మహతి-41

2
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[లౌక్యం ఉపయోగించి పంచాయితీ ప్రెసిడెంటును ఒప్పించినందుకు అందరూ మహతిని అభినందిస్తారు. మహతి, త్రిపుర, శ్రీధర్, సూరి, తాతయ్య మాట్లాడుకుంటూంటారు. విస్తళ్ళు కుట్టే కార్యక్రమం కాక ఇంకా ఏం చెయ్యచ్చో ఆలోచిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఎలా పొందాలో ప్రజలకి అవగాహన కల్పించాలనుకుంటారు. ఓ రోజు స్వరూపరాణి మహతికి ఎదురుపడుతుంది. గొంతులో హేళన ధ్వనిస్తున్నట్లు మాట్లాడుతుంది. వాళ్ళిద్దరి మధ్యా వివాహ వ్యవస్థ గురించిన చర్చ సాగుతుంది. స్వరూపరాణి మాటల్ని త్రిపుర గారికి చెప్తుంది మహి. తన వైవాహిక జీవితం గురించి, మనస్పర్ధల గురించి చెప్తారామె. ప్రేమ వివాహాల్లోనూ ఇబ్బందులొస్తున్నాయని అంటారామె. – ఇక చదవండి.]

మహతి-3 మహి-8

[dropcap]మా[/dropcap] ప్రయత్నాలు కొంత ఫలించాయి, కొంత ఫలిస్తూ ఆశను పెంచాయి. చాలా ఇళ్ళల్లో అటకెక్కిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, పకపకలు లాంటి పిల్లల పుస్తకాలనీ, సుమతీ, కృష్ణ, వేమన, కుమారీ, భాస్కర శతకాలని కలెక్టు చేసి స్కూలు పిల్లలకి ఆ కథలు వినిపిస్తూ వాళ్ళలో – చదవాలనే కోరికను బాగానే పెంపొందించాము. వారానికి రెండుసార్లయినా గ్రంథాలయానికి వెళ్తే ఎంతో ఉపయోగం వుంటుందనే మాటని మళ్ళీ మళ్ళీ చెబుతూ, ఎయిత్ క్లాస్ నించి ఇంటర్ చదివే బాల బాలికల మస్తిష్కాలలో ఎక్కించగలిగాము.

వయోజన ‘స్కూలు’ బాగానే నడుస్తోంది. అయితే సమస్యలు ఎక్కువగా ‘మహిళా’ సమాజం నించే వచ్చాయి. పిల్లలకి క్లాసు పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదవడం నేర్పితే, వాళ్ళు చెడిపోయి జులాయిలుగా మారతారని ‘తల్లులు’ మమ్మల్ని నానా మాటలూ అన్నారు, వాళ్ళకి నచ్చచెప్పేసరికి తలప్రాణాలు తోక కొచ్చాయి.

‘విద్య’, ‘విజ్ఞానం’ గురించి పెద్ద వాళ్ళకి క్లాసులు తియ్యడం అంత తేలిక కాదు. లోకంలో బ్రతకాలంటే లోకజ్ఞానం ఉండి తీరాలిగా! మొత్తానికి ఓ మాదిరిగా వాళ్ళకి నచ్చచెప్పినా, మహిళలకి కూడా ‘చదివే’ అలవాటు వస్తే ఆడపిల్లల్ని సరైన మార్గంలో నడిపించలేరనే నిర్ణయానికి వచ్చాం. మహిళా మండలి ఉన్నది అందుకే అయినా, అక్కడున్నన్ని రాజకీయాలు ఎక్కడా వుండవని ఔట్ సైడర్ నైన నాకూ తెలిసి వచ్చింది. ఎంతో కాలంగా పాతుకుపోయిన మహిళామణులు ‘పదవి’ పోతుందన్న భయంతో ఎవర్నీ ఏమీ చెయ్యకుండా అడ్డుకోవడంలో సిద్ధహస్తులని సంపూర్ణంగా అర్థమైంది. అందుకు తగినట్లే వాళ్ళ పిల్లల ప్రవర్తనా ఉంది. రాజకీయమా నీకు జిందాబాద్!

“ఏం చెయ్యాలీ?” నిర్లిప్తతతో అన్నారు త్రిపుర.

“నిరాశ నిండిన గుండెలో ఉపాయాలు పుట్టవు. ముందర కాస్త ఉత్సాహాన్ని సేవిస్తే, ఒక్కటి కాదు వెయ్యి ఉపాయాలు పుట్టుకొస్తాయి.” అన్నాను. హాయిగా నవ్వారు త్రిపుర.

“మహీ.. ఒకప్పుడు నేనూ నీలాగా ఉత్సాహ కెరటంలా ఉయ్యాల లూగేదాన్ని, పెళ్ళి నాలో సగాన్ని చంపితే, బంధుగణం మిగతా సగాన్ని చంపింది. యస్.. నిర్లిప్తత నిరాశ మనిషిని డొల్లగా మారుస్తాయి. ఓ.కె. మరోసారి.. మరోసారి అనుకుంటూ వెయ్యిసార్లు ప్రయత్నిద్దాం!” అన్నారు త్రిపుర.

***

“మహీ.. నీతో ఓ విషయం డిస్కస్ చెయ్యాలి.” అన్నారు డా. శ్రీధర్.

“హాయిగా చేద్దాం” అన్నాను వేడి వేడి పకోడీలు, అరటికాయ బజ్జీలు, మాంఛి ఘాటైన ఉల్లిపాయి టమోటా చట్నీ ప్లేటు డాక్టరు గారికి అందిస్తూ.

“ఇన్నా?” అన్నారు కంగారుగా.

“అయ్యా, అవి కాక నేతి బీరకాయ బజ్జీలు ట్రై చేశా ఇవ్వాళ. ముందు వడ్డించబోయేది మీకే” అన్నాను.

“ఇది బాగుంది. VIP లకి ప్రత్యేక ఫుడ్ టేస్టర్స్ ఉంటారు. ముందర వాళ్ళు తిని ఓకే అన్నాకే గొప్పవాళ్ళు తినాలి.” అన్నారు.

“డాక్టరు గారూ, వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేసేది అందులో విషంగానీ, స్లో పాయిజన్ గానీ కలిసిందా అని టెస్టు చేయడానికి. నేను మీకు నేతిబీర బజ్జీలు పెట్టేది ప్రథమ తాంబూలం, అంటే ప్రథమ గౌరవం ఇవ్వడానికి.”

“అమ్మయ్యా.. ‘Good Food.. Good Mood’ అన్నారు పెద్దలు. ఫుడ్ ఎలానో Good better best.. ఇక మూడ్ కూడా the best గానే వుండాలని పార్థిస్తూ అన్నపూర్ణాజీ అభివందనం” అని ఉల్లిపాయ పకోడీ చట్నీతో కలిపారు. నేను కిచెన్ లోకి పరిగెత్తాను.

“ఏమిటే ఘమఘమలు!” అంటూ తాతయ్య వచ్చాడు.

“బజ్జీలు తాతయ్యా” అని ప్లేట్లో ఉల్లిపాయ పకోడీలు, అరటికాయ బజ్జీలు చట్నీ వేసి పెట్టాను. “ఇంకా నేతిబీరవీ వస్తాయి.” అన్నా.

“మరి మిరపకాయ బజ్జీ లేవీ?” అన్నాడు నవ్వి. మా అమ్మమ్మ ముందు మిర్చీ బజ్జీలు వేశాకే తరవాత మిగతావి చేసేది.

“నువ్వొచ్చేదాక ఆగి వేడి వేడిగా వేద్దామని ఎదురుచూస్తున్నా. వచ్చేశావు కదా. రెండు నిముషాల్లో వడ్డిస్తా” అని బంగాళాదుంప, ఉప్పుకారం, వాము పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం చక్కగా ముద్దగా కలిసి ‘స్టఫ్’ని మిర్చి బజ్జీల్ని చూపించి, వాటిని ఒకటొకటిగా నూనెలో వెయ్యడం మొదలుపెట్టాను.

“నేతిబీర బజ్జీ సూపర్. మిర్చి బజ్జీ మస్త్ మస్త్, పకోడీ భేష్” అన్నారు డా. శ్రీధర్.

“థాంక్యూ.. మీరు పొగడకపోయినా నేనేమీ అనుకోను. ఇప్పుడు చెప్పండి ఏదో చర్చించాలని అన్నారుగా!” అన్నాను కూర్చుంటూ.

“Food Mood తో మైండ్ నిద్రలోకి జోగుతానంటోంది. టిఫిన్ బాగా పడింది గనక ‘చర్చ’ని ప్రస్తుతానికి ఆపేస్తా” అన్నారు శ్రీధర్.

“కనీసం సబ్జక్టు చెప్పవచ్చు కదా?” అన్నాను.

“హాయిగా చెప్పచ్చు. కానీ ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచితేనే బెటర్ అనిపించింది” అన్నారు నవ్వి.

“రేపు చెయ్యాల్సిన పని ఇవ్వాళ చెయ్యడమే ధీర లక్షణం” అన్నాను. “యస్. కానీ రేపు మాత్రమే పూసే మొగ్గని ఇవ్వాళ కూయకూడదు గదా.” ఆయనా నవ్వి అన్నారు.

“ok ok డాక్టర్ సాబ్.. కాఫీనా టీనా?” అన్నాను.

“అవి పట్టే స్థలమే పొట్టలో వుంటే మరొ నాలుగు మిర్చి బజ్జీలే తిందును గదా! నో ప్లేస్!” అన్నారు శ్రీధర్.

“మహీ.. కాస్త మజ్జిగ పులుసు చేసి మిగిలిన పకోడీలు దాన్లో వెయ్యమ్మా” అన్నాడు తాతయ్య. మా అమ్మమ్మ అలవాటు అది.

***

“స్వరూపరాణి భర్తకి విడాకులు ఇవ్వడానికి రెండు కోట్లు అడిగిందట.” త్రిపుర గారు అన్నారు. నేను అవాక్కయ్యాను. “ఎందుకు అడగరూ? ఆడదంటే ఆటవస్తువా?” తీవ్రంగా అన్నది మహిళా మండలి ప్రెసిడెంటు గారు.

ఆవిడ పేరు చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే, తన పేరు పిల్లల పేర్ల పక్కనా మాత్రమే కాదు, అప్పుడే పుట్టిన శిశువు పేరు పక్కన కూడా ‘కులం’ పేరు పెట్టే పిలుస్తుంది. కులం పేరుతోనే చెబుతుంది.

“ఆవిడ్ని ఎవరైనా లేపుకుపోయి వుంచుకుంటే, అడగొచ్చు. అప్పుడు ఆటవస్తువుగానే పరిగణించచ్చు. తీసుకెళ్ళి విసిరి పారేశారని అనుకోవొచ్చు. కానీ ఆ పిల్ల సలక్షణంగా పెళ్ళి చేసుకుని మరీ అత్తారింటికి వెళ్ళింది. అదీగాక మనకి తెలిసింది వన్ సైడ్ కథ మాత్రమే. ఈ స్వరూపరాణి వల్ల వాళ్ళ అత్తమామాలు భర్త ఏం బాధలు పడ్డారో మనకేం తెలుసు?”

“ఓహో.. మీరు ఆవిడకి వ్యతిరేకంగా ఆల్‍రెడీ నిర్ణయాలు తీసుకున్నారన్న మాట” కోపంగా వనజ వంక చూస్తు అన్నది మహిళా మండలి అద్యక్షరాలు.

“ఎవరి వ్యతిరేకంగానూ మేం నిర్ణయాలు తీసుకోలేదు” స్థిరంగా అన్నది వనజ.

“అయినా, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు మన కెందుకు?” సుచిత్ర గారు అన్నారు. ఆవిడ చాలా తెలివైనదీ, శాంతస్వభావురాలు.

“స్వరూపరాణి అమ్మగారు యీ విషయంలో మన మహిళా మండలి సహాయం అడిగింది. సహాయం చేస్తామనీ, త్వరలో ఓ పూట స్వరూపరాణికి సపోర్టుగా హైస్కూలు ప్లేగ్రౌండ్‍లో నిరాహార దీక్ష చేపడతామనీ మాట ఇచ్చాను.” అహంకారం ఉట్టిపడేట్టు అన్నది మహిళా మండలి ప్రెసిడెంటు.

“కనీసం సభ్యులతో చర్చించకుండా ఎలా మాట ఇవ్వగలరు?” సూటిగా అడిగారు వనజ గారు.

బహుశా యీ మాట వస్తుందని ఆవిడ ఊహించి వుండలేదేమో.

“ఇది ఆడవాళ్ళ సమస్య. మనం వున్నదే ఆడవారికి న్యాయం జరిగేలా చూసేందుకు. మీరు ముందుకొస్తారనే నమ్మకం తోనే నేను మాట ఇచ్చాను” అన్నది కట్ చేస్తున్నట్లు.

“అది కాదు మేడమ్” త్రిపుర గారు ఏదో చెప్పబోయేంతలో

“త్రిపుర గారూ, యీ మహతి మీ ఫ్రెండ్ కావచ్చు. దానికి నాకేం అభ్యంతరం లేదు. మహిళా మండలి మీటింగ్‌లో పాల్గొనడానికి ఈమెకి ఏమి పనుందీ? ముందు ఆ పిల్లని బయటికి పంపించి ఆ తరవాత మీ ప్రశ్నలు సంధించండి” తీవ్రంగా అన్నదా అధ్యక్షురాలు.

“మొదట ఇది మన మహిళా మండలి సభ కాదు. అసలు మనం ఇవ్వాళ ఇక్కడ కలుసుకున్నది సుచిత్ర గారి పుట్టిన రోజు ఫంక్షన్ కనక. స్వరూపరాణి కేసు విచారించడానికి కాదు. మమ్మల్నెవర్నీ కనీసం సంప్రదించకుండా మీరు స్వరూపరాణి తల్లికి మాట ఎలా ఇచ్చారు? నిరాహర దీక్ష మీరు చేస్తారా?” తీవ్రంగానే అన్నది వనజ గారు.

“వనజా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.” సీరియస్‌గా అంది ప్రెసిడెంటు.

“ఒక్క క్షణం. దయచేసి స్వరూపరాణి విషయం పక్కన పెడుదాం. ఇది పుట్టిన రోజు ఫంక్షన్ ప్లీజ్.” అన్నారు కాంతిమతి. ఆవిడ విజయవాడలో ఓ కాలేజీ లెక్చరర్‍గా పనిచేసి రిటైర్ అయ్యారు.

“ఇది మహిళా మండలి సభ కాకపోవచ్చు. కానీ 80% సభ్యులు ఇక్కడే వున్నారని స్వరూపరాణి విషయం ఎత్తాను. ఇది పుట్టిన రోజు ఫంక్షన్ అని నాకు తెలియక కాదు.” రుసరుసగా అంది ప్రెసిడెంటు. జనాలు తన పట్ల సుముఖంగా లేరని గ్రహించి వుండాలి.

నాకు నవ్వొచ్చింది.

“ఏంటి నవ్వుతున్నావూ? పెద్దా చిన్నా లేదా?” నా మీద విరుచుకుపడింది ప్రెసిడెంటు.

“క్షమించండి మాలతీ.. గారూ. మీరంటే నాకు గౌరవమే. ఎంత సమర్థులు కాకపోతే పదేళ్ళ పాటు మహిళా మండలిని నడిపిస్తారు. నేను నవ్వింది ఎందుకంటే, నేను ఇక్కడ వుండాలో లేదో తెలియక. నేను వచ్చింది త్రిపురగారితోనే. అయినా శాంతగారు, సుచిత్ర గారు, కాంతిమతి గారూ నాకూ మా కుటుంబానికే చిరపరిచితులే. సుచిత్ర గారి పుట్టినరోజు కనుక వుండాలా? లేక, మీరు దీన్నే మహిళా మండలి మీటింగ్‌గా భావించారు గనక వెళ్ళాలా అనే సందిగ్ధంతో నాకు నవ్వొచ్చింది” స్పష్టంగా అందరికీ వినపడేలా అన్నాను.

“అదేంటమ్మా.. మాలతిగారు పెద్దవారు. దాన్ని నువ్వు సీరియస్‌గా తీసుకోకూడదు. నువ్వెళ్ళిపోతే మాలతి గారే మళ్ళీ బాధపడతారు.” లౌక్యంగా అన్నది విజయ గారు. ఆవిడ ‘నొప్పించక తానొవ్వక’ టైపు, లౌక్యం ఎక్కువ.

“అవును. నేనే చెప్తున్నా.. నువ్వు ఇక్కడే వుండాలి. అంతేకాక స్వరూపరాణి కేసు విషయంలో కూడా నీ అభిప్రాయం చెప్పి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలి” అన్నది ప్రెసిడెంటు మాలతీ.. గారు.

ఈసారి చచ్చేంత నవ్వొచ్చినా దాన్ని అణచుకుని గంభీరంగా మొహం పెట్టి, “లేదు మాలతి.. గారూ, మీరు పెద్దలు, మంచీ చెడూ క్షుణ్ణంగా తెలిసినవారు. నేనెంత నా తెలివి ఎంత. మీ మాటని తలదాల్చి ఇక్కడే వుంటాను. కానీ చర్చలో తలదూర్చను. కానీ, సుచిత్ర గారికి వంటలో సహాయం చేస్తా,” చెప్పేసి వంటగదిలోకి పోయా. అక్కడ హాయిగా నవ్వుకున్నా.

“ఏమన్నావ్.. మీ మాటని తలదాల్చా!” ఫకాల్న నవ్వి అన్నది సుచిత్ర గారు. “గ్రాంథిక ప్రావీణ్యం మరి” నేనూ పగలబడి నవ్వి అన్నాను.

వంట అనేది ఒక కళ అని సుచిత్రగారి దగ్గర నాకు తెలిసింది. నల్ల కారంపొడిని వంకాయలో స్టఫ్ చేసి ఆ కారప్పొడి పడిపోకుండా దారాలు చుట్టి డీప్ ఫ్రై చేసింది చూడూ.. అద్భుతం. చెబితే తప్ప లోపల వున్నది నల్లకారం అని తెలీదు. మా అమ్మమ్మ గ్రేటు. అందులో సందేహం లేదు. కానీ ఆవిడకి ఏ కూరతో దేన్ని చెయ్యాలో, అంటే కూరగాయలు గురించిన విషయాలు చాలా బాగా తెలుసు. కూరలు చెయ్యడంలో కూడా ఓ సంప్రదాయం అనేది వున్నదని అమ్మమ్మ నించి నేర్చుకుంటే, ప్రయోగాలు చేస్తే కొత్త రుచుల్ని పుట్టించవచ్చని సుచిత్ర గారి దగ్గర నేర్చుకున్నాను. ‘వాక్కాయి కొబ్బరికాయ’ పచ్చడి సూపర్బ్.

ఇద్దరం వంటగది వొదిలి బయటికొచ్చేసరికి చర్చ చాలా తీవ్రంగా సాగుతోంది.

“మాలతి గారూ, ఆడవాళ్ళంటే స్వరూపరాణీ, వాళ్ళు అమ్మ మాత్రమే కాదు, స్వరూపరాణి భర్త తల్లి కూడా ఆడదే. కూతురి సంసారం చెడిపోవడానికి స్వరూపరాణి తల్లి అతి గారాబమే కారణం. ఆ పిల్లకి ఉండే అహంకారానికి వెయ్యిసార్లు పెళ్ళి చేసిన ఏ ఒక్కటీ సక్సెస్ కాదు. మగవాళ్ళ అహంకారం ఎప్పుడో చచ్చింది. ఆడవాళ్ళ ప్రవర్తనలో, మాటల్లో వచ్చిన తీరు మీరు గమనించలేదేమో గానీ, మేం ఎప్పుడో గమనించాం. అయినా, కుటుంబం నిలబడాలని మనం కోరుకోవాలి గానీ, కోట్ల డబ్బు వాళ్ళ దగ్గర్నించి పిండి స్వరూపరాణిని ఇంకా మహారాణిని చెయ్యాలని చూడకూడదుగా.” నిక్కచ్చిగా అన్నది వనజ. వనజ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని నాకు ఆ రోజు బాగా తెలిసింది.

“మీకెలా తెలుసు?” మొహం గంటు పెట్టుకుని అడిగింది మాలతి.. గారు.

“ఇదే ప్రశ్న నేనూ వెయ్యచ్చు.. స్వరూపరాణిని భర్త అత్తమామలు ఎలాంటి బాధలు పెడితే ఇక్కడి పుట్టింటికి వచ్చిందని. కానీ, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఒకవేళ వాళ్ళ సంసారాన్ని తీర్చిదిద్దాలని మీకుంటే, ఆ పిల్ల భర్తనీ, అత్తమామల్ని మనమే వెళ్ళి కనుక్కుందాం, వాళ్ళు చెప్పే వెర్షన్ కూడా విందాం. అప్పుడో నిర్ణయానికి వద్దాం. అంతేగానీ గేదెని చెరువులో పెట్టి బేరాలు చెయ్యద్దు.” అన్నది వనజగారు.

“దానికి స్వరూపరాణీ, వాళ్ళ అమ్మ మొదట ఒప్పుకోవాలిగా?” శాంతగారు అన్నారు.

“ఛస్తే ఒప్పుకోదు. కూతురు కంటే తల్లి పది ఆకులు ఎక్కువే చదివింది.” నవ్వి అన్నది సావిత్రి.

సావిత్రికి టైలర్ అండ్ ఎంబ్రాయిడరీ షాపున్నది. ఓ ఎనిమిది మంది స్త్రీలకి సావిత్రి గారు భుక్తిని కలిపిస్తోంది. భర్త బ్యాంకులో కేషియర్.

“అవునూ, పది ఆకులు ఎక్కువ చదవడం అంటే?” అడిగింది సువర్చల. ఆమెకు 22 సంవత్సరాలు వుంటాయి. ఈ ఊరి అబ్బాయిని చేసుకొని కొత్తగా కాపరానికి వచ్చింది.

“పూర్వకాలం చదువు ముందు ఇసుక మీద అక్షరాలు వ్రాయించేవారు. అక్షరాభ్యాసం పళ్ళెంలో బియ్యం పోసి చేసేవారు. ఆ తరువాత ఇసుక, ఇసుక సాధన తరువాత బలపం పలకలు. ఆ తరువాత తాటి ఆకుల మీద ఘంటంతో వ్రాసిన వ్రాతల్ని చదివేవారు. కూతురు మూడో తరగతి, తల్లీ ఎనిమిది తరగతి అనుకోండి, మూడూ ఆకులు ఎనిమిది ఆకులు అనేవాళ్ళు. కూతురు చాలా గొప్ప చదువు చదువుకున్నా, తల్లికి ఇంకా ఎక్కువ జ్ఞానం తెలివితేటలూ వుంటే, ‘ఏడాకులు ఎక్కువ చదివింది’ అని తల్లి తెలివితేటల్ని కూతురితో పోల్చి పొగిడేవారు. చిత్రం ఏమంటే యీ పదాకులు ఎక్కువ చదవడం ‘గయ్యాళి’తనానికి కూడా వర్తిస్తుంది.” నవ్వుతూ వివరించారు శాంతగారు.

“భలే బాగుంది. వావ్..” మెచ్చుకుంది సువర్చల.

నాకూ తెలీదు. నేను వినడమూ మొదటిసారే!

“ఒప్పుకుంటుందో లేదో తెలిసిది స్వరూపరాణి అమ్మని అడిగాక కదా! మన ప్రెసిడెంటు గారే ఆవిడ్ని అడగాలి మరి. ఎందుకంటే, కూతురి భరణం సంగతి ఆమె చెప్పింది మాలతి గారికేగా!” అన్నారు వనజ.

“అందరికీ ఓ చిన్న మనవి. ఆహార వ్యవహారాలంటారు. ఏ వ్యవహారం చేసినా ఆహారం తీసుకున్న తరువాతే చెయ్యాలని మా అమ్మమ్మ గారు చెప్పేవారు. లోపల సుచిత్ర గారు బ్రహ్మాండమైన, ఎర్రగా, వేడిగా నోరూరిస్తున్న టమోటా పప్పు, బ్రహ్మాండమైన మిరియాల చారు, బంగాళదుంప వేపుడు, పనసపొట్టు కూర, చూడగానే తినెయ్యాలనిపించే దోసావకాయ, అరటికాయ ఉప్మా కూర, అన్నిటికంటే మహారాణి – వంకాయ + నల్లకారం వేపుడు.. ఓహ్.. కొరికితే కరకర.. ఇక పచ్చడి అయితే కేబేజీ పచ్చడి – కేరెట్ పాయసం + కరకరలాడే అప్పడాలు.. మెంతి మజ్జిగా.. స్పెషల్ స్వీటు బూరెలు. అమ్మలారా.. రండి.. రుచి చూడండి., స్వర్గానికి కూరల నిచ్చెన వేసి నిద్రాదేవిని కంటిపాపల్లోకి ఆహ్వానిద్దాం. సుస్వాగతం.. శుభ స్వాగతం” అంటూ చర్చకి ముగింపు పలికి, భోజనం ఎనౌన్సుమెంటు చేశాను నేను.

చివరిలో గొంతు కొంచెం వణికిందని నాకు మాత్రమే తెలుసు. మా అమ్మమ్మ అయితే ఆ పదార్థాలని ఇంకా అద్భుతంగా వర్ణించేది. నిజంగా నోరూరేలాగా.

సకల శుభమస్తు.. చక్కని విందారగించాలని పాఠకుల్ని కోరుకుంటూ-

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here