రాసిన కొద్ది వొడువనివి
మా ఊరి గూర్చిన ముచ్చట్లు
ఉరికురికి వస్తూనే ఉంటాయి
తనివి తీరని మకరందాల వంటి జ్ఞాపకాలు
వాటిని వ్యక్తీకరించడానికి అసంఖ్యాకమైన
ఈ పదాల అల్లికలు కూడా సరిపోవు..!

మా ఊరి ఇసుక రేణువుల్లో
పోగొట్టుకున్న అనుభూతుల సమాహారంను
పసిపిల్లాడిల వెతుకుతూనే ఉన్నాను
గరికపచ్చ మైదానాల్లోని బాల్యపు ఆటల్లో
పారేసుకున్న అనుభూతులను గాలించి
గుండె గూటిలో భద్రపరుచుకుందామనుకుంటే
వేళ్ళ సందుల్లోంచి బిందువుల్లా జారిపోతున్నాయి..!

ఊరు చుట్టూ ఆవరించిన పర్వత ప్రాంతాలు
ఎన్నెన్ని రంగుల్లోనో కనిపిస్తుంటాయి
ఎన్నెన్ని లయల హొయలు ముద్దాడుతుంటాయి
ఎక్కడ పాదం మోపిన చాలు
మట్టి సుగంధాలు పరిమళిస్తాయి
నేలతల్లి పలకరింపులకు హద్దులు లేవు
మనమంతా తిరిగే వాటికి సరిహద్దులు లేవు..!

తడి ఆరని బాల్యపు స్మృతులు
ఒక్కొక్కటిగా తోసుకుంటూ వస్తుంటాయి
ఆ అద్భుత దృశ్యావరణాలను
అక్షర సవ్వడుల్లో నేర్పుగా వినిపిస్తుంటాను
స్నేహపు వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ
కలల్లా సాగిపోతున్న జీవన ప్రస్థానాన్ని
పదిలపరచుకుంటున్న క్షణాల గూర్చి
గాఢమైన వాక్యాల్లో వ్యక్తీకరిస్తుంటాను..!

సంతోషపు సుమాల వానలున్నాయి
దుఃఖపు ముళ్ళ గాయాలున్నాయి
ఈసడించుకున్న దగ్గరి వాళ్ళున్నారు
అక్కున చేర్చుకున్న దూరపు సహృదయులున్నారు
నేటికీ నిన్నటి బతుకు దీనావస్థాలు
రేపటి దారికి వెలుగు రేఖలయ్యాయి
ఇంటి ముందటి అరుగులు మాయమనట్లుగా
మనుషుల్లోని ఆత్మీయతలు కరిగిపోతున్నాయి
మా ఊరే కాదు ఏ ఊరు మినహాయింపు కాదు..!

నిర్బంధాలను తట్టుకోని నిలబడింది ఊరు
ఆదిపత్యాల తాకిడితో రాటు తేలింది ఊరు
నిటారుగా ఎదగటానికి ఊపిరినిచ్చింది ఊరు
సామూహిక జీవనానికి ప్రతీకైంది ఊరు
కట్టు తప్పనిది మడమ తిప్పనిది ఊరు
తంగేడు పువ్వుల నవ్వులతో
మోదుగు పూల పులకరింతలతో
నాకెప్పటికీ మా ఊరొక కావ్యంలా
దృశ్యమానమవుతూ హత్తుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here