[ఇటీవల పర్లీ వైద్యనాథ్ క్షేత్రాన్ని దర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]పా[/dropcap]పికొండల మీదుగా గోదావరి నదిలో లాంచీ మీద భద్రాచలం రామభద్రుని దర్శనం చేసుకోని వచ్చి, రెండు వారాలయినా కాలేదు. ఆ యాత్రకు మా మిత్రుడు యోగానంద రాలేకపోయాడు. హైదరాబాద్‌కు దగ్గరలో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనే సంకల్పం కలిగి, వాడికి ఫోన్ చేశాను. వాడు రెడీ!
మిత్రుడు యల్లమందకు ఫోన్ చేశాను. ఆయన వైజాగ్ లోని శంకర్ ఫౌండేషన్ లో ఆ రోజే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడట.
“ఈ సారికి వీరిద్దరూ వెళ్లి రండి మిత్రమా!” అన్నాడు.
మా కోడలు ప్రత్యూషను పర్లీ వైద్యనాథ్‌కు ట్రెయిన్స్ ఏమున్నాయో చూడమన్నాను. చూసి,
“ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నాయి మావయ్యా! స్లీపర్ క్లాస్ చేయమంటారా? థర్డ్ ఎ.సి.నా?” అనడిగింది కోడలు.
సరిగ్గా వారం రోజుల తర్వాత ఉన్నాయట. తిరుగు ప్రయాణంలో కూడా అదే బండి. అక్కడ రెండు రోజులుంటే అన్నీ కవర్ అవుతాయని తెలుసుకోన్నాను. లాడ్జి, అక్కడే వెతుక్కుందామని నిర్ణయించాను. ఆన్‌లైన్‌లో మావాడు బుక్ చేస్తాడుగాని, వాళ్లు చెకిన్ మధ్యాహ్నం 12 గంటల కంటారు. రైలు ఉదయం 6.50కే పర్లీ చేరుతుంది.
మా యోగాకు ఫోన్ చేసి, బయలుదేరే రోజు సాయంత్రానికి హైదరాబాదుకు వచ్చేయమన్నాను. వాడికి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులు ఫ్రీ! అందులోనే వాడు పనిచేశాడు. వాడు ప్రస్తుతం యాద్గిర్ (కర్నాటక) లో ఉన్నాడు, వాడి కొడుకు వద్ద. రెండు రోజుల్లో, రాయచూర్‌లో ఉన్న వాడి రెండో కొడుకు కూతురి పుట్టిన రోజుకు సతీసమేతంగా వెళ్లాలట.
“ఒరేయ్! ఐతే నీవు రాయచూరు నుంచి హైదరాబాదుకు వచ్చేయి. మక్తల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల మీదుగా, గట్టిగా ఐదుగంటల జర్నీ. అయితే అన్నీ కర్నాటక బస్సులు. నీకు ఫ్రీ కాదురోయ్!” అన్నాను నవ్వుతూ!
“పరవాలేదులే శర్మా!” అన్నాడు వాడు నవ్వుతూ. “నేను మధ్యాహ్నం బయలుదేరి 6 గంటలకల్లా చేరుకుంటాను. మన రైలు ఎంతకు? ఎక్కడ నించి?” అడిగాడు.
“రాత్రి 10.45కు రా! నాంపల్లి నుంచి. రైల్వే వాళ్ళు దాన్ని హైదరాబాద్ దక్కన్ అంటారు లే”
“అవన్నీ నా కెందుకు గాని, నీవు ఎంజిబిఎస్ కొచ్చేయి, లేకపోతే మర్యాదగా ఉండదు.”
“ఏం బెదిరిస్తున్నావా?”
“అవును”
“సరే, ఏం చేస్తాం? రాక చస్తానా?” అన్నాను.
మా ధోరణి ఇలాగే ఉంటుంది. మన జీవితంలో అత్యంత స్వతంత్రంగా వ్యవరించగలవాడు స్నేహితుడొక్కడే!
“ఆరామ్‌ఘర్ దాటిన తర్వాత ఫోన్ చేయి. నేను యింటి నుండి బయలుదేరతా!”
“అదెక్కడుందో నాకేం తెలుసు?’
“కండక్టరు నడుగురా వెధవా?”
“సరే సరే”
***
వాడు MGBSలో దిగేసరికి నేను ఉబర్ బుక్ చేసుకుని ఆటోలో చేరుకున్నాను. ఇద్దరం నాంపల్లి స్టేషన్‌కు వెళ్లాం. అక్కడ క్లోక్ రూములో బ్యాగులు పెట్టాం. సమయం 6.30 ని. ఇంకా నాలుగు గంటలు టైముంది రైలుకు.
“అరెయ్ యోగా! ఈలోపు జుబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లిని దర్శించుకుని వద్దాం” అన్నాను.
మీకిదివరకే చెప్పాను ఏకీభవించడంలో మావాడు మొనగాడు!
నాంపల్లిలో మెట్రో ఎక్కి, పెద్దమ్మ గుడి స్టేషన్‍లో దిగాము. హైదరాబాదు లోనే ఉన్నా, నేనూ ఎప్పుడూ వెళ్లలేదు. చాలా పెద్ద గుడి. అమ్మవారు సింహవాహిని. ఆదిపరాశక్తి . ఆమె దివ్య దర్శనం అయింది. ఒక గంట అక్కడ ప్రశాంతంగా గడిపాము.
మళ్లీ మెట్రో ఎక్కి నాంపల్లికి వచ్చేశాము. టైము తొమ్మిదిన్నర. మెయిన్ రోడ్ లోని ఒక వెజిటేరియన్ రెస్టారెంటులో సింగిల్ ఇడ్లీ, సాంబార్, టమోటా ఉతప్పం తిని, మజ్జిగ తాగాం. బ్యాగులు తీసుకొని, ప్లాట్‌ఫాం రెండు పై సిద్ధంగా ఉన్న ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. మాడి S2 కోచ్. ఇద్దరివీ లోయర్ బెర్తులు. కిటికీ లోంచి చల్లని గాలి. హాయిగా పడుకున్నాం.
ఆరున్నరకు లేచి, బ్రష్ చేసుకొని, రెడీగా ఉన్నాము. సరిగ్గా 6.50 నిమిషాలకు వైద్యనాథ్ స్టేషను వచ్చింది. దాన్ని వైజ్‌నాథ్ అని రాశారు. చాలామంది అక్కడ దిగి పోయారు. రెండు వందల మీటర్ల దూరం లోనే మెయిన్ రోడ్. ఒక చాయ్ వాలా దగ్గర షుగర్ లెస్ టీ తాగాము.
ఎదురుగ్గా హాటల్ ‘ఆర్య ఎగ్జిక్యూటివ్’ అన్న బోర్డ్ కనిపించింది. వెళ్లి రూమ్స్ ఉన్నాయా అని వాకబు చేశాము. “ఉన్నాయి సర్! ఎ.సి అయితే పదిహేను వందలు. నాన్ ఎసి అయితే వెయ్యి రూపాయలు” అన్నాడు రిసెప్షనిస్టు.
“రెండూ ఒక సారి చూపించండి “అన్నాను.
సంభాషణ అంతా హిందీ లోనే సాగుతుంది. మరాఠీ మనకు రాదు కదా!
“రెండు రకాలూ ఒకటే సార్. రెండింటిలో ఎ.సి. ఉంటుంది. మీరు నాన్ ఎ.సి. రూమ్ తీసుకుంటే ఎ.సి. వెయ్యం. అంతే”
“మీకు తెలియకుండా మేం వేసుకుంటే?” అతి తెలివి!
“స్విచ్ మా దగ్గరుంటుంది గదా!” అని నవ్వాడతను. ఆ నవ్వులో ‘ఆ మాత్రం తెలియదా, చూస్తే చదువుకొన్నవాడిలా ఉన్నావు!’ అన్న ధ్వని!
రూం చూశాము. చాలా బాగుంది. సోలార్ పవర్. 24 గంటలూ వేడి నీళ్లు వస్తాయి. టి.వి వుంది. అది మాకెందుకు?
“వాతావరణం చల్లగానే ఉందిరా శర్మా ! నాన్ ఎ.సి. చాలు” అన్నాడు యోగా.
“సరే” అన్నాను. చెకిన్ అయ్యాము. బ్యాగ్స్ తీసుకొని వచ్చిన బాయ్ (బాయ్ కాదు మ్యానే) ఇలా అన్నాడు:
“సాబ్! ఆప్ బైద్యనాధ్ మహదేవ్ కా దర్శన కర్తే? అభిషేక్ భీ స్వయం కర్ సక్తే! స్పర్శ్ దర్శన్ కర్ సక్తే! హమారా ఏక్ పండిత్ హై! బహుత్ అచ్ఛా ఆద్మీ హై. ఉన్ కా నామ్ దయాస్వామి. ఆప్ చాహ్తే తో ఉనా కా నంబర్ దూంగా!”
“ఠీక్ హై! నంబర్ దేవ్!” అన్నా! మాకైనా ఎవరో ఒక పండిత్ జీ కావాలి!
దయాస్వామి నంబరు ఫీడ్ చేసుకొన్నాను. అతనికి ఫోన్ చేశాను.
“జై భోలేనాథ్! హార్ హర్ మహదేవ్, బోలియే జీ!” అన్నాడు దయా.
“మేం హైదరాబాదు నుంచి వచ్చాం పండిత్ జీ! మాకు దర్శనం, అభిషేకం చేయించాలి” అన్నాను.
“జరూర్ కరాయేంగే సాబ్! ఆప్ నౌ బజే కే బాద్ మందిర్ పర్ ఆజాయియే. మై ఆప్ కే నామ్ పే టోకెన్ లూంగా!”
“మీరు ఎంత తీసుకుంటారు?”
“పంచామృత, ఏకవార రుద్రాభిషేకం, బిల్వపత్రి, పూలు, మొత్తం నేను చూసుకుంటాను. దక్షిణ యతాశక్తి, యతా ఇచ్ఛా” అన్నాడు.
‘యథా’ను యతా అంటున్నాడు.
“అట్లా కాదు. కరెక్ట్‌గా చెప్పండి “
“పాంచ్ సౌ రూపయే దీజియే”
నాకు సహేతుకంగానే అనిపించింది. “సరే”అన్నాను.
స్నానాలు చేసి, బట్టలు మార్చుకొని, ఆటోలో మందిరానికి బయలుదేరాము. ఒక కిలోమీటరు దూరం. ఆటో వాడు 30 రూపాయలు తీసుకొన్నాడు.
వెళ్లేసరికి తొమ్మిదింబావు! గుడి బయట కాఫీ తాగి, దయాస్వామికి ఫోన్ చేశాను.
“మహాద్వార్ దగ్గరుండండి. వస్తున్నా” అన్నాడు.
చాలా పెద్ద గుడి. ఎత్తు అసలు లేని, చదునైన మెట్లు. వాటి మీదే క్యూ కాంప్లెక్స్. అది కిటకిటలాడుతూంది. దయా స్వామి యువకుడే. నిండా ముఫ్ఫై ఏళ్లుండవు.
మమ్మల్ని నేరుగా శీఘదర్శన్, అభిషేక్ కౌంటరు దగ్గరికి తీసుకొని వెళ్లాడు. సమున్నతమైన ఆలయ శిఖరాలు దర్శనమిచ్చాయి. పైన ‘శ్రీ పర్లీ వైద్యనాథ్ ధామ్’ అని పెద్ద పెద్ద, పోతపోసిన, హిందీ అక్షరాలు ఎండలో మెరుస్తున్నాయి. వాటి మధ్యలో త్రిశూలం!
టోకెన్ నంబరు ముందే రాయించాడతడు. మా నంబరు 22. నేరుగా ఆలయంలోకి వెళ్లాము. “మన వంతు వచ్చేసరికి అరగంట పైనే పడుతుంది. ఇక్కడ కూర్చొండి. పంచామృతం, పత్రి, పూలు, నీరు తెస్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు.
“హరహర మహాదేవ్! జై బోలో వైద్యనాథ్ మహరాజ్ కీ!” అని భక్తులు నినదిస్తున్నారు. ముఖమంటపంలో ఇత్తడి నందీశ్వర విగ్రహలు న్నాయి. ఒక పక్క నాగప్రతిమ. ఉత్సవ పల్లకి వద్ద, పెద్ద పెద్ద వ్యాసాలతో, కళ్లతో వీరభద్రస్వామి ఒక ఉపాలయంతో కొలువై ఉన్నాడు.
ఇంకోవైపున ఒక శిలా వితర్థికపై రెండడుగుల ఎత్తున్న శివలింగం ఉంది. దాని మీద పుష్పాలుంచి భక్తులు నమస్కరించుకుంటున్నారు. క్యూ లైన్ కు కొంచెం వెనుక ఆరడుగుల పానవట్టంపై, మూడడుగుల నల్లని శివలింగం కనబడింది. అందరినీ దర్శించుకున్నాము.
దేవాలయం అంతర్భాగం నల్ల రాతినిర్మాణం. చాలా పురాతనమైనది. పైకప్పుకు దన్నుగా నగిషీలు చెక్కిన నల్లని చెక్క నిలువుగా, అడ్డంగా ఉన్నాయి. అవి నల్లగా నిగనిగ మెరుస్తున్నాయి. పరీక్షగా చూస్తేగాని, అవి చెక్కతో చేయబడ్డాయని తెలియదు.
దయాస్వామి ఇంకా రాలేదు!
“శర్మా! శివుని మీద ఏదైనా స్తోత్రం పాడు! వీడియో తీస్తా” అన్నాడు మిత్రుడు.
“బాగా గుర్తు చేశావురా!” అన్నాను ప్రశంసగా.
“నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై ‘న ‘ కారాయ నమశ్శివాయ!”
అంటూ వైద్యనాధుని స్తుతించసాగాను.
‘న’, ‘మ’, ‘శి’, ‘వ’, ‘య’ కారాలకు ఒక్కో అక్షరానికి ఒక్కో శ్లోకం చొప్పున వచ్చే శ్రీ శివపంచాక్షరీ స్తోత్రం అది!
చివర్లో ఫలశృతి పాడుతుండగా, దయాస్వామి వచ్చాడు. మమ్మల్ని డిస్టర్స్ చేయకుండా, దూరంగా నిలబడ్డాడు.
“పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివీన సహమోదతే!” అని ముగించాను.
“ఆప్ కా ఆవాజ్ బహుత్ అచ్ఛా హై జీ!” అని మెచ్చుకున్నాడు దయా. “పదండి. ఇప్పుడు మనమే” అని గర్భాలయంలోకి దారి తీశాడు.
లోపల వైద్యనాథ లింగం వెలుగులు జిమ్ముతూ ఉంది. పదిపన్నెండు మంది భక్తులు శివలింగం చుట్టా కూర్చుని అభిషేకాలు చేసుకొంటున్నారు. వారిని తెచ్చిన పండిత్‌జీలు నమక చమకాలు పఠిస్తున్నారు. ఎవరి పూజ, ఎవరి శిభిషేకం వారిదే. సైమల్టేనియస్‍గా జరుగుతున్నాయి. పంచామృతాలు, పాలు, నీరు కొందరు స్వామిపై పోస్తున్నారు. కొందరు శివాష్టత్తోరానికి అనుగుణంగా బిల్వపత్రాలతో, పూవులతో, శివలింగమును పూజిస్తున్నారు.
కొందరు మోకాళ్లు మీద వంగి శిరస్సును శివలింగమును తాకించి పునీతులవుతున్నారు. నమక చమక మంత్రాల ఘోషతో గర్భాలయం సాక్షాత్ కైలాసంలా ఉంది.
దయాస్వామి ముందుగా మా గోత్ర నామాలు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పించి, సంకల్పం చేయించాడు.
“శంచమే మయశ్చమే” అని ఆయన ప్రారంభించగానే, నేనూ గొంతు కలిపాను. మా తండ్రిగారు, శతావధాని, బ్రహ్మణ్య పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారి దయ వల్ల, నాకు తొమ్మిదో ఏటనే అలంపుర క్షేత్రంలో బాల బ్రహ్మేశ్వరుని ఆలయంలో, ఉపనయనం జరిగి, ఆయన ద్వారా, అన్నీ నేర్చుకున్నాను. భక్తాగ్రీసరుడైన ప్రహ్లాద కమారుడన్నట్లు, “తండ్రి హరిభీరుమనియెడు తండ్రి, తండ్రి!” అన్న మాట మా నాన్నగారికి చక్కగా సరిపోతుంది. ఈ శరీరంతో పాటు చక్కని సంసారాన్ని, వేద సంస్కృతిని, సాహిత్యాన్ని వారసత్వంగా ఇచ్చారాయన.
“నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః” అంటూ దయాస్యామి, నేను పఠిస్తున్న నమకం గర్భాలయంలో ప్రతిధ్వనించింది. మిగతా పండిత్‌జీలు నన్ను ఆశ్చర్యంగా, ప్రశంసాపూర్వకంగా చూడసాగారు. తర్వాత చమకంలోని తొలి పనస.
తర్వాత అర్చన. “మిధున పతయే నమః” అంటూ మొదలుపెట్టాము. పంచామృతం, పాలు, నీరుతో అభిషేకం తర్వాత బిల్వపత్రాలు, పూలతో స్వామికి అర్చన చేశాము. తీర్థం తీసుకొన్నాము. ఒక అద్భుతమైన అనుభూతి! మనసంతా శివమయమైంది. టైము 11.30. దయాస్వామి చెప్పాడు – “మీలాంటి వారిని అరుదుగా చూస్తాము. ఉదాత్త అనుదాత్తములను చక్కగా పలికించారు. ఎక్కడా స్వరం (వేదపఠనంలోని ఒక రిథమ్) తప్పలేదు.” అంటూ నా చేతులను కళ్ల కద్దుకున్నాడు. ఆయనకు ఆరు వందల రూపాయలు సంభావన యిచ్చి, పాదాలకు నమస్కరించాము. “వైద్యనాథ అనుగ్రహ సిద్ధిరస్తు!” అని దీవించాడు.
“ఇక్కడే అన్నపూర్ణ చారిటీస్ ట్రస్ట్ అని ఉంది. పదకొండు గంటలనుంచీ అన్నప్రసాద్ వితరణ మొదలవుతుంది. స్వామివారి ప్రసాదం తీసుకుందురుగాని, రండి!” అంటూ దారి తీశాడు.
దేవాలయానికి అనుకోనే ఉంది అన్నప్రసాదాలయం. లోపల పాల రాతితో చేసిన నాలుగడుగుల అన్నపూర్ణా దేవి విగ్రహం ఉంది. అమ్మ చల్లగా నవ్వుతూ ఉంది. ఒక చేతిలో గరిటె ధరించింది.
దయా పండితుడు మాకో టోకెన్ ఇప్పించాడు. లోపల కేవలం వందమంది పట్టే హలు. బయట వందమందికి టికెట్లిచ్చి కూర్చోబెడుతున్నారు. లోపలి వాళ్లు బోజనం అయింతర్వాత, బయటి వాళ్లను అనుమతిస్తున్నారు.
మా నంబర్లు పిలిచారు మైకులో! పెద్ద పేపరు ప్లేట్లు పెట్టారు. పల్చని, మృదువైన జొన్నరొట్టె, పప్పు, ఒక పలచని ఆకుకూర, చిన్న గులాబ్ జాం, ఒక గరిటె అన్నం వడ్డించారు. “హరహర మహాదేవ్! జై వైద్యనాథ్!” అని మైకులో అరిచారు. భోజనం బాగుంది. ఆ జొన్నరొట్టెలయితే అద్భుతంగా ఉన్నాయి. పొరలు పొరలుగా వస్తున్నాయి. ఎన్ని రొట్టెలు కావాలన్నా వేస్తున్నారు. కానీ అన్నం మాత్రం రావడం లేదు! మన తెలుగు వాళ్లం అన్నగత జీవులం కదా! చివరికి “కొంచెం అన్నం పెట్టగలరా?” అని ఒక ఆమెని అడిగితే ఆమె వెళ్లి అన్నం బేసిన్ తెచ్చి, కొంత అన్నం వడ్డించి పోయింది. చిక్కని మజ్జిగ అందులో పోయించుకొని తిన్నాము.
నేను, కూర్చునే, అన్నపూర్ణాష్టకములోని ఒక శ్లోకాన్ని భూపాల రాగంలో పాడాను.
“నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందీహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!”
శ్లోకం పూర్తి కాగానే భోక్తలందరూ హర్షధ్యానాలు చేశారు. కొందరు నా దగ్గరికి వచ్చి “బహుత్ అచ్ఛా గాయా ఆప్ నే” అని మెచ్చుకొన్నారు
ఆటోలో లాడ్జ్ చేరుకునే సరికి పన్నెండు ముప్పావు. నాలుగు వరకు హాయిగా విశ్రమించి, దయాస్వామికి ఫోన్ చేశాను “పండిత్‍జీ! నమస్కార్” అన్నాను.
“హర్ హర్ మహదేవ్! బోలియే దత్తాజీ!”
“ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవాలయాలు దర్శించాలనుకుంటున్నాము. మీ సలహా కావాలి”
“నేను మీ దగ్గరికి, నా శిష్యుడు, ఒక ఆటో అతన్ని పంపిస్తాను. అతని పేరు కూడ దత్తా త్రిభువన్. వీరు ఒక అరగంటలో సిద్ధంగా ఉండండి. రాత్రి ఎనిమిదిన్నర వరకు, మీరు యోగేశ్వరీమాత శక్తి పీఠం, సోమేశ్వర మహాదేవ్ ఆలయం చూసి రండి.”
“ధన్యవాద్! మేం రెడీగానే ఉన్నాము. అతన్ని రమ్మనండి. ఈలోపు పర్లీ వైద్యనాథ్ క్షేత్ర పాశస్త్యాన్ని కాసేపు వివరిస్తారా, దయచేసి?”
“తప్పకుండా.”
నేను ఫోన్‌ను స్పీకర్ మోడ్‍లో పెట్టాను, యోగా కూడా వింటాడని. లేకపోతే, ఆయన ఏం చెప్పాడో చెప్పమని నన్ను సతాయిస్తాడు. దయాస్వామి చెప్పసాగాడు.
పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం, మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ఉంది. మందిరం ఉన్న ప్రాంతాన్ని హబీబీపుర అంటారు. దేవాలయం 75-80 మీటర్ల ఎత్తున్న గుట్టపై నిర్మించారు. ముఖ్యద్వారానికి ఇత్తడి తాపడం చేశారు. 1706లో, ఔరంగజేబు ధ్వంసం చేసిన ఈ గుడిని పునరుద్ధరించారు. దానిని నిర్వర్తించింది రాణి – అహల్యాబాయి కేల్కర్.
ఇక్కడ పరమేశ్వరుడు వైద్యనాథుడుగా ప్రసిద్ధుడు. ఆయనకు అభిషేకం చేసి, శివలింగాన్ని స్పర్శిస్తే, ఎటువంటి వ్యాధులైనా నయమౌతాయని భక్తుల విశ్వాసం. అభిషేక సమయంలో భక్తులు (మగవారు) పైన ఏ ఆచ్చాదన లేకుండా ఉండాలి. (మేం కూడా షర్ట్‌లు, బనియన్లు విప్పేశాము).
సతీ సావిత్రీ కథ ఇక్కడే జరిగిందని ఐతిహ్యం. మద్ర దేశాధిపతి అశ్వపతి సావిత్రి తండ్రి. అప్పుడు దీనిని ‘పరలి’ అనేవారట. భక్త మార్కండేయుడు ఇక్కడ యముని నుండి రక్షించబడినట్లు చెబుతారు.
ఈ జ్యోతిర్లింగము తేజోరూపమైన శివుడు. స్వయంభూ. శివపురాణంలో రావణుడు దీనిని ప్రతిష్ఠించాడని చెప్పబడింది. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ 7వ శతాబ్దంలో ఈ క్షేత్రాన్ని సందర్శించాడు. చాళుక్యులు, యాదవులు, భోంస్లేలు దీనిని అభివృద్ధి చేశారు.
ఆలయ నిర్మాణరీతిలో హేమాడ పంతీ మరియు ఇండో-ఆర్యన్ ఆర్కిటెక్చర్ శైలి ద్యోతకమవుతుంది. విశాలమైన ప్రాంగణం, కుడ్యాలపై చెక్కిన మనోహరమైన లతలు, పూలు, దేవతల బొమ్మలు ఆలయవైభవాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. భారతదేశం లోని ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి.
పర్లీ పారిశ్రామికంగా కూడ అభివృద్ధి చెందింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పర్లీ థర్మల్ స్టేషన్‌ను నెలకొల్పింది. వైజ్‌నాథ్ షుగర్స్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ఉన్నాయి” చెప్పాడాయన.
“బహుత్ బహుత్ ధన్యవాద్, దయాజీ!” అన్నాను.
“మీకు రేపు ట్రయిన్ ఎప్పుడు?”
“రేపు రాత్రి పదిగంటలకు “
“ఈరోజు సాయంత్రం యోగేశ్వరి మాత శక్తిపీఠ్, సోమేశ్వర మహాదేవ్ లను దర్శించండి. రేపు ఉదయాన్నే బయలుదేరి, ఔంధా నాగనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లండి.”
“అది ఎంత దూరం?”
“120 కి.మీ. బస్సులున్నాయి. కాని పర్బనికి వెళ్లి బస్సు మారాలి. ఫ్రీక్వెన్సీతక్కువ”
“వద్దు దయాజీ! మాకో ఒక టాక్సీ మాట్లాడండి ప్లీజ్”
“తప్పకుండా. రేపు ఉదయం 8 గంటలకు కారు వస్తుంది. డ్రైవరు నా శిష్యుడు. వాటి పేరు పినాక్ పాణి. ఔంథా చూపించి మధ్యాహ్నానికి మళ్లీ మిమ్మల్ని పర్లీకి తీసుకొస్తాడు.”
“ఎంత తీసుకుంటాడు?”
“మామాలుగా అయితే పైంతీస్ సౌ రూపయే. మీకు ఐదువందలు తగ్గించమని చెబుతాను లెండి.”
నేను లెక్కలు వేశాను. రానూపోనూ 240 కి.మీ. కిలోమీటరుకు 12 రూపాయలనుకున్నా 2880/- అవుతుంది. మూడువేలు సహేతుకమే!
“అలాగే జీ” అన్నాను.
“ఔంథాలో మా తమ్ముడే పండిత్‍జీ ఉంటాడు. ఆయన నంబర్ పంపిస్తాను. ఆయన పేరు గజానన్ మహరాజ్. ఆయన మీకు దగ్గరుండి దర్శనం అభిషేకం చేయిస్తాడు.”
“బహుత్ ధన్యవాద్.”
“మీరు మాటిమాటికీ కృతజ్ఞతలు చెప్పకండి దత్తాజీ! మీరు పెద్దవారు. పండితులు. మా పితృసమానులు” అన్నాడాయన. సంస్కారవంతుడు!
నాలుగు నలభైకి దత్తా త్రిభువన్ ఆటోతో వచ్చేశాడు. స్టేషన్ బయట, మెయిన్ రోడ్‌లో టీ తాగి బయలుదేరాం, సమోసా చాట్ తిన్న తరువాత.
దత్తా చెప్పాడు. “యోగేశ్వరి మాత మందిరం ఇక్కడికి 25 కి.మీ. ఉంటుంది సార్. హైవే నించి ఒక ఎనిమిది కి.మీ. పక్కకు వెళ్లాలి. ఆ రోడ్ బాగుండదు. గంట ప్రయాణం”
“మీ ఇద్దరి పేర్లు ఒకటే కావడం విశేషంరా శర్మా” అన్నాడు యోగానంద మహరాజ్.
నేను నవ్వాను. “మహారాష్ట్రలో దత్తస్వామి కల్ట్ చాలా ఎక్కువ. ఇలా ఒకే పేరున్న వాళ్లను ఇంగ్లీషులో ‘Namesake’ అంటారు.” అన్నా.
మేము యోగేశ్వరి శక్తిపీఠం చేరేసరికి అరు కావస్తోంది.
***
యోగీశ్వరి క్షేత్రం పర్బని జిల్లా క్రిందికి వస్తుంది. పర్బని చాలా పెద్ద పట్టణం. రైల్వే జంక్షన్ కూడా. మేం అంతవరకు వెళ్లలేదు. దారిలో గంగాఖేడ్ అన్న ఊరు వచ్చింది. దాని ప్రక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది. అక్కడ శ్రీ సంత్ జనాబాయి జన్మస్థలం ఉందని దత్తా చెప్పాడు. ఆమె ఒక యోగిని. గంగాఖేడ్ కూడా పెద్ద పట్టణమే.
యోగేశ్వరీ మాత ఆలయం విశాలంగా ఉంది. ప్రధాన ద్వారం ఒక ఆర్చి రూపంలో ఉంది. ‘మా యోగేశ్వరీ శక్తిపీఠ్’, అని హిందీలో అక్షరాలను సిమెంటుతో తాపడం చేసి ఉన్నారు. ఆవరణలో సహస్ర దీపాలంకరణ కోసం 40 అడుగుల ఎత్తున్న దీపస్తంభం ఉంది.
గర్భగుడిలో అమ్మవారు ఒక బండరాయి రూపంలో, స్వయంభువుగా వెలసి ఉంది. చేరెడెంత కళ్ల తల్లివి. ఆ రాయికి బంగారపు పూత పూసిన తొడుగు అమర్చారు. గర్భాలయం ఒక గుహలా ఉంది.
ముందు ముఖమంటపం నల్లరాతి శిల్పాకృతులు గల స్తంభాలతో అలరారుతూంది. పైకప్పు ఎత్తు చాలా తక్కువ. బయట మూడు గోపురాలు రకరకాల దేవతామూర్తులతో శోభిల్లుతున్నాయి. చుట్టూ చిన్న స్తంభాలు దింపిన నడవా. దాని ముందు చక్కని రాతి అరుగులు భక్తులు కూర్చోడానికి వీలుగా ఉన్నాయి. కొందరు ధ్యానం చేసుకుంటున్నారు.
అక్కడ ఒక నోటీసు బోర్డు లాంటిది ఉంది. దాని మీద ఇంగ్లీషులో, మరాఠీలో ఆలయ ప్రాశస్యం గురించి రాసి ఉంది. “శర్మా, ఇది చదివి, నాకు చెప్పు అని ఆర్డర్ వేశాడు మా యోగా. మరాఠీ మన కెలాగూ రాదు. ఇంగ్లీషు వెర్షన్ చదివి, చెప్పానిలా.
“ఈ ఆలయం ఉన్న ఊరి పేరు, అంబా జోగాయి. భారతదేశం లోని అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఇది ఒకటి. అమ్మవారు సాక్షాత్ దుర్గాదేవే. ‘అంబాబాయి’ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె మహారాష్ట్ర ప్రజలకు కులదేవత. కొంకణ్ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా.
ఆలయనిర్మాణం హేమాద్రి పంతీ శైలిలో ఉంది. స్తంభాల మీద అతి సున్నితమైన చెక్కడపు పని ఉంది. ఉత్తర ద్వారాన్ని ఆనుకొని ఒక కోనేరు ఉంది. దాని పేరు ‘సర్వేశ్వర్ తీర్థ్’. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
‘ముకుందరాజ్’ అన్న మహాపండితుడు ఇక్కడివాడే. ఆయన ‘వివేక్ సింధు’ అన్న గ్రంథం మరాఠీ భాషలో వ్రాశారు. ఆయన అరచేతిలో బ్రహ్మదేవుడు దర్శనమిచ్చేవాడని ఐతిహ్యం”.
అమ్మవారి విగ్రహం ముందు ఆమె వెండి పాదుకలున్నాయి. వాటిపై శిరస్సు ఆన్చి ప్రణమిల్లాము.
ముఖమండపంలో ఒక పెద్ద వెండి కూర్మము (తాబేలు) తాపడం చేసి ఉంది. ఇంతింత కళ్లు పెట్టుకుని తల్లి మమ్మల్నే చూస్తున్నట్లుగా ఉంది. పర్లీకి తిరుగు ప్రయాణం అయ్యాం.
పర్లీకి ఐదు కి.మీ. ముందే ఎడమవైపు ఒక రోడ్డు లోకి మళ్లించాడు ఆటోను మా దత్తా త్రిభువన్. రోడ్డు ఘోరంగా ఉంది. చుట్టూ అడవి. కొండ దిగువకు చేరుకున్నాము. తల ఎత్తి చూడవలసినన్ని మెట్లు కనబడ్డాయి. పైన వెలసి ఉన్నాడు సోమేశ్వర మహదేవ్. దత్తా అన్నాడు. “ఘుబరావో మత్, కాకాజీ! ఆటో ఊపర్ మందిర్ తక్ జా సక్తీ హై”
‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నా. యోగా గాడు నవ్వుతున్నాడు. బక్క వెధవ! ఎన్ని మెట్లయినా ఎక్కగలడు.
“ఆటో పైకి వెళ్లకపోయి ఉంటే ఏం చేసేవాడివి?” అనడిగాడు నన్ను ఉడికించాలని.
“రెయిలింగ్ ఉందిగా, మెల్లగా ఎక్కేసేవాణ్ణి” అన్నా నవ్వుతూ.
“మెట్లెక్కడం రచనలు చేసినంత సులభం కాదు దత్తశర్మగారు!” అన్నాడు వాడు.
“నీ మొహం” అన్నా నేను.
ఆటో కొండదారిలో ఎక్కసాగింది. కచ్చా రోడ్డు, గతుకులు. దత్తా లాఘవంగా నడుపుతున్నాడు. పది నిమిషాల్లో మందిరం చేరాము.
గుడి దిగువన ఉంది. ఇరవై మెట్లు దిగి వెళ్లాలి. మందిరం విశాలంగా ఉంది. గర్భాలయంలో, సోమేశ్వరుడు ఒక సాలగ్రామ శిలారూపంలో వెలసి ఉన్నాడు. ఒక గుంతలాంటి ప్రదేశంలో ఉన్నాడు. ఒక క్రమమైన ఆకృతి లేదు. అడుగు వెడల్పు, రెండడుగున్నర పొడవు ఉంది ఆ లింగాకృతి.
పండిట్‌జీ శివలింగాన్ని పానవట్టాన్ని ఒక పైపు పెట్టి నీటితో కడుగుతున్నాడు. భక్తులెవ్వరూ లేరు.
“అభిషేకం చేసుకోవచ్చా” అనడిగితే “అవశ్య్” అన్నాడాయన.
ఇద్దరం షర్ట్‌లు, బనియన్లు విప్పి, పక్కన కంచుబిందె లోని నీటిని ఒక చెంబుతో తీసుకొని స్వామికి అభిషేకం చేసాము. కేవలం ఒక పనస మాత్రం చెప్పాను.
“విశ్వేశ్వరాయ మహదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ సదాశివాయ, శ్రీమన్మహాదేవాయనమః”
పండిత్‍జీకి ఒక వంద రూపాయలు దక్షిణ యిచ్చి మొక్కాము. ముఖమంటపంలో ఒక వితర్థిక మీద కూర్చున్నాము.
“మంచి శివస్తోత్రము పాడురా శర్మా. ప్రశాంతంగా ఉంది” అన్నాడు యోగా.
యాజ్ఞవల్క్య మహర్షికృతమైన శ్రీ శివరక్షా స్తోత్రాన్ని నేను శ్రావ్యంగా గానం చేస్తుండగా, యోగా వీడియో తీశాడు.
“గంగాధరః శిరః పాతు భాలం అర్ధేన్దుశేఖరః
నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః”
ఈ స్తోత్రమును సాక్షాత్ శ్రీమన్నారాయణుడు యాజ్ఞవల్క్య మహర్షికి స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పాడట. ఉదయం ఆయన దాన్ని గ్రంథస్థం చేశాడని ఐతిహ్యం. పండిత్‍జీ బయటకు వచ్చి స్తోత్నాన్ని శ్రద్ధగా విన్నారు.
పైన ఒక ఆవరణలో సిమెంట్ బెంచీలు వేసి ఉన్నాయి. అక్కడ కనీసం రెయిలింగ్ కాని, పిట్టగోడ గాని లేవు. అక్కడనుంచి పర్లీ పట్టణం దీపసమూహంలాగా కాంతులీనుతూ, విశాలంగా కనబడింది. అక్కడ ఉన్న ఒక ఫలకాన్ని చదివాను. అది ఇంగ్లీషు, మరాఠీలో ఉంది. అందులో పెద్ద విశేషాలేవీ లేవు. మేం రూం చీరేసరికి తొమ్మిదవుతుంది. ఒక హోటల్లో పుల్కా, టమోటా కర్రీ తిని విశ్రమించాము.
***
మర్నాడు ఉదయం పావు తక్కువ ఎనిమిదికీ డ్రైవర్ కారు తీసుకొనివచ్చాడు. పినాక్ పాణి! మధ్యలో ఒక చోట బ్రేక్‌ఫాస్ట్‌కు ఆపాడు. ఆ హోటలు పేరు సౌదామిని రెస్టారెంట్. హైవే మీద ఉంది. అక్కడ పొగలు కక్కుతున్నపోహ, మిర్చి వడ (బ్రెజ్సీ) ఉన్నాయి. ‘ఇకనేం మన ఉగ్గాని బజ్జీ లాంటిదే’ అనుకున్నాము. కానీ పోహ బిరుసుగా ఉన్నట్లు అనిపించి, వడ సాంబారు, సింగిల్ పూరీ తిన్నాం. అక్కడ మంచి కాఫీ కూడా దొరికింది.
మేము ఔంథా చేరేసరికి పదిన్నర. గజానన్ మహారాజ్ మేము పర్బని దాటగానే ఫోన్ చేయమన్నాడు. చేశాము. పార్కింగ్ దగ్గర నుంచి చేస్తే, ఆయన ఎత్తి ఇలా చెప్పాడు.
“మాఫ్ కర్నా దత్తాజీ! అత్యవసరమైన పని. అయినా మా బావమరది హృషీకేశ్ దీక్షిత్‌ను పంపుతున్నాను. మీరు షూస్ భద్రపరచుకునే చోట ఉండండి.”
ఐదు నిమిషాల్లో వచ్చాడు హృషీకేశ్. నిండా పద్దెనిమిదేళ్ళు కూడా ఉండవు. బాలపరమేశ్వరుడిలా ఉన్నాడు. మమ్మల్ని నేరుగా ఆలయంలోకి తీసుకు వెళ్లాడు. చాలా పెద్ద గుడి.
మహత్తరమైన గోపురాలు. చుట్టూ అమూల్యమైన శిల్పసంపద. లోపలికి ప్రవేశించాము. ముఖమంటపం, నల్లరాతి స్తంభాలతో అలరారుతుంది. ఒక పదహరేళ్ళ పడుచు అక్కడ కూర్చుని శంఖనాదం చేస్తూంది.
అక్కడ నాగనాథుడు భూగర్భంలోని ఒక గుహలో ఉన్నాడు. దానిలోకి ప్రవేశించడానికి ఒక బిలం ఉంది. మొదటి మెట్టే మూడడుగుల ఎత్తుంది. నాకు భయం వేసింది.
“యోగా! నీవు వెళ్లి దర్శనం చేసుకోని రారా! నేను దిగతాను” అన్నాను. హృషీకేశ్ ఒప్పుకోలేదు. అక్కడ భక్తులను ఒక క్రమపద్ధతిలో క్రిందికి పంపిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ వాళ్లున్నారు. వారికా పిల్లవాడు ఏదో చెప్పాడు. వాళ్లిద్దరూ నన్ను చంకల క్రింద చేయి వేసి, పైకెత్తి, చక్కగా మెట్టు మీద దింపారు.
అక్కడనుంచి ఒక ఐదడుగుల పొడవు బిలం ఉంది. అది కేవలం మూడడుగుల వెడల్పు, రెండున్నర అడుగుల ఎత్తు ఉంది. భక్తులు మోకాళ్ల మీద, చేతుల మీద దోగాడుతూ వెళుతున్నారు. “హరహర మహాదేవ! శంభో! శంకర!” అని నినదిస్తూ మోకాళ్లపై వంగి చేతులు ముందుకు నేలపై ఆన్చి, వెళ్లాను.
లోపల గుహ కూడా నాలుగైదు అడుగుల ఎత్తే ఉంది. ఔంథా నాగనాథుడు నల్లని శివలింగం. రెండడుగుల ఎత్తున్నాడు. చుట్టూ పానవట్టం. వైద్యనాథ్ లాగే భక్తలు చుట్టూ కూర్చొని అభిషేకాలు, అర్చనలు చేసుకుంటున్నారు. హృషీకేశుడు మాతో గోత్ర నామాలు చెప్పించి, సంకల్పం చేయించి, లఘున్యాస అభిషేకం చేయించాడు. ఏ మాత్రం వెంటిలేషన్ లేదు. కానీ చక్కగా ఊపిరాడుతూ, చల్లగా ఉంది. భక్తులు తోసుకోకుండా, క్రమశిక్షణతో ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు. ఒక ఐదారు మందిని ఒక్కసారి వదుల్తున్నారు సెక్యూరిటీవారు.
హృషీకేశ్ ముందుగా పైకి వెళ్లాడు. ఎక్కడ సంపాదించాడో. రెండడుగుల ఎత్తున్న ప్లాస్టిక్ స్టూలు తెచ్చి, పై మెట్టుకో ఒక మూలన వేశాడు. దాని వల్ల నేను బిలంలో పాకుతూ వచ్చి, ఆ మెట్టును అవలీలగా ఎక్కగలిగాను.
బయటికి వచ్చాము. బాల పండిత్‌కి ఐదు వందలిచ్చి మొక్కాము. సెక్యూరిటీ వాళ్లకు రెండు వందలిస్తే, వారు మొదటి వద్దన్నారు. బలవంతపెడితే తీసుకున్నారు.
బయట శిల్పసంపదను వీడియో తీశాము – అక్కడ అంగారఖా, తలపాగా ధరించి, నెమలి ఈకలతో చేసిన అందమైన ఒక టోపీని ముందు పెట్టుకుని కొందరు కూర్చున్నారు. ఒకాయన దగ్గరికి వెళ్లి, ఇది ఏమిటని అడిగాము. ఆయన ఇలా చెప్పాడు.
“మేము కృష్ణుని తండ్రి వసుదేవుని వంశానికి చెందినవాళ్లము. యాదవులం. నా పేరు నాగనాథ్ జాదవ్. మీ పితృదేవతల పేర్లు చెప్పండి. ఈ టోపీ మీ తల మీద పెట్టి వారికి సద్గతులు కలగాలని దీవిస్తాం.”
“మీకెంత ఇవ్వాలి?”
“ఆప్‍కీ ఇచ్ఛా మహారాజ్!’
నేను, యోగా, ఆయనతో, మా పితృదేవతల పేర్లు (తండ్రి, తాత) చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాము. ఆయనకు యాభై రూపాయ లిచ్చాము. ఒక చోట ప్రశాంతంగా కూర్చున్నాం. అక్కడ ఒక రావి చెట్టుంది. దాని ఆకులు గలగల శబ్దం చేస్తూ, నాగనాథస్వామిని ప్రార్థిస్తున్నాయి. అక్కడ ఒక గైడ్, క్షేత్ర ప్రాశస్త్యాన్ని యాత్రికులకు హిందీలో వివరిస్తున్నాడు. వెళ్లి విన్నాం. హిందీ కాబట్టి నాకర్థమైంది.
“ఈ క్షేత్రం హింగోలీ జిల్లాలో ఉంది. మరట్వాడా ప్రాంతం ఇది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఎనిమిదవది. ఇక్కడికి దగ్గరలో సిద్ధేశ్వర్ డ్యాం, 15 కి.మీ దూరంలో ఉంది. ఇది ‘లేజర్ ఇంటర్‍ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్బర్వేటరీ’ (LIGO) – ఇండియా ప్రాజెక్ట్ కోసం గుర్తించబడింది. ప్రపంచంలోనే, గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే పరిశోధనా కేంద్రాలతో ఇది ఐదవది.
ఈ స్వామిని పాండవాగ్రజుడైన ధర్మరాజు ప్రతిష్ఠించి, పైన ఈ ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. ఇది వారి అరణ్యవాస సమయంలో జరిగిందని అంటారు. గుడి బయట శిల్పకళ అసాధారణం. మందిరం మొత్తం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. హేమాడ్ పంతీ నిర్మాణశైలి.
ఔరంగబాబు, దీనిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా, అతని సైనికుల పై తేనెటీగల గుంపు దాడి చేసి తరిమిందని ఐతిహ్యం. శివలింగం చుట్టూ సర్పాకృతి ఉంటుంది. రాణి అహల్యాబాయి కేల్కర్ ఈ మందిరాన్ని పునర్నిర్మించారు.
సంత్ నామ్‌దేవ్ మహారాజ్ రోజూ నాగనాథుని దర్శించి, స్వామిపై కీర్తనలు రచించి పాడేవారు. పూజలకు అంతరాయమని పూజారులు ఆయనను రావద్దన్నారట. అప్పుడు స్వామి ఆయన కభిముఖంగా తిరిగాడట. అందుకే నందీశ్వరుడు ఈ క్షేత్రంలో స్వామి ఎదురుగ్గా ఉండడు.
ఈ ప్రాంతాన్నే దారుకావనం అంటారు. దారుకాసురులనే రక్కసులు మునులను పీడించేవారు. శివుని వారు వేడుకుంటే, ఆయన దారుకుని శిక్షించాడట. వారూ శివ భక్తులే. వారి వనాన్ని దూరంగా ఒక ద్వీపానికి తరలించమని చెప్పాడట శివుడు.
సుప్రియుడనే శివ భక్తుడు రుద్రమంత్రమును జపిస్తే, శివుడు జ్యోతిర్లింగ రూపములో ఇక్కడ కొలువైనాడని మరో ఐతిహ్యం.”
ఇదంతా మావాడికి తెలుగులో వివరించాను. నేను తగ్గించానేమోనని వాడి అనుమానం!
“అదేమీ లేదురా”, అంటే వినడే!
పన్నెండున్నరకు తిరుగుప్రయాణం. పర్బనిలో లంచ్. దారిలో ఒక ‘నరసింహ సంస్థాన్’ ఉందని, హైవేకు ఐదు కిలోమీటర్లు అని చెప్పి, “చూపించమంటారా?” అని అడిగాడు పినాక్ పాణి. సంతోషంగా అంగీకరించాము. మా నరసింహుడు ఎక్కడున్నా మమ్మల్ని పిలిపించుకుంటాడు!
ఆలయం పెద్దది. స్వామి నాగనాథుని లాగే ఒక గుహలో ఉన్నాడు. చిన్న, మనిషి పట్టేంత బిలం. దాంట్లోంచి పాకుతూ వెళ్లి దర్శనం చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగేంత చోటు లేదు. అలాగే కాళ్లు బయటికి పెట్టి వెనక్కు రావాలి. యోగా గాడు వెళ్లి వచ్చి, ఒక ఉపాయం చెప్పాడు.
“నీవు పడుకొని, తల మాత్రం లోపలికి పెట్టి, పడుకునే స్వామిని దర్శించు. తర్వాత నీ కాళ్ళు పట్టి నేను వెనక్కి లాగుతాను” అన్నాడు. అట్లే చేశాను. ప్రసన్నవదనుడు, లక్ష్మీ దేవిని అంకపీఠిపై నిల్పిన నృసింహుని కనులారా దర్శించుకున్నాను. నా హృదయం ఆర్ద్రమైంది.
మేము పర్లీ చేరేసరికి నాలుగు దాటింది. విశ్రాంతి తీసుకొని, స్టేషన్ దగ్గరే ఇడ్లీలు తిని, 9.50కి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పడుకున్నాము. ఉదయం 7 గంటలకు నాంపల్లిలో దిగాము. యోగాను ఎం.జి.బి.ఎస్.లో దింపాను. వాడు రాయచూరుకు వెళ్లిపోయాడు. నేను ఇల్లు చేరాను!