పక్షి ముక్కు హెలికోనియా పువ్వులు

0
4

[డా. కందేపి రాణీప్రసాద్ గారు రచించిన ‘పక్షి ముక్కు హెలికోనియా పువ్వులు’ – అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మే[/dropcap]ము ఈ మధ్య కేరళకు వెళ్ళాం. కేరళలో కొచ్చి చూడటానికి వెళ్ళాము. అక్కడ పిల్లల డాక్టర్ల అంతర్జాతీయ సమావేశం జరుగుతున్నది. మా వారు, పిల్లలు – పిల్లల డాక్టర్లు కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఇంతకీ చెప్పేదేమిటంటే ఎయిర్‌పోర్టులో దిగగానే ఎరుపు ఆరెంజి రంగులలో పక్షి ముక్కుల్లాంటి పువ్వులు కనిపించాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో! చూసి ముచ్చటపడ్డాను.

ఆ తర్వాత కారులో హోటల్‌కు వెళుతున్నాం. దారిలో చాలా చోట్ల ఈ పక్షి ముక్కుల్లాంటి పువ్వులు కనిపించాయి. పెరియార్ నదీతీరంలో కూడా కనిపించాయి. ఆ తర్వాత హాటల్ వివాంతాకు చేరాం. రాత్రి పూట చేరాం. హోటల్ హాల్ మధ్యలో టేబుల్ మీద పక్షి ముక్కుల పూలు అందంగా అలంకరించబడ్డాయి. చాలా ముద్దుగా అనిపించాయి. పేరేమో తెలియదు. కానీ నాకున్న చెట్లు, పూల మీద ఆసక్తి వలన వాటిని చూస్తూండిపోయాను. తెల్లవారి వెలుగులో హాటల్ గార్డెన్‌ను పరిశీలిస్తున్నపుడు ఈ పక్షిముక్కు పూలు “హలో” అని పలకరించాయి. “నిన్నటి నుండీ మమ్మలే చూస్తున్నావు, ఏమిటి సంగతి?” అని అడిగాయి.

“మీ పేరు తెలీక చూస్తున్నాను. చాలా అందంగా ఉన్నారు” అని నేను సంతోషంగా చెప్పాను.

పూలు తలూపి “మా గురించి తెలుసుకోవాలనుకోవడం మాక్కూడా సంతోషమే. మమ్మల్ని ‘హెలికోనియా’లని అంటారు. మమ్మల్ని ‘అడవి అరటి’ అని కూడా అంటారు” అని చెప్పాయి.

“ఓహో గుర్తొచ్చింది. నేను పాతకేళ్ళ క్రితం ఈ అడవి అరటి పువ్వుల్ని మా షోకేస్‌లో పెట్టుకున్నాను. మా పేషెంట్ ఒకావిడ తెచ్చిచ్చింది. ‘మీరు పూలు, కొమ్మలతో బొమ్మలు చేస్తారు కదా! ఇదేమైనా పనికొస్తుందా’ అని ఇచ్చింది. సంబరపడి తీసుకున్నాను. అది ఎండిపోయాక మరల నేను పువ్వులు ఏ రంగులో ఉంటాయో అదే రంగులు వేశాను. ఇప్పటికీ నా షోకేస్‌లో సజీవంగా ఉన్నది. కాకపోతే కొన్ని తెగిపోయాయి. అయినా గుర్తుగా సజీవ సాక్ష్యంగా మిగిలాయి. ఇదే, గుర్తొచ్చింది.”

“ఊ! అయితే మేం తెలుసన్నమాట. అయితే మాకూ, వాటికీ కొద్దిగా భేదమున్నది. ఆ చెట్టు ఆకులు అరటి ఆకుల్లా పొడవుగా ఉంటాయి. అందుకే అడవి అరటి అని పిలుస్తారు. అందరం ఒకటే కుటుంబం అయినప్పటికీ కొద్దిగా భేదాలు ఉంటాయి అంతే! మా ఆకులు చిన్నవిగా ఉంటాయి. గమనించు” అని చెప్పాయి.

ఆ తర్వాత హాటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కు వెళితే అక్కడ ఫ్లవర్ వేజుల్లో కనిపించాయి. టిఫిన్ తిని మేము ‘లులు బోల్గట్టి ఇంటర్నేషనల్ కన్వెన్షనలో సెంటర్’కు వెళ్ళాం. అక్కడి గ్రాండ్ హయత్ లోనే మా కాన్ఫరెన్స్ జరుగుతోంది. హోటల్ ప్రహరీ గోడ పొడవునా ఈ హెలికోనియాలు కనిపించాయి. లోపల కూడా ఎన్నో హెలికోనియాలు బారులుగా నిలబడి నమస్కరించాయి. అలాగే సాయంత్రం జరిగే ప్రారంభోత్సవంలో రంగుల సీరియల్ బల్బులతో అలంకరించుకుని మెరుపుల్లా మెరుస్తూ కనిపించాయి. ఎంతో ఆనందించి ‘ఏమిటీ! ఈ హెలికోనియాల సంగతి!’ – తెలుసుకోవాలన్పించింది.

‘హెలికోలియా’ అనే పూల చెట్టు ‘హెలికోనియేసి’ అనే కుటుంబానికి, ‘జింజిబరేలిస్’ అన్నే క్రమానికి చెందినది. ఇవి ఉష్ణ మండల అడవులలో ఎక్కువగా పెరుగుతాయి. ఇవి కూడా కలలు ఐ.యు.సి.ఎన్. రెడ్ లిస్ట్‌లో చేర్చబడ్డాయి. ఈ పూల జాతులను అలంకరణ కోసమే ఎక్కువగా పెంచుతారు. థాయిలాండ్, ఫ్లోరిడాలలో సహజంగా ఎన్నో హెలికోనియాలు పెరుగుతాయి.

‘హెలికోనియా లాటిస్పాతా’ పువ్వులు సమూహంగా పుష్పగుచ్ఛాలుగా ఏర్పడతాయి. వాటిని ఒక్కచోట చూస్తుంటే పక్షులు చెట్టు మీద వాలినట్లుగా కనిపిస్తాయి. ‘హెలికోనియా మారియా’ యొక్క పుష్పగుచ్చాన్ని గమనిస్తే అరటి పువ్వులా అనిపిస్తుంది. ఎర్రగా అరటి పువ్వు రంగును కూడా ప్రతిబింబిస్తుంది. వీటికి మాములుగా ఎన్నో పేర్లున్నాయి. ఎండ్రకాయల ముఖాలు, టౌకానే ముక్కు, ఫాల్స్ బర్డ్ ఆఫ్  పారడైజ్, పారెట్స్ ప్లవర్ అని ఎన్నోరకాల పేర్లున్నాయి.

హెలికోనియాల్లో ఎన్నో జాతులున్నాయి. అందులో హెలికోనియా అక్యుమినటా, హెలికోనియా ఆడిఫ్లెక్సా, హెలికోనియా ఎమిగ్దియానా, హెలికోనియా అంగస్టా, హెలికోనియా రోస్ట్రాటా అని ఎన్నో రకాలున్నాయి. కొన్ని కొన్ని లక్షణాలతో విభేదిస్తాయి. ఇందులో హెలికోనియా రోస్ట్రాటా మొక్క పూలు ఎరుపు వర్ణంలో ఉండి చివర్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. ఒక సన్నని కాడకు రెండు పక్షి ముక్కుల్ని అలరించినట్లుగా అనిపిస్తాంది. నాకైతే కలశం లోని తమల పాకులకు పసుపు రాసి కుంకుమ అద్దినట్లుగా ఉండే పసుపు కుంకుమలు వర్ణాలు ఈ పూలలో కనిపిస్తాయి. ఈ పూలలో ఎరుపు వర్ణానికి పసుపు అద్దినట్లుగా కనిపిస్తాయి. వీటిని ‘పారాకీట్ ఫ్లవర్’, ‘పారట్ బీక్స్’ అని పిలుస్తారు. ఈ చెట్లు 1.5 అడుగులు ఎత్తు పెరుగుతాయి. సంవత్సరమంతా పూస్తాయి. పూలగుత్తులు స్ప్రింగ్ సీజన్‌లో బాగా పూస్తాయి.

‘హెలికోనియా సిట్టాకోరం’ అనే జాతి పువ్వులు ఎర్రగా పూస్తాయి. ఈ పూలను ‘హెలికోనియా లేడీ డయానా’ అని పిలుస్తారు. లేడీ డయానా పేరును పెట్టుకున్న ఈ పూలు ఎంత అందగత్తెలో. అత్యంత ఆకర్షణీయమైన పూల జాతులలో ఇదొకటి.

ఏ పుష్ప గుచ్ఛాలలో అలంకరించాలన్నా, ఏ ఫ్లవర్ వేజ్‍లో పెట్టాలన్న అందంగా మరిపోయే పువ్వు ఇది.

హెలికోనియేసియే కుటుంబంలో దాదాపు 200 జాతులు ఉన్నాయి. ఇవన్నీ అమెరికాకు చెందినటువంటివి. కొన్ని పసిఫిక్ దీవుల నుండి ఇండోనేషియా వరకు వ్యాపించి ఉన్నాయి. మొదట్లో వీటిని ‘మ్యుసేసి’ కుటుంబంలో చేరినప్పటికీ తర్వాత ఈ జాతులను ‘హెలికోనియేసి’ కుటుంబానికి మార్చారు. ఇవి మంచును తట్టుకోలేవు. ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతూ ఉంటాయి. ప్రకృతి రామణీయకతను పెంచడానికి మనోహరమైన రంగుల్లో పూసే హెలికోనియాలను సాగుచేస్తారు. ప్రకృతి దృశ్యాలకు, పెళ్ళి వేడుకలకూ ఈ రంగుల పూలు అత్యధికంగా ఉపయోగపడతాయి. ఫ్లోరిస్టులు వ్యాపారం కోసం పెంచుతారు.

పువ్వులు మైనపు తొడుగును కలిగి ఉంటాయి. పువ్వులు ఎరుపు, నారింజ, పసుపు మరియు ఆకుపచ్చ వర్ణాలను కలిగి ఉండి చూపరులను ఆకర్షిస్తాయి. హమ్మింగ్ బర్డ్ వలన పువ్వుల మధ్య పరాగ సంపర్కం జరుగుతుంది. పండ్లు పండాక విత్తనాలు నీలం రంగులోనూ, ఊదా రంగులోనూ ఉంటాయి. హెర్మిట్లు, హమ్మింగే బర్డ్‌లు ఈ పూలను, పండ్లనూ ఎక్కువగా తింటాయి. అత్యంత ఆకర్షణీయమైన హెలికోనియా పుష్పాల వివరాలు ఇవీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here