అనుక్త గీతం!!

0
4

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘అనుక్త గీతం!!’ అనే దీర్ఘ కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

* నా సుమపేశల మృదులోహల హృదయావరణంలో
* నేనొక మనోజ్ఞ గీతం పూయించి
* నిన్నొక అనర్ఘ పద దామంతో
* అతి సుందర విరి మండపమందున
* అర్హంగా ఘన సన్మానం చేద్దామని
* తొందర పడుతూ ఉంటే
* నాకొచ్చిన తలపులలో
* కొన్నిటినైనా ఒక ఉపదగ
* అర్పించే ఉత్సాహంతో వివశుడనైపోతుంటే!

* ఎటు నే చూచిన భీకర ఆశాలంపట
* కఠినాత్ముల కహకహలే
* మది పేదల ధనదాహాలే
* ధర నేలాలను తహతహలే
* యుధ్ధోన్మాదపు గర్జారావాలే
* దురాక్రమణల విషఫూత్కారాలే
* ఇళ్ళను కూల్చే పేల్చే ఫిరంగులే
* బతుకుల చించే చీల్చే నరక్రౌర్యాలే
* అతి దీనంగా ఏడ్చిన, వేడిన వీడని
* శిత కరవాలాలే, గత సౌశీల్యాలే!
* ఈ బాహ్యపు గందరగోళంలో
* నా భావం వెలిరానందున
*నా మది లోగిలిలో లో-గదిలో పెంజీకటిలో
* ఉక్కిరిబిక్కిరియై గడపని క్షణమే లేదే?
* పరహిత సన్ముద్రల ఆంతరయోగంలో
* నిరతాలోచనలో
* వినువీథుల క్షత పతంగమై సాగిన నా
* మస్తిష్కంలో
* ఏయే పారుష్యా లెద ఘోషలు, వెక్కిరించాయో?
* నే నేయే సలసల మరిగే ఊర్ముల
* చిత్తాబ్దుల కన్నానో
* నా వేయాల్సిన హారం ఏయే మార్పుల
* నూత్నాకారం పొందిందో?
* నా యత్నం శూన్యాభాసం అయిందో
* ఏమని చెప్పను తల్లీ, ఎంతని చెప్పను?!
* నేనెటు నా మౌనవ్యథ వెలిగ్రక్కను?

* మరి నే నల్గడ పరికిస్తే
* నా కగుపించిన దృశ్యాలా?
* వినిపించిన వ్యాఖ్యానాలా?
* పసి మనస్సున మొలకెత్తిన భయం
* ఎగిరే క్ష్వేడ విహంగం!
* గన్నులకే వెన్నున వణుకెత్తించే మారణఘోరం
* ఇంకా నే విన్నవి చెప్పేనా?
* నడినిశి నిద్దురలో
* భయవివశుని చేసే సత్యావిష్కరణం
* అబల అతివిభ్రాంత మనోగతం
* శిశువు ఏమెరుగని నిద్దురలో
* ఊయల లూగిన కత్తుల రాపిడి నాదం!
* వైద్యశాలల్లో
* అస్త్రసన్యాసపు నిర్వేదంలో
• భిషగ్వరుల
* రక్తనాళాల సంఛేదం!
* కన్నీరుల కడలియె ఉప్పొంగగ
* బాధార్తుల అశ్రుసిక్త మూకోద్వేలం!
* కొమ్మెక్కిన ధరలతో
* రెక్కలు ముక్కలు చేసిన, తీరని
* ఆకటి మంటల ఎరుపులలో
* క్రోధాలాపం! శోకావర్తం!!

* ఒక లక్ష ఉల్కా శకలపు టాటోపాలు,
* ఒక కోటి అశనిపాతాల ఉద్భిన్నాలు
* శతకోటి వాయోధ్ధ్రృతుల అట్టహాసాలు!
* విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
* నా విన్నవి కన్నవి ఎన్నగ లేనే
* నా విన్నవి హృది కలచీ విలపించానే
* నా కన్నవి మది తలచీ విహ్వలించానే!

* ద్వేషాగ్నుల బూదైన సాధ్వాశల సుమలతలు
* మదమత్తుల చేతల నలిగిన సామాన్యులు
* క్రౌర్యారుణ వ్యాఘ్రాలటు తరిమే శశకాలు
* విషభర కాళీయులు చెరచే ముగ్ధ కాళిందులు
* శోకాతుర చీకాకుల కకావికల జీవితాలు
* ఆకాశపుటంచుల మార్మ్రోగే విషాదజీమూతాలు
* విద్రావిత తప్తాత్ముల ఘనీభవించిన ఆక్రందనలు
* ఏమని చెప్పను ఎన్నని చెప్పను
* నా విన్నవి కన్నవి హృత్ఫలకాన తుడిచివేసి
* ఆ దృశ్యపు రావపు చిత్తాక్రమణలను విస్మరించేసి
* నే నీ కిచ్చిన మాటగ, ఆ మాలను కట్టను పూనగ!

* జననీ, దయాధునీ, నే మాటలకై వెదుకాడగ వచ్చె
* అవి,
* హృదయాంతర కుహరాంతముల
* శృంఖలముల చుట్టువడి
* స్వేచ్ఛా విహరణ భంగుల మరచి
* అందమ్మగు కోమల వైనమ్ముల వదలి
* సుడులై, చిడిముడులై, చిరుశిలలై
* వెలువడవే, పరుగిడవే, నా యెద రవళించవే?!

* ఆ కలవరముల, ఖిన్నావరణముల
* వలయాంతర్వలయపు
* తలపుల చక్రవాత నడిగర్భంలో
* నే నేయే ఎత్తులలో
* ఎటు కాని త్రిశంకునై తేలానో
* నా సంక్షుభిత చిత్తంలో
* సంశోషిత భావుకతా కేదారంలో
* నిర్వేదపు ప్రాబల్యపు వశవర్తినై
* నా పాదాధారం సంచలితం కాగా
* నా మృదుభావం వెలిమేఘం కాగా
* నా నిర్భావపు శబ్దాభావంలో
* నా అనుకంపా సురగాంగంలో
• నా దుఃఖోల్బణ సమాధి స్థితిలో
* ఇటు నను వశీకరించి
* సమ్మూఢుని గావించిన ఆ అమానుషంలో
* ధూమావృత పటు నీరంధ్రంలో
* జనియించిన విషాద సాంద్రంలో
* నా ప్రేగుల వీణియ తీగలపై సాగిన
* ఖేద స్వర మూర్ఛనా పరిరంభంలో
* రుధ్ధకంఠ జనితాతిచిత్ర వేదనాస్వరంలో
* నానాధూసరవర్ణ సమ్మిశ్రితాఛ్ఛాదనలో
* ఈ మత్సమావృత కీలాగ్నులమధ్యంలో
* అమోఘ అచింత్య అలేఖ్య, అవర్ణనీయ
* విధురోచీజిత భవదాస్య ప్రశంసా కార్యం
* ఆ రమణీయ కవిభావిత భవ్యానుభవం
* అక్షరబద్ధం చేయగ నీకై నే సంకల్పించిన
* మహదుత్సవ సంభవమే సంశయమై పోవగ
* నా సకలోహయె పెనుశూన్యమై మిగులగ!

* నను పదములు గికురించేనే ఓ రసానర్ఘమణీ
* నను ఎలయించేనే నా నుడి, ఓ మృతసంజీవనీ
* అక్షరత్విషాసంభృతమణీ కవితారమణీ! ఓ జననీ!

* ఈ మానవ మనో కుహరంలో
* ప్రతి నిముషం నినదిస్తూన్న
* ఆ అహంరావానికి
* విశ్వాకారం కల్పించిన వాడే
* నా దీటే లేదను దివాంధపు లోతుల్లో
* ప్రాణాలను తోడే యుద్ధాలను పెంచి
* పరదుఃఖాలే లెక్కించక
* నేరాల, దుర్ఘోరాల ననునిత్యం వింటూ, చూస్తూ
* ఈ ప్రపంచ పరపీడన స్వార్థాలయంలో
* మూకవ్రత సాక్షినై
* అసహాయుడనై
* కణకణ కనలే వేళల
* అభయ హస్తపు జాడే ఎటు కానక
* ఈ దారుణ‌మాగే రూపే తెలియక
* అధికారం, ధనగర్వం తాండవించే
* ఈ దశదిశాసమావ్రృత నిబిడాంజనంలో
* నా మనోఫలకాన చిద్రుప చిద్రుపలై,
* హింసాత్మక కదనాంగణ చిత్రశకలాలు
* క్షతగాత్రుల, రుధిరాత్మల వినిపించని మూల్గులు
* కళేబరాలు, ఊళ్ళకు ఊళ్ళు పొలికలనులు
* వెడ నవ్వుల నాయకప్రచ్ఛన్న సృగాలఘూకాలు
* క్రూరాజ్ఞల పాలించే ఇనుపబూట్ల భళాభళాలు
* మోయలేక,ఆపలేక, ధరాంగన విరతిలేని విషణ్ణరాగం
* రెండుగ చీలి మటుమాయం కావాలనే ఇలాతలావేశం
* కళ్ళకు తేటతెల్లమె,గుండెల రంపపు కోత, ఓ తల్లి!

* చెప్పేదెవరికి వినేదెవరు,
* ఎవరి ఆజ్ఞల దురహం, ఈ మారణహోమం
* ఎవరికి తెలియని, అజాసమూహ సమ మౌఢ్యం
* నేతల పగటి వేషాలు, బూటకపు శాంతి కథనాలు
* గుండెల రసమింకిన పాషాణ శాసనరాక్షసాలు
* ఈ భువిపై నరుడన్న వాడికి వేదనలే సదా
* బలవంతుడి రాజ్యంలో, నరవ్యాఘ్ర సంచారమే సదా!

* మృదులం, కవనం, సుకుమారం ఈ యుద్ధంలోనా
* నా యీ మెత్తదనం వాడిన మదిలో
*. నే డీ మేటలు వేసిన సరిత్తీరంలో
*. నా యీ తృణసమ శుష్కవనంలో
*. ఏ అక్షర సుమం పూయదె తల్లి నేడు!
• ఏ నీటి బిందువు కనరాని ఎడారి నేడు!
*. రసమింకిన శోకపంకిల ఘనం నేడు!
* పూలన్నీ దళాల రెక్కలతో ఎగిరిపోయి
* వాటిక చినవోయి,నిదరోయినట్లైనది
* ప్రాంగణమె నిశ్చేష్టితం, ఓ నిష్పందనశైలం!!

* మన్నింపవె అమ్మ! ఏ హారము కూర్చలేని
* సుమదూరుని, పూజెరుగని ఈ పూజారిని
* నను పునీతు కావించిన ప్రపూతా!
* లలిత గుణ సంకలితా శుభచరితా
* నిరుపమితా!
* మితరహితా!
* కవితా! ఓ కవితా
* నేడీ నా మధురోహల
* నవ కోమల విరి హారం
* నిట్టూర్పుల కొలుములలో
* కూర్చుట నే విరమిస్తున్నా!
* కూర్చలేక నే విరమిస్తున్నా!!

* నా రచనల్లో బీదల ఊసులెత్తి
* నా సహానుభూతి ప్రతిఫలించి
* నా గీతం నేతల గుండెలలో మార్మ్రోగి
* నా సాటి జనానికై పాటుపడే
* మంత్రంగా నినదించే నవోదయమ్మున
* నా అక్షర వ్యవసాయం
* సామాన్యుని చేరువగా
* నా సోదర తతికో
* ఆశల మోసుల బంగరు పాదుగ
• ఫలియించే సస్యశ్యామల పర్వంగ
• శాంతి కపోతాల కువకువల
• యుధ్ధం గతమై, జ్ఞాపకమై మిగిలిన తరుణంలో
* ఆ నా మానస గీతం వినిపించి
* నా పల్కుల సిరి విరుల నేరి కూర్చి
* ఆ అక్షరప్రసూన స్రజం అమర్చి
* నీ కర్పించే ధృతినీ, స్థితినీ, నా కీయవే
* అతి త్వరలో, ఈ సుతు మన్నించవే!

మృదు హాసిని! పద భూషణి! గుణ తోషిణి!
కవితా! ఓ కవితా!
రస భరితా, హిత సహితా! ఋషి నమితా
కవితా! ఓ కవితా!
******
(ప్రేరణ యైన అధిక సిరుల శ్రీనివాసీయానికి కృతజ్ఞతలతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here