[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ”. [/box]
[dropcap]సుం[/dropcap]దరం ఎక్కడి నుంచో తీసి ఓ ఎర్ర చొక్కా తగిలించుకున్నాడు.
“నీలో ఓ గొప్ప గుణం ఉంది” అన్నాను.
“పేపర్లో వ్రాసాడు ఈ రోజు”
“ఏంటి?”
“అవమానం జరుగుతుందని”
“అందుకు ఎర్ర షర్ట్ ఎందుకు?”
“అది కాదు. నువ్వే అవమానం చేసేశావు”
“నేనా?”
“అవును. ఓ గొప్ప గుణం ఏంటి? నాన్‌సెన్స్”
“అలాక్కాదు మిత్రమా! గరీబోడిని. ఒకసారి ఒకటే గుర్తుకొస్తుంది”
“సరే! ఇంతకు ఏం గుర్తుకొచ్చింది?”
“ఎవరు ఏమనుకుంటారు? ఇలాంటివి పట్టించుకోవు. నీ దారి నీదే!”
“చివరికి మిగిలేది ఎవరి దారి వారిదే, వేదాంత శాస్త్రం కూడా వచ్చేసింది.
“ఈ ఎర్ర గులాబీలెందుకు?”
“ఓ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి”
“ఎందుకు?”
“అక్కడ ఓ సమ్మె జరుగుతోంది. మనం మిర్చీ సప్లయర్స్”
“బాగుంది… సమ్మెలో మిర్చీలా?”
“పిచ్చివాడా!…” సుందరం కాలు కుర్చీ మీద పెట్టాడు.
“కాస్త జాగ్రత్తగా ఆలోచించు. నాలుక కాలిన తర్వాతే జీవిత సత్యాలు నిప్పులా మనలను తాకుతాయి. అందులోంచి నిప్పు రగులుతుంది. ఆ తర్వాత పోరాటం… ఆ తరువాత తిరుగుబాటు. ఉద్యమాలు అక్కడి నుండే ప్రారంభమవుతాయి”
“అంతుందా?”
“మరి? అసలు మనిషంటే ఎవరు?”
“నాకు తెలియదు. తెలుసుకోవాలని అనుకోవడం లేదు కూడా”
“వద్దు. ప్రతి మనిషిలోనూ ఓ మార్క్స్ దాక్కునుంటాడు. మనిషి మిర్చీ తినిన తర్వాత ఇవతలకి వచ్చి మార్కులేస్తాడు. అంతవరకు ఎందుకు? తెనాలిలో ప్రసంగిస్తూ గాంధీగారు మిర్చీ సామాన్యమైనది కాదు అన్నారు. ఇందులో కారం ఉన్నదని తెలిసి కూడా మనిషి దాన్ని ఆస్వాదిస్తున్నాడంటే ఇది నిజమైన సత్యాగ్రహం! ఒకరిని హించించకుండా అహింసామార్గంలో తనను తాను హింసించుకుంటూ రుచిని ఆస్వాదించే ప్రక్రియ పూర్తి గాంధేయ మార్గం అన్నారు…!”
సుందరాన్ని ఆపాను.
“రేయ్! ముందర పని చూడు”
“కరెక్ట్. పద! బండీ రెడీ!”
***
ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులందరూ సమ్మెలో కూర్చున్నారు. విద్యార్థుల లీడర్ మైకులో చెబుతున్నాడు.
“ఫ్రెండ్స్! కాలేజీలో లక్షలు లక్షలు కట్టి మన పేరెంట్స్ నానా ఇబ్బందులు పడి ఇక్కడ చేరిపిస్తే అమ్మాయిలను ఆ డ్రెస్ వేస్కోవద్దు, ఈ డ్రెస్ వేసుకోకూడదు అని కాలేజీ యాజమాన్యం వారు దౌర్జన్యం చేయడాన్నినిరసిస్తూ మనమందరం మరి ఈ రోజు సమ్మెలోకి దిగాం. ఒక్కసారి గొంతు ఎత్తి చెప్పండి – కాలేజీ యాజమాన్యం డౌన్ డౌన్!”
నినాదాలతో ఆకాశం మారుమ్రోగింది. పోలీసులు మిర్చీ బండీ దగ్గరకొచ్చి చక్కగా ఆరగిస్తున్నారు. కుర్రాళ్ళు, అమ్మాయిలు బండిని ముట్టడి చేశారు. సుందరం వ్యాపారం మామూలుగా లేదు.
మైకు ముందుకు ఓ అమ్మాయి వచ్చింది.
“దుస్తుల్లో ఇవి సంప్రాదయపు దుస్తులు, ఇవి మరో రకం దుస్తులు అని ఎక్కడైనా వ్రాశారా? ఏంటి ఈ దౌర్జన్యం? స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. మాకు నచ్చినవి మాకు నప్పేవి మేం తొడుక్కుంటాం. అదుగో చూడండి, అక్కడ ఓ కామ్రేడ్ మిర్చీ బజ్జీలు అమ్ముతున్నాడు. ఇలాగే వీళ్ళ ఆటలు కొనసాగితే రేపు ప్రొద్దున ఆ బజ్జీలు కూడా తినడానికి లేదని చెబుతారు. ఫ్రెండ్స్, ఆలోచించండి. కాలేజీ స్వేచ్ఛను కాపాడుకోండి. నేను గట్టిగా చెబుతాను, మీరు రిపీట్ చెయ్యండి. మెస్ ఇన్‌ఛార్జ్ డౌన్ డౌన్…”
అందరూ ఏమన్నారో తెలియలేదు కానీ పెద్దగా గోల చేశారు. సుందరం చాలా బిజీగా ఉన్నాడు. ఓ చెట్టు క్రింద వెళ్ళి నిలబడ్డాను. మైకు గీ అంటోంది. ఇంతలో ఓ పాట ప్రారంభమైంది… “తెలుగు వీర లేవరా – దీక్ష బూని సాగరా… దేశ మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా… చెట్టు క్రింద ఇద్దరు కుర్రాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళకు దగ్గరగా వెళ్ళాను.
“అసలు ఏమైందయ్యా? ఎందుకు సమ్మె?”
“ఏం లేదు సార్…!” ఒకడు చెప్పాడు. “… ఈ క్యాంపస్ మొత్తం సి.సి. కెమెరాలున్నాయి సార్. మొన్న మెస్‌లోకి ఇద్దరు అమ్మాయిలు చాలా పొట్టి స్కర్ట్స్ వేసుకుని వెళ్ళారు. కుర్రాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ కామెంట్స్ చేస్తున్న సీను మెస్ ఇన్‌ఛార్జ్ చూసి అమ్మాయిలను పిలిపించి ఏదో చెప్పాడట. అంతే, ఇదీ రిజల్ట్స్!”
స్టేజ్ మీద ఓ పెద్దాయన మైకు తీసుకున్నాడు.
“అసలు కాలేజీ క్యాంపస్‌లో అడుగడుగునా సి.సి.కెమెరాలు పెట్టడం ఏంటి? నాకైతే అర్థం కావడం లేదు. ప్రతీదానికి సెక్యూరిటీ అనే ఒక వంక. నిజం ఏంటో తెలుసా? అసలు యాజమాన్యమే అమ్మాయిలను చూస్తూ కూర్చోవటం కోసం కాదా?”
జనం గోల గోల చేసి ఈలలు వేశారు.
“చెప్పండి. ఆ మెస్ ఇన్‌ఛార్జ్‌కి ఏమైందంట? నేను చెబుతాను. వాళ్ళు చూడాలనుకున్నది వేరే వాళ్ళు చూస్తున్నారని బాధ – ఎసిడిటీ. అదీ సంగతి! అర్థమైందా?”
జనం మరల గోల చేశారు.
“అదేంటండీ? అందమైన డ్రెస్ తొడుక్కుంటే అది కూడా తప్పేనా?”
పాట వినిపిస్తోంది – “ఈ ఊరు మనదిరా, ఈ నేల మనదిరా…”
మిర్చీ బండీ దగ్గరనుండి రెండు ప్లేట్లు తీసుకుని ఇద్దరమ్మాయి ఇటుగా వచ్చారు.
“బావున్నాయా?” అడిగాను.
“బావున్నాయి” అన్నారు.
“అవి కావు”
“మరేంటి సార్”
“ఆయన చెప్పే మాటలు?”
“ఏవి సార్?”
“అమ్మాయిలను యాజమాన్యం చూడాలనుకుంటోందా? మరి అమ్మాయిలు అంత స్థాయికి వెళ్ళిపోయారా? మీరందరూ ఎలా ఊరుకుంటున్నారు?”
“సార్! అదంతా కాదు సార్. కాలేజీ అన్న తరువాత కేవలం చదువుకునేందుకొస్తామా? నలుగురితో కలసి తిరగాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఆడాలి, పాడాలి…”
మరో అమ్మాయి తగులుకుంది.
“కాంటీన్ కెళ్ళాలి, మిర్చీ బజ్జీలు తినాలి. సార్, ఆలోచించండి, మీ టైమ్‌లో మీరు చెయ్యలే?”
“అవునవును. అందరికీ ఓ టైమ్ ఉంటుంది. ఇదీ అంతే!”
“మిత్రులారా…” స్టేజి మీద చెబుతున్నారు.
“…ఇప్పుడు మన మధ్యలో మనోవిజ్ఞానానికి సంబంధించి విదేశాల్లో ఎన్నో ప్రసంగాలు చేసిన శ్యాం ప్రసాద్ గారు మాట్లాడుతారు”
ఆయన్ను ముగ్గురు కలిసి స్టేజి ఎక్కించారు. కొద్ది సేపటి క్రితం గేటు దగ్గర బండ్లన్నీ ఎందుకాగిపోయాయో ఇప్పుడర్థమైంది! అందరికీ ఆయన నమస్కారం చేశాడు.
“ఫ్రెండ్స్…!” చెప్పాడు. “… మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇది ప్రశ్న! ఒక అమ్మాయి స్కర్ట్‌లో కాలేజీకి వస్తే ఇంత సమస్య కాలేజీలో ఉత్పన్నమైందంటే సగటు భారతీయుడి మేధస్సు అసలు ఎదగడం లేదని అర్థం…!”
ఎవరో పిచ్చెక్కినట్టు “ఇంకలాబ్ జిందాబాద్” అనేశాదు. అనేసి, పళ్ళికిలిస్తూ గడ్డిలో కూర్చున్నాడు.
“నిజం చెప్పాలంటే నలుగురిలో తిరుగుతూ కాలేజీల్లో అమ్మాయిలతో సరదాగా గడిపిన కుర్రాళ్ళే ఉత్తరోత్తర జీవితంలో ఎంతో చక్కగా సంసారాలు చేస్తూ స్త్రీల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తున్నరాన్నది ఒక పరిశీలనలో తేలింది. ఎన్నో కట్టుబాట్లతో పెరిగి స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలియని వారు స్త్రీల పట్ల సరిగ్గా ప్రవర్తించరన్నది కూడా ఈ పరిశోధన వలన తేలిపోయింది. ఎందుకు నిర్బంధనలు? ఆలోచించండి. క్లాసురూములలో జరిగేదే బోధన కాదు. కాలేజీ గేటు దగ్గరనుండే ప్రారంభమవుతుంది నిజమైన విద్య”
ఇంతలో మైక్ గీ మనటం మొదలెట్టింది. ఎవరో ఇక్కడ కూర్చుని పాట పెట్టేశారు. “గువ్వా గోరింకాతో ఆడిందిలే బొమ్మలాట…” ఈలలతో గోలగోలగా ఉంది.
ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇద్దరు కుర్రాళ్ళు స్టేజి మీద చిరంజీవిని చూపిస్తున్నారు. ఓ అమ్మాయి అటునుండి స్టేజి ఎక్కింది. జనం లేచి నిలబడ్డారు. అమ్మాయి చున్నీ నడుములోకి బిగించింది. అసలు సమ్మె మొదలయింది. అమ్మాయి భానుప్రియను దించేసింది. అరుపులు ఆకాశాన్నంటాయి.
ఎర్ర రుమాళ్ళు కట్టుకుని కొంతమంది కుర్రాళ్ళు మిర్చీ బండీ దగ్గరకొచ్చారు. సుందరం దగ్గర సరుకు అయిపోవచ్చింది. అందరూ క్రింద చతికిలబడ్డారు. గెడ్డం పెంచిన కుర్రాడు మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడి జేబులో పెట్టాడు.
“కాలేజీ వాళ్ళు ఏమంటున్నారు?” అడిగాను.
“వాళ్ళేమంటారు సార్! పవర్ మనది. దట్సాల్”
“ఇంతకీ మీరు అమ్మాయిల కోసం పోరాడుతున్నారా? అబ్బాయిల కోసం సమ్మె చేస్తున్నారా?”
“అదేం ప్రశ్న సార్? అందరి కోసం”
“అలాక్కాది మిత్రమా! అమ్మాయిలందరూ ఇక అలాంటి డ్రెస్‌లు వేసుకోకపోతే అబ్బాయిలందరూ ఇబ్బంది పడిపోతారని ఇలా సమ్మె చేస్తున్నారని చెప్పుకుంటున్నారు మరి”
“చాలా అన్యాయం సార్. అబ్బాయిలందరూ తుంటరోళ్ళనడం చాలా తప్పు సార్. అమ్మాయిల స్వాతంత్ర్యం కోసం మేం పోరాడుతున్నాం. ఎంపవర్‍మెంట్!”
స్టేజి మీద అమ్మాయికి మరో ఇద్దరు జోడీగా చేరి పవర్ పెంచారు!
మరో కుర్రాడు బజ్జీలు నమిలేసి నవ్వాడు.
“సార్…” అన్నాడు. “… అందరూ నిలబడి చూస్తున్నారా లేదా? మీరూ చూస్తున్నారు. అవునా?”
“బావుందయ్యా. కనబడుతుంటే కళ్ళకు కంతలు కట్టుకోం కదా? అలా అని అక్కడ గెంతులు లేకపోతే గెంతించమని చెప్పం కదా?”
“అదే సార్ స్వాతంత్ర్యం అంటే. పాట ఇన్నారు కదా! ఒకరి కోసం ఒకరి పోరాటం – గువ్వ గోరింకతో కలసి పోరాడాలి. అట్లా….”
***
సుందరం బండీ ఇంటికి పోనిస్తున్నాడు.
“ఈ సమ్మె రేపు కూడా ఉంటుందా?”
“ఉండవచ్చు. అతను ఫోన్ చేస్తానన్నాడు”
ఫోన్ మ్రోగింది.
“హలో”
“సార్, మనం గెలిచాం సార్!”
“శభాశ్. ఎలాగ? యాజమాన్యం ఒప్పుకుందా?”
“ఒప్పుకోక? ఆ అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసారుట. వాళ్ళు ఏమన్నారో తెలుసా?”
“ఏమన్నారు?”
“మీరు మరీ పాత రోజులలో ఉన్నారు… అలా కుదరదు… పిల్లలను బాగా ఎంజాయ్ చేయనిస్తే చక్కగా పెద్దవాళ్ళవుతారు అన్నారుట. ఆ మెస్ ఇన్‌ఛార్జ్ వాళ్ళను డైరక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడట. అన్నీ విని ఆయన చూసీ చూడనట్లు వదిలెయ్యమన్నాడుట! మేం గెలిచాం సార్! మీ మిర్చీలే లేకపోతే మాకు సమ్మెలో మజా వచ్చేదే కాదు సారూ… థాంక్యూ!”
00000