ఫస్ట్ లవ్-6

0
4

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తనకి నచ్చిన యువకుడు ఇంకో యువతితో చనువుగా ఉండడం చూసిన హసంతి ఆఫీసుకొచ్చేసి తన క్యూబికల్‍లో కూర్చుని బాధపడుతుంది. లాప్‍టాప్ తెరపై ఆమె వదనం ఆమెకే కనబడి ఆమెను మందలిస్తుంది. గతంలోంచి బయటకొచ్చిన హసంతి పెళ్ళిచూపులకి వచ్చినతన్ని చూసి విస్తుపోతుంది. అతను హసంతి చేసుకోవాలనుకున్న యువకుడే. అతను రఘు మావయ్యతో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది హసంతి. ఇద్దరూ హసంతి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. రెస్టారెంట్‍లో హసంతిని చూశానని చెప్తాడతను. ఎక్కడ ఉద్యోగం చేస్తుందో కనుక్కుంటాడు. మాటల సందర్భంలో అతను ఎవరినైనా ప్రేమించాడా అని అడుగుతుంది. ఏం చెప్పాలని అడుగుతాడు. అంతకుముందు వారం రెస్టారెంట్‍లో టీ తాగుతూ ఓ అమ్మాయి భుజం మీద చేతులు వేసి క్లోజ్‍గా మసలుకున్నాడని చెప్తుంది. నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు అని అంటాడతను. కాసేపు మాట్లాడుకున్నాక – గదిలోంచి బయటకి వస్తూ నా పేరు కార్తీక్ అంటాడతను. ఇదంతా నిజం కాదు, హసంతి కల. కాసేపటికి రఘురాం మావయ్య తన కొడుకు గౌతంతో వస్తాడు. పెళ్ళిచూపులకి వచ్చింది తన కలల రాకుమారుడు కార్తీక్ కాదు, మావయ్య కొడుకు గౌతం అని గ్రహిస్తుంది. మేడ మీద గదిలోకి వెళ్ళి మాట్లాడుకోమని పంపిస్తుంది హసంతి తల్లి కవిత. గౌతం ఏవేవో అడుగుతుంటే, హసంతి ముభావంగా జవాబులిస్తుంది. ఇంతలో ఆఫీసు నుంచి కొలీగ్ ఫోన్ చేయడంతో, వెళ్దామా అంటుంది హసంతి. ఇద్దరూ కిందకి దిగి వస్తారు. ఇక చదవండి.]

[dropcap]వా[/dropcap]రం రోజుల తర్వాత..

బాంక్విట్ హాల్ ముందు ‘హసంతి గౌతమ్ ఎంగేజ్ మెంట్ సెర్మనీ’ ఫ్లెక్సీ పెట్టారు.

ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న బ్యాంక్విట్ హాల్ ఎంట్రెన్స్‌లో మరో ఫ్లెక్సీ పెట్టారు. లోపల స్టేజి ఫ్లవర్ డెకరేషన్‌తో అందంగా ముస్తాబయింది. కుర్చీలన్నీ తెల్లని తొడుగులు వేసుకొని వరుసలో ఉన్నాయి. నాదస్వరం సన్నగా వినిపిస్తోంది. అబ్బాయి తరఫు వాళ్లు, అమ్మాయి తరఫు వాళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చారు.

హసంతి వాళ్ళమ్మ కవిత; ఫ్రెండ్స్ ధృతి, స్వప్న, అనూష, శృతి; పిన్నులు సరోజ, శ్రీలక్ష్మి; కజిన్స్ అరుణ్, శ్యామ్ ముస్తాబయి వచ్చారు.

అందంగా ప్యాక్ చేయించిన స్వీట్లు, పళ్ళు, బట్టలు, పూజకు కావలసిన సామాన్లు అన్నీ కవిత తలా ఒకటి ఇచ్చి పైకి పంపింది.

“ప్యాకింగ్ పాడవకుండా జాగ్రత్తగా తీసుకెళ్లండి” అంది. కవిత రోజా పూలదండలు, పూజకు కావలసిన పూలు ఉన్న పెద్ద కవర్లు తనే పట్టుకుంది కవిత. ప్రతిదీ డెకరేటివ్‌గా, అందంగా ఉండాలని అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. కవిత ఫంక్షన్‌కి కావాల్సిన ప్రతిదీ వివరంగా పర్చేజ్ చేసింది. స్పూన్‌తో సహా ఏదీ వెతుక్కోకుండా సమయానికి అందుబాటులో ఉండాలనుకుంటుంది. ఫ్రూట్సే కదా చేతిలో ఇవ్వచ్చు, స్వీట్సే కదా బాక్స్‌లో పెట్టి ఇవ్వచ్చు అని అనుకోదు. ప్రతిదీ నీట్‌గా అందంగా ప్యాకింగ్ దగ్గరుండి చేయించింది. హసంతితో పాటు ఆమె ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్నారు. కవిత, ఆమె చెల్లెలు రెండో కూతురు గీతిక వస్తున్న బంధువుల్ని ఆహ్వానిస్తున్నారు.

ఇన్నోవా కార్లో గౌతమ్, తండ్రి రఘురాం; ఫ్రెండ్స్ నరేష్, సుధాకర్, పృథ్వి; వంశీ; గోపి వచ్చారు. రఘురాం తరఫున కజిన్స్ అక్కలు, పెద్దమ్మలు ఒక్కొక్కరుగా బ్యాంక్విట్ హాలుకి చేరుకున్నారు.

వీడియో గ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్ల హడావిడి మొదలైంది. వేదిక ఎదురుగా ఉన్న డైనింగ్ సెక్షన్ దగ్గర కాఫీ, టీ ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ క్యాటరింగ్ స్టాఫ్ యూనిఫామ్ వేసుకుని స్టార్టర్స్, వెల్‌కమ్ డ్రింకులు వచ్చినవాళ్లు కూర్చున్న దగ్గరికి తెచ్చిస్తున్నారు.

“అన్నయ్యా! రండి!” అని కవిత, రఘురాంని, గౌతమ్‌ని ఆహ్వానించింది.

“కవితమ్మా! కావాల్సినవన్నీ వచ్చినట్టేగా!” అడిగాడు రఘురాం.

“అన్నీ! తెచ్చానన్నయ్యా! నువ్వేం కంగారు పడకు. నేనున్నాగా!” అంది.

గౌతం ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో బంధువులు వచ్చి పలకరించి వెళుతున్నారు.

గదిలో హసంతికి పట్టుచీర సరి చేస్తూ.. తలలో పూలు పెడుతూ, నగలు సర్దుతూ ధృతి, స్వప్న అల్లరి చేస్తున్నారు. హసంతి పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నా, తల్లి చెప్పిన ‘కృతజ్ఞత’ గౌతమ్‌తో ఎంగేజ్మెంట్‌కి తలవంచేలా చేసింది.

అంతలో పురోహితుడు, అతని శిష్యులు వచ్చారు. శిష్యులు పూజకు కావలసిన ఏర్పాట్లు చూస్తుంటే, గురువుగారు పర్యవేక్షిస్తున్నారు.

రఘురాం పురోహితుడికి నమస్కారం పెట్టి మాట్లాడుతుంటే, అక్కడికి కవిత, సరోజా వచ్చారు.

“నమస్కారం పంతులుగారూ ! కాఫీ తీసుకున్నారా! ముహూర్తానికే నిశ్చితార్థం జరగాలి” అంది కవిత.

పురోహితుడు టైమ్ చూసుకొని,

“ఇంకా అరగంట టైం ఉంది. అమ్మాయిని, అబ్బాయిని సిద్ధం చేస్తే పూజ ప్రారంభిద్దాం” అన్నాడు.

“అలాగేనండి” అని బంధువుల్ని పలకరించడానికి వెళ్ళాడు రఘురాం.

గౌతమ్ మొహంలో సంతోషం చూసి సుధాకర్, నరేషు ఆటపట్టిస్తున్నారు.

“ఏయ్! హసంతీ! కాస్త నవ్వుతూ ఉండవే బాబూ! మొహం సీరియస్‌గా పెట్టకు” అంది ధృతి.

“నా మొహం ఇంతేనే!” అంది హసంతి.

“స్మైల్ మేడం!” అని స్వప్న అనగానే

హసంతి ఆర్టిఫిషియల్‌గా “ఈఁ..” అని నవ్వింది.

“వద్దే బాబూ! అంతకుముందే బాగుంది. నువ్వు నువ్వు లాగే ఉండు” అంది.

అంతా నవ్వారు.

“కంగ్రాట్స్ రా! గౌతం..” అని భుజం మీద చెయ్యేసిన చిన్నప్పటి క్లాస్‌మేట్ రవిని చూసి ఆశ్చర్యపోయాడు.

“ఏంట్రా జుట్టంతా..!?”

“ఊడిపోయింది రా!”

“కాదులేరా! వాడు మేధావి. ఐ.ఐ.టి. చదివితే ఆ మాత్రం బట్టతల రావాలి కదా!” అన్నాడు సుధాకర్.

అంతలో పురోహితుడు పిలవడం.. వేదిక మీద ఏర్పాటు చేసిన పీటల మీద గౌతమ్ వచ్చి కూర్చున్నాడు. హసంతిని ఫ్రెండ్స్ తీసుకొచ్చారు.

పట్టుచీరలో పసిడి బొమ్మలా మెరిసిపోతున్న హసంతిని కన్నార్పకుండా గౌతం చూస్తుంటే “రేయ్! గౌతమ్ చూపు తిప్పు” అని ఫ్రెండ్స్ అనగానే, అందరూ “ఓ” అని అరిచారు.

హసంతి పక్కన కూర్చోగానే “హలో!” అన్నాడు గౌతం.

హసంతి నవ్వింది.

పంతులుగారు విఘ్నేశ్వర పూజ ఆరంభిస్తూ..

“బాబూ! ఇద్దరూ ఆచమనం చేయండి” అని

“శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే!” అంటూ పూజా కార్యక్రమం మొదలుపెట్టాడు.

వీడియో గ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు ప్రతి అంశాన్ని క్లోజప్‌లో ఒకళ్ళు తీస్తుంటే; ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళని మరో ఇద్దరు కవర్ చేస్తున్నారు.

విజ్ఞేశ్వర పూజ అయ్యాక ఇంకా పది నిమిషాలు ఉండటంతో “వెళ్లి బట్టలు మార్చుకుని రండి” అని ఇద్దరికీ పురోహితుడు చెప్పాడు.

“సార్ అలా రండి, ఇలా రండి” అని; ఇలా ఫోజు పెట్టమని వీడియో గ్రాఫర్లు హసంతిని, గౌతమ్‌ని ఫోటో షూట్ చేస్తున్నారు.

“బాబూ! త్వరగా వెళ్లి బట్టలు మార్చుకుని రండి” అని పురోహితుడు మరోసారి చెప్పాడు.

ఇద్దరూ ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్లారు.

కవిత అందర్నీ పలకరిస్తూ నిశ్చితంబులాలకు కావలసిన సామాన్లన్నీ తాంబాలాల్లో సర్దింది.

గులాబీ పూల దండలు బయటపెట్టింది.

గౌతం డార్క్ బ్లూ కలర్ సూట్‌లో వచ్చాడు. హసంతి ముదురు ఆకుపచ్చ పెద్దంచు పట్టు చీరలో వచ్చింది.

వేదిక మీద హసంతివైపు పెద్దవాళ్లు, వాళ్లకి ఎదురుగా గౌతమ్ వైపు పెద్దవాళ్లు కూర్చుని కూర్చున్నారు. పంతులుగారు ముహూర్తం సమయానికి తాంబూలాలు మార్పించారు. రఘురాంకి హసంతి బాబాయ్ భాస్కరరావు ఇవ్వగా, రఘురాం అతనికి ఇచ్చాడు.

అదయ్యాక గౌతమ్ హసంతి లను నుంచో బెట్టి ఒకరికొకరు బొట్టు పెట్టుకోమన్నారు. హసంతి అతని నుదుటిన బొట్టుపెట్టి, మెడలో దండేసింది. తర్వాత గౌతమ్ వేశాడు.

ఫోటోగ్రాఫర్లు “సార్! సార్! ప్లీజ్” అంటుంటే పెద్దవాళ్లు ముహూర్తానికి ఉంగరాలు మార్చుకోండని తొందర పెడుతున్నారు.

ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇద్దరికీ ఉంగరాలు ఇచ్చారు. గౌతమ్ వేలికి హసంతి రింగు తొడిగింది. గౌతం ఆమె వేలిని సున్నితంగా పట్టుకొని రింగు తొడిగాడు.

తర్వాత అందంగా ప్యాక్ చేసిన పళ్ళు, స్వీట్స్, పటిక బెల్లం ఆడవాళ్ళంతా హసంతికి ఇస్తుంటే.. ఫోటోగ్రాఫర్స్ ప్రతి మూమెంట్‌ని షూట్ చేస్తున్నారు.

వచ్చిన వాళ్లంతా ఇద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వేదిక మీద నుంచి పెద్ద సోఫాలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరినీ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. గౌతమ్ ఫ్రెండ్స్ అంతా వచ్చి హడావిడి చేస్తుంటే, హసంతి ఫ్రెండ్స్ వచ్చి రెట్టింపు అల్లరి చేశారు.

తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం కోలాహాలంగా జరిపారు గౌతమ్ బొకేతో హసంతిని ప్రపోజ్ చేస్తుంటే..

“ఓ..” అని ఇద్దరి ఫ్రెండ్స్ పెద్దగా అరుస్తూ కేరింతలు పెట్టారు. మల్టీకలర్ పార్టీ పర్పస్ పోటీపడి ఇద్దరి మీద పూలవర్షంలా కురిపించారు.

మొత్తానికి సింపుల్‌గా, నీట్‌గా గౌతం, హాసంతిల నిశ్చితార్థ వేడుక ముగిసింది. ఆ తర్వాత భోజనాలు కార్యక్రమం. తర్వాత ఫంక్షన్ హాల్ ఖాళీ చేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకున్నారు.

***

కార్తీక్ ఫ్రెండ్స్‌తో వచ్చి ఫేమస్ రెస్టారెంట్లో టీ తీసుకుంటుంటే

“హలో! బ్రో.. వన్ మినిట్. నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు శ్రీరామ్.

“ఎస్” అని ఆగాడు.

ఫ్రెండ్స్‌తో “మీరు పదండి. నేను వచ్చి జాయినవుతా” అన్నాడు కార్తీక్.

ప్రతిరోజూ హసంతి కూర్చునే కార్నర్ దగ్గరకు తీసుకొచ్చాడు శ్రీరామ్.

“చెప్పండి. ఐ యాం కార్తీక్” అన్నాడు చెయ్యి జాపి.

“నా పేరు శ్రీరామ్. ఈ రెస్టారెంట్ ఓనర్.” అన్నాడు చెయ్యి కలిపి.

“మిమ్మల్ని రోజూ చూస్తాను. కానీ పరిచయం లేదు.” అన్నాడు కార్తీక్ నవ్వి.

“రోజూ ఇక్కడ ఓ అమ్మాయి కూర్చొని కాఫీ తాగడం ఎప్పుడైనా గమనించావా?”

“ఏం? ఏమైంది?” అన్నాడు కార్తీక్.

“ఏమీ కాలేదు. నీకు ఆమె ఫేస్ గుర్తుందా?”

“నేను అంత కీన్‌గా ఎప్పుడూ గమనించలేదు. కానీ ఒక రెండు సార్లు ఆమె నన్నే చూడటం గమనించాను. నేను చూడబోయేంతలో తలదించుకునేది” అన్నాడు.

“అవును. ఆమె సంవత్సరం నుండీ ఇక్కడే కూర్చొని, నిన్నే చూస్తుండేది. అసలు నిన్ను చూడటం కోసమే ఇక్కడికి వస్తుంది. ఇక్కడే కూచునేది. నీ గురించి ప్రతి విషయమూ ఆమెకు తెలుసు.”

“ఇంట్రెస్టింగ్” అన్నాడు కార్తీక్.

“పోయిన వారం నీతో మాట్లాడాలని డిసైడ్ అయిపోయింది. అదే రోజు నువ్వు మరో అమ్మాయితో క్లోజ్‌గా మాట్లాడుతుంటే చూసింది. తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయింది. నీకు ఇద్దామని చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. దానిని ఇక్కడే వదిలెళ్ళింది.” అన్నాడు శ్రీరామ్.

కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. మెల్లగా ఆమె గుర్తొచ్చి మనసులోకి ప్రవేశిస్తోంది.

“ఫేర్‌గా ఉంటుంది కదా!”

“అవును.”

“నాతో క్లోజ్‌గా ఉన్న అమ్మాయి అక్కడ ఉన్న అమ్మాయే కదా! చూడండి” అన్నాడు.

శ్రీరామ్ చూశాడు.

“షి ఈజ్ మై క్లాస్మేట్ మృదుల. రీసెంట్‌గా బెంగళూరు నుంచి ట్రాన్స్‌ఫరై మా కంపెనీలో జాయిన్ అయింది. ఎనీవే పరిచయం లేకుండా, ఆమె ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు కదా! ఆమె అనుకున్నట్టు మృదులకి, నాకు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే. మరే ఫీలింగ్స్ లేవు” అన్నాడు.

“ఓ.కే! మూడు రోజుల నుంచి ఆమె రావడం లేదు. రేపు రావచ్చు. పరిచయం చేయొచ్చా!” అన్నాడు శ్రీరామ్.

“ష్యూర్. ఆమె పేరు?”

“హసంతి”

“నైస్ నేమ్”

అంతలో కార్తీక్ ఫ్రెండ్స్ రావడంతో బై చెప్పి వెళ్ళబోతుంటే.. “వన్ మినిట్ బ్రో” అని కౌంటర్ దగ్గరి కబోర్డ్‌లో దాచి ఉంచిన హసంతి వదిలివెళ్ళిన గిఫ్ట్ ప్యాక్ తీసి కార్తీక్‌కి ఇచ్చాడు శ్రీరామ్.

“ఓ! థాంక్యూ” అని తీసుకుని వెళ్ళిపోయాడు కార్తీక్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here